పృథ్వీ వృత్తము

పరిచయము

సంస్కృత ఛందస్సులో అక్షరసామ్య యతి లేక వడి లేదు, ద్వితీయాక్షర ప్రాస కూడ లేదు. సంస్కృత ఛందస్సులో యతి అంటే పదచ్ఛేద యతి మాత్రమే, అనగా పద్య పాదములో ఒక అక్షరము వద్ద పదము అంతమై, తఱువాతి అక్షరము వద్ద మఱొక కొత్త పదము ఆరంభము కావాలి. దీనిని విరామయతి అంటారు. అనగా పాఠకుడు అక్కడ ఒక క్షణము ఆగి పిదప మిగిలిన పాదమును పూర్తి చేయును. పాదాంతములో కూడ సామాన్యముగా ఈ విరామయతిని పాటిస్తారు. అందుకే పాదాంతమునందలి లఘువు గురుతుల్యము. ఈకారణమువలన సంస్కృతములో లఘ్వంతములైన వృత్తములు అరుదు. ఈ విరామయతిని పింగళాదులు పాటించినారు, భరతాదులు పాటించలేదు. ఏదో అక్కడక్కడ తప్పించి సంస్కృత ప్రాకృత కవులు విరామయతిని విధిగా పాటిస్తారు. కన్నడములో ప్రాస మాత్రమే. వారు వృత్తములలో విరామయతిని పేర్కొన్నను, దానిని పాటించరు. తమిళములో సామాన్యముగా పదములను గణములకు తగినట్లు ఎన్నుకొంటారు. కాబట్టి విరామయతిని వారు పాటిస్తారనే చెప్పాలి. దీనితోబాటు అక్షరసామ్య యతిని (మోనై) కూడ పాటిస్తారు. మలయాళములో విరామయతి, పాదాంత యతి నియతము. తెలుగులో వృత్తములలో విరామ యతి, పాదాంత విరామయతి ఐచ్ఛికము. యతిస్థానము వద్ద పదములు విఱుగవు. పదము ఎక్స్‌ప్రెస్ బండి చిన్న స్టేషనులో దూసుకొని పోయేటట్లు వ్రాయుట ఒక కళ అనుకొంటారు కొందఱు కవులు!

తెలుగులో అక్షరసామ్య యతి

లాక్షణికులు వృత్తములకు సంస్కృతములోని విరామయతిని తెలుగులో అక్షరసామ్య యతిగా గ్రహించినారు, ఉదా. శార్దూలవిక్రీడితము, స్రగ్ధర, స్రగ్విణి, ఇత్యాదులు. సంస్కృతములో వరుసగా నాలుగు, అంతకన్న ఎక్కువగా గురువులు ఉంటే అక్కడ విరామయతిని పాటించుట వాడుక, ఉదా. మందాక్రాంతము, శిఖరిణి, వక్త్ర, మున్నగునవి. తెలుగులో పాదములో పది, పదికన్న ఎక్కువ అక్షరములు ఉంటే యతిని తప్పని సరిగా వాడుతారు. కాని సంస్కృతములో అలా కాదు, వసంతతిలకము, పంచచామరము, మానిని వంటి వృత్తములకు యతిని నిర్ణయించలేదు. అది కవి ఇచ్ఛానుసారము వాడబడుతుంది. తెలుగులో కొన్ని వృత్తములకు సంస్కృతములోని యతిని తొలగించినారు, ఉదా. మందాక్రాంతమునందలి మొదటి యతి. అదే విధముగా పృథ్వివంటి కొన్ని వృత్తములకు యతిని మార్చినారు. తెలుగులో సామాన్యముగా లఘువుపైన యతిని ఉంచరు. దీనికి కారణము బహుశా ఊనిక కావచ్చును. భుజంగప్రయాతము, పంచచామరములకు బహుశా దీనిని సరిపుచ్చుకొన వచ్చును, ఎందుకంటే లగారంభ పదములు తెలుగులో తక్కువ అని. కాని ఇంద్రవజ్రవంటి వృత్తములకు ఇది నా ఉద్దేశములో సరికాదు. ఇంద్రవజ్రపు గురులఘువుల అమరిక UUI UU IIUI UU. పాదము 5,4 – 5,4 మాత్రలుగా విఱుగుతుంది, అప్పుడే లయ కుదురుతుంది. అట్టి సమయములో వడిని రెండు అక్షరముల పిదప ఉంచుట సరికాదు. తెలుగు లాక్షణికులు పాదపు మాత్రల అమరికను, అందులోని లయను గమనించలేదని నాకు అనిపిస్తుంది. లాక్షణికులు చెప్పినవి కవులు స్వతంత్రముగా ఆలోచించక అలాగే తుచ తప్పక పాటించినారు. దీనివలన పద్యములోని గేయబద్ధత, సంగీతము మఱుగుపడి పోయినది. ఇది చాల విచారకరమైన విషయము. ఈ వ్యాసములో అట్టి ఒక వృత్తమును గుఱించి చర్చిస్తాను. ఆవృత్తము పృథ్వీవృత్తము.

