Comment navigation


15549

« 1 ... 1432 1433 1434 1435 1436 ... 1555 »

  1. అతిథి వ్యయో భవ గురించి అళక్కి శ్రీనివాస్ గారి అభిప్రాయం:

    01/10/2008 2:19 am

    గొర్తి గారికి అభినందనలు.
    కధలోని విషయం నిర్ద్వంద్వంగా జీవితంలోంచి పుట్టుకొచ్చిందే. కాస్త అతిశయం లేకపోతే, కధ ఉప్పు లేని కూరలా వుంటుంది. సుబ్బారావు రోడ్డుమీద నడిచెళుతోంటె, కుక్క ఎదురొచ్చింది – అంటే కధ కాజాలదు. ఎవరూ వినరు. అ సుబ్బారావుని, ఈ కుక్క కరిచిందంటే – ఆయన్ని ఎరిగున్న వర్గం (సర్కిల్) లో ఓ వార్త అవుతుంది. కానీ సుబ్బారావే కుక్కని కరిస్తే – అసక్తికరమైన సార్వజనిక కధా వస్తువు లభించినట్లే.
    శ్రుతి మించని ఈ అతిశయం కధ కి ఆయువు. దీన్ని పట్టుకోవడంలో శ్రీ గొర్తి గారు సఫలీకృతులయ్యేరని నాకనిపించింది.
    శుభాభినందనలు.

  2. తెరమరుగవుతున్న తెలుగు నాటకం గురించి mOhana గారి అభిప్రాయం:

    01/09/2008 7:03 pm

    మంచి వ్యాసము వ్రాసినందులకు అభినందనలు.
    తెలుగులో నాటకాలు లేవని అనుకోకూడదు. ఎందుకంటే యక్షగానంతెలుగుభాషకు ప్రత్యేకమైనది. తెలుగులో ఉన్నన్ని యక్షగానాలు మరే భాషలో లేదంటే అతిశయోక్తి కాదు. కాని ఈ నాడు వాటిని గురించి తెలిసినవారు అరుదు.పొరుగు భాష ఐన కన్నడములో, తుళు భాషలో అవి మూడు పూవులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నాయి. తెలుగు నాటకము గురించిన ఒక మంచి పుస్తకము Surabhi Theatres by Sri Rama Sastri.
    – mOhana

    ============================================

    మంజరీమధుకరీయమును గురించిన ప్రస్తావన వచ్చింది కనుక ఆ నాటికను గురించి కొద్దిగా తెలుసుకుందామని పుస్తకాలు తిరగవేస్తుండగా కింది పుస్తకము కనబడింది. దాని నుండి ఈ నాటిక వివరాలు కొన్ని. దీని కర్త కోరాడ రామచంద్ర శాస్త్రిగారు మరొక మహా కావ్యాన్ని రాశారు. అది ఘనవృత్తము. ఇది మేఘదూతపు తరువాతి కథ. అదే మందాక్రాంతములో రాశారు దీనిని. దీనిని ఒకప్పుడు రచ్చబండలో నేను పరిచయము చేశా.

    శ్రీ కోరాడ రామకృష్ణయ్య శతజయంతి సాహితీనీరాజనం
    సంపాదకుడు – కోరాడ మహాదేవ శాస్త్రి
    ప్రచురణ – సీతా ట్రస్ట్, విశాఖపట్ణం,
    మరియు శ్రీ ఫవుండేషన్, ఇల్లినాయ్, 1992

    అందులో పుటలు 12, 13 నుండి.

    ఇది ఒక తెలుగు నాటిక. దీనిని కోరాడ రామచంద్ర శాస్త్రి గారు 1860 ప్రాంతంలో రచించారు. దీని ఇతివృత్తం అపూర్వం. స్వకపోల కల్పితం. పురాణాదులనుంచి సంగ్రహించింది కాదు. దీని కథ సంగ్రహంగా ఇది.

    రాజకుమారి మంజరి నవయౌవనవతి అవుతుంది. ఆ సమయంలో శరీరంలో కలిగిన నూతనమైన మార్పులు ఆమెకు అర్థం కాలేదు. పొటమరించిన పాలిండ్లు మొదలయిన వాటిని ఆమె కంతులని భావించింది. మందు ఇప్పించమని తల్లి అయిన సంతానవల్లిని కోరుతుంది. ఆమె సిగ్గుతో తన కుమార్తెకు వాస్తవ విషయం చెప్పలేక పోయింది. తన పుట్టింటినుంచి మంజరి చెలికత్తె ఆమోదరేఖను రప్పించి, రాజకుమారికి ఆమె యౌవనం వివరించమని చెబుతుంది.

