కూటి రుణం

కెత్తేల్ సాయిబు అనే పేరు మీరు విని ఉండరు. తిరువనంతపురం శాలబజార్‌లో ఇప్పుడున్న శ్రీపద్మనాభా థియేటర్ పక్కన, ఆ కాలంలో అతను నడిపిన పూటకూళ్ళ ఇల్లుండేది. పందొమ్మిది వందలా అరవై, డెబ్బైలలో అక్కడ భోజనం తిననివారు తిరువనంతపురంలో ఉన్నట్టయితే వాళ్ళు ఖచ్చితంగా శాకాహారులై ఉండుంటారు.

డెబ్బై ఎనిమిదిలో కెత్తేల్ సాయిబు చనిపోయేంత వరకు ఆయన ఆ హోటల్ నడిపించాడు. ఇప్పుడు ఆయన కొడుకు ఊళ్ళో చాలా చోట్ల అలాంటి హోటళ్ళు నడుపుతున్నాడు. సాయిబు హోటల్ నడిపిన ఆ చోట ఇప్పుడు వాళ్ళ బంధువులు నడుపుతున్నారు. ఇప్పుడు కూడా అక్కడ చేపలు, కోడిమాంసం కూరలు అదే రుచి. ఇప్పుడు ఆ హోటల్‌కు ముబారక్ హోటల్ అని పేరు పెట్టారు. ఈరోజుకీ జనం వరుసలు కట్టుకుని తమవంతు కోసం కాచుకుని కూర్చుంటారు. ముబారక్ హోటల్‌లో భోజనం చేస్తేనే తిరువనంతపురం వచ్చినదానికి సార్థకత అని నమ్మే మాంసాహారులు కేరళ అంతటా ఉన్నారు. అయితే కెత్తేల్ సాయిబు నడిపిన పూటకూళ్ళ ఇంటి ప్రత్యేకత మాత్రం దానికదే! వివరించి చెప్పకపోతే మీకు అర్థం కాదు.

ఇప్పుడైతే ముబారక్ హోటల్ రేకుల షెడ్డులో నడుస్తోంది గాని, ఆ రోజుల్లో అది కొబ్బరి మట్టలతో వేసిన కొట్టం. పదిహేనడుగుల పొడవు, ఎనిమిదడుగుల వెడల్పు. వెదురుతో కట్టిన బెంచి, వెదురు మేజా. కొట్టానికి మూడు పక్కలా అడ్డుగా తడికలుండేవి. కొట్టాం వెనకవైపు ఒక గోనెసంచీ గుడ్డతో చేసిన పరదా వేలడుతుండేది. ఎండాకాలంలో చల్లటి గాలి వచ్చినా వర్షాకాలంలో మాత్రం లోపలికి జల్లు కొడుతుండేది. కెత్తేల్ సాయిబు హోటల్ ఎప్పుడూ రద్దీగానే ఉండేది.

‘ఎప్పుడూ’ అనా అన్నాను? అతను ‘ఎప్పుడూ’ ఎక్కడ తెరుస్తాడు! మధ్యాహ్నం పన్నెండుకు తెరిచేవాడు. మూడుకి కట్టేసేవాడు. మళ్ళీ సాయంత్రం ఏడుకు తెరిచి రాత్రి పదికి మూసేసేవాడు. పొద్దున పదకొండుకల్లా ఆ తడికల్లేని పందిరి ముందున్న ఇంటి అరుగు మీద, దానికటుగా ఉండే రహ్మత్‌విలాస్ అనబడు టైలర్ అంగట్లో, కరు.ఫళ.అరుణాలయం చెట్టి అండ్ సన్స్ హోల్‌సేల్ కిరాణా గోడౌన్ వాకిట్లోనూ జనాలు మూగిపోయేవారు. వారిలో చాలామంది అలా నిలబడే మాతృభూమి పత్రికో, కేరళకౌముది పత్రికో చదువుతూ ఉండేవారు. కె. బాలకృష్ణన్ రాసే తాజా రాజకీయ వ్యాసాల గురించి చర్చలు సాగుతుండేవి. అప్పుడప్పుడూ వాగ్వివాదాలు కూడా జరుగుతుండేవి.

పన్నెండవుతుండగానే సాయిబు తన హోటల్ తెరుస్తున్న ఆనవాలుగా వెనకవైపు వేలాడదీసున్న గోనెసంచి కర్టెన్‌ను చుట్టి పైకి కట్టేవాడు. జనం ఆ పందిటి కిందకు వెళ్ళి కూర్చునేవారు. కెత్తేల్ సాయిబుది మంచి దృఢమైన శరీరం. ఏడడుగుల ఎత్తు, స్తంభాల్లా చేతులు, కాళ్ళు. అమ్మవారు పోసిన మచ్చలు నిండుగా ఉండే పెద్ద ముఖం. ఒక కన్ను అమ్మవారు పోసి సొర రావడంతో గవ్వలా ఉంటుంది. ఇంకో కన్ను చిన్నదిగా నిప్పు కణికలా ఉంటుంది. తల్లో తెల్లటి చిక్కం టోపీ. మీసాల్లేని గుండ్రటి గడ్డానికి గోరింటాకు పెట్టి ఎర్రగా నిగనిగలాడించేవాడు. నడుముకి గళ్ళ లుంగీ, దాని మీద అరచేయి మందాన ఆకుపచ్చరంగు బెల్టు. మలయాళీ అయినా సాయిబుకు మలయాళం స్పష్టంగా రాదు. అరబిక్ మలయాళమే. అతను పెద్దగా మాట్లాడగా ఎవరూ విని ఉండరు. మాట్లాడినా ఒకటి రెండు వాక్యాలు మాత్రమే. ‘ఫరీన్’ అని గంభీరమైన గొంతుతో లోపలనుండి ఒకసారి కేకేశాడంటే జనం బెంచీల్లో నిండిపోతారు.

నిజానికి కేకెయ్యాల్సిన అవసరం కూడా లేదు. లోపలనుండి కోడిమాంసం పులుసు, కోడి వేపుడు, చేపల పులుసు, బొమ్మిడాయిల వేపుడు, రొయ్యల వేపుడు అన్నిటి ఘుమఘుమలూ కలగాపులగంగా గాల్లో తేలుతూ వచ్చి పిలుస్తుంటాయి. ఇన్నేళ్ళుగా ఎన్నో హోటళ్ళల్లో తిన్నాను కానీ కెత్తేల్ సాయిబు భోజనం ఘుమఘుమ, రుచీ ఎక్కడా చూడలేదు. వాసుదేవన్ నాయర్ అనేవాడు: ‘దానికీ ఒక లెక్కుందివాయ్. సరుకు కొనేవాడొకడు, వండేవాడొకడైతే భోజనానికి సువాసన, రుచి కుదరదు. కెత్తేల్ సాయిబు చేపలు, మాంసమే కాదు, బియ్యం, కిరాణా సామాను కూడా స్వయంగా ఆయనే వెళ్ళి నాణ్యత చూసి గానీ కొనుక్కురాడు. క్వాలిటీలో నువ్వుగింజంత తేడా ఉన్నా కొనడు. రొయ్యలు ఆయనకంటూ ప్రత్యేకంగా దీవి మూల నుండి వస్తాయి. పాప్పీ అని ఒక ముసల్మాన్ పట్టుకొస్తాడు. వలలో చేపలు పైకి తియ్యకుండా నీళ్ళల్లోనో ఉంచి పడవ కిందనే లాక్కుని వస్తాడు. ఒడ్డుకు రాగానే తీసుకుని నేరుగా వండటానికి తీసుకొస్తాడు సాయిబు… అరేయ్, చేసే పనిలో చిత్తశుద్ధి ఉంటే చాలు! రుచిగా ఉండక చస్తుందా!’

ఏం మాయో మంత్రమో గానీ అక్కడ తిన్న పదిహేనేళ్ళలో ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క వంటయినా కూడా రుచి విషయంలో అద్భుతః అన్న స్థాయికి కిందకు దిగినట్టు అనిపించలేదు. దాన్ని ఎలా వర్ణించగలమో తెలీదు గాని, ఒక్క చిత్తశుద్ధి మాత్రమే ఉంటే అది సాధ్యం కాదు. లెక్క కూడా ప్రతిరోజూ సరిగ్గా ఉండద్దూ. సాయిబు హోటల్లో కూరలు, వేపుళ్ళు ఎప్పుడూ నేరుగా పొయ్యి మీదనుండే తీసుకొచ్చి వేడివేడిగా వడ్డించేవాళ్ళు. ఈ రోజుకి ఇంతమందే వస్తారు అని ఒక అంచనా ఉండేది సాయిబుకు. తగినట్టు అన్నీ అమర్చుకునేవాడు. సాయిబు, ఆయన బేగం, ఇద్దరు కొడుకులు, ఇద్దరు పనివాళ్ళు. వీళ్ళు ఎవరూ సాయిబు మాట జవదాటరు. సాయిబు ముక్కుతోనే రుచి చూడగలరు అంటారు. ఎన్ని చెప్పుకున్నా నేను మాత్రం అక్కడ ఒక దేవత కొలువుంది అనే అంటాను. దేవత కాదేమో ఏదో జిన్ని అయుంటుంది. అరబ్బుదేశం నుండి వచ్చిన జిన్ని కాదు, మలబార్ ప్రాంతంలో ఒక గ్రామంలో పుట్టి కల్లాయి ఏటి నీళ్ళు తాగిన జిన్ని.

