పరిచయము
నాకు నచ్చిన వృత్తములలో మందాక్రాంతము ఒకటి. అందులో ఒక గాంభీర్యము, ఒక విభిన్నమైన గతి దాగి ఉన్నాయి. కాలిదాసకవి వ్రాసిన మేఘదూతము ద్వారా ఈ వృత్తము మిక్కిలి ప్రసిద్ధి కెక్కినది. ఈ వృత్తపు పుట్టుక, ఇందులో వ్రాయబడిన సందేశ కావ్యములనుగుఱించి ఇంతకు ముందే నేను ఆషాఢస్య ప్రథమ దివసే అనే వ్యాసములో చర్చించి యున్నాను. సుమారు పది సంవత్సరాలుగా నాకు తోచినప్పుడు మందాక్రాంత వృత్తములో, ఈ లయతో ఉండే ఇతర వృత్తములలో (శాస్త్రములో నున్నవి, నేను కల్పించినవి) అప్పుడప్పుడు పద్యములను వ్రాస్తూ వచ్చాను. సుమారు 150కు పైగా అలాటి పద్యములు ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. వాటిలో కొన్నిటిని ఎంపిక చేసి ఇప్పుడు ప్రచురించాలని ఆశ కలిగినది. దాని ఫలితమే యిది. తెలుగులో మందాక్రాంతమునకు ఒక్క యతియే. కాని నేను సంస్కృతములోవలె రెండు యతులను, విరామ యతులను వాడుతాను. అప్పుడే ఈ వృత్తములో ఉండే అపురూపమైన సౌష్ఠవము ప్రస్ఫుటమవుతుంది. మొదటి పట్టికలో నేను ఉపయోగించిన వృత్తముల వివరములను ఇచ్చినాను.
మందాక్రాంతము– మ/భ/న/త/త/గగ UUUU – IIIIIU – UIU UIUU 17 అత్యష్టి 18929
శ్రీవాగ్దేవీ – చెలఁగు చదువుల్ – సెప్ప వేగమ్ము రావా
శ్రీవారాశీ – సిరుల ధరపైఁ – జిందజేయంగ రావా
శ్రీవిశ్వాంబా – చిరసుఖములన్ – జిల్కి దీవించ రావా
కావన్ రారే – ఘనపదములన్ – గాఢమౌ భక్తి గొల్తున్ – మందాక్రాంత 1
అ-ఆ-ఇ-ఈ – యనగ మనసా – యమ్మనే దల్చుచుండెన్
ఉ-ఊ-ఋ-ౠ – యురల మదిలో – నొజ్జయే నిల్చియుండెన్
ఎ-ఏ-ఐ యం – చెలుగిడ హృదిన్ – హృష్టితో స్వామి దోఁచెన్
ఒ-ఓ-ఔ-అం – యొలుక గళమం – దోమనెన్ వాణి నాలో – మందాక్రాంత 2
ఆ సాయంత్ర – మ్మరుణ కిరణా – లందమై తోఁచెఁ గాదా
ఆ సాయంత్ర – మ్మలసగతితో – నాడినామందుఁ గాదా
ఆ సాయంత్ర – మ్మలరు హృదయా – లర్పణమ్మయ్యెఁ గాదా
ఈ సాయంత్ర – మ్మిచట నిను నే – నెంచఁగన్ రావు గాదా – మందాక్రాంత 3
ఈయాషాఢ – మ్మెదను విరహ – మ్మెంతగా నింపుచుండెన్
బాయంగా నిన్ – బ్రణయ సఖుఁడా – వర్షమందౌనె నాకున్
రేయిన్ లేదే – మృగధరుఁ డెటన్ – మ్రింగె నా మేఘవహ్నుల్
గాయమ్మార్పన్ – గలదె వెదుకన్ – గట్టిగా నౌషధమ్ముల్ – మందాక్రాంత 4
ఈ సాయంత్ర – మ్మినుని కిరణ – మ్మెఱ్ఱగా వెల్గుచుండెన్
ఈ సాయంత్ర – మ్మిపుడు పవన – మ్మెంతగాఁ దావి నిచ్చెన్
ఈ సాయంత్ర – మ్మిచట వనిలో – నెన్ని పుష్పాలు బూచెన్
ఈ సాయంత్ర – మ్మెడఁద నినె దా – నెందుకో పిల్చె రావా – మందాక్రాంత 5
ఎందున్నావో – హృదయసఖుఁడా – యిట్లు నేనొంటినైతిన్
సందెల్ లేవే – సరసముగ నా – సాంద్ర వర్ణాల నీడన్
ముందుండంగా – ముదము పెఱుఁగున్ – ముద్దు మోమున్ గనంగా
నుందున్ నీతో – నొరిమ వెలయన్ – హోళియే రోజురోజున్ – మందాక్రాంత 6
ఎన్నాళ్ళో నా – కిటుల విరహం – బీ విధానన్ సరేనా
నిన్నే గాదా – నిజముగ సదా – నేను దల్తున్ ముదమ్మై
కన్నీళ్ళన్ నే – గలగి యెపుడున్ – గార్చజాలన్ గదా, యో
కన్నయ్యా నన్ – గనుల గనరా – కారు మబ్బుల్ నశించున్ – మందాక్రాంత 7
ఔరా పుష్పా – లలరె వనిలో – నందముల్ జాల చిందన్
భారాక్రాంతం – బగు తరులతల్ – వర్ణ వైచిత్రి నొందన్
కోరెన్ నిన్నే – కులుకు నెదయున్ – గొప్పగా నాశ నిండన్
శ్రీరంగా రా – చిఱునగవులన్ – జిన్ని జీవమ్ము పండన్ – మందాక్రాంత 8
చింతాక్రాంతా – చిఱునగవులన్ – జెట్టుపై నుంచినావా
అంతమ్మెందో – యది తెలియదే – యాత్ర యీ ధాత్రిపైనన్
గాంతుల్ నిండున్ – గనుల సొబగై – గట్టిగా నవ్వుమా నీ
భ్రాంతుల్ వీడున్ – బ్రదుకు వఱలున్ – బాలపొంగై ముదమ్మై – మందాక్రాంత 9
నీవేనా నా – నిదుర కలగా – నెమ్మదిన్ దోచినావా
నీవేనా నా – నిధికి ఫణిగా – నిష్ఠతో వేచినావా
నీవేనా నా – నిశికి శశిగా – నింగిలో వెల్గినావా
నీవేనా నా – నెనరు నదిగా – నిండుగాఁ బారినావా – మందాక్రాంత 10
పాలై పొంగెన్ – వలపు తలపుల్ – ప్రక్క నుండంగ రావా
చాలింకన్ నీ – చలము చతురా – చక్కగా నాడ రావా
ఆలస్యమ్మే – యమృతము విష – మ్మంచు వారందురే హా
వేళాయెన్గా – ప్రియరజనిలోఁ – బ్రేమగీతాలఁ బాడన్ – మందాక్రాంత 11
బాలానందా – ప్రణతు లివిగో – భావరాజీవసూర్యా
కాలాతీతా – కమలనయనా – కామితార్థప్రదానా
లీలాలోలా – ప్రియతరగుణా – ప్రేమపూర్ణప్రియాంగా
సాలంకారా – సముదహృదయా – సన్నుతా చిత్రమాలీ – మందాక్రాంత 12
మందమ్మై నా – మనసు పిలిచెన్ – మౌన మింకేల నీకున్
ఛందమ్మున్ నా – స్వరపు లయతో – సంతసమ్మంది నీకై
మందాక్రాంత – మ్మగు పదములన్ – మంద్రమంద్రమ్ముగా నేఁ
జిందింతున్ రా – చిలుకు సుధగా – చేరగా మోదవీథుల్ – మందాక్రాంత 13
మందాక్రాంతం – బలఘుగతితో – మాలగా నల్లి వేతున్
సౌందర్యమ్మున్ – సరసగతితో – శబ్దచిత్రమ్ము లిత్తున్
నందానందా – నవపదములన్ – నాట్య వృత్తమ్ము సేతున్
బృందారణ్య- ప్రియ సువదనా – ప్రీతి జూపంగ రారా – మందాక్రాంత 14
మందాక్రాంత – మ్మగును ముదమై – మానసమ్మందు దీప్తిన్
స్కందా సన్మం-గళపు నవరా-గమ్ము నిండెన్ నిజమ్మై
యందమ్మౌ యీ – యతివ హృదయ – మ్మల్లకల్లోల మయ్యెన్
విందై రారా – విరియు సిరిగా – వీర యీ వల్లి చెంతన్ – మందాక్రాంత 15
మందాక్రాంతా – మఱల యిటు రా – మానస మ్మిందు వేచెన్
