భారతీయ సంగీతానికి ఆద్యుడు భరతముని. భరతముని పేరు చెప్పగానే మనకి నాట్యశాస్త్రం స్ఫురిస్తుంది. పూర్వం “గీతం వాద్యం తధా నృత్యంత్రయం సంగీత ముచ్యతే” అనే వారు. అంటే గీతమూ, వాద్యమూ, నృత్యమూ ఈ మూడింటినీ కలిపి సంగీతం అన్నారు. ఈ తీరులోనే భరతముని నాట్యశాస్త్రం రచించాడు. ప్రస్తుతం మనం వేరు వేరు కళలుగా చెప్పుకునే సంగీతమూ, నాట్యమూ వేర్వేరు కావు. ఇక్కడ గీతము అంటే పాట, నాట్యము అంటే లయ. మెల్ల మెల్లగా గీతానికీ ఒక శాస్త్ర రూపం వచ్చింది. నాట్యానికీ ఒక పద్ధతి సమకూర్చారు. అసలు సంగీతం అన్నది సమ్యక్ గీతం నుండి పుట్టిందని చెబుతారు. సమ్యక్ అంటే చక్కగా లేదా యావత్తు అని అర్థం.
మొట్టమొదట సంగీత శాస్త్ర పుస్తకం నారదుడు రాసిన ‘స్వరార్ణవం’ అంటారు. ఆ తరువాత ప్రతాప శైలుడి ‘సంగీత చూడామణి (క్రీ.శ.~900)’, ముమ్మటాచార్యుడి ‘సంగీత రత్నమాల (1050 – 1150)’ మనకున్న సంగీత గ్రంధాలు. ముమ్మటాచార్యుడి కాలంవాడే జయదేవుడు కూడా. అష్టపదుల రచనలతో జయదేవుడి సంగీతం మరింత జనబాహుళ్యంలోకి వెళ్ళింది. ఆ తరువాత శార్ఙ్గదేవుడి (~1247) ‘సంగీత రత్నాకరం’ మనకు లభ్యమయిన సవివరణ సంగీత శాస్త్ర ప్రతి. కానీ ఇవన్నీ కూడా సంస్కృతంలోనే ఉన్నాయి. సంగీతానికి సంబంధించి మొట్టమొదటి తెలుగు రచన చేసిన ఘనత పెదకోమటి వేమారెడ్డికి చెందుతుంది. ఈయన 1402-1480 కాలానికి చెందినవాడు. సుమారు అదే కాలానికి చెందిన కుమారగిరి వసంతరాజు ‘వసంత రాజీయం’ అనే సంగీత ప్రబంధం రాసినా అందులో సింహభాగం సంస్కృతంలోనే ఉండడం వల్ల పెదకోమటి వేమారెడ్డి రాసినదే మొదటి ప్రయత్నంగా అనుకోవచ్చు. ఆ తరువాత కూడా తెలుగు వారు సంగీతానికి చేసిన సేవా, కృషీ ఇంతా అంతా కాదు. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం ఉన్న కర్ణాటక సంగీతానికి ఒక రూపూ, రేఖా ఇచ్చింది ఖచ్చితంగా తెలుగు వారేనని గట్టిగా చెప్పచ్చు. అంటే మిగతా భాషల వారి కృషీ, సహకారం లేదని కాదు. సంగీతంలో తెలుగువారి కృషికి దీటుగా వేరెవరిదీ కనబడదు.
సంగీతకారులా? వాగ్గేయకారులా?
తన పద సంకీర్తనలతో ప్రజాపథం వైపు సంగీతాన్ని మలుపు తిప్పిన అన్నమయ్య, కృష్ణలీలా తరంగిణి రాసిన నారాయణ తీర్థులు, భామాకలాప సృష్టికర్త సిద్ధేంద్ర యోగి, ప్రస్తుతమున్న మేళకర్త రాగ చక్ర సంయోజన కర్త, చతుర్దండి ప్రకాశిక కర్త అయిన వేంకటమఖి, పద రచన కర్త క్షేత్రయ్య, కీర్తనాచార్యుడు రామదాసు, తాళ్ళపాక చిన్నయ్య, కర్ణాటక సంగీతాన్ని ఒక పెద్ద మలుపు తిప్పిన త్యాగయ్య, ఇంకా తూము నర్సింహ దాసు, శ్యామశాస్త్రి, మునిపల్లె సుబ్రహ్మణ్య కవి – ఇలా ఎంతో మంది సంగీతకారుల సృజన వల్లే ప్రస్తుతం కర్ణాటక సంగీతం జనరంజకంగా ప్రసిద్ధి చెందింది.
వీరందరూ తమ పాటలనీ తెలుగులో రాసి, స్వయంగా స్వరపరిచి, తమ తమ గళాల్లో పలికించి ప్రజల గొంతుకి సంగీతాన్ని చేరవేసిన వారే! అప్పట్లో ఇటువంటి వారిని సంగీతకారులు అనే సంబోధించేవారు. వీరినే మనం ప్రస్తుతం వాగ్గేయకారులంటున్నాం.ఈ పదం వాడుక అన్నమాచార్య తాళ పత్ర విశదీకరణం సమయంలో రాసిన వ్యాసాల్లో ఎక్కువగా కనిపించింది. ముఖ్యంగా “అన్నమయ్య పద కవిత్వం” అనే వ్యాసంలో మొదట అన్నమయ్యని బయకాడనే సంబోధించారు. బయకాడు అంటే గాయకుడు లేదా రాగమును విశదీకరించేవాడని అర్థం.
“పద స్వరూపాన్ని రచనకై పరిగ్రహించిన తెలుగు బయకార్లలో ఇప్పటికి అన్నమాచార్యుడే ప్రాచీనతముడుగా కానవస్తున్నాడు. పదకవితా పితామహుడని తరువాతి కాలం వారు అతని బిరుదు పేర్కొన్నారు. తన పదాలు తానే పాడడం వలన అన్నమాచార్యుడిని వాగ్గేయకారుడిగా కూడా సంబోధించవచ్చును.” అని పైన చెప్పిన వ్యాసంలో రాసారు. ఈ వ్యాసం 1943 కాలంలో వాణి అనే పత్రికలో ప్రచురించ బడింది. ఆ తరువాత 1947లో త్యాగరాజ శతాబ్ది సంచికలో బెంగుళూరు నాగరత్నమ్మా, కల్లూరి వీరభద్ర శాస్త్రీ, ద్వారం వేంకట స్వామి నాయుడు వంటి వారి వ్యాసాల్లో కూడా వాగ్గేయకారుడు(లు) వంటి సంబోధన కనిపించింది. చర్ల గణపతి శాస్త్రి గారి ‘గాంధర్వ వేదము’ పుస్తకంలో మాత్రం సాహిత్యమూ, సంగీతమూ సమకూర్చిన వారిని వాగ్గేయకారకులని అన్నారు.ఈ వాగ్గేయకార అర్థమూ, సంబోధనా ఎలా వున్నా, ప్రస్తుతం మనకి అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు వంటి వారు వాగ్గేయకారుల క్రిందే లెక్క. త్యాగరాజు తరువాత సంగీతంలో అసమాన ప్రతిభ కలిగి ఆయనకి చేరువుగా చెప్పుకోదగ్గ వ్యక్తి మంగళంపల్లి బాలమురళీ కృష్ణ.
తన గాత్ర మాధుర్యంతో ఆబాల గోపాలాన్ని, పండిత పామరులను రంజింపచేసిన మహా విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ. ఒక్కమాటలో చెప్పాలంటే కర్ణాటక సంగీతానికి కంఠాభరణం బాలమురళి గానం. తెలుగువారికి బాలమురళి గొంతుని పరిచయం చెయ్యనవసరం లేదు. గత డెబ్భైయేళ్ళగా ఎన్నో తరాలకి ఆ కంచు కంఠం సుపరిచయమే!
