డాక్టర్ పి.శ్రీదేవి పేరు చెప్పగానే సాహితీలోకంలో కాలాతీత వ్యక్తులు నవల గుర్తుకు రానివారు అరుదు. ఆమె కథలు రాసినట్లు తెలిసినా, ఆ కథల గురించి తెలిసినవారూ తక్కువే. పి. శ్రీదేవి రాసిన కథలు రాశిలో తక్కువే అయినా వాసిలో ‘కాలాతీత వ్యక్తులు’కు దీటుగా 1955 నుండి 1961 వరకూ సుమారుగా ఇరవై ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆమె రచనా జీవితం ఆరు సంవత్సరాలు మాత్రమే. ఆ కొద్దికాలంలోనే సాహిత్యరంగంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్రని సాధించిందామె. అరవై ఏళ్ళకుపైగా ఆ ముద్ర చెరిగిపోకుండా ఉందంటే శ్రీదేవి రచనలకు గల విశిష్టత తెలుస్తుంది.
శ్రీదేవి కథలు చాలావరకూ అనేక భిన్నమనస్తత్వాలు గల పాత్రలతో, విభిన్నమైన కథాంశాలతో, సంఘటనలతో ఆనాటి సమాజానికి ప్రతిబింబంగా ఉంటాయి. కథావిస్తృతి కలిగివుండటంవలన కొన్నికథలు నవలికలుగా అనిపిస్తాయి. కొన్ని కథలు, కాలాతీత వ్యక్తులు రాసిన తర్వాతవి, కథాసంవిధానంలో, పాత్రల చిత్రణలో నవలలోని పాత్రల మనస్తత్వంతో పోలినట్లుగా ఉంటాయి.
1955 మార్చి-ఏప్రిల్‍లలో రెండు భాగాలుగా ‘తెలుగు స్వతంత్ర’లో ప్రచురితమైన ‘స్వరూపంలో రూపం’ కథతో శ్రీదేవి రచనాప్రస్థానం మొదలైనదని భావించవచ్చు. ఈ కథ ఆనాటికి అధునాతన అంశంగా చెప్పతగినది, అనాథ శరణాలయంలోని కట్టుబాట్లకి విసుగు చెంది స్వేచ్ఛ కోసం తనను కోరిన వ్యక్తితో బయటపడి రఘునాథంతో పెళ్ళి చేసుకోకుండానే జీవితాన్ని పంచుకుంటుంది రాధ. కొంతకాలం తర్వాత అతను ఆమెని విడిచి దేశాంతరాలు వెళ్ళిపోతాడు. రాధ తిరిగి చదువు కొనసాగించటమే కాక దృఢమైన వ్యక్తిత్వంతో తనను పెళ్ళి చేసుకుంటానని అతని తమ్ముడు కోరినా సరే తిరస్కరించి, తన కాళ్ళమీద తాను నిలబడి తిరిగి అనాథాశ్రమానికి వెళ్ళిపోతుంది. రాధ పాత్ర చిత్రణలో రచయిత్రి సంయమనం పాటిస్తూ సాధికారత గల పాత్రగా తీర్చిదిద్దింది.
ఈ కథలో ప్రేమ గురించిన చర్చని కథనం చేసింది రచయిత్రి. ‘ప్రేమ ఎవరికీ అర్థంకాని అపూర్వ విషయం. దాని లోతు కనిపెట్టటానికి జీవితమంతా తపస్సు చేయాలి’ అని ఒక సందర్భంలో కథానాయిక రాధతో వ్యక్తం చేస్తుంది. మరో సందర్భంలో ‘వ్యక్తికీ వ్యక్తికీ మధ్య అంతరాంతరాల్లోని సమైక్యతనే నేను ప్రేమ అని నిర్వచిస్తాను. అదొక దివ్యానుభూతి’ అంటుంది రాధ. రాధ పాత్రను మలచటంలో, ఆత్మాభిమానం, వ్యక్తిత్వం తీర్చిదిద్దటంలో మొదటి కథలోనే రచయిత్రి రచనా సంవిధానంలో గల చాతుర్యాన్ని ప్రదర్శించింది. కథలో కొంతమేర నాటకీయత ఉన్నా సన్నివేశ కల్పనలోగల సమకాలీనత కథను ప్రత్యేకంగా చూపుతుంది.
