ఒకరికోసం

బెడిసి కొడుతున్నవి నువ్వాడిన మాటలు
నువు పాడిన పాటలు, నువ్వల్లిన పద్యాలు
భాషించిన గద్యాలు, వెదజల్లిన హృద్యాలు
హృదయం ఒకటే చాలదు హృదయేశ్వరా

హృదయానికి నిర్వచనం నీ సొంతం కాదు
హృదయంతో ముడిపడి వాచకం ఉంటుంది
ప్రతి వాచకానికీ కొంత అహం ఉంటుంది
నీ అహం నీది, వినే వాడి అహం వినేవాడిది

జగమంచి కోరుతున్నాయా నీ ౙవసత్వాలు?
మనోవాక్కర్మలు, ముగ్ధ భావనలు, మధుసేవనాలు?
జరిగినది జరిగింది, జరగబోయే దెలాగూ జరుగుతుంది
ఎందుకీ తోపులాట? తోయకు, తోపింపకు, నువ్వూ జరుగు

కానీ నేస్తం, చేస్తూనే ఉండు
నువు చేస్తున్నాననుకునే ఆకూస్తా
నీకో తృప్తి, నీ పైవాడికీ అదే తృప్తి;
తీరని దప్పిక, తెలిసీ తప్పదిక
నీవారనుకునే వారు, ఎవరో అనుకునే
వారూ అందరూ ఒకరే
విత్తనాలు జల్లుతూపో, మొలిస్తే మొలవనీ
బ్రహ్మ జ్ఞానమైనా, బ్రహ్మ జెముడైనా