నన్ను గురించి కథ వ్రాయవూ? – నాకు అర్థమయినట్లుగా…

నన్ను గురించి కథ వ్రాయవూ? – ఇది రచయిత బుచ్చిబాబు కథల్లో బాగా పేరున్న కథ. ఇది ఈ మధ్యనే నేను చదివిన ఒక విలక్షణమైన కథ. ఇరవైరెండు సంవత్సరాల నిడివిలో జరిగిన కథ. కథలో రెండే రెండు పాత్రలు. ఒకటి బాలికగా, యువతిగా, గృహిణిగా, తల్లిగా, చివరకు న్యుమోనియా రోగిగా దర్శనమిచ్చే కుముదం పాత్ర. రెండవది నేనుగా కనిపించే, కథను చెప్పే, నడిపించే కథకుడు. అతడు సమాజంలో అంతగా పేరు సంపాదించుకోని రచయిత. నిరుద్యోగి. కథలో ఆ రెండు పాత్రలు ఐదుసార్లు మాత్రమే కలుసుకుంటాయి. బాల్యదశ నుంచి వయస్సు పెరుగుతూ వచ్చిన ఐదు దశల వరకు. కథ సామాన్యమైనది. మలుపులు, మెరుపులు, సస్పెన్సులు, ఉత్కంఠతలు లేనిది. ఇరవై పేజీల ఇంత పెద్ద కథ రాయాలా? పది పేజీల్లో ముగించవచ్చు అని నేటి రచయితలు అనుకునే కథ.

మరి ఈ కథకు ఇంత గుర్తింపు ఎలా వచ్చింది అన్న ప్రశ్న కలగవచ్చు. ఒకసారి చదవంగానే పూర్తిగా అర్థమయ్యే కథ కాదు. చదివిన ప్రతిసారి కొత్త కోణాలను, లోతులనూ చూపించే కథ. పాత్రల అంతరంగాలు, మనస్తత్వాలు అర్థం చేసుకోవడంలో మెదడుకు పని కల్పించే కథ. అందుకే గొల్లపూడి మారుతీరావు ఈ కథను నిగూఢత, మార్మికత ఉన్న మిస్టిక్‌ స్టోరీ అన్నారు. కుముదం మృత్యువుతో ముగిసిన ఈ కథ మనస్సులో నిశ్శబ్దాన్ని, విషాదాన్ని నింపుతుంది.

ముందుగా కథలోని రెండు పాత్రలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. స్త్రీ పాత్ర కుముదం సామాన్యంగా కనబడుతూ అసమాన్య వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా గోచరిస్తుంది. వాళ్ళు కల్సుకున్న ప్రతిసారి సజీవమైన కొత్త పాత్రగా సాక్షాత్కరిస్తుంది. మొదట్లో అమాయకమైన పదేళ్ళ బాలికగా కనబడుతూ తనకంటే రెండేళ్ళు పెద్దయిన కథకుణ్ని కథలు చెప్పమని, తన గురించి కథ రాయమని అడుగుతుంది. అతడు చెప్పే కథల్ని ఆసక్తిగా నమ్ముతున్నట్లు వింటుంది. చెట్టు మీద జామకాయలు కోసివ్వమని వేధిస్తుంది.

రెండవసారి ఎనిమిదేళ్ళ తర్వాత గృహిణిగా కనబడుతుంది. మళ్ళీ మర్చిపోకుండా తన కథ రాయమని అడుగుంది. ‘నీలో ఏ ప్రత్యేకత ఉందని నేను కథ రాయనూ’ అంటాడు కథకుడు. ప్రత్యేకత అంటే ఏమిటని ప్రశ్నిస్తుంది. దానికి కథకుడు చెప్పే వివరణలు విని ఊరుకోకుండా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. ఈ దశలో ఆమె బాల్యదశ నుండి ఎదిగి ప్రశ్నించే పరిపక్వతకు ఎదిగినట్లు మనకనిపిస్తుంది. కథకుడికి ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తుంది. చదువుకున్నదాన్ని కాదు కదా, ఎలా చెప్పాలో తెలియడం లేదు అని తికమకపడ్తుంది.