ఆమె తన స్వంత పేరుతోనే కాక శ్రీ, వైదేహి అనే కలంపేర్లతో కూడా కొన్ని కథలు, కవితలు రాసింది.
విద్యాభ్యాసం అనంతరం గుడివాడలో వైద్యసేవ అందించే కాలంలో అక్కడి సాహిత్య సంస్థలతోను, వ్యక్తులతోనూ శ్రీదేవికి స్నేహసంబంధాలుండేవి. అప్పట్లో గుడివాడ ఎ.ఎన్.ఆర్. కళాశాలలో ఉపన్యాసకుడిగా పనిచేస్తున్న కేతవరపు రామకోటి శాస్త్రి, అక్కడ విద్యార్థిగా ఉన్న మొదలి నాగభూషణశర్మ తదితరులతో కలిసి సమకాలీన సాహిత్య చర్చలు జరిపేది. చేకూరి రామారావు, నాయని కృష్ణకుమారి, పి. సరళాదేవి ఆమె స్నేహబృందంలోనివారే.
1956లో వైమానిక దళంలో ఉద్యోగస్తుడైన పెమ్మరాజు కామరాజుతో ఆమెకు వివాహానంతరం ప్రభుత్వ సర్వీసు వదిలి భర్తతో కలిసి ఉద్యోగ రీత్యా దేశంలో పలుప్రాంతాలు తిరిగింది. ఒకవైపు వైద్య వృత్తి కొనసాగిస్తూనే, ప్రవృత్తిగా సాహిత్య, పాత్రికేయ రంగాల్లో కూడా పనిచేసి, తన సాహిత్యాభిలాషను పెంపొందించుకుంది.
ఉరుములూ మెరుపులూ, రేవతి స్వయంవరం, కల్యాణ కింకిణి అను మూడు పెద్ద కథలను కలిపి 1957లో ఉరుములూ మెరుపులూ పేరిట వేసిన సంపుటికి ముందుమాట రాసిన గోరాశాస్త్రి, ‘స్వయం వ్యక్తిత్వం గల ఆత్మవంతురాలి’గా శ్రీదేవిని ప్రశంసించారు.
స్వతంత్ర ప్రవృత్తి కలిగి ఎటువంటి క్లిష్టపరిస్థితులలోనైనా వ్యక్తిత్వం నిలుపుకోగల పాత్రలతో కథారచన చేసింది శ్రీదేవి. ప్రతీపాత్రా కూడా అతి సాహసవంతమైన భావప్రకటన చేయటంవలన పాఠకుల దృష్టిలో ఆ పాత్ర చిరస్థాయిగా నిలుస్తోంది. ఉదాహరణకు ‘వాళ్ళు పాడిన భూపాలరాగం’లో శ్రీనివాసులు, రామారావు; ‘ఉరుములూ మెరుపులూ’లో సుధ; ‘రేవతి స్వయంవరం’లోని రేవతి; ‘శ్రావణ భాద్రపదాలు’లోని శైలజ… ఇలా చెప్పుకోవచ్చు.
శ్రీదేవి కథలలోని పాత్రలన్నీ సజీవ చైతన్యంతో ఉంటాయి. దృఢమైన వ్యక్తిత్వం కలిగివుండి, జీవితంపైన స్పష్టమైన అవగాహన కలిగివుంటాయి. వేసే ప్రతీ అడుగూ తడబడకుండా ఆచితూచి వేస్తాయి. పొరపాటున అడుగు పక్కకు తప్పినా దానికి మరొకరిపై నింద వేయవు. తమ తప్పిదాన్ని తామే తెలుసుకుని మేలుకుంటాయి. ఎటువంటి పరిస్థితిలోనూ నిరాశకు లోనుకావు. చాకచక్యంలో అధిగమించే నిబ్బరం కలిగివుంటాయి. కర్మ సిద్ధాంతాన్ని కాక హేతువాద దృక్పథాన్ని కలిగివుండి ఇతర పాత్రల్ని జాగృతపరుస్తాయి. ‘కల్యాణకింకిణి’లోని పాత్రలు, ‘చక్రనేమి క్రమాన’లో మిసెస్ పాణి, ‘మెత్తని శిక్ష’లోని డాక్టరు, ‘వర్షం వెలిసేసరికి….’లోని పాత్రలూ అటువంటివే.
