Comment navigation


15541

« 1 ... 1504 1505 1506 1507 1508 ... 1555 »

  1. పద్యాలు – వాడుకభాష గురించి Kameswara Rao గారి అభిప్రాయం:

    01/30/2007 11:27 am

    నిజమే, గ్రాంధిక భాషకీ వాడుకభాషకీ మధ్యనున్న భేదాన్ని వివరించడం శ్రమతో కూడుకున్న పనే. అసలు గ్రాంధిక భాషనీ, వ్యావహారిక భాషనీ సరిగ్గా నిర్వచించాలంటేనే అనేక సమస్యలున్నాయి. వాడుక భాషకి ఒక కాలపరిమితిలోనే లక్షణాలు చెప్పుకోగలం, అది నిత్యం మారుతూ ఉంటుంది కాబట్టి. గ్రాంధిక భాష అంటే, గ్రంథస్థమైన భాష అన్న నిర్వచనం చెప్పుకుంటే, అదీ కాలంతోపాటు మారుతూ ఉంటుంది. గాంధిక వ్యావహారిక భాషా వాదాలు నడచిన కాలంలో, గ్రాంధిక భాషంటే ప్రాచీన కావ్యాల ఆధారంగా రూపొందించిన కొన్ని వ్యాకరణాలకి బద్ధమైన భాష అనీ, వ్యావహారిక భాష అంటే ఆ వ్యాకరణాలకి బద్ధం కానిదనీ నిర్వచించుకున్నారు. ఐతే అటువంటి వ్యాకరణాలకి విరుద్ధమైన ప్రయోగాలు కావ్యాలలో ఉండడం అటు గ్రాంధిక భాషా వాదులు, ఇటు వ్యావహారిక భాషా వాదులూ కూడా గుర్తించారు. ఐతే గ్రాంధిక భాషంటే కేవలం సంస్కృత పదభూయిష్టమైన రచనే కాదన్నది నిర్వివాదం. శివుడిని “అరపదిమోముల దయ్య”మనడం వ్యవహార దూరమే కదా, అంచేత అది గ్రాంధిక భాషే అవుతుంది. ఒక రకంగా ఆలోచిస్తే వాడుకభాష ఎప్పుడైనా గ్రాంధిక భాష కావచ్చు. కానీ గ్రాంధిక భాషలో కొన్ని పదాలూ, లక్షణాలూ ఎప్పటికీ వ్యవహారంలోకి రానివీ, వ్యవహార దూరమైనవీ ఉంటాయి.

    గ్రాంధికభాష అంటే గ్రంథస్థమైన భాష అని చెప్పుకుంటే, అది వ్రాసే భాష అవుతుంది. అప్పుడు వాడుకభాషంటే మాట్లాడుకునే భాష అని నిర్వచించుకోవాలి. ఐతే ప్రాచీన కాలంలోని కావ్యేతరమైన లిఖిత సాహిత్యాన్ని పరిశీలిస్తే, అది కావ్య భాషకి భిన్నంగా కనిపిస్తుంది.

    ఈ రకంగా గ్రాంధిక, వ్యవహార భాషల నిర్వచనాలగురించే చాలా చర్చ చెయ్యవచ్చు. భాషా శాస్త్ర అభిమాన్లు గ్రాంధిక, వ్యవహార భాషల్లో కాలానుగుణంగా వచ్చిన మార్పులని పరిశీలించ వచ్చు.