సందీప్తమ్మై – ఛవులు వెలిఁగెన్ – సందియ మ్మింక చాలున్
జిందించంగన్ – జిఱునగవులన్ – శ్రీధరా వేగ రారా
బంధించంగన్ – భవపు ముడులన్ – బర్హిపింఛా దరిన్ రా – మందాక్రాంత 16
రాగోద్దీపా – రసరుచులతో – రంగులన్ నిండనిమ్మా
తీఁగన్ బూలన్ – దినము వనిలోఁ – దృప్తిగాఁ గాంచుదామా
భాగమ్మై నా – బ్రదుకు సగమై – భవ్యమై నుంద మెప్డున్
మ్రోఁగన్ ముద్దుల్ – ముదము లలరన్ – ముగ్ధులై జేరుదామా – మందాక్రాంత 17
రావా చూడన్ – రసభరితమౌ – రంగులన్ జిందు వెల్గున్
నీవే గాదా – నెనరు నిధియున్ – నిన్న నేఁడిందు రేపున్
మోవిన్ ముద్దుల్ – ముదము నిడఁగా – మోహనా ముందు రారా
చావైనన్ నీ – సరసఁ గలుగున్ – జాలు వేఱేల నాకున్ – మందాక్రాంత 18
లీలారామా – ప్రియము లొలుకన్ – బ్రేమగీతమ్ము వ్రాతున్
సాలంకారా – సరసములతో – సందెలో నాలపింతున్
కేళీలోలా – కెలవు సిరిగా – గేహమున్ జేర రారా
మాలన్ వేతున్ – మనసు మురియన్ – మందహాసమ్ముతో రా – మందాక్రాంత 19
వాఁడే వీఁడా – వయసు వడిలో – వాంఛతో బిల్చినాఁడే
వాఁడే వీఁడా – వలపు కలలో – వచ్చి ముద్దిచ్చినాఁడే
వాఁడే వీఁడా – ప్రణయ సరసిన్ – బాటలన్ బాడినాఁడే
వాఁడే వీఁడా – వల దనుచు నన్ – బంధమున్ ద్రుంచినాఁడే – మందాక్రాంత 20
వాదా లేలా, – వదనము గనన్ – వంద విశ్వాలు వెల్గెన్
బోధించన్ రా, – బుధులు పొగడన్ – మోదవేదమ్ము లెన్నో
నాదశ్రీలన్ – నవత జెలఁగన్ – నర్మిలిన్ బాడుచుందున్
పోదున్ నీకై – భువనతలి నేన్ – పుష్పదామమ్ముతోడన్ – మందాక్రాంత 21
వేణూనాద – ప్రియ రవములన్ – బ్రేమతో నూఁదఁగా రా
యానందింతున్ – హరియనుచు నే – నాశ లింపారుచుండన్
బ్రాణ మ్మీవే – ప్రణయ మధువుల్ – బారఁగా ధారగా రా
మేనుల్ బొంగున్ – మృదువుగ ననున్ – మెల్లఁగాఁ గౌఁగిలించన్ – మందాక్రాంత 22
శృంగమ్మందున్ – సితముగ హిమ – శ్రేణులై మంచు వెల్గెన్
సంగీతమ్మున్ – స్వరభరితమై – చక్కగాఁ బాడెఁ బక్షుల్
నింగిన్ జూడన్ – నిగనిగలతో – నిండె జీమూతమాలల్
రంగై పూచెన్ – రసహృదయముల్ – రాగసంధ్యన్ రమించన్ – మందాక్రాంత 23
సానందమ్మై – సరసి యలలన్ – జల్లఁగా గాలి వీచెన్
గానంగా నిన్ – గనులు వెదకెన్ – గైతలో నాశ లేచెన్
మౌనమ్మై యీ – మనసు దలఁచెన్ – మాయలో జారి పోవన్
వీణావాణిన్ – వినగ జెవులన్ – విశ్వమే మాఱిపోవున్ – మందాక్రాంత 24
సాయంత్రమ్మా – సరసుఁ డెచటే – చాల నేఁ గ్రుంగుచుంటిన్
సాయమ్మందన్ – సఖునికొఱకై – సందియమ్మందు నుంటిన్
వ్రాయన్ రాఁడో – వలపు కవితల్ – ప్రాణమున్ దాఁకి లేపన్
నాయాశాబ్ధిన్ – నగవుటలలన్ – నా శశిన్ జూడ నౌనో – మందాక్రాంత 25
సారంగమ్మై – సరసమతియున్ – జాల నృత్యమ్ము లాడెన్
కోరెంగాదా – కుతుక మొలుకన్ – గొల్లలై యాశ లెన్నో
చేరంగా నిన్ – జెలియ దలఁచెన్ – జేర రావేల నన్నున్
శ్రీరంగా నా – చిర సఖుఁడవై – శ్రీకర మ్మీయ రారా – మందాక్రాంత 26
సౌందర్యమ్మా – చలనము లిలన్ – జంచలమ్మా జ్వలమ్మా
అందమ్మందే – ననుచితముగా – నాడు నీ మానసమ్మో
బంధమ్మెల్లన్ – వయసు కలయా – వర్ణజాలాల వీడో
ముందేమౌనో – ముదపు సెలలో – ముక్తమై పోవునేమో – మందాక్రాంత 27
సౌందర్యమ్మే – సరసనటనల్ – జక్కఁగా నాడెనేమో
ముందాడెన్గా – ముదిత మగుచున్ – మువ్వలన్ దాల్చి భావా-
నందజ్యోతిన్ – నగుచు వెలుఁగై – నాకమున్ దాఁకుచుండెన్
మందాక్రాంత – మ్మగుచు మదిలో – మాధవాస్యమ్ము నిండెన్ – మందాక్రాంత 28
హింసల్ వద్దోయ్ – హృదిని గొనవా – యింద్రనీలాభ్రదేహా
హంసిన్ జూడన్ – హరి దరికి రా – హారకేయూరభూషా
కంసధ్వంసా – కమలనయనా – కామకేళీవిలాసా
వంశీలోలా – పఱుగు లిడుచున్ – పారవశ్యమ్ముతో రా – మందాక్రాంత 29
కాకీ కాకీ – కడలి కొనలో – కాటుకేమైన ఉందా
కేకీ కేకీ – కెరలితివి నీ – కెవ్వరిచ్చారె నాట్యం
ఆకాశంలో – అలలు అలలై – ఆడు ఓ మేఘమాలా
నాకోసం ఆ – నగవు విరితో – నాతి ఏమంది నీతో – మందాక్రాంత 30 (వాడుక భాషలో)
చీకూ చింతా – చెలియ వలదే – చేర రావేల నాతో
నీకూ నాకూ – నెనరు గల దీ – నేస్త మెంతెంత హాయి
శ్రీకారంతో – సిరుల నియగా – చేరవే వేగ నాతో
బాకీ లేదే – బదుకు పుటలో – పద్దులా ముద్దు లీయ – మందాక్రాంత 31 (వాడుక భాషలో)
వ్రాయాలండీ – రచనలుగ పల్ – రమ్య పద్యమ్ము లెన్నో
పూయాలండీ – పులక లిడగన్ – పూర్ణ వర్ణమ్ము లెన్నో
చేయాలండీ – చిరునగవుతో – చిత్ర కార్యమ్ము లెన్నో
మోయాలండీ – ముదము గలుగన్ – మూపుపై మోత లెన్నో – మందాక్రాంత 32 (వాడుక భాషలో)
మందాక్రాంతము– మ/భ/న/త/త/గగ UU UU IIII – IUU IU U IUU 17 అత్యష్టి 18929 4,4,4 – 5,5,5 మాత్రల విఱుపుతో
శ్యామా, సంధ్యా సమయము – సమీరమ్ము వీచెన్ సుఖమ్మై
సోమాకార మ్మలరెను – సుధాపాత్రగా నాకసానన్
ప్రేమోద్దీపా నయముగఁ – బ్రియోక్తుల్ వచించంగ రారా
సామోదమ్మై సరసను – సమీపించరా సారసాక్షా – మందాక్రాంత 33
కావ్యం వ్రాసా తలపుల – కలంతో మథించే ముదంతో
నవ్యం నవ్యం రసముల – నదమ్మౌ సుధాబుద్బుదమ్మౌ
దివ్యం దివ్యం ధర యిది – దివమ్మౌ నభీష్టాలయమ్మౌ
భవ్యంబౌ నీ బ్రదుకులు – వరాలౌ ప్రమోదస్వరాలౌ – మందాక్రాంత 34 (వాడుక భాషలో)
మందాక్రాంతము– మ/భ/న/త/త/గగ UUUU – IIIII UUI – UUI UU 17 అత్యష్టి 18929 మొదటి నాలుగు గురువుల పిదప వనమయూరపు లయతో
