అలా మనం వూళ్ళోకి దిగి, రెండు ఆటోలు కట్టించుకుని ఇంటిముందాగీ ఆగడంతోనే మీ ఇంటి పనమ్మాయి రత్నం గావుకేక పెడుతుంది, ‘అమ్మగోరూ! ఎవరో సుట్టాలొచ్చారూ!’ అని. అది విని వసరాలో పడక్కుర్చీలో పడుకున్న మావగారు, చదువుతున్న పేపర్ని కిందకి దించి మనల్ని చూస్తారు. ముందు నమ్మలేని వాడిలా, ఆ తర్వాత ఆశ్చర్యంగా నోరు తెరిచి బిగ్గరగా కేకేస్తారు అత్తగారిని, ‘ఏమేవ్, పిల్లలొచ్చారే’ అని. ఆవిడకి వినపడదు. మళ్ళీ కేకేస్తారు, ‘వస్తున్నావా? త్వరగా రా!’ అని. అప్పటికి మనం రిక్షా వాళ్ళకు డబ్బులిచ్చి పంపేస్తాం.
అత్తయ్యగారు విసుక్కుంటూ వస్తారు. ‘ఏమిటీ వస్తున్నానంటే కూడా అరుస్తారు ఊరకే పొద్దస్తమానం,’ అంటూ. అప్పుడు చూస్తారు మనల్ని. ఇద్దరి పిల్లల చేతులు పట్టుకుని ముందు నువ్వు, ఆ వెనక ఒద్దికగా నిలబడి నేనూ… కళ్ళు నులుముకుని మరో సారి చూస్తూ కలకాదని తెలుసుకుని మరో మారు, వయసు మరచిపోయి, పరుగు పెడుతూ మన దగ్గరకొస్తారు. ‘సూర్యం! నువ్వుట్రా… నువ్వు? నువ్వొచ్చావుట్రా…’ అంటూ తన రెండు చేతులతో నీ చెంపలని నిమిరి, దగ్గరికి తీసుకుంటారు. ఆ వెంటే గబగబా పిల్లల్నెత్తుకుని భుజానికేసుకుని తబ్బిబ్బైపోతారు.
అవునమ్మా, సంక్రాంతికని పిల్లల్ని జానకిని తీసుకొచ్చాను, అని అంటావ్ నువ్వు. పట్టలేని సంభ్రమాశ్చర్యాలతో, ఉద్వేగావేశాలతో కదలి కడలైపోతారు. ఆవిడ పండగైపోతూ, నా పిల్లల్ని కావలించుకుని, ముద్దాడుతూ, ఇన్నాళ్ళకి గుర్తొచ్చిందట్రా ఈ బామ్మ! అని నిష్టూరంలోనే ప్రేమనొలకబోస్తూ వాళ్ళు కొత్త వాత్సల్యంలో తనమునకలౌతూంటే, ఇవేవీ చేయడం చేతకాని మావయ్యగారు కళ్ళు తుడుచుకుంటారు. అంత గంభీరపు సంఘటనలోనూ రత్నం బయట్నించి లగేజిని గబగబా లోపలకి జేరేస్తూ, ‘వూరుకోండమ్మగారూ. పిల్లలు పండగపూటా వాయిట్లోకొస్తే సంబరపడాల్సింది పోయి కన్నీళ్ళెట్టుకుంటారు,’ అంటూ మురిపెంగా కోప్పడుతుంది.
కళ్ళు తుడుచుకుని, తిరిగి కళ్ళజోడు సవరించుకుంటూ మావగారు, ‘ఎప్పుడు బయల్దేరారురా? బెజవాడ కెప్పుడొచ్చింది బండి?’ అని అడుగుతారు. నిన్ను పక్కన కూర్చోబెట్టుకుంటూ. ముందుగా చెబితే కారు పంపేవాణ్ణిగా అని కూడా కూకలేస్తారు ఆప్యాయంగా. నువ్వేదో సర్ది చెబుతుంటావ్. ఆ పాటికే పిల్లలు ఆ ఇంట్లో సామాన్లని వింతగా, అద్భుతమైన వస్తువులుగా పరిగణిస్తూ వారి వారి పరిభాషల పరిశీలన లోకెళ్ళిపోతుంటారు. వాకిట్లోకొచ్చిన కోడల్ని పలకరించలేదని, నాకెంత అవమానమైందో తెలుసా అని, ఇంకెప్పుడూ నన్ను మీ ఇంటికి రమ్మని అడగకు అనీ, నేనీసారి నీకు కంప్లైంట్ చేయను శ్రీ!
