పడవ మునుగుతోంది

మా పడవ మునిగి పోతుంది. మాక్కావల్సిందీ అదే! కూర్చున్న కొమ్మనే నరుక్కునే మూర్ఖులుంటారా? నడి సముద్రంలో ఒడ్డుకు చేర్చగల ఏకైక ఆధారమైన పడవకి రంధ్రాలు చేసి చేజేతులా ముంచుకునే తెలివి తక్కువ మనుషులు వుంటారా? అయ్యా! అది తెలివి తక్కువతనం కాదు! దౌర్భాగ్యం. నిజానికి బ్రతుకే ఒక చిల్లి పడవలా వున్నప్పుడు, ఏం చేయగలం?

అమ్మ గుర్తొస్తోంది. చిన్నప్పుడు “ఆడి అమావాస్య” తరువాత కళ్యాణి నది లో అమ్మ మూడు మునకలు వేయమన్నప్పటి రోజు గుర్తొస్తోంది. మునిగి పోతానన్న భయం. పుణ్యం వస్తుందన్న ఆశ. ఇప్పుడూ సరిగ్గా అదే భయం, అలాంటిదే ఆశ.

దేశానికీ దేశానికీ మధ్య సరిహద్దులేమిటో, ఆ సరిహద్దులకోసం పోట్లాటలేమిటో, ఆ హద్దు దాటి పరాయి వారిని లోపలికి రానిస్తే వచ్చే కష్టాలేమిటో ఎంతకూ అర్ధం కాదు నాకు. తనకంటూ ఒక సొంత దేశంలేని నాలాంటి దురదృష్టవంతులకే అర్ధం కాదేమో.

నింగి, నేల, గాలి, వెలుగు అందరి సొత్తేనని చిన్నప్పుడు ఏదో కవిత చదివినట్టు గుర్తు. మరైతే మిగతా మనుషుల్లాగా నింగి నీడలో, స్వేచ్ఛగా గాలి పీలుస్తూ జీవితంలో వెలుగు నింపుకోవాలని కోరుకునే మాకు కాస్తా నేల ఆసరా దొరకనివ్వరెందుకని? మీ నేల మీద పని చేస్తున్న మిగతా మనుషుల్లాగా మేమూ కష్టపడి పనిచేస్తాం. మా తిండి మేం సంపాదించుకుంటాం. చేతనైతే మిగతావారికి సాయపడుతామని చెప్తే ఒప్పుకోరా? ఏవో వీసాలు, పాస్పోర్టులు కావాలంటారట. నిజానికి మాకూ అలాగే ఆ వీసాలూ పాస్పోర్టులతో సగర్వంగా, దర్జాగా ఈ నేలలోకి ప్రవేశించాలనే వుంటుంది. ఇలా దొంగ చాటుగా ఇంకొకళ్ళ దేశంలోకి జొరబడాలని ఎవరికి మాత్రం ఎందుకు వుంటుంది? మరి మేమింకేమిటి చెయ్యటం? ఈ దారి కాకపోతే చావొక్కటే దిక్కు మాకు. చచ్చిపోవాలనీ అనిపించటం లేదు.

అదే అన్నిటికంటే ఆశ్చర్యం నాకు. పుట్టినప్పటినించీ ఒక్క రోజు కూడా సుఖ పడ్డది లేదు నేను. మనశ్శాంతితో ఆదమరిచి నిద్ర పోయిందీ లేదు. ఒక్క పూటైనా కడుపు నింపుకోవటం, చావకుండా ప్రాణాలతో ఇల్లు చేరటం, ఇవి రెండే ఒక రోజులో మేం చేయగలిగిన పనులు. ఇంతోటి బ్రతుకు, అది వుంటే ఎంత, లేకుంటే ఎంత? ఇలా కొన్నిసార్లు వైరాగ్యం వచ్చినా మళ్ళీ అంతలోకే ఏదో ఆశ పైకి తంతుంది! రోజులు మారకపోవు, మళ్ళీ మేమూ మంచి రోజులు చూసి ప్రపంచంలో అందరు ప్రజల్లా సుఖంగా శాంతిగా వుండకపోమూ అని!

నా చిన్నతనం — అది చిన్నతనమా? నరకమంటే సరిగ్గా సరిపోతుంది. అంత అందమైన ప్రదేశంలో అంత వికృతమైన జీవితం గడపొచ్చని ఎవరైనా అనుకుంటారా? మనుషులు యుద్ధం మొదలు పెట్టింతరువాత వాళ్ళా యుద్ధాన్ని ఎందుకు మొదలు పెట్టారో మరిచిపోతారో ఎమో!