ఆలించన్ రా – యలలవలె నా కోర్కె – లా నింగిఁ దాఁకెన్
పాలించన్ రా – ఫలితమవ నా పూజ – ప్రార్థిచుచుందున్
లాలించన్ రా – లలన కిట డెందమ్ము – లాస్యమ్ముఁ జేసెన్
తేలించన్ రా – తెలుఁగు నుడి నేఁ బాడి – దీపమ్ము నుంతున్ – మందాక్రాంత 35
మళ్ళీ రావే – మధురముగ మాటాడు – మౌనమ్ము వద్దే
వల్లీ రావే – పదములను జక్కంగఁ – బాడంగ ముద్దే
చల్లంగా రా – సదమలము గానమ్ము – సంతోషకారీ
ఫుల్లమ్మయ్యెన్ – ముదితమగు డెందమ్ము – పూవై మిటారీ – మందాక్రాంత 36
మోదమ్మెందున్ – భువనమునఁ బుష్పించు – పూలన్ని నీకై
వేధించంగా – వివశ నిట నుప్పొంగెఁ – బ్రేమమ్ము నీకై
కాదంబమ్మై – కవనములఁ బాడంగఁ – గల్పింతు నీకై
నాదించంగా – నవముగను సృష్టింతు – నాకమ్ము నీకై – మందాక్రాంత 37
మందారమాల లేక లలితాక్రాంత– స/త/న/య/య/య IIUUU – IIIIIU – UIU UIUU 18 ధృతి 37860
కనకాంగీ నీ – కనుల వెలుఁగుల్ – కాంచనాబ్జమ్ములేనా
వనితా నీ యా – వదనము గనన్ – బద్మముల్ ఫుల్లమయ్యెన్
వినుమా గీతిన్ – బ్రియమగు గతిన్ – వింత రాగంపు చాయన్
నిను జూడంగా – నెనరు విరియున్ – స్నేహ దీపమ్ము వెల్గున్ – మందారమాల లేక లలితాక్రాంత 1
కలలో నీవే – కమలనయనా – కారు మేఘమ్మువాఁడా
తలలో నీవే – తరళహృదయా – తాండవ మ్మాడువాఁడా
అలలో నీవే – యలరు నగవై – యందమున్ జిందువాఁడా
చెలికాఁడా రా – చెలికి నవమై – జీవితమ్మిచ్చు ఱేఁడా – మందారమాల లేక లలితాక్రాంత 2
ప్రియ రాగాలన్ – వినుమ త్వరగాఁ – బ్రేమతోఁ బాడుచుంటిన్
నయగారాలన్ – నవము నవమై – నందమై చిల్కుచుంటిన్
లయతోడన్ నే – లలిత పదముల్ – లాసమై పల్కుచుంటిన్
స్వయమై రమ్మీ – జ్వలిత హృదిలోఁ – జల్లఁగా హైమ ధారల్ – మందారమాల లేక లలితాక్రాంత 3
మధురమ్మౌ నీ – మనసు వరదన్ – మగ్నమై యుండిపోనా
మధురమ్మౌ నీ – మమత వలలో – మత్స్యమై చిక్కిపోనా
మధురమ్మౌ నీ – మరుల గుడిలో – మంత్రమై మ్రోగిపోనా
మధురమ్మౌ నీ – మదిర చవిలో – మత్తుతో నిండిపోనా – మందారమాల లేక లలితాక్రాంత 4
లలితాక్రాంతా – లయల సొబగై – లాస్య మాడంగ రావా
కలలో నీవీ – కలికి యెదలోఁ – గారు చిచ్చుంచినావా
యలయై రావా – యలఘుతర మో – దాబ్ధిలో ముంచ రావా
తెలియందమ్మై – తెలుఁగు కవితై – తేనె లూరించ రావా – మందారమాల లేక లలితాక్రాంత 5
విరహాంబోధిన్ – విచలితగ నేన్ – వేగమై మున్గుచుంటిన్
సరసాకారా – సముదముగ నన్ – జల్లఁగా దాఁకమంటిన్
మఱుగింకేలా – మఱల మఱలన్ – మానస మ్మిందు దల్చెన్
నిరవద్యమ్మై – నిశి ఘడియలో – నిన్నె డెందమ్ము బిల్చెన్ – మందారమాల లేక లలితాక్రాంత 6
హరి రాధేశా – హరుస మిడ రా-యంచ హావమ్ములన్ రా
వర ప్రాణేశా – ప్రణయమునఁ నీ – వాణి పద్యమ్ములేగా
సిరి నీవేగా – చెలువముల నన్ – జేరు చిత్తమ్ము నీకే
దరి రావేలా – తలఁపులకు నృ-త్యమ్ము తాళమ్ము నీవే – మందారమాల లేక లలితాక్రాంత 7
మందారమాల లేక లలితాక్రాంత– స/త/న/య/య/య IIUUU – IIIII UUI – UUI UU 18 ధృతి 37860 IIUUU పిదప వనమయూరపు లయతో –
మధురాక్రాంతా – మధురతర గీతాలు – మాయింట మ్రోఁగన్
మృదు భావమ్మై – మెదలుచును డెందాన – మెల్లంగ రావా
పద పద్మమ్ముల్ – వదల నిఁక నేనెప్డు – వందింతుఁ గేలన్
బుధ సంసేవ్యా – ముదమలర నాకిమ్ము – మోక్షమ్ము దేవా – మందారమాల లేక లలితాక్రాంత 8
హరి రాధేశా – హరుస మిడ రాయంచ – హావమ్ములన్ రా
వర ప్రాణేశా – ప్రణయమునఁ నీ వాణి – పద్యమ్ములేగా
సిరి నీవేగా – చెలువముల నన్ జేరు – చిత్తమ్ము నీకే
దరి రావేలా – తలఁపులకు నృత్యమ్ము – తాళమ్ము నీవే – మందారమాల లేక లలితాక్రాంత 9
కోమలకాంత– UIIUU – IIIIIU – UIU UIUU 18 ధృతి 37863
ఆమనిలో నీ – యవనిపయినన్ – హ్లాదమై పూలు పూచెన్
ప్రేమపయోధిన్ – బ్రియరజనిలో – బ్రీతిగా నీఁదుదామా
కామలతాంతా – కమలనయనా – కాకలీనాదలీలా
నా మనసిత్తున్ – నయముగ సకీ – నాకలోకమ్ముఁ దెత్తున్ – కోమలకాంతా 1
ఏమని జెప్పన్ – హృదయ మది ని-న్నెందుకో చూడ గోరెన్
శ్యామలమై యా – జలధరతతుల్ – జల్లఁగా నింగి దేలెన్
కామలతా నా – కవిత వినఁగాఁ – గన్నులే మాటలాడున్
కోమలకాంతా – కొలనుదరి రా – కోర్కెలే కాటువేయున్ – కోమలకాంతా 2
కానుక నీకే – కనులు దెఱువన్ – గళ్ళ ముందుండు నీకై
ఈ నవ వర్ష – మ్మెపుడు శుభమై – హృష్టితో నిండు నీకై
తేనెల సోనల్ – తియగ తియగాఁ – దృష్ణఁ దీర్చున్ బదమ్మై
తాననతానా – తకిటధిమితా – తానతందానతానా – కోమలకాంతా 3
చంద్రుని జూడన్ – సకియ మదిలో – జల్లగా దల్చినా నేన్
చంద్రనిభా నీ – సరసగతులే – స్వప్నమై నిల్చె నాలో
మంద్రముగా నీ – మనసు బలికెన్ – మానసోల్లాసగీతిన్
ఆంధ్రపురంధ్రీ – హరుస మిడఁగా – నాశతో రమ్ము చెంతన్ – కోమలకాంతా 4
పర్ణము లెన్నో – పడఁగ ధరపై – వర్ణముల్ నాట్యమాడెన్
గర్ణములందున్ – గరగుచుండెన్ – గానముల్ బైడివోలెన్
అర్ణవమయ్యెన్ – హరుస మలలై – యందముల్ బొంగి పొర్లెన్
వర్ణన లేలా – ప్రణయకవితల్ – పారెఁగా గంగరీతిన్ – కోమలకాంతా 5
వేంకటనాథా – విమలచరితా – విశ్వరూపప్రసాదా
సంకటహారీ – సకల విదితా – శ్యామలాంగా సుహాసా
పంకజనాభా – పరమపురుషా – పద్మచిత్తప్రకాశా
ఇంకను నాకీ – యిడుము లిలపై – నెప్పుడో ముక్తిగల్గున్ – కోమలకాంతా 6