కెత్తేల్ సాయిబు పూర్వీకులది మలబార్ ప్రాంతం. యూసఫ్ అలీ కెచ్చేరి రాసిన ‘కల్లాయిపుళ ఒర మణవాట్టి…’ అన్న పాట రేడియోలో వస్తుంటే ఆయన కొడుకు ‘అది మా నాయనోళ్ళ ఏరు’ అన్నాడు. అంతకంటే ఆయన గురించి ఏమీ తెలియదు. ఆయన మాట్లాడడు కూడా. ఆయన్ని ఎవరైనా మంత్రం వేసి మాట్లాడిస్తే తప్ప ఆయన్ని మాట్లాడించలేము. పొట్ట చేతబట్టుకుని వచ్చిన కుటుంబం. చిన్న వయసులోనే సాయిబు వీధినపడ్డాడు. ఇరవై ఏళ్ళదాక పెద్ద కెటిల్ మోసుకుని తిరిగి చాయ్ అమ్మేవాడు. కెత్తేల్ సాయిబు అన్న పేరు అలా వచ్చిందే. మెల్లమెల్లగా రోడ్డు పక్కన చేపలు వేయించి అమ్మేవాడు. తర్వాత భోజనం హోటల్. అనంతన్ నాయర్ ఒకసారి ‘కెత్తేల్ సాయిబు చేతి చాయ్ తర్వాత ఈరోజు వరకు నేను మంచి చాయ్ తాగెరగను’ అన్నాడు. సాక్షాత్తూ కౌముది బాలకృష్ణన్ అంతవాడు కూడా సాయిబు చేతి చాయ్ తాగటానికి పార్టీ సమావేశాలు తొందరగా ముగించుకుని శాలబజారుకు వచ్చేవాడు అంటారు.

సాయిబుకు ఏ కొరతా లేకుండా జీవితం సాఫీగా సాగిపోయేది. అంబలముక్కులో పెద్ద ఇల్లు. ఉమ్మడి కుటుంబం. పట్టణంలోనే ఏడెనిమిది హోటళ్ళు. ముగ్గురు అమ్మాయిలకీ పెళ్ళి చేసేశాడు. ముగ్గురు అల్లుళ్ళచేతా తలా ఒక హోటల్ పెట్టిచ్చాడు. ఆయన చేర్చిన ఆస్తులన్నీ ఈ హోటల్ వ్యాపారంతో కూడపెట్టిందే అంటే ఆశ్చర్యం కలగొచ్చు. ఎందుకంటే సాయిబు భోజనానికి డబ్బు తీసుకోడు. చాయ్ అమ్మే రోజలనుండే కొనసాగుతున్న అలవాటిది. హోటల్ ముందు ఒక మూల ఒక అడ్డ తడిక, దాని వెనక ఒక ఇనప డబ్బా హుండీ ఉంటుంది. భోజనం అయాక వెళ్ళేప్పుడు ఎంతయినా వేసి వెళ్ళొచ్చు. ఎవరూ చూడరు. వెయ్యకుండా కూడా వెళ్ళొచ్చు. ఎన్ని రోజులు డబ్బులు వెయ్యకుండా వెళ్ళినా, ఎంత తిన్నా సాయిబు పట్టించుకోడు.

ఒంటి మీద చొక్కా లేకుండా కాకి నిక్కరూ టోపీ వేసుకుని వీధిలో చాయ్ అమ్మిన పసిపిల్లాడి నాటినుండి కెత్తేల్ సాయిబు అంతే. ఒక చిన్న డబ్బా పక్కన ఉంటుంది, చాయ్ తాగినవాళ్ళు అందులో ఎంతోకొంత వేస్తే చాలు. చాయ్ ఎంత అని అడగకూడదు, అడిగినా చెప్పడు. మొదట్లో కొందరు ఆకతాయిలు ఇతన్ని ఆటపట్టించేవాళ్ళు. డబ్బాలో కాగితాలు మడిచి వేసి వేళ్ళేవాళ్ళు. కొందరు ఆ డబ్బానే కాజేసేవాళ్ళు. మరికొందరు నెలలు, సంవత్సరాల పొడవునా పైసా ఇవ్వకుండా చాయ్ తాగేవారు. కెత్తేల్ సాయిబుకు వాళ్ళ ముఖాలు కూడా గుర్తు పెట్టుకోవాలి అనిపించేది కాదు.

జీవితంలో ఒకే ఒక్కసారి కెత్తేల్ సాయిబు ఒకడిపై చెయ్యి చేసుకున్నాడు. తమిళనాడు నుండి వచ్చి మార్కెట్‌లో ధనియాలు, మిరియాలు, జీలకర్ర లాంటి దినుసులు చెరిగి కూలిడబ్బులు తీసుకుని పొట్టపోసుకునే ఒక పేదమ్మాయి తన దగ్గర చాయ్ తాగుతోంది. ఆ రోజుల్లో దందాలు వసూలు చేసుకు తిరిగే కరమన కొచ్చుట్టన్ పిళ్ళై అదే సమయంలో చాయ్ కోసం వచ్చాడు. ఆమెను చూశాడు. ఏమనుకున్నాడో ఉన్నపళాన వెళ్ళి ఆమె రొమ్ములు పట్టుకుని పిసకసాగాడు. ఆమె కేకలు పెట్టింది. పూనకం వచ్చినవాడిలా ఆమెను ఎత్తుకుని వెనక వైపు గల్లీలోకి వెళ్ళే ప్రయత్నం చేశాడు. కెత్తేల్ సాయిబు గమ్మున లేచి కొచ్చుట్టన్ పిళ్ళైని లాగి పెట్టి ఒక్క లెంపకాయ కొట్టాడు. కొచ్చుట్టన్ పిళ్ళై చెవిలోంచి, ముక్కులోంచి, నోట్లోంచి రక్తం కారుతూ నేల మీద దబ్బున పడ్డాడు. కెత్తేల్ సాయిబు అక్కడ అసలేమీ జరగనట్టు తిరిగి తన ఛాయ్ పనిలో పడిపోయాడు.

కొచ్చుట్టన్ పిళ్ళై మనుషులొచ్చి అతన్ని తీసుకెళ్ళి పద్దెనిమిది రోజులు ఆస్పత్రిలో చికిత్స చేయించారట. ఆ తర్వాత ఇక ఎప్పుడూ కొచ్చుట్టన్ పిళ్ళై లేచి ముందులా నడవలేదట. చెవులు సరిగా వినిపించేవి కావుట. తల ఎప్పుడూ వణుకుతూ, పదేపదే మూర్ఛలొచ్చేవట. ఏడు నెలల తర్వాత కరమన నదిలో స్నానం చేస్తుండగా మూర్ఛ వచ్చి నీటిలో కొట్టుకుపోతే ఉబ్బిపోయిన శవాన్ని వెలికి తీశారట.

ఒక తురకోడు పెద్ద కులస్తుడైన పిళ్ళైపై ఎలా చెయ్యి చేసుకుంటాడు? అని ఒక ముఠా సరంజామా వేసుకుని వస్తే, శాలమహాదేవాలయం ట్రస్టీ అనంతన్ నాయర్ వాళ్ళను ఆపి ‘పోయి మీ పనులు మీరు చూస్కోండ్రా! వావీ వరుసల్లేకుండా అడ్డగోలుగా ఒ‌ళ్ళు కైపెక్కి జంతువులా ప్రవర్తిస్తే తురకోడి చేతుల్లోనైనా చస్తాడు, చీమ కుట్టయినా చస్తాడు’ అన్నాడట. అనంతన్ నాయర్ మాటకు శాలబజార్‌లో ఎవరూ ఎదురు చెప్పరు.

నేను మొదటిసారి కెత్తేల్ సాయిబు హోటల్‌కు వచ్చింది పందొమ్మిదివందలా అరవై ఎనిమిదిలో. నా సొంత ఊరు కన్యాకుమారి పక్కన ఒసరవిళై. నాన్న కోట్టాఱులో ఒక రైస్ మిల్లులో లెక్కలు రాసేవాడు. నాకు చదువు బాగానే అబ్బింది. పదకొండో తరగతి అవ్వగానే కాలేజీలో చేరమన్నారు అందరూ. కాని, నాన్నకొచ్చే జీతం డబ్బుతో కాలేజి చదువు అన్నది నా ఊహకైనా అందలేదు. అయితే ఒక మేనమామ తిరువనంతపురంలో పేటలో ఉండేవాడు. ఒక మోస్తరుగా సాగే ప్రింటింగ్ ప్రెస్ వ్యాపారం. అత్తది తాళక్కుడి. వాళ్ళూ బంధువులే. నాన్న నన్ను చేయి పట్టుకుని తీసుకెళ్ళి బస్ ఎక్కి తంబానూర్‌లో దిగి పేటదాకా నడిపించే తీసుకెళ్ళాడు. నేను చూసిన మొదటి పట్నం తిరువనంతపురం. జుట్టుకు రాసుకున్న కొబ్బరినూనె చెమటతోపాటు ముఖంమీద కారుతూ, అంచులు చుట్టుకుపోయిన పంచెతో కుండలో ఉండ చుట్టిపెట్టిన చొక్కా వేసుకుని, చెప్పులు లేని కాళ్ళతో పిచ్చి అవతారంలో వెళ్ళాను.