నిజం. ఒట్టు.
మా ఇద్దరి మధ్యా దట్టంగా పేరుకున్న మంచు తెరలను కరిగించే ఉపాయం గురించే ఆలోచిస్తాను. ‘రత్తమ్మా, ఏమిటీ ఇల్లు ఇలా వుంచావ్? ఆ బూజు కర్ర అందుకో, ఇదిగో ఆ మెత్త చీపురూ, బరక చీపురూ కూడా తీసుకురా. ఇల్లంతా దులపాలి. నాలుగు రోజుల్లో పండగ పెట్టుకుని, ఇల్లిలానేనా అంఠ, వుంచుకునేది!’ అంటూ ఆర్భాటం చేసేస్తాను.
అలకపోయి అత్తయ్యగారు నా చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ, ‘పండగ పూట ప్రాణం వుసూరుమనకుండా మా ఇంటికి సంక్రాంతిని తీసుకొచ్చావే జానకీ! ఎంతైనా నువ్వీ ఇంటి మహలక్ష్మివి! నిన్ను చీపుళ్ళు పట్టుకోనిస్తానా?’ అంటూ ఎక్కడలేని మమకారం చూపుతారు (అప్పటి దాకా నాపై వున్న కారమంతా పోయి.) ‘మీ అమ్మాయికి పని రాదా? వదినగారూ? ఇక్కడ చీపురు తీసి అక్కడ పెట్టదు, మరీనూ…’ అని మా అమ్మతో ఒకప్పుడు ఫిర్యాదు చేస్తూ బుగ్గలు నొక్కుకుందీ ఈవిడేనా అని విస్తుపోతాను నేను. ఆవిడ కాల్లో చక్రాలేసుకుని ఇల్లంతా తిరిగేస్తూ, మూల సామాన్లు ఎత్తి అటకలకెక్కిస్తూ, అటకల మీదినించి అరిసె చట్రాలు, కారప్పూస గొట్టాలు, కజ్జికాయ పీట, గవ్వల పీట, బూందీ దూసే ఇనప జల్లెడలు దింపిస్తుంటే నేనింతింత కళ్ళేసుకుని చూస్తూండిపోతా.
నువ్వప్పటికే, మీ అమ్మ ఇచ్చిన గ్లాసుడు పాలు, మినప దిబ్బరొట్టె లాగించి వేపచెట్టు కింద వాల్చిన నవారు మంచం మీద వాలి నిద్రలోకెళ్ళిపోతావ్. పిల్లలెక్కడని చూద్దును కదా, వాళ్ళ తాతగారి బండి మీద వూరేగడానికి వెళ్ళిపోనే వెళ్ళిపోయుంటారు. వూళ్ళో అందరకీ తన మనవళ్ళని చూపించుకురావొద్దూ. అందుకే అంత తొందరపాటు మరి. నేను శుభ్రంగా స్నానం చేసి వంట పన్లు అవీ చూసి, చకచకా ఏవేం బొమ్మలున్నాయీ అడిగి తెలుసుకుంటుంటా అత్తయగార్ని. దక్షిణం వైపున్న ఆ గదిలో అన్నీ బొమ్మల పెట్టెలే. కొన్ని ఇనప్పెట్టెల్లో, ఇంకొన్ని చెక్క పెట్టెల్లో, మరి కొన్ని అట్ట డబ్బాలలో వున్నవన్నీ బయటకి తీస్తాం. తెల్ల దొరల కాలం నాటి బొమ్మల్ని చూపిస్తూ వాటి వెనక ఆవిడ చెప్పే కథలు వింటూ నా ప్లాన్స్ నేను వేసుకుపోతుంటాను. ఏ బొమ్మ ఎక్కడ పెట్టాలా అని, ఏ సెట్ ఎలా డెకొరేట్ చేయాలా అనీ.