రాగోత్కళిక– UUIIU – IIIIIU – UIU UIUU18 ధృతి 37869
ఆ నాఁ డలలై – యమృత ధునితో – నందమై పాడినావే
గానోత్కళికా – కవిత గుళికా – కావ్యవారాశినౌకా
ఈ నాఁ డిటులన్ – హృదయమున నా – కెంతయో బాధ గల్గెన్
రా నా మదిలో – రసము జిలుకన్ – ప్రాణమే లేచివచ్చున్ – రాగోత్కళికా 1
ఈ యామనిలో – హృదయ మలరన్ – హృద్యమై పూలు బూచెన్
ఈ యామనిలో – నెదుట గనఁగన్ – హేమ సంధ్యల్ వెలింగెన్
ఈ యామనిలో – నిలయు మురిసెన్ – నృత్యగీతాలతోడన్
ఈ యామనిలో – నిచట మదిలో – నెందు నీచింతలేగా – రాగోత్కళికా 2
చిత్రమ్ముగ నీ – చెలువు మొగమున్ – జిత్రమై గీచితిన్ నేన్
చిత్రమ్ముగ నీ – చిఱునగవులన్ – చెన్నుగా దోచితిన్ నేన్
చిత్రమ్ముగ నీ – చెలిమి కలిమిన్ – శ్రీలుగా గోరితిన్ నేన్
చిత్రమ్ముగ నీ – చిఱు నటనలన్ – జిందుగా జూచితిన్ నేన్ – రాగోత్కళికా 3
నిత్యానందము– UUUII – IIIIIU – UIU UIUU 18 ధృతి 37881
నిత్యానందము – నిను గనుటయే – నీరజాక్షా ముకుందా
సత్యాకారము – సఖుఁ డనుటయే – సచ్చరిత్రా మురారీ
అత్యాదర్శము – లగును కథలే – యప్రమేయా యనంతా
ప్రత్యేకత్వము – పరమపదమే – పాహిమాం ప్రత్యగాత్మా – నిత్యానందము 1
నీవేనా నను – నిముసములలో – నేర్పుతో మార్చినావే
నీవేనా నను – నిసి దినములో – నిప్పులోఁ గాల్చినావే
నీవేనా నను – నిదుర కలలో – నీడ గావించినావే
నీవేనా నను – నెనరు ముడితో – నేస్తమై కల్పినావే – నిత్యానందము 2
వేళాయెన్ గద – విరులవనిలో – వేచుచున్నాను నీకై
మూలన్ వీణను – ముదము నిడఁగా – మ్రోఁగజేయింతు రావా
నాలోఁ జిందిన – నవము నవమౌ – నాదపీయూషధారల్
పాలేఱాయెను – పదపు సడిలోఁ- బల్కులే మున్గిపోయెన్ – నిత్యానందము 3
కమలదళాక్ష– IIIIUU – IIIIIU – UIU UIUU 19 అతిధృతి 75728
అట జని గాంచన్ – హరుస మలలై – యాపకన్ నన్ను ముంచెన్
నటనము జేతున్ – నగుచు నగుచున్ – నల్లనయ్యన్ దలంచన్
ఇటునటు వాఁడే – యెడఁద గుడిలో – హృద్యమౌ మూర్తి గంటిన్
తటమున నుంటిన్ – దనర నదిపై – దర్శన మ్మివ్వ రాఁడో – కమలదళాక్షా 1
అమలినవేశా – అచల హృదయా – అక్షయా౽నందరూపా
కమలదళాక్షా – కమలములతోఁ – గాలి కెందమ్మిఁ గొల్తున్
సుమముల మాలన్ – సుచరితునకున్ – సుందరమ్మై రచింతున్
నమనము లిత్తున్ – నవనవముగా – నన్ను జేయంగ రావా – కమలదళాక్షా 2
మనసున నీవే – మమతల వలన్ – మత్స్యమై చిక్కుకొంటిన్
మనసున నీవే – మధుర మురళీ – మాయలో మాయమైతిన్
మనసున నీవే – మగత నిదురన్ – మన్మథున్ నేను గంటిన్
మనుగడ నీవే – మరణ మయినన్ – మంచిగా నెంచుకొంటిన్ – కమలదళాక్షా 3
లలితముగాదా – లసిత హృదిలో – రాగరత్నమ్ము వెల్గన్
జలితముగాదా – సలిలమువలెన్ – జల్లఁగాఁ బ్రేమ పారన్
కలయగుగాదా – కనులఁ బడఁగాఁ – గారు మేఘమ్ము వాఁడున్
అలలగుగాదా – యతని గనఁగా – నందమౌ డెంద మెల్లన్ – కమలదళాక్షా 4
అమరలతిక– IIUIIU – IIIIIU – UIU UIUU 19 అతిధృతి 75740
అనురాగమయీ – అమరలతికా – యామినీపూర్ణబింబా
దినరాత్రులు నేఁ – దృషితుఁడనుగా – తృప్తి నీయంగ రావా
ప్రణయాబ్ధిమణీ – ప్రథమకిరణా – ప్రాణపీయూషపాత్రా
కన రమ్ము ననున్ – గమలవదనా – కంజపత్రాయతాక్షీ – అమరలతికా 1
ఉదయాభ్రములో – నుష సొబగుతో – నుజ్జ్వలమ్మై వెలింగెన్
హృదయోత్సుకమై – యినకరతతుల్ – హృద్యమై నిద్ర లేపెన్
ముద మిచ్చుచు నా – పులుఁగుల సడుల్ – భూరుహమ్మందు నిండెన్
పదముల్ బలు నే – వరగళముతో – బాడ యత్నింతు నీకై – అమరలతికా 2
ఒక నీ నగవే – ఉదయరవిగా – నుల్లమున్ బూచు గాదా
ఒక నీ పదమే – యునికికి సదా – యొక్క తార్కాణమౌగా
సకల మ్మిక నీ – చరణములకే – శ్యామ సంతృప్తి నిత్తున్
మకరాంకపితా – మధుర మురళీ – మంజులస్వానకర్తా – అమరలతికా 3
మనసా వలదే – మరులు గొనకే – మాపులో వాఁడు రాఁడే
కనులా వలదే – కరుగకు వ్యధన్ – గౌగిలించంగ రాఁడే
చిన యాశలతో – చిఱునగవుతో – జీవిత మ్మెప్పుడోగా
వినవే వినవే – విరహచితిలో – వేగకే మాడిపోకే – అమరలతికా 4
మధురాపురమే – మనకు నిజమై – మాధవుండుండు చోటే
అధర మ్మెపుడున్ – హరిగుణములే – యాగకన్ బాడుచుండున్
సుధ గారునుగా – సుమసమహృదిన్ – సుందరున్ బూజ సేయన్
మది పారునుగా – మమత నదియై – మౌనరాగాబ్ధి జేరన్ – అమరలతికా 5
కనకాలంకృత లేక నవరాగాంజలి– IIUUII – IIIIIU – UIU UIUU 19 అతిధృతి 75764
కనకాలంకృత – కలల కడలీ – కాకలీనాదలీలా
నను రమ్మంటివి – నయముగ నిటన్ – నవ్వు రాజిల్లు మోమున్
మనసందుండెను – మధురతరమై – మౌనరాగార్ద్ర గీతుల్
ప్రణయామోదిని – ప్రథమ దినమా – పంచబాణున్ జపించన్ – కనకాలంకృత లేక నవరాగాంజలి 1
గగనమ్మందునఁ – గనఁబడె గదా – కాలమేఘంపు ఛాయల్
పొగలై నింగిని – ముసురుకొనెఁగా – మోదమే లేని రేయిన్
సగమైపోతిని – సడుల బెడదన్ – జాల ధైర్యమ్ము తగ్గెన్
మగరాయా యిట – మగువ సరసన్ – మక్కువన్ జేర రారా – కనకాలంకృత లేక నవరాగాంజలి 2
నను పాలింపగ – నడచి యిటకున్ – నాథ రావేల నీవున్
విను మీ గీతము – విమల హృదితో – బ్రేమతో వ్రాసితిన్ నేన్
మనసం దుందువు – మధురమయమై – మందరోద్ధార నీవే
ప్రణయోత్సాహపు – ప్రథమ రవముల్ – ప్రార్థనారూప మయ్యెన్ – కనకాలంకృత లేక నవరాగాంజలి 3
నవరాగాంజలి – నయముగ హృదిన్ – నాకుఁ దోఁచంగ నీకై
భువన మ్మెల్లను – ముదపు సరసిన్ – మోహనా పొంగె నీకై