    ఆమోదరేఖ సకల విద్యాప్రవీణ. ఆమె వల్ల వాస్తవం తెలుసుకొని మంజరి సిగ్గు పడుతుంది. రాజకుమారి ఆమె వల్ల గానకళ నేర్చుకుంది. ఒకనాడు వారిద్దరు ఉద్యానవనంలో ఉండగా కుంభస్తని అనే చేటిక వచ్చి, చండయోగిని అనే యోగినిని చూడ్డానికి మంజరిని అంతఃపురానికి పిలుచుకొని పోతుంది. చండయోగిని క్షుద్ర మంత్రోపాసకురాలు. సామంతరాజకన్యలకు గురువు. మంజరి ఇద్వాంసురాలని ప్రసిద్ధి పొందినందున, ఆమెను వాదంలోనో మరే విధంగానో ఓడించడానికి చండయోగిని వచ్చింది. వారిద్దరికి వాదం జరుగుతుంది. చండయోగినితో ఆమోదరేఖ ఆమె గురువైన రాజయోగిని కూడ వాదించారు. చండయోగిని ఓడి పోతుంది.

    ఆమోదరేఖకు సంయమి అనే స్నేహితురాలు ఉంది. ఆమె స్నేహితురాలు సుమతి. విరిద్దరూ తపస్వినులు. వీరు ఆమోదరేఖా మంజరులకు వచ్చిన ఆపదను గురించి చర్చించుకుంటారు. ఆ ఆపద ఇది: మంజరి ఒక రాత్రి కలలో ఒక రాజచంద్రునితో రతి సుఖ మనుభవించి ఆ పారవశ్యంతో అతనిని గురించి ఆశువుగా పద్యాలు చెబుతుంది. అందుకు అందరూ కలత పడుతారు.

    ఒకనాడూ మంజరి ఆమోదరేఖలు ఉద్యానవనంలో ఉండగా, చండయోగిని నియమించిన ఒక రాక్షసుడు హరిణ రూపంలో వచ్చి వారిని తన కొమ్ముల సందులో ఇరికించుకొని ఆకాశానికి ఎగిసి పోతాడు. తపస్విను లిద్దరూ ఇలా మాట్లాడు కుంటుండగా, ఒక కాపాలిక వచ్చి, కలలో మంజరిని కలుసుకున్న మధుకర రాజపరమేశ్వరుడు విరహి అయి అరణ్యంలో తిరుగుతూ, ఆకాశంలో ఎగిరిపోతున్న హరిణాన్ని బాణంతో కొట్టాడని, హరిణ రూపంలో ఉన్న రాక్షసుడు నిజరూపంతో తాను అపహరించుకొని పోతున్న ఇద్దరిని ఒక ఇనుప పెట్టెలో బంధించి దాచి, మధు
    కరునితో పోరాడి మరణించాడని చెప్పింది. పెట్టె ఏమైందో మధుకరునికీ తెలీలేదు.

    మంజరి వార్త తెలియక విలపిస్తున్న, అగ్నిప్రవేశం చేయనున్న రాజమాతకు కాపాలిక మాయతో ఒక మణిఘంటికను ఒక లేఖతో సహా అందజేస్తుంది. అవి రాజమాత చేతిలో పడుతాయి. మంజరి క్షేమంగా తిరిగి వస్తుందని, రాజయోగిని శాపంతో హండయోగిని పిచ్చిదై పోయిందని ఆ లేఖ వల్ల తెలిసింది. రాజమాత మనసు ఊరట చెందుతుంది.

    మధుకర చక్రవర్తి భార్య హేలావతి ఎదుట మంజరి ఆమోదరేఖ ఉన్న ఇనుప పెట్టె పడుతుంది. ఆమె ఆ పెట్టె తెరిపించి, దానిలో ఇద్దరు సుందరులు ఉండడం చూచి ఆశ్చర్య పడి వారిని అంతఃపురంలో రాజు కంట పడకుండా దాచింది. రాజు విచారంగా ఉండడానికి కారణమేమో ఆమెకు తెలియలేదు. ఈ విషయాన్ని
    కుంభస్తని అనే చేటి విదూషకునికి తెలుపుతుంది. విదూషకుడు రాజును కలిసినప్పుడు రాజు, తన చింతకు కారణం చెబుతాడు.

