జీవితసమరంలో అనుక్షణం ఓడి గెలుస్తూ
ఊపిరి నిలిచిపోయినా, స్వాతంత్య్రపు స్వేచ్ఛావాయువుల్ని పీలుస్తూ ..
నిర్జీవంగా నట్టింటి వసారాలో …
మూసిన కళ్ళలోంచి రంగులనాటకాన్ని వీక్షిస్తున్నా ..!!
కలసి పయనిద్దాం అంటూ,
మధ్యలోనే చతికలబడ్డావేం?
ఒంటరిగా ఈ బరువు ఎలా లాగేది?…
నిస్తేజంగా నావంక చూస్తోంది నా తోటిచక్రం!!
నే తిన్నా తినకపోయినా, నాపిల్లలు తింటే చాలు..
అనుకున్న నాకు, వయసు మీరేక ..
నాలుగు గింజలు చల్లడానికేడ్చే నా పుత్రరత్నం ..
నిర్జీవంగా పడున్న నన్ను చూసి ..
నెత్తిబాదుకుని ఏడుస్తున్నాడు ..
నే పోయినందుకు కాదు .. ఆస్తి పంచనందుకు !!
నా యింటికి ఎప్పుడూ రాడు ..
పెద్దకొడుకు పక్షపాతి అంటూ ప్రచారం చేసి,
“ఒక్కసారి కూడా పిలవలేదన్న” నిజాన్ని మింగేస్తూ ..
దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నాడు …
నాగారాల పట్టి నా రెండో వజ్రం !!
నా ఊపిరి ఆగినందుకు కాదు
చిల్లిగవ్వ కూడా దక్కనందుకు !!
పట్టీలు లేకుండా పది అడుగులు కూడా వేయలేని ..
పట్టుచీర పెడితే కాని పండగ గుమ్మం దాటని ..
నా ముద్దుల ముద్దబంతి ..
పడిపడి కొట్టుకుంటూ ఏడుస్తోంది …
నా ఆయువుపట్టు ఊడినందుకు కాదు!
“ఆస్తిలో కూతుళ్ళకి సమానహక్కు” చట్టం నే అమలుచేయనందుకు..
ముఖం చూస్తేనే పాపం అంటూ
ముఖం తిప్పుకుని చీదరించుకునే నా రత్నానికి తోడు..
ముఖమంతా వాచేలా ఏడుస్తోంది
నా జవసత్వాలు శాశ్వతంగా పోయినందుకు కాదు
ఇంటిఖర్చులో తనవాటా పెరిగినందుకు..
చూసిపోదామని వస్తేనే..
ఎక్కడ ఉండి తిష్ట వేస్తానో నన్న భయంతో
సమస్త రోగాలని క్షణంలో తెచ్చుకోగల నా వజ్రపు నీడ..
ఇల్లు దద్దరిల్లేలా ఏడుస్తోంది
చూడడానికి ఆప్యాయంగా ఇంకెవ్వరూ రారని కాదు!
నాలుగురాళ్ళు కూడ దక్కనందుకు..
పలకరిస్తేనే చూడనట్లుగా తలతిప్పే బంధువర్గం,
తలతిప్పకుండా, లేని బాధ చూపిస్తున్నారు
నా తల నేల వాలినందుకు కాదు !
పదితలలకి తమ బంధుప్రీతి చాటే అవకాశం దొరికినందుకు …
బ్రతికుండగా తెరుచుకోలేని ఈ జ్ఞానచక్షువులు
శ్వాస పోయాక మరింత తీక్షణతతో
వీక్షిస్తున్నాయి పంచరంగుల్లో
నా కుటుంబీకుల నవరసనటనా చాతుర్యాన్ని !!