    ఇవన్నీ నా వ్యాసానికి ముఖ్యం కాదని నేననుకోవడం వల్ల ఈ విషయాల్లోకి వెళ్ళలేదు. నేను ప్రథానంగా చర్చించాలనుకున్నది – ఈ కాలంలో పద్య కవిత్వం రాయాలంటే, ఇప్పటి వాడుకభాషను ఎంతమేరకు ఉపయోగించ వీలవుతుంది? ప్రాచీన కావ్య భాష అనువైనంతగా నేటి వాడుక భాష పద్యాలకి తగుతుందా? దీనికోసమే వాడుక భాష అంటే గత వంద సంవత్సరాలుగా వాడుకలో ఉన్న భాష అని అన్నాను. గ్రాంధిక భాషకి తాత్కాలిక నిర్వచనం (ఇది చేరాగారి దగ్గరనుండి నేనరువుతీసుకున్న పదం) మాత్రమే ఇచ్చి, ఆ భాషలో కనిపించే లక్షణాలని ప్రస్తావించాను. ప్రాచీన కావ్య భాష కూడా నన్నయ్య నుండి, విశ్వనాథ వరకూ మార్పులు పొందుతూ వచ్చినా కొన్ని ప్రధానమైన లక్షణాలను మాత్రం కోల్పోలేదు. వాటినే నా వ్యాసంలో ఉపయోగించుకున్నాను. అధికమైన పద సంపద, “-‌న్”, “-ల్” వంటి ప్రత్యయాలు మొదలైనవి. అలాగే వాడుక భాషలోని ప్రధానమైన లక్షణాలని ప్రస్తావించాను – నామవాచకాలలోని “ము” సున్నాగా మారడం, విసంధి మొదలైనవి.

    ఆధునిక పద్య కవిత్వాన్ని పరిశీలించి, వాడుక భాష పద్య కావిత్వంలో ఎలాంటి మార్పులు చెందుతుంది అన్న విషయమ్మీద ఇంకా పరిశోధన చెయ్యవచ్చు.

    “నేనొక పూలమొక్క….” పద్యం మనసుకి హత్తుకోవడం వెనుక వాడుకభాష సహాయం తగినంత ఉందని తెలుస్తుంది – “చివాలున” కొమ్మ వంచడం, “జాలిగ నోళ్ళు”విప్పడం, “బావురు”మనడం వంటి పదాలని గమనిస్తే.

    సురేశ్ గారూ, “అడవికి బువ్వులు దేరగ వడి నరిగిన కచుని జంపి…” అన్న నన్నయ్య గారి పద్యాన్ని బాగానే పట్టుకున్నారండీ!

    వారిజములంటే తామరపువ్వులుకాబట్టి ఆ పదం సరిపోదు. “ప్రసవమ్ములొగిన్” అంటే సరిపోతుంది:-)

    అలాగే చివరి పాదంలో యతిభగం జరిగింది, “జాలింబడగన్” అని మార్చుకోవచ్చు.

  2. పద్యాలు – వాడుకభాష గురించి Raja Sankar Kasinadhuni గారి అభిప్రాయం:

    01/29/2007 3:05 pm

    కామేశ్వరరావుగారి వ్యాసం చాలా ఆసక్తికరంగా ఉంది. అయితే, గ్రాంథికానికి వాడుక భాషకి తేడా చెప్పడం ఒక పరిథి దాటిన తరువాత చాలా కష్టం అని నాకనిపిస్తుంది.
    ఉదాహరణకు ఒక పద్యంలో “అరపది మోముల దయ్యము” (ఐదు ముఖముల దైవము, అనగా శివుడు) అని అచ్చ తెలుగులోని మాటలతో ఈశ్వరుడిని వర్ణిస్తాడు కవీశ్వరుడు. ఈ పద్యం ఏ కోవలోకి వస్తుంది?
    సంస్కృత పద భూయిష్టమైన రచనలే గ్రాంథికమని రచయత అభిప్రాయామా?
    ఏది ఏమైనా రచయత విషయాన్ని చెప్పిన శైలి చాలా బాగుంది. కామేశ్వరరావుగారి కలంనుంచి మరిన్ని మంచి వ్యాసాలు రావాలని కోరుతున్నాను.