ప్రగతిశీల దృక్పథం కలిగిన రచయిత్రి కావటంవలన ఆమె సృష్టించిన స్త్రీపాత్రలు కూడా ఏతరంలోనైనా యువతరానికి స్ఫూర్తినిచ్చేలా ఉండటంలో స్త్రీ చైతన్యం వ్యక్తమౌతుంది. కథలు రాసేనాటికి రచయిత్రి కూడా యువతరానికి చెందిన ఉన్నత విద్యావంతురాలూ, ఉద్యోగినీ కావటంవలన వృత్తిరీత్యా ఆమె తనకు తటస్థపడిన యువతలోని కలలూ కల్పనలూ సంఘర్షణలూ అశాంతులూ ఆరాటాలే కాక కొందరిలోని సంకుచితస్వభావాలను పరిశీలించగల అవకాశాల్ని కూడా అందిపుచ్చుకుని తన కథల్లో పొందుపరచింది.
కథలన్నింటా చాలావరకూ సమకాలీన సమాజంలోని ఆర్థిక స్థితిగతులూ, సామాజిక పరిస్థితులూ, ఆనాటి కుటుంబ జీవన విధానం, యువతీయువకుల మనస్తత్వం, వారి ఆలోచనా విధానం స్పష్టంగా కనిపిస్తాయి. కొందరు స్త్రీలలో సౌకుమార్యం, లాలిత్యం ఎంతగా ఉంటాయో మానసికంగా ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోగలిగే దృఢత్వమూ ఉన్న పాత్రలుగా కూడా వారు ఉంటారు. చాలావరకూ స్త్రీ పాత్రల్ని విద్యావంతులుగానే కాక కొందర్ని వైద్యవృత్తిలో ఉన్న పాత్రలుగా కూడా మలచింది రచయిత్రి.
శ్రీదేవి తన సమకాలీన రచయిత్రుల రచనలకు భిన్నంగా స్త్రీలకు స్వావలంబన, ఆశించిన విద్య, అధికారం, హక్కులు గల దాంపత్య సంబంధాలు, పురోగామి దృక్పథం, స్త్రీ స్వేచ్చ పట్ల అవగాహన కలిగిన స్త్రీ పాత్రల్ని తన కథలలో ప్రత్యేకించి సృష్టించింది. కుటుంబ సంబంధాలలో మానవీయ విలువలు అంతకంతకూ లుప్తమౌతున్న సామాజిక పరిస్థితుల్ని కొన్ని కథల్లో ప్రతిబింబించటంవలన చదువరులకు స్ఫుటమైన ఆలోచననూ, అవగాహననూ కలిగించే రీతిలో ఉండి, ఏనాటికీ నిలిచివుండే కాలాతీత కథలుగా అవి నిలుస్తాయి.
‘రేవతి స్వయంవరం’లో ప్రేమ-పెళ్ళి గురించి సుదీర్ఘమైన చర్చలో అనేక విషయాలను స్పష్టం చేస్తుంది రచయిత్రి. ‘పరిచయం లేని వ్యక్తితో జీవితం ప్రారంభించేకంటే అదివరకే అర్థంచేసుకున్న వ్యక్తితో జీవితం సుఖంగా ఉండదంటావా?! అని రేవతికి గురువైన శాస్త్రి ప్రశ్నించినప్పుడు. ‘ప్రేమ అనేది ఒకరిసొత్తుగా ఒకచోట నిల్చిపోయేది కాదు. ఎత్తునున్న నీరు పల్లానికి ప్రవహించటం ఎంత సహజమో ఇష్టం కలిగిన ప్రతీ వ్యక్తియందూ ప్రేమ ప్రసరించటం అంత సహజం. ప్రేమించిన ప్రతీ వ్యక్తిని వివాహం చేసుకోలేము’ అని నర్మగర్భంగా రేవతిచేత చెప్పించటంలో రచయిత్రి మనోభావాలు వ్యక్తమౌతాయి. రేవతి పాత్రలో పాఠకులకు ‘కాలాతీత వ్యక్తులు’లోని ఇందిర కనిపిస్తుంది. కథలోని చర్చలో ప్రేమమీదా, పెళ్ళిమీదా రచయిత్రికి గల అభిప్రాయాలు ఎంత బలమైనవో తెలుస్తుంది. ఆ చెప్పటంలో ఏమాత్రం తొట్రుపాటూ, తొందరపాటూ లేకుండా నిలకడగా నిల్చుని ఎదుటివ్యక్తి మనసులోని అపోహలను ఎగరగొట్టేలా చెప్తుంది.