పృథ్వీ లేక విలంబితగతి

పృథ్వీ జ్సౌ జ్సౌ యలౌగ్ వసునవకౌ అని ఈ వృత్తము పింగళ ఛందస్సులో పేర్కొనబడినది. అనగా జ/స/జ/స/య/లగ గణములతో పాదము ఎనిమిది (వసు), తొమ్మిది అక్షరములుగా విఱుగు వృత్తము పృథ్వీ వృత్తము. నాట్యశాస్త్రమునందలి విలంబితగతికి ఉదాహరణము:

విఘూర్ణిత విలోచనా – పృథు వికీర్ణహారా పునః
ప్రలంబరశనా చల-త్క్షలిత పద మందక్రమా
న మే ప్రియమిదం జన-స్య బహుమాన రాగేణ యన్
మదేన వివశా విలం-బితహతిః కృతా త్వం ప్రియే

ఓ ప్రియా, నీకన్నులు తిరుగాడుచున్నవి, నీమెడలోని హారము ఇటునటు చెదరియున్నది, నీవడ్డాణము వదులుగా నున్నది, నీవు నడిచేటప్పుడు తడబడుతున్నావు. కాని ఇలా నీవుండుట నాకు చాల నచ్చినది, ఎందుకంటే నీ విలంబితగతి నీ ప్రియుడైన నాపై ఉండే ప్రేమను, మర్యాదను చూపుతున్నది.

ఈ ఉదాహరణమును మీకు చూపుటకు గల కారణము ఏమనగా ఒక్క మొదటి పాదములో తప్ప మిగిలిన మూడు పాదములలో విరామయతి లేదు, అనగా నాట్యశాస్త్ర రచయిత దీనిని పాటించలేదు. పింగళాదులు (పింగళుడు, రత్నమంజూష రచయిత, జయదేవుడు, విరహాంకుడు, జయకీర్తి, హేమచంద్రుడు మున్నగువారు) పృథ్వీ వృత్తమునకు 8, 9 అక్షరముల విఱుపునే గ్రహించినారు. ఉదా. జసో జసయలా గురుర్వసుయతిశ్చ పృథ్వీ సతా – జయకీర్తి ఛందోనుశాసనము.

ఎన్నియో సంస్కృత కావ్యనాటకములలో పృథ్వీ వృత్తము వాడబడినది. అందులో కొన్ని: బృహత్సంహిత (వరాహమిహిరుడు), మాళవికాగ్నిమిత్రము, అభిజ్ఞానశాకుంతలము, విక్రమోర్వశీయము (కాలిదాసు), భట్టికావ్యము (అజ్ఞాత రచయిత), నైషధము (శ్రీహర్షుడు), శృంగార వైరాగ్య శతకములు (భర్తృహరి), శృంగారతిలకము (రుద్రటుడు), మల్లికామారుతము (దండి), మాలతీమాధవము, మహావీరచరితము, ఉత్తరరామచరితము (భవభూతి), బాలరామాయణము, ప్రచండపాండవము, విద్ధశాలభంజిక, చండకౌశికము, హనుమన్నాటకము (రాజశేఖరుడు), ప్రసన్నరాఘవము (జయదేవుడు), ప్రబోధచంద్రోదయము (కృష్ణమిశ్రా), చైతన్యచంద్రోదయము (కవికర్ణపుర), విక్రమాంకదేవచరితము (బిల్హణుడు), భామినీవిలాసము (జగన్నాథపండితుడు).