    కొలిచాలగారి క్రింది అభిప్రాయంలో ఎదో self-contradiction కనిపిస్తోంది:
    “పండితుల పట్టుదల వల్ల, లాక్షణీకుల వ్యాకరణ సూత్రాల వల్ల గ్రాంథిక భాష కొంత జడత్వం చూపినా, “ప్రాఁతవడ్డ మాటలను” పరిహరించడంలో, కొత్త మాటలను, ప్రయోగాలను ఉపయోగించడంలో నన్నయ్య, తిక్కనల నుండి విశ్వనాథ వరకూ, మహాకవులెవ్వరూ సందేహించలేదని నాకనిపిస్తుంది.”

    1. పూర్వ కవుల ప్రయోగంబులు గ్రాహ్యంబులని కదా వ్యాకరణ సూత్రం? మరి పై ఆక్షేపణ (వ్యాకరణం వలన భాషలో జడత్వం) ఎంత వఱకు సమంజసం?
    2. నన్నయ, తిక్కన, విశ్వనాథ ఇత్యాదులంతా పండితులు కారా?

    ధన్యవాదాలతో,
    కాశీనాథుని రాజాశఙ్కర్

  3. పద్యాలు – వాడుకభాష గురించి సురేశ్ కొలిచాల గారి అభిప్రాయం:

    01/29/2007 9:33 am

    లోతైన విశ్లేషణతో ఆలోచింప చేసే చక్కని వ్యాసం! అయితే, “గ్రాంధిక భాష అంటే ఇంతకాలం సాంప్రదాయికంగా లిఖిత పూర్వకంగా వస్తున్న ప్రాచీన కావ్యాలలో వాడబడిన కావ్య భాష.” అని మీరిచ్చిన తాత్కాలిక నిర్వచనాన్ని ఇంకొంత వివరిస్తే బాగుండేదేమో. కాల గతిలో వాడుక భాష మారినట్టుగానే కావ్య భాష కూడా పరిణామం చెందుతూ వస్తోందని, నన్నయ్య, తిక్కనాదులనుండి విశ్వనాథ వరకు వారి వారి కావ్యాల్లో వాడిన కావ్యభాషలన్నీ ఒకే రూపంలో లేవని మీకు తెలుసు. నన్నయ్య కావ్యభాషకు ఎనమిదో శతాబ్దపు భాష ఆధారమైతే, 11వ శతాబ్దపు శాసనాలలో కనిపించే ఇచ్చినాఁడు ( < ఇచ్చినవాడు < ఇచ్చినవాణ్డు) వంటి మాండలిక ప్రయోగాలు తిక్కన నాటికి కావ్య గౌరవం పొందాయి. అంటే ఒకనాటి వ్యవహారిక భాషా ప్రయోగాలు మరో నాటికి కావ్యభాషలో భాగాలయ్యాయన్నమాట. ఒకటి, రెండు శతాబ్దాలు ప్రజల నాలుకల్లో నలుగుడు పడ్డ వాడుక భాషా ప్రయోగాలు ఆ తరువాత గ్రాంథిక భాషలో ఆమోద యోగ్యాలయ్యాయని నా అభిప్రాయం. పండితుల పట్టుదల వల్ల, లాక్షణీకుల వ్యాకరణ సూత్రాల వల్ల గ్రాంథిక భాష కొంత జడత్వం చూపినా, "ప్రాఁతవడ్డ మాటలను" పరిహరించడంలో, కొత్త మాటలను, ప్రయోగాలను ఉపయోగించడంలో నన్నయ్య, తిక్కనల నుండి విశ్వనాథ వరకూ, మహాకవులెవ్వరూ సందేహించలేదని నాకనిపిస్తుంది. మీరేమంటారు? రిగార్డులతో, సురేశ్. "నేనొక పూలమొక్కకడ నిల్చి ..." పద్య భావాన్ని నన్నయ్య భాషలోకి ఎవరైనా అనువాదం చేసి రాస్తే చూడాలని ఉంది. నా శుష్క ప్రయత్నం: అడవికిఁ బువ్వులు దేరఁగ వడినరిగిన నన్నుఁజూచి వారిజ(?) కాంతల్ పొడవుఁ సెడఁ ద్రుంచి వగవక జడముడిఁ వడలింతురనుచు శోకింపంగన్ (నన్నయ్య భాషలో పొడవు=రూపము; వగవక=ఆలోచింపక)