ఈ కథలోని రేవతి గాని, ‘కల్యాణకింకిణి’లోని హేమ గాని, ‘శ్రావణ భాద్ర పదాలు’లోని శైలజ గాని, ‘స్వరూపంలో రూపం’లోని రాధ గానీ బలంగా, స్పష్టంగా అభిప్రాయాలు ప్రకటించే పాత్రలు.
హేతువాద దృక్పథంగల వైద్యవృత్తిలో ఉన్న రచయిత్రి ‘అర్థం కాని ఒక అనుభవం’ కథలో డాక్టరు పాత్రలోనే తన ప్రత్యేకతను నిలుపుకునేలా సంభాషణలు రాస్తుంది. ‘విద్యవల్ల, వృత్తివల్ల, శాస్త్రీయవిజ్ఞానం అలవరచుకున్నదానిని, సంస్కారంవల్ల హేతువాదాన్ని వంటపట్టించుకున్నదానిని, నిర్జీవమైన శరీరాలను తెలుసుకున్నదానిని, వీటన్నిటికీ అతీతమైన సత్యమేదో ఈ పిచ్చిబైరాగికి దర్శనం ఐనట్లనిపిస్తుందేమిటి? శుద్ధ బైరాగి, సంఘానికి ఏ విధంగానూ పనికిరాకపోగా ఒక రకంగా పరాస్నభుక్కుడు. సంఘానికి బరువుకూడా.’ ఇలా ఈ రచయిత్రి కథలోని డాక్టరు పాత్రచేత స్వగతంలో రాసిన మాటలు ఆమె మనసులోని ఆలోచనలకి ప్రతిబింబాలు. క్రితం రోజువరకూ ప్రశాంత నిర్మల మానవాకారంగా దర్శనమిచ్చిన బైరాగి తెల్లారేసరికి రక్తసిక్తంగా వికృతంగా కనిపించటంలో రెండు ఆకారాల మధ్య గల రహస్యమే ‘అర్థం కాని ఒక అనుభవం’. రెండు పార్టీల మధ్య గ్రామ తగాదాల్లో సంబంధం లేకుండానే బలైపోయిన బైరాగి, దీనికి సాక్షీభూతురాలైన డాక్టరు అనుభవానికి రూపకల్పనే ఈ కథ. ఈ కథలోని డాక్టరు వ్యక్తపరిచిన హేతువాద దృక్పథమే రచయిత్రి రచనలోని ప్రత్యేకతను పట్టి చూపుతుంది.
‘వర్షం వెలిసేసరికి…’ కథ ‘శ్రీ’ అనే కలం పేరుతో రాసిన రెండవ కథ. ప్రధాన పాత్ర డాక్టరే. ఈ కథలోని పాత్రల ఆలోచనాసరళిలో అధునాతన భావాలు వ్యక్తం కావు. సంఘటనలు కూడా నాటకీయంగా ఉంటాయి. చివరిలో కథానాయిక భర్త కాళ్ళు పట్టుకొని కన్నీళ్ళతో కడిగినట్లు ఉండటం మొదలైన సన్నివేశాలు శ్రీదేవిలోని పరిణతలేమిని తెలుపుతాయి. కానీ కథాగమనంలో వర్ణనాత్మక కథనం, స్వగతంలో కారుప్రయాణంతో జీవనగమనాన్ని పోల్చే విధానం రచయిత్రి కథానిర్మాణశైలిలోని విశిష్టతని పట్టిచూపుతాయి. కథలోని భాషకూడా కొంతవరకు గ్రాంథిక ఛాయలకు దగ్గరగా ఉండే శిష్ట వ్యవహారికంలో వుంది.