ఎన్నో తరాల కింద తేయాకు తోటల్లో పని చేయటానికి భారత దేశం నించి వచ్చి స్థిరపడ్డాం మేము; ఈ భూభాగం మాదే అంటారు మా వాళ్ళలో కొందరు. మరి లేకపోతే స్థానిక ప్రభుత్వం అణచివేత నించి మాకు రక్షణ ఎక్కడిది? తప్పో ఒప్పో ఈ అభిప్రాయాలతో మొదలైన సంఘర్షణ ఇప్పుడు కేవలం “నీ కంటే నేనే ఎక్కువ మందిని చంపాను” అన్న పోటీ లోకి దిగింది. తమపై జరుగుతున్న అన్యాయాలకూ, అకృత్యాలకూ కడుపు మండి మొదలుపెట్టిన తిరుగుబాటు, ఎవరు, ఎందుకు, ఎవర్ని చంపుతున్నారో అర్ధం కాని సంకుల సమరంగా మారి పోయింది. ఎన్నెన్ని జీవితాలు, ఏ ప్రయోజనం లేకుండా, ఏ సంతోషమూ పొందకుండా ఎంత అర్ధాంతరంగా, భీకరంగా అంతరించి పోయాయో లెక్క పెట్టే ఓపిక కూడా పోయింది.

కొంత మంది వీలయినంత వరకూ ఇతర దేశాలకు వలస వెళ్ళి పోయారు. పోయిన వాళ్ళు పోగా, యుద్ధ భూమిలో చావుకీ బ్రతుక్కీ మధ్య ఊగిసలాడే క్షతగాత్రుల్లా మేం మిగిలాం. పది పదిహేనేళ్ళ కింద మగ పిల్లలు యుద్ధంలోకి వెళ్ళి చచ్చి పోతే ఆడ పిల్లలకి పెళ్ళిళ్ళెలా అని బెంగ పడేవాళ్ళట. ఇప్పుడా భయం కూడా లేదు. ఎందుకంటే ఆడా మగా చిన్నా పెద్దా అందరం యుద్ధ దేవత పూజారులమే, ఆమె బలిపీఠం మీద వేటు కోసం ఎదురుచూస్తున్న మేకలమే!

చిన్నప్పుడు మంచిదో చెత్తదో ఓ స్కూలు కెళ్ళేవాడిని. స్కూల్లో స్నేహితుల్లో, చుట్టాల్లో, ఎవరు, ఎవరి చేతిలో, ఎందుకు, ఎప్పుడు చచ్చి పోతారో తెలియని పరిస్థితి. ఇవాళ కాకపోతే రేపైనా చావక తప్పదని అందరికీ తెలుసు. కానీ ప్రతీ క్షణం ఇదే ఆఖరి క్షణమేమో అనుకుంటూ ఎలా బ్రతకటం? అసలు చదువు మీద కూడా మనసు నిలిచేది కాదు. స్కూలంటే స్కూలూ కాదు. మా వాళ్ళే నడిపే ఒక చిన్న బడి. తమిళ అక్షరాలూ పద్యాలూ పాటలూ నేర్చుకునే వాళ్ళం. మర్నాడే టీచర్ని కాల్చి చంపేసారని వార్త వచ్చేది. ఇంకొక టీచరు, ఇలా అస్థిమితంగా రోజులు గడిచేవి.

ఒక స్థాయిలో శత్రువులనే కాదు, మా వాళ్ళని చూసి భయపడే పరిస్థితి వచ్చింది. స్కూలు కెళ్ళే పిల్లలని కూడా యుద్ధం లో చేరమంటే ఎలా? మా స్కూల్లో ఎంత మంది పిల్లలు ఈ యుద్ధంలో చచ్చి పోయారు? ఎప్పుడూ ఒకటే ప్రశ్న- “మాతో చేరి యుద్ధం లో చస్తారా లేకపోతే సైన్యం చేతిలో చస్తారా?” ఏ రాయైతేనేం పళ్ళూడ గొట్టుకునేందుకు? మా ఇంట్లో నాన్న కూడా చచ్చిపోయి నేనూ అమ్మ మాత్రమే మిగలటంతో నన్నొదిలేసారు. కానీ ఏడాది కింద ఒక రోజు నాకూ తాఖీదొచ్చింది, రమ్మని. భయంతో గుండెలు టారెత్తిపోయాయి. అసలే పిరికి వాణ్ణేమో, గడ గడా వణికి పోయాను. సరేనని ముందుకెళితే నాలుగు రోజుల్లో చావు తప్పదు. వెళ్ళనంటే ఇప్పుడే చావు తప్పదు. భగవంతుడా, ఇప్పుడేది దారి అనుకున్నాను.

