బయటకి రావాలంటే
లోపల భయం బయటకొస్తుంది.
దిక్కులన్నీ చేదు వెలుగులే
వీధులన్నీ చెద పురుగులే
మనుషులు
ముళ్ళమండల్లా గీసుకుపోతున్నారు.
మనసులు
జెర్రిగొడ్లల్లా పాకుతున్నాయి
తీయగా కనిపిస్తారే గాని
విపించేదంతా భ్రమ.
కుండపోతలా కురుస్తారే గాని
బొట్టు తేమ కూడా కరవు.
పెదాలలో విషాన్ని
మాటల్లో కనపడనీయక
చాటుగా కాటేస్తూ మెలికలు మెలికలుగా
గడుపుకుపోతారు.
ఎదురుపడి కంపులా
వాసన కొడుతుంటే ముక్కుమూసుకున్నా
పాచిపళ్ళు బొంకే పచ్చి అబద్దానికి
రుచిని పూసే రంగులెక్కువే.
కల్తీ వస్తువుల్లా
మోసాలకు మూసలు తొడిగి
చిల్లర ఇష్టాలకు అమ్మకానికి పెట్టి
పెట్టుడు మాటలతో లొంగదీసుకుంటారు.
పలుకరిస్తే ఏ పడగ కిందకు వస్తామో?
మాట ఇస్తే ఏ మత్తు చల్లి మాయ చేస్తారో?
భుజాలపై చేతులేసే పలుకులే
వెనుక గోతులు తీసే పలుగులు
ఒక ముఖంలో రెండు నాలుకలు
ఒకే నాలుకతో రెండు జీవితాలు.
సిగ్గు చెరుపుకుని
బుద్ది విప్పేసి నగ్నంగా వీధిలో
మురుగు కాలువల్లా పారుతూ
చింది పడుతుంటారు.
తప్పించుకోలేని బలహీనత
నిజాల కింద నలగలేక
ముఖానికి గోడ కట్టుకుని
సమాధిచేసిన మాటలపై నిర్మించిన
ఒంటి స్తంభం మేడలో సృష్టించుకున్న
క్షణాల ముందు మోకరిల్లి
ప్రపంచం తృణప్రాయంగా
ధిక్కారతనే వరంగా పొందింది.