యాభయ్యవ దశకంలో మధ్యతరగతి కుటుంబ జీవనంపై ఆర్థికాంశాలు ఏ విధమైన ప్రభావం చూపుతాయో ‘కల్యాణకింకిణి’, ‘కల తెచ్చిన రూపాయిలు’, ‘వాళ్ళు పాడిన భూపాలరాగం’ కథలు తెలుపుతాయి.
సమాజంలోని స్వార్థం ఏవిధంగా మానవ విలువల్నీ, కుటుంబ సంబంధాల్నీ విచ్ఛిన్నం చేస్తాయో చాలా శక్తివంతంగా ప్రతిపాదించిన కథ ‘కల్యాణకింకిణి’. ఏ కాలంలోనూ స్త్రీకి భద్రత లేకపోవటం, అభద్రతకు, లైంగిక దోపిడీకీ గురైన స్త్రీ జీవితం, ఆమెతో ముడిపడిన కుటుంబసభ్యుల జీవితం ఏవిధంగా ఛిన్నాభిన్నం అయిపోతుందో కథ చివరివరకూ టెంపోని బలంగా కొనసాగించింది. కథలోని ప్రతీ పాత్రా మానసికంగా ఒంటరితనాన్ని అనుభవిస్తుంది. ప్రతీ పాత్రనీ భయంకర దుఃఖవేదన పెనవేసికొని ఉంటుంది. అందుకే గోరాశాస్త్రి ఈ కథను ‘బరువురెప్పల విషాదగాథ’గా అభివర్ణించారు.
‘శ్రావణ భాద్రపదాలు’ కథలో కథానాయకుని జీవితంతో ముడిపడిన ముగ్గురు విభిన్న మనస్తత్వాలు గల స్త్రీల మనోభావాల్ని ప్రధానంగా చెప్పినా, కథంతా కథాకథన విధానంలో ప్రథమ పురుషలో ఒక తాత్విక చింతనతో నడుస్తుంది. పిల్లలు తమకంటే అన్నివిధాలా ఉన్నతస్థాయికి ఎదగాలని వాళ్ళ భవిష్యత్తుకు బంగారుబాటలు పరుస్తూ తమ జీవితాలనే నిచ్చెనలు చేసి, విదేశాలకు వెళ్ళేందుకు ప్రోత్సహించి, తీరా తమ వృద్ధాప్యదశలో ఆసరా ఇవ్వలేకపోయిన కొడుకు పాత్రచిత్రణ రచయిత్రి ముందు చూపుకు నిదర్శనం. ఈనాడు వృద్ధాశ్రమాలుగా దేశం మారిపోతున్న దృశ్యాన్ని డెబ్భై ఏళ్ళక్రితమే అందించింది రచయిత్రి.
వైద్యవృత్తిలోని తొలిరోజుల్లో నీతినియమాల పట్ల నిబద్ధత ఉన్నా, క్రమేణా ధర్మాలూ, ఆశయాలూ కరిగిపోయి జీవిత దృక్పథాన్నే మార్చేసిన పరిస్థితుల్ని, ఒక డాక్టరుగా ఆవేదనతో రాసిన కథ ‘మెత్తని శిక్ష’. ఈ కథలో ఒక ప్రత్యేకత- కథనమంతా ఒక తలపోతగానే రచయిత్రి చెప్పింది. మరొక విషయం మధ్యనిషేధం అమలులో ఉన్నప్పటికీ ఆ రోజుల్లో దిగువవర్గంవారికి కూడా మద్యం అందుబాటులో ఉండడంతో ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రతీకగా ఈ కథ వ్యక్తమౌతుంది. మరొక విషయం అవినీతిలో అలవాట్లకు కూరుకుపోయిన ప్రభుత్వ ఉద్యోగుల తీరుతెన్నులని ఎత్తిచూపటం కూడా కనిపిస్తుంది.