సెల్వమణి గుర్తొచ్చాడు నాకు. నాకంటే అయిదేళ్ళు పెద్దవాడు సెల్వమణి. రెండేళ్ళ కింద ఇలాగే తనకీ యుద్ధంలో చేరాల్సిన పరిస్థితొస్తే, రాత్రికి రాత్రే పారిపోయాడు. ఎలా చేరుకున్నాడో ఏమో కాని, న్యూజీలాండ్‌ చేరుకున్నాడట. ఆ దేశ పౌరసత్వం తీసుకుని, సుఖంగా శాంతిగా వున్నాడట. రెండేళ్ళలో ఎన్ని ఉత్తరాలు రాశాడో కానీ, ఒక్కటైతే నాకు చేరింది. అంతే, నేనూ ఇల్లొదిలి పారిపోవాలని నిశ్చయించుకున్నాను. మా అమ్మనొదిలి పోవాలంటే ప్రాణాలు తోడేసినట్టుగా వుంది. కానీ అమ్మ కూడా నా నిర్ణయాన్నే బల పరిచింది. ఉన్న ఒకే ఒక్క ఆధారం నేను, అమ్మకి. నేనొదిలి వెళ్తే ఎలా తట్టుకుంటుంది? ఈ ప్రశ్న అడిగితే అమ్మ అదొకలా నవ్వింది. ఆ నవ్వు చూసాక కానీ అదెంత అర్ధంలేని ప్రశ్నో తెలిసొచ్చింది నాకు. “నా కళ్ళ ముందు లేకున్నా, ఎక్కడో ఒక దగ్గర నువ్వైనా ప్రశాంతంగా, ప్రాణాలతో వుంటే అంతే చాలురా!” అంది కానీ, ఆ రాత్రంతా అమ్మా నేనూ నిద్ర పోలేదు.

రెండ్రోజుల తరువాత కానీ రామేశ్వరం వెళ్ళే పడవలో చోటు దొరకలేదు నాకు. ఆ పడవలో ఏ క్షణంలో ఏమవుతుందోనని బిక్కు బిక్కు మంటూ రామేశ్వరం చేరుకున్నాం. భారత నౌకా దళం మమ్మల్ని వెంటబెట్టుకుని భారతీయ ఇంటెలిజెన్స్‌ విభాగాని కప్పగించారు. ఆ తరువాత ధనుష్కోటి పోలిస్‌ స్టేషంలో రిజిస్ట్రేషన్‌ చేసి మండపం కేంప్‌ కి తీసుకొచ్చారు.

ప్రాణలు దక్కించుకుని బయటపడ్డామని సంతోషించినా, ఈ ప్రాణాలతో ఏం చేయాలో అర్ధం కాని అయోమయం మొదలయింది కొన్నాళ్ళలో. కేంపులో దాదాపు ఖైదు లాగానే వుండేది. ఇంకొద్ది రోజుల తరువాత కేంప్‌ లో బ్రతుకు దుర్భరమనిపించింది. మా స్నేహితులు భారత ప్రభుత్వాన్ని తిట్టే వారు. ప్రాణాలరచేతిలో పెట్టుకుని పారిపోయి బిచ్చగాళ్ళలా వచ్చిన వాళ్ళం, మాకేమి హక్కులు వుంటాయి అనిపించేది నాకు. ఇక్కడ రెఫ్యూజీ కేంపులో బాత్రూములు సరిగ్గా లేవని, పాములు తిరుగుతుంటాయనీ ఎవరిని తిట్టి ఏమి లాభం?