మామకు వేరే దారి లేదు. ఆయన్ని చిన్నతనంలో పెంచింది నాన్నే. యూనివర్సిటీ కాలేజిలో ఇంగ్లీష్ సాహిత్యం తీసుకున్నాను. నాన్న సంతృప్తిగా ఊరికి తిరిగెళ్ళాడు. ఒక రూపాయి నా చేతిలో పెట్టి ‘దాచుకో, ఖర్చు పెట్టేయకు. అంతా మీ మామ చూసుకుంటాడు’ అన్నాడు నాన్న. ‘ఇదిగో సుబ్బమ్మా, వీడు నీకు కేవలం మేనల్లుడే కాదు, కొడుకు కూడా’ అని అత్తకు చెప్పి వెళ్ళాడు. నేను వాళ్ళతో ఉండటం మామకు ఎలా అనిపించేదో గానీ, అత్తకు మాత్రం నేను వాళ్ళింట్లో చేరడం ఏ కోశానా నచ్చలేదన్నది ఆ రోజు రాత్రి భోజనాలప్పుడు స్పష్టంగా తెలిసిపోయింది. అందరూ సాంబారు, కూర, అప్పడాలు వేసుకుని భోజనం చేస్తుంటే నన్ను తినమనలేదు. వాళ్ళ భోజనాలయ్యాక పొయ్యి దగ్గరే ఒక అల్యూమినియం గిన్నెలో ఉన్న చద్దన్నంలో కూర వేసి ఇచ్చారు.

ఇక ఆ రోజునుంచీ నాకు అవమానాలు, ఆకలీ అలవాటయిపోయాయి. అన్నిట్నీ భరిస్తూ వచ్చాను. భరించినకొద్దీ అవి ఎక్కువయ్యాయి. ఇంట్లో పనులన్నీ నేనే చెయ్యాల్సి వచ్చేది. బావిలో నీళ్ళు చేది అన్నిటికీ నింపాలి. రోజూ ఇల్లూ, వాకిలీ ఊడవాలి. వాళ్ళ ఇద్దరి కూతుళ్ళనూ బడికి తీసుకెళ్ళి విడిచిపెట్టాలి. పెద్దమ్మాయి రామలక్ష్మి ఎనిమిదో తరగతి. ఆమెకు లెక్కలు నేర్పించి, ఆమె హోమ్‌వర్కు చేసివ్వాలి. రాత్రి వంటగది కడిగేసి పడుకోవాలి. ఇంతకీ నాకు తలదాచుకోడానికి నాకు వాళ్ళిచ్చిన చోటు వరండా అరుగే. రెండు పూటలూ చద్దన్నం, పచ్చడి. అత్త ఎప్పుడూ చిరాగ్గా విసుగ్గా చిటపటలాడుతూనే ఉండేది. ఇంటికి వచ్చే ప్రతి ఒక్కరికీ నా గురించి చెప్తూ వాపోయేది. నేను తినే పిడికెడు కూటివల్ల వాళ్ళు అప్పుల పాలైపోతున్నట్టు చెప్పేది. నేను పుస్తకం తీసుకోవడం చూస్తే ఆమెకు ఆవేశం కట్టలు తెంచుకునేది, గగ్గోలు పెట్టేసేది.

నేను ఇవేవీ నాన్నకు రాయలేదు. అక్కడ ఇంట్లో ఇంకా ఇద్దరు తమ్ముళ్ళు ఒక చెల్లి ఉన్నారు. సగం రోజులు రైస్‌మిల్లులో బియ్యం, పప్పులు చెరిగేవాళ్ళు తీసి పక్కన పెట్టే నూక, ముక్కపోయిన బియ్యపు గింజలే గంజి కాచుకు తాగేవాళ్ళం. ఏటొడ్డున పెరిగే పొన్నగంటి ఆకే నాకు ఊహ తెలిసినప్పట్నుండి మేము రోజూ తిన్నది. మిరపకాయలు, ఉప్పు, ఆకు వేసి ఉడికించుకోవడమే. దాన్లో కొబ్బరి కోరు కూడా వేసుకుని తినలేని పరిస్థితి. ఆకలి మహిమేమోగానీ చాలాసార్లు ఆ పొన్నగంటి ఆకుకూరకే నోట్లో నీళ్ళు ఊరేవి. ఎప్పుడైనా ఒక రోజు అమ్మ తెగించి నాలగణాలకు కవలు చేపలు కొంటే ఇక ఆ రోజు ఇల్లంతా ఆ వాసన ఘుమఘుమలాడేది. ఆ రోజు మాత్రం మంచి బియ్యం వండి వార్చేది. ఇక నాకయితే రోజంతా ధ్యానం చేసినట్టు కవలుచేప పులుసు మాత్రమే మనసులో తిరుగుతుండేది. వేరే ధ్యాస ఉండేదే కాదు. చివరికి తినడానికి కూర్చున్నప్పుడు పులుసు చట్టిలో అన్నం కలుపుకుని ఊడ్చి ముద్ద నోట్లో పెట్టుకుంటుంటే అందులో కూడా భాగం కావాలన్నట్టు తమ్ముడు చేయి చాచేవాడు.

కాలేజికి ఫీజ్ కట్టాల్సి వచ్చినప్పుడు ఎన్నో రకాలుగా నలిగిపోతూ మామతో నసిగాను. చివరికి నేరుగా అడిగేశాను. ‘మీ నాన్నకి రాసి తెప్పించుకో. ఇక్కడ బసకి, భోజనానికి మాత్రమే అని చెప్పాను అప్పుడే…’ అని అన్నాడు. నాన్నకు రాయడం సమంజసం కాదు అని నాకు తెలుసు. వారం గడువు దాటాక కాలేజికి రావద్దు, ఫీజు చెల్లించాకే రావాలి అన్నారు. నేను పిచ్చి పట్టినవాడిలా తిరిగాను. తంబానూర్ రైల్వే స్టేషన్‌కు వెళ్ళి రోజంతా ఆ పట్టాల శబ్దాలు వింటూ కూర్చున్నాను. నా మనసులో ఆ పట్టాలమీద ఎన్ని రకాలుగా పడి చచ్చానో చెప్పలేను. అప్పుడే నాతో చదువుకున్న కుమారపిళ్ళై ఒక ఉపాయం చెప్పాడు. వాడే స్వయంగా నన్ను తీసుకెళ్ళి శాలలో కె. నాగరాజ్ పణిక్కర్ బియ్యం మండీలో లెక్కలు రాసే పనిలో చేర్చాడు. సాయంత్రం ఐదు గంటలకు వస్తే చాలు. రాత్రి పన్నెండు వరకు లెక్కలు రాయాలి. రోజుకు ఒక రూపాయ్ జీతం. నలభై రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు. అది తీసుకెళ్ళి ఫీజు కట్టాను.

రోజూ ఇల్లు చేరేసరికి అర్ధరాత్రి ఒకటి దాటేది. పొద్దున ఏడింటికి లేచేవాడిని. కాలేజిలో చదివే చదువే. అంతకంటే సమయం దొరకదు. తరగతి గదుల్లో శ్రద్ధగా వినే అలవాటు సహజంగా ఉండింది. అయినా సమయం సరిపోలేదు. యూనివర్సిటీ నుండి సెక్రటేరియట్ గుండా అడ్డదారిలో దూరి కరమన దాటుకుని బజారుకు వెళ్ళడానికి ముప్పావు గంట పట్టేది. చివరి పీరియడ్ షణ్ముఖం పిళ్ళై తీసుకుంటే నాలుగున్నరకు కూడా ఆపేవారు కాదు. నేను వెళ్ళడానికి ఆలస్యం అయితే లెక్కలు రాయడానికి పరమశివం కూర్చునేవాడు. ఆ తర్వాత నేను వెళ్ళినా ప్రయోజనం లేదు. వారంలో నాలుగు రోజులు మాత్రమే సరుకు వస్తుంది. ఆ నాలుగు రోజుల్లో ఒక రోజు తగ్గినా పావువంతు రాబడి నాకు రాకుండా పోయినట్టే.

