హృదయం ఇక్కడే వుంది!

నిజానికది ఆహ్వానం కాదు. అర్ధింపు. ‘ఒకసారి రాగలవా? ప్లీజ్,’ అంటూ!

మళ్ళీ ఇన్నాళ్ళకి విహారి నుంచి మెసేజ్. తను ఇచ్చిన అడ్రస్ చూశాను. మా వూరికి కొంత దూరంగా వున్న ఖరీదైన గెస్ట్ హౌస్ అది. వింటమే కానీ నేనెప్పుడూ చూసే అవకాశం రాలేదు, ఇప్పటిదాకా. ఇంకేమీ అడగకుండా వెంటనే బయలుదేరాను.

అప్పుడూ అదే మెసేజ్. అదే వాక్యం. ఎన్నేళ్ళు తనని వెంటాడింది? ఎంత ఆర్ద్రత నింపుకున్న అక్షరాలని అవి! ఆనాడు గండి తెగిన తన గుండెకి నన్నొక ఆనకట్టగా భావించాడేమో? జీవన్మరణ సంధిలో తననొక రాయబారిగా పంపాలనుకున్నాడేమో?! ఆరిపోతున్న తన ప్రాణజ్యోతికి నేనొక ఆసరాగా నిలుస్తానని ఆశపడ్డాడేమో? ఆ తర్వాత కదూ తనకు తెలిసింది!

మనసంతా మళ్ళా అప్పటి విషాదం చుట్టుకుంటోంది. వర్షం కురవని కరిమబ్బవుతోంది.

వెంటనే తులసి గుర్తొచ్చింది. తలొంచుకుని భాషే రాని మూగ దానిలా నా ముందు నుంచుని కనిపించింది.

విహారి. ఆ చీకట్లోకి వెళ్ళిపోతున్నప్పుడు ఒంటరిగా ఎంతగా కుంగిపోతూ కనిపించాడు? మిన్ను విరిగి వెన్ను మీద పడ్డవానిలా తలొంచేసుకుని, రెండు భుజాలు కుదించేసుకుని… తనకిక పగలన్నది లేదు, మిగిలింది అమావాస్య మాత్రమే అన్న వైనాన శోకమూర్తిలా రైలెక్కి వెళ్ళిపోవడం… ఎంత చేదయిన జ్ఞాపకం!

ఆ ఆఖరి దృశ్యం కళ్ళ ముందు మెదిలినప్పుడల్లా అదంతా, ఇప్పుడే కళ్ళముందు జరుగుతున్నట్టుంటుంది. నా ఆలోచన్లతో ప్రమేయం లేకుండానే నా చేతుల్లో స్టీరింగ్ వీల్ కదులుతోంది.


‘ఒక్క సారి రాగలవా? ప్లీజ్!’ విహారి మెసేజ్ చూసి వెంటనే ఫోన్ చేశాను.

“ఏమైందీ విహారీ?” ఆందోళనగా అడిగాను.

అవతల్నించి ఒక సెకనుపాటు నిశ్శబ్దం. నా మనసుకెందుకో భయమేసింది. చాలా, భయమేసింది.

“విహారీ, అంతా బాగానే వుందా?” మెల్లగా అడిగాను.

అవతలనించి ఒక్కసారిగా దుఖం పెల్లుబుకింది. “లేదు, గీతా. ఏమీ బాగాలేదు. తను నన్నిలా ఒదిలేసి వెళ్ళిపోవడం ఏమీ బాగోలేదు. ఏం చేయాలో తోచడం లేదు. అడిగితే కారణమూ చెప్పటం లేదు. గీతా! నువ్వొక్క సారి వెళ్ళి తనతో మాట్లాడవా? తను లేకపొతే, నేను… నే…ను చచ్చిపోతానని చెప్పవా! ప్లీ…జ్!” అతికష్టంతో ఆగిన స్వరం. సుడిగుండంలో పడి కొట్టుకుపోతున్న వారికి మిగిలిన చిట్టచివరి ఆసరాలా వుంది ఆ అవస్థ. వింటున్న నాకు ఏమీ అర్ధం కాలేదు. అతని దీనావస్థకి కంగారుపడి నిలువునా నీరైపోతూ అడిగాను.

