రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

చౌరాష్టకం – ఆంధ్రానువాదం

రచన: తాడిగడప శ్యామల రావు
మూలం: లీలాశుకుడు
నవంబర్ 2024

ఈ చౌరాష్టకం బిల్వమంగళులు చెప్పినది. ఆయనే శ్రీకృష్ణకర్ణామృతకర్త. ఆయనే లీలాశుకుడు. వీరి గురించి పంగులూరి వీరరాఘవుడుగారి శ్రీమదాంద్ర మహాభక్తవిజయము పుస్తకం ఉత్తరభాగంలో ఒక వ్యాసం ఉంది. అంతర్జాలంలో కూడా ఈయన చరిత్ర కనిపిస్తోంది.

లీలాశుకుడు 17వ శతాబ్దపు కవి. అసలు పేరు బిల్వమంగళుడు. యౌవనోద్రేకంలో వేశ్య చింతామణిని తగులుకొని దారి తప్పాడు. ఒక భయంకరమైన తుఫాను రాత్రి నానా అగచాట్లూ పడి ఆమె ఇంటికి పోతే ఆమె కాస్తా ఈ మాంసపుముద్దకోసం మనసుపడి యింత తుఫానునూ లెక్కచేయకుండా వచ్చావే, ఈ మనసుని ఆ భగవంతునిపై నిలుపరాదా అన్నది. అంతే ఆయన తక్షణం విరాగియై భగవన్నామస్మరణలో పడ్డాడు. ఆయనకు గోపాలమంత్రం లభించింది. ఎంతో మధురమైన చిక్కని భక్తితో కూడిన కవిత్వం చెప్పాడు. ఆయన చెప్పిన ఈ చౌరాష్టకం అంతా నిందాస్తుతిపూర్వకంగా ఉంది. బహుచమత్కారంగా ‘ఓరి దొంగా కృష్ణా నీకు నమస్కారం’ అంటూ ఎనిమిది శ్లోకాలు ఉన్నాయిందులో. నువ్వు దొంగతనం చేయనిది ఏమీ లేదు ప్రపంచంలో. చివరికి నా సర్వస్వాన్నీ దొంగిలించావు. అందుకే నిన్ను నామనస్సనే చీకటికొట్టులో పడవేశాను. ఇంక ఎక్కడికీ పోలేవు సుమా అంటాడు.

శ్రీకృష్ణాష్టమినాడు అనుకోకుండా ఈ అష్టకంలోని మొదటి శ్లోకాన్ని తెలుగుచేసి ఒక మిత్రునకు పంపితే ఆయన మొత్తం తెలుగుచేయమని ప్రోత్సహించారు. ఈ శ్లోకాలలోని చమత్కారం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అలాగే తెలుగులోనూ రావాలని ఆశిస్తూ ఆంధ్రీకరణం చేశాను.


  1. వ్రజే ప్రసిద్ధం నవనీతచౌరం
    గోపాంగనానాం చ దుకూలచౌరం
    అనేకజన్మార్జితపాపచౌరం
    చౌరాగ్రగణ్యం పురుషం నమామి

    ఉ.
    దొంగిలె పాలువెన్నలను తొల్లిట నీతడు గొల్లపల్లెలన్
    దొంగిలె గొల్లకన్నియలు తోయములాడెడు వేళ చీరలన్
    దొంగతనంబుచేసె బహుధూర్తత నావగు పాపసంపదల్
    దొంగల రాజువీ డనుచు దోయిలి యొగ్గెద వీని కెప్పుడున్
  2. శ్రీరాధికాయా హృదయస్య చౌరం
    నవాంబుదశ్యామలకాంతిచౌరం
    పదాశ్రితానాం చ సమస్తచౌరం
    చౌరాగ్రగణ్యం పురుషం నమామి

    ఉ.
    దొంగిలె నీలపద్మరుచి తొల్తగ వీడు నిజాంగకాంతులన్
    దొంగిలె రాధికాహృదయతోయజ మంతట చిన్నినవ్వులన్
    దొంగిలువేళలన్ నిలువుదోపిడి చేయు నిజాశ్రితాళి నీ
    దొంగల రాజరాజనుచు దోయిలి యొగ్గెద వీని కెప్పుడున్
  3. అకించనీకృత్య పదాశ్రితం యః
    కరోతి భిక్షుం పథి గేహహీనం
    కేనాప్యహో భీషణచౌర ఈదృగ్
    దృష్టః శృతోవా న జగత్రయేపి

    ఉ.
    పాదములంటి మ్రొక్కులిడు వారల సర్వము కొల్లగొట్టుచున్
    బీదల జేసి కేవలము భిక్షుకవృత్తికి ద్రోసి కొంపగో
    డేదియు లేని దుస్థితికి నీడ్చక మానని యిట్టి దొంగ యీ
    యాదవబాలుడే జగములన్నిట వీనికి మ్రొక్కెదన్ సదా
  4. యదీయ నామాపి హరత్యశేషం
    గిరిప్రసారాన్ అపి పాపరాశీన్
    ఆశ్చర్యరూపో నను చౌర ఈదృగ్
    దృష్టః శృతోవా న మయా కదాపి

    ఉ.
    ఇంతటి దొంగ వీడనుచు నెవ్వరి యూహకు రాదు సు
    మ్మెంతకు నైన వీడు దగు నించుక పేరు దలంచినంతనే
    వింతగ నాదు పాపగిరి వీడు హరించుకపోయె నెన్నడున్
    చింతల దీర్చుచోరుని విచిత్రము విన్నది కన్నదున్నదే
  5. ధనం చ మానం చ తథేంద్రియాణి
    ప్రాణాంచ హృత్వా మమ సర్వమేవ
    పలాయసే కుత్ర ధృతోద్య చౌర
    త్వం భక్తిదామ్నాసి మయా నిరుద్ధః

    సీ.
    నాధనంబుల నెల్ల నయముగా నీపాలు చేసికొన్నావుగా చిన్నిదొంగ
    నా మానధనమును శ్యామసుందర నీవు కొల్లగొట్టితివిగా గోపబాల
    అరయ నా సర్వేంద్రియముల సత్వంబుల నీవ గైకొంటివి నీటుకాడ
    నాప్రాణములు కూడ నావి కావాయెనే నీయందు నిలచెనే నీలవపుష
    ఆ.
    ఇన్ని యపహరించి యెందు బోయెదవయ్య
    వెన్నదొంగ నిన్ను విడుచు టెట్లు
    భక్తిరజ్జువులను బంధించినాను నా
    హృదయమందిరమున నింపు మీఱ
  6. ఛినత్సి ఘోరం యమపాశబంధం
    భినత్సి భీమం భవపాశబంధం
    ఛినత్సి సర్వస్య సమస్తబంధం
    నైవాత్మనో భక్తకృతం తు బంధం

    తే.
    త్రెంచెదవు ఘోరయమపాశ మంచితముగ
    త్రెంచెదవు భవపాశ ముదీర్ణశక్తి
    త్రెంచెద వఖిలబంధముల్ దీనుల గని
    భక్తిపాశంబులను ద్రెంచ వశమె నీకు
  7. మన్మానసే తామసరాశిఘోరే
    కారాగృహే దుఃఖమయే నిబద్ధః
    లభస్వ హే చౌర! హరే! చిరాయ
    స్వచౌర్యదోషోచితమేవ దండం

    చం.
    అరయగ నామనోకుహర మంతటి చీకటి కొట్టులేదు శ్రీ
    హరి పదునాల్గులోకముల నట్లగుటన్ నిను పట్టి దెచ్చి చె
    చ్చెర నట కార బెట్టితిని చేసిన చిత్రము లిన్ని యన్నియా
    మురహర నీవొనర్చినవి ముట్టిన శిక్షప్రశస్తమైనదే
  8. కారాగృహే వస సదా హృదయే మదీయే
    మద్భక్తిపాశదృఢబంధననిశ్చలః సన్
    త్వాం కృష్ణ హే! ప్రలయకోటిశతాంత రేపి
    సర్వస్వచౌర! హృదయాన్ న హి మోచయామి

    చం.
    హరి నిను నామనోకుహర మందున నూరక నుంచినానుబో
    యురికెద వంతలోనె నను యూహను నిన్ను బిగించి కట్టితిన్
    మురహర భక్తిరజ్జువుల మోదము మీఱగ దొంగవాడ యీ
    చెరబడి యుండవోయి యిక చెల్లవు టక్కులు పారిపోవగన్

ఇతి శ్రీబిల్వమంగళ విరచిత చౌరాష్టకం సంపూర్ణం

శ్రీబిల్వమంగళులు రచించిన చౌరాష్టకానికి స్వేచ్ఛానువాదం సంపూర్ణం.