తొలి నెల నా చేతికి డబ్బే రాలేదు. రావలసిన పదిహేను రూపాయలూ అడ్వాన్స్‌లో జమ చేశాడు పణిక్కర్. నేను పొద్దున లేవగానే అత్త నా ముందొక నోటు పుస్తకం పెట్టి వెళ్ళింది. అదొక పాత పాత నోటు పుస్తకం. తిరగేసి చూశాను. నేను వచ్చిన రోజునుండి ప్రతిరోజు తిన్న ప్రతి పూటా తిన్న తిండికి పద్దు రాసిపెట్టి ఉంది. ఒక పూటకి రెండణాలు చొప్పున మొత్తం నలభైయెనిమిది రూపాయలు పద్దు రాసుంది. నాకు కళ్ళు తిరిగాయి. మెల్లగా వంటగదికి వెళ్ళి ‘ఏంటత్తా ఇది?’ అని అడిగాను. ‘ఆఁ, భోజనం ఊరకే పెడతారేంటయ్యా! ఇప్పుడు నువ్వు సంపాయిస్తున్నావుగా? ఇస్తేనే నీకూ గౌరవం, మాకూ మర్యాద!’ అని అంది. నేను నిశ్చేష్టుడనయ్యాను. ఆమె ‘లెక్కల్లో ఏఁవైనా పొరపాటుంటే చెప్పు. నువ్వు వచ్చిన తొలి రోజునుండి క్రమం తప్పకుండా రాస్తూ ఉన్నాను’ అంది.

నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి, గొంతు పూడుకు పోయింది. కొంచం తేరుకుని ‘నేను ఇలా అనుకోలేదు అత్తా… నాకేం అంత జీతం రాదు. ఫీజు కట్టాలి, పుస్తకాలు కొనాలి…’ అన్నాను. ‘ఇదిగో చూడు, నేను నీకెందుకు ఉత్తపుణ్యానికి తిండి పెట్టాలి? నాకు ఇద్దరమ్మాయిలున్నారు. రేపు వాళ్ళని ఒక అయ్య చేతిలో పెట్టి పంపించాలంటే డబ్బు, నగలు అని బోలుడుంటాయి. లెక్క లెక్కగా ఉంటేనే నీకూ మర్యాద, నాకూ మర్యాద’ అని కచ్చితంగా చెప్పింది. నేను పూడుకుపోతున్న గొంతుతో ‘ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు అత్తా. నేను కొంచం కొంచంగా ఇస్తాను’ అన్నాను. ‘ఇస్తావని ఎలా నమ్మేది?’ అంది. నేను మాట్లాడలేదు. ఆ రోజు సాయంత్రమే నేను అక్కడనుండి సర్దుకుని నేరుగా పణిక్కర్ గొడౌన్‌లో వచ్చి చేరిపోయాను. పణిక్కర్‌కు ఉచితంగా వాచ్‌మేన్ దొరికాడు అన్న అదనపు సంతోషం. అత్త నా ముఖ్యమైన పుస్తకాలు కొన్నిట్ని తాకట్టుకింద తీసిపెట్టేసుకుంది.

శాలబజార్‌లో నా రోజులు సంతోషంగానే గడిచాయి. కరమన ఏటిలో స్నానం, అక్కడే ఎలిసామ్మ ఇడ్లీకొట్టులో నాలుగు ఇడ్లీలు, నేరుగా కాలేజీ. మధ్యాహ్నం ఉపవాసం. సాయంత్రం పని ముగిశాక ఒక బన్ను తిని, టీ తాగి పడుకునేవాడిని. లెక్కకు ఒక్క పూటే ఆహారం. పొద్దస్తమానం ఆకలిగానే ఉండేది. దేని గురించి ఆలోచించినా చివరికి భోజనం దగ్గరకే వచ్చేది. పుష్టిగా ఎవరైనా కంటబడితే వాళ్ళనుండి కళ్ళు మరలేవి కావు‌! ఎంత తింటారో అన్న ఆలోచన. శాలమహాదేవరాలయం దార్లో వెళ్ళేప్పుడు పాయసం వాసన వస్తే లోపలికి వెళ్ళిపోయేవాడ్ని. ఆకు దొన్నెలో ఇచ్చే పాయసం, పండు ఒక రోజు ఇడ్లీ ఖర్చుని తగ్గించేది. శాస్తా గుడిలో శనగలు, ఇసక్కియమ్మోరు చిత్రాన్నం అని అప్పుడప్పుడు ఏదో ఒకటి దొరుకుతూ ఉండేది. అప్పటికీ డబ్బు సరిపోయేది కాదు. పణిక్కర్ అడ్వాన్స్ డబ్బు మొత్తం జమ అయ్యేలోపే కాలేజిలో తరువాయి కంతు ఫీజు కట్టమన్నారు. వీటన్నిటి మధ్యలో నెలకు ఐదు రూపాయలు చొప్పున అత్తకు తీసుకెళ్ళి ఇచ్చాను. పరీక్షలు వచ్చేలోపు పుస్తకాలు విడిపించుకోవాలి.

రాన్రానూ నేను బక్కచిక్కిపోయాను. కళ్ళు పూడుకుపోయి నడిచేందుకు కూడా బలం సరిపోయేది కాదు. లెక్కలు రాస్తూ ఉంటే ఉన్నట్టుండి కళ్ళు బైర్లుగమ్మేవి. ఏదో చీకటిబావి లోపల పడినట్టు, మునుగుతూ తేలుతూ ఉన్నట్టూ ఉండేది. నోట్లో ఎప్పుడూ చేదు రుచి. చేతులు, కాళ్ళలో చిన్న వణుకు. కాలేజీకి నడవటానికి గంట పట్టేది. నా ధ్యాసంతా తిండిమీదే. ఒక రోజు రోడ్డుమీద దెబ్బతగిలి చచ్చిపడి ఉన్న కుక్కను చూశాను. దాని మాంసాన్ని తీసుకెళ్ళి గోడౌన్ వెనక రాళ్ళ పొయ్యి రగిలించి కాల్చి తిందామా అని కూడా ఆలోచించాను. ఆ ఊహకే నోరూరి చొక్కా మీదకు ఉమ్మి కారిపోయింది ఆ రోజు.

అప్పుడు కూలి నారాయుడు చెప్పాడు, కెత్తేల్ సాయిబు హోటల్ గురించి. డబ్బులే ఇవ్వక్కర్లేదన్నది నాకు నమ్మబుద్ధి కాలేదు. చాలామందిని విచారించాను, నిజమేనన్నారు. ఉంటే ఇవ్వచ్చట. నాకు ధైర్యం రాలేదు. అయితే ఆ రోజునుంచీ కెత్తేల్ సాయిబు హోటల్ గురించిన ఆలోచన మాత్రమే ఎప్పుడూ మనసులో తిరుగుతూ ఉండేది. నాలుగైదుసార్లు హోటల్ బయట నిల్చుని చూసి వచ్చేశాను. ఆ ఘుమఘుమలు నన్ను పిచ్చెక్కించాయి. నేను వేయించిన చేపలు నా జీవితంలో రెండుసార్లు మాత్రమే తిన్నాను, దూరపు చుట్టాలయిన ఒక జమీందారింట్లో. ఒక వారం తర్వాత మూడు రూపాయలు పోగయ్యాక డబ్బు జేబులో పెట్టుకుని కెత్తేల్ సాయిబు హోటలుకు వెళ్ళాను.

సాయిబు హోటల్ గోనెసంచీ కర్టన్ తెరిచేదాకా నాకు ఒళ్ళు వణుకుతూ ఉండింది. ఏదో దొంగతనానికి వచ్చినవాడిలా అనిపించింది. జనంతో కలిసిపోయి ఒక మూలగా ఎవర్నీ పట్టించుకోనట్టు కూర్చున్నాను. ఒకటే రద్దీ. సాయిబు తుఫాను వేగంతో అన్నం వడ్డిస్తున్నాడు. తామరాకుల్లో వడ్డన. ఆవిర్లు కక్కుతున్న ఎర్ర సంబా అన్నాన్ని పెద్ద హస్తంతో వడ్డించి దాని మీద చేపలు పులుసు పోస్తున్నారు. కొందరికి కోడి మాంసం పులుసు. కొందరికి వేయించిన కోడి మాంసం. ఆయన ఎవరు కూర్చున్నారన్నది చూడకుండానే వడ్డన చేస్తున్నాడు. అయితే తర్వాత తెలుసుకున్నాను, ఆయనకి అందరూ తెలుసని. చాలామందికి ఏం కావాలో కూడా అడగకుండా చేపలు, మాంసం వడ్డించారు. రెండోసారి పులుసు వెయ్యడానికి మాత్రం వేరే అబ్బాయి.

నా దగ్గరకు రాగానే ముఖానికేసి చూశాడు. ‘ఏంటి‌ పిళ్ళైగారూ, మొదటిసారి వస్తున్నారా?’ అన్నాడు. నన్ను చూడగానే వేళాళుడన్న నా కులాన్నెలా పసిగట్టారో అని ఆశ్చర్యంతో నాకు మాటలు రాలేదు. అన్నం పెట్టి దాని మీద పులుసు పోశాడు. వేయించిన పెద్ద చికెన్ కాలు, రెండు ముక్కలు వేయించిన చేపలు. ‘తినండి తినండి’ అని గదమాయించి వెళ్ళిపోయాడు. దీనికే మూడు రూపాయలు దాటేస్తుందేమో అని నా చేతులు కాళ్ళు వణికాయి. అన్నం నా గొంతులో చిక్కుకుంది. సాయిబు నాకేసి చూసి ‘తినేప్పుడు ఏం ఆలోచించకుండా తినండి, పిళ్ళైగారూ’ అని గట్టిగా కేకేశాడు. గబగబా తిన్నాను. ఆ రుచి నా ఒళ్ళంతా, అణువణువులోనూ పాకింది. రుచి! దేవుడా, అలాంటొక మాట ఉందన్నదే మరిచిపోయానే ఇన్నాళ్ళూ! నా కళ్ళవెంట ధారగా కారిన నీళ్ళు నోటివరకు జారాయి.

