భారతీయ సంగీతానికి ఆద్యుడు భరతముని. భరతముని పేరు చెప్పగానే మనకి నాట్యశాస్త్రం స్ఫురిస్తుంది. పూర్వం “గీతం వాద్యం తధా నృత్యంత్రయం సంగీత ముచ్యతే” అనే వారు. అంటే గీతమూ, వాద్యమూ, నృత్యమూ ఈ మూడింటినీ కలిపి సంగీతం అన్నారు. ఈ తీరులోనే భరతముని నాట్యశాస్త్రం రచించాడు. ప్రస్తుతం మనం వేరు వేరు కళలుగా చెప్పుకునే సంగీతమూ, నాట్యమూ వేర్వేరు కావు. ఇక్కడ గీతము అంటే పాట, నాట్యము అంటే లయ. మెల్ల మెల్లగా గీతానికీ ఒక శాస్త్ర రూపం వచ్చింది. నాట్యానికీ ఒక పద్ధతి సమకూర్చారు. అసలు సంగీతం అన్నది సమ్యక్ గీతం నుండి పుట్టిందని చెబుతారు. సమ్యక్ అంటే చక్కగా లేదా యావత్తు అని అర్థం.
మొట్టమొదట సంగీత శాస్త్ర పుస్తకం నారదుడు రాసిన ‘స్వరార్ణవం’ అంటారు. ఆ తరువాత ప్రతాప శైలుడి ‘సంగీత చూడామణి (క్రీ.శ.~900)’, ముమ్మటాచార్యుడి ‘సంగీత రత్నమాల (1050 – 1150)’ మనకున్న సంగీత గ్రంధాలు. ముమ్మటాచార్యుడి కాలంవాడే జయదేవుడు కూడా. అష్టపదుల రచనలతో జయదేవుడి సంగీతం మరింత జనబాహుళ్యంలోకి వెళ్ళింది. ఆ తరువాత శార్ఙ్గదేవుడి (~1247) ‘సంగీత రత్నాకరం’ మనకు లభ్యమయిన సవివరణ సంగీత శాస్త్ర ప్రతి. కానీ ఇవన్నీ కూడా సంస్కృతంలోనే ఉన్నాయి. సంగీతానికి సంబంధించి మొట్టమొదటి తెలుగు రచన చేసిన ఘనత పెదకోమటి వేమారెడ్డికి చెందుతుంది. ఈయన 1402-1480 కాలానికి చెందినవాడు. సుమారు అదే కాలానికి చెందిన కుమారగిరి వసంతరాజు ‘వసంత రాజీయం’ అనే సంగీత ప్రబంధం రాసినా అందులో సింహభాగం సంస్కృతంలోనే ఉండడం వల్ల పెదకోమటి వేమారెడ్డి రాసినదే మొదటి ప్రయత్నంగా అనుకోవచ్చు. ఆ తరువాత కూడా తెలుగు వారు సంగీతానికి చేసిన సేవా, కృషీ ఇంతా అంతా కాదు. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం ఉన్న కర్ణాటక సంగీతానికి ఒక రూపూ, రేఖా ఇచ్చింది ఖచ్చితంగా తెలుగు వారేనని గట్టిగా చెప్పచ్చు. అంటే మిగతా భాషల వారి కృషీ, సహకారం లేదని కాదు. సంగీతంలో తెలుగువారి కృషికి దీటుగా వేరెవరిదీ కనబడదు.
సంగీతకారులా? వాగ్గేయకారులా?
తన పద సంకీర్తనలతో ప్రజాపథం వైపు సంగీతాన్ని మలుపు తిప్పిన అన్నమయ్య, కృష్ణలీలా తరంగిణి రాసిన నారాయణ తీర్థులు, భామాకలాప సృష్టికర్త సిద్ధేంద్ర యోగి, ప్రస్తుతమున్న మేళకర్త రాగ చక్ర సంయోజన కర్త, చతుర్దండి ప్రకాశిక కర్త అయిన వేంకటమఖి, పద రచన కర్త క్షేత్రయ్య, కీర్తనాచార్యుడు రామదాసు, తాళ్ళపాక చిన్నయ్య, కర్ణాటక సంగీతాన్ని ఒక పెద్ద మలుపు తిప్పిన త్యాగయ్య, ఇంకా తూము నర్సింహ దాసు, శ్యామశాస్త్రి, మునిపల్లె సుబ్రహ్మణ్య కవి – ఇలా ఎంతో మంది సంగీతకారుల సృజన వల్లే ప్రస్తుతం కర్ణాటక సంగీతం జనరంజకంగా ప్రసిద్ధి చెందింది.