    
   

17అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    sarma November 2, 2024 12:25 am

    లీలాశుకుని గూర్చి పూర్తిగా తెలియడు. చోరాష్టకమే అసలు తెలియడు. లీలా శుకుడు(బిల్వమంగళుడు) విలక్షణ కవి. అనుభవ సారం చెప్పినవాడు.

    చాలాకాలం తరవాత మీనుంచి చాలామంచి టపా.

    ఈమాటవారు ఇటువంటివి కూడా ప్రచురిస్తూ ఉంటారా? అప్పుడపుడు.

    [మంచి సాహిత్యం అనుకుంటే ఏదైనా ప్రచురిస్తాం. సాహిత్యంపై మాకు ఏ నిర్వచనాలు నిబంధనలు లేవని ఇంకెన్ని వేలసార్లు చెపుతూ ఉండాలో! – సం.]

  2. 2
    శర్మ దంతుర్తి November 3, 2024 9:59 am

    ఏడవ పద్యం అద్భుతం. నా మనస్సనే చీకటి కొట్టులో బంధించాను అని చెప్పడం. ఎనిమిదోది కూడా (ఎలా పారిపోతావో చూస్తాను అనడం). ఆయన ఆ కొట్టులోకి వస్తే ఇంకేముంది, నారాయణీయంలో భట్టాత్తిరి గారు చెప్పినట్టూ ‘కాంతం కాంతి నిధానతోపి, మధురం మాధుర్యధుర్యాదపి’

    శ్యామలగారు, అసంపూర్తిగా ఉన్న పూతన ఖండ కావ్యం ఈమాటకి పంపి ప్రచురించండి పూర్తిగా. ఇదే సరైన సమయం.

  3. 3
    తాడిగడప శ్యామల రావు November 8, 2024 8:56 am

    నవంబరు రెండవ తారీఖున ఒక శర్మగారున్నూ ఐదున మరొక శర్మగారున్నూ మెచ్చినందుకు వారిద్దరికీ ధన్యవాదాలు.

    సాహిత్యంపై మాకు ఏ నిర్వచనాలు నిబంధనలు లేవని ఇంకెన్ని వేలసార్లు చెపుతూ ఉండాలో అని సంపాదకులు అన్నారు కాని ఆశర్మగారు ఈమాటను తరచుగా చదువుతూ ఉండకపోవచ్చు కాబట్టి వారికి తెలిసి ఉండకపోవచ్చునేమో.

    దంతుర్తి వారు అసంపూర్తిగా ఉన్న నా పూతన ఖండ కావ్యాన్ని ఈమాటకి పంపి ప్రచురించండి పూర్తిగా, ఇదే సరైన సమయం అన్నారు. మంచిసలహా – అలాగే చేస్తాను త్వరలో. ఆపైన ఈమాటవారి యిష్టం.

  4. 4
    తమ్మినేని యదుకుల భూషణ్ November 8, 2024 9:44 pm

    అధికమాసం (పురుషోత్తమ మాసం అనీ పిలుస్తారు) లో చౌరాష్టకం గానం చేసే వైష్ణవ సంప్రదాయం ఒకటి ఉంది. ఇక ఈ అష్టకం ‘ఉపజాతి’ అన్న మిశ్ర ఛందస్సులో ఉన్నది. ఇంద్రవజ్ర, ఉపేంద్రవజ్రను సమ విషమపాదాల్లో ప్రస్తరిస్తే వచ్చే ఛందమిది (మినహాయింపు అష్టకంలో చివరిది – అందులో ప్రస్తరించిన పాదాలు ఇంద్ర వజ్ర (18 మాత్రలు), ఉపేంద్ర వజ్రవి (17 మాత్రలు) కావు, మరేదో వృత్తం -7 మాత్రలు ఎక్కువ). అన్ని అష్టకాల్లాగే ఇది గాన యోగ్యం. అనువాదంలో అసలు గొడవ ఇక్కడి నుండే మొదలవుతుంది. మూలంలో సంగీత గుణమున్న కవిత్వాన్ని అనువాదంలో మెప్పించలేము. అష్టకాలు మరీ కష్టం.

    అనువాదకులు అధికంగా మాలికలు ఎంచుకున్నారు (4 ఉత్పలమాలలు & 2 చంపకమాలలు – 28 మాత్రలు – వజ్రలతో పోలిస్తే 10-11 మాత్రలు ఎక్కువ); సీసం ఆటవెలది, తేటగీతి కూడా వచ్చాయి. ఇందులో తేటగీతితో చేసిన అనువాదం మేలుగా ఉంది. కారణం – తేటగీతి పాదంలో తక్కువ అంటే 17 మాత్రలు, ఎక్కువ అంటే 19 – మధ్యస్థంగా 18 మాత్రలు వస్తాయి. కొంత మెలకువతో రాస్తే క్లుప్తత చెడకుండా భావాన్ని, ఉపజాతి లోని స్ఫూర్తిని సమంగా పట్టుకురావచ్చు – ఏమాత్రం దండుగ్గణాలు లేకుండా. సంస్కృతంలో ఏదో ఒక వృత్తాన్ని ఎన్నుకొని చివరికంటా దానితోనే బండి లాగించడం పరిపాటి, మన కవుల్లో దూకుడు ఎక్కువ, అది అలా ఉండనిస్తే, అక్కడక్కడ లోతైన వ్యంగ్యం ఉన్నా – మూలంలో కథ అందరికి తెలిసినదే. కావున చౌరాష్టకం మొత్తం తేటగీతులతో రాస్తే మరింత అందగించేది. మూలంలో – వ్యంగ్యంగా, క్లుప్తంగా చెప్పడం ఉంది, ఎక్కడా వివరణ అన్నది లేదు.