సూర్యకాంతి, 1997. పే.296
ఎం.బి.కె ట్రస్ట్, చెన్నై.
బాలమురళి సంగీతంలో తాను కూర్చిన వివిధ గాన ప్రక్రియలని సూర్యకాంతి అనే పుస్తకంగా ప్రచురించారు. ఇందులో కేవలం సాహిత్యమే కాకుండా ప్రతీ రచనకీ స్వరాలు కూడా ఇచ్చారు. ఇంకా ప్రతీ రచననీ తెలుగు, తమిళ, దేవనాగరి భాషల్లో పక్క పక్కనే వేసారు. ఈ పుస్తకానికింకో ప్రత్యేకత ఏమిటంటే, ప్రతీ తెలుగు రచననీ బాలమురళి స్వదస్తూరీతో రాసారు. ఇన్ని ప్రత్యేకతలతో ఉన్న ఈ పుస్తకం తెలుగునాట దొరకదు. చెన్నై లోనే లభిస్తుంది. దీనికి నడుం కట్టుకున్నది కూడా తమిళులే! ఈ పుస్తకం మామూలు పుస్తకాలకి భిన్నంగా ఒక ఆల్బం తరహాలో అదే సైజులో ప్రచురించారు. సంగీతాన్ని అభిమానించే ప్రతీ ఒక్కరూ దాచుకోదగ్గ పుస్తకం ఇది. ఇందులో 128 వివిధ సంగీత రచనలు ఉన్నాయి. బాలమురళి సంగీతాన్ని చిన్నతనం లోనే ఆపోశన పట్టి దానికి కొత్త ఒరవడీ, వైవిధ్యమూ చూపించిన సంగీత కారుడన్న విషయం చాలా మందికి తెలీదు. చాలా మందికి బాలమురళి పాట గురించే తప్ప ఆయన రచనల గురించి అంతగా పరిచయం లేదు. ఆయన కర్ణాటక సంగీతంలో చేసిన కొత్త కొత్త ప్రయోగాలూ, రచనల్లో చూపించిన వైవిధ్యమూ ఇవన్నీ పదిమందితో పంచుకోవాలన్న తాపత్రయమే ఇది.
సంగీత కచేరీ
ఇప్పుడు మనం చూసే కర్ణాటక సంగీత కచేరీల్లో విద్వాంసులు ఏ పాటలు పాడాలి అన్న దానికి ఒక క్రమం వుంది. దీన్నే ‘పద్ధతి’ అని కూడా వ్యవహరిస్తారు. ఈ పద్ధతి దాదాపు 1910 కాలంనుండీ రూపు దిద్దుకుందనీ అంటారు. ఈ కచేరీ పద్ధతిలో మొదట ఒక వర్ణం, వెంటనే గణేశ ప్రార్థన పాడుతారు. ఆ తరువాత సంగీత త్రిమూర్తులని వ్యవహరింపబడే త్యాగరాజు, శ్యామశ్యాస్త్రి, ముత్తుస్వామి దీక్షితార్ల కృతుల్ని పాడతారు. మరలా వీటిలో ఒక శుద్ధ మధ్యమ కృతీ, మరొకటి ప్రతిమధ్యమ కృతీ పాడతారు. తరవాత రాగం-తానం-పల్లవి పాడతారు. మెల్లగా సమయం బట్టీ జానపదగీతమో, జావళీనో, పదమో పాడతారు. పాండిత్యాన్ని బట్టీ తిల్లానా పాడుతారు. చివర్లో మంగళంతో ముగిస్తారు. సుమారుగా ఇదే క్రమంలో ఏ కచేరీ పద్ధతయినా ఉంటుంది.
త్యాగరాజు ముందుకాలం వరకూ విద్వాంసులందరూ రాగాలాపన మీద, వర్ణాల మీద, రాగమాలికల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టే వారు. స్వరకల్పనకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. కాలక్రమేణా సంగీతానికి సాహిత్యాన్ని జోడించారు. ఎప్పుడైతే శాస్త్రీయ సంగీతంలో సాహిత్యం జతకూరిందో అప్పటినుండీ అది జనబాహుళ్యంలోకి వెళ్ళడం ప్రారంభించింది. త్యాగరాజు వచ్చాక ఆయన సొంత బాణీలోనే కచేరీలు చేసేవాడు. స్వతహాగా రామభక్తుడవడం వల్ల రామనామ భజనతోనే మొదలు పెట్టేవాడు. తన సొంత రచనలు పాడేవాడు. త్యాగరాజువి ప్రస్తుతం మనకి 900 పైచిలుకు కృతులున్నాయి. ఆయన తరువాత 400 పైగా సంగీత రచనలు చేసిన మరో విద్వాంసుడు బాలమురళీ కృష్ణ. మధ్యలో త్యాగరాజు శిష్యులు తెలుగులో కొన్ని రచనలు చేసి స్వర పరిచినా ఎవరివీ నూరు దాటలేదు.
చాలామందికి బాలమురళి గాన మాధుర్యమే పరిచయం. ఆయన స్వీయ రచనలు ఒకటో రెండో పరిచయం. ముఖ్యంగా బాలమురళీ అంటే తిల్లానాలకి పర్యాయపదంగానే తెలుసు. కానీ ఆయన శాస్త్రీయ సంగీతంలో కేవలం కృతులతోనే సరిపెట్టుకోలేదు. వర్ణాలూ, కృతులూ, జావళీలూ, రాగమాలికలూ, పదాలూ, జానపదాలూ, తిల్లానాలూ, జతి స్వరాలూ ఒకటేమిటి, బాలమురళి కేవలం స్వరపరచడమే కాకుండా వాటికి సాహిత్యాన్నీ సమకూర్చారు. కేవలం తెలుగులోనే కాక తమిళ, సంస్కృత, కన్నడ భాషల్లో రచించారు. మరలా వీటిల్లో తనదైన ముద్రని వేసారు.
ముద్ర
కర్ణాటక సంగీత రచనల్లో సంగీతకారుల ముద్ర ఉండడం అనాదిగా వస్తున్న ఆచారం. అన్నమయ్యకి తిరు, వేంకట వంటి ముద్రలు, రామదాసుకి రామదాస ముద్ర, త్యాగరాజుకి త్యాగరాజ అన్న ముద్ర, క్షేత్రయ్యకి మువ్వ గోపాల ముద్ర వారి వారి రచనల్లో కనిపిస్తాయి. ఈ ముద్రని బట్టే ఆ కృతీ లేదా కీర్తన రాసిందెవరో తెలుసుకోవడానికి అప్పట్లో ఉపయోగపడేది. ఇదే పద్ధతి ఇప్పటికీ వస్తోంది. బాలమురళి రచనలకి ‘బాల మురళి’, ‘మురళి’ ముద్రలున్నాయి.
సాధారణంగా ఈ ముద్రన్నది కృతి ఆఖరి చరణంలో జత చేర్చి రచిస్తారు. చివరి చరణంలోనే ఉండాలన్న నియమేమీ లేకపోయినా ఆఖరిన జతకూర్చడమే అనాదిగా వస్తున్న ఆనవాయితీ. ఈ ముద్ర వినిపించగానే కృతి చివరికొచ్చిందన్నది శ్రోతలకి తెలుస్తుంది. బాలమురళి కూడా చాలా కృతుల్లో ఈ పద్ధతి పాటించినా, కొన్నిటిలో పల్లవి లోనే ముద్రతో మొదలుపెట్టారు. కొన్ని కృతుల్లో అనుపల్లవిలో ముద్ర వాడారు. అమ్మవారి మీద చేసిన ఒక రాగమాలిక పల్లవిలోనే ఈ ముద్ర వుంది.
అంబ మామవ అఖిల జగ
దంబ మామవ మురళీ రంజని
మిగతా చరణాల్లో ఈ ముద్ర లేదు.
అలాగే హంసానందీ రాగంలో ‘మీనాక్షీ జయదా వరదా’ అన్న కృతిలో అనుపల్లవిలో ముద్ర కనిపిస్తుంది.