సంస్కృతకావ్యములయందలి పృథ్వీవృత్తపు ఉదాహరణములు

నితాంత కఠినాం రుజం – మమ న వేద సా మానసీ
ప్రభావవిదితానురా-గమవమన్యతే వాపి మాం
అలబ్ధఫలనీరసం – మమ విధాయ తస్మింజనే
సమాగమ మనోరథం – భవతు పంచబాణ కృతీ – కాలిదాసు విక్రమోర్వశీయము, 2.11
(రెండవ పాదములో విరామయతి చెల్లలేదు!)

బహుశా ఆమెకు నామనస్సు పడే ఈ భరించలేని బాధ అర్థము కాలేదు కాబోలు. ఒకవేళ అర్థము చేసికొని ఉంటే, దానిని అవమానపరచ్చున్నదేమో? ఆమెతో నాసమాగమమనే అభిలాష ఫలించదు కావున దానిని మన్మథుడు రసహీనము చేయుగాక!

అయం హి శిశురేకకో – మదభరేణ భూరిస్ఫురత్
కరాలకరకందలీ – జటిల శస్త్రజాలైర్వలైః
కణత్కనకకింకిణీ – ఝణఝణాయితస్యందనైః
అమందమదదుర్దిన – ద్విరదడామరైరావృతః – భవభూతి ఉత్తరరామచరితం, 5.05

మన సైనికులు గొప్ప ఆయుధాలను ప్రయోగిస్తున్నారు. వాళ్ళ రథములు బంగారు గంటలతో మ్రోగుచున్నాయి. విజృంభించిన మత్తేభాలు మదజలాన్ని స్రవిస్తున్నాయి. కాని వీడు బాలుడైనను ఒక్కడే మన సైన్యముచే చుట్టబడి పోరు సలుపుతున్నాడు!

పురా సరసి మానసే – వికచ సారసాళి స్థలత్
పరాగ సురభీకృతే – పయసి యస్య యాతం పయః
స పల్వల జలేధునా – మిలదనేక భేకాకులే
మరాళకుల నాయకః – కథయతే కథం వర్తతామ్ – జగన్నాథ పండితుని భామినీవిలాసము, 1.03

(ఫుల్ల జలజావళి ద్యుత – పుష్పరేణు
సురభిళంబగు మానస – సరసి నీట
వయసు మును గడపిన హంస-పతి యనేక
భేక వృత వాపి నిప్పు డే-విధి మెలంగు – మాగురువులు వేదం వేంకటకృష్ణశర్మ అనువాదము, అంధ్రభామినీవిలాసమునుండి)

సదాశ్రితపదా సదా-శివ మనోవినోదాస్పదా
స్వదాసవశ మానసా – కలిమలాంతికా కామదా
వదాన్య జన సద్గురో – ప్రశమితామితా సన్మదా
గదారిదరనందకాం-బుజధరా నమస్తే సదా – మోరోపంత్, మరాఠీ కేకావలీ, 1.

ఆశ్రితులచే వందింపబడిన పదములు గలవాడా, సదాశివుని మనస్సునకు ఆనందము కలిగించువాడా, నీ భక్తుల మనస్సులకు ఆధీనమైనవాడా, కలి కల్మషములను హరించువాడా, కోరికలను తీర్చువాడా
మహాత్ములకు సద్గురువైన వాడా, అసంఖ్యాకులైన దుర్మార్గుల మద మణచినవాడా, శంఖచక్రగదాపద్మాదులను ధరించినవాడా, ఓ నారాయణా నీకు ఎల్లప్పుడు నా నమస్కారాలు!