“అసలేమైంది విహారీ?”

“తులసి పెళ్ళి చేసుకుంటోంది గీతా! నన్ను కాదని వేరే అతన్ని…”

మాట పూర్తి చేయలేక, వెక్కిళ్ళని నొక్కిపెట్టుకుంటున్నా వినిపిస్తూనే వుంది నాకు స్పష్టంగా. అతని గుండె ఎంత ఏడుస్తోందో! నోట మాట రానిదాన్నయిపోయాను. ఏమని చెప్పి ఊరడిస్తానని? జీవితంలో మగాడికెలాటి కష్టమొచ్చినా ఓదార్చి, ఊరుకోబెట్టొచ్చు. కానీ ప్రేమలో ఘోరంగా విఫలమైన ఒక సున్నిత మనస్కుడికి కలిగే దుఖాన్ని ఊరడించడానికి మాత్రం ఎంత స్నేహమూ చాలదు. ప్రేమికుణ్ని నిలువునా దహించివేసే అగ్ని జ్వాల అది. ఆమాటకొస్తే, ఎవ్వరి వల్లా కూడా సాధ్యమయ్యే పని కాదు బద్దలవుతున్న అగ్ని పర్వతాన్ని చల్లార్చడం.

ఒక గాయపడిన గుండెకి మందేమిటో, గాయం చేసిన వారికే తెలుస్తుంది. కానీ అప్పటికే, ఆ ఒక్కరు పిలుపందుకోలేని దూరంలో వుండిపోతారు. ‘కాలిన శవంలా బ్రతకడకొమొకటే మిగిలింది చెలీ, నువ్ రగిల్చి వెళ్ళిన ప్రేమాగ్నిలో’ అని అంటాడు ఒక కవి.

అప్పటికే నా మెదడు పనిచేయడం ఆగిపోయి చాలా సేపయింది. అందుకు రెండు కారణాలు. ఒకటి – తులసిపై నా అనుమానం నిజమైనందుకు. రెండు – విహారి ఇంత బేలవాడైపోతాడని అనుకోనందుకు.

ఎవరికైనా, పగిలే దాకా తెలుస్తుందా, హృదయం అద్దమని?


కాంపస్‌లో అతని కళ్ళు తులసి కోసం వెదుకుతున్నప్పుడు గమనిస్తుండే దాన్ని. చూపందనంత దూరం నించి ఒక చిన్న చుక్కలా కదలి వస్తున్నా, ఆ బిందువు తులసి అని ఇట్టే గుర్తుపట్టేసేవాడు. అతనికంత ప్రేమ! ఆ సంగతి అతనెప్పుడూ నోటితో చెప్పేవాడు కాడు. కాని, ఆ కళ్ళల్లోంచి పుట్టుకొచ్చే కాంతి, ఆమె దగ్గరౌతున్న కొద్దీ ముఖమంతా కమ్ముకునేది. చూపుల కాంతులే దీపాలు, ఆశల ఊపిరులే నీకై పూజించే పుష్పాలు. నా ధ్యానం నీ కోసం. నా ప్రాణం నీతో జీవించడం కోసం… – ఒకసారి కవిత రాశానంటూ మా ఇద్దరికి చదివి వినిపించాడు.

తులసి మాత్రం మామూలుగా వినేది. పట్టరాని సంతోషం, ఆశ్చర్యం వంటి భావాలు ముఖంలో కనిపించేవి కావు. బిడియం వల్ల కావచ్చు. కానీ, అతనంటే ఆమెకి ఓ ప్రత్యేకమైన ఇష్టం వుందన్న సంగతిని మాత్రం నా నించి దాచలేకపోయింది. బహుశా నాపైన నమ్మకం కావచ్చు. ఇలాటి కథలు కడుపులో పెట్టుకుని కాపాడేందుకో మనిషి కావాలి ఏ రహస్యమైన ప్రేమ కైనా! ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య అప్పుడప్పుడు అలకల తగవులొచ్చినప్పుడు – కారణాలు చెప్పుకునే తడిక పాత్ర పోషణకి ఒక మనసున్న మనిషి చాలా అవసరం కదా మరి.

