Overture
(or entr’acte after Sita’s Eros-A Musical)
వెండికొండ మీద వెన్నెల వెలుగులో
నాట్యమాడినాము నటరాజుతో మేము.
ఏటి నీటిలోన మీటులు విను మమ్ము
పోటు కెరటమొకటి దివికి తేల్చె.
రెప్పపాటున సురల సంధ్యా సమయపు
నాట్య-సంగీత సభలోన నిల్చినాము.
సూర్య చంద్రుల, రాహుకేతువుల నరసి
తుంబురుని చూసి, తారల కలిసినాము.
అచ్చెరల కంటిమిగ అచ్చెరువుతొ అచటె
కంటిమిగ నారదుని పక్క నారాయణుని
శివ పార్వతుల ఆనంద నృత్య మహో!
మేము కనులార కంటిమి.
మద్దెల మోతలు వింటిమి, డమరుకలు వింటిమి,
ఓంకార నాదాల వలయాలలో మేమూగాడుచుంటిమి.
ఊగేటి మము చూసి, గిరిసుత చల్లగా నవ్వింది,
లీలగా శివునిలో లీనమై పోయింది.
అతి గౌరసుందరుడు, అత్యంత శాంతుడు,
ఆదిపురుషుడు శివుడు నాట్యమాడగ మాకు ఆనతిచ్చేను.
శంభునితో మేమపుడు చిందులేసితిమి,
తన్మయతతో మహేశుమంత్ర స్మరణ చేసితిమి:
మహాదేవం, మహాత్మానం
మహాధ్యానం పరాయణం
మహా పాపహరం దేవం
ఓంకారాయ నమో నమః
శివం శాంతం, జగన్నాథం
లోకానుగ్రహ కారకం
శివమేక పదం నిత్యం
ఓంకారాయ నమో నమః (శంకరాచార్య విరచితం)
లక్ష్మి పాడేను, బ్రహ్మ తాళము వేసె,
సరస్వతి వీణ ఝణఝణకు తోడుగ
వేల్పుల వేల వేణువులు, వీణలు,
సన్నాయి, ఝర్ఝరీ ధ్వానాలు మ్రోగినవి!
వెండికొండ పైన, వెన్నెల రాత్రిలో
నాట్యమాడేము గద! నటరాజు తోటె!
ఆడవలె నిపుడు సరయూ నీరాల
వినవలె నిపుడు వైదేహి వీణలు
కానవలె నిపుడు అయోధ్యరాముని
ఆడవలె వినవలె కానవలె మేము.
[అంటూ స రి గ మ ప ద ని స్వరహంసలు ఆ పవలు ఆకాశంలో రివ్వురివ్వున ఎగురుతుండగా తెర తీయబడింది.]
కోసల రాజ్యానికి, భావి రాజుగా ఉండటానికి రాముడు అవసరమైన శిక్షణ పొందుతున్నాడు. రాజధాని ఐన అయోధ్య నగరవాసులకు ఆ చిన్నవానిపై ‘వల్లమాలిన మమత కమ్మతెమ్మెర లాగా కమ్ముకున్నది’. వారి మనసులలో రాముడే వారి రాజు. అతడే వారి దైవం. నగరి తూర్యములు విని వారు నిద్ర లేచి, అతడి పేరిట మేలుకొలుపులు పాడుతారు.
ప్రత్యూషమిది రామ!
ప్రజ్వలుడాదిత్యుడరుదెంచె
ప్రాగ్దిశ అరుణిమలు పూయించె
ప్రాణుల ప్రాణాలు తిరిగొచ్చె!
ప్రాప్తసంతోషివని, సత్యసంభాషివని
ప్రాజ్ఞుడవని, పరమాత్ముడవని
ప్రథమంగ నీ నగుమోము చూడంగా
ప్రజలు వేచేరు, పడక దిగవయ్యా!