నవనీతమ్మన – నవరసరుచుల్ – నాల్కపై నాట్యమాడెన్
శ్రవణానందము – సరస పదముల్ – జారి తేనెయై పారెన్ – కనకాలంకృత లేక నవరాగాంజలి 4
నిసిలో తారక – నిను బిలిచెనే – నీరవమ్మైన వేళన్
రసరాసాంబుధి – రతనములకై – రాత్రిలో మున్గినావా
మసృణ మ్మైనవి – మమత విరులన్ – మాలగా నల్లినావా
దెసలన్ వెలుఁగులు – దినము గడచెన్ – దివ్యమై జ్యోత్స్న నిండెన్ – కనకాలంకృత లేక నవరాగాంజలి 5
మనసా వానిని – మఱువ నవదే – మాయలో నింపినాఁడే
తనువా వానిని – ధరణిపయినన్ – దల్వకుండంగ లేనే
మును నే జేసిన – మొదటి యఘమా – మోము జూపంగ రాఁడే
కనరాకుండినఁ – గడకు విషమై – కాలమే కాటు వేయున్ – కనకాలంకృత లేక నవరాగాంజలి 6
సారసనయన– UIIIIU – IIIIIU – UIU UIUU19 అతిధృతి 75743
ఉల్లసితముగా – నుదయమగు నేఁ – డుర్విపై భాస్కరుండున్
బల్లవితముగా – వనియు లతలన్ – బర్వకాలంబువోలెన్
ఎల్లరి హృదులం – దిరవు గొనెఁగా – నీ వసంతమ్ము సొంపై
మల్లెలవలె స-న్మతులు విజయ-మ్మౌను గ్రొంగ్రొత్త యేటన్ – సారసనయనా 1
నన్ను మనసుతో – నవనవముగా – నమ్మమంచందు వెప్డున్
నిన్ను మనసులో – నిరతము హరీ – నేను సేవింతుఁ గాదా
సన్నుతు లివిగో – సరసిజముఖా – చారువేణూనినాదా
కన్నులు మణులో – కరుగు హిమమో – కాన రావేల యిప్డున్ – సారసనయనా 2
సారసనయనా – సరసహృదయా – శ్యామలాంగా సుహాసా
వారణహరణా – పరమపురుషా – వైజయంతీవిలాసా
నీరజచరణా – నిగమగమనా – నిర్ణాయకా నియంతా
హారవిలసితా – హరుస మిడ రా – హ్లాదమూర్తీ యనంతా – సారసనయనా 3
ఆమనిచెల్వము– UIIUII – IIIIIU – UIU UIUU 19 అతిధృతి 75767
ఆమని చెల్వము – లలరె వనిలో – హర్ష సంపత్కరమ్మై
రాముఁడు సూపెను – రమణికిఁ దనున్ – రంగుతో వెల్గు పూలన్
శ్రీమతి సీతయు – సిరుల తరువుల్ – చిత్రమో యంచు దల్చెన్
భూమికి కూతురు – భువికిఁ బతితో – భూమి తల్లిన్ రమించెన్ – ఆమని చెల్వము 1
గుమ్మని బిల్తును – గుటిల గతులన్ – గుత్సితా మానకున్నన్
అమ్మయుఁ జెప్పఁగ – నతని మదిలో – నప్పుడే భీతి గల్గెన్
గుమ్మని బిల్వకె – గొడుగునఁ దనున్ – గుండ్రమై చుట్టు నన్నున్
అమ్మయుఁ గౌగిలి – నతని గొనియెన్ – హ్లాద ముప్పొంగి పొర్లన్ – ఆమని చెల్వము 2
వేణువు నూఁదుచు – విరహము నెదన్ – వేగ కల్పించువాఁడా
వీణను మీటుచుఁ – బ్రియపు నుడులన్ – బ్రేమతో బల్కువాఁడా
గానము సేయుచు – కలగు మదిలో – గాయమున్ మాన్పువాఁడా
ఏమని జెప్పుదు – నిచట భువిలో – నెల్ల నీవేగ నాకున్ – ఆమని చెల్వము 3
ఆకాశసుమము– UUIIII – IIIIIU – UIU UIUU 19 అతిధృతి 75773
ఆకాశసుమము – లగుఁగద కలల్ – హర్ష మింకెట్లు గల్గున్
రాకాశశి సుధ – రజని ఘడియన్ – రక్తి గట్టించ లేదే
ఆకారము గన – నతిగ నిట నే – నాత్రుతన్ జూచుచుంటిన్
నీకై జగమున – నిను దలచుచున్ – నేను వేసారియుంటిన్ – ఆకాశసుమము 1
ఆ తారక యిట – నవని గల నా – యంతరంగమ్ముఁ జూచెన్
చేతమ్మున గల – చెలువపు కలన్ – జిత్రవర్ణమ్ము నింపెన్
ప్రీతిన్ గనె మది – ప్రియతముఁడెటో – వేగ రాఁడెందు బోయెన్
జూత మ్మిక మృదు – సుమధుర నిశిన్ – సుందరుం డేల రాఁడో – ఆకాశసుమము 2
నీ గీతికలను – నెనరు విరులన్ – నేను వర్ణింపలేనే
రాగాతిశయము – రసహృదయములన్ – రక్తిఁ గట్టించు గాదా
సౌగంధికముల – సదమల ఛవుల్ – సత్సుగంధమ్ము నింపెన్
ఆగంతుకుడయి – యతిథియయి నా – యాస్తులన్ దోచినావే – ఆకాశసుమము 3
సామజగమన– UIIIIII – IIIIIU – UIU UIUU 20 కృతి 159743
కమ్మని గరువలి – కడు సొబగుతో – గంధమున్ దెచ్చె నింపై
రమ్మని బిలిచెను – లలితతరమై – రత్నపుష్పాలు రాలెన్
ఝుమ్మనె లతికల – సురవములతోఁ – జొక్కె నా షట్పదమ్ముల్
ఇమ్మగు ఘడియల – నిలయు వఱలెన్ – హృద్య వాసంత వేళన్ – సామజగమన 1
మల్లెల గమగమ – మనసు దలఁచన్ – మంత్రముగ్ధమ్ము గయ్యెన్
మెల్లగ బదములు – మెదలఁ బెదవిన్ – మెండుగా నాద మయ్యెన్
ఫుల్ల కుసుమములు – ముదము నలరెన్ – మోహనా చూడ రావా
ఉల్లము లికపయి – నొకటి యవఁగా – నొక్క భావమ్మె గాదా – సామజగమన 2
సామజగమనుని – సరసిజముఖున్ – సారసాక్షున్ ముకుందున్
కాముని జనకుని – కమలకుఁ బతిన్ – గమ్ర వేణూవినోదిన్
మామను దునిమిన – మదగజహరున్ – మాయలో ముంచువానిన్
బ్రేమను గొలుతును – విజయహితునిన్ – వేయి పుష్పాలతో నేన్ – సామజగమన 3
సరసీరుహముఖి– IIUIIII – IIIIIU – UIU UIUU 20 కృతి 151548
పదపంకజములఁ – బడెద వరదా – పార్థరక్షా ముకుందా
సదయా సదమల – సరసహృదయా – సారసాక్షా మురారీ
నిధి నా బ్రదుకున – నిరత మిలపై – నీవెగా నిత్యసత్యా
ముదమొందునుగద – పులక లిడుచున్ – మోహనా మోము జూడన్ – సరసీరుహముఖి 1
ప్రణయాంబుధి గల – రతనముల నీ – రమ్య పాదాల నుంతున్
ప్రణయాంబరమున – రజతశశియై – రాజిలన్ జూతు వెల్గున్
ప్రణయాకరమున – వనజములతో – భాసిలన్ మాల గూర్తున్
ప్రణయాలయమున – ప్రణమిలుచు నే – భక్తితో ప్రస్తుతింతున్ – సరసీరుహముఖి 2
విరజాజులు బలు – విరిసె వనిలో – వేయి నవ్వుల్ వెలింగెన్
జిఱు గాజులు మెల – చెలఁగె సడితోఁ – జేతులన్ గీతులౌచున్
వర రాగిణి సుధ – పరుగు నదిగా – వాణితో జేయ రావా
సరసీరుహముఖి – సరసతరమై – చక్కఁగాఁ బాడ రావా – సరసీరుహముఖి 3
భృండి– IIIIUII – IIIIIU – UIU UIUU 20 కృతి 151536