పల్లవి:
ధ్యాన దీక్షారత రక్షణి మధుర
అనుపల్లవి:
గానలోలినీ కరుణా కటాక్షీ
కొన్ని కృతుల్లో మొదటి చరణంలో కూడా ఈ ముద్ర కనిపిస్తుంది. “గానలోల నీ లీల లెన్న జాలరా మురళీ” అన్న వేంకటేశ్వర కృతిలో ప్రతీ ఆవృతం చివరా మురళీ అన్న ముద్ర కనిపిస్తుంది. రేవతి రాగంలో ‘మోహన వంశీ వాదన మధురిమ’ కృతిలో అసలెక్కడా ఏ ముద్రా కనిపించదు. బహుశా ఇది ఆయన తొలిరోజుల్లో కట్టిన కృతేమో తెలీదు.
ఈ మధ్య అమెరికా వచ్చినప్పుడు ఆయన్ని కలిసే అదృష్టం లభించింది. సంగీతం గురించి ముచ్చటిస్తూ ఆయన రచనల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన కృతుల్లో ముద్ర గురించి నా పరిశీలనలు చెప్పాను. ఆ సందర్భంలో ‘మోహన వంశీ వాదన మధురిమ’ కృతిలో ముద్ర లేదని చెప్పిన వేంటనే, అది ఒక కచేరీలో ఆశువుగా కట్టానని చెబుతూ – మరో కృతిలో తన గురువైన పారుపల్లి రామకృష్ణయ్య పంతులు మీద చేసిన రచనలో, కావాలనే ముద్ర వాడలేదని చెప్పారు. “ఆ కృతి ఎవరైనా వారి వారి గురువుల నుద్దేశించి పాడుకునేలా రచించాను. ముద్ర వుంటే నా గురువుకే అది చెందుతుంది. అందిరికీ గురుభావం వర్తించేలా ఉండాలనే ముద్ర చేర్చ లేదు,” అంటూ చెప్పారు. ఆ కృతి “అయ్యా గురువర్యా” అని మొదలవుతుంది. దీని సుషమ రాగంలో స్వరపరిచారు. ఈ సుషమ రాగం కూడా బాలమురళి సృష్టే!
బాలమురళి రచనల్లో ముఖ్యంగా కనిపించేది సరళత. త్యాగరాజూ, దీక్షితార్ కృతుల్లోలాగ ఎక్కడా విరివిగా సంగతులుండవు. చాలా సరళంగా పాడుకోవడానికి హాయిగా ఉంటాయి. ఈ కృతి చాలా గమ్మత్తుగా ఉంటుంది.
అయ్యా గురువర్యా
నీ యానతితో పాడుచుంటుమయ్యానీ మృదుపల్లవ వచో విలాసము పల్లవిగా
నీ అనుబంధము అనుపల్లవిగా
నీ చరణములే చరణముగా
నీ యాకృతియే మా కృతిగా
ఈ కృతిలో పల్లవీ, అనుపల్లవీ, చరణం పద ప్రయోగాలున్నాయి. పాటకి ఇవే రూపం. ఇవన్నీ కలబోసినవారే గురువన్న అర్థంలో రాసారు. ఈ సుషమ రాగం 20వ మేళకర్త కీరవాణి రాగ జన్యం. సుషమ అంటే మనోజ్ఞమైనదీ, సాటిలేనిదని అర్థం. గురువుని మించిన వారుండరన్న అర్థం ధ్వనించేలా ఈ రాగం పేరు ‘సుషమ’ అని ఎన్నుకున్నారు. బాలమురళికి ఆయన గురువు పారుపల్లి రామకృష్ణయ్యంటే ఎనలేని భక్తి ప్రపత్తులున్నాయి. ఒక్క గురువు గారి మీదే అయిదారు కృతులు స్వరపరిచారు. గురుప్రియ రాగంలో ‘సద్గురు దక్షిణా మూర్తిం నుహిరే చిత్త’ అన్న కృతిని సంస్కృతంలో రచించారు. గురుప్రియ రాగంలో కట్టడం మరో ప్రత్యేకత.
అందరూ అనుసరించే విధానానికి వేరుగా బాలమురళి ముద్ర ఉండడం ప్రయోగాల పట్ల ఆయనకున్న ఆసక్తి తెలుస్తుంది. తోడి రాగంలో లక్ష్మీ దేవి మీద ఒక కృతి భలే గమ్మత్తుగా రాశారు.
మా మానినీ – నీ ధామ గని –
నీ దాసరిని గాదా?మా మా పాప మద దమనీ –
నీ నిగా నీ గరిమ మరి మరి నీ మ్మాసరిగాని దారి మారి – గదా
ధరి – నీ నిగ నిగ గని – నీ మగని
సామ నిగమ గరిమ గని – నీ పాద
దరిని – పరి పరీ మురళీ రవళి
నిమ్మని – సదా కోరితినమ్మా
మొత్తం కృతిలో “స రి గ మ ప ద ని” స్వరాల కూడిక కల పదాలనే సాహిత్యంగా మలచి రచించారు. ఒక్క చివరి పాదంలోనే “మురళీ రవళి నిమ్మని సదా కోరితినమ్మ” తప్పించి మిగతా కృతిలో పదాలన్నీ సప్తస్వర పద సమూహమే! ఈ పాట బాల మురళి గొంతులోనే వినాలి. అసలే తోడిరాగం, దానికితోడు ఈ పదాల విరుపులూ. వినడానికి భలేగా ఉంటుందీ పాట.
రాగమాలికలు
కర్ణాటక సంగీతంలో రాగమాలికలకి చాలా ప్రాధాన్యత ఉంది. చాలా మంది విద్వాంసులు ఈ రాగమాలికలు పాడడానికి ఉత్సాహం చూపిస్తారు. ఎందుకంటే వివిధ రాగాలలో వారి గాత్ర ప్రావీణ్యత చూపించే అవకాశం వుంటుంది. సాధారణంగా ఈ రాగమాలికలు ఆది తాళంలోనే స్వరపరచడం కద్దు. వేరే తాళాల్లో ఈ రాగమాలికలు చాలా చాలా తక్కువ. గమనశ్రమ, ఆహిరి భైరవీ, ఆభోగి, మాయామాళవగౌళ, మధ్యమావతీ రాగాలనుపయోగించి కట్టిన గానలోల నీ లీల లెన్న జాలరా మురళీ అన్న వేంకటేశ్వర కృతిని రూపక తాళంలో బాలమురళి కూర్చారు.
హరియే గతి సకల చరా చరములకు అన్న రాగమాలికని బౌళీ, కాంభోజి, శుద్ధ ధన్యాసి, హంసానంది రాగాలతో స్వరపరిచారు. విడిగా సాహిత్యం కన్నా, వినడానికి ఈ పాట చాలా బావుంటుంది. ముఖ్యంగా ప్రతి చరణం తరువాత వచ్చే స్వరకల్పన వినసొంపుగా ఉంటుంది.
కేవలం ‘రంజని’ పేరుతో వచ్చే రాగాలతో రంజని త్రయ రాగమాలిక అని ఒకటుంది. ‘అంబ మామవ’ అన్న ఈ సంస్కృత కృతిలో రంజని, నిరంజని, జనరంజని రాగాలతో పల్లవీ, చరణాలుంటాయి. సాధారణంగా రాగమాలిక పాడేటప్పుడు ప్రతీ రాగానికి ఉండే చివర్లో చిట్టస్వరాలు పాడడమనే ఒక ఆనవాయితీ ఉంది. కొన్ని రాగమాలికలకి చిట్టస్వరాలు ఉండకపోవచ్చు కూడా. ఉంటే మాత్రం ఆ రాగాంతంలోనే పాడుతారు. ఈ పద్ధతికి భిన్నంగా ఈ రాగమాలికలో చిట్టస్వరాలు చరణాలన్నీ ముగిసాక ఒకదాని తరువాతొకటి చేసారు.