    ఎంచుకున్న వృత్తం ఉపజాతి కాబట్టి, ఆ పరిమితులకు లోబడి, ఎంతో సంయమంతో నడిచింది వ్యవహారం. ఇక అనువాదంలోకి ప్రవేశిస్తే –

    మొదటి శ్లోకం, దానికి ఆంధ్రీకరణ:

    వ్రజే ప్రసిద్ధం నవనీతచౌరం
    గోపాంగనానాం చ దుకూలచౌరం
    అనేకజన్మార్జితపాపచౌరం
    చౌరాగ్రగణ్యం పురుషం నమామి

    దొంగిలె [పాలు]వెన్నలను [తొల్లిట నీతడు] గొల్లపల్లెలన్
    దొంగిలె గొల్లకన్నియలు [తోయములాడెడు వేళ] చీరలన్
    దొంగతనంబుచేసె [బహుధూర్తత నావగు] పాప[సంపదల్]
    దొంగల రాజువీ డనుచు దోయిలి యొగ్గెద [వీని కెప్పుడున్]
    [కుండలీకరణల్లో ఉన్నవి – మూలంలో లేని అంశాలు ]

    చిన్ని కృష్ణుడు వెన్నదొంగ అని తెలుసు కానీ, పాల దొంగ అని తెలియడం ఇదే ప్రథమం – కుండంత భావాన్ని కొండంత వృత్తంలో చెప్ప బోతే వచ్చే చిక్కులు – మూలంలో నవనీతం – అనువాదంలో పాలలో కలిసిపోయింది.
    కొండ మీద కూచుని రోజుకొక కృతి రచించిన అన్నమయ్య కూడా ‘ కినిసి వెన్న దొంగిలె వీడే’ అన్నాడే గానీ పాల ప్రస్తావన తీసుకురాలేదు. (5 వ పద్యానువాదంలో “వెన్నదొంగ నిన్ను విడుచు టెట్లు” అన్న వాక్యమున్నది – పాల ప్రస్తావన లేదక్కడ). ఇక, జలకాలు ఆడేటప్పుడే కదా బట్టలు మాయమయినది – మూలంలో స్నానాల ప్రస్తావన తేలేదు. అది అనువాదంలోకి వచ్చి చేరింది. కవిత్వంలో పాఠకుని ఊహకు వదిలేయవలసిన విషయాన్ని విస్తరించడం, వివరణకు పూనుకోవడం పెద్ద దోషం – మూలంలోని లేని దోషాన్ని అనువాదంలో స్థాపించడం మరింత పెద్ద తప్పు. అంతేకాదు, అగ్రగణ్యుడు అంటే రాజు అనడం కూడా తప్పు – వీరాగ్రగణ్యుడు అంటే వీరుల్లో మొదట లెక్కించవలసిన వాడు అంతే గాని వీరులకు రాజు కాదు. ఇన్ని తప్పులు ఎందుకు దొర్లాయి అంటే – మూలంలో కావ్యాత్మను పట్టుకోలేకపోవడం, వృత్తం ఎంపికలో ఔచిత్యం లేకపోవడం. కాబట్టి మూలంలో, 70 మాత్రల్లో క్లుప్తంగా, బలంగా – గానయోగ్యంగా ఉన్నవి – దండుగ్గణాలు చేరిన అనువాదం, పేలవ ప్రదర్శన గా మారిపోయింది.
    ఐదవ శ్లోకం దానికి ఆంధ్రీకరణ:

    “ధనం చ మానం చ తథేంద్రియాణి
    ప్రాణాంచ హృత్వా మమ సర్వమేవ
    పలాయసే కుత్ర ధృతోద్య చౌర
    త్వం భక్తిదామ్నాసి మయా నిరుద్ధః” (5)

    నాధనంబుల నెల్ల [నయముగా నీపాలు చేసికొన్నావుగా]( చిన్నిదొంగ)
    నా మాన[ధన]మును (శ్యామసుందర) [నీవు కొల్లగొట్టితివిగా] (గోపబాల)
    అరయ నా సర్వేంద్రియముల సత్వంబుల నీవ గైకొంటివి (నీటుకాడ)
    నాప్రాణములు [కూడ నావి కావాయెనే నీయందు నిలచెనే] (నీలవపుష)

    ఇన్ని యపహరించి యెందు బోయెదవయ్య
    [వెన్నదొంగ నిన్ను విడుచు టెట్లు]
    భక్తిరజ్జువులను బంధించినాను నా
    [హృదయమందిరమున నింపు మీఱ] ( 5)

    (మూలము నందు లేని సంబోధనలు ) [మూలంలో లేనివి ]

    మూలంలో కృష్ణ సంబోధన అష్టకం ముగిసేటప్పుడు కేవలం ఒక్క సారి వినిపిస్తుంది – అనువాదంలో ఐదారు వచ్చి చేరాయి. మూలంలో రెండు పాదాల్లో చెప్పిన భావం అనువాదంలో సీసమై విస్తరించింది. తర్వాత రెండు పాదాల్లోని భావం చెప్పడానికి అనువాదంలో ఒక ఆటవెలది ప్రవేశించింది. అనువాదం కత్తి మీద సాము, అందులోను గానయోగ్యమైన అష్టకాలకు ఇక చెప్పేదేముంది. దాని కన్నా – మూలంలోని విశేషాలు సరళంగా అనువాదకునికి తెలిసిన వాడుకభాషలో వివరించడం శ్రేయస్కరం అనిపిస్తుంది. లేదా గురజాడ మార్గంలో, ముత్యాల సరాల్లో అణకువగా తేలిక తెలుగులో అనువాదం చేయవచ్చు.
    (ఉరామరికగా, కేవలం ఉదాహరణ కోసం సుమా)

    పేరుమోసిన వెన్న దొంగవు
    గొల్లభామల వల్లెవాటులు,
    జన్మజన్మల పాపభారం –
    హరించు నీకు నమస్కారం 1

    రాధమనసును చూరగొంటివి
    మెరిసిపోయే మేఘకాంతిని,
    పంచ జేరినవారి సమస్తం –
    హరించు నీకు నమస్కారం 2

    ఆరవ శ్లోకం దానికి ఆంధ్రీకరణ :
    ‘ తేటగీతితో చేసిన అనువాదం మేలుగా ఉంది ‘ అని పైన తెలిపి ఉన్నాను. ఛినత్సి, భినత్సి అన్న రెండు సంస్కృత క్రియలను తెనుఁగులో ఏకంగా త్రెంచి పడ వైచినా – దాని దుంప తెంచిరి అది అటుండనిద్దాం- బిల్వమంగళుని స్ఫూర్తి, ఆర్తి పట్టుకున్నారు శ్యామలకవి – ఉపజాతిని ఎంతో ఔచిత్యంతో తేటగీతిలో తెనిగించారు.
    “దించెదను కవిభావ ముదీర్ణశక్తి ” అని గొప్పగా రాశారు ఈ పద్యం.

    ఛినత్సి ఘోరం యమపాశబంధం
    భినత్సి భీమం భవపాశబంధం
    ఛినత్సి సర్వస్య సమస్తబంధం
    నైవాత్మనో భక్తకృతం తు బంధం (6)

    త్రెంచెదవు ఘోరయమపాశ మంచితముగ
    త్రెంచెదవు భవపాశ ముదీర్ణశక్తి
    త్రెంచెద వఖిలబంధముల్ దీనుల గని
    భక్తిపాశంబులను ద్రెంచ వశమె నీకు

    స్థాలీపులాకంగా అనువాదంలో కష్టసుఖాలను వివరించాను. ఇంకా ఎవరైనా అనువాదాల్లో మెలకువలు తెలుసుకోదలిస్తే: “అనువాదంలో మెలకువలు

    ఇంత కష్టమైన పనిని తలకెత్తుకున్నందుకు తాడిగడప శ్యామలరావు గారికి అభినందనలు తెలుపుతున్నాను. అందరిలాగా, వారి ఇతర పద్యరచనల కోసం ఎదురుచూస్తాను.

  5. 5
    తాడిగడప శ్యామల రావు November 9, 2024 2:21 am

    చౌరాష్టకానువాదానికి యదుకులభూషణుల విమర్శ రమ్యంగా ఉంది.

    నేను చేసినది చౌరాష్టకానికి స్వేచ్ఛానువాదం అని మనవి చేయటం జరిగింది.