మూడవసారి ఒక పిల్ల తల్లిగా కన్పడుతుంది. ఇది వరకు చూసినప్పటి కంటె ఈ సారి ఎక్కువ చలాకీతనం, యవ్వనోద్రేకం చూపుతుంది. తనని కలవడానికి ఎండ లో వచ్చిన కథకుడి ముఖం మాడిపోయినట్లు గమనించడం, ఆప్యాయంగా అనాస ముక్కలు, మంచినీళ్ళు అందివ్వడం అతని పట్ల ఆమెకున్న శ్రధ్ధను తెలియజేస్తుంది. పిల్లలు పుట్టడం సర్వసాధారణమైన చర్యగా వర్ణిస్తూ, ఒక చిన్నపిల్ల తల్లిగా తన మాతృత్వానికి గర్వపడుతున్నట్లుగా కన్పడదు. సంసారానికి, పిల్లలకు, భర్తకు అతీతంగా ఆమె బతుకుతున్నట్లు అనిపిస్తుంది. ఈసారి కూడా తన గురించి కథ రాయమని అడుగుతుంది.

నాల్గవసారి కల్సుకున్నప్పుడు ముగ్గురు పిల్లల తల్లిగా మారుతుంది. ఆమెలో కథకుడికి మరింత నిండుతనం, మాతృత్వం, పరిపూర్ణత కనబడతాయి. ఆమె మాటల్లో పరిణతి గోచరిస్తుంది. వయసు మొహానికి వైరాగ్యాన్నిచ్చినా, వార్థక్యాన్ని ఇవ్వలేకపోతుంది. ప్రేమలో, సంసార బంధనాల్లో దాస్యం ఉంటుందని, వీటికి దూరంగా ఉంటే మంచిదని అంటుంది. స్వేచ్ఛని, స్వాతంత్య్రాన్ని కాంక్షించే మనిషిగా కన్పడుతుంది. అందుకే తన మనస్తత్వానికి అనుగుణంగా ఆఖరిగా పుట్టిన కూతురికి ‘స్వరాజ్యం’ అన్న పేరు పెట్టుకుందేమో!

చివరిసారి న్యుమోనియా రోగిగా ఆస్పత్రిలో పడి కనపడుతుంది. ‘నీ రోగం గురించి నాకెందుకు చెప్పలే’దని కథకుడు అంటే జబ్బు చెయ్యడం సాధారణం, పదిమందికీ చెప్పుకోడానికి ఏముంది అంటుంది. నీ స్థితి నాకెంతో బాధగా ఉందంటే, నాకేం విచారం లేదు. ఈ ప్రపంచం నాదైతేగా విచారించడానికి అని తనలోని వైరాగ్య కోణాన్ని చూపిస్తుంది. కథకుణ్ని నువ్వు నా గురించే పెళ్ళి చేసుకోలేదంటుంది. కథకుడు ఆమె చెయ్యి మీద చెయ్యి వెయ్యబోతే తన చేతిని దుప్పటి కింద దాచుకుంటుంది. ఈ విధంగా అయిదు దశల్లో వైవిధ్యభరిత వ్యక్తిత్వాలను ప్రదర్శిస్తుంది.

కుముదం కలిసిన ప్రతిసారి కథకుడిని తన గురించి కథ రాయమనడం మనలను ఆశ్చర్యపరుస్తుంది. కథలో పాత్రగా ప్రాముఖ్యాన్ని పొందాలని ఆమె భావిస్తుందా అన్న ఆలోచన మనలో కలిగిస్తుంది. అన్నింటికి అతీతంగా బతుకున్నట్లు గోచరించే ఆమె, కథకుడు అన్నట్లు మరో లోకంలో ఆత్మను వదిలేసి వచ్చిన స్త్రీగా కనబడుతుంది. ఈ లోకంలో మూసుకుని మరో లోకంలో తెరుచుకున్న నేత్రాలుగా కనబడతాయి ఆమె కళ్ళు.

ఇక కథకుడి దగ్గరికి వస్తే ఉద్యోగం లేనందుకు అతడు ఆత్మన్యూనతాభావంతో బాధపడుతున్నట్లు అనిపిస్తాడు. అందుకే కుముదం ఉద్యోగం స్వేచ్ఛను హరిస్తుంది అన్నప్పుడు అతనికి ఆమె మీద గౌరవం కలుగుతుంది. తనను సమాజం మంచి కథకుడిగా గుర్తించనందుకు అసంతృప్తితో బాధపడుతున్నట్లుగా అనిపిస్తాడు. ఎప్పుడో ఒక మహత్తరం గ్రంథం రాయాలన్న కలలు కంటుంటాడు. కుముదాన్ని కలుసుకోవడం అతనికి ఇష్టమైన విషయమని తోస్తుంది. అందుకే కొన్నిసార్లు ఆమెతో మాట్లాడిన తర్వాత అద్దె డబ్బు అడగలేకపోతాడు. ఆమె చేతుల్లోంచి ఆ పాపిష్టి డబ్బు తీసుకోవడానికి ఇష్టపడడు.