అలాగే ఆరభి, బిలహరి రాగాలతో పుష్పాంజలి అన్న రాగతాళమాలిక చేసారు. ఈ రచన సగం సంస్కృతం, సగం తెలుగులో ఉంటుంది. ఇది భరతనాట్యం కోసం చేసిన రాగతాళమాలికలా అనిపిస్తుంది. పల్లవీ చరణమూ ఆరభి రాగంలో, ఆది తాళంలో ఉంటే, చరణం మాత్రం బిలహరి రాగంలో, ఝంప తాళంలో ఉంటుంది. ఎక్కువగా భరతనాట్య ప్రదర్శనల్లో ఇది వినిపిస్తుంది. కచేరీల్లో ఎవరూ పాడటం వినలేదు.
బాలమురళి రాగమాలికల్లో ముఖ్యంగా చెప్పుకోతగ్గది ఠాయ రాగమాలిక. ఠాయము అంటే స్వర స్థాయి. రాగానికున్న ఆధార షడ్జమం కాకుండా మరొక స్వరాన్ని ఆధార శ్రుతి చేసుకొని వేరే రాగచ్ఛాయల్ని తీసుకు రావడాన్ని గ్రహభేదం అంటారు. ఉదాహరణకి మాయామాళవగౌళ రాగ స్వరాలని ఆధారంగా చేసుకొని గ్రహ భేదంలో పాడితే రసికప్రియ, సింహేంద్రమధ్యమ రాగాలొస్తాయి. ప్రతీ రాగానికీ కొన్ని జీవ స్వరాలుంటాయి. పాడేటప్పుడు ఆ జీవ స్వరాలు కాకుండా వేరే స్వరాలపై గ్రహభేదం చేసి ఆ స్వరం ఆధారంగా వేరే రాగం పాడచ్చు. ఉదాహరణకి మోహన రాగాన్ని పాడుతూ అందులో ఆధార షడ్జమాన్ని రిషభ స్వరం వద్దకి మార్చి మధ్యమావతిగా పాడచ్చు. ఒక రాగం తీసుకొని గ్రహభేదం చేస్తూ మరొక రాగంలో పాడుతూ ఆ రాగంలో కొన్ని స్వరాలని వదిలేసి వేరొక రాగంలో పాడడాన్ని ఠాయమంటారు. ఈ పద్ధతిలో బాలమురళీ కృష్ణ కళ్యాణి రాగం ఆధారంగా ఠాయ భేద రాగమాలికని రచించారు. ఇందులో కళ్యాణి, శంకరాభరణం, మోహన, హిందోళ, దర్బారీకానడ రాగాలుంటాయి. ఈ ఠాయ రాగమాలిక ప్రత్యేకత ఏమిటంటే దీన్ని మామూలు కృతిలా కాకుండా తిల్లానాలో స్వరపరిచారు. ఇలాంటివి పాడటం బాలమురళి వంటి గాయకులకే చెల్లుతుంది.
ఇవి కాకుండా గతి భేద ప్రియ రాగమాలిక కూడా ఆయన కట్టారు. ఇదీ తిల్లానాయే! ఇందులో గురుప్రియ, రసికప్రియ, గాయకప్రియ, సునాదప్రియ, ఖరహరప్రియ రాగాలుంటాయి. ఒక్కో రాగం ఒక్కో గతిలో ఉంటాయి. అంటే గురుప్రియ చతుశ్ర గతిలోనూ, రసికప్రియ త్రిశ్ర గతి లోనూ, గాయకప్రియ మిశ్రగతిలోనూ, సునాదప్రియ సంకీర్ణ గతిలోనూ, ఖరహరప్రియ ఖండ గతిలోనూ ఉంటాయి.
కొత్త రాగాలు
తానే పని చేసినా నవ్యత, సరళతలకి ప్రాముఖ్యత ఇస్తానని చెబుతూ, సంగీత ప్రయోగాలంటే ఆయనకి చిన్నప్పటి నుండీ ఆసక్తినీ బాలమురళి చెప్పారు. తన ఇరవయ్యో ఏట 72 మేళకర్త రాగాల్లోనూ స్వరపరిచాననీ, అది చూసే సంగీత విద్వాంసుడు టి.ఎస్.పార్థసారధి తనని మరింత ప్రోత్సహించారనీ చెప్పారు. ‘జనకరాజ కృతి మంజరి’ అన్న పేరుతో అప్పట్లో పుస్తకం రాసారు. ఇలాంటి ఉత్సాహమే ఎదిగే కొద్దీ పెరిగిందనీ, ఆ తీరులోనే చాలా రాగాల్లో కృతులు స్వరపరిచానన్నీ చెప్పుకొచ్చారు.
కేవలం అందరికీ పరిచయమున్నా, వాడుకలో ఉన్న రాగాలే కాకుండా కొత్త కొత్త రాగాలు కూడా సృష్టించారు. ఆ కోవలోనే మహతి, గణపతి, లవంగి, సర్వశ్రీ, సుముఖం, సిద్ధి, మురళి రాగాల రూపకల్పన జరిగింది. ఈ రాగాలన్నింటికీ ఒక ప్రత్యేకత ఉంది. సాధారణంగా ఏ రాగానికయినా అయిదు స్వరాలు తగ్గకుండా ఉండాలని రాగలక్షణ శాస్త్రంలో ఉంది. దీనికి భిన్నంగా పైన చెప్పిన రాగాలన్నీ మూడు లేదా నాలుగు మించి స్వరాలున్న రాగాలు కావు.
మొట్ట మొదటసారి నాలుగు స్వరాలతో ఆశువుగా కట్టిన రాగం మహతి. ఇందులో స గ ప ని స్వరాలే ఉంటాయి. ముందు పాడేటప్పుడు ఆయనా గమనించలేదట. పాట మొత్తం అయ్యాక విన్న వారొకరు, ఇందులో నాలుగే స్వరాలున్నాయీ, ఇది ఏ రాగం అనడిగితే చటుక్కున మహతి అనేసానని ఆయన స్వయంగా చెప్పారు. నాలుగు స్వరాలతో ప్రయోగం త్యాగరాజు కూడా చేసాడు. వివర్ధని (ఆరో. స,రి,మ,ప) నవరస కానడ (ఆరో. స, గ,మ,ప) రాగాల ఆరోహణలో నాలుగు స్వరాలే ఉంటాయి. అవరోహణలో మాత్రం నాలుగు పైగా స్వరాలుంటాయి. త్యాగరాజు ఆరోహణలో నాలుగు స్వరాలు మాత్రమే వాడడం నిజమే అయినా, అవరోహణలో కూడా నాలుగు స్వరాలే వాడిన ఘనత బాలమురళి గారికే సొంతం.
ఈ మహతి రాగంలో కట్టిన కృతి మహనీయ మధుర మూర్తే కృతి సంగీత గురువులపైన రచించినది. ఇది చెన్నైలో ఒక కచేరీలో ఆశువుగా స్వరపరిచినదని చెప్పారు. తానెప్పుడు కచేరీల్లో ఏం పాడాలన్నది ముందుగా అనుకోననీ, ఏం పాడాలనిపిస్తే అది పాడుతాననీ చెప్పారు. ఒక్క జుగల్బందీలకి మాత్రం ఇది మినహాయింపనీ, ఒక్కోసారి ప్రేక్షకుల ఆసక్తీ, ఉత్సాహం బట్టీ కొత్తవి పాడుతాననీ అన్నారు.
ఈ పరంపరలో చేసిన రెండవ స్వీయ రచన ఉమా సుతం గణపతిం అన్న కృతి. ఇది కూడా ఆశువుగా కట్టిన కృతే. ముందు ఈ రాగానికి సర్వశ్రీ అని నామకరణం చేసారు. ఇందులో స, మ, ప మూడు స్వరాలే ఉంటాయి. రాగ లక్షణాలు బట్టి ఒక రాగానికి కనీసం నాలుగు స్వరాలుండాలి. మూడు స్వరాలతో రాగం ఏవిటని కొంతమంది విమర్శించారు. “స్వర లయాదులే రాగానికి శక్తి. ఎన్ని స్వరాలున్నాయన్నది కాదు ప్రధానం,” అని ఆయన సమాధానం. దాన్ని సమర్థించడానికే తర్వాత ఈ రాగం పేరు త్రిశక్తిగా మార్చారు.