    విదూషకుడు కుంభస్తనితో చెప్పిన దానితో రాజు చెప్పిన దానిని సరిపోల్చుకుని రాణి, రాజును ప్రసన్నుని చేసుకొనేట్టు యుక్తి చేస్తాడు. విదూషకుని భార్య యుక్తితో ఒక విప్రశ్నిక వచ్చి ఖేచరస్త్రీ సందర్శనంవల్ల రాజు స్వస్థ చిత్తుడవుతాడని
    ప్రశ్న చెబుతుంది. ఇనుప పెట్టెలో నుంచి బయటపడిన మంజరి, ఆమోదరేఖలు ఖేచర స్త్రీలని రాణి భ్రమపడి ఆమోదరేఖను రాజు కనబడేట్టు చేస్తుంది. మంజరిని చూస్తే రాజు మనస్సు మారుతుందని ఆమెను రాజుకు కనబడానీలేదు.

    రాజు, విదూషకుడు మంజరిని చూడడం ఎట్లా అని ఆలోచిస్తూ క్రీడాశాలకు రాగా,
    అక్కడ మంజరి కనిపిస్తుంది. మధుకరుడు మంజరిని గాంధర్వ విధితో వివాహం చేసుకుంటాడు. ఇంతలో రాణి వచ్చి అల్లరి చేయగా రాజు వెళ్లి పోతాడు. రాణి కోపంతో ఆమోదరేఖను, మంజరిని చెరసాలలో పడేస్తుంది. రాజు చర్యకు రాణి చింతిస్తుండగా, ఆమె తల్లినుంచి ఒక లేఖ వస్తుంది. దానినిబట్టి మంజరి రాణి
    పినతల్లి కుమార్తె అని స్పష్టమవుతుంది. రాణి పశ్చాత్తాప పడుతుంది. రాజు వద్దకు క్షమాపణ కోరుతుంది. మంజరిని రాణిని చేసి, తాను భట్టిని కావడానికి సమ్మతిస్తుంది. పిదప రాణే మంజరిని పిలుచుకొని వచ్చి రాజు చేత పాణిగ్రహణం చేయిస్తుంది.

    మచ్చుకు మొదటి అంకములో ఆమోదరేఖామంజరుల సంభాషణ –

    ఆమో – హళా మంజరి, సుమాళంబుగా నుంటివి గదా
    మంజరి – అత్తికా, నీవు వచ్చుట నింక నింక యద్ది కలుగునని
    నెమ్మనంబున నమ్మెదనే.
    ఆమో – హళా ఇట్లుంటివేమే
    మం – అత్తికా, నీవు నా చెంగట నుంటివే
    ఆమో – హళా, నీ కురంగట నవ్వ మొదలుగ వారంద రున్నారు
    గదా
    మం – అత్తికా, యీ యవ్వ తొంటి యవ్వ యనుకొంటివే
    ఆమో – యిప్పుడు గ్రొత్తగ మరి యొకతె యేతెంచెనే
    మం – కాదే యవ్వ యనిన యద్దియే కాని దాని యాత్మ మారినదే
    ఆమో – ఓసీ చెలియా, కాదే, తొల్లిటికంటె నీ యాత్మ మారిన
    దాని నెరుంగక యమ్మను వింతగ దూరుచున్నావు
    మం – అత్తికా నీవు కొన్ని నాడులు దడవున నుండుట
    నీ యాత్మయుం దారుమారయ్యెనని దలంపనగునే
    =========================================

  3. కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 1: శేష ప్రశ్న గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:

    01/09/2008 2:07 pm

    సాంకేతికపరమైన విషయాన్ని సరళంగా తెలుగులో అందించే మీ ప్రయత్నాన్నికి హృదయపూర్వక అభినందనలు.