తెలుగులో పృథ్వీవృత్తము

ఈ వృత్తపు గణముల అమరిక జ/స/జ/స/య/లగ, ఇది పాదమునకు 17 అక్షరములు గల అత్యష్టి ఛందములో 38750వ వృత్తము. తెలుగులో మూడు విధములైన యతులను లాక్షణికులు పేర్కొన్నారు. ఎక్కువగా లాక్షణికులు పన్నెండవ అక్షరముపైన వడిని ఉంచినారు. రేచన, విన్నకోట పెద్దన, అనంతామాత్యుడు, చిత్రకవి పెద్దన, అప్పకవి మున్నగు లాక్షణికులు ఈవిధముగానే తెలిపినారు. క్రింద రేచన కవిజనాశ్రయము నుండి, అప్పకవీయము నుండి లక్షణలక్ష్య పద్యములను చదవండి.

ప్రియంబగుచు రుద్ర విశ్రమము – పృథ్వికాసంజ్ఞ కా
హ్వయంబగు జసంబుతో జసయ-వంబులున్ గూడినన్ – రేచన కవిజనాశ్రయము

జసల్ జసయవంబు లుష్ణకర – సంఖ్య విశ్రాంతులున్
బొసంగి కవిపుంగవుల్ పలుక – భూమిలోఁ బృథ్వి నా
నసంశయమగున్ గళిందతన-యామనోవల్లభా
ప్రసన్నవదనాంబుజా ధృతప-రశ్వధా మాధవా – కాకునూరి అప్పకవి అప్పకవీయము

దీనికి విరుద్ధముగా లింగమగుంట తిమ్మకవి పదమూడవ అక్షరమును వడిగా స్వీకరించినాడు. ఆ లక్షణ లక్ష్య పద్యము:

త్రయోదశయతిన్ గృతిన్ జసజసల్ జ-తంబై యవల్
దయాజలనిధీ చెలంగు విను పృథ్వి – ధాత్రిం దగన్ – లింగమగుంట తిమ్మకవి సులక్షణసారము

పొత్తపివేంకటరమణకవి సంస్కృతములోవలె తొమ్మిదవ అక్షరముపైన యతిని ఉంచినాడు. ఆలక్ష్యము:

జసజసయలగలు, యతి తొమ్మిదింటను
– పొత్తపి వేంకటరమణకవి లక్షణశిరోమణి, కేదారభట్టు వృత్తరత్నాకరమునుండి గ్రహించబడినది.

కన్నడములో నాగవర్మ ఛందోంబుధిలో సంస్కృతములోవలె పాదపు విఱుపు ఎనిమిది, తొమ్మిది అక్షరములుగా ఉండవలయునని చెప్పెను. ఆ లక్ష్యము:

ఇనానిల దినేశ మా-రుత పయోలగంగళ్ బెడం
గనాళ్దు నిలె విశ్రమం – వసుగళల్లి చెల్వగె నీ
లనీరజ విలోచనే – బగెదు కేళిదం పృథ్వియెం
బ నామదొళగిల్లి సం-దుదు నిరంతరం ప్రీతియిం – నాగవర్మ ఛందోంబుధి
(సూర్యుడు (జగణము), అనిల (సగణము), దినేశ (జగణము), మారుత (సగణము), పయో (యగణము), లగము గణములు. యతి వసు, అనగా ఎనిమిది విశ్రమస్థానము.)

తెలుగు కవుల పృథ్వీవృత్తములు

అమూల్య మణిభూషణంబులు గ-జాశ్వ బృందంబులున్
సమృద్ధ ధనధాన్య రాసులు బ్ర-శస్త గోవర్గముల్
గ్రమంబునను భూసురేశుల – కగణ్య పుణ్యార్థియై
యమర్త్యనిభుఁడిచ్చెఁ బాండువిభుఁ – డత్యుదారస్థితిన్ – నన్నయ భారతము, ఆది 5.62

దేవతలతో సమానమైన పాండురాజు గొప్ప పుణ్యములను కోరినవాడై బ్రాహ్మణశ్రేష్ఠులకు వెలలేని రత్నాల నగలను, ఏనుగులను, గుఱ్ఱములను, సంపత్కరమైన ధనధాన్య రాసులను, ఉత్తమమైన పశువులను ఉదారహృదయముతో దానము చేసెను.