మా పరిస్థితికి ఎవరిని తిట్టలేమూ, మేమూ ఏమీ చేయలేము. అన్నిటికంటే ఈ నిస్సహాయత నన్నెక్కువగా విసిగించేది. మనిషిని బాధ పెట్టేదీ, మనశ్శాంతి దోచుకునేది సమస్య కాదు, అది ఎంత పెద్దదైనా సరే! నిజమైన బాధ సమస్యని తీర్చుకునే అవకాశం లేకపోవటం. కొద్ది రోజుల తరువాత ఆ కేంప్‌ లోంచి బయటపడి మామూలు మనుషుల్లా సంఘ జీవనం ప్రారంభించాలన్న కోరిక తీవ్రమయింది. పదేళ్ళ కింద ఈ కేంపుకి చిన్న పిల్లల్లా వచ్చి ఇప్పుడు ఇక్కడే పెళ్ళాడి బ్రతుకుంతున్న వారెందరో. నేనూ వాళ్ళలా ఇక్కడే బ్రతుకుతానా? నాకా ఊహే యేం బాగాలేదు. చిన్నదో పెద్దదో నాకంటూ ఒక ఉద్యోగం, తప్పులో ఒప్పులో నిర్ణయాలు తీసుకునే అవకాశం, మంచిదో చెడ్డదో నాదే ననిపించే జీవితం, కావాలని ఎంతో ఆశగా అనిపించేది. కొన్ని కొన్ని సమయాల్లో, ఆ కేంపులోని సురక్షిత జీవితం కంటే మా వూళ్ళో దిన దిన గండమే నయమనిపించేదేమో!

ఎలాగయితేనేం, ఒక రోజు ఇద్దరు స్నేహితులతో కలిసి ఆ కేంప్‌ నించి పారిపోయాను. చిన్నా చితకా పనులు చేసుకుంటూ జన ప్రవాహంలో కలిసిపోతే, మామూలు భారతీయుల్లా స్వేఛ్ఛగా బ్రతకొచ్చన్న ఆశే మాకా శక్తినిచ్చింది. కానీ ఎలా పసిగట్టారో ఎమో, పోలిసులు మా వాసన పసిగట్టి మా కోసం వేట మొదలు పెట్టారు. ఈ సంగతి మేము సరుకులు కొనుక్కునే దుకాణ దారు మాణిక్యం చెప్పగానే ఏడుపొచ్చింది నాకు. మా పూర్వీకులు ఇక్కడి వాళ్ళే కదా, మమ్మల్ని మామూలుగా వదిలేస్తే ఇక్కడి తమిళులలాగే బ్రతుకుతాం కదా! మమ్మల్ని విదేశీయుల్లాగా వేరు చేయటం అంత అవసరమా అనిపించింది.

ఎన్నో సార్లు దేవుడికి మొక్కుకున్నాను, “దేవుడా! నాకు ఒక్క అవకాశమివ్వు. మామూలు జన స్రవంతిలో కలిసిపోవటానికి. ఉగ్రవాదం జోలికి కానీ మరే ఇతర గొడవల జోలికి గానీ పోకుండా ప్రశాంతంగా బ్రతికి, వీలయితే నా పక్క వాళ్ళకి చేతనయిన సహాయం చేస్తాను”, అని. దేవుడు నా కోరిక తీర్చేటట్టు కనపడలేదు. ఇక అక్కడ బ్రతకలేమని తెలిసి, ఇంకొక పడవ ఎక్కి పారిపోయాం. నా దగ్గరున్న డబ్బు ఆ పడవ కిరాయికి బొటాబొటిగా సరిపోయింది. తిండి కోసం పడవ మీద పని చేస్తానని ఒప్పుకున్నాను. ఎలాగైనా ఈ పడవ మీద ఇండోనీషియా చేరితే, అక్కడినించి ఆస్ట్రేలియా చేరుకోవటం పెద్ద సమస్య కాదన్నాడు పడవ కేప్టేన్‌. రామేశ్వరం నించి ఒక పడవ ఎక్కి ఇండోనీషియా చేరుకున్నాము. ఈ పడవ ఎప్పుడు మునిగిపోతుందోనన్న భయం పీడిస్తున్నా, భయపడుతూ బ్రతకటం అలవాటై పోవటం వల్ల పెద్ద ఇబ్బందేమీ అనిపించలేదు. ఇండోనీషియా నుండి ఇంకొక చిన్న పడవలో ఆస్ట్రేలియా తీరానికి బయల్దేరాము. ఆస్ట్రేలియా దేశ జనాభా చాలా తక్కువనీ, కష్టపడి పనిచేసే వారికి చోటు వుంటుందనీ విన్నాను. ఇమ్మిగ్రేషన్‌ అధికారుల కళ్ళు గప్పి ఏదైనా పెద్ద నగరం చేరుకుంటే చాలు. భారతీయ తమిళులవో లేక పొతే శ్రీలంక సంతతి వాళ్ళవో కాళ్ళు పట్టుకుంటాను, అని నాకు నేనే చాలా సార్లు ధైర్యం చెప్పుకున్నాను.