  4. తెలుగులో అంకెలు, సంఖ్యలు 11 నుంచి పైన గురించి సురేశ్ కొలిచాల గారి అభిప్రాయం:

    01/29/2007 6:04 am

    ఏడు, పది డెబ్బది ఎలాగయిందో, ఏ వ్యాకరణసూత్రం ఉపయోగించాలో నాకు అర్థం కాలేదు.

    వర్ణవ్యత్యయం!

    మూల ద్రావిడంలోని ధాతువులలో ప్రథమాక్షరంగా కనిపించని మూర్ధన్యాక్షరాలు (ట,ఠ, డ, ఢ, ణ, ళ, ೞ లు), ర-ఱ-లలు తెలుగు-కుయి లో మాత్రమే కనిపించడాన్ని విశ్లేషిస్తూ భద్రిరాజు కృష్ణమూర్తి గారు వర్ణవ్యత్యయం (metathesis) అనే ధ్వని పరిణామం వల్ల మూల ధాతువులలో ద్వితీయాక్షరంగా ఉన్న ఈ మూర్ధన్యాక్షరాలు మొదటి స్థానానికి చేరాయని వివరించారు (చూ. Telugu Verbal Bases p 51-52)

    ఉదాహరణలు:
    లోన < ళోన < *ఒళన
    డస్సి < ೞస్సి < *అೞసి
    లే(త) < *ఎల
    రే(యి) < రెయి < *ఇరు
    రోలు < ఒరలు < *ఉరల్

    ఈ ధ్వని పరిణామం ఆధారంగా ఏడు + పది డెబ్బది ఎలా అయ్యిందో వివరించడం సులభం:
    *ఏೞು > ఏడు+పది > డేబ్బది > డెబ్బది > డెబ్భై

    రిగార్డులతో,
    సురేశ్.

  5. రచయితలకు సూచనలు గురించి Dr.K. Sujatha గారి అభిప్రాయం:

    01/28/2007 10:54 pm

    Being outside India we miss terribly telugu literature especially meaningful discussions.
    It is good today I came across your website. You are doing agreat service.Congrtaulations.

    Dr.K. Sujatha
    Canberra ,Australia

  6. భాషా సంబంధ నిరూపణ – భాషాశాస్త్రం 101 గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    01/26/2007 4:57 pm

    మనుషుల్లో వివిధ వ్యక్తులకి వివిధ విషయాల్లో ఆసక్తి ఉండడం సహజంగా అనిపిస్తుంది. ఎవరి కిష్టమైన సబ్జెక్ట్ వారు చదువుకుంటే సైన్స్, కామర్స్, ఆర్ట్స్, ఇంజనీరింగ్, మెడిసిన్ ఇలా ప్రతీ సబ్జక్ట్ లోనూ నిష్ణాతులు తయారవుతారు. అలా కాకుండా మంచి మార్కులొచ్చాయి కదా అని మనలో చాలా మంది తోసినట్టుగా ఇంజనీరింగో, మెడిసినో చదివి, “విధిలేక” అదే రంగంలో జీవితమంతా కొనసాగుతారు. “ఎందుకూ పనికిరాని” ఏ తెలుగు సాహిత్యంలోనో ఆసక్తి ఉన్నప్పటికీ అది ఔత్సాహిక దశలోనే ఆగిపోతుంది.