త్రిశక్తి (సర్వశ్రీ) రాగం మాదిరిగానే గణపతి (స, గ, ప), సిద్ధి (స, రి, ధ) రాగాల్లో కూడా మూడు స్వరాలే ఉంటాయి. గణపతి రాగ కృతి రచన ఈ క్రింది విధంగా ఉంటుంది.
గం గం గణపతిం భజేహం
గంగాపతి సుతంగణనీయ గణ గణనీయం
సదా వందనీయంత్రిభువన సర్వం త్వదీయ రూపం
త్రికాల కూలం త్రిలోక దీపం
శుభకర మురళీ గానలాపం
సిద్ధి బుద్ధి సంతోష కలాపం
ఈ కృతి సూర్యకాంతి పుస్తకం మొదటి ముద్రణలో లేదు. సూర్యకాంతి-2 వస్తోందని బాలమురళిగారే అన్నారు. బహుశా అందులో పొందుపరిచే అవకాశం వుంది.
బాలమురళికి గణపతి ఇష్ట దైవం. వినాయకుడి మీద పదికి పైగా కృతులు కట్టారు. పాహి ప్రభో గణరాజ (హంసధ్వని), మహనీయ నమస్సులివే (సుముఖం), మహాదేవ సుతం (ఆరభి), సిద్ధి నాయకేన (అమృత వర్షిణి), శ్రీ సకల గణాధిపా (ఆరభి), పరి పరి నీ పదమే (హంస ధ్వని), గణాధిపం సతతం (నాట) వంటివి కొన్ని ఉదాహరణలు. నిను నెరనమ్మితి గణనాయక (ఖరహర ప్రియ) అన్న కృతి బాల మురళి రచనల్లో చాలా పెద్దది. కృతులూ, వర్ణాలూ, తిల్లానాలలో మహా ఉంటే నాలుగు చరణాలు మించి లేవు. ఇదొక్క కృతిలో మాత్రం ఆరు చరణాలు పైగా ఉన్నాయి. ఆఖరి రెండు చరణాలూ మరింత పెద్దవి. సాధారణంగా కచేరీల్లో వర్ణం పాడి గణపతి ప్రార్థన చేసాక వినాయకుడిపై పాటలు పాడరు. ఈ పద్ధతికి బాలమురళి వ్యతిరేకం. “గణపతి మీద కొన్ని వందల కృతులున్నాయి. అవన్నీ ఎందుకు పాడరు? కచేరీ మొదట తప్ప పాడకూడదని ఏ శాస్త్రం చెప్పింది? ఈ కచేరీలన్నీ మనం ఏర్పరుచుకున్నవే కదా? వినాయకుడి పాట ఎప్పుడైనా, ఎక్కడైనా పాడుకోవచ్చు. ఈ ఉద్దేశ్యంతోనే నేను కచేరీ మధ్యలో వినాయకుడి పాటలు పాడతాను,” అని ఈ మధ్య కలిసినప్పుడు అన్నారు.
వర్ణములు
కర్ణాటక సంగీతంలో అతి ప్రాముఖ్యత వున్న ఒక ప్రక్రియ వర్ణం. ఈ వర్ణ సంప్రదాయం అనాదిగా వుంది. ఒక రాగాన్ని పూర్తిగా వర్ణంలోనే విస్తరించడానికి అవకాశముందని పండితుల అభిప్రాయం. సంగీతం నేర్చుకునే ప్రారంభ దశలో వర్ణాలు కనీసం ఏడెనిమిది వస్తే కానీ కృతులకి వెళ్ళరు. దాదాపు సంగీతకారులు అందరూ వర్ణాలు కట్టినవారే. త్యాగరాజు మాత్రం వర్ణాల జోలికి పోలేదు. ఆయన శిష్యులు వర్ణాలు స్వర పరిచారు. బాలమురళి కూడా సుమరు పదిహేను వర్ణాలు కట్టారు.
వీటిలో – ‘సరగున గావుము వరగుణ నిలయే’ అన్న తోడి రాగ వర్ణం బాలమురళి స్వరపరిచిన మొట్టమొదటి వర్ణం. దీని వర్ణం అనేకంటే పదవర్ణం అంటే బావుంటుంది. మామూలు వర్ణానికీ, పద వర్ణానికీ చిన్న తేడా వుంది. వర్ణంలో పల్లవీ, అనుపల్లవి, ముక్త్యాయి స్వరం, ఒక చరణం వుంటాయి. చరణం తరువాత నాలుగైదు ముక్త్యాస్వరాలతో కూడిన చరణాలుంటాయి. ఇదీ వర్ణం యొక్క రీతి. సాధారణంగా వర్ణంలో చరణం తరువాత వచ్చిన చరణాల్లో సాహిత్యం వుండదు. కేవలం స్వరాలే ఉంటాయి. అలాగే పాడుతారు కూడా. కానీ పదవర్ణాల్లో ప్రతీ చరణానికి సాహిత్యం వుంటుంది. స్వరాలు పాడరు.
బాలమురళి వర్ణాలూ, పదవర్ణాలూ కూడా కట్టారు. ‘చలము చేసిన నీకేమి ఫలమురా గోపాల’ అన్న రామప్రియ రాగ వర్ణం కూడా పదవర్ణం క్రిందకే వస్తుంది. కృష్ణుడిపై కట్టిన ఈ వర్ణానికి రామప్రియ రాగం ఎన్నుకోవడం గమ్మత్తుగా అనిపించింది. ఖరహర ప్రియలో నిను నెర నమ్మితి గణనాయక, షణ్ముఖప్రియలో ఓంకార ప్రణవ నాదోద్భవ, కమాస్‌లో వేసారితినే వెదకి, అమృతవర్షిణిలో ఆబాల గోపాలమూ, శంకరాభరణంలో ఎంత సుదినమే నేడే ఏమని తెల్పుదునే, స్వరాష్ట్రంలో సాకార సద్గుణ, నాటలో ఏ నాదములో, వంటివి బాలమురళి వర్ణ సృష్టిలో మరికొన్ని.
ఆయన తరచుగా కచేరీల్లో పాడే అమ్మా ఆనంద దాయినీ గంభీర నాట వర్ణం అతి ప్రసిద్ధి చెందినది. ఈ వర్ణ రచనపై ఓ నలుగురికి పిహెచ్.డీలు వచ్చాయని ఈ మధ్య కలిసినప్పుడు చెప్పారు. ఈ వర్ణాన్ని వివిధ కాలాల్లో పాడానని చెబుతూ, ఇది ఫ్యూజన్ సంగీతంలో కూడా పాడటానికి అనువుగా ఉంటుందనీ, ఇంతవరకూ కృతులే తప్ప వర్ణాన్ని ఫ్యూజన్ సంగీతంలో వాడలేదని చెప్పుకొచ్చారు.
