మన తరం – మహాకవి

ఉపహ్వరే గిరీణామ్ సంగథే చ నదీనామ్ ధియా విప్రో అజాయత
– ఋగ్వేదం, (8.6.28)

In a remote place of the mountains and at the conjunction of the rivers,
the inspired poet was born with insight.
( Tr. Brereton & Jamison)

ఏ గిరుల సమీపమందో
ఏ నదుల సంగమమందో
ధీమంతుడగు విప్రుడొకడు
జనియించుచుండు!
(అను. సురేశ్ కొలిచాల)


వాడ్రేవు చినవీరభద్రుడు 1962లో శరభవరంలో పుట్టాడు. శరభవరం తూర్పు గోదావరి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతానికి ఆనుకొని ఉన్న ఒక కుగ్రామం. చినవీరభద్రుడు 1986లో వెలువరించిన నిర్వికల్ప సంగీతంతోనే తన సొంత గొంతుని వెతుక్కొని తెలుగు కవితారంగంలోకి ప్రవేశించి, అనతికాలంలోనే ఒంటరిచేల మధ్య ఒక్కతే మన అమ్మ (1987-1992) అనే గొప్ప సంపుటిని ప్రచురించాడు. అప్పటికి తెలుగులో ఒక పక్క కరపత్రాల స్థాయికో అంతకన్నా అధమస్థాయికో దిగజారిన విప్లవ కవిత్వము, ఇంకో పక్క అనిబద్ధమైనదనీ అస్పష్టమైనదనీ అపప్రథ మోస్తూన్న, దుర్భర ఏకాంతంలో పుట్టిన పరాయీకృత సొంత గోడు (asocial) కవిత్వమూ ఎక్కువగా వస్తూండేవి. అలా ఒంటరిచేల మధ్య ఒక్కతే మన అమ్మ తెలుగు పాఠకులకు కొత్త అనుభూతిని కలుగజేసింది, ప్రకృతీ మనిషీ పల్లె పట్నం అడవి మహానగరం పొలం బీడు – వీటిని కొత్తగా పరిచయం చేస్తూ వింత పులకరింతను సహృదయహృదయాహ్లాదంగా సృష్టించింది. కవి ఈ కవితాసంపుటిలో తన సమకాలికులను కవితానిర్మాణసందర్భంలో మాత్రం తగు విధంగా మన్నిస్తూనే తన వస్తువునూ దర్శనాన్నీ అనాహతంగా నిలుపుకొని మళ్ళీ స్వచ్ఛమయిన అనుభూతి వేపు, తథ్యమిథ్యాచింతన వేపూ మనిషిని పరుగులిడేట్టు చేయించాడు. ఇందులో కుగ్రామంలో పుట్టి పెరిగి, పట్నానికి వెళ్ళి, దాన్ని వదలిపెట్టి అడవి దాపుకి వెళ్ళిన కవి మనిషినీ ప్రకృతినీ పునర్దర్శించి వాటి మధ్యనున్నది, ఆదిమానికీ ఆధునికానికీ మధ్యనున్నదీ అయిన ఒకే అనుబంధాన్ని కనుగొని జీవితానికి అర్థమేమిటనే అందర్నీ తొలిచే ప్రశ్నను ఆదరించి చేసిన కవనయజ్ఞఫలాన్ని పఠితలకిస్తూ వినయంగా తల వంచాడు. ఈ సంపుటిని విపులంగా పరామర్శిద్దాం.