    కొన్ని తోచిన స్నేహపరమైన సూచనలు.
    1. విషయ వివరణకు అంతగా సాయపడని Blake కవితా పంక్తులు, వాటి అనువాద వాక్యాలు మొదలైనవి, పాఠకుని అర్థగ్రహణకు అడ్డుపడకపోయినా, ఉపయోగపడకపోవచ్చు. అసలు విషయమే అంత సులభమైనది కాదు కాబట్టి, ఇటువంటి ఏ చిన్న distraction అయినా ఉండకపోవడం పాఠకుని ఏకాగ్రతకు అవసరమేమో ఆలోచించగలరు.
    2. వీలైనంతవరకు మీ ఆలోచనా సరళిని ఒకే వ్యాసంలో ఒక కొలిక్కి వచ్చేలా పూర్తిచేయండి. కథ లేదా నవల సీరియల్్ కు, ఇటువంటి సాంకేతిక రచనలకు ఇదే ఒక పెద్ద తేడా, చిక్కు కూడానేమో! కథలు నవలలు గుర్తుంటాయి, లేకపోయినా ఇప్పటిదాక జరిగింది ఇది అని టూకీగా చెప్పి సాగవచ్చు.ఇక్కడ అట్లా కాదు. అట్లా చేయడం అంత సుళువు కూడా కాదు. మధ్యలో పాఠకుడు దారి తప్పిపోయే ప్రమాదం లేకపోలేదు.

    సూచనలు సహృదయంతో చేసినవని, విమర్శ కాదని మరో సారి మనవి.
    విధేయుడు
    Srinivas

  4. నిన్నటి కల గురించి phaNi DokkA గారి అభిప్రాయం:

    01/09/2008 9:11 am

    గిరిధర రావు గారూ,

    మీ కథ బాగుంది. మహా బద్ధకస్తుడనైన నాచేత కూడా అభిప్రాయం
    రాయించగలిగిందీ కథ. కథ చదువుతున్నప్పుడు, నేను ముగింపు
    మరోలా ఉంటుందని ఊహించుకున్నాను. చిత్తగించండి..

    విశ్లేషణ :

    1.అవసరం, 2.సమాజం యొక్క ఒత్తిడి ..
    ఇవి మనిషి చేత ఎంతపనన్నా చేయిస్తాయి. కుర్రాడికి స్కాలర్షిప్
    లేకపోతే చదువులేదు, అసలు భవిష్యత్తే లేదు. అందుకే, అతను
    అన్యమనస్కంగా, సమాజం యొక్క ఒత్తిడికిలోనై
    లంచం ఇవ్వబోయాడు.

    కొత్తగా ఉద్యోగంలో చేరి, ఇంకా జీవితంలో ఢక్కాముక్కీలేవీ తినని
    వాడు కావున వీ.యస్.ఆర్ ఆదర్శవాది కావడమూ సహజమే.

    అయితే పరిస్థితులతో బాటు అతను మారిపోయినట్టుగా కాకుండా,
    మారలేక చివరకంటా తన ఆదర్శాలనే నమ్ముకుని, మధ్యతరగతి
    జీవితం గడుపుతున్నట్టు చిత్రీకరిస్తే అతని వ్యక్తిత్వం ఇంకా
    ఎలివేట్ అయ్యేదేమో.

    ముగింపు :

    సన్మానం అయిపోయాకా, అదే చోటుకొచ్చి, దూరంగా
    స్కూటర్ మీదవున్న తన కొడుకుని చూపించి, అడగలేక
    అడగలేక, ఎల్లాగో నోరు విప్పి, “వాడికి ఒక చిన్న వుద్యోగం
    వేయించమని” ఆ జాయెంట్ కలెక్టర్ గారిని అడిగుంటే,
    కథకి ఒక నిండుదనం వచ్చేదేమో..

    ఇది కేవలం నా ఊహ మాత్రమే, మీతో పంచుకుందామని రాసాను.
    మంచి కథ రాసినందుకు అభినందనలతో,

    డొక్కా ఫణి

  5. కళాపూర్ణోదయం -8: మణిహారం గురించి M. Nagaraju గారి అభిప్రాయం:

    01/08/2008 2:21 am

    This is an excellent site. I have been seararching for Kalapoornodayam at last I could get it here. Your endeavour will be remembered by all telugu people with big appreciation and high regard.

    All the best
    M. Nagaraju

  6. నాకు నచ్చిన పద్యం: ఆముక్తమాల్యదలో చిక్కులో పడిన పల్లెపడుచులు గురించి కొత్తపాళీ గారి అభిప్రాయం:

    01/07/2008 3:20 pm

    హనుమ గారూ,
    వావిళ్ళ వారిచ్చిన ఊతంతోనే కొన్నాళ్ళుగా ఆముక్తమాల్యద ఆరవ ఆశ్వాసము (మంగళ కైశికి కథ)ను ఆంగ్ల వ్యాఖ్యానంతో ప్రచురిస్తున్నాను. ఇక్కడ చూడండి.
    http://telpoettrans.blogspot.com

  7. సప్తపది గురించి నువ్వుశెట్టి గారి అభిప్రాయం:

    01/07/2008 10:16 am

    ఏ అడుగైనా వెనకడుగు వేయక ముందుకు వెళ్ళగలిగితే చాలు. మీ థీమ్ బాగుంది.