తిల్లానా
పూర్వం అంటే పదిహేడు పద్దెనిమిది శతాబ్దాల్లో యక్షగానాలు అత్యంత ప్రజాదరణ కలిగిన అంశం. యక్షగానంలో నృత్యమూ, సంగీతమూ, వాచకమూ, అభినయమూ ఇవన్నీ కలబోతగా ఉంటాయి. కొంతకాలానికి నృత్యనాటికలొచ్చాయి. ఈ నృత్యనాటికల్లో కూడా సంగీతానికి ప్రధాన పాత్రుంది. సంగీతానికీ, నాట్యానికీ ఉన్న పెద్ద లంకె లయ. పాడినా, ఆడినా లయబద్ధంగా ఉంటేనే రాణిస్తుంది. ఈ లయ ఆధారంగా జతి స్వరాలుండేవి. జతిస్వరాల్లో స్వరం తప్ప సాహిత్యం వుండదు. ఈ జతిస్వరాలకి సాహిత్యం జతపరిచి దాన్నే తిల్లానాగా మలిచారని ఒక వాదనుంది. హిందూస్తానీ తరానాల నుండే తిల్లాన వచ్చిందని మరొక వాదనుంది. హిందూస్తానీ తిల్లానాలకీ, కర్ణాటక సంగీత తిల్లానాలకీ చట్రం ఒకటే అయినా లోపలి రూపం మాత్రం భిన్నంగా ఉంటుంది.
ఈ తిల్లానాలు భరతనాట్యంలో ఒక ముఖ్య అంశం. వేగంగా సాగే లయ విన్యాస రచనకి అనుగుణంగా నృత్యం చెయ్యడం భరతనాట్యంలో ఒక అంశం. మామూలు సంగీత రచనల్లాగానే ఈ తిల్లానాల్లో కూడా పల్లవీ, అనుపల్లవీ, చరణాలుంటాయి. కాకపోతే చివరి చరణంలో మాత్రమే సాహిత్యం ఉంటుంది. పల్లవీ, అనుపల్లవీ, మొదటి చరణాల్లో లయ విన్యాసానికి సంబంధించిన తకిట తధిమి వంటివి ఉంటాయి. స్థూలంగా తిల్లానా అంటే ఇది. ఈ భరతనాట్యానికి కట్టిన తిల్లానాలు కాలక్రమేణా సంగీత కచేరీల్లో కూడా భాగమయ్యాయి. వేగంగా మధ్యమ కాలంలో పాట సాగడం వల్ల వినసొంపుగా ఉంటుంది.
తిల్లానాలు ప్రాచుర్యం పొందడానికి రాజాస్థానాలు కూడా ఒక కారణం. మహారాజా స్వాతి తిరుణాల్ నాలుగైదు తిల్లానాలు స్వరపరిచాడు. ఆనందభైరవి, ధన్యాస్రి, కళ్యాణి, పూర్వి కళ్యాణి రాగాల్లో కొన్ని తిల్లానలు కట్టారు. వీటిలో ఆనందభైరవి రాగంలో కట్టిన ‘ధిరనం తన తిల్లానా’ చాలా ప్రసిద్ధి చెందిన తిల్లానా. ఆనందంభైరవి రాగం నృత్యానికి అనుగుణంగా ఉంటుంది.
ప్రముఖ సంగీతకారులైన త్యాగరాజూ, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి వంటి వారు ఈ తిల్లానాల జోలికి పోలేదు. ఆ తరువాత వారి శిష్యగణంలో కొంతమంది తిల్లానాలు కట్టినా, ఈ మధ్య కాలంలో వాటికి మరింత ప్రాచుర్యం తెచ్చింది బాలమురళే! ఈయన తిల్లానాలు అటు భరతనాట్యంలోనూ, ఇటు సంగీతంలోనూ చాలా పేరు తెచ్చుకున్నాయి. బాలమురళి అంటే తిల్లానాకి మారుపేరుగా చెప్పుకునేంత రీతిలో మారిపోయాయి. సంగీత కచేరీల్లో కూడా తిల్లానాలు ఒక భాగం అయ్యాక, ఇదీ ఒక తప్పనిసరి అంశంగా మారింది. భరతనాట్యంలో తిల్లానాలు ఆఖరి అంశంగా ఉంటాయి. కానీ కచేరీల్లో చివర్లో పాడినా, మంగళం పాడి ముగించడం ఆనవాయితీ. బాలమురళి అయితే తిల్లానాలు పాడిన తరువాత తత్వాలు వంటివి కూడా పాడతారు.
బాలమురళి సుమారు పదికి పైగా తిల్లానాలు కట్టారు. తిల్లానాలకి కాస్త హుషారు గొలిపే రాగాలు ఎన్నుకోవడం కద్దు. హిందోళం, బృందావని, కుంతల వరాళి, ద్విజావంతి, ఆహిరి భైరవి, కదనకుతూహలం, బేహాగ్, గరుడ ధ్వని రాగాల్లో తిల్లానాలు రచించారు. కేవలం ఒకే రాగంలో తిల్లానాలు కట్టడమే కాదు; వాటిని రాగమాలికగా మలిచారు. ఇంతకుముందు ఎవరూ రాగమాలికలో తిల్లానాలు కట్టలేదు. పైన చెప్పిన కొన్ని గతిభేద ప్రియ రాగమాలిక, ఠాయ రాగమాలికలు నిజానికి తిల్లానాలు. ఒక్క తిల్లానాల్లోనే రాగమాలిక చెయ్యడం, అలాగే అందులోనే గతిభేదం చెయ్యడం వంటి ప్రయోగాలు కేవలం బాలమురళికే సాధ్యం. ఇవన్నీ స్వరపరచడం ఒక ఎత్తు. జనరంజకంగా పాడడం ఒక ఎత్తు. బాలమురళి తిల్లానాలకి సాటి ఏవీ రావు. ఒక్క తిల్లానాలే కాదు; నాలుగైదు జావళీలు కూడా కట్టారు. జంఝాటి రాగంలో నాయికా నాయకులపై రెండు విడివిడిగా జావళీలు రచించారు.
అవీ ఇవీ
కేవలం శాస్త్రీయ సంగీతానికే కట్టుబడి పాటలు కట్టలేదు. మంగళాలూ, భావగీతాలూ, భక్తిగీతాలూ, తత్వాలూ, స్ఫూర్తి గీతాలూ, దేశభక్తి గీతాలూ, ఒకటేవిటి బాలమురళి చేయని పాట లేదు.
“త్యాగరాజు కృతుల్లో భక్తి తప్ప ఇంకేవీ ఉండదు. నేను దానికి భిన్నంగా కృతుల్లో కవిత్వం జోడించాను. విప్లవ సందేశాలు జతచేసాను. స్ఫూర్తి సందేశాలు నింపాను,” అంటూ తన రచనలపై ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారాయన. ఇవన్నీ అందరికీ తెలియవు. ఎక్కడా విన్నట్టు కూడా గుర్తులేదు. వాటిల్లో మచ్చుక్కి కొన్ని చూద్దాం.
తెలుగు వారి మీదా, విజయవాడ మీదా కొన్ని కృతులు కట్టారు. కాంభోజి రాగంలో కట్టిన ఈ కృతిలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ వాసులపై ఆయన అభిప్రాయం నిక్కచ్చిగా అనిపించింది.
తెలుగు వెలుగు కిరణాలు మనకూ మన
దేశానికి నవరత్నాభరణాలువెలితిలేని కలిమిలో మెలకువగలిగిన పాలనలో
కలతలేని మనసుతో కలకాలం మెలగాలిఅన్నమునకు ఆంధ్రము – ఆదరణకు అరవము
కన్నతల్లి కన్నడము – మలయానిలము మలయాళముఆరంభమునకు ఆంధ్రము – ఆచరణకు అరవము
కన్నడకు కన్నడము – మరులు కొలుపు మళయాళము
మనమంతా ఒకటైతే మహినే మనమేల గలము
– ఇలా సాగుతుందీ పాట. తెలుగువారికి సంగీతం పట్ల అంత శ్రద్ధా, గౌరవమూ లేదని బాలమురళి పలుమార్లు వాపోయారు. తెలుగువరిని తెలుగువారు గుర్తించరు అని మొన్న కలిసినప్పుడు కూడా అన్నారు. అలాగే బెజవాడ మీద రాసిన పాటకూడా ఆసక్తి కరంగా ఉంది.
