అంతిమ లతాంతము

నా దృష్టిలో భాష అంటే కొన్ని పదాల గుంపునకు ఉన్న పేరు కాదు. అది మనిషి పుట్టిన వెంటనే అతనికి లభించే ఒక సిద్ధశక్తి. మానవుడికి ఉన్న దురదృష్టాలలో ఒకటి, కేవలం హృదయంతోనే పట్టుకోగలిగే భాష ఉనికిని మెదడుతో పట్టుకోవాలని ప్రయత్నించడం. ఎదుటివారితో తన భాష గురించి చెప్పవలసి వస్తే, నేటి కాలంలో ఏ మనిషీ తన అనుభూతులను పదాలలో పెట్టకోగలిగి బయటకు వ్యక్తీకరించే సమయంలో తన మాతృభాషలో మాట్లాడినప్పుడు అతను పొందే అలౌకిక ఆనందాన్ని వర్ణించడం నేను ఇప్పటివరకూ చూడలేదు, వినలేదు.

పుట్టిన తొలినాళ్ళలో, మనసులోని భావాలను బయటకు చెప్పలేని ఆ సమయంలో భాష మనిషి ప్రాణానికి ఇచ్చిన శక్తి ఎంత విలువైందని? ఆ శక్తితో ఎదిగిన ఒక మనిషి తన భాషలో ఇంకొకరికి ఒక కథ చెప్పి ఉంటాడు. ఒక ప్రియుడు తన ప్రియురాలికి ఒక కవితను వినిపించి ఉంటాడు. ఒక కవి ప్రకృతిని చూసి పద్యాన్ని చెప్పి ఉంటాడు. ఒక భావకుడు తన పూర్వకవి కవితను తల్చుకుని ఉంటాడు. ఈ కారణాలు చాలు, ఒక భాష గురించి మాట్లాడటానికి, దాని ఉనికిని గుర్తించి, నమస్కరించడానికి. దాని బదులు, ‘నా భాషలో ఉన్న ఈ ప్రక్రియ నీ భాషలో లేదు’ అనో; ‘నా భాష నీ భాష నుండి పుట్టలేదు’ అనో; ‘నా భాషను నీ భాష కంటే ముందునుంచే మాట్లాడుతున్నారు’ అనో; ‘నాది దేవతలు మాట్లాడే భాష, నీది కాదు’ అనో మొదటగా చెప్పడం తన భాషను తక్కువ చేసుకోవడమే అవుతుంది. ఇవన్నీ రెండవ, మూడవ కారణాలు అవుతాయని నాకనిపిస్తుంది. పుట్టగానే వ్యక్తీకరణ అనే సామర్థ్యం తనకు ఊరికే అలా చిక్కడం అనే జ్ఞాపకాన్ని మనసులో మాటిమాటికీ అనుభవించలేనివాడు ఎప్పటికీ భాషాభిమాని కాలేడు.

మాతృభాష అంటే తల్లినుండి వచ్చిన భాష అని మాత్రమే కాదు, అది మన అనుభూతిని, మనకు ఏరకంగానూ కాపట్యం సోకని ఆ పూత వయసులో, మొట్టమొదటగా వ్యక్తీకరించుకోనిచ్చిన భాష. ఆనాటి అనుభూతులే మన జీవితంలో అసలైన మాతృభావాలు. ఆనాటిది మాతృభాష.

ఒక భాష ఏ కారణం చేతనైనా మరణించింది అంటే, కేవలం ఆ భాషలో ఉన్న పదాలకు, ఇతర వ్యక్తీకరణపద్ధతులకూ బ్రతికి ఉన్నవారెవరూ అర్థం చెప్పలేరని మాత్రమే కాదు. ఒక భాష మరణించింది అంటే, విశ్వవ్యాపకమైన జీవశక్తిలో ఒక దారం తెగిపోయిందని లెక్క. ‘ఈ భాష మాట్లాడడం నేటి ప్రపంచంలో బ్రతకడానికి ఏమాత్రమూ సహకరించదు’ అని కారణం చెప్పే ఒక పరిస్థితిని కల్పించే జీవన విధానంలో మానవుడు బ్రతుకుతుండడం నన్ను ఎప్పుడూ కుదిపేస్తుంది.

పేరు గుర్తులేదు కాని, నా చిన్నతనంలో, చచ్చిపోతున్న ఒక భాషలో చివరి మనిషైన ఒక కొండప్రాంతానికి చెందిన ముసలామె వినేవారెవరూ లేక, ఒక పక్షితో తన భాషలో మాట్లాడిందని ఎక్కడో చదివేను. ఆ వార్త నన్ను కదిలించిన వైనం నేనెప్పటికీ మరిచిపోలేను. తరువాతనుండీ అనేకభాషలలో చివరివారి గురించి ప్రచురించబడే వార్తలు అడపాదడపా చదువుతూనే ఉన్నాను. ఒక భాషయొక్క ప్రతీ చివరి వ్యక్తి – అది స్త్రీ అయినా పురుషుడైనా వారు చేసేది ఇంతే – తన భాషయొక్క నిఘంటువు ఒకటి తయారు కావడంలో ఎవరెవరికో సహకరించడం; కుదిరితే ఆ భాషలో తనకు తెలిసిన కవితలను ఒక పుస్తకం వేయడం.