వీరందరూ తమ పాటలనీ తెలుగులో రాసి, స్వయంగా స్వరపరిచి, తమ తమ గళాల్లో పలికించి ప్రజల గొంతుకి సంగీతాన్ని చేరవేసిన వారే! అప్పట్లో ఇటువంటి వారిని సంగీతకారులు అనే సంబోధించేవారు. వీరినే మనం ప్రస్తుతం వాగ్గేయకారులంటున్నాం.ఈ పదం వాడుక అన్నమాచార్య తాళ పత్ర విశదీకరణం సమయంలో రాసిన వ్యాసాల్లో ఎక్కువగా కనిపించింది. ముఖ్యంగా “అన్నమయ్య పద కవిత్వం” అనే వ్యాసంలో మొదట అన్నమయ్యని బయకాడనే సంబోధించారు. బయకాడు అంటే గాయకుడు లేదా రాగమును విశదీకరించేవాడని అర్థం.
“పద స్వరూపాన్ని రచనకై పరిగ్రహించిన తెలుగు బయకార్లలో ఇప్పటికి అన్నమాచార్యుడే ప్రాచీనతముడుగా కానవస్తున్నాడు. పదకవితా పితామహుడని తరువాతి కాలం వారు అతని బిరుదు పేర్కొన్నారు. తన పదాలు తానే పాడడం వలన అన్నమాచార్యుడిని వాగ్గేయకారుడిగా కూడా సంబోధించవచ్చును.” అని పైన చెప్పిన వ్యాసంలో రాసారు. ఈ వ్యాసం 1943 కాలంలో వాణి అనే పత్రికలో ప్రచురించ బడింది. ఆ తరువాత 1947లో త్యాగరాజ శతాబ్ది సంచికలో బెంగుళూరు నాగరత్నమ్మా, కల్లూరి వీరభద్ర శాస్త్రీ, ద్వారం వేంకట స్వామి నాయుడు వంటి వారి వ్యాసాల్లో కూడా వాగ్గేయకారుడు(లు) వంటి సంబోధన కనిపించింది. చర్ల గణపతి శాస్త్రి గారి ‘గాంధర్వ వేదము’ పుస్తకంలో మాత్రం సాహిత్యమూ, సంగీతమూ సమకూర్చిన వారిని వాగ్గేయకారకులని అన్నారు.ఈ వాగ్గేయకార అర్థమూ, సంబోధనా ఎలా వున్నా, ప్రస్తుతం మనకి అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు వంటి వారు వాగ్గేయకారుల క్రిందే లెక్క. త్యాగరాజు తరువాత సంగీతంలో అసమాన ప్రతిభ కలిగి ఆయనకి చేరువుగా చెప్పుకోదగ్గ వ్యక్తి మంగళంపల్లి బాలమురళీ కృష్ణ.
తన గాత్ర మాధుర్యంతో ఆబాల గోపాలాన్ని, పండిత పామరులను రంజింపచేసిన మహా విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ. ఒక్కమాటలో చెప్పాలంటే కర్ణాటక సంగీతానికి కంఠాభరణం బాలమురళి గానం. తెలుగువారికి బాలమురళి గొంతుని పరిచయం చెయ్యనవసరం లేదు. గత డెబ్భైయేళ్ళగా ఎన్నో తరాలకి ఆ కంచు కంఠం సుపరిచయమే!
సూర్యకాంతి, 1997. పే.296
ఎం.బి.కె ట్రస్ట్, చెన్నై.
బాలమురళి సంగీతంలో తాను కూర్చిన వివిధ గాన ప్రక్రియలని సూర్యకాంతి అనే పుస్తకంగా ప్రచురించారు. ఇందులో కేవలం సాహిత్యమే కాకుండా ప్రతీ రచనకీ స్వరాలు కూడా ఇచ్చారు. ఇంకా ప్రతీ రచననీ తెలుగు, తమిళ, దేవనాగరి భాషల్లో పక్క పక్కనే వేసారు. ఈ పుస్తకానికింకో ప్రత్యేకత ఏమిటంటే, ప్రతీ తెలుగు రచననీ బాలమురళి స్వదస్తూరీతో రాసారు. ఇన్ని ప్రత్యేకతలతో ఉన్న ఈ పుస్తకం తెలుగునాట దొరకదు. చెన్నై లోనే లభిస్తుంది. దీనికి నడుం కట్టుకున్నది కూడా తమిళులే! ఈ పుస్తకం మామూలు పుస్తకాలకి భిన్నంగా ఒక ఆల్బం తరహాలో అదే సైజులో ప్రచురించారు. సంగీతాన్ని అభిమానించే ప్రతీ ఒక్కరూ దాచుకోదగ్గ పుస్తకం ఇది. ఇందులో 128 వివిధ సంగీత రచనలు ఉన్నాయి. బాలమురళి సంగీతాన్ని చిన్నతనం లోనే ఆపోశన పట్టి దానికి కొత్త ఒరవడీ, వైవిధ్యమూ చూపించిన సంగీత కారుడన్న విషయం చాలా మందికి తెలీదు. చాలా మందికి బాలమురళి పాట గురించే తప్ప ఆయన రచనల గురించి అంతగా పరిచయం లేదు. ఆయన కర్ణాటక సంగీతంలో చేసిన కొత్త కొత్త ప్రయోగాలూ, రచనల్లో చూపించిన వైవిధ్యమూ ఇవన్నీ పదిమందితో పంచుకోవాలన్న తాపత్రయమే ఇది.