ఒక చిన్న గిన్నెలో కాచిన నెయ్యిలాంటిదేదో పట్టుకుని నా దగ్గరకొచ్చాడు కెత్తేల్ సాయిబు. నా ఆకులో దాన్ని కుమ్మరించి ఇంకాస్త పులుసు పోసి ‘బాగ కలుపుకుని తినండి. చేప కొవ్వు ఇది’ అన్నారు. ఏటి చేప కొవ్వు. చేప చెవుల దగ్గర కోసి ఆ పసుపు రంగు కొవ్వును తీస్తారు. కూరకు అది ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. కడుపునిండా తిని చాలా కాలం అవ్వడంతో కాసేపటికే నా పొట్ట నిండిపోయింది. హఠాత్తుగా నా విస్తరిలో రెండు హస్తాలు అన్నం పెట్టాడు సాయిబు. ‘అయ్యో, చాలండి’ అని ఆపబోయిన నా చేతిమీద ఆ హస్తంతోనే ఒకటిచ్చి ‘అన్నం పెడుతుంటే వద్దంటావూ! చచ్చినోడా… తిను మూసుకుని’ అని గదమాయించి వెళ్ళాడు. నిజంగా చేతికి నొప్పెట్టింది. లేచేస్తే సాయిబు మళ్ళీ ఎక్కడ కొడతాడో అని ఆయన ఎర్రటి కళ్ళు చూసి భయపడి తింటూ కూర్చున్నాను. ఆకులో అన్నం విడిచిపెడితే సాయిబుకు నచ్చదని తెలుసు. భోంచేశాక లేవలేకపోయాను. బెంచ్ పట్టుకుని నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి ఆకు పడేసి చేయి కడుక్కున్నాను.

ఆ హుండీ డబ్బా దగ్గరకు వెళ్తుంటే నా కాళ్ళు వణికాయి. ఎక్కడో ఒక మూలనుండి కెత్తేల్ సాయిబు చూస్తునే ఉంటారేమో అనిపించింది. అయితే ఆయనేమో వేరేవాళ్ళకు హడావుడిగా వడ్డన చేస్తూ ఉన్నాడు. ఎంతోమంది డబ్బులు వెయ్యకుండానే సహజం అన్నట్టు వెళ్తూ ఉండటం కూడా చూశాను. కొంతమంది ఇదీ సహజమే అన్నట్టు అందులో డబ్బులు వేస్తూ ఉన్నారు. నేను వణికే చేతులతో మూడు రూపాయలు తీసి అందులో వేశాను. ఏదైనా అరుపు వినబడుతుందేమోనని వీపంతా చెవులుగా చేసుకున్నాను. ఇక మెల్లగా బయటికి వచ్చాక నా మనసు, ఒళ్ళు కాస్త కుదుటపడ్డాయి. శాలబజారంతా చల్లగాలి వీస్తున్నట్టు అనిపించింది. నా దేహం పులకించిపోయింది. దేన్ని పట్టించుకోకుండా ఒక కొత్త మత్తుతో నడిచాను.

నాలుగైదు రోజులు నేను ఆ దరిదాపులకు వెళ్ళలేదు. మళ్ళీ రెండు రూపాయలు కూడపెట్టుకున్నాక ధైర్యం చేసి కెత్తేల్ సాయిబు హోటల్‌కు వెళ్ళాను. ఆయన నన్ను గుర్తు పెట్టుకున్నాడు అన్నది కరిగించిన కొవ్వు గిన్నె తెచ్చి కుమ్మరించినప్పుడు తెలిసొచ్చింది. అదే గదమాయింపు, అవే తిట్లు. పొట్టపగిలిపోయేంతగా అంతే సుష్టుగా భోజనం. ఈసారి డబ్బులు నెమ్మదిగానే వేశాను. మళ్ళీ మూడు రోజుల తర్వాత వెళ్ళినప్పుడు చేతిలో ఏడు రూపాయలు ఉన్నాయి. సాయంత్రం అత్తకు ఇవ్వాలి. రెండు రూపాయలకు భోంచేద్దాం అనుకున్నాను. నిజానికి నా సంపాదనకి నేను భోజనానికి రెండణాలకంటే ఎక్కువ ఖర్చుపెట్టడం అన్నది దుబారాతనం! అయితే సాయిబు వంటల రుచి నన్ను వదల్లేదు. ఆ రోజుల్లో నా కలల్లోకూడా కెత్తేల్ సాయిబు హోటల్ చేపలు పులుసు, కోడిమాంసం వేపుడు మాత్రమే వచ్చేవి. అంతెందుకు నా నోటు పుస్తకంలో వాటిగురించి చివరిపేజీలో ఒక పద్యం కూడా రాసిపెట్టుకున్నాను.

భోజనం చేస్తున్నప్పుడు, డబ్బు వెయ్యకుండా వెళ్ళిపోతే ఏమవుతుంది అన్న ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన పొట్టలో తెలియని ఆదుర్దా కలిగించింది. ఇక ఆపై తినలేకపోయాను. బంతిని బలవంతంగా నీటిలో ముంచినట్టు, అన్నం మెతుకుల్ని గొంతులో కుక్కాల్సి వచ్చింది. కళ్ళు బైర్లుకమ్మాయి. లేచి చేతులు కడుక్కుని చల్లబడి గడ్డకట్టిన పాదాలను బలవంతంగా ఎత్తిపెట్టి నడిచాను. కళ్ళు తిరుగుతున్నాయా? గుండెలో బరువా? మూత్రపిండాలు నిండిపోయాయా? ఒకటే అస్పష్టత! ఇంతా ఎందుకు, డబ్బులు తీసుకెళ్ళి హుండీలో వేసేస్తే పోతుంది కదా అనిపించింది. నెమ్మదిగా నడుచుకుంటూ హుండీ దగ్గరకు వచ్చాను. దాన్ని దాటుకుని వెళ్ళలేకపోయాను. చెవుల్లో ఒకటే హోరు. ఫట్టుమని ఏడు రూపాయలూ తీసి హుండీలో వేసేసి బయటకు వచ్చేశాను. బయట గాలి తగిలాక ప్రశ్నలే ప్రశ్నలు. సగం నెల సంపాదన మొత్తం వేసేశాను. ఎన్ని అప్పులు. కాలేజి ఫీజుకు ఇంకా ఎనిమిది రోజులే గడువు ఉంది. నేను చేసిన ఈ పని మూర్ఖత్వానికి పరాకాష్ఠ!

మనసు కరిగి కన్నీళ్ళుగా కారుతోంది. దగ్గరవాళ్ళు ఎవరో పోయినట్టు అనిపించింది. పెద్దగా మోసపోయినట్టు అనిపించింది. మండీకి వెళ్ళి కూర్చున్నాను. రాత్రి వరకు తీరికలేనంత పని మనసునీ ఒంటినీ మరెటూ కదలనివ్వలేదు కాబట్టి బతికిపోయాను. లేదంటే ఆ బాధలో నేను ఏ పట్టాలమీదో కూడా తలపెట్టి పడుకుని ఉండేవాడిని. ఆ రాత్రి అనిపించింది. ఎందుకు ఏడవడం? ఆ డబ్బు జమ అయ్యేన్ని రోజులు కెత్తేల్ సాయిబు హోటల్లో భోజనం చేస్తే సరిపోతుంది. ఆ ఉపాయం మనసుకు కొంచం ఉపశమనాన్ని కలిగించింది, నిద్రపోయాను.

మరుసటి రోజు మధ్యాహ్నం వరకే కాలేజి. నేరుగా వెళ్ళి కెత్తేల్ సాయిబు హోటల్లో కూర్చుని నెమ్మదిగా ముద్ద ముద్దా ఆస్వాదిస్తూ భోంచేశాను. ఆయన తీసుకొచ్చి వడ్డిస్తూనే ఉన్నారు. కొంచం విరామం ఇస్తే వీడెక్కడ లేచేస్తాడో అన్నట్టు ‘నాన్చకుండా తినవోయ్ పనికిమాలిన కొయ్యా!’ అన్నాడు. భోజనం చేసి చేతులు కడుక్కుని గమ్మున వస్తుండగా లోపలున్న కెత్తేల్ సాయిబు ఏమైనా అడిగితే చెప్పడానికి కారణాలు పోగుచేసుకుంటున్నాను. ఆయనేమో అసలు పట్టించుకోనేలేదు. నేను బయటకు వచ్చినప్పుడు అసంతృప్తిగా అనిపించింది. ఆయన మీద చిరాకు కలిగింది. పెద్ద పుడుంగి అనుకుంటున్నాడు. ధర్మానికి కట్టుబడి అందరూ డబ్బులు వేస్తున్నారు కాబట్టే కదా ఈయన పెద్ద ధర్మాత్ముడిలా కనపడుతున్నాడు. రంజానుకు జక్కాత్తు ఇచ్చేవాళ్ళు డబ్బు తెచ్చి హుండీలో వేస్తున్నారు కాబట్టి బతుకుతున్నాడు. ఊరకే ఇస్తున్నాడా? ఇలా వచ్చిన డబ్బులతోనేగా పెద్ద ఇల్లు, ఆస్తులు అన్నీ? ఎవరూ డబ్బు వెయ్యకుంటే ఎన్నాళ్ళు ఇలా నడుపుతాడేం! చూద్దాం. ఆ రోజు నాకు అంత చిరాకెందుకు కలిగిందో తెలియలేదు. అయితే ఒళ్ళంతా దురదలాగా ఆ చిరాకు తొలుస్తూనే ఉండింది.