వర్షాన్ని ఏ కవి ఎలా ఆహ్వానించినా ఈ కవి మాత్రం హర్షాతిరేకంతో బీటలు వారిన చేలల్లోకి ఆహ్వానించాడు. ‘తొలకరి’లో వర్షం, అన్నాళ్ళై అపరాధ పంజరంలో చిక్కి కృశించిన కవిని, పరాజయం పెదాల్ని పురుగులా కరుస్తున్న కవిని, మరణం నాలుగువైపుల్నుంచి మంటపెడుతున్న కవిని, చావులన్నిటిలోకి దుర్భరమైన చావుని పొందిన కవిని ప్రక్షాళించి, పధ్నాలుగు లోకాల్లోంచీ దేవతలు ఆలపించిన మంగళగీతాలు వినిపించి, శాపాల బరువుకి కుంగిన భూమిపై శతకోటి గంగలు వర్షించి, కవిని గాయత్రివైపు మళ్ళించింది. మానాని (Manna from heaven) అప్పుడు ఆ క్షుత్పీడితులైన ప్రాచీన గణప్రజ దేవునికి కృతజ్ఞత తెలియజేస్తూ స్వీకరిస్తే ఇప్పుడు ఈ కవి వర్షుకాభ్రస్తనితంలో మంత్రపఠనం విన్నాడు. ఈ రెండు అనుభవాలూ ఒకలాటివే. వర్షపాతానంతరం ఊడ్పులు: ‘వంగి బారులు తీరి తదేకదీక్షతో స్త్రీలు ముద్దలుగా కరుగుతున్న మట్టిలో మంత్రాక్షరపంక్తులు రచించి, గింజల్ని విత్తి గింజలు పండించినప్పుడు’ అక్కడ దస్తావేజులూ భూమి హక్కులూ రెవెన్యూ కోర్టులూ లేవు, ఆ లేత కంకులు పాలుపోసుకున్న తరువాతే ట్రాక్టర్లూ మార్కెట్ యార్డులూ గిడ్డంగులూ గుర్తొచ్చేది. ఆహారోత్పత్తి ఉత్తమ వృత్తి. దీని ప్రాచీన మహాత్మ్యం ఎరిగినవాడే కనుక కవి ఇలా రాశాడు. గింజల్ని విత్తి గింజల్ని పండించడం అన్నాడు. మనిషి ప్రకృతిలో భాగం. గింజలే లేకుంటే గింజలు పండవు. ఉన్నదల్లా మనిషి శ్రమ. అమ్మకాల కొనుగోళ్ళ మార్కెట్‌లు మనిషి నుంచి మనిషి విడిపోయిన తరువాతనే ఏర్పడిన వైనమని చినవీరభద్రుడికి అర్థమయినంతగా ఎవరికర్థమయ్యింది? బహుశా, మనిషి నుంచి మనిషి వేరై దూరమైన వ్యథ ‘ఓల్డ్ స్పైస్ మస్క్’లోనూ లీలగానైనా ధ్వనించింది (తన గుంపు నుంచి తప్పించుకొని ఒంటరిగా ఆరాటంతో ఈ ప్రాచీనమహాసుగంధం కోసం ఏ పర్వతసానువుల్లోనో ఆ హరిణం ఇంకా వెతుకులాడుతునే ఉంటుంది). The alienation of man from man preceded and caused the alienation of man from the society. ఇది అంతరార్థం.

పార్వతీపురం మన్యం నుంచి హైదరాబాద్ నగరానికి వెళ్ళిన కవికి చాలానే కొత్త అనుభవాలు ఎదురయి ఉంటాయి. ‘హైదరాబాద్:రెండు పద్యాలు’ పూర్తి పాఠము, పరామర్శ:

1.

తొలి సంజ కాంతిలో నగరపుష్పం విప్పారింది
మోటారు వాహనాలు జుమ్మని ముసురుకున్నాయి

పౌడరు పూత దేహాల ఉద్వేగం, టైర్లు, డీసెల్
తాజావార్తాపత్రికలు, పొగ, సబ్బువాసన
దైనందిన నగరజీవితపరిమళం నన్నల్లుకుంది
ఈ శతపత్రవక్రరేఖలవలయాల్లో దినమల్లా తిరిగిన దారుల్లో తిరుగుతాను

హైదరాబాద్‌ను పుష్పంతో (బహుశా పద్మం, శతపత్ర వక్రరేఖలు!) ఉపమిస్తూ ఎత్తుకున్నాడు కవి. మోటార్లు తుమ్మెదలు కావు, అవి మకరందాన్ని గ్రోలలేవు. నగరరేఖలు వక్రరేఖలు. నగరం నిషిద్ధవస్తుపరిపూరితం. అయినా ఏదో పరిమళం కవిని అల్లుకుంది.

సెకండ్ హాండ్ పుస్తకాలు, అభిప్రాయాలు
వేళ తప్పని నమాజులు కిళ్ళీలు ఉమ్ములు
చర్వితచర్వణాలైన నీతులు, నల్లని బురఖాలు
పాలుచిమ్మే యాపిల్ పండ్లు, రహస్య ద్వేషాల మొగలాయి దర్బారులు

ఒక్క యాపిల్ మినహా మిగతా అంతా రోత లేదా రొటీన్, కాపోతే తెరవెనుక దాగిన సామగ్రీ.

ఎంత తిరిగినా
ఎన్ని సార్లు వచ్చివెళ్ళినా
ఈ నగరం తన రహస్యాన్ని నాకు చెప్పనే చెప్పదు.

మళ్ళీ సంజ వేళకి నగరం ముడుచుకుంటుంది
అలిసిన గుమస్తాల్ని
ఇళ్ళకు మోసుకుపోతున్న సిటీబస్సుల వెనగ్గా
నల్గిన రోడ్ల మీద విద్యుద్దీపాల వింతనగరం పుట్టుకొస్తుంది

పద్మం ముడుచుకుంది. కార్యాలయవేళలు ముగిసిన తరువాతనూ మనుషుల్నందర్నీ గుమస్తాలన్నాడు, అందరూ అస్వతంత్రులు. నగరం తన రహస్యాన్ని కవికి చెప్పకపోయినా ఒక అనుభవాన్నిచ్చింది. దాన్ని మననం చేసుకుంటూ కవే కనుగొన్నాడా రహస్యాన్ని. వాహనాలు కదుల్తూంటేనే రోడ్లు సరిగ్గా కనిపిస్తాయి.