  8. తెరమరుగవుతున్న తెలుగు నాటకం గురించి Sai Brahmanandam Gorti గారి అభిప్రాయం:

    01/06/2008 8:33 pm

    శాయి గారూ, మీరు చెప్పినట్లుగా మొదటి తెలుగు నాటకం మంజరీ మధుకరీయమే ! ఇది నా పొరపాటు. తెలుగుని ఇంగ్లీషులో టైపు చేయడం వల్ల దొర్లిన పొరపాటు. నేను రాసుకున్న నోట్సులో సరిగ్గానే రాసుకొని, తీరా టైపు చేసే సరికి మధుకరీయం కాస్తా మాధవీయం అయ్యింది. ఇది నా అచ్చుతప్పు.
    సంపాదకులు ఈ చిన్న సవరణ ఈ వ్యాసంలో చేయమని నా అభ్యర్థన!
    వెబ్ పత్రికల వల్ల ఒనగూడే మరో పెద్ద సౌకర్యం ఇది.

    తప్పిదాన్ని సూచించిన శాయి గారికి మరోసారి కృతజ్ణతలు.

    -సాయి బ్రహ్మానందం.

  9. జుగల్‌బందీ కచేరీలు గురించి Suryanarayana Saripalle గారి అభిప్రాయం:

    01/06/2008 8:24 pm

    జుగల్బందీ ల గురించి మీరు వ్రాసిన అమూల్యమైన వ్యాసం చదివాను.
    ఒక విధంగా సాహిత్యం లో అష్టావధానానికి దీటైన ప్రక్రివయల్ని , సంగీత విభావరులలో , సంగీతానికే ఒక ఒరవడి చుట్టిన గాన గంధర్వులు, బృహస్పతులనదగిన వారి నుంచి మీరు వినగలగడం మా అదృష్టం , తద్వారా కలిగిన ఆనందాన్ని ,జ్ఞానాన్ని, ద్రాక్షపాకసమంగా చదువరులకి విడమరచిన మీ రచనకి మా జోహార్లు.

    వివిధ సంగీత సాంప్రదాయల పై మీకు సంక్రమించిన లేక సాధించిన ” విహంగ సమీక్షణం” , పాశ్చాత్య శాస్త్రీయ సంగీతం వైపు కూడా సారించబడి , 1. అటు అది బారతీయ సినిమా సంగీతం లో ఎలా రంగరించుకోబడింది, దానితో పాటు, 2. పాశ్చాత్య సంగీతం వింటున్నప్పుడు, అలవోకగా కనుపించి అంతలో కనుమరుగయ్యే “రాగాధారమైన” సంగీత ఛాయల గురించి ,……….
    మీ సోదాహరణ వ్యాసం ఏదైనా ఉంటే చదవాలని కుతూహలంగా ఉంది.

  10. నాకు నచ్చిన పద్యం: ఆముక్తమాల్యదలో చిక్కులో పడిన పల్లెపడుచులు గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    01/06/2008 3:18 pm

    ఆముక్తమాల్యదతో నా అగచాట్లు

    ఆముక్తమాల్యదతో నాకున్న అష్టకష్టాలు ఇవాళ్టివి కాదు. పెద్దలు దీన్ని ప్రౌఢ కావ్యం అన్నారు. మామూలు కావ్యాలని అర్థం చేసుకునే స్తోమతే నాకు లేకపోతే ప్రౌఢ కావ్యాల జోలికెళ్ళే ధైర్యం ఎక్కడుంది? అయినా సాహసం చేసి ఎప్పుడో ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యంలో కొన్ని పేజీలు చదివాను. రాయలు James Joyce కోవలో వారన్నారాయన. నా గుండెలో పెద్ద రాయి పడింది.