రోజూ పొద్దున్నే, వారి ఆంతరంగిక మందిరంలో -సీతా! సుస్మితా! ఆత్మసఖీ! అంటూ ఆమెకు ఫాలంపై, చెక్కిళ్ళపై, చుబుకముపై, పెదవులపై తియ్యని ముద్దులిచ్చి, రాముడు బైటకు వెళ్ళిపోతుంటాడు. తన అంతఃఫురంలో, ఆ రోజుల సీత పాటలివి.
రామ్! కోదండ ధారీ!
దశరథ నందన! మన్ సుఖదాయీ
ఉదయాన నీ పలుకులే హృదయాన
మార్మోగునోయీ!
గడియ గడియ నేను గణుతించుచున్నాను
రాచకార్యాలు తీర్చేటి రాజారాముడా
రాతిరే జాము నొచ్చేవొ
ఏకాంతమందిరపు గడియ మరల నెపుడు వేసేవో
మెరుపు నీ అందాలు, మేనెల్ల పులకలు
ఉత్తేజితను ప్రియా!
నీకై నే వేచేను.
గురుశిక్షణలో, రాముడు భావి రాజుగా తీర్చిదిద్దబడుతుంటే; వైదేహినుండి, క్రమంగా కోసలరాజ్యపు భావి రాణిగా సీత మారుతూంది. రామునికి సీతకు మధ్య ఆంతరంగిక సంబంధాలు, చనువులు కూడా మారుతున్నాయి. అతడితో సంభోగము ఆమె కిప్పుడు ప్రియము. సమత, సరసతగల అతడి నడవడి, తనలో తాను సీత చాల మెచ్చుకుంటుంది.
వస్త్రమూడ్చుచో, వక్షమానుచో
కస్తూరిరేఖలు ఇద్దరం కరిగించుచో
మనసు మర్యాదరేఖలు దాటవు
మాన్యుడవు రామా! నీ తోటి
శృంగార క్రీడలు నాకు స్వర్గాలు.
కేశము కేశము, పెదవి పెదవి
నాభి నాభి, నూగారు నూగారు
కటి కటి, కలిపి కలిపి పెనగుచో
ఏచి తలిర్చు నా వాంఛలు!
ఇంత దయ ఏల కలుగు
ఇక్ష్వాకుడ! నాపై.
సదయా! నీ హృదయము
మీద పూవుగ నను నిలిపేవు
సదా గౌరవాలు సలిపేవు
ఇక్ష్వాకుడ! ఈ ఇంతిపై
ఇంతగ మోపై దయ
నీకేల కలుగునో.
రాజకుమారులు, రాజకుమార్తెలు, రాముడు-సీత, లక్ష్మణుడు-ఊర్మిళ, భరతుడు-మాండవి, శత్రుఘ్నుడు-శ్రుతకీర్తి, తరచు కలుస్తూ, వారి తోటల్లో నాట్యాలు చేస్తూ, బృందగీతాలు ఆలాపిస్తూ, నెయ్యముతో ఉంటున్నారు. ఇద్దరిద్దరుగా వనవాటికా గీతికను ఆలపిస్తున్నారు.
ఓ కమనుడ! నీవికను నా తలపు మా
నగదగుర! శుకపికాల పనుపకుమా.
ఓ విలుతుడ! పదేపదిగ నీ చిలుక తీపి పలుకులు చెవి
జొనుపకుముర! ఓ విలుతుడ! పోవోయి.
ఓ మదనుడ! నా తలపు నీవికను
మానుముర. బలగము తో రావలదు. ఓ మదనుడ
పో! నీ శుకము నీ పికము నీ వికను తే వలదు నా
వనముకు. ఓ మదనుడ! పో పో రాకుమిక. (పియానో: లియపునావ్)
రాముడికి యువరాజుగా పట్టాభిషేకం త్వరలో జరుగుతుందని ఆశిస్తూ, రాజమందిరాలలోనూ పట్టణంలోనూ జనులు తమ లోగిళ్ళు, అతిథివసతులు, రహదారులు బాగుపరుస్తూ ఉత్సాహంతో ఉంటున్నారు. సీతకు రాముడి తోటిదే సకలం. అదే ఆమె పాట.
నిన్నేకోరి-
నేటికీనాటికి
ఒడిని వీణియనుంచి
ఏకాంతమున నీకై
ఒక ప్రణయ గీతికను పలికింతులే
ప్రియా!