సంగీత కచేరీ
ఇప్పుడు మనం చూసే కర్ణాటక సంగీత కచేరీల్లో విద్వాంసులు ఏ పాటలు పాడాలి అన్న దానికి ఒక క్రమం వుంది. దీన్నే ‘పద్ధతి’ అని కూడా వ్యవహరిస్తారు. ఈ పద్ధతి దాదాపు 1910 కాలంనుండీ రూపు దిద్దుకుందనీ అంటారు. ఈ కచేరీ పద్ధతిలో మొదట ఒక వర్ణం, వెంటనే గణేశ ప్రార్థన పాడుతారు. ఆ తరువాత సంగీత త్రిమూర్తులని వ్యవహరింపబడే త్యాగరాజు, శ్యామశ్యాస్త్రి, ముత్తుస్వామి దీక్షితార్ల కృతుల్ని పాడతారు. మరలా వీటిలో ఒక శుద్ధ మధ్యమ కృతీ, మరొకటి ప్రతిమధ్యమ కృతీ పాడతారు. తరవాత రాగం-తానం-పల్లవి పాడతారు. మెల్లగా సమయం బట్టీ జానపదగీతమో, జావళీనో, పదమో పాడతారు. పాండిత్యాన్ని బట్టీ తిల్లానా పాడుతారు. చివర్లో మంగళంతో ముగిస్తారు. సుమారుగా ఇదే క్రమంలో ఏ కచేరీ పద్ధతయినా ఉంటుంది.
త్యాగరాజు ముందుకాలం వరకూ విద్వాంసులందరూ రాగాలాపన మీద, వర్ణాల మీద, రాగమాలికల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టే వారు. స్వరకల్పనకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. కాలక్రమేణా సంగీతానికి సాహిత్యాన్ని జోడించారు. ఎప్పుడైతే శాస్త్రీయ సంగీతంలో సాహిత్యం జతకూరిందో అప్పటినుండీ అది జనబాహుళ్యంలోకి వెళ్ళడం ప్రారంభించింది. త్యాగరాజు వచ్చాక ఆయన సొంత బాణీలోనే కచేరీలు చేసేవాడు. స్వతహాగా రామభక్తుడవడం వల్ల రామనామ భజనతోనే మొదలు పెట్టేవాడు. తన సొంత రచనలు పాడేవాడు. త్యాగరాజువి ప్రస్తుతం మనకి 900 పైచిలుకు కృతులున్నాయి. ఆయన తరువాత 400 పైగా సంగీత రచనలు చేసిన మరో విద్వాంసుడు బాలమురళీ కృష్ణ. మధ్యలో త్యాగరాజు శిష్యులు తెలుగులో కొన్ని రచనలు చేసి స్వర పరిచినా ఎవరివీ నూరు దాటలేదు.
చాలామందికి బాలమురళి గాన మాధుర్యమే పరిచయం. ఆయన స్వీయ రచనలు ఒకటో రెండో పరిచయం. ముఖ్యంగా బాలమురళీ అంటే తిల్లానాలకి పర్యాయపదంగానే తెలుసు. కానీ ఆయన శాస్త్రీయ సంగీతంలో కేవలం కృతులతోనే సరిపెట్టుకోలేదు. వర్ణాలూ, కృతులూ, జావళీలూ, రాగమాలికలూ, పదాలూ, జానపదాలూ, తిల్లానాలూ, జతి స్వరాలూ ఒకటేమిటి, బాలమురళి కేవలం స్వరపరచడమే కాకుండా వాటికి సాహిత్యాన్నీ సమకూర్చారు. కేవలం తెలుగులోనే కాక తమిళ, సంస్కృత, కన్నడ భాషల్లో రచించారు. మరలా వీటిల్లో తనదైన ముద్రని వేసారు.
