నువ్వెళ్ళిపోయాక
అడవీ వెళ్ళిపోయింది
ఒక్క ఆకూ లేక తడార్చుకున్న ఎండు కొమ్మ తప్ప.
కాని నీకు తెలీదు, ఎన్నెన్ని జ్ఞాపకాల విత్తుల్ని ఇక్కడ విసిరి పోయావో.
ఒక్కో కన్నీటి బిందువుని దోసిళ్ళలో ఒడిసి – గుండె నేలన జల్లుకుంటూ
మళ్ళీ మొలకెత్తించుకున్న ఆశల ఇగురులివి.
ఊపిరులూదుకున్న లేత రెమ్మలివి.
క్షణాలే రోజులవుతూ మొక్కపక్కన మొక్కగా
ఎన్నేసి పచ్చటి చెట్లయ్యాయో!
చెక్కిళ్ళ నద్దుకుంటూ ప్రిదిలి పరిమళిస్తున్న లతాంతాలు
తేనియకోసం విహరిస్తున్న భ్రమరాలు
చెలువుమీర చేయి చాస్తూ ఒక సెల
కొండ కాలువ మీంచి వీస్తూ ఒక తెమ్మెర
విహరిస్తూ ఒక చంద్రశాల.
మదిని తుళ్ళిస్తూ మధురోహలు పూయిస్తూ
నా ఉద్యానవనం నడుచుకుంటూ నాకై వొచ్చేసింది.
అడవంత పచ్చదనం ఒళ్ళంతా పరచుకుంది.
ఇప్పుడిక్కడ-
పయ్యధరం మీద కెందామరలు పూస్తున్నాయి.
విచ్చుకున్న పెదవులు మల్లెపూలకి మందారలు తొడుగుతున్నాయి.
మది కోయిల కొత్త గొంతు కోసం మావి చిగురు మేస్తోంది.
నెమలి పిల్లకి కాలు నిలవక ప్రతి అడుగూ నాట్యమౌతోంది.
నాకు మళ్ళీ గుర్తొస్తోంది-
నువ్వొచ్చిన ఆ కాలమే ఇదనీ
చప్పున గుండె చప్పుడు ఆగి వెళ్ళిందనీ.
అయినా… మళ్ళీ ఆశ! నిరాశపడాలని.
వలపు విలాపాలని, విషాదాల బాష్పాలతో
ప్రేమ గాయాల తీపి బాధల భాష్యమేదో లిఖించుకోవాలని.
ఆశగా ఎదురుచూస్తూ… నిలబడి వున్నా
నువ్వొచ్చి వెళ్ళాక నిరాశపడటం కోసం!
నీ పేరు గ్రీష్మం – నీదెప్పుడూ అదే తీరు.
నా పేరు హర్షం – నాదెప్పుడూ ఇదే వూరు.