    సురేశ్ వంటి వారు తెలుగు భాష, సాహిత్యం తదితర విషయాల్లో తమకున్న గాఢమైన ఆసక్తిని చంపుకోలేక మరేదో ఉద్యోగం చేస్తూ, ఇటువంటి విషయాల గురించి ఉన్న పరిమిత సమయంలోనే చదివి, తమ ఉత్సాహాన్ని నలుగురితోనూ వ్యాసాల ద్వారా పంచుకునే ప్రయత్నం చేస్తారు. అటువంటి వ్యాసాలను విమర్శించకూడదని అనలేముగాని, రచయిత ఎటువంటి ఒత్తిళ్ళకు లోనయి ఇటువంటి ప్రయత్నం చేస్తాడో పాఠకులు కాస్త గుర్తుంచుకోవాలని నాకనిపిస్తుంది.

    యూనివర్సిటీల్లో జరిపే రిసెర్చ్ మరింత నిర్దుష్టంగా ఉండవచ్చు గాని ఔత్సాహికుల రచనల్లాగా అవి చదువరులను ఎక్సయిట్ చేసి ఆసక్తి కలిగించలేకపోవచ్చు. ఈ వ్యాసానికి లభించిన, లభిస్తున్న స్పందనే అందుకు ఉదాహరణ.

    ఈమాట, తదితర వెబ్ పత్రికలలో ఇతర ప్రొఫెషన్లలో ఉన్నవారు ఎన్నో విషయాల గురించి ఆసక్తికరమైన వ్యాసాలు రాస్తున్నారనేది గమనించాలి. వీరిలో ప్రసిద్ధ రచయితలుగాని, మహా పండితులుగాని ఎక్కువగా లేకపోవచ్చు. తెలుగు గురించి విశేష పరిశోధనలు చేసిన ఒక చేరాగారో, బూదరాజువారో, వెల్చేరువారో అరుదుగా కనిపిస్తారుగాని తెలుగు రచనల్లో వైవిధ్యాన్నీ, విస్తృతినీ కలిగించటానికి ప్రయత్నిస్తున్న ఇతర “చిన్న” రచయితల ప్రయత్నాలు ఎంతో మెచ్చుకోదగ్గవి.

    సురేశ్ గారికి అభినందనలు.

  7. తరం మారినా … గురించి Vaidehi Sasidhar గారి అభిప్రాయం:

    01/26/2007 2:47 pm

    చక్కని కథ!!చాలావరకు అందరి అనుభవం లోకి వచ్చి, జ్ఞాపకాల దొంతర ని కదిలించే కధ!!

  8. భాషా సంబంధ నిరూపణ – భాషాశాస్త్రం 101 గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:

    01/26/2007 10:04 am

    సురేష్,

    వొక అద్భుతవైన రచన, పాఠకుల్ని ఎంత ప్రభావితం చేస్తుందో మీ వ్యాసం మీద వెల్లువెత్తిన అభిప్రాయాలే వొక వుదాహరణ. శ్రీశ్రీ కవిత్వం చాలా మంది సాధారణ పాఠకుల్ని కవులుగా మార్చింది అన్నది వొక అభిప్రాయం. మీ వ్యాసం కుడా కొందరు పాఠకుల్ని భాషాశాస్త్ర దిశలో ప్రయాణం కట్టిస్తుందని నా అబిప్రాయం.