వినుమురా విజయ వాణి – కనుమురా కృష్ణ వేణి
ఆలకించు ఆంధ్ర బాల
లాలపించు మధుర వాణివిజయుని జయాలయం
విజయమాత విమల నిలయం
వికచ గాన కళా కవితా
విచక్షణుల శుభాలయం
బాలమురళి చాలా కాలం విజయవాడలో ఉన్నారు. ఆ వూరి మీద మమకారాన్ని అందంగా పాటలో పొదిగేరు. ఇటువంటి పాటలు నాలుగైదు రచించారు. ఇవే కాకుండా దేశభక్తి గీతాలక్కూడా కృతి రూపం కలిగించారు. తోడి రాగం, ఆది తాళంలో కట్టిన పాట ఇలా సాగుతుంది.
తెలుసుకున్నామన్నా స్వాతంత్ర్యమన్నా
తెలిసెనొక గాంధి – కలుగు సుఖ శాంతి
కలిసి మెలిసి మసలు కొనుటే మనకు నీతిసమ్మెల పేర ప్రగతి పధమ్ములను
వమ్ము చేయకురా స్వాతంత్ర్యమన్నాబ్రహ్మరాసిన వ్రాత కెదురు లేదానాడు
పత్రికల వ్రాతల కెదురు లేదీనాడుభూమిని మోయుట మిన్నా
భూమిపై పన్నుల భారము మోయుట కన్నా
ఇండియాకి కార్గిల్ యుద్ధం వచ్చినప్పుడు సైనికుల మీద ఒక పాట కట్టారు. ఇది ఢిల్లీలో మిలటరీ అకాడమీలో చేసిన కచేరీలోని పాటిది. ఆశువుగా కట్టానని చెప్పారు.
నవ హాయన మిది వచ్చెనులే – మా
నవులకు హాయిని ఇచ్చునులేసాయుధ సవ్వడి వాయు మూల విన
నాయె – భయము లేదని మురళి
మ్రోయగా మనదే జయమని
విజయ దుందుభి నినదించే
హిందీ గడ్డమీద, అందునా మిలటరీ సైనికుల మధ్య ఒక తెలుగుపాట ఆశువుగా కట్టి పాడడమే కాదు; దాని అర్థం కూడా వివరించారట. ఇది విని హిందీ వచ్చిన ఒక తెలుగాయన హిందీలోకి తర్జుమా చేస్తే అది హిందీలో పాడారని చెప్పారు.
తనపై ఎందుకో పత్రికల వారికి అంత సుముఖత లేదని చెబుతూ – “చాలా మంది నాపై అనేక కట్టు కధలు అల్లి పత్రికల్లో రాశారు. నిజానిజాలు తెలుసుకోకుండా చెడ్డ ప్రచారం చేశారు. నా సంగీతం మీద కన్నా, నా మీద గాసిప్ రాసేవారు ఎక్కువయ్యారు. వాళ్ళ కోసం ఒక కృతి కట్టాను,” అంటూ గట్టిగా నవ్వేశారు.
నిందలు మోపువారు కావలె
పందులు లేక మన సందులు బాగౌనా?మనము చేయు పాప పంకిలమును
తనివి తీర భుజియించువారు
– అంటూ ఆయన గోడు కృతిలో వెళ్ళబోసుకున్నారు. అయితే ఇది, “నిందక రిరబేకు హంది ఇద్దరే కేరి హేగె శుద్ధియో హాగె” అనే పురందదాసు కీర్తనకు అనువాదమని తెలిసిపోతుంది. అలాగే ఆయన తన కచేరీలలో ఇతర పురందరదాసు కీర్తనలకు తన తెలుగుసేతలు పాడడం శ్రోతలకు అనుభవైకవేద్యమే.
ఇవొక్కటే కాదు. ఆయన కొన్ని భావగీతాలు కూడా రాసారు.
ఒక్క నవ్వే చాలు
చాలదనిపించుటకుఒక్క చూపే చాలు
చాలదనిపించుటకుఒక్క స్పర్శే చాలు
చాలదనిపించుటకుఒక్క నవ్వే చాలు
ఈ బ్రతుకు మనుగడకు
అలాగే ఇంకోటి –
వలపులేలనే – వింత తలపులేలనే
మనసులోన తెలియ రాని
మధుర భావ జాలమాయె
అంటూ పహాడి రాగంలో పాట కట్టారు.
అన్నమయ్య ప్రేరణో లేక ఆదిశంకరుల బోధనల ప్రభావమో కానీ – బాలమురళి కొన్ని తత్వాలు కూడా రచించారు. శుద్ధ ధన్యాసిలో ఈ కృతి చూడండి:
తన హితవే తన మతము
తన సఖుడే తరణితను వలచినదే వనిత
తను తలచినదే కవితతనను తానెరుగు వరకే ద్వైతము
తనను తానెరిగిన అద్వైతము
“తా వలచింది రంభ – తాను మునిగింది గంగ” అన్న సామెత చిన్న మార్పుతో ఇందులో చేర్చారు. కాలం మీద కూడా కొన్ని కృతులు అల్లారు. “సత్యవంతరిగిదు కాలవల్లా దుష్టజనరిగిదు సుభిక్ష కాల” అనే పురందరదాసు కృతికి తెలుగుసేతగా భైరవిలో కట్టిన ఒక పాటలో కొంచెం భాగం.
సత్యమునకిది కాదు మంచి కాలం
నిత్య దుర్వర్తనుల కిది మంచి కాలంహరిభక్తులకెల్ల హరియించు కాలం
పరమ పాపులకెల్ల వరమైన కాలం
పతివ్రతల నిందించి బాధించు కాలం
పతుల బాధించు సతులకు మంచి కాలం
కామవర్ధిని రాగంలోనే మరొకటి.
ఆకాలం అది అంతే
ఈకాలం ఇది ఇంతేఅది వేదాల కాలం
ఇది భేదాల కాలంఅది నీమాల కాలం
ఇది సినిమాల కాలం
ఇలా రాసుకుంటూ పోతే ఈ జాబితా చాంతాడంత అవుతుంది. అందుకే మచ్చుక్కి కొన్ని చూపించాను. కాకపోతే ఈ పాటలన్నీ సీడీల రూపంలోకి తీసుకొస్తే ప్రజలకి తెలుస్తాయి. నలుగురి గొంతులోనూ ప్రవహించినప్పుడే పాట నిలబడుతుంది. లేకపోతే మరుగున పడిపోయే ప్రమాదముంది. ఇవే కాకుండా నవరోజు రాగంలో అయిదారు మంగళాలూ రచించారు. సాధారణంగా మంగళం అంటే ఏ విష్ణువు మీదనో, రాముడి మీదనో, లేదా అమ్మవారి మీదనో ఉంటాయి. ఈ సంప్రదాయానికి విరుద్ధంగా బాలమురళి గణపతి మంగళం సురటి రాగంలో స్వరపరిచారు.
హీరగణపతికి హారతి మణి
హార ధారునికి మంగళ హారతి
అంటూ ఈ మంగళం సాగుతుంది. ఇది కాకుండా ‘రామ చంద్రాయ జనక రాజగా మనోహరాయ’ అన్న రామదాసు మంగళ కీర్తన (ఇది స్వర పరిచింది బాలమురళే) రీతిలో బాలమురళి వేంకటేశ్వరునిపై రచించిన మంగళం ఆయన తరచు కచేరీల్లో పాడుతూనే ఉంటారు.
నిరాశ పరిచిన సాహిత్యం
సంగీత విషయంలో ఎవరూ వేలుపెట్టి చూపించలేని ప్రతిభ కనబరిచిన బాలమురళి రచనల్లో సాహిత్యం తక్కువ స్థాయిలోనే ఉంది. త్యాగరాజు కృతుల్లో కనీసం సామెతలూ, దేశీయాలూ, నీతి వాక్యాలూ, పలుకుబడులూ ఉన్నాయి. శబ్దాలంకారాలు చాలా ఉన్నాయి. సరళమైన భాష ఉంది. పేరుకి భక్తి గీతమయినా అర్థవంతంగా సాగుతుంది. ‘ఎంత జూసినా ఎంత నేర్చినా ఎంత వారలయినా కాంత దాసులే, ఎందరో మహాను భావులు అందరికీ వందనములు, నిధి చాల సుఖమా? రాముని సన్నిధి చాల సుఖమా?’ వంటివి నేటికీ జనబాహుళ్యంలో ఉన్నాయంటే కేవలం సంగీతం మొక్కటే కాక వాటిలో భావం జీవితానికి దగ్గరగా ఉంది కాబట్టే అవి నిలబడ్డాయి.