మానవ సంచారపు
అమాయికమైన అట్టహాసం కింద
ఏ రహస్యవిషాదం దాగివుందో
దూరంగా గోల్కొండ గొణుక్కుంటోంది
అర్థరహితమయిన ఆబిడ్సు రోడ్డు సంరంభం
అస్పష్టమయిన దిగులును రేపుతుంది
కాంక్రీటు రాక్షసాకృతుల నీడల్నుంచి
బెదురుగా నంగిరిగా సందు లోకి తప్పుకుంటుంటే
ఎవరి జెడలో జాజిచెండో నా బుజానికి రాసుకుంటుంది
అట్లాంటి ఒక్క క్షణం మైమరపులోనే
బహుశా, ఒక నగరం వైభవమంతా ఉందనుకుంటాను.

నగరసౌందర్యం అంతా కృత్రిమమే. అయినా మనిషి అంటే సహానుభూతి కవికి ఉంది కనుక, ‘అమాయికమైన అట్టహసం’ అన్నాడు. గోల్కొండకున్న చరిత్రా ప్రాచీనతా ఆబిడ్సు రోడ్డుకి లేవనేనేమో కవి గోల్కొండ గొణుక్కుంటోందనీ ఆబిడ్సు దిగులు రేపుతోందనీ అన్నాడు. ఈ కాంక్రీటు ఆకృతుల్నించి తప్పుకుంటే తప్ప సహజసౌందర్యస్పర్శ కలగదు. పల్లెటూర్లో ముందు పరిచయమైన జాజిచెండు దివసావసాన కవిని కరిగించింది, కనుకనే కవి తన అనుభవాన్ని కాచి వడపోసి సత్యాన్వేషకుడయ్యాడు. క్షణికమైన నవ్యానుభవాలే శాశ్వతమైన దివ్యానుభవాలు. పదాలకు అర్థవ్యాప్తి కలిగినట్లు, అనుభూతులకు ధ్వనివ్యాప్తి కలుగుతుంది కాబోలు.

2.

భ్రాంతి లేని జీవితాన్నే కోరుకున్నాం మనం
జీవించడం ఎలాగూ తప్పదు
ఈ కప్‌లో ఒక స్పూన్ నమ్మకాన్ని కూడా కలపమన్నాం
కాలువగట్టు నీడన సోమరి కునుకు తీసిన మధ్యాహ్నాల్లో
“ఏది నిజంగా ఏమిట”న్న ధ్యాసే లేదు మనకి.
వ్యాపకాల్ని వెతుక్కుంటో రోజులకి రోజులు ప్రయాణాల్లో కూరుకుపోయినపుడు
ఒకట్రెండు సందేహాలు కలిగినా
ప్లాట్‌ఫామ్ పైని పోర్టర్ల సందడి కమ్మేసింది మనని

ఇప్పుడిక ఈ వేగాల ఆరాటాల అల్లికజిగిబిగిలో
కాళ్ళూ చేతులూ కూరుకుపోయి
ఆక్రందించడమొకటే మిగిలింది మనకి
అన్నీ ఉన్నాయిక్కడ
అనుభవించడానికి తీరిక తప్ప

ఇంక జీవితానికి అర్థం వెతక్కు
అభిలషించినదానికీ అందినదానికీ మధ్య
ఆ అందమైన తెరనట్లా ఉండనివ్వు

మనోహరసుందరమూర్తి రెబెకాని
ముసుగు తొలగించి చూడాలనే ఆ శిల్పీ తపించాడు
పాపం అతనూ మానవుడే కదా

మన విషాదమంతా తొలగించలేని ఆ చివరి తెర
భ్రాంతి లేని జీవితం ఎంత సుందరమో తెలియదు కానీ
ఈ భ్రాంతిబంధురమైనదే అత్యంత సుందరం మనకి

భ్రాంతి పంచేద్రియాలు కల్పించే అవస్థ. నమ్మకం (faith) లేనిదే జీవఫలం చేదు విషమై గరళమై గళం దిగదు. ఏది నిజంగా ఏమిటన్న ధ్యాస కవిని సత్యాన్వేషణపథం వైపు తొలి అడుగు వేయించింది. నగరవాసమెన్ని సౌందర్యాగ్నికీలలను రేపినా, ఎక్కడ చూసినా ఏదో అవాంఛితాచ్ఛాదన. అభిలషించినదానికీ అందినదానికీ మధ్యనున్న తెర అందమైనదంటే, సత్యాన్ని ఆవరించిన తెర హిరణ్మయపాత్రవంటిదనే గ్రహింపు కవికి ఉన్నది కనుకనే అలా అన్నాడు. విజ్ఞానశాస్త్రం సాయంతో ఎంత ముందుకెళ్ళినా ఏదో ఓ దగ్గర ఆగిపోవక తప్పదు. చివరి తెర ఉండేది అక్కడే. అది తొలగిస్తే మనిషికి కైవల్యం లభించినట్లే. ప్లాట్‌ఫామ్‌మీది పోర్టర్లు ఇంకెవరిదో అయిన భారాన్ని జీవికకై మోస్తారు కనుక ఇక్కడ మనము మనకు దూరంగా ఉన్నామని కవి హృదయం. జిజ్ఞాస బొత్తిగా అవసరంలేని నాగరికతలోని జీవితంలో అందమూ ఆనందమూ ఉండవు. ఇక బెన్జోని చెక్కిన పాలరాతి శిల్పం రెబెకా (సాలార్ జంగ్ మ్యూజియమ్‌లో ఈ veiled Rebecca శిల్పం ఉంది) ముసుగు తీయాల్సిన అవసరం సందర్శించేవారికయితే లేదు. బెన్జోని శిల్పకళాకౌశల్యం ఎటువంటిదంటే, రెబెకాకు ముసుగు ఉన్నట్టున్నా, లేనట్టే. శిల్పికి తెర తీసి చూడాలనిపించడం తన కౌశల్యానికి అందని ఏ సుందరసత్యాన్నో దర్శించి ఒడిసిపట్టుకుందామనే జిజ్ఞాసే. చినవీరభద్రుడు ఇంకో సందర్భంలో (కొండ కింద పల్లె) ‘నిజమైన మానవుణ్ణి దర్శించుకుందామని ఎంత కాచుకొని ఉన్నా ఎంతకీ తెర తొలగదు‘ అని నిట్టూర్చాడు. ఏ తెర తొలగితే మానవుడు పరిపూర్ణుడౌతాడో, మానవుడికీ దైవానికీ అభేదం చెప్పగలమో అదే చివరి తెర.