ప్రతాపగుణభూషణా – పరహితార్థసంభాషణా
వితీర్ణరవివందనా – విభవనూత్నసంక్రందనా
శ్రుతిస్మృతివిచక్షణా – సుకృతకీర్తిసంరక్షణా
క్షితీంద్రసుతవర్తనా – శివపదద్వయీకీర్తనా – జక్కన విక్రమార్కచరిత్రము, 2-262

విక్రమము అనే గుణమే నగగా గలవాడా, ఇతరుల హితములనే మాటగా నుంచుకొనిన వాడా, సాంధ్యరవిని వందించినవాడా, క్రొత్త యుద్ధములనే ఐశ్వర్యముగా గలవాడా, వేదవేదాంతములను పఠించినవాడా, పొందిన కీర్తిని రక్షించుకొనువాడా, రాజకుమారునివలె నడయాడువాడా, శివుని పాదద్వయమును కీర్తించువాడా!

గదాహతికి నాత్మఁ గొం-కక యెదిర్చి రాఁగా నిదౌ
గదా యనుచుఁ ద్రిప్పి రా-క్షసుఁడు వైచె గాఢభ్రమీ
నదత్కనకకింకిణీ – నటనజాగ్రదుగ్రాద్భటీ
వదావద మహాగుహా – వలభి యైన శూలంబునన్ – అల్లసాని పెద్దన, మనుచరిత్రము, 4.100

గదాప్రయోగమును జంకు లేక ఎదిరించి తప్పించుకొన్నప్పుడు ఇది కదా ధైర్యమని రాక్షసుడు ప్రశంసించి గిరగిర తిరుగునప్పుడు కదలాడే గంటలతో ఆ గుహ మారుమ్రోగగా రాక్షసుడు తన శూలమును రాజుపై (స్వరోచిపై) ప్రయోగము చేసెను.

జగత్పతి! భవత్పదా-బ్జయుగభక్తి సంయుక్తిలో
గగుర్పొడువ నన్యథా-గతి యెఱుంగఁ డెవ్వఁడు నీ
యగణ్యగుణ కిర్తనం-బధిగమించుటన్ మించునే
నగాధభవసాగరం – బతఁడు దాఁటు నొక్కెత్తునన్ – తెనాలిరామకృష్ణుని శ్రీపాండురంగమాహాత్మ్యము, 4.89

ఓ విశ్వనాథా, నీచరణారవిందద్వయముపై భక్తియందలి ఆసక్తిలో దేహము గగుర్పాటు చెందగా వేఱేమియు తోచదు. నీ గొప్ప గుణముల కీర్తనలను చదువుటకన్న మఱేమున్నది? ఈలోతైన జీవనసముద్రమును నతడు ఒక యెత్తులో దాటగలడు (దాటించగలడు).

నిరుద్ధ జగదర్ణవోన్మథన – నిర్గతోగ్రానల
ప్రరూఢ పరితశ్శిఖాయవలయ – బద్ధకంఠస్థలీ
సరోజశరదుష్క్రియా దమన-జాత రోషోజ్జ్వల
న్నిరూఢ పరితశ్శిఖాయవలయ-నేత్ర ఫాలస్థలీ – విశ్వనాథ సత్యనారాయణ శ్రీరామాయణకల్పవృక్షము, యుద్ధకాండ, ఉపసంహరణ, 416

మహాసాగరమును చిలికినప్పుడు జనించిన తీవ్రానలమునుండి వ్యాపించిన విషమును ఒక ముద్రావలయమువలె కంఠములోనుంచుకొనిన వాడా! అరవిందపుష్పశరములతో దురాలోచనతో ఎక్కుపెట్టగా గొప్పరోషముతో వానిని నాశనము చేసిన కారణముగా నుదుట ఒకముద్రావలయమువలె మూడవకన్ను గలవాడా!

