ప్రతిబింబం

అద్దం అమాయకంగా నవ్వుతుంది
నేనేమో ముఖంపై మచ్చలు లెక్కపెట్టుకుంటాను.
కనురెప్పలపై నలుపు చీకటి పాట పాడుతుంది
కళ్ళక్రింది గుంతలు స్వేచ్ఛగా ఊఁ కొడతాయి.

చర్మంపై మునుపటి నునుపు లేదు,
పోనీ కాంతీ లేదు.
బుగ్గల్లో కరుకుదనం.
నవ్వులో ఒకలాంటి అంతశ్శోకం.
పళ్ళ సందుల్లో శూన్యం.
అయినా తెల్లటి నిర్మలత్వంలో ఒక దాపరికం.

ఒక్కొక్క తెల్లవెంట్రుకకీ ఉలిక్కిపడతానా!
సర్దుకునేసరికి మరొకరోజవుతుంది.
వయసు ఇంత తొందరగా ఎలా కరిగిందో తెలియదు.

నడకలో వేగం… గడచిన జీవితంలో జ్ఞాపకం.
పాదాల తడబాటు… ప్రస్తుతపు దారిచూపు.
నీడని చూస్తే మరణచ్ఛాయ. చుక్కగా అయి,
కూర్చుని చూసుకుంటే అర్థంకాదు!
ఇది ప్రశాంతతో, నైరాశ్యమో!