ఆంగ్లోపన్యాసకులుగా ఉద్యోగజీవితాన్ని కొనసాగించిన సూరపరాజు రాధాకృష్ణమూర్తి ప్రాచ్య పాశ్చాత్య తత్వరీతులను మథించి విశ్వసాహిత్యాన్ని ప్రాచ్య దృష్టితో, ఆత్మతో పరిశీలించి, భారతీయ సాహిత్యంతో అనుసంధానించి విశ్లేషించి తెలుగు పాఠకలోకానికి ఒక కొత్త దృక్కోణాన్ని పరిచయం చేసిన విమర్శకులు. షేక్స్పియర్, ఎలియట్, బోద్లేర్, హాప్కిన్స్, దాన్తె, కాఫ్కా తదితరుల రచనలపై వారి విమర్శ, విశ్లేషణ భారతీయ చింతనతో ముడిపెట్టి చేసిన వ్యాఖ్యానం ఇరుభాషల సాహిత్యంతో సుదీర్ఘకాలంగా మమేకమైనందువల్ల దక్కిన సాధికారత వలన మాత్రమే కాక, ఉపనిషత్తులనీ గీతనీ నిశితంగా చూసిన చూపుతో ముడిపెట్టినందువల్ల కూడా బహు ప్రత్యేకం. ఏ వాదానికి ముడిపడివున్నా, ఆ వాదపు లోతుపాతులను కేవలం నామమాత్రంగానో, అరకొరగానో అర్థం చేసుకున్నవారి రచనలు బలహీనమైన చట్రాల్లో ఇరుక్కుని ఉండి, కేవలం శుష్కనినాదాలు, సందేశాలుగానే మిగలడం, వాటిలో సాహిత్య విలువలు మృగ్యమవడం సర్వసాధారణం. అందుకు భిన్నంగా రచనావ్యాసంగాలను కొనసాగించిన కా.రా. కథలను, శ్రీశ్రీ, బైరాగుల కవిత్వాన్ని రాధాకృష్ణమూర్తి గమనించిన తీరు, ‘మార్క్సిజాన్ని, సనాతనధర్మాన్ని, కలిపి ఒక్క ముక్కలో పట్టుకున్నాడు శ్రీశ్రీ, మరొకడు కా.రా.’ అన్న వారి పరిశీలన ఎన్నదగినవి. ‘ఎత్తగలడా సీత జడను’ అన్న వేటూరి సినీగీత సాహిత్యంలోని శ్లేషను, సౌందర్యాన్ని విప్పి చెప్పినా, కృష్ణుని పిలుపు పేరిట భగవద్గీతకు వ్యాఖ్య రాసినా అటు పండితులను మెప్పించేదిగానూ, సామాన్య పాఠకుల స్థాయిని పెంచేదిగానూ ఉండటం అబ్బురపరుస్తుంది. అగ్నిమీళేతో 2012లో తన తొలి కవితా సంపుటి ప్రచురించిన ఈ కవి, తిరిగి 2021లో జ్ఞానదేవ్ మరాఠీ రచన అమృతానుభవంను తెలుగులోకి అనువాదం చేశారు. మాణిక్యవాచకుల తిరువాచకపు స్ఫూర్తిని మాణిక్యవాణి పేరిట తెలుగులోకి తెచ్చారు. శివభక్తతన్మయతలో నడిచే ఈ చిన్న పుస్తకానికి కూడా మధ్య మధ్యలో కనపడే వ్యాఖ్యలే అసలైన ఆకర్షణ. శంకరభాష్యసహిత గీతకు వీరు చేసిన తెలుగు అనువాదం, ఈశ, కేన, కఠ, మాండూక్య ఉపనిషత్లకు ఈయన రాసిన అతిసరళమైన వ్యాఖ్య ఎలాంటివారినైనా ఆ ఆధ్యాత్మిక, తాత్విక లోకంలోకి సాదరంగా స్వాగతిస్తుంది. ఇరుకైన చూపులతో జీవితాన్ని, సమాజాన్ని, సాహిత్యాన్ని దర్శిస్తున్న రోజుల్లో ఉన్నాం. తత్వమీమాంస మనిషి హృదయాన్ని ఎలా విశాలం చేస్తుందో సూటిగా స్పష్టంగా చెప్పే రచనలు రాధాకృష్ణమూర్తిగారివి. జీవితాన్నైనా సాహిత్యాన్నైనా పరికించడానికి మన దగ్గర ఉండాల్సిన ప్రశ్నలను, బుద్ధిని పరిచయం చేస్తాయీ రచనలు. గొప్ప గొప్ప రచనలన్నింటిని లోతుల దాకా తీసుకెళ్ళి చూడగల సమర్థులంటూ ఉంటే, వాటిని సరిపోల్చి చూసినప్పుడు కనపడే సారూప్యాలెంత ఆశ్చర్యకరంగా ఉంటాయో వారి విశ్లేషణ ద్వారా గమనించవచ్చు. ఆయా సాహిత్య రసనిధులకు రహస్యంగా దాచిన తాళంచెవులను తన విమర్శల్లో పొందుపరిచి తెలుగు విమర్శను సంపద్వంతం చేసిన సాహితీకృషీవలుడు సూరపరాజుగారు. వారి నిష్క్రమణతో ఆంధ్రాంగ్లసంస్కృత సాహిత్యాలనిట్లా కలబోసి విచారించి ఆ వివేచనను పదిమందికీ పంచగల ముందటితరం మహనీయుల్లో మరొకరిని కోల్పోయాం.