‘హైదరాబాద్: రెండు పద్యాలు’లో ఈ రెండో భాగం కేవలం తొలి భాగానికి పొడిగింపు కాదు. అనుభవం ఒక సత్యాన్ని దర్శింపజేస్తున్నప్పుడు పుట్టే కవితాత్మకతత్త్వం. తత్కవిత్వతత్త్వవిచారానికి కాస్త సమయం కేటాయించాలి. మొదటి భాగం పచ్చి అనుభవమైతే, రెండోది దాని కషాయం (filtered essence). మొదటిది ముడి దినుసైతే రెండోది పూర్తయిన ఉత్పత్తి. మొదటిది దేహమైతే రెండోది ఆత్మ. మానవుడెప్పుడూ సృష్టి వెనుకనే ఉంటాడు. నాక్కొద్దిగా నమ్మకమివ్వు అన్నాడు బైరాగి. చినవీరభద్రుడా నమ్మకాన్ని కప్‌లో కలిపి మనచేత తాగించి జీవనమాధుర్యాన్నీ సత్యాన్వేషణఫలార్థాలనూ మనకు రుచి చూపిస్తున్నాడు.’దినమల్లా’ తిరిగిన దారుల్లోనే తిరుగుతాను అన్న కవి ‘సంజ వేళ’కే బెదురుగా నంగిరిగా సందులోకి తప్పుకున్నాడు. గోల్కొండ, రహస్య ద్వేషాల దర్బారుల ప్రసక్తి రెండో భాగంలో పాఠకులు అర్థం కోసం వెర్రిగా అర్రులు చాచేలా చేసింది. ఈ కవే ఇంకో సందర్భంలో ‘ఒక పద్యాన్ని గుర్తుపెట్టుకోవాల్సినది పదాలతో కాదు పదాలు విడిచిన ముద్రలతో‘ (కోకిల ప్రవేశించిన కాలం) అన్నట్టే ఈ పద్యద్వయాన్ని ఇది విడిచిన ముద్రలతో గుర్తు పెట్టుకోవాలి. ‘శుభ్రసలిలాలతో దోసిలి నిండీనిండకుండానే దాహం తీరిపోతుంది‘ (ఏటి ఒడ్డున నీటి చెలమ, కోకిల ప్రవేశించిన కాలం) అని మనకు క్లూ ఇచ్చాడు. ఈ కవిత్వమే శుభ్రసలిలం. ఈ పద్యద్వయం శ్రీశ్రీ ‘కవితా ఓ కవితా’ తరువాత అంతటి ప్రభావశీలమైనదీ శక్తివంతమైనదీనూ. ఇటువంటి పద్యం చదివిన వారికిక జీవితంపై ఆశ చావదు. ‘అక్షరం పైని ఆశ చావదు‘ అన్న కవి మనకు జీవితంపైని ఆశను పెంచే పద్యాలను ఇచ్చాడు.

‘ఇప్పుడు రాస్తున్న కవిత’లో (a foreboding title!) ఈ కవి తన కవిత్వం పాఠకులను ఎలా చుట్టుకొనేదీ వివరించాడు.