    ఒక భాష నుండి మరొక భాష లోనికి అనువదించటం లోని సాధకబాధకాలు తెలిసిన యదుకులభూషణులు అమూలకమైన మాటల నెత్తి చూపటమూ తప్పుబట్టటమూ కొంచెం అచ్చెరువు కలిగించింది. మూలం లోని పదాలను కాని తత్సమానాలను కాని ప్రయోగిస్తూ అలాగే భూలోకంలోని భావానికి న్యూనాతిరిక్తంగా ఏమీ లేకుండా మూలదైర్ఘ్యాన్నే పాటించుతూ అనువదించటం బహుకష్టం. పద్యం కృతకం అయిపోయే ప్రమాదం హెచ్చు.

    మహాభారతాంధ్రీకరణం నాటి నుండి నేటిదాకా కవులు అనువాదంలో స్వేచ్ఛ తీసుకున్నారు. మక్కికిమక్కి అనువాదాలు కళగట్టినది తక్కువే కదా.

    విషయాన్ని సందర్భానుసారంగా పెంచటం కొత్త విషయం కాదు కదా. పాల దొంగతనం వేమనగారే అంటించారు కదా కృష్ణుడికి గొల్ల యిండ్లపాలు కోరనేల అని. నేనేమీ కొత్తగా అన్నది లేదు.

    ఇకపోతే విమర్శకులు నేను బిల్వమంగళుని స్ఫూర్తి, ఆర్తి పట్టుకున్నానని అన్నారు. చాలా సంతోషం.

    యదుకులభూషణులకు ధన్యవాదాలు.

  6. 6
    తాడిగడప శ్యామల రావు November 9, 2024 10:58 am

    మొదటి శ్లోకానికి నేను ఉత్పలమాలను ఎంచుకున్నాను. దానిని వీరు చీల్చి చెండాడారు. వృత్తం ఎంపికలో ఔచిత్యం లేకపోవడం గురించి వారి వాదన వారిది. మూలం యధాతధంగా రాకపోవటమూ దీర్ఘవృత్తాన్ని ఎంచుకోవటమూ తత్కారణంగా కొన్ని కొత్తపదాలు చేరటమూ వంటివి వారికి నచ్చలేదు. వారి దృక్కోణం వారిది.

    కాని వారు “మూలంలో, 70 మాత్రల్లో క్లుప్తంగా, బలంగా – గానయోగ్యంగా ఉన్నవి – దండుగ్గణాలు చేరిన అనువాదం, పేలవ ప్రదర్శన గా మారిపోయింది” అన్నారు. ఈమాట ఆశ్చర్యం కలిగించింది. నిజం చెప్పాలంటే కొంచెం బాధించింది.

    దొంగిలె పాలువెన్నలను తొల్లిట నీతడు గొల్లపల్లెలన్
    దొంగిలె గొల్లకన్నియలు తోయములాడెడు వేళ చీరలన్
    దొంగతనంబుచేసె బహుధూర్తత నావగు పాపసంపదల్
    దొంగల రాజువీ డనుచు దోయిలి యొగ్గెద వీని కెప్పుడున్

    అన్న ఈవృత్తం గానయోగ్యంగా లేదని వారు ఎలా భావించారో అర్ధం కాదు. క్లుప్తత వీడి దీర్ఘం అవటం వలన గానయోగ్యం కాకుండా పోయిందా? కొత్తపదాలతో పొడుగై పేలవమై గానయోగ్యం కాకుండా పోయిందా? దీర్ఘవృత్తాలు గానయోగ్యాలు కావనుకుంటే ఎవ్వనిచేజనించు పద్యం కూడా గానయోగ్యం కాదు కదా. తిరుపతివేంకట కవుల చెల్లియో చెల్లకో పద్యం అస్సలు గానయోగ్యం కాదు కదా? ఇక మందారమకరంద అంటూ సాగే సీసం ఐతే అస్సలు గానయోగ్యం కాకుండా పోవాలి కదా?

    వీరిదృష్టిలో దండుగ గణాలు చేరాయి. సరే, అలా చేరితే అవి దైర్ఘ్యాన్ని ఆపాదించగలవు కాని పద్యాన్ని ఏకంగా గానయోగ్యం కాకుండా చేస్తాయా?

    ఈపద్యం గానయోగ్యంగా ఉందని నావిశ్వాసం. నేను గాయకుడిని కాను. ఐతే పాడి మరీ ఋజువు చేయగలిగి ఉండేవాడి నేమో. మిగిలిన పద్యాలూ నాదృష్టిలో గానయోగ్యాలే. కావనుకుంటే నేను చేయగలిగినది లేదు.

    దండుగ గణాలు అంటే ఒక సంగతి గుర్తుకు వస్తోంది కరుణశ్రీ గారు కుంతీకుమారి ఖండకావ్యంలో దిగుచున్నది క్రిందికి మెట్లమీదుగన్ అంటారు. దిగటం అంటేక్రిందికి కాక పైకి కూడా ఉంటుందా? క్రిందికి అనటం దండుగే కదా. మెట్లమీదుగన్ అని మాత్రం ఎందుకు? మేడ దిగాలంటే మెట్లే దిగాలి కదా (అప్పట్లో లిఫ్టులు లేవు సుమా) కాబట్టి మెట్లమీదుగన్ అన్నది కూడా దండగే కదా. ఇలా పూరణకోసం పదాలు పడటం దండుగ గణాల వ్యవహారమే కదా. ఇలా లెక్కలు వేస్తూ పోయి కరుణశ్రీకి పద్యాలు వ్రాయటం చేతకాదనీ కుంతీకుమారి, పుష్పవిలాపమూ పేలవకవిత్వాలనీ అనటం చేయవచ్చునేమో. ఏమో నాకు తెలియదు. ఈశంకల వంకల డొంకల నుండి ఏకవి బ్రతికి బయటపడగలడో తెలియదు.

  7. 7
    తాడిగడప శ్యామల రావు November 10, 2024 12:51 am

    శ్రీమదాంధ్రమహాభాగవతము దశమస్కంధము పూర్వభాగములోని పద్యాలు రెండు చూపుతున్నాను శ్రీకృష్ణబాలుడు పాలు కూడా దొంగిలించిన వాడేనని సాక్ష్యంగా.

    మ.కో. పుట్టిపుట్టడు నేడు దొంగిలబోయి మాయిలు సొచ్చి తా
    నుట్టి యందక ఱోళ్ళు బీటలు నొక్క ప్రోవిడి యెక్కి చే
    వెట్టజాలక కుండ క్రిందొక పెద్దతూ టొనరించి మీ
    పట్టి మీగడపాలు జేరల బట్టి త్రావె తలోదరీ 310

    కం. ఓయమ్మ నీకుమారుడు
    మాయిండ్లను పాలుపెరుగు మననీడమ్మా
    పోయెద మెక్కడి కైనను
    మాయన్నల సురభులాన మంజులవాణీ 329

    తెలుగు భాగవతం సరే, వ్యాసభగవానుల మూలంలో ఎలా ఉన్నదీ చూదాం. దశమస్కంధే పూర్వార్ధే తృణావర్తమోక్షో నామ సప్తమోఽధ్యాయః అని ఆతరువాత విశ్వరూపదర్శనే అష్టమోఽధ్యాయః వస్తుంది.ఆ అష్టమోధ్యాయం నుండి మూడు శ్లోకాలను ఉటంకిస్తున్నాను.

    వత్సాన్ ముంచన్ క్వచిదసమయే క్రోశసంజాతహాసః
    స్తేయం స్వాద్వత్త్యథ దధి పయః కల్పితైః స్తేయయోగైః .
    మర్కాన్ భోక్ష్యన్ విభజతి స చేన్నాత్తి భాండం భిన్నత్తి
    ద్రవ్యాలాభే స గృహకుపితో యాత్యుపక్రోశ్య తోకాన్ .. 29..