ప్రథమ కానుకగా నీవె తెప్పించి ఇచ్చిన
బహువర్ణాల వీణపై,
గగురుపాటుల మన గాఢానురాగాలు
తనివితీరని మన తమకాల గమకాలు
ప్రణయజీవితపు అనుభవపు సంగతులు
వీణ తీగలపై నీకై వినిపింతులే!
మన ప్రేమ పాటనే
మనసార మ్రోగింతులే.
రాముడు, తమ్ముళ్ళతో పాటు పగలు కోసల రాజ్యంలో తండ్రి దశరథమహారాజు పురమాయించిన పనులు చేస్తూ, పలు ప్రాంతాల ప్రజలను కలుస్తూ ఉంటాడు. తిరిగి వచ్చాక, తండ్రికి రాజ్య పరిస్థితులు తెలుపుతుంటాడు.
ఒక రాత్రి, రాముడూ సీత, తమ మేడ పైన విశ్రాంతిగా వింటూ ఉండగా; నిశాకాంతతో, సంహిత వీణ సంభాషణ:
రాగము లెన్నని? రాతిరి కాంత
తీగల వీణను తీయగ అడిగె.
వీణియ నవ్వెను హాయిగ ఊగి,
మోగెను తీగల వింతగ సాగి-
సరి! సరి! పదసరి దాపరీ!
సరిగమపదని గని నీదని గని
సరిగ నీ దాగని పస గని
మరి సరిగ నీ దాగని గరిమ గని
పద గగనీ! నీ పాదమాని
నీ దారి నీ సరి సాగగ మా పని గాని
సామ పాదమా! సామమా! మరి మరి
సరిగమపదని రిగమపదని
గమపదని మపదని పదని
పద పదమని సాగ మా పని గాని-
వీణ కేమి తెలుసు రాగపు రీతులు
వీణ కేమి తెలుసు రాగపు తీపులు
రాగము లన్నియు పరగు రాతిరి యందే
తీగల కేమి తెలుసు! రాగము లెన్నో
ఆగడపు ప్రశ్న లడుగుదువు నన్ను.
నిశారమణి ప్రసన్నతతో, తను రాగాలాపన చేస్తుంటే, తోడుగా సంహితను మ్రోగించమంటూ ఒక సన్నుతి స్వరమిస్తుంది.
సరి గపమ మదప|పస·ని స·పగ సరిగ|మపద పమగ రిగస|
ని॒సరి ని॒రి మగరి|గసరి గపమ మదప|పస·ని స·పగ సరి॒గ|
పమ గరిస సని॒|సా| (బాఖ్)
ఆ మేడపైనే మరో రాత్రి, సీతారాములు చక్కని చెక్కడపు పర్యంకంలో పరుండి వింటుండగా; ఆకాశంలో పరుగులెత్తుతున్న చంద్రునికై, సంహిత మంత్రవీణ వినిపించిన జోలపాట:
రా! నిదురా రావమ్మ రావమ్మ రా
మెల్లగ చల్లగ దివి లోకి రా
పియానొ షోపాన్ స్వనమల్లె రా
పారాడి తారాడి పండంటి పాపాయి
మబ్బుల పరుపు పై పండేనుగా
తియ్యని కూర్పాటు నియ్యగ రా.
అకస్మాత్తుగా పరిస్థితులు తారుమారై; ఒక్క రాత్రిలో, రాముని యువరాజ పట్టాభిషేకం రద్దవుతుంది. అతడికి ఇల్లు, ఆ రాజ్యం వెంటనే విడిచి, అడవులకు వెళ్ళిపొమ్మని ఆజ్ఞ ఇవ్వబడుతుంది. సీతకు ఆ విషయం రాముడు చెప్పినప్పుడు, అతని వ్యాకులత, అయోమయస్థితి, సవయస్క ఆమెకు వెంటనే అర్థమవుతుంది. రాముడికి ప్రేమించబడటం, అందరినీ ప్రేమించటం మాత్రమే తెలుసు. అసూయలు, తిరస్కారాలు తెలియవు. (పెద్దవారి చలచిత్తపు విపరీతప్రవర్తనలు చిన్నవారికి భరించటం సాధ్యమా?)