పైపద్యములలో జక్కన, పెద్దన, రామకృష్ణుడు సంస్కృతము ననుసరించి తొమ్మిదవ అక్షరముపై యతిని ఉంచినారు. మిగిలిన వారు అక్షరసామ్యయతిని పన్నెండవ అక్షరముతో ఉంచినారు. తిక్కన కాలమునందలి జక్కన సంస్కృతములోవలె పాదపు విఱుపును అనుసరించి వడిని తొమ్మిదవ అక్షరముపైన ఉంచగా, ఇతని ముందటి నన్నయ పన్నెండవ అక్షరముపైన వడిని పెట్టెను. కవిజనాశ్రయకర్త నన్నయ పిదపవాడని ఊహ. అలాగయితే ఈ పృథ్వి యతి నన్నయభట్టు ప్రతిపాదనయా?

గురులఘువుల అమరిక పరిశీలనము

ఇప్పుడు ఈ వృత్తపు గణముల అమరికను జాగ్రత్తగా గమనిద్దామా?

IUIII UIU – మొదటి ఎనిమిది అక్షరములు
IUIU UIU – చివరి ఏడు అక్షరములు

ఈ రెండు అమరికలలో మొదటి మూడు (IUI), చివరి మూడు (UIU) అక్షరముల అమరిక ఒక్కటే. నాలుగవ, ఐదవ అక్షరములైన మొదటి భాగములోని రెండు లఘువులు, రెండవ భాగములో ఒక గురువైనది. కావున ఈ రెండు భాగముల లయ ఒక్కటే! ఈ రెండు భాగములు రెండు లఘువుల వంతెన చేత కలుపబడినది. ఈ రెండక్షరముల పదము సంగీతములోని వరణము వంటిది. పైన ఇచ్చిన రెండు భాగములకు ప్రాసయతిని, వంతెనలోని మొదటి లఘువుకు అక్షరసామ్య యతిని ఉంచి వ్రాసినప్పుడు ఈ వృత్తమును చక్కగా పాడుకొన వీలగును.

ఆవిధముగా నేను వ్రాసిన కొన్ని పద్యములను క్రింద ఇచ్చినాను. పద్య పాదమును రెండు పంక్తులుగా విఱిచి వ్రాసినాను. ఇలా వ్రాసినప్పుడు మొదటి, చివరి భాగముల లయ, వాటికి మధ్య ఉండే ప్రాస విదితమవుతుంది.

పృథ్వీ – జ/స/జ/స/య/లగ IUIIIUIU – II – IUIUUIU 17 అత్యష్టి 38750

ప్రమోదముల నీయఁగాఁ – బలు
యమూల్యమౌ కాన్కలే
సుమమ్ములగు మాలగా – శుభ
మమేయమై నిండఁగా
రమించగను బృథ్వికిన్ – రహి
ద్రుమమ్ములూఁగాడెనే
తమస్సులిఁక వీడఁగాఁ – ద్వర
నమస్సులందింతు నేన్ … (1)

కనంగ నిట రమ్మురా – కథ
వినంగ నీకర్థమౌ
ననంతమగు కోర్కెరా – హరి
యనుంగు నీవే గదా
మనస్సునను గాయమే – మఱి
మనంగ దిక్కేదిరా
దినమ్ము చను రాత్రిలోఁ – దృష
క్షణమ్ములో మాడ్చురా … (2)

జ్వలించె నిట నాశలే – చలి
వెలుంగులో మంటలై
ఫలించునొ యెఱుంగనే – వలి
యెలుంగులో దుఃఖమే
విలాసమిది వానికా – విని
చలించునో లేదొకో
శిలాప్రతిమ యౌదునో – చెలి
జలమ్ములో మున్గి నేన్ … (3)

ఈమధ్య ఫేస్‍బుక్‍లో శ్రీమతి తంగిరాల శిరీషగారు బెల్లంకొండ రామరాయకవి వ్రాసిన ఒక పృథ్వీ వృత్తమును పరిచయము చేసినారు. ఆ సంస్కృత వృత్తము ఎనిమిది అక్షరముల పిదప విరామయతి, ఆపైన రెండు అక్షరముల పిదప ద్విప్రాసతో నున్నది. (ఆ పద్యమే నాయీ వ్యాసమునకు స్ఫూర్తి, శిరీషగారికి నా మనఃపూర్వక ధన్యవాదములు.)