    హస్తాగ్రాహ్యే రచయతి విధిం పీఠకోలూఖలాద్యైః
    ఛిద్రం హ్యంతర్నిహితవయునః శిక్యభాండేషు తద్విత్ .
    ధ్వాంతాగారే ధృతమణిగణం స్వాంగమర్థప్రదీపం
    కాలే గోప్యో యర్హి గృహకృత్యేషు సువ్యగ్రచిత్తాః .. 30..
    (దీనిని పోతనగారి 310వ పద్యంతో పోల్చి చూడండి)

    ఏవం ధార్ష్ట్యాన్యుశతి కురుతే మేహనాదీని వాస్తౌ
    స్తేయోపాయైర్విరచితకృతిః సుప్రతీకో యథాఽఽస్తే .
    ఇత్థం స్త్రీభిః సభయనయనశ్రీముఖాలోకినీభిః
    వ్యాఖ్యాతార్థా ప్రహసితముఖీ న హ్యుపాలబ్ధుమైచ్ఛత్ .. 31

    ఈ శ్లోకాలను ఆధారం చేసుకొని పోతనామాత్యులవారు విజృంభించి 307వ పద్యం నుండి 334వ పద్యం వరకూ గోపికలు యశోదాదేవితో మొఱపెట్టుకొనటం బహుచమత్కారంగా వర్ణించారు.

    మూలంలో కూడా స్తేయయోగార్హమైన వస్తువులలో దధి పయః అని పెరుగునూ పాలనూ పేర్కొన్నారు.

    వేమన్నగారు గొల్లయిండ్ల పాలు కోరినాడని అనటం దాకా అక్కర లేదు – పోతన్నగారే పాలుపెరుగు మననీడమ్మా అన్నారు గొల్లెతలని చెప్పారని అనటం దాకా కూడా అక్కర లేదు. మూలంలోనే గోపాలకృష్ణుల వారి పయః స్తేయం స్పష్టంగానే ఉన్నది.

  8. 8
    Tupurani Krishnama Chary November 10, 2024 1:35 am

    శ్యామల రావు గారి చౌరాష్టకం అనువాదపద్యాలను చూడడం జరిగింది పద్యాలు చాలా బాగున్నాయి. వారికి నా హృదయపూర్వక అభినందనలు! పద్యాలతో పాటు విజ్ఞుల ప్రతిస్పందనలు కూడా చూడడం జరిగింది. అయితే దాదాపుగా అందరూ పద్యాలు బాగున్నాయని ప్రతిస్పందిస్తే ఒక విమర్శలో మాత్రం అనువాదం మూలంలో లేని విషయాలను చేర్చిందని, పద్యాలు పేలవంగా ఉన్నాయని, గానయోగ్యంగా లేవని తెలుపడం జరిగింది!

    దీనికి స్పందిస్తూ శ్యామలరావు గారు ఇచ్చిన సమాధానంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఇంకొంచెం లోతుగా వెళితే, విమర్శ సహేతుకంగా లేదేమోనని, విమర్శ లోని ఈ క్రింది వాక్యంతో తేటతెల్లమౌతుంది.

    “చిన్ని కృష్ణుడు వెన్నదొంగ అని తెలుసు కానీ, పాల దొంగ అని తెలియడం ఇదే ప్రథమం”

    బహూశా విమర్శకులకు పోతన గారి ఈ భాగవత పద్యం గుర్తుకు రాలేదేమో!

    కం. ఓయమ్మ నీకుమారుడు
    మాయిండ్లను పాలుపెరుగు మననీడమ్మా
    పోయెద మెక్కడి కైనను
    మాయన్నల సురభులాన మంజులవాణీ!

    శ్యామలరావు గారి కలంనుండి మరిన్ని చక్కటి పద్యాలు వస్తాయని, ఈ మాట వేదిక ద్వారా వాటిని చూడాలని అభిలషిస్తూ వారికి మరొక్కసారి నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా!

  9. 9
    శర్మ దంతుర్తి November 10, 2024 9:19 am

    చిన్ని కృష్ణుడు వెన్నదొంగ అని తెలుసు కానీ, పాల దొంగ అని తెలియడం ఇదే ప్రథమం – కుండంత భావాన్ని కొండంత వృత్తంలో చెప్ప బోతే వచ్చే చిక్కులు – మూలంలో నవనీతం – అనువాదంలో పాలలో కలిసిపోయింది.

    సంస్కృత భాగవతం నేను చదవలేదు కానీ, పోతన భాగవతంలో కొన్ని పద్యాలలో కృష్ణుడు వెన్న, పాలు, పెరుగు, నేయి, ఒకటేమిటి మొత్తం Dairy Industry అంతా కొల్లగొట్టాడని ఉంది. అలా అని గోకులం నాశనం చేసినట్టు లేదు. నిజానికి కృష్ణుడు పుట్టాకనే మొత్తం గోకులంలో Dairy Industry అంతా బాగా వృద్ధి చెందినది అంటారు. అదీగాక “మధురానగరిలో చల్లనమ్మ బోయెద దారి వీడుము కృష్ణా …” అనే పాట విని ఉండొచ్చు తెలుగువాళ్ళు. చల్ల అంటే మజ్జిగే కదా?

    మత్త. పుట్టి పుట్టఁడు నేడు దొంగిలఁ బోయి మా యిలు జొచ్చి తా
    
నుట్టి యందక ఱోలు పీఁటలు నొక్క ప్రోవిడి యెక్కి చై
    
పెట్టఁ జాలక కుండ క్రిం దొక పెద్ద తూఁ టొనరించి మీ
    
పట్టి మీఁగడపాలు చేరలఁ బట్టి త్రావెఁ దలోదరీ! [10.1-310 ]

    మిగతా “పాలు కొల్లగొట్టే” పద్యాలు 10.1-306 నుంచి 329 వరకూ కింద లింకులో చూడవచ్చు.
    https://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=45

    అనువాదం చేయడంలో నేనూ కొన్ని కష్టాలు పడ్డాను కనక ఓ మాట చెప్పగలను. ఒక భాష, సంసృతిలోంచి మరో భాష/సంస్కృతిలోకి సరిగ్గా అనువాదం చేయడం దాదాపు అసంభవం కొన్ని వెసులుబాట్లు కల్పించుకోకపోతే. పోతన వ్యాస భాగవతం ఒకటే కాక అనేక గ్రంధాలు దగ్గిర ఉంచుకుని భాగవతాన్ని తెలుగులోకి అనువదించాడు అంటారు. అందులో శ్రీధర భాగవతం కూడా ఒకటి అని విన్నాను. పోతన తెలుగు భాగవతంలో మీగడ అన్నం తింటూ మాగాయ/ఊరగాయ నంచుకున్నాడని ఉంటుంది (తెలుగు చందమామలో కూడా). ఆంధ్రా నుండి కొంచెం పైకి ఉత్తరంగా వెళ్తే ఆవకాయ, మాగాయ, ఊరగాయ అంటే ఎవరికీ తెలియదు; “అచార్” అనే పదం తెల్సినా అది ఆవకాయ/మాగాయ కింద రాదని నేను అనుకుంటున్నా. భాగవతంలోకి మాగాయ/ఊరగాయ ఎలా వచ్చిందనేది పోతన సృష్టే అని చెప్పుకోవాలి.

    రవీంద్రనాథ్ టాగోర్ విషయంలో పేర్లు తెలుగు లోకి అనువదించడం పెద్ద తలనెప్పి. అవేమిటో కూడా అర్ధం కావు ఒక్కొక్కప్పుడు. ఉదా: ఒక పేరు “ఫైల్నా.” పోనీ మొత్తం అన్నీ పేర్లు మార్చి తెలుగులో రాద్దామా అంటే కుదరదు/నప్పదు. లేకపోతే చందమామ కధలాగా “ఒకవూర్లో ఓ రాజు ఉండేవాడు, రాజుకి ముగ్గురు కొడుకులు. ….” అలా తయారౌతుంది.