సూర్యకాంతి, 1997. పే. 296
ఎం.బి.కె ట్రస్ట్, చెన్నై.
అన్నమయ్య సాహిత్యంతో పోల్చి త్యాగరాజు కృతుల్లో సాహిత్యం విలువలు తక్కువున్నాయని రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మగారు అన్నారు. సంగీతంలో సాహిత్యానికి అంత విలువలేదు కాబట్టి అంతగా పట్టించుకోనక్కర్లేదన్న వాదన కూడా కొంతమంది చేస్తారు. కానీ సాహిత్యం సంగీతాన్ని సులువుగా ఆస్వాదించడానికి ఉపయోగపడే వాహకం. సాహిత్య రహిత సంగీతం ఓ పట్టాన అందరికీ ఎక్కదు.
ఆ రకంగా త్యాగరాజు సాహిత్యంతో పోల్చి చూస్తే బాలమురళి రచనల్లో భాషా, భావమూ ఒక మెట్టు తక్కువగానే ఉన్నాయి. ఇంకా చాలా రచనల్లో పూర్వపు వాగ్గేయకార పదజాలం ప్రస్ఫుటంగా కనిపించింది. నిధి – సన్నిధి, గ్రహము – అనుగ్రహము వంటి ప్రయోగాలు అందరికీ పరిచయమే! కొన్ని కృతుల్లో సాహిత్యమయితే దాదాపు త్యాగరాజూ, దీక్షితార్ కృతుల్లానే అనిపిస్తాయి. ‘నీ దయరాదా అంబ – నీ దయరాదా నాపై’ అన్న కృతి ‘నీ దయరాదా రామా’ అన్న త్యాగరాజ కృతికి దగ్గరగా సాహిత్యం అనిపిస్తుంది. చాలా కృతుల్లో వాడిన భాష గతంలో విన్న ఏదో ఒక కృతి లాగానో, లేక పూర్వపు వాగ్గేయకారులు వాడిన పదజాలానికి దగ్గరగానో అనిపిస్తాయి.
అలాగే భావగీతాలూ, దేశభక్తి గీతాలూ వంటివి కూడా ఓ మోస్తరుగానే ఉన్నాయి. ఈ పద ప్రయోగం బావుందే, ఇక్కడ ఈ చరణంలో ఈ పాదం బావుందే అనడానికి ఒక్కసారి అవకాశం రాదు. వాగ్గేయకారుల నుండి సాహిత్యం ఆశించకూడదన్నది అందరికీ తెలుసున్నదే! భక్తయినా, రక్తయినా భావం మాత్రం అందంగా ఉంటే పాట నిలబడుతుంది. కొన్ని పాటలు ఆశువుగా కట్టానని ఆయనే చెప్పారు. కాబట్టి ఎంతో భాషా సంపద ఉంటే కాని సమయానికి తగిన మాటలు అందవు. ఇలా అనుకునే సరిపెట్టుకోవాలి. త్యాగరాజుపై రాసిన కృతి కాస్త మెచ్చుకో తగ్గదిగా అనిపించింది. అమృత వర్షిణిలో ఈ కృతి నడుస్తుంది.
సామగాన సార్వభౌమ –
స్వామి త్యాగరాజ నామఈ మహిలో నీ కృతులని
మేమంతా పాడి పాడి
పేరు, ధనము, కీర్తి పద్మ
గౌరవముల నందేముతామే పెద్దలట – సంప్రదాయ సంసిద్ధులట
శ్రీమన్ మురళీగానము రసిక జనులు మెచ్చరాదట
ఏమోమో పలుమాటలు నేర్చిరి గాయకులు నేడు
నీ మహిమను జూపి సత్సంగీతము సంరక్షింపుము
సూర్యకాంతి మొత్తం పుస్తకంలో స్వదస్తూరీతో రాసినా కొన్ని చోట్ల అచ్చుతప్పులు కనిపించాయి. శింధు భైరవి, గనాపతి వంటి కొన్ని తప్పులు దొర్లాయి. ఇటువంటి చిన్న చిన్నవి మినహాయిస్తే సంగీత ప్రియులు దాచుకో తగ్గ పుస్తకం. ప్రతీ కృతికీ స్వరాలు ఇవ్వడం వల్ల, పాట తెలియక పోయినా, రాగం తెలిసిన వారు సుమారుగా వరస పట్టుకోవచ్చు.
చివరగా – అనన్య సామాన్య ప్రతిభగల బాలమురళి తెలుగు వాడిగా పుట్టడం మనకు వరం; ఆయనకి శాపం. ఆయన మాటల్లో చెప్పినట్లు ఆయనకి ఆదరణ అరవదేశంలో ఎక్కువ లభించింది. భారతరత్న వంటివి ఆయన లాంటి వారికి ఇవ్వడం వల్ల ఆ పురస్కారాలకే మరింత విలువ పెరుగుతుంది. ఇలాంటివి ఎలా వున్నా ఒక్క విషయం మాత్రం రూఢిగా చెప్పచ్చు. త్యాగరాజు తరువాత అంతటి అసమాన స్థాయి కళాకారుడు బాలమురళి. బహుశా మన కాలంలో ఆఖరి తెలుగు సంగీత వాగ్గేయకారుడేమో కూడాను. కర్ణాటక సంగీత సౌధానికి పునాదులే వేసిన తెలుగువారు దాన్ని విస్మరించడం బాధాకరమయిన విషయం. ముందు ముందు మంచి రోజులొస్తాయేమో చూద్దాం.
(గమనిక: మూడు నెలల క్రితం అమెరికా విచ్చేసినప్పుడు బాలమురళి కృష్ణ గారిని నేను చేసిన ఇంటర్వ్యూని వీడియో తీసాను. ఈ వ్యాసంలో బాలమురళి గారి మాటలు అందులోనివే. అందులో చాలా విషయాలు చర్చించారు. వీడియో ఇంటర్వ్యూ వారి అంగీకారం లేకుండా ఎక్కడా పెట్ట వద్దని చెప్పారు. ఆయన మాటను గౌరవించి నేను వీడియో పెట్ట లేకపోయాను. ఆయన అన్నట్లుగా చెప్పిన మాటలు నా దగ్గర వున్నాయి. అవి పుకారు ప్రవచనాలు కావని మనవి చేసుకుంటున్నాను. – సాయి బ్రహ్మానందం.)
ఉపయుక్త గ్రంథసూచి
- సూర్యకాంతి – ఎం.బి.క్ ట్రస్ట్ ప్రచురణ – చెన్నై, 1997.
- త్యాగరాజ శతాబ్ది సంచిక – త్యాగరాజ సమితి రాజమహేంద్ర వరము (రాజమండ్రి) ప్రచురణ: 1947.
- అన్నమయ్య పద సాహిత్యం – రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ – టి.టి.డి ప్రచురణ, తిరుపతి: 1967.
- అన్నమయ్య పద కవిత్వం – రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ – వాణి పత్రిక: 1942.
- గాంధర్వ వేదము – సంగీత రత్నాకరం – చర్ల గణపతి శాస్త్రి – ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్టణం: 1987.
- గాన కళా బోధిని – పార్థ సారధి – బాలసరస్వతి బుక్ డిపో., మద్రాసు: 1965.
- నాదమురళి – బాలమురళి – వ్యాసం – సాయి బ్రహ్మానందం గొర్తి – పాలపిట్ట మాస పత్రిక ఆగస్ట్ 2010.