అటువంటి ఒకానొక వార్తే, ఈ క్రింది కవితను నేను వ్రాయడానికి నన్ను ప్రేరేపించింది. నేను చదివిన ఇటువంటి ప్రతీవార్తలోనూ ఒకేలా ఉన్న అంశం, ఆ భాష ఉనికి వారి ముందుతరంతో పోకుండా, వారి దాకా రావడానికి ప్రధానకారణాలు రెండు. ఒకటి, నేటి ఆధునికత యొక్క అవసరం ఒక జాతిని తమ భాషమీద ప్రేమను తొక్కివేయవలసింత బలంగా తాకకపోవడం. రెండు, అది తాకినా, వారు తమ సంస్కృతిమీద, నేలమీదా ప్రేమ ఉన్న దృఢచిత్తం కల మనుషులు కావడం. ఈ వ్యక్తి అటువంటివాడే.

అతని పేరు అమాదియో గార్సియా. దక్షిణ అమెరికాలోని పెరూ దేశంలో ఉన్న అమెజాన్ నది పరీవాహక ప్రాంతంలో తౌషిరో అనే వేలయేళ్ళ భాషను మాటలాడే చివరి వ్యక్తి అతను. అతని మీద న్యూయార్క్ టైమ్స్ 2017లో ఒక కథనాన్ని ప్రచురించింది.

అతనే ఈ కవితలో నాయకుడు.


  1. పూవును పిల్చుటెట్లు? మరి ముత్యమునో? యని ప్రశ్నవేయు భా
    షావిదురాలికిన్ తనదు చచ్చిన పల్కున పల్లవించి వి
    ద్రావిత కౌతుకాంకముల రాయిడిగొన్న పరాకుగుండెతో
    మోవి కదల్చునాతడు నమోదుకు; కన్నుల మాటలాడుచున్.
  2. అతడు వచియించెడు పదార్థతతి నిఘంటు
    నిర్మితికి తోడుపడుత, కానీ, యతడు వ
    చింపని హృదయాంతయథార్థ స్థితిని పట్టు
    కొను మనిషి వేరొకడు నెట్టి కొసను లేడు.
  3. ప్రథితభాషలోనె పారాడు లోకము
    ను గమనించి యతడు నగవులాడు;
    పనిలొ వారిభాషను నొడువుచు తన భా
    ష తలపునకు రాగ సంతసిల్లు
  4. అతని హృది యొక రుద్ధవీణ, తెరకట్టు
    యాతని గళము, రసన పత్రాంజనమ్ము
    లేని ముద్రణశాల; మాలిన్యపూర
    మతని దేహము, విస్మృతస్మృతి మనీష.
  5. అతడు నిరుద్యోగి, మితఖాది; నేటి నవీననైపుణ్యము లేని కతన
    అతడు వరాకుడు, గతభోగి; తనవారు నైక్యత చెదరి వేరైన కతన
    అతడు చేబోడి, నిహతరాగి; సహచరీసూనులు తనవద్ద లేని కతన
    అతడు ప్రమత్తుడు, పతితుడు; దురదృష్టమాతనినెపుడు వెన్నాడుతున్న

    కతన; వాడొక యేకాకి – కమ్రమైన
    నైజభాషలొ బాసాడగా జవాబు
    చెప్పువాడు లేని కతన; యిప్పుడు తన
    దైన భూమిని విడచి పోలేని కతన.

  6. కాని లోపల వాడొక మౌని, యోగి;
    ప్రకృతి యాతని భాషలో వస్తువులను,
    జీవములను, రహిని, కటుచిక్కణత్వ
    ములను యతనికి చూపించి మురియు కతన
  7. పులుగుతో వాదులాడును; పలుగు, పార,
    తట్టలను కలిసికొనును; ధరణికి తన
    గోడు చెప్పుకొనును; మావి కొమ్మపైని
    కోకిలను చూసి పాడును గొంతునెత్తి
    తనదు భాషయందున తన తనివి దీర.
  8. అతడు నిద్రించు వేళల నతని భాష
    జోలపాట; యుదయమున మేలుకొను స
    మయమున నొక బోధకరి; విమలవయస్య;
    వేరు వారికి దొరకని ప్రేమనగరి.
  9. కొన్ని వేలయేండ్ల మధువుకు చరమంపు
    చప్పరింపు వాడు; తనదు జాతి జాలు
    వార్చినట్టి సంస్కృతి తుది వారికణము;
    ఆతడొక భావనాలతికాంత్యసుమము.