కవితల వ్రాసితిఁ – గమలనయనా – కాటుకన్ దిద్ది నీకై
యివి జననమ్మగు – హృదయసరసిన్ – భృండులై లేచి యాడున్
భువనపు టెల్లల – ముదము నొసఁగన్ – బుల్గులై యుద్గమించున్
రవివలెఁ గాంతుల – రమణఁ బఱచున్ – రంజిలంగా నుషస్సుల్ – భృండి 1
తెలుఁగున గీతము – దినము దినమున్ – దీయఁగాఁ బాడవేలా
కలుగును మోదము – గళము వినఁగాఁ – గాకలీ సుస్వరమ్ముల్
వెలుఁగుల వడిలో – వెలయుఁ బులుఁగై – వేగ మాకాశవీథిన్
మలసిన దేహము – మఱల నిలువన్ – మందు సంగీతమౌనా – భృండి 2
పిలిచెను నాహృది – ప్రియతరముగాఁ – బ్రీతితో రమ్ము దేవీ
తలఁచెను నామది – తఱచుగ నినున్ – ధ్వాంతమందుండు వేళన్
వలపుల గాలులు – వదలక నిటన్ – వచ్చునో నేఁడు రాదో
మలుపుల త్రోవల – మనికి నిజమై – మభ్యమో మాయ యేమో – భృండి 3
గ్రీష్మ– IIIIIIU – IIIIIU – UIU UIUU 20 కృతి 151488
చలనరహితమై – సరసహృదయా – సంధ్యలో వేచియుంటిన్
గలలకుఁ గరువై – కనుల బరువై – కారుచీఁకట్లు వచ్చున్
శిల కొక నసువున్ – సిరిగ నొసఁగన్ – శీఘ్రమే రమ్ము చెంతన్
నలినమువలెఁ దా – ననయు విరియున్ – నక్తమందంద మీయన్ – గ్రీష్మ 1
జలములు వడిగా – జలధిఁ గలియన్ – సాఁగు మోదమ్ముతోడన్
జలము మరుగగున్ – జలము మరుగున్ – సంద్రమున్ జూడకుండన్
సలిలమువలెనే – సగటు బ్రదుకుల్ – స్వామినిన్ జేరకుండున్
కల నొక కలగాఁ – గరఁగుఁ ద్రుటిలోఁ – గాలమే కాటువేయున్ – గ్రీష్మ 2
మదిర మగతయో – మదిని వెతయో – మాయలో నుంటి నిట్టుల్
మదనుని శరముల్ – మరలి వెడలెన్ – మ్లానమౌ గ్రీష్మమందున్
మృదు మధురముగా – మెలఁగు కవితల్ – మెల్లఁగా నింకిపోయెన్
నది యది యిసుకై – నభము గనుచున్ – నావలెన్ జిక్కిపోయెన్ – గ్రీష్మ3
భారాక్రాంతము– UUUU – IIIIIU – IUI IUIU 17 అత్యష్టి 46577
ఔరా పుష్పా – లలరె వనిలో – ననంత విభాతితో
భారాక్రాంతం – బయె తరులతల్ – వసంత విభూతితో
కోరెన్ నిన్నే – కులుకు నెదయున్ – గులాబులు బూయఁగా
శ్రీరంగా రా – చిఱునగవులన్ – శివమ్ముల నీయఁగా – భారాక్రాంత 1
తల్లీ నిన్నే – దలచితి మదిన్ – దయన్ గనుమా సదా
కల్లోలమ్మౌ – కలఁత హృదిలోఁ – గవిత్వము నాటఁగా
చల్లంగా నీ – సరసపు నుడుల్ – సరాగము నిండఁగా
ఫుల్లాబ్జాక్షీ – పులకితుఁడవన్ – ముదమ్మున నీయుమా – భారాక్రాంత 2
సందెన్ రంగుల్ – సలలితముగాఁ – జలించఁగ శోభతో
సిందూరమ్మే – చెలఁగె నభమున్ – జిరమ్మగు కాంతితో
మందమ్మై యీ – మలయ పవనం – బలోలము సేసె న-
న్నెందున్నావో – యెపుడు గనుటో – హృదిన్ మృదు గీతులే – భారాక్రాంత 3
హారిణి– UUUU – IIIIIU – UUI UUIU 17 అత్యష్టి 37361
ఈ నా డెందం – బెపుడు దలఁచున్ – హేమాంగి నిన్నే గదా
తేనెల్ చిందన్ – తెలుఁగు నుడులన్ – దివ్యమ్ముగాఁ బాడవా
మేనుల్ రెండున్ – మిలన మవఁగా – మేళమ్ము లింకేలనే
రా నాచెంతన్ – రజని వెలిఁగెన్ – రావే మనోహారిణీ – హారిణి 1
నీవేగాదా – నిముసమున నన్ – నింపంగ నీప్రేమతో
నీవేగాదా – నిశి దినము నన్ – నింపంగ నీయాశతో
నీవేగాదా – నిగమము గనన్ – నింపంగ నీవెల్గుతో
రావా నా యీ – బ్రదుకున సదా – రాగాల రంజిల్లఁగన్ – హారిణి 2
ప్రాణ మ్మీవే – ప్రణయవరదా – ప్రార్థింతు నిన్నే గదా
తాన మ్మీవే – తపితహృదిలోఁ – దల్లీన మౌదున్ సదా
గాన మ్మీవే – గతుల వడిలోఁ – గంపించు రాగమ్ము నేన్
శ్రీనాథా రా – చెలిమి జగతిన్ – శృంగార బింబమ్ము నేన్ – హారిణి 3
శ్రీవై రావా – చెలియ త్వరగా – జీవమ్ము నీవేగదా
భావమ్మీవే – బ్రదుకు కలలో – వాంఛల్ సదానీవెగా
జీవాంభోధిన్ – జిఱునగవులే – చెల్వంపు చంద్రద్యుతుల్
దేవీ నాలో – దివియ యనెదన్ – దేహి ప్రియ మ్మీయవే – హారిణి 4
భూతిలక– UIIUII – UIUII – UIU IIUIU 19 అతిధృతి 186039
భూతిలకమ్మగు – పూలకారున – మోదమే నవ నాదమే
నాతుల నవ్వుల – నందనమ్మున – నందమే కడు యందమే
వ్రాతలలోఁ గవి – రమ్య వర్ణన – రాగమే యనురాగమే
చేతనలోఁగల – చిత్ర రీతులు – చెన్నులే తెలి వెన్నెలే – భూతిలక 1
మోదము నిండఁగఁ – బూజ సేతును – బూలతో నొక మాలతో
నాదము నిండఁగ – నాట్యమాడెద – నవ్యమై కన దివ్యమై
వేదన వీడఁగఁ – బ్రేమ నింపుము – మెండుగా హృది నిండఁగా
శోధన లెందుకు – చొక్కఁ జేయుము – సొంపుగాఁ గడు యింపుగా – భూతిలక 2
వాతపు శీతల – బాధ తగ్గెను – భాసిలెన్ రవి కాంతులన్
జేతన గల్గెను – జెట్టులన్, యవి – చెన్నుగా నిడె రంగులన్
భూతలిపైనను – బూచె బూవులు – బ్రోవులై కడు రమ్యమై
భూతిలకమ్ముగ – భూమి నామని – మోద మిచ్చెను ముగ్ధమై – భూతిలక 3
శిశుశార్దూలము– UUUII – UIIIU – UUI UUI U 17 అత్యష్టి 37337
ఆనందమ్మున – నాశ వెలిఁగెన్ – హా డెంద ముప్పొంగెఁగా
గానమ్మందున – గంగ కదలెన్ – గర్ణమ్ములోఁ దేనెలే
ప్రాణమమ్మందునఁ – బర్వె నమృతం – బందమ్మె విశ్వమ్ములో
నీనా జీవిత – మీశ్వరునిదే – యెల్లప్పు డాప్రేమయే – శిశుశార్దూలము 1
కేళీలోలురు – కేకలిడుచున్ – గ్రీడించ నుద్యుక్తులై
లీలాసక్తిని – లీనమవఁగా – లేలేత మోముల్ రహిన్
దోలన్ దూఁగెను – ద్రుళ్ళిపడుచున్ – ద్యోతమ్ములో హాయిగా
బాలానందము – వంద విరులై – భవ్యమ్ముగా నవ్వెఁగా – శిశుశార్దూలము 2
దూరమ్మందునఁ – దోఁచె మిసిమిన్ – దూర్ణంపు తారావళుల్
హారమ్మై పలు – యందములతో – నభ్రమ్ములో శోభిలెన్