నేను ఇప్పుడు రాస్తున్న కవిత
ఒకనాడు నీ కిటికీ పక్కగా ప్రవహిస్తూ వచ్చి ఆగుతుంది
నువ్వు దాని పక్కగా కుర్చీ జరుపుకుని కూచుంటావు
నీకేమీ కాని నా వ్యక్తిత్వ ఛాయ నాచులాగ పరుచుకుంటుంది
ఏదో మిలమిలమని అంచుల్లో మెరుస్తుంది
నువ్వు దయతోనో అర్థం కాని ఆసక్తితోనో
దుస్తులు విప్పకుండానే ఆ నీళ్ళలో దిగుతావు
మెత్తని నీ పాదాల్ని ఒక వెర్రి చేపపిల్ల చుట్టుకుంటుంది
“అబ్బా ఎంత దుర్గంధం” అంటూనే ముందుకి వంగుతావు
నీ కాళ్ళని వణికిస్తున్న ఆ సజీవస్పర్శని నీ చేతుల్తో అందుకోవాలని
తడిసిన నీ వేళ్ళ చుట్టూ మోచేతుల చుట్టూ మిలమిలలు అల్లుకుంటాయి
నీకు తెలీకుండానే నువ్వు లోతుల్లోకి జారిపోతావు
చేపపిల్ల తప్పుకు పోతుంది
నువ్వు కూడదీసుకొని లేచేటప్పటికి
నీ ఒళ్ళంతా నా అక్షరాల వాసనా, నాచూనూ

కవిత చక్కగా పట్టు శాలువాలా ఉంది. ప్రవాహానికి ఏ రాయో రప్పో అడ్డు తగిల్తేనే నాచు ఏర్పడుతుంది. కవితాప్రవాహం పాఠకుల దరిని నిలిచి ఆకర్షించి తనలోకి లాగుకొని చేపపిల్ల చేతికందకపోయినా ఏవో భావాల మిలమిలలను మిగులుస్తుంది. ఇదీ ధ్వని. దీని వెనుక అనుభవం ఏదైనా కావచ్చు, వాచ్యంగా నదిలోనో చెరువు గట్టునో నాచురాతి మీద నడుస్తూ నీళ్ళలోకి జారి పడడం జరిగి ఉండవచ్చు. ‘దుస్తులు విప్పకుండానే నీళ్ళలోకి దిగడం‘ అంటే ఏదో ఆచ్ఛాదన ఉన్నట్టే. హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపిహితం ముఖమ్, తత్త్వం పూషన్నపావృణు సత్యధర్మాయదృష్టయే (సత్యం స్వర్ణపాత్రవంటి ఆచ్ఛాదనను కలిగి ఉంది, ఓ సూర్యా, దాన్ని సత్యధర్మదర్శనానికై తెరువుము అని అర్థం) అని ఈశావాస్యోపనిషత్తు. సత్యదర్శకులు అనాచ్ఛాదితులనే ధ్వని ఇక్కడుంది. చినవీరభద్రుడి కవిత్వంలో చాలచోట్ల అనాచ్ఛాదనకే ఆహ్వానం దొరుకుతోంది (ఉదా: నిర్వికల్ప సంగీతంలో సత్యపూర్ణ). చేజారిన చేపపిల్ల కవికి కూడా అందీ అందని పరాసత్యం. దాని దుర్గంధం ఐహికజన్మవాసన. ఆ అక్షరాల వాసనా నాచూ పఠితలకు మిగిలాయి. ఈ సామగ్రితోనే పాఠకులూ పద్యం వెనుక పరుగెత్తాలి, పరమసత్యం దిశగా ప్రస్థానించాలి. అక్షరాల వాసన కవిత రూపానికి అద్దం పట్టగా, ఎన్నో నాళ్ళకు గానీ ఏర్పడని నాచు పాఠకులకు తమ అనుభవాలు కవ్యుక్తితో కలగలిసి ప్రతిష్ఠితమైన భావసారాంశం. పద్యం పాంచభౌతికం కనుక సంవేదన కలిగిస్తుంది, ధ్వనివ్యాప్తి కలిగి ఆలోచనామృతమయింది. చినవీరభద్రుడి మెటా పోయెమ్ భాష్యానికి లొంగుతున్నది.


చినవీరభద్రుడి పునర్యానం ఆత్మచరిత్రాత్మచరిత్రాత్మక (శ్రీశ్రీ పదబంధం!) కావ్యం. దీర్ఘకవిత. అయితే అది ఒంటరి చేల మధ్య ఒక్కత్తే మన అమ్మలోనుంచే పుట్టింది. ఇక్కడ చినవీరభద్రుడు మనకు ముందు వజ్రాల ఆభరణం కాన్క చేసి తరవాత ‘ఇదుగో ఇక్కడే ఆ వజ్రఖని ఉన్నది’ అని చెప్పినట్టే ఉంది. అయితే పునర్యానం రూపవైశాల్యం చాలా పెద్దది కనుక చాలామంది పాఠకులకు దీని అపీల్ విస్తృతంగా ఉండవచ్చు. పునర్యానం 2004లో వచ్చింది. దీనిలో పృథ్వి, అగ్ని, రసః (అంటే నీరు అనే ఒక అర్థం), మరుత్, ఆకాశం అని విభాగాలున్నా ప్రతి విభాగంలోనూ సర్గలున్నా, ఇది ఒక దీర్ఘ కవిత. 270పేజీల పాంచభౌతికమైన దీర్ఘ కవిత. ఇది కవి పుట్టింది మొదలు అతని జీవనయానాన్ని తెలియజెప్తున్న కవిత. కవి సొంతూరు, కవి మజిలీలు చేసిన పట్నాలు, అడవులు, మహానగరం. కవి చూసిన సొంతూరి అందాలు, అక్కడి ప్రకృతి, ఋతువులు, మనుషులు, పండగలు, సంతలు, జాతర్లు, పొలాలు ఇలా. సొంతూరు విడిచిపెట్టిన కవికి ప్రపంచంతో పరిచయమేర్పడడం. కొత్త జ్ఞానం కలగడం, జ్ఞానదంతం ఏర్పడడం, తస్మాద్బాధ. ఆకలి తెలియడం, అడవుల్లో ఆదిమవాసుల మట్టి వాసన, దోపిడీ, పోరాటం, మహానగరం దైన్యత. నాస్టాల్జియా మొదలుకొని ఉపన్సిషద్రత్నాకరాలవరకూ కవి మేధామథనం, హృత్క్షోభ – అన్నిటికీ ఆలవాలమీ కవిత. ఇందులో కవి ఏదీ దాచిపెట్టలేదు. అన్నీ చెప్పేశాడు.