ఆ చిరాకుతోనే మరుసటి రోజు కూడా వెళ్ళి కూర్చున్నాను. కెత్తేల్ సాయిబు అడగడని నాకు తెలుసు. ఒకవేళ ఆయన చూపులోనో, ప్రవర్తనలోనో ఏ చిన్న తేడా కనిపించినా ఆ రోజు నుండీ అక్కడికి వెళ్ళకూడదు అని నిర్ణయించుకున్నాను. కాస్త ఎక్కువ ఆతిథ్యం చూపించినా ఆయనకు లెక్క ఉంది, గమనిస్తున్నాడు అనేగా అర్థం. అయితే కెత్తేల్ సాయిబు ఎప్పట్లానే అంతే హుషారుగా వడ్డించాడు. చేప కొవ్వు తెచ్చి కుమ్మరించాడు. ‘కోడిమాంసం తినండి పిళ్ళైగారూ’ అంటూ సగం కోడిని తీసుకొచ్చి నా ఆకులో పెట్టేశాడు. తర్వాత చేపలు తెచ్చాడు. ఈయన ఈ ప్రపంచంలోని మనిషేనా! నిజంగా ఈయన సాయిబేనా లేకుండే పైనుండి దిగివచ్చిన జిన్నీనా? అని భయం కూడా కలిగింది. ముద్ద నోట్లో పెట్టుకోబోతుంటే, మాంసం వేయించిన నూనెలోని అడుగు కారం, మాడు కోడి కాళ్ళు తెచ్చి పెట్టారు. నేను అవి ఇష్టంగా తింటున్నానన్నది పైకి కనిపించకూడదని ఎప్పుడూ జాగ్రత్తగానే ఉంటాను. అయినప్పటికీ ఆ విషయం ఆయనకు తెలిసిపోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు.

ఆ కారాన్ని అన్నంలో కలుపుకుంటుంటే మనసులో ఏదో బాధ పైకి తొణికిపోయింది. కన్నీళ్ళను ఆపుకోలేకపోయాను. నా జీవితంలో ఇంత ఆప్యాయంగా ఎవరూ అన్నం పెట్టలేదు. తవ్వ బియ్యాన్ని గంజి వార్చి పెట్టే అమ్మ కూడా ఎప్పుడూ చిటపటలాడుతూ, తిడుతూ ఉండకపోతే అందరికీ పంచిపెట్టడం వీలయేది కాదు. నేను కడుపునిండా తినాలి అని ఆలోచించిన మొదటి మనిషి. నాకోసం లెక్క చూడకుండా వడ్డించిన తొలి చేయి. అన్నం పెట్టిన చేయి అంటారే, జీవితంలో చివరి క్షణందాకా మనసులో నిలిచిపోయే తల్లి చేయి అంటారే! తాయత్తు కట్టిన మణికట్టు, మొద్దుబారి కాయలు కాచిన వేళ్ళు, మోచేతులదాకా జుట్టున్న ఈ ఎలుగుబంటి చేయేగా నాకు తల్లి చేయి? ఆ తర్వాత నేను కెత్తేల్ సాయిబు హుండీలో డబ్బే వెయ్యలేదు. ఇవ్వకుంటే నాలుగు డబ్బులు ఆదా అయి ఖర్చులకు కలిసొస్తుందన్నది మాత్రం కారణం కాదని నా గుండెమీద చెయ్యి పెట్టుకుని చెప్పగలను. అది నా తల్లి చేతి అన్నం అనుకునే ఇవ్వలేదు. ఒకటి కాదు రెండు కాదు, ఐదేళ్ళ పాటు ఒక పైసా కూడా హుండీలో వెయ్యలేదు.

మధ్యాహ్నమో, రాత్రో రోజూ ఏదో ఒక పూట అక్కడే తినేవాడిని. అదే నాకు సరిపోయేది. మరో పూట ఎక్కడైనా ఇడ్లీలు. నా కాళ్ళకు, చేతులకు కొంచం కొంచంగా బలం వచ్చింది. బుగ్గలు నునుపెక్కాయి. మీసం చిక్కబడింది. గొంతులో కొంత పెద్దరికం వచ్చింది. నడకలో హుందా, మాటల్లో ఒక కరుకుదనం, నవ్వులో ఆత్మవిశ్వాసం వచ్చాయి. మెల్లగా నా మిల్లులో నా ఉద్యోగం మేనేజర్ స్థాయికి చేరింది. సరుకు రాకపోకలన్నీ నా ఆజమాయిషీలోకి వచ్చాయి. చదువు ఖర్చులకు పోను మిగిలిన దాంట్లో ప్రతినెలా ఇంటికి డబ్బు పంపించాను. నేను బి. ఏ. ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యాక యూనివర్సిటీ కాలేజీలోనే ఎం. ఏ. చదవటానికి చేరాను. శాలబజార్‌లో అరుణాచలం నాడార్ అంగటి పైన ఒక గది అద్దెకు తీసుకున్నాను. ఒక మంచి సైకిల్ కొనుక్కున్నాను.

ప్రతిరోజూ కెత్తేల్ సాయిబు చేతి భోజనం తిన్నాను. మెల్లగా మాటలు తగ్గి ఆయన నన్ను గమనిస్తున్నారేమో అన్న సందేహం కూడా కలగసాగింది. అయితే నా ఆకు మీద ఆయన లావు చేతులు అన్నం వడ్డించేప్పుడు తెలిసిపోయేది అవి ప్రేమకు ప్రతిరూపమైన అమ్మ చేతులేనని. నేను ఆయన ఒడిలో పుట్టి ఆయన చనుబాలు తాగినవాడిని అని అనిపించేది. తమ్ముడు చంద్ర పదకొండో తరగతి పూర్తవ్వగానే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని ప్రభుత్వ రవాణాశాఖలో చేరాక ఇంట్లో కష్టాలు చాలా వరకు తగ్గాయి. నేను అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళొచ్చేవాడిని. అమ్మ ఇప్పుడు మంచి బియ్యం కొని, చేపల పులుసు వండి ఆమే వడ్డించేది. అయితే ఏళ్ళ తరబడి కొనసాగిన పేదరికం ఆమెను విడిచిపెట్టలేదు. దానితో ఆమెకు వడ్డించడం చేతయేది కాదు. ఒక కన్ను ఎప్పుడూ చట్టిలో ఉన్న కూర, అన్నం పైనే ఉండేది. ఎంత పెడుతున్నానో అని లెక్క వేసుకోకుండా వడ్డించటం ఎప్పటికీ రాలేదు. అన్నంలోనో కూరలోనో ఆమె గరిటె ముంచిందంటే దానిలో సగాన్ని తిరిగి వంపేసేది. ఇంకాస్త పులుసు అడిగితే ఆమె గరిటెతో ఒక చెమ్చాడు మాత్రమే తీసేది. చేయో మనసో కుంచించుకుపోయింది అమ్మకి. సంబా బియ్యం అన్నాన్ని, కవలు చేపల పులుసుని ఆమె కొంచం కొంచంగా వడ్డిస్తుంటే నాలుగో ముద్దకే పొట్ట నిండిపోయిందన్న భావం కలిగేది. ఆ అన్నాన్ని ముద్దలు చేసుకుని తినడానికే చిరాకనిపించేది. బలహీనంగా ‘ఇంకొంచెం తినరా’ అనేది అమ్మ. తల అడ్డంగా ఊపి, చెయ్యి కడుక్కునేవాడిని.