దీరమ్మందునఁ – దెల్ల వెలుఁగుల్ – దీప్తమ్ము లాయెన్, ననున్
జేరన్ వచ్చునొ – శ్రీల నొసగన్ – చిన్మోహనుం డీ నిశిన్ – శిశుశార్దూలము 3
దూరమ్మందునఁ – దోఁచె శిశుశా-ర్దూలమ్ము లెన్నో వనిన్
జేరంబోకుమ – చెంతగలదే – సిద్ధమ్ముగాఁ దల్లియున్
వారిం జూడుమ – పల్విధములన్ – బర్వెత్తె నిట్టట్టులన్
స్వారస్యమ్ముగఁ – జారు గతులన్ – సానందమై యందమై – శిశుశార్దూలము 4
సాయంకాలము – సంద్రపు తటిన్ – సందీప్తమౌ నీరముల్
నాయం దొల్కెను – నవ్య కవితల్ – నాదమ్ములన్ సొంపుగా
మాయాజాలము – మానసములో – మత్తైన భావమ్ములన్
బ్రేమే దైవము – ప్రేమమయ మీ – విశ్వమ్ము సందేహమా – శిశుశార్దూలము 5
శిశుమత్తేభము– IIUUII – U – UIIIU – UUI UUI U 18 ధృతి 74676
అసమానమ్మగు – నారవములన్ – హర్షధ్వనుల్ మ్రోఁగఁగా
శిశుమత్తేభము – చెల్వ మలరన్ – జిందాడుచుండెన్ దనా
పసిపాపన్ గని – పారవశమున్ – వాలమ్ము నాడించుచున్
మసలెన్ దల్లియు – మందగతితో – మధ్యాహ్న వేళన్ వనిన్ – శిశుమత్తేభము 1
లలితారామము – లాసములతో – రమ్యమ్ముగా నుండఁగా
లలితుండప్పుడు – రాసములతో – లాస్యమ్మునాడెన్ వినన్
లలితారావము – రాగములతో – రాణించె మార్మ్రోఁగుచున్
విలసద్దృశ్యము – ప్రేమమయమై – విశ్వమ్ములో నెక్కొనెన్ – శిశుమత్తేభము 2
వనజాక్షీ కను – పక్కున స్మృతుల్ – భావార్థమై తోచెఁగా
దినమ్మయెన్గద – దిక్కు లలరెన్ – దేదీప్యమానమ్ముగా
స్వనముల్ మ్రోఁగెను – చక్కని నుడుల్ – సంసక్తమై పర్విడెన్
వినవా నాహృది – పెక్కు సడులన్ – వేవేల రాగాలతో – శిశుమత్తేభము 3
వీణాక్వణము లేక సురభిగీత– UUUU – IIIUU – UIU UIU U 16 అష్టి 9329
ఉన్నావా నా – కుసురు నీవే – యుల్లమందుండి పోవా
కన్నీరే నా – కలిమియేనా – కారుచీఁకట్లు నిండెన్
కన్నా యందున్ – గమలనేత్రా – గాయమున్ మాన్ప రావా
తెన్నుల్ నీవే – దిశలయందున్ – దీపమున్ జూపు దేవా – వీణాక్వణము లేక సురభిగీత 1
పంపాతీరం – బలరె నీకై – వర్ణచిత్రంబువోలెన్
కెంపుల్ నిండెన్ – గిరుల సంధ్యన్ – గ్రీడ లాడంగ ఛాయల్
సొంపుల్ నిండన్ – సురభిగీతన్ – సుందరమ్మైన రీతిన్
సంపూర్ణమ్మై – స్వరవశమ్మై – చక్కఁగాఁ బాడెదన్ రా – వీణాక్వణము లేక సురభిగీత 2
పూవుల్ దాఁకన్ – బులకరింపుల్ – పొంగు నీ డెంద మెల్లన్
భావమ్ముల్ నా – బ్రదుకు పంటల్ – బంధముల్ శాశ్వతమ్ముల్
రావమ్ముల్ వా-గ్రసపు చుక్కల్ – రాగ వీణాక్వణమ్ముల్
నీవే నేనై – నిఖిలమందున్ – నిల్చిపోదాము రావా – వీణాక్వణము లేక సురభిగీత 3
సాలంకారా – సరసచిత్తా – సత్యలోకాధికారీ
మాలల్ వేతున్ – మనసు కింపై – మందహాసమ్ముతో రా
మూలాధారా – ముదసముద్రా – మోహనాంభోధిచంద్రా
పూలన్ దెత్తున్ – బులకితమ్మై – పూర్ణబింబాననా రా – వీణాక్వణము లేక సురభిగీత 4
సమయరాగ– IIUUU – UIUU – UIU UIUU 16 అష్టి 9284
నిను జూడంగా – నిర్మలమ్మై – నిండు నాశా మరీచుల్
ప్రణయాసక్తిన్ – భావనమ్ముల్ – భాసిలున్ డెందమందున్
గన రావా నన్ – గంజనేత్రా – కాఁచియుంటిన్ గదా నే
ననఘా నీ యా – యాననమ్మున్ – హర్షమై చూపు మిందున్ – సమయరాగ 1
వదనమ్మందున్ – వాన చిన్కుల్ – పైబడన్ మోదమిచ్చున్
హృదయమ్మందున్ – నృత్యమాడున్ – దృప్తితో బర్హిణమ్మై
వ్యధలన్ దీర్చున్ – వర్షధారల్ – ప్రాణమున్ వెండి నిల్పున్
పద యీ వానన్ – బర్వు లెత్తన్ – బాలలై యాడుదామా – సమయరాగ 2
వినవేలా యీ – వింత గాథన్ – బ్రేమయే దీని మూలం
బనెదన్ స్వామీ – యార్తితోడన్ – హర్షమే కానకుండెన్
గనరావా యీ – కాళరాత్రిన్ – గారు చీఁకట్లు గ్రమ్మెన్
మనరా నా యీ – మన్కి నీకే – మానసమ్మందు నీవే – సమయరాగ 3
సమయరాగ– IIUUU – UIUU – UIU UIUU 16 అష్టి 9284 IIUUU పిదప వనమయూరపు లయతో –
ప్రియ వేళాయెన్ – ప్రేమతో నాతోడఁ – బ్రీతిన్ రమించన్
భయ మీరాత్రిన్ – బాధతో నన్ ముంచి – బంధించె నిప్డున్
నయగారమ్ముల్ – నాహృదిన్ నిండంగ – నవ్వుల్ సుమించన్
ద్వయమై యుండన్ – దాపముల్ తగ్గంగ – దాపుండ రావా – సమయరాగ 4
శరభలలితా– UUUU – IIIIIU – UIUU 14 శక్వరి 2545
నీవున్నావా – నిజముగ నిలన్ – నేర్వనౌనా
తావెందో నీ – దనువుమను యా – స్థాన మెందో
శైవుండా యో – శరభలలితా – శైలజాప్తా
నీవా బుద్ధున్ – నిలయ మగునా – నే నెఱుంగన్ – శరభలలితా 1
మందాక్రాంత – మ్మవక మునుపే – మట్టిపై నీ
వందాలివ్వన్ – వఱలితివిగా – భాషయందున్
సందేహమ్మా – శరభలలితా – చక్కగా నో
ఛందోనాదా – శ్రవణసుఖముల్ – చప్పునీవా – శరభలలితా 2
మాత్రా మందాక్రాంతము
పైన వివరించిన వృత్తములలో లలితాక్రాంత లేక మందారమాల (జయకీర్తి ఛందోనుశాసనము), భూతిలక (కవిజనాశ్రయము), భారాక్రాంత (హేమచంద్రుని ఛందోనుశాసనము), హారిణి (భట్ట ఛంద్రశేఖరుని వృత్తమౌక్తికము), శరభలలిత (నాట్యశాస్త్రము) వృత్తములను ఛందశ్శాస్త్రములో లాక్షణికులు పేర్కొన్నారు. మిగిలినవినా కల్పనలు. వీటికన్నిటికి గణస్వరూపములు వేఱైనా మందాక్రాంతపు లయ ఉన్నది. కొన్నిటికి ఎక్కువగా, మఱి కొన్నిటికి తక్కువగా నుండవచ్చును. నా ఉద్దేశములో మందాక్రాంతమును గాని లేక మఱొక ప్రత్యేక వృత్తమును గాని వాడ నవసరము లేదు. ఆ లయను ఒక జాతి పద్యములో కల్పించ వీలగును. దీని పర్యవసానమే మందాకిని లేక రాగసుధ.