ఒక దప్పిక తీరాలంటే
తప్పదొక ప్రయాణం ఆకాశం నుంచి పాతాళానికి
తిరిగి పునర్యానం పాతాళం నుంచి ఆకాశానికి

అని ప్రయాణం మొదలుపెట్టిన కవికి, సొంతుర్లో బహుశా ఏ పెద్దాయనో రాత్రి వేళ నెగడి చుట్టూ కూచొనున్న పిల్లలకి సీతారామకల్యాణం కథ ఇలా చెప్పాడు:

పెళ్ళికొడుకు ఆదిమ ధనుర్ధారి
సత్యంగా గిరివనప్రియుడు
ఆయమ్మ భూమిబిడ్డ
అరక పట్టిన తండ్రికి బోధపడ్డ ఎరుక
నేలకూ, నింగికీ పెళ్ళి జరిగినప్పుడు
నీ మీదా నా మీదా పూలవాన

ఇంకా, ఇంటినీ సొంత ఊరినీ ‘ఏకగాత్ర ఏకగోత్ర సహపంక్తిగా వర్ధిల్లి‘న గంగాలమ్మ జాతర్లనూ విడిచి ‘మాఘ మాసపు తీరిక‘ ఏమాత్రమూ లేని పట్నానికి వెళ్ళాడు. సొంత ఊరిలో అందరి ఆనందమూ తన ఆనందమైతే, పట్నంలో అందరి బాధా కవి బాధ అయింది. అంతేకాక, కవి తలితండ్రులు ఊరు విడిచి వచ్చేశారు, ఆ అనుభవం ఎలా ఉంటుందంటే,

ఆ ఇల్లు వదలి ఆ ఊరు వదలి అమ్మా నాన్నా వచ్చేసిన రోజు
నన్నేదో ప్రగాఢ నిద్ర ఆవహించింది
ఎడ్ల బండిలో వేసుకొచ్చారు ఉన్న సామానంతా
వెంటతేలేకపోయారు వాళ్ళా జాముచెట్టుని, బత్తాయి నీడని, నేరేడు కొమ్మని
వదిలిపెట్టినప్పుడు వాళ్ళా ఊరు
వదులుకున్నాయి వాళ్ళని ఆ కొండలు, ఆ అడవి సంపెంగలు, ఆ ఏరు, ఆ చెరువు, ఆ రామ కోవెల…

అయితే ఇతని ప్రయాణంలో ఒక మజిలీ అడవిలో పడింది. ఆ ‘నేలను చీల్చుకు వచ్చిన’ సమాజం ‘సొమన్నా గిల్లామండే ఆమన్నా తారన్’ (అంటే సవరభాషలో, చుక్కలూ చంద్రుడూ ప్రకాశిస్తున్నయని అర్థం) అని పాడారు. ఆశ్చర్యంగా ఈ కవికి సొంతూర్ని విడిచి వచ్చిన బెంగను లేకుండా చేసింది, ఎందుకంటే వాళ్ళ పాటల్లో కనిపించిన దేవతలతో కవికి పూర్వపరిచయం ఉన్నది కనుక. వారి నివేదనా కవి నివేదన ఒకలాటివే కనుకా. యులీసిస్‌కి సాంగ్ ఆఫ్ ది సైరన్స్ తప్పనట్టు కవికి నగరవాసం తప్పలేదు. ‘దెబ్బకు రెండు ద్రాక్ష పళ్ళు, నీకేం తెలుసు, నాకేం తెలుసు, చీనా పిల్ల, ఆఖరి పిల్లను పట్టుకోండోయ్‘ వంటి ఆటలనుండి ‘ప్లేగులాంటి పని కోసం తెల్లవారే ఉదయాల‘ పట్నానికి వెళ్ళాడు.

నా అసలు ముఖం ఇక్కడెవరికీ తెలియదు,
పరిచయం చేసుకోవాలంటే నా పేరు కన్నా ముఖ్యం నా ఆఫీసు పేరు

చివరిగా, క్షుద్బాధ నిజానికి బాధ కాదు. దీనికి ఏ భాషలోనూ సరైన పేరు లేదు. కరువు వస్తే మనిషి ఏమౌతాడు?