    అయితే యదుకుల భూషణ్ గారి వ్యాఖ్య అద్భుతంగా ఉంది. ఇటువంటి వ్యాఖ్యలతోనే రచయితలు తమ రచనలు మెరుగుపర్చుకునే అవకాశం ఉంది. మంచి సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు.

  10. 10
    సురేశ్ కొలిచాల November 10, 2024 11:29 am

    నేను కూడా గత ఆగస్టు నెలలో ఈ చౌరాష్టకానికి అనువాదం ప్రయత్నించాను. సంస్కృత మూలంలో ఉన్న భావాలను, శబ్దాలను వీలైనంతవరకూ ఉపయోగించడం నాకు ప్రధానం కాబట్టి, సులభమైన రగడలతో అనువాదం ప్రయత్నించాను. దీన్ని ఆగస్టులో ఫేస్‌బుక్ మీద కామెంటుగా పోస్ట్ చేసాను:

    వ్రజేప్రసిద్ధం నవనీత చోరం
    గోపాంగనానాంచ దుకూలచోరం |
    అనేక జన్మార్జిత పాప చోరం
    చోరాగ్ర గణ్యం పురుషం నమామి || (1)

    రేపల్లెలో తాను నవనీత చోరుండు
    గోపాంగనల యెడ దుకూలముల చోరుండు
    పాహియను వారికిని పాపాల చోరుండు
    చోరాగ్ర గణ్యునికి జోతలర్పించెదన్!

    శ్రీరాధికాయా హృదయస్య చోరం
    నవాంబుదశ్యామలకాంతిచోరం .
    పదాశ్రితానాం చ సమస్తచోరం
    చోరాగ్రగణ్యం పురుషం నమామి. 2

    శ్రీరాధికాసతికి హృదయాబ్జ చోరుండు
    క్రొక్కారు మబ్బులకు కఱకాంతి చోరుండు
    పాదాశ్రితులకెల్ల సకలార్థ చోరుండు
    చోరాగ్ర గణ్యునికి జోతలర్పించెదన్! (2)

    అకించనీకృత్య పదాశ్రితం యః
    కరోతి భిక్షుం పథి గేహహీనం
    కేనాప్యహో భీషణచౌర ఈదృగ్-
    దృష్టఃశ్రుతో వా న జగత్త్రయేఽపి ..3..

    అకించనులను జేయు ఆశ్రితావళినితడు
    దారి భిక్షకుఁ జేయు దామోదరుండితడు
    ఇటువంటి చోరుండు ముల్లోకమున లేడు
    చోరాగ్ర గణ్యునికి జోతలర్పించెదన్! (3)

    యదీయ నామాపి హరత్యశేషం
    గిరిప్రసారాన్ అపి పాపరాశీన్ .
    ఆశ్చర్యరూపో నను చౌర ఈదృగ్
    దృష్టః శ్రుతో వా న మయా కదాపి .. 4..

    ఎవరి నామము తలచ ఎడలించు పూర్తిగా
    *పర్వతము వలెనున్న పాపరాశులనైన *
    *అటువంటి చోరుణ్ని కనలేదు వినలేదు *
    చోరాగ్ర గణ్యునికి జోతలర్పించెదన్! (4)

    ధనం చ మానం చ తథేంద్రియాణి
    ప్రాణాంశ్చ హృత్వా మమ సర్వమేవ .
    పలాయసే కుత్ర ధృతోఽద్య చౌర
    త్వం భక్తిదామ్నాసి మయా నిరుద్ధః .. 5..

    ధనములను మానమును తస్కరించుటె గాక
    పంచేద్రియముతోడ ప్రాణముల హరియించి
    పారిపోయెదవెందు? భక్తితో బంధింతు!
    చోరాగ్ర గణ్యునికి జోతలర్పించెదన్! (5)

    ఛినత్సి ఘోరం యమపాశబంధం
    భినత్సి భీమం భవపాశబంధం .
    ఛినత్సి సర్వస్య సమస్తబంధం
    నైవాత్మనో భక్తకృతం తు బంధం .. 6..

    ఘోరమౌ యమపాశ బంధముల త్రెంపించి
    జననమరణములన్న చక్రమును తప్పించి
    భవబంధముల తేర్చు భక్తజన బాంధవుడు
    చోరాగ్ర గణ్యునికి జోతలర్పించెదన్! (6)

    మన్మానసే తామసరాశిఘోరే
    కారాగృహే దుఃఖమయే నిబద్ధః .
    లభస్వ హే చౌర! హరే! చిరాయ
    స్వచౌర్యదోషోచితమేవ దండం .. 7..

    నా మనసు లోనున్న అజ్ఞాన తిమిరంపు
    కారాగృహమునందు నిను కట్టి బంధింతు
    నీ చోర కృత్యాల కనువైన దండనే!
    చోరాగ్ర గణ్యునికి జోతలర్పించెదన్! (7)

    కారాగృహే వస సదా హృదయే మదీయే
    మద్భక్తిపాశదృఢబంధననిశ్చలః సన్ .
    త్వాం కృష్ణ హే! ప్రలయకోటిశతాంతరేఽపి
    సర్వస్వచౌర! హృదయాన్ న హి మోచయామి .. 8..

    నా మనసు చెరలోన వసియించు మెల్లప్పుడు
    నా భక్తి పాశమను దృఢబంధనముతోడ
    శౌరి నిను బంధింతు శతకోటి జన్మలకు
    సకలాఘ చోరుండ! సాష్టాంగ దండముల్! (8)

  11. 11
    తాడిగడప శ్యామల రావు November 10, 2024 11:31 am

    ఇకపోతే దండుగ గణాలు (దండుగ్గణాలు అనటం నాకు నచ్చలేదు) అని ఈసడించబడే వాటి గురించి కొంతైనా చెప్పుకోవాలి. తప్పదు.

    సంస్కృతంలో శబ్ధాల స్వరూపం విభక్తులను అనుసరించి మారుతూ ఉంటుంది సాధారణంగా. అందుకే శబ్దమంజరిని తీసుకొని శబ్దాలను బట్టీపట్టటం. తెలుగులో ఐతే విభక్తులు ఎక్కువగా విడిపదాలు. అందుచేత సంస్కృతంలో దీర్ఘంగా సమాసాలను తయారు చేయగలిగినట్లు తెలుగులో చేయటం కుదరదు. అందుచేత సంస్కృతంలోని క్లుప్తతను తెలుగులో అలాగే దిగుమతి చేయటం దుస్సాధ్యం. సంస్కృతంలో ఒకటి చిన్న వృత్తంలో ఉంది కదా దానిని తెలుగులో దైర్ఘ్యం పెంచకుండానే వ్రాసితీరాలి అనటం అన్యాయం.

    విడివిడిపదాలతో తెలుగులో పద్యాలను కూర్చేక్రమంలో అనేకకారణాలవలన కొన్ని ఇతరపదాలనూ చేర్చి పద్యపు బిగింపు తప్పదు. కేవలం అవసరమైన పదాలనే ఏరుకోవాలన్న ఆశ మంచిదే కాని తరచుగా వాటిని ఇతరపదాలతో మాటువేయకుండా ఛందస్సులలో ఇరికించటం వీలుకాదు. ఇలా అదనంగా కనిపించిన పదాలను దండుగలు అని ఈసడించటం పొరపాటు. అదనపు పదాలవలన పద్యం బిగువు చెడుతున్నదా అన్నది చర్చనీయాంశం కావచ్చు కాని అదనపు పదాలు ఉండవచ్చా అన్నది కానే కాదు.