ముగ్గురం స్నేహితులమే అయినా నాకు వారిద్దరితో ఉన్న బంధం కంటే వేరొక రకమైన బంధం వారిద్దరి మధ్య అని తెలిసిపోతూనే ఉండేది. అందుకే వాళ్ళు మాట్లాడుకోవడం కోసం, బీచ్ కెళ్ళినా, పార్క్ కెళ్ళినా కొంచెం పక్కకి తప్పుకుంటూ వుండేదాన్ని, నా బుక్స్ లోనో, హెడ్‌ఫోన్స్ పెట్టుకుని నాకు నచ్చిన పాటల్లోనో దాగిపోతూ. వెళ్ళడం ముగ్గురం కలిసే అయినా, జంటగా మాత్రం వాళ్ళిద్దరూ కలిసి షికార్లు కొట్టేవాళ్ళు. ఏదో విలువైనది వెతుక్కోవడం కోసం వెళ్తున్నట్టుండేది వాళ్ళిద్దరూ కలిసి నడిచే విధానం! సముద్రం తీరం వెంట మాట్లాడుకుంటూ, మాట్లాడుకుంటూ అలా పోతూ వుండేవారు. మధ్యమధ్యలో అతను వొంగి, రంగు రాళ్ళనో అరుదైన శంఖాలనో ఏరి ఆమెకిస్తుండేవాడు. ఆమె వాటిని అపురూపంగా అందుకుని, పరిశీలిస్తూ ఆగిపోయేది. కొన్ని క్షణాల్లో తిరిగి నడక సాగించే వాళ్ళు. ప్రేమించుకునే వాళ్ళకి వాళ్ళది మాత్రమే ఒక లోకంగా తోస్తుంది. నా ముందు దాచుకునేవారూ కాదు, అలా అని పైకి చూపించేవారూ కాదు.

నాకు నవ్వొచ్చేది ఈ జంటనిలా చూసినప్పుడల్లా. తాగిన వాని చేష్టలు తాగని వారికి వినోదం అయినట్టు. ఇద్దరూ స్నేహితులే, ఆప్తులే. ఆనందంగానూ ఉండేది. నేనిక్కడ వెనక్కి వాలి, ఇసుకలో చేతులు ముంచి, వెనక నించి ఆ వాళ్ళను అలా చూస్తుండేదాన్ని. గవ్వలేరుకునే ఈ మాత్రం సరదాకి అంతదూరం… నడచి నడచి పడి పోవాలా? కాదు. అప్పటి దాకా కాస్త దూరం దూరంగా నడుస్తున్న ఆ ఆకారాలు మెల్లమెల్లగా దగ్గరకి జరిగేవి. అతని చేయి మెల్లగా ఆమె చేతినందుకునేది. ఆమె తల అతని భుజం మీద వాలేది. పడమటి సూర్యుడు వాళ్ళిద్దరి మీంచి జారిపోతూ చేయి తిరిగిన చిత్రకారుని చేతిలోంచి జారిన రెండు వొంపుల గీతల్లా మార్చేవాడు ఇద్దరినీ.

హబ్బ! ఎంత బావున్నారీ జంట, లైలా మజ్ఞూల్లా!

ఒకసారి ఇలానే, ఓ సాయంత్రం బీచ్ కెళ్ళినప్పుడు – వాళ్ళకి తెలీకుండా ఫోటో తీసి చూపించాను. విహారి ముఖం వెలిగిపోయింది. తులసి మాత్రం కంగారు పడింది. ఎందుకు ఇదంతా? అంటూ కోపగించుకుంది. ఆ కళ్ళల్లో ఆనందానికి బదులు ఆందోళన చోటు చేసుకోవడం ఆశ్చర్యమేసింది. నన్ను ఆలోచనలో పడేసింది.