మృగశిర కార్తె వచ్చింది, వెళ్ళిపోయింది
ఆకాశం ఉరుముతూనే ఉంది, అయినా పడదొక్క చినుకు
… అయినా పడదొక్క చినుకు

మొదటి ఆకలి కేకకు భూమి తలవంచింది
రెండవ ఆకలి కేకకు అడవి తలవంచింది
మూడవ ఆకలి కేకకు దేవతలౌ తలవంచారు
నాల్గవ ఆకలి కేకకు నేను సిగ్గుపడ్డాను

వేల యోజనాల దూరంలో ఉన్నా
పసిగట్టడం కష్టం కాదు కరువొచ్చిందని
బుజాన్నెత్తుకుని అప్పటిదాకా ఆడిస్తున్న తల్లి
పడతోసి కిందకు నిందిస్తుంది పిల్లని
‘నువ్వు బిడ్డవి కావే, శాపానివి’

స్టాలిన్ కాలంలో ఉక్రెయిన్ క్షామం కథ వివరంగా చదివిన నాకు ఈ వాక్యాల్లో కవితాత్మకత కన్నా ముఖ్యమైన వాస్తవికత తెలుసు. భయంకరమైన కరువు రక్కసి మనిషిని పీడిస్తే, మనిషి మనిషి కాడు, రాక్షసుడౌతాడు.

తిండి లేని పిల్లలున్న గ్రామాల్లో
పువ్వులు నల్లగా ఉంటాయి
పిల్లలకు తిండి లేని గ్రామాల్లో
చెట్లు రాళ్ళల్లా ఉంటాయి

తిండి లేని పిల్లలున్న దేశాల్లో
పాలు నల్లగా ఉంటాయి
పిల్లలకు తిండి లేని దేశాల్లో
రొట్టెలు రాళ్ళల్లా ఉంటాయి

తిండి లేని పిల్లలున్న లోకంలో
పాటలు నల్లగా ఉంటాయి
పిల్లలకు తిండి లేని లోకంలో
మాటలు రాళ్ళల్లా ఉంటాయి

విషయం ఏదైనా చినవీరభద్రుడి వ్యక్తీకరణ మనసును కుదిపేస్తుంది. పట్నం తెలియాలంటే ‘అగ్ని’ భాగంలో ఐదవ సర్గ చదవండి. చినవీరభద్రుడు తెలియాలంటే పునర్యానం మొత్తం చదవండి. మీకు మీరు అప్పుడే అర్థమౌతారు. గంగోత్రికీ యమునోత్రికీ హిమాలయాలే పుట్టినిల్లైనట్టుగానే పునర్యానంకీ తదనంతర కవిత్వానికీ ఒంటరి చేల మధ్య ఒక్కత్తే మన అమ్మయే పుట్టినిల్లు, మాతృక. ఈ కవికి మానవుడంటే అది పరిపూర్ణుడయిన మానవుడు. మనుషులంటే ‘నేలను చీల్చుకు పుట్టిన’ ఆదిమ సమాజం. కోకిల ప్రవేశించిన కాలం కవిని పూర్తిగా నిర్వచించే సానందగద్గదపదసంచయం. చినవీరభద్రుడి కవిత్వం చదవడమంటే పనిచేసేవారితో కూడి పని చెయ్యడం, పగలంతా ఆనందమధురమైన శ్రమ, రాత్రికి విశ్రాంతి. దేవతలతో సహపంక్తి భోజనం. అసలు, వాడ్రేవు చినవీరభద్రుడంటే మనమే.


గొప్ప కవిత్వంలో ఉండితీరాల్సిన గుణాల గూర్చీ కావ్యమర్మవిజ్ఞాతలు చెప్పిన విషయాలను పరిశీలిస్తే అవి:

– వాగర్థాల మేలుకలయిక
– స్థానికతకూ సార్వజనీనతకూ ఉన్న అవినాభావసంబంధం ప్రస్ఫుటంగా కనిపించడం
– అవసరమైనంత మేరకే ఉండాల్సిన దీర్ఘత, శబ్దప్రయోగాదులు
– కవితలో స్ఫురిస్తున్న సృజనాత్మకత
– పద్యనిర్మాణకౌశల్యం
– చదవగానే పుర్తిగా అర్థం కాకున్నా “ఇందులో ఏదో ఉంది” అనిపించడం (Genuine poetry communicates before it is understood.)
– మళ్ళీ మళ్ళీ చదివించే గుణం. అలా చదివినప్పుడు ముందు కనుగొనని కొత్త అర్థాలు
అందులో కనిపించడం. ఆ స్ఫూర్తితో జీవితాన్ని కొంగొత్త కోణాల్లోంచీ చూడగలగడం
– కొన్నేళ్ళకు రచన భావితరాలకు నికషోపలంగా నిలబడగలగడం