‘చక్రనేమి క్రమాన’ కథంతా కేన్సర్ ఆస్పత్రి వాతావరణాన్ని, చికిత్సలను అత్యంత సహజంగా ఆ వార్డు ముందో, ఆ గది ముందో నిలబడి చూస్తున్నట్లుగా పాఠకులకు అనుభూతి కలుగుతుంది. రచయిత్రి శ్రీదేవికూడా ముప్ఫయి రెండేళ్ళ ప్రాయంలోనే వెన్నెముక కేన్సర్‍తో మరణించింది. ఈ కథాకాలంనాటికే ఆమె ఆనారోగ్యంతో ఉందేమో!
ఈ కథలో మొదటినుండి చివరివరకూ అమృతవల్లి పాత్ర, మిసెస్ పాణీ ఒకరే అనే విషయాన్ని బయటపడకుండా కథంతా రాశారు శ్రీదేవి, ఈ విధానం ఈ కథలోనే కాక ‘కల్యాణకింకిణి’, ‘స్వరూపంలో రూపం’ కథల్లో కూడా గమనించవచ్చును.
కథానాయకుడు చనిపోయేముందు తన భార్యతో, “కొత్తగా కొన్న కారు చెడిపోతే బాగులేదని చీదరపడి దానిని అమ్మేసి మరొకటి కొనటం సహజమే కావచ్చు. నీ సర్వస్వం అని నమ్మిన మనిషి కేవలం అతని దౌర్భాగ్యంవలన సర్వనాశనం అయిపోతుంటే చీదరించుకుని గాయపరచటం ఏం ధర్మం? మనిషినికూడా మరచక్రంలా వాడుకుని పనికిరాని సమయంలో పారవేసుకునే నీ మనస్తత్వానికి కొంచెం ఔదార్యం తెచ్చిపెట్టుకోమని అర్థిస్తున్నా” నంటాడు. ‘చక్రనేమి క్రమాన’ కథకు మూలాంశం ఇదే.
‘వాళ్ళు పాడిన భూపాలరాగం’ విస్తృతిని బట్టి పెద్దకథగానో, నవలికగానో చెప్పదగిన కథ. ఇందులోని ప్రతీ పాత్రా విలక్షణమైన విభిన్నవ్యక్తిత్వం కలిగి సమాజానికి ప్రతిబింబంగా అనిపించేలా ఉంటాయి. పట్టణజీవితానికి, నగర జీవితానికీ గల వ్యత్యాసం చూపటమేకాక సమాజంలోని సాధారణ మధ్యతరగతి జీవులు ఏవిధంగా నగరంలోని ప్రలోభపెట్టే అలవాట్లకు ఆకర్షితులౌతున్నారో తెలియజేస్తుంది రచయిత్రి. తాహతును మించి ప్రలోభాలకు బలై అప్పులపాలై జీవితాలను అస్తవ్యస్తం చేసుకుని లేమిలో మరింతగా కూరుకుపోయి చస్తూ బతికే జీవితాలకు అద్దంపట్టే కథ ఇది. ప్రలోభాలకు గురికాకుండా బతకగలిగే తెలివితేటలు లేకపోతే శ్లేష్మంలో ఈగల్లాగో, బురదగుంటలో పందుల్లాగో బతకాల్సిందే అనే నిజాల్ని వెల్లడించటానికి ఒక్కొక్క కుటుంబాన్నీ పరిచయం చేస్తూ కథానిర్మాణం చేసింది శ్రీదేవి.
జీవితాన్ని సఫలీకృతం చేసుకోవటానికి ఉపకరించని చదువులు అనవసరమని, చదివిన చదువువలన మానసిక వికాసం కలగాల్సిన అవసరాన్ని చర్చించారు రచయిత్రి. ఇది ఈనాటికీ విద్యార్థులు, తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన సత్యం.
అరవై ఏళ్ళనాటి ఆడపిల్లల మనోభావాలు – ముఖ్యంగా బాలవితంతువుల దుస్థితి, ఆర్థికావసరాలు – మధ్యతరగతి కుటుంబాలలోని మానవ సంబంధాన్ని చేయటం దృశ్యమానం చేశారు రచయిత్రి. పుస్తక జ్ఞాన మానసిక వికాసంకోసం. జీవితాల్ని అధ్యయనం చేయాల్సిన అవసరాన్ని ఈ కథ ఆసాంతం తెలియజేస్తుంది. కథానిర్మాణశైలిలోనూ, సంభాషణల్లోనూ, పాత్రల రూపచిత్రణలోనూ, రచయిత్రి వ్యాఖ్యానంలోనూ కాలాతీత వ్యక్తులు నవలకు ఏమాత్రం తీసిపోని రీతిలో ‘వాళ్ళు పాడిన భూపాలరాగం’ కథని కాలాతీత కథగా ఆమె మలిచింది.