    పత్రికలు చదివే చాలామంది పాఠకులు నాలాగే, ప్రత్యేకవైన భాషా, సాహిత్య పరిఙ్ఞానంలేని సాధారణ పాఠకులే. సాధారణ జీవితం ఇచ్చిన కొద్దిపాటి లోకఙ్ఞానం, పాఠశాలల్లోనో, కళాశాలల్లోనో నేర్చుకున్న కొద్దిపాటి శాస్త్ర పరిశీలనా పరిఙ్ఞానం, ఈ రెండిటి కలబోతలోంచి అలవరచుకున్న కొద్దిపాటి తర్కఙ్ఞానం ఇవే మాకున్న అతి సరళవైన logical skills, నిజాన్నిఅబద్దంలోంచి వేరుచైడానికి, తప్పుని వొప్పులోంచి చెరిపేయడానికి. ఐతే ఈ nascent rational attitude lives along with irrational emotional beliefs about race, language, nationality in our minds. తెలుగు ప్రాచీనత మీద ఆంధ్రజ్యోతి లో వచ్చిన ఆ నాలుగు వ్యాసాలు చదివేక మనసుకెంత ఆనందవేసిందంటే, ఎక్కడో కుర్చోని ఎదో చదువుకుంటున్న నా ఏడో తరగతి కుతుర్ని పిలిచి, చదివి వినిపించి, చుశావా, మన తెలుగు జాతి, తెలుగు భాష గొప్పదనం, ఎప్పుడో సుమేరియన్ నాగరికత కాలంలోనే మన roots వున్నయ్ అని డబ్బా కొట్టి మరీ చెప్పెటంత ఆనందం. తర్వాత మళ్ళా నా కుతురుతో కుర్చోని అ తప్పుని సరి చేసుకోవటం సురేష్ రచన చదివేకే సాధ్యపడింది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే సురేష్ గారి వ్యాసం ఇంతకుముందు వచ్చిన వ్యాసాలమీద విమర్స లేకుండా వొక్క భాషా శాస్త్రం 101 కే పరిమితవైయ్యుంటే బావుండేది అనే అభిప్రాయం ఈమాట అభిప్రాయాల్లో వ్యక్తం కావటం వలనే. మేవు అతి సాధారణ పాఠకులం, మా బుర్రలో వుండే సవాలక్ష తర్కానికి నిలవని నమ్మకాల్ని తొలగించుకొని, ఎక్కడో, మనసులో ఏ ములో నక్కి నిద్రపోతున్న శాస్త్రియ పరిశీలనని నిద్రలేపాలంటే సురేష్ వ్యాసంలో వున్నటువంటి juxtaposition అవసరవని నా ఉద్దేశం.

    విప్లవ్ చెప్పినట్టు ఏ కళ్ళంలో గింజలు ఆ కళ్ళంలో నే నూర్చుకోవటం సహజవే. చేనైతే చాలానే వుంది. కానీ అదేం యదకొచ్చిన చేనేం కాదు. నిదర్శనం కావాలంటే మన ఘనత కెక్కిన విశ్వవిధ్యాలయాల భాషాశాస్త్ర శాఖల వెబ్ సైట్లకెళ్ళి వొకసారి చూడండి. పెట్టుబడైతే చాలానే పెడ్తున్నరు గాని, చేన్ని మాత్రం చవుడు నేల చేస్తున్నారు. కాబట్టి దుక్కి దున్ని, నారేతలేసి, కోసి, నూర్పులు చేసే మెళుకువలు, వోపికలు లేని నాలాటి పాఠకులకి శాస్త్రం తో పాటు, అశాస్త్రియతని వేలెత్తి చూపే సురేష్ గారు వ్రాసిన వ్యాసాలే ఉపయోగకరం.

    రవికిరణ్ తిమ్మిరెడ్డి

  9. నాన్నగారు కట్టిన ఇల్లు గురించి Naveen గారి అభిప్రాయం:

    01/25/2007 3:06 pm

    రావు గారు,

    మీ ఇంటి కథ చాలా బాగుంది. ఇంకా కొన్ని అనుభవాలు రాసి పంపుతారని ఆశిస్తున్నాను.

    నవీన్‌

  10. విదేశంలో మనుమరాలు గురించి viswamitrudu గారి అభిప్రాయం:

    01/24/2007 10:52 am

    విదేశాలలో తాతయ్యను తాతీ అనిపిలుస్తారా?
    బాగుంది

« 1 ... 1504 1505 1506 1507 1508 ... 1555 »