    ఆమాటకు వస్తే సంస్కృతంలో కూడా ఇలా మాటువేయకుండా శ్లోకాలను అల్లటం కుదరదు. తరచుగా పాదపూరణాక్షరాలను వాడవలసి వస్తుంది. అందరికీ తెలిసిందే చకారాలను బిగించని శ్లోకాలే అరుదు. ద్రోణంచ భీష్మంచ జయద్రధంచ వగైరా శ్లోకాలు తెలియనిది ఎవరికి? అని. కాళిదాసు గారు వ్యాసుణ్ణి చకారకుక్షి అని ఆక్షేపించాడని ఒక ఐతిహ్యం. తు హి చ స్మ హ వై పాదపూరణే అని నానుడి. శ్లోకంలో ఒకోసారి ఒక అక్షరం మేర లోటువస్తే చ వేసేయటమే. మరి దండుగలు అని అంటున్నామా వాటిని? కవుల బాధలు కవులవి, ఛందోబధ్ధంగా వ్రాయటంలో ఉన్న బాధలు ముఖ్యంగా రెండు. ఛందస్సును ఒప్పించటం అందంగా రచించటం – ఈరెండూ తరచు పరస్పర విరుధ్ధమైన త్రోవల్లో ఉంటాయి. కవి ఏవో తిప్పలు పడి ఉభయతారకం చేయాలి మరి. చేయితిరిగిన కవికైతే అంతకష్టం కాదు తరచుగా. కాని ఎంతవారికైనా సరే పూరణపదాలూ పూరణాక్షరాలూ అస్సలు లేకుండా అసిధారావ్రతంగా రసవంతమైన కవిత్వం చెప్పటం సాధ్యం కాదు.

    విమర్శకాగ్రేసరులు కాస్త సానుభూతితో ఆలోచించితే బాగుంటుంది. స్వల్పాంతరత్యశ్చ బహూపయోగాః. తత్యజ్యతే తన్నతు దూషణాయ అని ఒక సూక్తిని ఒక జ్యోతిష గ్రంథంలో చదివాను. నాకు సంస్కృతం రాదు. కాబట్టి సూక్తిని ఉటంకించటంలో కించిత్తుగా పొరపాటు ఉండవచ్చును. మన్నించాలి.

    అలాగని, చచ్చీచెడీ ఏవో కొన్నికొన్ని మాటలను ఛందశ్చక్రంలో ఇరికించి హమ్మయ్య ఐపోయింది పద్యం అన్నట్లు కిట్టించిన పద్యాలను ఆక్షేపించవద్దని అనటం లేదు. ఛందస్సు ఒక ఫ్రేమ్ వర్క్ మాత్రమే. కవి ప్రతిభతోనే పద్యం వస్తుంది.

  12. 12
    శర్మ దంతుర్తి November 10, 2024 12:45 pm

    >> శ్లోకంలో ఒకోసారి ఒక అక్షరం మేర లోటువస్తే చ వేసేయటమే.

    ఇది చదివి నవ్వు ఆపుకోలేకపోతున్నానండి. సంస్కృతం, ఛందస్సూ ఇదీ అదీ అంటూ దెప్పకండి నాకు అవేమీ రావు గాక రావు. కామెంటర్ల పేరుతో చకార కుక్షి ఐపోదావని ప్రయత్నం. మీరు/ఎవరు ఎలా తిట్టినా సంతోషమే. ఇలా రాసినండుకు నేను పోయేది ఎలాగా యమలోకానికే కనక ఏమనుకునేది లేదు. 🙂

    ఏక శర్మాయ”చ”, ద్వీతీయ శర్మాయ”చ”
    శ్యామలాయ”చ” యదుకుల భూషణాయ”చ”
    ప్రతి శ్యామలాయ”చ”, కృష్ణమాచారీయ “చ”
    ప్రతి శర్మాయ”చ”, కొలిచాలాయ “చ”
    ప్రతి ప్రతి శ్యామలాయ”చ” ….

    ఇతి తు హి చ స్మ హ వై పాదపూరణే.

  13. 13
    K.V.S. Ramarao November 12, 2024 6:46 pm

    ఈ నా అభిప్రాయం మూలం గురించి. అనువాదాల గురించి కాదు. అది ఎవరు రాశారు లేదా పాడారు అన్న విషయం పక్కన వుంచి శ్లోకాల్ని మాత్రమే చూస్తే – వీటిలో వీటి కర్త భక్తిపారవశ్యం స్పష్టంగానే మనక్కనిపిస్తుంది. “చౌర్యం” అనే భావాన్ని తీసుకుని దాన్ని అన్ని శ్లోకాల్లోను అంతర్లీనంగా చొప్పించే ప్రయత్నం జరిగింది, అభినందనీయమే. “నవనీతచోరుడిగా”, “గోపీమానసచోరుడిగా” కృష్ణుడు ప్రసిద్ధుడే. మొదటిదాన్ని పాలు, మజ్జిగలకి ఇంకా కావాలంటే నెయ్యికి, రెండోదాన్ని రాధ, రుక్మిణి మొదలైన ప్రియులకీ భక్తులకీ పొడిగించటం సాధారణమే. అలాటి చోరుణ్ణి చీకటికొట్లలో బంధించటం – భక్తుల మనసుల్తో సహా – అనేది కూడ లోతైన భావనగా నాకు కనిపించదు. శబ్దప్రయోగాలూ ఏమంత చెప్పుకోదగ్గవి కావు.

    కనుక నా సందేహం వీటిలో కవిత్వం వున్నదా అనేది. అంటే పైపైన కనిపించే విషయమేనా లేక ఆలోచనామృతమైన వ్యవహారం ఏమైనా వుందా అనేది. నాకలాటిది కనిపించలేదు. కనిపించినవారు ధన్యులు. అదేదో మిగిలిన వారితో కూడ పంచుకుంటే ఇంకా బాగుంటుంది.

    భక్తిపురస్సరంగా వీటిని పాడుకుంటాం అంటే మంచిదే. కాని దీన్లో ఏదో అద్భుతసాహిత్యం వుందంటే ఒప్పుకోవటం కష్టం.

  14. 14
    తాడిగడప శ్యామల రావు November 13, 2024 5:09 am

    భక్తిసాహిత్యంలో అద్భుతమైన సాహిత్యం ఉండవచ్చును. ప్రతిశ్లోకంలోనూ తదాపి ప్రతిపాదంలోనూ కూడా సాహిత్యపువిలువలు బ్రహ్మాండంగా ఉండాలీ, ప్రత్యక్షరం రసరమ్యం కావాలీ అంటే అలా ఉంటే అద్భుతమే కాని మనం సమాహారంగా ఆసాహిత్యఖండికలోని రసరమ్యత వంటివి మాత్రమే స్వీకరించాలి. మైక్రోస్కోప్ క్రింద పెడితే అందమైన వస్తువులనేకం వికారంగా కనిపించవచ్చునండి.

    ఇకపోతే భక్తి సాహిత్యం మనసా ఆస్వాదించి రమించవలసినదే కాని కేవలసాహిత్యపు విలువల తూకపురాళ్ళతో బేరీజు వేయదగినది కాదు తరచుగా.

    పదాశ్రితానాం చ సమస్తచౌరం అన్న ఒక ప్రయోగం తీసుకుందాం. ఒక భక్తుడు ఈవాక్యం చదివి తన్మయత్వం చెందుతాడు. ఒక విమర్శకుడు ఏముంది ఈవాక్యంలో విశేషం అనుకోవచ్చును.