కదంబవనవాసినీ – సిత
సదంబరోద్భాసినీ
మదంబ! శుభకారిణీ – ముని
కదంబసంతారిణీ
హృదంబర విహారిణీ – సుర
కదంబ సంరక్షిణీ
సదంబరమణిద్యుతిః – మమ
ముదం బహుం త్వం దిశా – బెల్లంకొండ రామరాయకవి రుక్మిణీపరిణయ చంపువు, చతుర్థోల్లాసము, 3

కదంబవనములో నివసించుదానా, తెల్లని వస్త్రధారణచే శోభించుదానా, నాతల్లీ శుభములను కలిగించుదానా, మునిసమూహమును తరింపజేయుదానా, మానసాకాశములో విహరించుదానా, దేవతలను సంరక్షించుదానా, సూర్యునివలె ప్రకాశించుదానా, నాకు నీభక్తి అనే ఆనందము నొసగుమమ్మా!

ఎనిమిదేసి మాత్రలకు యతి: లయ ప్రకారము పైన నేను సూచించిన యతి, ప్రాసయతి ఈపృథ్వీ వృత్తమునకు ఉత్తమమైనది. అయితే మఱొక విధముగా కూడ యతిని అనుసరించ వీలగును. మొత్తము పాదములో 24 మాత్రలు. ఎనిమిదేసి మాత్రలకు యతినుంచి కూడ పద్యమును వ్రాయవచ్చును. అట్టి ఒక ఉదాహరణమును క్రింద చదవండి.

పృథ్వీ – జ/స/జ/స/య/లగ IUIIIU – IU I IIU – IUUIU 17 అత్యష్టి 38750

ప్రియుం దలచుచున్ – బ్రియా యనియెఁ దా – వియోగమ్ములోఁ
బ్రియుండు వనిలోఁ – బ్రియా యనియెఁ దా – వియోగమ్ములో
వియోగ మికపైఁ – బ్రియంబె యగునో – ప్రియా పృథ్విలో
వియోగ మికపైఁ – బ్రియంబె యగు నో – ప్రియా పృథ్విలో

ముగింపు

పాదములోని మాత్రల విఱుపు, పదముల విఱుపు పద్యములకు ఒక క్రొత్త విధమైన అందమైన అద్భుతమైన నడకను ప్రసాదిస్తుంది. లేకపోతే పద్యమనే చట్రములో పదాడంబరముతో వచనమును వ్రాసినట్లు ఉంటుంది. ఛందస్సు శారదాదేవి రెండు స్వరూపములైన సంగీత సాహిత్యములకు ప్రతీక. సంగీతము లేని సాహిత్యము బధిరత్వమే, సాహిత్యము లేని సంగీతము అంధత్వమే. వాగర్థా వివ సంపృక్తౌ అన్నదానిలోని వాక్కు సరస్వతీదేవి సంగీతస్వరమే. అందుకే అక్షరసామ్య యతిని గురులఘువుల అమరికను శ్రద్ధతో జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయించవలెను. పద్యమును వ్రాయునప్పుడు పదముల ఎన్నిక ఈ సంగీతమును ప్రదర్శించవలెను. అప్పుడే ఛందస్సు పాత్ర సార్థకమవుతుంది.

జెజ్జాల కృష్ణ మోహన రావు

రచయిత జెజ్జాల కృష్ణ మోహన రావు గురించి: జననం నెల్లూరు (1943).మదరాసులో SSLC వరకు.తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం. IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా;1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన; తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు.పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు.వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem. ఛందశ్శాస్త్రంలో కృషి,పరిశోధనకు గాను విరోధినామ (2009)సంవత్సరపు బ్రౌన్ పురస్కారాన్ని అందుకున్నారు. ...