పైనిచ్చిన లిస్ట్‌లోని లక్షణాలన్నీ చినవీరభద్రుడి కవిత్వంలో కనిపించేవే. ఒంటరి చేల మధ్య ఒక్కత్తే మన అమ్మ, పునర్యానం, కోకిల ప్రవేశించిన కాలం – ఈ సంపుటాల్లో కవి ఎంత స్థానికుడో అంత సార్వజనీనుడు. చినవీరభద్రుడికి కవిత్వంలో వైయక్తికానికీ సమష్టికీ సంబంధించి ఉన్న అవగాహన ఉన్నతమైనది. ఈ కవి రచనలు ప్రధానంగా వైయక్తికమే అని ముందనిపించినా అవి సమష్టి శ్రేయస్సును (common good) ఆశించేవే. ‘ఇంత దాకా సామాజిక నిశ్రేణిలో అణచివేతకు గురైనవారు కవిత్వం ద్వారానే ఈ ప్రపంచంలో తమ అస్తిత్వాన్నీ తమ ఆరాటాలనూ నిర్ధారించుకోవడానికి ఉద్వేగపడుతున్న కాలమిది. వారికి నా పూర్తి సమర్థన.’ అని వామపక్షకవులకూ అస్తిత్వవాదులకూ సంఘీభావం తెలిపాడు. చినవీరభద్రుడిప్పుడు నగరంలోనే జీవిస్తున్నాడు. బాల్యం, పుట్టినూరూ, కన్నతల్లి – ఇవి ఎవర్నీ వదిలిపెట్టవు. అయితే, చిన్నపాటి కోకిల కూజితం కవి నగరవాసక్లేశాన్నంతా ఒక మూలకు తుడిచేసింది (ఆ ఒక్క కూజితంతో). తన ముందు తను నిరాయుధుడిగా నిలబడాలనే ప్రయత్నం చేస్తూ కవిత్వాన్నింకా పరిత్యజించలేకున్నానని కవి కన్ఫెస్ చేశాడు. ‘నేను రాయవలసిన కవిత ఇంకా రాయనేలేదు’ అన్నాడు, ఈ పర్ఫెక్షనిస్ట్! దాన్తేకు (Dante Alighieri) ది డివైన్ కామెడీ లాగా చినవీరభద్రుడికి ఈ కవితాసంపుటాలు పారదీసో దిశగా ప్రస్థానానికి ఉపకరిస్తున్నాయి.

వాడ్రేవు చినవీరభద్రుడు మహాకవి.

చినవీరభద్రుడి ప్రస్థానం ఒక కుగ్రామం నుంచి మొదలై చిన్న పట్నంలో తాత్కాలిక మజిలీతో కూడి (సెలవు రాజమండ్రీ, సెలవు) మళ్ళీ అడవి దాపుకెళ్ళి మహానగరంలో ఇప్పుడు స్థిరపడినా, అతన్ని తొలినుంచి ప్రాచీన ఋషుల ద్రష్టల ప్రస్థానాలే ఎక్కువ ప్రభావితం చేశాయి. కవిత్వంలో contradictions ఉంటే అవన్నీ mixtures of opposites! ఈ సమ్మిశ్రమాన్ని పరికించి పరిశీలిస్తేనే కవిత్వానికి ప్రౌఢత్వం అబ్బి, కవికి ముక్తి లభిస్తుంది. అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ నుంచి ఏకమేవాద్వితీయమ్ వంటి ఉపనిషత్సూక్తులే అతనికి దారి చూపుతున్నాయి, పాథేయాన్ని ప్రసాదిస్తున్నాయి. తోవంతా పువ్వులతో పక్షులతో పంచభూతాలతో దేవదూతలతో సహవాసం ఇతనికి బహుమతిగా లభిస్తే, ఇతని మహోత్కృష్టమైన కవిత్వం మనకు బహుమతిగా లభించింది. దీన్ని మనమందరమూ అందుకొని కళ్ళకద్దుకుందాం. ఎంత యూరోపియన్ కవుల, తత్త్వవేత్తల ప్రభావం తన కవిత్వంలో కనిపించినా, కవి ఎంతగా చైనా జపాన్ దేశాలకు చెందిన మహామహులను చూసి ఉద్వేగం చెందినా, చినవీరభద్రుడు భారతీయ కవి. ఉపనిషత్సుధాధారల్లోంచే ఇతని కవిత్వం జన్మించింది. కవికి తను పుట్టి పెరిగిన శరభవరమే కేంద్రంగా నిలిచింది. అక్కడి ప్రకృతినే ప్రతిఫలిస్తూ, అక్కడి ప్రజల మాటల్నే ఆ గంగానమ్మ జాతరలోని పాటల్నే ఈ కవిత్వం ప్రతిధ్వనించింది. కవి మహానగరాల్లో ఏకాకేమోగానీ, ఆ శరభవరం పక్కనున్న అడవిలో ఆ జాతర్ల గుంపులో చినవీరభద్రుడెప్పుడూ ఏకాకి కాడు. అక్కడెక్కడ తనని మనం వదిలిపెట్టినా గోధూళివేళకు చక్కగా ఇల్లు చేరుకోగలడు.


(ప్రథమ ప్రచురణ: నా కుటీరం. కొన్ని మార్పులు చేర్పులతో ఈమాటలో ద్వితీయ ప్రచురణ.)