కుముదం మొదట్లో అతనికి సీదాసాదాగా ఏ ప్రత్యేకతా లేని వ్యక్తిలా కనబడినా, రాను రాను ఆమెలో ఆకర్షణ, యవ్వనం తీసుకొచ్చే చురుకుతనం, అందం కన్పడతాయి. ఆమె మాటలు విని ఆమె తాననుకున్నంత అమాయకురాలు కాదని అర్థం చేసుకుంటాడు. ఆమెలో అలౌకిక వ్యక్తిత్వం, పవిత్రత, పరిపక్వత కన్పడతాయి. అందుకే చనిపోయే ముందు, నువ్వు నా కోసం పెళ్ళి చేసుకోలేదన్నప్పుడు అతని ప్రపంచం తలకిందులవుతుంది. విపరీతమైన ఆలోచనలు అతని మస్తిష్కంలో గిరగిరా తిరుగుతాయి. తనకు ఇంతవరకు అర్థం కానిదేదో అర్థం అయినట్లు అనిపిస్తుంది. ఏది ఏమైనా ఉదాత్తత, పరిణతి ఉన్న కుముదం వ్యక్తిత్వం ముందు కథకుడు మరుగుజ్జులా కనబడతాడు.

ఇక శైలి విషయానికొస్తే ఈ కథ సరళంగా సాగిపోతూ చివరి వరకు చదివిస్తుంది. ప్రకృతి వర్ణనలు, పరిసరాల వివరాలు కథలో చోటుచేసుకుని కథకు నేపథ్యంలా అనిపిస్తాయి. కథలో మనకు కనబడే మరో ముఖ్యవిషయం రచయిత కథలో ప్రవేశించి కథకుడి ద్వారా తన అభిప్రాయాలు తెలుపడం! ఉదాహరణకి ఒక చోట అంటారు: ముదుసలే జ్ఞాని కాగలడని భారతీయుల వెర్రి నమ్మకం. పెద్దలన్నా, ప్రాచీనులన్నా, పాత విషయాలన్నా మనవాళ్ళకి అంత గౌరవం. మరో చోట అంటారు: సృష్టిని ఆహ్వానిస్తూ తెరుచుకున్న తలుపులు మన స్త్రీలు. తెరుచుకోలేని తలుపులు లేవు. ఏదైనా ఒక తలుపు తెరుచుకోలేని నాడు, దాన్ని గురించి చెప్పుకుని మరమ్మత్తు సంకల్పించాలి. ఇలాంటి అభిప్రాయాలు మనకి కథలో చాలాసార్లు కనబడతాయి. ఇలా రచయిత కథ మధ్యలో జొరబడి ప్రవచనాలు చెప్పడం బహుశా ఇప్పటి పాఠకులకు నచ్చకపోవచ్చు!

ఆఖరిగా కుముదం, కథకుడి మధ్య ఉన్న సంబంధం ఎటువంటిది అన్న ప్రశ్న మనకి రాకమానదు. వాళ్ళిద్దరూ అప్పుడప్పుడు అలా కలుసుకోవడాన్ని ఇష్టపడటమే కాకుండా ఎదురు చూశారని అనిపిస్తుంది. ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ఆత్మీయత, ఆకర్షణ, ఇష్టం ఉన్నాయని కూడా అనిపిస్తుంది. కానీ సంఘం ఏర్పరిచిన కట్టుబాట్లకు లొంగి ఉంటూ, సమాజపు సరిహద్దులు దాటడానికి ప్రయత్నించని వ్యక్తులుగా కనబడతారు. అలా మిగిలిపోతారు.

(అక్టోబర్ నెలసరి సాహిత్య సమావేశానికి ఈ కథను సెలెక్ట్ చేసి, చదివించి, ఆలోచింపజేసిన ఢిల్లీ సాహితీ వేదిక అమరేంద్రగారికి, బందా శ్రీనివాస్‌గారికి కృతజ్ఞతలు.)