ముద్ర
కర్ణాటక సంగీత రచనల్లో సంగీతకారుల ముద్ర ఉండడం అనాదిగా వస్తున్న ఆచారం. అన్నమయ్యకి తిరు, వేంకట వంటి ముద్రలు, రామదాసుకి రామదాస ముద్ర, త్యాగరాజుకి త్యాగరాజ అన్న ముద్ర, క్షేత్రయ్యకి మువ్వ గోపాల ముద్ర వారి వారి రచనల్లో కనిపిస్తాయి. ఈ ముద్రని బట్టే ఆ కృతీ లేదా కీర్తన రాసిందెవరో తెలుసుకోవడానికి అప్పట్లో ఉపయోగపడేది. ఇదే పద్ధతి ఇప్పటికీ వస్తోంది. బాలమురళి రచనలకి ‘బాల మురళి’, ‘మురళి’ ముద్రలున్నాయి.
సాధారణంగా ఈ ముద్రన్నది కృతి ఆఖరి చరణంలో జత చేర్చి రచిస్తారు. చివరి చరణంలోనే ఉండాలన్న నియమేమీ లేకపోయినా ఆఖరిన జతకూర్చడమే అనాదిగా వస్తున్న ఆనవాయితీ. ఈ ముద్ర వినిపించగానే కృతి చివరికొచ్చిందన్నది శ్రోతలకి తెలుస్తుంది. బాలమురళి కూడా చాలా కృతుల్లో ఈ పద్ధతి పాటించినా, కొన్నిటిలో పల్లవి లోనే ముద్రతో మొదలుపెట్టారు. కొన్ని కృతుల్లో అనుపల్లవిలో ముద్ర వాడారు. అమ్మవారి మీద చేసిన ఒక రాగమాలిక పల్లవిలోనే ఈ ముద్ర వుంది.
అంబ మామవ అఖిల జగ
దంబ మామవ మురళీ రంజని
మిగతా చరణాల్లో ఈ ముద్ర లేదు.
అలాగే హంసానందీ రాగంలో ‘మీనాక్షీ జయదా వరదా’ అన్న కృతిలో అనుపల్లవిలో ముద్ర కనిపిస్తుంది.
పల్లవి:
ధ్యాన దీక్షారత రక్షణి మధుర
అనుపల్లవి:
గానలోలినీ కరుణా కటాక్షీ
కొన్ని కృతుల్లో మొదటి చరణంలో కూడా ఈ ముద్ర కనిపిస్తుంది. “గానలోల నీ లీల లెన్న జాలరా మురళీ” అన్న వేంకటేశ్వర కృతిలో ప్రతీ ఆవృతం చివరా మురళీ అన్న ముద్ర కనిపిస్తుంది. రేవతి రాగంలో ‘మోహన వంశీ వాదన మధురిమ’ కృతిలో అసలెక్కడా ఏ ముద్రా కనిపించదు. బహుశా ఇది ఆయన తొలిరోజుల్లో కట్టిన కృతేమో తెలీదు.
ఈ మధ్య అమెరికా వచ్చినప్పుడు ఆయన్ని కలిసే అదృష్టం లభించింది. సంగీతం గురించి ముచ్చటిస్తూ ఆయన రచనల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన కృతుల్లో ముద్ర గురించి నా పరిశీలనలు చెప్పాను. ఆ సందర్భంలో ‘మోహన వంశీ వాదన మధురిమ’ కృతిలో ముద్ర లేదని చెప్పిన వేంటనే, అది ఒక కచేరీలో ఆశువుగా కట్టానని చెబుతూ – మరో కృతిలో తన గురువైన పారుపల్లి రామకృష్ణయ్య పంతులు మీద చేసిన రచనలో, కావాలనే ముద్ర వాడలేదని చెప్పారు. “ఆ కృతి ఎవరైనా వారి వారి గురువుల నుద్దేశించి పాడుకునేలా రచించాను. ముద్ర వుంటే నా గురువుకే అది చెందుతుంది. అందిరికీ గురుభావం వర్తించేలా ఉండాలనే ముద్ర చేర్చ లేదు,” అంటూ చెప్పారు. ఆ కృతి “అయ్యా గురువర్యా” అని మొదలవుతుంది. దీని సుషమ రాగంలో స్వరపరిచారు. ఈ సుషమ రాగం కూడా బాలమురళి సృష్టే!