మావయ్యగారు వొస్తూ వొస్తూ ఇంటికి సున్నాలేసే సరంజామాతో బాటు పనివాళ్ళనీ తీసుకొస్తారు. అత్తయ్యగారు ఇద్దరి మనవళ్ళిద్దర్నీ వెనకేసుకుని తెగ మాట్లాడేస్తూంటారు. రెండ్రోజుల్లో, ఇల్లంతా ఎలా మారిపోతుందంటే — గోడలకేసిన కొత్త సున్నాల ఘాటుతో, గుమ్మాలకి అద్దిన లక్కలతో, తలుపులకు పూసిన వార్నిష్ వాసన్లతో భలే గుమ్మెత్తిపోతుంటుందిలే ఇల్లు మొత్తం. నీకు గుప్పున మన పెళ్ళినాటి ఇంటి వాతావరణం గుర్తొస్తుంది. కదూ? అప్పుడు నువ్వు… నా వైపు చూసే చూపెంత బావుంటుందో తెలుసుకోవాలనుంది శ్రీ!
అదిగో ఇంతలో భోగి రానే వచ్చేస్తుంది. ఊరు వూరంతా సందడౌతుంది. కళ్ళు నులుముకుంటూ తెల్లవారు జామునే పిల్లలు నిద్ర లేస్తారు. నాలుగు దారుల కూడలి మధ్య భోగి మంటలేస్తారు. అవిగో వినొస్తూ జనపదాలు, డప్పులు, దరువులు, పాటలూ పద్యాలూ, నాట్యాలూ! చీకటి చలి వొణికొణికి పారిపోతూ, వీధుల్లో ముగ్గులు నవ్వుతూ వుంటే, గొబ్బెమ్మ చలి బట్టలిప్పి, వెలుగు వన్నెల చీరకట్టి, గుమ్మడి పూవు తురుముకుంటూ నవ్వేస్తుంటుంది.
అడగడం మరిచిపోతాను. మన పిల్లల్ని చూశావా శ్రీ? అని. గడగడలాడే ఇంత చలిలోనూ ఎలా లేచి కూర్చున్నారో, అని. ఇక్కడికొచ్చినప్పట్నించి గమనిస్తున్నా, మనమిద్దరం ఇక్కడున్నామన్న సంగతే మర్చిపోయారు. వంశోద్ధారకులని చూసి, మావగారెంత మురిసిపోతున్నారనుకున్నావ్? అదిగో సాయంత్రం. పిల్లలకి పోస్తున్న భోగిపళ్ళ పేరంటం. ఎప్పొడొచ్చారంటే ఎప్పుడొచ్చారని అబ్బబ్బబ్బ! అమ్మలక్కలు ఒకటే ప్రశ్నలు పేరంటంలో. అందరెళ్ళాక, ఏం దిష్టి తీసి పోస్తుందిలే అత్తయ్యగారు నీకునూ, నీ పిల్లలకీనూ?
పండగ నాడు పొద్దునే పక్కూర్నించి వూడిపడ్డ మీ అత్తగార్నీ, మావగార్ని చూసి నువ్వు తెగ అబ్బురమై పోతావ్ కానీ, నాకీ సంగతి ముందే తెలుసు కాబట్టి కళ్ళెగరేసి మరీ చూస్తా నీ వైపు.
అసలేమవుతుందంటే… రెండ్రోజులనాడే అడుగుతుంది అత్తయ్యగారు, మీ వాళ్ళెలా వున్నారే జానకీ, అంటూ. వాళ్ళూ ఒంటరి వాళ్ళే అత్తమ్మా అని అంటానో లేదో, ‘అదేమిటే అలా అంటావ్. మనమంతా ఇక్కడుండంగా, పండగపూట వాళ్ళొక్కళ్ళే మాత్రం ఎందుకంట అక్కడ? ఫోను కలుపు. నే పిలుస్తా’ అని అంటుంది. నాక్కావాల్సిందీ అదే కదా. ఆవిడ పొంగిపోతూ పిలుస్తుంది. వీళ్ళు గాల్లో ఎగిరిపోతూ వస్తారు. అలా జరుగుతుంది కథ.
సంక్రాంతి ఎంత బాగుంది కదూ?