    భగవంతుడు తన పాదాలను ఆశ్రయించినారి సమస్తాన్నీ దోచుకుంటాడట. ఏజీవుడైనా అహమిక ఉన్నంతకాలం ఇది నాది అది నాది అన్న లెక్కలనుండి దాటి బయటకు రాలేడు. వాడు నాది నాది అనుకొనేది సమస్తం భగవానుడు తీసివేసుకున్నాక ఆభక్తుడు నాది అనుకుందుకు గాను ఏదీ మిగలదు. తనది అన్నది ఉంటే దానితో బంధం. అటువంటిది లేకపోతే ఏబంధమూ లేదు కదా. ప్రాపంచికబంధరహితుడై భగవంతుడితో మాత్రమే సంబంధం కలిగి ఉంటాడు. వాడికి ఈస్థితి కలిగించాలనే అన్నీ ఆ భగవంతుడు లాగివేసుకుంటాడని ఈవాక్యం తాత్పర్యం. ఇదంతా స్ఫురించి భక్తుడు తాదాత్మ్యం చెందుతాడు. సాహిత్యవిమర్శకుడు ఏరసానుభూతినీ పొందడు. రసో వై సః అని మన సిధ్ధాంతం కదా. ఆ రససిధ్ధి కేసి అడుగువేయని వాడికి అంతా శుష్క భక్తి ప్రలాపమే.

    ఇలాగు భక్తిభావన ఉన్నవారి దృక్కోణంలో ఇది సమున్నతమైన సాహిత్యమే. అసలు సాహిత్యం అంటే ఏమిటండీ? సహితమైనది సాహిత్యం. హితముతో కూడినది అని. ఏది హితము? భగవత్సంబంధి కన్నా హితమైనది ఉందా అని భక్తులు భావిస్తారు. కొందరు సామాజిక హితము వరకూ లెక్కలు వేస్తారు. కొందరు సాహిత్యప్రయోజనం వరకూ ఆలోచిస్తారు. ఇత్యాది.

  15. 15
    తాడిగడప శ్యామల రావు November 18, 2024 9:17 am

    మహాభారతం సభాపర్వంలోని రెండు మహా ప్రసిధ్ధమైన తెలుగు పద్యాలూ వాటికి మూలమైన వ్యాసులవారి శ్లోకాలూ ఇలా ఉన్నాయి.

    మొదటిది.
    అస్యపాపస్య దుర్బుధ్ధేర్భారతాపదస్య చ
    స పిబేయం బలాద్ వక్షః భిత్వా చేద్ రుధిరం యుధి (సభా. 68-53)

    అనువాదం.
    మ. కురువృద్ధుల్ గురువృద్ధ బాంధవులనేకుల్ చూచుచుండన్ మదో
    ద్ధురుడై ద్రౌపదినిట్లు చేసిన ఖలున్ దుశ్శాసనున్ లోకభీ
    కర లీలన్ వధియించి తద్విపుల వక్షశ్శైల రక్తౌఘ ని
    ర్ఝర ముర్వీపతి చూచుచుండ అని నాస్వాదింతు నుగ్రాకృతిన్

    రెండవది.
    పితృభిః సహ సాలోక్యం మా స్మ గఛ్ఛేద్ వృకోదరః
    యద్యే తమూరుం గదయా న భిద్యాం తే మహాహవే (సభా. 71-14)

    అనువాదం.
    ఉ. ధారుణి రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణజూచి రం
    భోరుని జోరు దేశమున నుండగ బిల్చిన యఈ ద్దురాత్ము దు
    ర్వార మదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భ
    గ్నోరుతరోరు జేయుదు సుయోధను నుగ్రరణాంతరంబునన్

    విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణ కల్పవృక్ష అవతారిక లో “ఋషి వంటి నన్నయ రెండవ వాల్మీకి అని కొనియాడబడిన తెలుగువారి ఆదికవి గారు మూలశ్లోకాలను ఏవిధంగా విస్తరించి తెనుగించారో పాఠకులను చిత్తగించవలసిందిగా కోరుతున్నాను. పాఠకుని ఊహకు వదిలేయవలసిన విషయాన్ని విస్తరిస్తూ దండుగ్గణాలు చేరిన నన్నయ్య చేసిన అనువాదం, పేలవ ప్రదర్శన గా మారిపోయింది అని ఎవరన్నా అనుకుంటే వారికొక నమస్కారం.

  16. 16
    మంథా వీరభద్రం December 29, 2024 10:25 am

    తాడిగడప వారికి తాడియెత్తు మ్రొక్కులు! చాలా గొప్పగా అనువదించారు.

    “ధారుణి రాజ్యసంపద మదంబున” అనే నన్నయ గారి పద్యానికి ప్రేరణ భట్ట నారాయణుడి వేణీసంహారం లోని ఈ క్రింది శ్లోకమని ఏల్చూరి వారు వ్యాస ఘట్టాలలో తేల్చారు.

    చంచద్భుజ భ్రమిత చండ గదాభిఘాత
    సంచూర్ణితోరు యుగలస్య సుయోధనస్య
    స్త్యానావనద్ధ ఘన శోణిత సిక్త పాణి
    రుత్తంసయిష్యతి కచాంస్తవ దేవి! భీమః.

    తెలుగుకోరాలో వాఙ్మయ చరిత్రలో కొన్ని వ్యాసఘట్టాల గురించి ఒక సమీక్ష దీనిగురించి ప్రస్తావించారు.

  17. 17
    తాడిగడప శ్యామలరావు December 30, 2024 7:09 am

    భట్ట నారాయణుడు నన్నయ కన్నా మూడువందల సంవత్సరాల పూర్వపువాడు కాబట్టి నన్నయ్య వేణీసంహారం తప్పక చదివి ఉండవచ్చును. అందుకేనేమో ఈశ్లోకంలోని ‘చండ గదాభిఘాత’, ‘సుయోధన’, ‘ఊరు’ పదాలు ‘ధారుణి రాజ్యసంపద మదంబున’ అనే నన్నయ పద్యంలోనూ దర్శనం ఇస్తూ ఉన్నాయి.

    చాలా గొప్పగా అనువదించానని మంథా వీరభద్రం గారు అభిప్రాయపడటం వారి సహృదయతకు నిదర్శనం అనుకుంటున్నాను. వీరభద్రం గారికి ధన్యవాదాలు.

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • కాలుష్యాష్టకం
  • చౌరాష్టకం – ఆంధ్రానువాదం

ఇటువంటివే…

  1. గణానాం త్వా గణపతిం – తెలుగు అనువాదం

నవంబర్ 2024 సంచికలో ...

  • అంతిమ లతాంతము
  • అడుగడుగూ తిరుగుబాటైన గీత
  • అది నీవు
  • ఆవంత్స సోమసుందర్ – గేయాలు, లఘుకవితలు
  • ఇంతేనా
  • ఎవరెస్ట్ బేస్ కాంప్ – 1
  • ఒక వర్షం కావాలి
  • ఒకరికోసం
  • కాలాతీత కథల కథనశిల్పం
  • కృత్రిమ మేధ, ప్రజ్ఞానం, నోబెల్ బహుమానాలు
  • చౌరాష్టకం – ఆంధ్రానువాదం
  • ట్వైలైట్
  • ధిక్కారతే వరం
  • నన్ను గురించి కథ వ్రాయవూ? – నాకు అర్థమయినట్లుగా…
  • నవంబర్ 2024
  • నో ఎగ్జిట్ .1
  • పూలతావుల కథాపరిమళాలు
  • పెద్దన్నయ్య, ప్రపంచం
  • మన తరం – మహాకవి
  • మేకప్
  • యూట్యూబ్‍లో ఈమాట: అక్టోబర్ 2024
  • లోకాలోకం
  • సూర్యాస్తమయాన మెరిసే మేఘాలు
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

ధిక్కారతే వరం
అంతిమ లతాంతము

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.