విలవిలలాడుతున్న అతనిని గాఢంగా కౌగిలించి ముద్దులు పెడుతూ సీత ఇలా అన్నది.
ముగిసె ఏనాడో మన తలిదండ్రులకు
నా లక్కచిట్ల, నీ చిన్నివిల్లమ్ముల మురిపాలు.
ముగిసె ఆపైన ఎంతో యోచించి నిబంధించిన
మన పెళ్ళి షరతులు, క్రతువులు, ఆర్భాటాలు.
ముగిసె ఇప్పుడు మూడు నిమిషాలలో
మనకేనని వారిన్నేళ్ళు ఊరించి, బులిపించిన
సింహాసనాలు, కిరీటాలు, ఛత్రాలు, చామరాలు.
అన్నీ వారి కోర్కెలే రామ! నీది నాదొక్కటి లేదు చూడ!
కష్టపడి ఇన్నాళ్ళు వారు నేర్పించిన విద్యలన్ని నష్టమేగా!
మేలుమేలు! రామా! బహుబాగు! శాబాసు!
ఆమె ముద్దులొలికే ముఖం, ఆ మాటలు అన్నతీరు రాముడికి పట్టరాని నవ్వు తెప్పించింది. అతడి వ్యగ్రత పటాపంచలయ్యింది. సీతతో అప్పుడిలా అన్నాడు.
ఎక్కడ చదివావో మనసెరుగు విద్య!
ఎక్కడ చదివావు వెతలు తీర్చు విద్య!
ఉన్నమాట ఉన్నట్టుగ పలుకుతావు
లేకపోతె మౌనం వహిస్తావు నీవు.
పోని! అభిషేక ప్రహసనం ముగిసె, హాయి.
నెత్తి మీదింక భారాలు లేవు హాయి
చెంచు చెంచెతల వలె ఉందాము హాయి
పద సఖీ! వనాలకు, మనకెంత హాయి!
పెళ్ళి కాన్కగా ముందు నిన్నిచ్చె, పిదప
విల్లు, అక్షయ బాణాలు ఇచ్చె నాకు
జానకీ! నాడు మీ తండ్రి, చాలు నాకు.
పద సఖీ! అడవికి వెళదాము పద.
“రామా! మరి నువ్వు నాకిచ్చిన సంహిత?” -అడిగింది సీత.
“ఇక్కడే ఉండనీ. ఆ మంత్రవీణ సంకలించే సంగీతం మనం ఎక్కడ ఉన్నా వినగలం.” -అన్నాడు రాముడు.
వెనువెంటనే వారికి,
పాహి! రామప్రభో! పాహి రామప్రభో!
పాహి భద్రాద్రి వైదేహి రామప్రభో! (గోపన్న)
పాహి రామ ప్రభో! పాహి రామ ప్రభో!
పాహి! సుందర వనద్యుతి భావించు, రామ ప్రభో!
అంటూ సంహితనుండి వినిపించి, అరణ్యమే వారిని ఆహ్వానిస్తున్నట్టుగా అనిపించి, ఆ చిన్నవారిద్దరూ అయోధ్య వదిలి, కలిసిమెలిసి దండకారణ్యానికి వెళ్ళిపోయారు.
సుందరుడ వీవు, సుందరిపై నీ వలపు,
సుందరము నీ వనవాసా నందమని, ఊహించి
భావించి, నీ కథనె కీర్తించుచున్నాము రా
త్యాగి రామ ప్రభో! యోగి రామ ప్రభో!
(తీపికథ, ప్రేమకథ, కావ్యకథ, రామకథ, అంటూ స రి గ మ ప ద ని హంసలు పలుచని తెరల వెనుక ఎగురుతుండగా -)
[Curtain]
Composition: Lyla Yerneni
Poet & Poetry insights: James Fenton
Prosody insights: J.K. Mohana Rao
Character insights: Udaya