ఎం. ఏ.లో యూనివర్సిటీలో సిల్వర్ మెడల్‌తో పాసయ్యాను. వెంటనే అదే కాలేజిలో లెక్చరర్‌గా ఉద్యోగం వచ్చింది. ఆర్డర్ చేతికి రాగానే తీసుకుని నేరుగా కెత్తేల్ సాయిబు హోటల్‌కు వెళ్ళాను. అప్పటికి తెరవలేదు. వెనకవైపుకు వెళ్ళాను. గోనె సంచీ పరదా తీసి చూశాను. పెద్ద అండాయిలో కెత్తేల్ సాయిబు చేపల పులుసు తిప్పుతూ ఉన్నాడు. కళ్ళు, చేతులు, దృష్టి, మనసు అంతా పులుసు మీదే పెట్టినట్టున్నాడు, అదొక నమాజు లాగా. ఆయన్ని పిలిచి ఆయన పనికి భంగం కలిగించడం భావ్యం కాదనిపించింది. వెనకకి తిరిగాను. భోజనం వడ్డించేప్పుడు తల పైకెత్తి ఆయన ముఖం చూశాను. ఆ ముఖంలో నాకంటూ ఏ ప్రత్యేక భావమూ ఒలికించినట్టు కనిపించలేదు. చెప్పాల్సిన అవసరం లేదు అనిపించింది. ఆ సమాచారంవల్ల ఆయనకు ప్రయోజనమూ లేదు.

సాయంత్రం ఊరెళ్ళాను. అమ్మ మురిసిపోయిందో లేదో తెలియలేదు. దేన్నయినా బాధగానే వ్యక్తపరిచే ముఖకవళికలు అమ్మవి. నాన్న మాత్రం ‘ఎంత ఇవ్వొచ్చు?’ అని అడిగాడు. ‘బానే రావచ్చు…’ అన్నాను చప్పగా. ‘ఏం, ఒక రెండు వందలిస్తారా?’ అని అడిగాడు. ఆ ప్రశ్నలో ఉన్న లేకి గుమాస్తాతనం నన్ను ఒక సూదిలా పొడిచింది. ‘అలవెన్స్ అంతా కలుపుకుంటే ఏడువందలు వస్తాయి’ అన్నాను. నాన్న కళ్ళల్లో వెలిగి ఆరిపోయిన ఆ అసూయ నేను జీవితకాలం మరిచిపోలేదు. నెలకు ఇరవై రూపాయలకంటే ఎక్కువ జీతం తీసుకోకుండానే పదవీ విరమణ పొందినవాడు ఆయన. తమ్ముడు మాత్రం నిజంగా ఆనందపడ్డాడు. ‘నువ్వు ఇంగ్లీష్‌లోనే కదా క్లాస్ తీసుకోవాలి? అంటే నీకు ఇంగ్లీష్ మాట్లాడటం బాగా వచ్చు కదా? దొరల్లా మాట్లాడుతావు కదా?’ అని ఇలా ఏవేవో అడుగుతూనే ఉన్నాడు. అమ్మ కోపంగా ‘సంతోషించింది చాల్లేగాని, డబ్బు కూడబెట్టి మీ వెనకున్న చెల్లెళ్ళకు పెళ్ళిళ్ళు చేసి కాపురాలకు పంపించే మార్గాలు చూడండి’ అంది.

అలా బాధ్యతను మాకు గుర్తు చేస్తూ ఆమె అహంకారాన్ని దాని ద్వారా వ్యక్తపరిచింది. ‘డబ్బు మదంతో గెంతులేసిన వాళ్ళందరూ ఇప్పుడెలా ఉన్నారో చూస్తున్నారు కదా? తాళక్కుడిదాన్ని ఆ మధ్య పెళ్ళిలో చూశాను. బూజుపట్టిన ఎండు చేపలా ఉంది. ఎంత పొగరుగా ఉండేదీ? పాపిష్టిది. దేవుడికి తెలుసు ఎవరిని ఎక్కడ పెట్టాలో’ అని అంది.

‘ఏం మాటలే అవి? ఇప్పుడు ఎదిగి నీ ముందున్న నీ కొడుకు అది పెట్టిన తిండితోనేగా చదివి ఒక మనిషిగా ఎదిగాడు? కృతజ్ఞత ఉండాలి’ అని అమ్మను ఖండించాడు నాన్న.

‘ఏం కృతజ్ఞత? ఇంత కూడూ కూరా పెట్టిందనా? కావాలంటే లెక్కేసి దాని మొహాన పడేస్తే చాలు. లేదంటే రేపు ఇంకో లెక్క తీసుకుని వస్తుంది మూరెయ్యడానికి. పనికిమాలిన ఆడది’ అంది అమ్మ.

‘ఛీ! నోరు ముయ్యవే’ అని నాన్న కోపంగా అరిచాడు.

మరుసటి రోజు తాళక్కుడికి వెళ్ళాను. మామ చనిపోయి రెండు ఏళ్ళు దాటింది. ఉన్నట్టుండి ఒక రోజు జ్వరం వచ్చింది. నేనే హాస్పిటల్లో తన దగ్గరున్నాను ఆ రోజు. చిగుళ్ళు పుండుపట్టి బ్యాక్టీరియా నరాల ద్వారా గుండె దాకా చేరిపోయింది. మూడో రోజు రాత్రే మామ చనిపోయాడు. పెద్ద కర్మ అయ్యాక ప్రెస్ లెక్కలన్నీ చూశాము. రెండు వేల రూపాయల దాకా అప్పు ఉంది. ఆ బిల్డింగ్ యజమాని ప్రెస్ ఖాళీ చెయ్యాలి అన్నాడు. మెషీన్లు అమ్మి అప్పులు చెల్లించగా మిగిలిన మూడు వేల రూపాయలతో అత్త తాళక్కుడికి వచ్చేసింది. ఆమె భాగానికి కొంచం పొలం వచ్చింది. ఇల్లు గుత్తకు తీసుకుంది. రామలక్ష్మి పదకొండో తరగతికి పైన చదువుకోలేదు. చిన్నమ్మాయి ఎనిమిదో తరగతి. అత్త అతలాకుతలం అయిపోయింది. రోజులు గడిచే కొద్ది ఉన్న డబ్బు తరిగిపోయి ఆ దిగులు ముఖాన కనబడసాగింది. మనిషి బక్కచిక్కిపోయింది. ఊరికి వచ్చినప్పుడల్లా మాటవరుసకంటూ వెళ్ళి పలకరించి ఒక పది రూపాయలు మేజామీద పెట్టి వచ్చేవాడిని.

నేను వెళ్ళేసరికి అత్త ఇంట్లో లేదు. రామలక్ష్మి మాత్రమే ఉంది. ఆమె కూడా కొంచం చిక్కిపోయి దిగులుగా కనబడింది. ఒక అరుగు, చిన్న గది, అవతల ఒక వంట స్థలం – అంతే వాళ్ళ ఇల్లు. పేడతో అలికిన నేల. చుట్టబెట్టిన చాపలు పైన దండేనికి వేలాడుతున్నాయి. చిన్న మేజా. దాని మీద ఒక మాసపత్రిక, నవల. రామలక్ష్మి పెరటిగుండా వెళ్ళి ఏ పక్కింట్లోనో చక్కెరో టీ పొడో అరువుకు తెచ్చి పాలులేని టీ చేసి ఇచ్చింది. టేబుల్ మీద గ్లాసు పెట్టి తలుపు దగ్గరకు వెళ్ళి సగం ఒళ్ళు దాచేసుకుని నిల్చుంది. నేను ఆమె పాపిడి మాత్రమే చూశాను. తెలివైన పిల్లే. అయితే లెక్కలు మాత్రం రావు. తిరువనంతపురంలో ఆమెకు ఒక్క చక్రవడ్డీ లెక్క నేర్పడానికే ఇరవై రోజులు పట్టింది. ఏం మాట్లాడాలో తెలియలేదు. ఆమె అప్పటికి ఇప్పటికీ పోల్చుకోలేనంతగా మారిపోయుంది.

పదినిముషాలు గడిచాక లేచి నిల్చున్నాను.

‘నేను వెళ్ళొస్తాను’ అన్నాను.

‘అమ్మ వచ్చేస్తుంది’ అంది సన్నటి గొంతుకతో.

‘లేదు, నేను వెళ్ళాలి…’ అని చెప్పి టేబిల్ మీద యాభైరూపాయలు పెట్టి బయటికొచ్చాను. ఊరి బయటకు వస్తుంటే ఎదురుగా అత్త రావడం చూశాను. దుమ్ముపట్టిన చీర కట్టుకుని, పైటని చుట్టకుదురులా చుట్టి తలమీద పెట్టుకుని తలమీద ఒక వెదురు బుట్ట పెట్టుకుని నడిచి వస్తోంది. నన్ను చూసినా వెంటనే పోల్చుకోలేకపోయింది.

‘అయ్యో! నాయనా నువ్వా!’ అంది.

బుట్ట దించి పక్కన పెట్టాను. అందులో తవుడు. ఎక్కడో కూలికి ఒడ్లు దంచి ఇచ్చి వస్తోంది. తవుడే కూలి. దాన్ని అమ్ముకోడానికి తీసుకెళ్తున్నట్టు ఉంది.

‘ఇంటికి రా అయ్యా’ అని చేయి పట్టుకుంది.

‘లేదు. నేను వెళ్ళాలి. ఇవాళే తిరువనంతపురం వెళ్తున్నాను’ అని ‘ఉద్యోగం వచ్చింది, కాలేజిలోనే’ అన్నాను.