ప్రేమ అనేది ఒక తీపి పదార్ధం. ఇద్దరిలో ఎవరిష్టపడకున్నా, అది చేదైపోవడం ఖాయం. తులసికి అతనంటే వుండే ఇష్టంలో ఏదో తేడా వుందనిపిస్తోంది. ఊహుఁ, కాదు. అలా అయివుండదు. ఆమెని అర్ధం చేసుకోవడంలో నేనే పొరబడ్డానేమో? నాకు నేను సర్దిచెప్పుకున్నాను. ఆ తర్వాత మరి కొన్ని సందర్భాలలో మరింత పట్టుబడింది. తల మీద అప్పుడే తీగలెత్తుకుంటున్న లేత మొలక తులసి. దగ్గరగా ఏ ఆధారం దొరికినా చాలేమో అల్లుకోడానికి. కానీ, విహారి అలా కాదు. చాలా స్థిరమైన గట్టి గుంజ లాంటి వాడు. తనచుట్టూ అల్లుకున్న తీగని పందిరిగా చేసుకుని బ్రతుకుదామని కలలు కంటున్న వాడు.

అందరిలో వున్నప్పుడు – అతనితో టచ్ మీ నాట్‌లా ఏమీ ఎరగనట్టుండే తులసి, ఎవరూ లేనప్పుడు అతనితో మమేకమై కబుర్లు చెప్పే తులసి, ఒక్కరు కాదనే నిజాన్ని నేనెప్పుడూ పైకి చెప్పే సాహసం చేయలేకపోయాను. కనీసం ప్రయత్నమైనా చేయలేదు. అదే నే చేసిన పెద్ద తప్పేమో విహారి విషయంలో. కనీసం ఒక హింట్ అయినా ఇచ్చి వుంటే అతను కొంత వరకు జాగ్రత్త పడేవాడేమో? తులసి కళ్ళలో కనపడే ప్రేమ ఎంత నిజమైందో నాకూ తెలుసు, చెప్పలేక పోయాను, అందుకేనేమో.

అనుకుంటాం కానీ, అసలు ప్రేమించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు, కొందరి హెచ్చరికలు, మరి కొన్ని సూచనలు సలహాలు చూసి, చదివి, విని భద్రకవచాలు ధరించి ప్రేమలో పడతారా ఎవరైనా? అసలా మాటకొస్తే, ఈత రాని వాడు నీళ్ళలోకి దూకితేనే ఈది ఒడ్డుచేరతాడట. వలపు ఈదులాటా అంతే. ప్రేమలో విఫలమైన వాడు ఆ మునకలో మరణించడానికైనా సిద్ధపడతాడు కానీ, ప్రాణాల కోసం ఒడ్డున పడదాం అని అనుకోడు. అలాటి మానసిక స్థితిలోని ప్రేమికునికి ఈత వచ్చినా దండగే కదూ? ఖుస్రో అన్నట్టు దరియా ప్రేమ్ కా ఉల్టీ వా కీ ధార్, జో ఉతరా సో డూబ్ గయా, జో డూబా సో పార్. నాలో నేనే విశ్లేషించుకుంటూ నన్ను నేను సమాధానపర్చుకునే ప్రయత్నం చేశాను.

ఏదైనా కాని, ఇది వాళ్ళ జీవితానికి సంబంధించిన విషయం. ఎంత స్నేహితులమైనా నా జోక్యం కొన్ని విషయాలలో తగదు. అందుకని వాళ్ళని ఏ రకంగానూ ఏమీ అనకుండా నా దూరం నేను పాటిస్తూనే వచ్చాను.

కానీ ఇప్పుడు విహారి బాధ చూసి నా మనసు భగ్గుమంది. కోపం హద్దులు దాటింది. వెంటనే ఉన్నదాన్ని వున్నట్టు బయల్దేరాను. పట్టలేని కోపంతో ఆఘమేఘాల మీద తులసి ఇంటికెళ్ళాను. లాక్కెళ్ళి విహారి కాళ్ళ మీద పడేయాలన్నంత ఉద్వేగంతో బయల్దేరాను. ఎందుకంటే – ఆ అమాయకుడికి, ఆ ఆరాధకుడికి జరుగుతున్న అన్యాయానికి ఏకైక బాధ్యురాలు తులసి అన్న సంగతి నాకొక్కదానికి మాత్రమే తెలుసు కాబట్టి.