కానీ భయపడ్డంతా అయింది. ఆస్ట్రేలియా నౌకా దళానికి చెందిన పెట్రోల్‌ బోట్లు మా పడవని తీరానికి చేరకుండా అడ్డు పడ్డాయి. ఏం చేయాలో ఎవరికీ పాలు పోలేదు. ఎక్కడైనా తీరానికి చేరి, ఇమిగ్రేషన్‌ అధికారులు పట్టుకుంటే “డిటెన్షన్‌ సెంటర్‌” లో వేస్తారు. ఈ సెంటర్లు పెర్త్‌ లో, మెల్బోర్న్‌లో, సిడ్నీలో, క్రిస్మస్‌ దీవి లోనూ వున్నాయి. ఆ డిటెన్షన్‌ సెంటర్లో వుంచి వీసా కార్యక్రమాలు పూర్తి చేస్తారని విన్నాము. కానీ దేశ తీరం చేరితే మానవతా దృష్టితో వీసా లివ్వక తప్పదు. అందుకే ఇలాటి పడవలని తీరం చేరనివ్వరని చెప్పాడు కేప్టెన్‌. ఆస్ట్రేలియా నౌకా దళం మమ్మల్ని తీరానికి పన్నెండు మైళ్ళ కవతలే నిలబెట్టి కాపలా కాస్తున్నారు.

“అసలు మమ్మల్ని రానిస్తే వచ్చే నష్టమేమిటి? జనాభా చాలా తక్కువటగా?” అమాయకంగా అడిగాను కేప్టెన్ని.

“అలా ఎంత మందికని వీసాలిస్తూ పోతారూ? నిరంకుశ ప్రభుత్వాన్నించి తప్పించుకునే వాళ్ళకి కాందిశీకుల్లా వీసా ఏర్పాట్లు వుంటాయి. ఈ విషయం తెలిసి కొన్నిసార్లు పాకిస్తానీలు, వీసా కోసమని ఆఫ్ఘానిస్తాన్‌ నించి తాలీబాన్ ల తాకిడి నించి తప్పించుకొని వచ్చామని అబద్ధాలు చెప్తున్నారట. అందుకే అప్పట్నించీ డిటయినీలకి వీసాలివ్వటం మీద ప్రభుత్వం ఆంక్షలు విధించింది.”

“మేమూ యుద్ధం నించి పారిపోయి వస్తున్నాం కాదా, మేము కాందిశీకులం కాదా?” కేప్టెన్‌ ఏమీ జవాబివ్వలేదు.

“దేశానికి దేశానికీ మధ్య సరిహద్దులూ, పౌరసత్వపు చికాకులూ ఎందుకు?” నిస్సహాయంగా అడిగాను.

“ఎందుకంటే వనరుల కోసం పోటీ లేర్పడ్డప్పుడు ఇదే పౌరులు ఒకళ్ళనొకళ్ళు నరికేసుకుంటారు కాబట్టి!”

ఆ సంగతి మాకంటే బాగా ఎవరికి తెలుసు?

ఇప్పుడు ఒక్కటే దారి. ఈ పడవతో సహా మేం మునిగి పోవటం! అప్పుడు కూడా మమ్మల్ని రక్షించకపోతే మానవ హక్కుల సంఘం ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తుంది. ఇంతకు ముందు ఒక పడవలోంచి చిన్న పిల్లల్ని ఇలాగే సముద్రం లోకి విసిరేసారట! కేప్టెన్‌ ఈ సంగతి చెప్పగానే మేము పడవని ముంచేసే ప్రయత్నం మొదలు పెట్టాం. నాకైతే ఇక పోరాడే ఓపిక నశించింది. బ్రతుకు మీద అన్ని ఆశలూ వదిలేసుకున్నాను. పడవ మునిగినా నేను చచ్చిపోయినా, ఏమైనా నాకు ఖాతరు లేదన్న విరక్తి కలుగుతోంది. పడవ మునుగుతోంది.

అమ్మ గుర్తొస్తోంది! కళ్యాణి నదిలో వేసిన మునకలు గుర్తొస్తున్నాయి!

[ఆస్ట్రేలియాలో ఉంటున్న కొంతమంది శ్రీలంక తమిళ శరణార్థులతో మాట్లాడిన తరువాత — రచయిత]

శారద

రచయిత శారద గురించి: ఆస్ట్రేలియా ప్రభుత్వోద్యోగిగా పనిచేస్తూ, బ్రిస్బేన్ నగరంలో నివసించే శారద తెలుగులో, ఇంగ్లీష్‌లో కథలు, అనువాదాలు రాస్తూ వుంటారు. నీలాంబరి అనే పేరుతో వీరి కథల సంపుటి ప్రచురించారు. ...