మీ అత్తామావలు నిన్నూ, మా అత్తామావలు నన్నూ నెత్తినెట్టుకుని చూసుకుంటుంటే, పిల్లలు అమ్మమ్మ, బామ్మ, తాతయ్యల గారాల పల్లకీలలో వూరేగుతుంటే, చూడటానికి రెండు కళ్ళు చాలతాయంటావా? ఊహు. చాలవు. పండగెళ్ళిపోయినా, ఆనందంతో బరువెక్కిన ఈ గుండెల్లోంచి సంక్రాంతి వెళ్ళనంటుంది శ్రీ, అవును కదూ?
గుమ్మాలకి కట్టిన బంతిపూల దండలు, వాకిట్లో వేసిన పండగ ముగ్గు, చతికిలపడ్డా, చేమంతుల సిగ చెరగని గొబ్బెమ్మలు. నాలుగు రోజుల సాన్నిహిత్యంతో మనలో ఒకటైపోతూ జీవమొచ్చి కదుల్తూ ఆ బొమ్మలు… ఎలా వదిలిపోగలం?
పందిరిమంచం మీద సొమ్మసిల్లి పడుకున్న పిల్లలు, వాళ్ళమీద చేతులేసుకుని వాళ్ళు- తమ అపురూపమైన సంపదలన్నట్టు అమ్మమ్మలు, నాన్నమ్మలు, తాతయ్యలు. ఎందుకో మనసు మూగబోయిన మనం బయట పడతాం ఉక్కపోతకు తట్టుకోలేని వాళ్ళంలా. వేణుగోపాల స్వామి గుడి వెనక కోనేటి మెట్ల మీద మౌనమై కూర్చుండిపోతాం. ప్రేమెరిగిన హృదయాలు నోటితో కాదుట మాట్లాడుకునేది. మౌనంగా సంభాషించుకుంటాయిట. మనకి పెళ్ళైన మూణ్నిద్రలప్పుడొచ్చాం కదూ ఇక్కడికి. అప్పుడు మనం అమ్మాయీ అబ్బాయిలం. ఇప్పుడో? అమ్మానాన్నలం.
నువ్వెందుకో నవ్వుతావ్! నేనందుకే సిగ్గుపడ్తాను. చేతిలో చెయ్యేసుకుని వచ్చేస్తుంటే చెరువు గట్టు మీద చెట్టు నీడ దిగులుగా వాలినట్టుంటుంది. చల్లటి శీతాకాలపు సాయంత్రపు తెమ్మెర దుఃఖం తెల్సిపోతూంటుంది. గుడి గోపురం మీద వాలిన గువ్వ రెక్క విదల్చక చూస్తూంటుంది.
ఇల్లు చేరే సరికి వాకిలి చిన్నబోతూ కనిపిస్తుంది.
తిరుగు ప్రయాణానికంతా సిధ్ధం. మావగారి ముఖంలో నవ్వు మాయం. అత్తయ్యగారి మోకాళ్ళ నొప్పులూ పునః ప్రారంభం. వెళ్ళొస్తాం నాన్నా అంటావ్. మళ్ళెప్పుడొస్తావు రా నాన్నా, అన్నట్టు చూస్తారు వాళ్ళు ఆశగా.
‘మీరేం దిగులుపడకండి. మనమెప్పుడిలా కలుసుకుంటే అప్పుడే సంక్రాంతి. రేపు ఉగాదికి మీరటువచ్చేయండి అత్తయ్యగారూ, మావయ్య గారూ,’ అంటూ నీవైపు చూస్తా. ‘నువ్వు కూడా చెప్పు,’ అన్నట్టుగా. అదిగో అప్పుడే మా అత్తయ్యగారు అంత దిగుల్లోనూ నెలలు లెక్కేస్తుంటారు.
అదీ, అలా గడిపేసి వద్దాం శ్రీ! మన కుటుంబాన్ని, మనవాళ్ళ ప్రేమానుబంధాల్ని శాశ్వతం చేసుకుందాం. ఏమంటావ్? నీ కళ్ళల్లో నవ్వుల తుంపరలేనా అవి? అందమైన భావాలకి భాష్యాలు నా కళ్ళల్లో ఆనంద బాష్పాలు…
వుంటా మరి? నీ ఫోన్ కోసం ఎదురుచూస్తూ…
నీ
నేను.