ఇటీవల కథలలో ప్రత్యేకంగా కనిపించే మహిళలపై అమలౌతున్న అనవసర నియమనియంత్రణలనీ, పురుషాధిక్యతనీ, స్త్రీలపై అనేక రూపాలలో జరుగుతున్న సామాజిక వివక్షతలూ, అత్యాచారాలపై నిరసనల్నీ, ప్రతిఘటనల్నీ అరవై ఏళ్ళ క్రితమే డాక్టర్ శ్రీదేవి తన కథలలో చాలాచోట్ల స్పష్టీకరించటం గమనించదగినది.
బాల్యవివాహాలు, బహుభార్యానిషేధం, మద్యపానం, మొదలైన సామాజిక దురాచారాలకు సంబంధించి ప్రభుత్వ చట్టాలు అమలులో ఉన్నా సరే సమాజంలో యథేచ్ఛగా ఇవన్నీ యథాప్రకారం జరుగుతున్న విషయాల్ని కథలలో ఎత్తి చూపింది రచయిత్రి.
‘కల తెచ్చిన రూపాయిలు’ లోను, ‘వాళ్ళు పాడిన భూపాలరాగం’లోను, ‘స్వరూపంలో రూపం’ వంటి కథలలో ఆనాటి దేశ ఆర్థిక పరిస్థితులలో చితికిపోయిన మధ్యతరగతి కుటుంబాల్ని సమాజానికి ప్రతిబింబాలుగా చూపింది. సాధారణమైన కథని కూడా ప్రత్యేకమైన శిల్పచాతుర్యంలో ఆకట్టుకొనే శైలీవిన్యాసం ఈ రచయిత్రి సొంతం.
వృత్తి ప్రవృత్తులలో ఎంత తీరిక లేకపోయినా నిరంతర పఠనం ఆమె అభిలాష, అందువలనే ఆమె రచనలలో చక్కనిశైలి, పదునైన వాక్యనిర్మాణం, తనదైన విశిష్టమైన శైలి, భాషపై పట్టు, అతి సాహసమైన భావప్రకటన, చిరకాలం సాహిత్యంలో నిలిచి వుండే పాత్రల సృష్టి, అనితర సాధ్యమైన శిల్పచాతుర్యం. వీటన్నిటివలన పత్రికల ప్రశంసలూ, సాహితీవేత్తల గుర్తింపు, పాఠకలోకం అభిమానం సంపాదించుకుంది. కథారచయిత్రిగా పరిపక్వమైన సంస్కారం వ్యక్తమయ్యే ఆణిముత్యాల వంటి కథలు అందించింది. ఈ కథలన్నీ ఆమెని ప్రత్యేకంగా గుర్తించదగిన కథలే.
అందుకే 1957లో వెలువడిన కథాసంపుటి ఉరుములూ మెరుపులూ ముందు మాటలో గోరాశాస్త్రి ఈ విధంగా ప్రశంసల వర్షం కురిపించారు: నిజమైన ప్రతిభ ఎప్పుడూ ధ్వనికి ప్రతిధ్వని కానేరదు. విలక్షణమైన స్వయంవ్యక్తిత్వంలో ప్రకాశిస్తుంది. కనుకనే ఆమె రచనల్లోను ఆ ప్రత్యేకత, ఆ విలక్షణత ప్రస్ఫుటంగా గోచరిస్తాయి. రచయిత్రిగా ఆమె సాధించిన విజయం- భాషపై ఆమెకు గల స్వాధీనం, శైలిలో ఎనలేని మాధుర్యం, గాంభీర్యం వలన ఆమె సాధించగలిగారు. కథానికా సృష్టిలో చక్కని సంవిధానము కూడా ఉన్నది. ఆ సంవిధానానికి కావలసిన నిగ్రహం ఉంది. అనగా ఉత్తమ కళాసృష్టికి కావలసిన సాధనసంపత్తి, ప్రతిభా రచయిత్రి పి. శ్రీదేవి వద్ద పరిపూర్ణంగా ఉన్నాయి. అని అభినందించిన గోరాశాస్త్రి మాటలు అక్షరసత్యాలని శ్రీదేవి కథలు చదివినవారు ఏకీభవిస్తారు. ఎందుకంటే నేటికికూడా ఆమె కథలు నిత్యనూతనంగా, చర్చనీయాంశాలుగా ఉన్నాయంటే వాటి సార్వకాలీనత, గొప్పతనమే కారణం.