అమెకు అది అర్థం అయినట్టు లేదు. పేదరికం మీదపడి మొద్దుబారిపోయింది. కాసేపటికి అర్థం చేసుకుని ‘అయ్యో మా నాయనే! బాగుండవయ్య, బాగుండు’ అని మళ్ళీ చేయి పట్టుకుంది ‘నీకొక ఉద్యోగం వచ్చాక అడుగుదాం అనుకున్నాను. అడిగేందుకు నాకిక ఇంకెవరున్నారని? ఇచ్చుకోడానికంటూ నా చేతిలో దమ్మిడి లేదు. చూశావుగా… ఇలా వాళ్ళింట్లో వీళ్ళింట్లో ఒడ్లు దంచి ఇచ్చి గంజి తాగుతున్నాం… తవుడు అమ్ముడు పోలేదంటే సందేళ ఆకలికి పచ్చి తవుడు తినాలి నాయనా… అయితే నేను ఒకప్పుడు నీకు కూడుబెట్టానయ్యా. నా చేతి ముద్ద తినే నువ్వు చదువుకుని ఇంతవాడివయ్యావు. ఎనిమిది నెలలు రోజూ రెండు పూటలు అనుకున్నా ఐదొందలు సార్లు నీకు నేను అన్నం, కూరలు పెట్టాను గుర్తు పెట్టుకో. అవేవీ మీ అమ్మకు ఇప్పుడు గుర్తుండవు. ఆ కృతజ్ఞత మీ అమ్మకు లేకున్నా నీకుంటుందని నాకు తెలుసు నాయనా… రామలక్ష్మికి నువ్వు తప్ప మరో దిక్కులేదు. పిచ్చిది ఎప్పుడూ నీ గురించే తలచుకుంటూ ఉంటుంది… ఆమెకు ఒక జీవితం ఇవ్వు నాయనా, తిన్న తిండికి కృతజ్ఞతగా… లేకుంటే దాని ఋణం నువ్వు జన్మజన్మలకి తీర్చాల్సి ఉంటుంది… ఆలోచించుకో.’

ఆమె దగ్గర శలవు తీసుకుని బస్ ఎక్కేప్పుడు వేపకాయలు నమిలినట్టు నోరంతా చేదు. బస్ నుండి ఉమ్ముతూనే వచ్చాను. నేరుగా తిరువనంతపురం చేరుకున్నాను. బాధ్యత గల ఉద్యోగం ఇచ్చిన నిలకడ, ఆ హుందాతనం నన్ను నిలవరించకపోయుంటే ఆ చేదుని చాలాకాలం ఒళ్ళంతా నింపుకుని ఉండేవాడినే. మొదటి నెల జీతం రాగానే అమ్మకు కొంత డబ్బు పంపించాను. అమ్మ పంపిన జవాబులో ‘సుబ్బమ్మ వచ్చి మీ నాన్నతో మాట్లాడి వెళ్ళింది. మీ నాన్నకు కూడా పూర్తిగా ఇష్టమేమీ కాదు. అయినా మనకొద్దు. సరేనా? వాళ్ళు చేసిన సాయానికి వందో వెయ్యో ఆ పిల్ల పెళ్ళికి ఇచ్చేద్దాం. మనం ఎవరి కూటి రుణమూ ఉంచుకోవద్దు. ఇప్పుడు చాలా గొప్ప వాళ్ళందరూ వస్తున్నారు అడుగుతూ. పెట్టుపోతలవీ బాగా ఉంటాయి. పూతపాండినుండి ఒక సంబంధం వచ్చింది. చూడమంటావా?’ అని రాసింది.

నేను రాత్రంతా ఆలోచిస్తూ ఉండిపోయాను. విసిగి వేసారి ఎప్పటికో నిద్రపోయాను. లేచాక మనసు తేలికైంది. స్పష్టత వచ్చింది. ‘చూడు, కాని అమ్మాయి కొంచం చదువుకున్నదిగా ఉండాలి’ అని అమ్మకు జాబు రాశాను.

అదే నెలలో కేంటీన్ సామినాథ అయ్యర్ నడిపే ఇరవైవేల రూపాయల చీటీపాట ఒకదానిలో చేరాను. నెలకు ఐదువందలు కంతు. దాన్ని నాలుగువేలు తోసి వేలం పాడి తీసుకున్నాను. పదహారువేల రూపాయలు కట్ట కట్టి మాతృభూమి పత్రికలో చుట్టి చేతిలో పెట్టాడు అయ్యర్. అన్నీ వంద రూపాయల నోట్లు. అంత డబ్బు నేను అదివరకు తాకి ఎరుగను. ఒక రకమైన దిగులు చేతులకు కూడా అంటుకుంది. తీసుకొచ్చి గదిలో పెట్టి వాటినే చూస్తూ ఉండిపోయాను. ఇంత డబ్బు నేను సంపాయించగలనని ఎప్పుడూ ఊహించలేదు. ఆ డబ్బుతో తిరువనంతపురం ఊరి బయట ఒక ఇల్లు కూడా కొనుక్కోవచ్చు. కాసేపట్లోనే ఆ డబ్బు నా చేతికీ మనసుకూ అలవాటైపోయిన వింతను తలచుకుని నవ్వుకున్నాను.

మధ్యాహ్నం కెత్తేల్ సాయిబు హోటల్‌కు వెళ్ళాను. తెరవగానే నేరుగా లోపలికి వెళ్ళి హుండీలో డబ్బులు వెయ్యసాగాను. కాసేపటికి పెట్టె నిండిపోయింది. కెత్తేల్ సాయిబును మరో పెట్టె అడిగాను. ‘రేయ్ హమీదూ, పెట్టె మార్చూ’ అన్నాడు. పిల్లాడు పెట్టె మార్చి వెళ్ళాడు. మళ్ళీ వెయ్యసాగాను. డబ్బంతా వేసేశాక చేతులు కడుక్కుని వచ్చి భోజనానికి కూర్చున్నాను. కెత్తేల్ సాయిబు ఆకేసి నాకు ఇష్టమైన రొయ్యల వేపుడు వడ్డించాడు. అన్నం పెట్టి పులుసు పోశాడు. అతనిలో ఎలాంటి మార్పూ ఉండదని నాకు బాగా తెలుసు. ఒక మాటైనా లేదు. అవతల ఇద్దరు పిల్లగాళ్ళు బిక్కుబిక్కుమంటూ కూర్చుని ఉన్నారు. తెల్లగా బక్కచిక్కిన నాయర్ పిల్లలు. పేల ముఖం, తెల్లని కళ్ళు. పొట్ట నిండిందేమో, కెత్తేల్ సాయిబు వడ్డించిన మాంసాన్ని తినలేక తింటున్నారు. కెత్తేల్ సాయిబు మరో ముక్క మాంసం ఒకడి ఆకులో పెట్టారు. వాడు ‘అయ్యో… చాలు’ అని లేచాడు. కెత్తేల్ సాయిబు ‘తినరా పిచ్చినా కొయ్యా’ అని వాడి నెత్తిన ఒకటి పెట్టాడు. బలంగా తగిలిన దెబ్బకు వాడు భయపడి అలా కూర్చుండిపోయాడు. కంట్లో కారప్పొడి పడిందేమో అలా ఏడుస్తూనే అంతా శుభ్రంగా తిన్నాడు.

కెత్తేల్ సాయిబు కోడి మాంసం, చేపల పులుసు, రొయ్యల వేపుడంటూ ఒకదాని తర్వాత ఒకటి వడ్డిస్తూనే ఉన్నాడు. నేను కోరుకున్నది ఆయన కళ్ళల్లో ఒక చూపుని. నేను కూడా ఒక మనిషయ్యాను అని నా తల్లికి నేనే చెప్పాలి కదా? అయితే ఆయన కళ్ళు ఎప్పట్లాగే నా కళ్ళకేసి చూడనే లేదు. మళ్ళీ చేపలు తెచ్చినప్పుడు తాయత్తు కట్టుకున్న ఆ పెద్ద చేతులను చూశాను. అవి నావి. నా పొట్టకు ఎంత ఆకలి ఉందో, ఎంత పడుతుందో అవి మాత్రమే కొలుస్తాయి.

ఆ రోజు ఊరికి బయలుదేరి వెళ్ళాను. రామలక్ష్మిని తర్వాత శ్రావణమాసంలో పెళ్ళి చేసుకుని తీసుకొచ్చాను.

(మూలం: సోట్ఱు కణక్కు)


జయమోహన్ 1962 ఏప్రిల్ 22న కేరళ-తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో కన్యాకుమారి జిల్లాలో జన్మించారు. ఆయన తల్లితండ్రులు మలయాళీలు. ఇరవై రెండో ఏట వామపక్ష, సామ్యవాద సాహిత్యం మీద ఆసక్తి కలిగింది. ఆ రోజుల్లోనే రాసిన ఖైది అనే కవిత; నది‌, బోధి, పడుగై వంటి కథలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అప్పుడు రాసిన రబ్బర్‌ అనే నవల అకిలన్‌ స్మారక పురస్కారం అందుకుంది. ఈయన రచనలన్నీ మానసిక లోతులను వివిధ కోణాల్లో అద్దంపట్టేవిగా ఉంటాయి. 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని తన సిద్ధాంతానికి విరుద్ధమంటూ తిరస్కరించారు.