దీనికి నా నియమములు – మందాక్రాంతములో మూడు లెగోలు ఉన్నవి, అవి: (1) UUUU, (2) IIIIIU, (3) UIU UIUU. మొదటి లెగోలో రెండు చతుర్మాత్రలు ఉన్నాయి. ఆ రెండు చతుర్మాత్రలను కనీసము రెండు గురువులతో నింపవచ్చును. ఎదురు నడక ఉండరాదు. ఇది మొత్తము పది విధములుగా సాధ్యము (పట్టికను చూడండి). అక్కడక్కడ ఒక గురువును అనివార్యమైనప్పుడు ఉంచవచ్చును. (2) రెండవ భాగములో ఏడు మాత్రలు ఉన్నాయి, చివర లఘువు రాకుండా ఉంటే నడక బాగుంటుంది, అనగా చివరి అక్షరము గురువుగా ఉండాలి. మిగిలిన ఐదు మాత్రలను ఎదురు నడక లేకుండ ఆఱు విధములుగా వ్రాయ వీలగును, అవి – IIIII, UIII, IIUI, IIIU, UIU, UUI. (3) ఇందులో ర-గణమునకు బదులు IIIU, UIII ఉంటే నడక చెడదు. IIUI, UUI, IIIII లతో నడక బాగుండదు. అందువలన UIU, UIII, IIIU బాగుంటుంది, కాని ఆక్కడక్కడ IIUI, UUI ఉపయోగించవచ్చును. మేఘదూతమువంటి కావ్యములను అనువాదము చేయాలంటే ఇలాటి మాత్రామందాక్రాంతము అనువుగా ఉంటుంది. ఎందుకంటే మందాక్రాంత వృత్తములా ఇందులోని నియమములు అంత కఠినము కావు. ఇలా కొన్ని మాత్రా మందాక్రాంతములను క్రింద వ్రాసినాను.
ఓ ఘనరాశీ – యుఱుమవలదే – యుల్లమో నీరసమ్మే
దాఘమ్మయ్యెన్ – దప్పి దీర్చన్ – దగ్గరకు రాసుధలతో
మేఘసరమ్మా – మేలు ప్రియునిన్ – మేదినిన్ గంటివా నిన్
శ్లాఘింతును నేన్ – సరస జేరన్ – సందేశ మందించవే – రాగసుధ లేక మందాకిని 1
నందనవనిలో – ననలు విరిసెన్ – నంద మివ్వంగన్ సదా
బృందావనిలో – విరులు మురిసెన్ – బ్రేమ పెంపొందున్ గదా
సుందర సంధ్యన్ – శుక్రుఁడు తెలగా – సొగసుతో వెల్గె నింగిన్
మందాకినిలో – మనసు మునిగెన్ – మాధవా నిన్ను జూడన్ – రాగసుధ లేక మందాకిని 2
పల్లవి నీవే – ప్రణయ గీతిన్ – బాడనా నే రజనిలో
నుల్లము నీకై – యుత్సుకతతో – నూహలన్ బొంగెఁ గాదా
మల్లెలతో నే – మనసు పొంగన్ – మౌళిపై మాల గానా
తెల్లని వెల్గుల – దీపశిఖనై – తెరువులో నిల్చిపోనా – రాగసుధ లేక మందాకిని 3
ప్రేమనినాదము – ప్రియుల చెవులన్ – వేదవాక్కై వినఁబడున్
ప్రేమ నిజముగా – పెన్నిధి గదా – పేదలకు భూపతులకున్
ప్రేమకు వేఱొక – పేరక్షయమే – ప్రియముగా మాటాడుమా
ప్రేమాయణమే – విశ్వవీధిన్ – వెలుగు ధ్యేయమ్ము గాదా – రాగసుధ లేక మందాకిని 4
మదిలో నీవే – మమత నీవే – మంచి బంధమ్ము నీవే
వ్యధలో నీవే – హర్ష మీవే – వ్యాధిలో మందు నీవే
నిదురన్ గలలో – నెనరు నీవే – నిండుగా తృప్తి నీవే
బ్రదుకను గీతికి – స్వరము నీవే – శ్వాసలో నాశ నీవే – రాగసుధ లేక మందాకిని 5
రవణీయముగా – రవళి నిండెన్ – స్రవితమయ్యెన్ బదమ్ముల్
నవనవలాడెన్ – నవతతోడన్ – నవరసాలన్ రమించన్
భవ మొక దీపం – బవగ ధరపై – భవన మెల్లన్ వెల్గెఁగా
పువు లిలఁ బూచెన్ – భువన మెల్లన్ – భువనమోహనుని రూపై – రాగసుధ లేక మందాకిని 6
రాయంచలతో – రాగమధువున్ – రమ్యమై పంచుకోనా
ప్రేయసి యొడిలోఁ – బ్రియ వచనముల్ – ప్రీతితోఁ బల్క రానా
తీయని తేనెన్ – దెలుఁగు నుడిగాఁ – దృప్తితోఁ గ్రోల రానా
మూయని తలుపుల్ – ముదపు మలుపుల్ – మోక్షమని దలఁచుకోనా – రాగసుధ లేక మందాకిని 7
రాసక్రీడకు – రమణి పదముల్ – రమ్య లాస్యానుభవముల్
ప్రాసక్రీడకు – పదపు రమణల్ – పద్య సంగీత జవముల్
రాసక్రీడకు – ప్రణయ రసముల్ – రత్నమంజీర రవముల్
ప్రాసక్రీడకు – రసమయ గతుల్ – శ్రవణ సౌందర్య భవముల్ – రాగసుధ లేక మందాకిని 8
వేంకటనాథా – విశ్వరూపా – వేదశాస్త్రప్రదీపా
సంకటహారీ – శార్ఙపాణీ – సర్వశక్తిస్వరూపా
పంకజనేత్రా – పరమపురుషా – పద్మనాథా ప్రధానా
ఇంకను నాపై – నేల దయ రా – దిట్లు నుండంగ నౌనా – రాగసుధ లేక మందాకిని 9
శాపముతో నా – శైలతలిపై – స్వామి యాజ్ఞన్ వహించన్
పాపము భార్యను – వదలి వ్యధతో – వర్ష మొక యక్షు డుండెన్
ఆ పాదపముల – నమరె నీడల – నాశ్రమమ్మొండు, యందే
భూపుత్రియు దా – పుణ్య జలముల – మున్గె రామాద్రి లోయన్ – రాగసుధ లేక మందాకిని 10
సాయంకాలము – సవితృఁ డలరెన్ – జారు మందారసుమమై
పోయెన్ వెలుఁగుల్ – బొలమెఁ దిమిరం – బొప్పె నది నల్ల జిల్గై
ఛాయలె యెందున్ – జలిత మయ్యెన్ – జక్కనౌ రూపములతో
మాయాజాలపు – మధుర ఘడియల్ – మందమై జారుచుండెన్ – రాగసుధ లేక మందాకిని 11
ప్రాసయతితో –
నీలాకాశము – నీల నిశిలో – నీలమౌ తార లెందున్
గాలి సుగంధపు – జ్వాలలనగా – సోలి చొక్కంగఁ దెచ్చెన్
చాల సొబగుతో – మాల నొకటిన్ – గేల గళమందు వేతున్
వేళాయెనుగా – మేలమాడన్ – తేల మోదాబ్ధిలో రా – రాగసుధ లేక మందాకిని 12
ముగింపు
మందాక్రాంతవృత్తములో సంస్కృతములోవలె విరామ యతులను, అక్షరసామ్యయతులను ఉంచి ఉదాహరణములను ఇచ్చినాను. అంతేకాక, వృత్తమునందలి మూడు భాగములలో లయ చెడకుండ మార్పులు చేసి వృత్తములను కల్పించి అందులో ఉదాహరణములను ఇచ్చినాను. మందాక్రాంతమును ఒక జాతి పద్యముగా వ్రాసి దానిని కూడ ఉదాహరణముల ద్వారా లయాన్వితము చేయు పద్ధతిని వివరించినాను. ఇట్టి జాతి పద్యము అనువాదములకు అనుకూలముగా ఉంటుంది.