శ్రీదేవి కథలు చదివిన తర్వాత అనేక విషయాలు గమనింపుకి వస్తాయి. చాలాకథల్లో మెడిసిన్ చదువుతున్నవాళ్ళూ, లేదా డాక్టర్లూ, హాస్పిటల్ వాతావరణం కథానేపథ్యంగా ఉంటుంది. ప్రథమ పురుషలో నడచిన కొన్నికథల్లో ఆ పాత్ర డాక్టరు కావటంలో కారణం రచయిత్రి డాక్టరు కావటమే!
చాలావరకూ కథలు స్వగతంతో ప్రారంభమై, అందులోనే సంఘటనలు కలుపుకుంటూ రచన సాగించటం శ్రీదేవి రచనావిధానంగా చెప్పొచ్చు. మూడుపదులు నిండని వయసులోనే శ్రీదేవి చాలాకథల్లో అద్భుతమైన జీవనసత్యాలను, నిర్వచనాలను అవసరమైనచోట్ల సమర్థవంతంగా ప్రయోగిస్తుంది. ఇది ఆమె సాధించిన ఒక ప్రత్యేకత. ఒకింత తాత్విక దృక్పథంతో కథాసందర్భాన్ని బట్టి, కథకు బలాన్ని సమకూర్చే విధంగా కథాసంవిధానం కావచ్చు.
మరొక గుర్తించదగిన అంశం – కొన్ని కథలలో పసివయసులోనే తల్లినిగానీ, తండ్రినిగానీ కోల్పోయినట్లుగా ప్రధానపాత్రలు ఉంటాయి. కాకతాళీయం అయితే కావచ్చు. కానీ ఆ పెనువిషాదం శ్రీదేవి కూతురు మాళవికకు కూడా సంభవించటం ఒక విషాదం.
ఆమె కథలలో జీవితంపట్ల ప్రేమ, బతుకుపట్ల ఆసక్తి వ్యక్తమౌతుంది. జీవితాన్ని స్వప్నించే శ్రీదేవి, జీవితాన్ని ఎలా దిద్దుకోవాలో గొప్ప అవగాహనతో రచనలు చేసే శ్రీదేవి, జీవిత పరమార్థాన్ని ఆకళింపచేసుకున్న శ్రీదేవి ఆ జీవితాన్ని అనుభవించకుండా భౌతికంగా అదృశ్యం కావడం గొప్ప విషాదం!
సమాజంలో, కుటుంబంలో ఎదురయ్యే ఆటుపోట్లని తట్టుకొని నిబ్బరంగా నిలవగలిగే బలమైన వెన్నెముకగల పాత్రలను సృష్టించిన శ్రీదేవి వెన్నెముక కేన్సర్ బారినపడి తన భర్తనీ, రెండేళ్ళ పసిపాప మాళవికనే కాక, అభిమానించే అశేష పాఠకలోకాన్ని వదలి 1961 జూన్ 29న తేదీన అకాలమరణం పొందింది.
(వాళ్ళు పాడిన భూపాలరాగం సంపుటికి ముందుమాట – ర.)
పుస్తకం: వాళ్ళు పాడిన భూపాలరాగం
రచన: పి. శ్రీదేవి
సంపాదకత్వం: శీలా సుభద్రాదేవి
ప్రచురణ: అనల్ప (2022)
పేజీలు: 208 వెల:₹250
ప్రతులకు: అనల్ప, ఎక్సోటిక్ ఇండియా ఆర్ట్, అన్ని పుస్తకాల దుకాణాలలోను.