    కాలేజీ రోజుల్లో బుచ్చిబాబు రాసిన “చైతన్యస్రవంతి” చదివి, ఎప్పటికయినా Ulysses చదవాలని నిశ్చయించుకున్నా. నాలుగు రాళ్ళు సంపాదించే స్థికి రావడంతోటే మద్రాసులో మూర్ మార్కెట్ కెళ్ళి Ulysses కొన్నా. పది పేజీలు గూడా చదవలేకపోయా! ఇప్పటికీ ఇండియాలో ఓ స్నేహితుడింట్లో పెట్లో భద్రంగా ఉందది.

    కె. వి. యస్. రామారావు గారి సులభ అనువాదం చదివా. అది మొదటిమెట్టుగా ఉపయోగపడి స్వయంగా చదువుకోడానికి ప్రోత్సాహమిస్తుందని భావించారాయన. అయినా నేను కనీసం రెండో మెట్టుకి కూడా చేరుకోలేకపోయాను. లోపం నాదే కాని వేదం గారి సంజీవనీ వ్యాఖ్య దొరకలేదనే వంకతో సరిపెట్టుకున్నా.

    తర్వాత, మెచ్చుకోదగ్గ విస్తృత చదువరి పరుచూరి శ్రీనివాస్ పెట్టిన ‘వాత’ చదివి, కనీసం వావిళ్ళ వారి టీకా తాత్పర్యాలతో నన్నా ఓ మెట్టు ఎక్కగలనేమో అని ఆశ పడ్డా. ఊహు, కదలదే!

    ఇప్పుడీ పద్యం చదివాను. వెంటనే అనిపించిందేమిటంటే, “దేశ భాషలందు తెలుగు లెస్స” అన్న రాయలు వారు రాసిన తెలుగు నాకెందుకందుబాటులో లేదా అనే విచారం! చిన్నగా చీమలమర్రి గారి వివరణ చదివాను. ఓహో అనుకున్నా. కాని “జలరుహనాభగేహ రురుశాబము” లో జింక దాక్కొని ఉందంటే నమ్మశక్యం కాలా!

    ఈ కష్టాల్లో నాకింకో పద్యం కనిపించింది. ఇది నాఅష్టకష్టాలకీ ప్రతిఫలం అనిపించింది. వానాకాలంలో ఆడవాళ్ళు పడే అగచాట్లని వర్ణించేది:

    ఇల్లిల్లు దిరుగ నొక్కిం తబ్బు శిఖి, యబ్బెనే నింటిలో బూరి యిడి విసరక
    రాజదు, రాజిన రవులుకొల్పాసలెగాని కల్గదు గూడు దాన, గలిగె
    నేని కూరగుట మందైన బెన్పొగ సుఖ భుక్తి సేకూర, దాభుక్తి యిడిన
    బ్రాగ్భోక్తలకె తీరు బహుజనాన్నము, దీర నారుల కొదవు పునఃప్రయత్న
    మాజ్యపటముఖ్యలయ మెన్న, రాలయాంగ
    దారులయమెన్న, రంతిక కారజనిక
    పచన నాంధోగృహిణి రామి బడక మరుడు
    వెడవెడనె యార్వ నొగిలి రజ్జడిని గృహులు.

    ఆముసుర్లో ఇంటింటికీ తిరిగితే కాస్త నిప్పు దొరుకుతుంది. దొరికినా, ఇంట్లోని ఎండుగడ్డి పెడితేగాని రాజుకోదు. రాజుకున్నా, రగులుకోవాలనే ఆశే కాని రగుల్కోదు. రగుల్కొన్నా అన్నం ఉడకదు. అన్నమయినా కూర గాదు. అయినా, ఇల్లంతా పొగతో నిండి, సుఖ భోజనం కాదు. తిన్నా, ఇంట్లో అందరికీ వండిన అన్నం, మొదటి బంతి వాళ్ళకే సరిఫోతుంది. ఆడవాళ్ళు మళ్ళీ వంటకి తయారు. అప్పుడు నేతిలో తడిపిన కోకలూ, ఇంట్లోని వాసాలూ గూడా పొయ్యిలో వెయ్యడానికి వెనుకాడరు. రాత్రంతా వండుతూ, అన్నం లేని గృహిణి, ఎంతకీ పక్కలోకి రానందుకు ఇంటాయన చిందులేస్తాడు!

    ఇది నాకు చాలా నచ్చింది. ఎందుకంటే, ఇదెప్పుడో రాయల కాలంనాటి ఆడవాళ్ళ అగచాట్లు కాదు; నా చిన్నతనంలో మా ఇంట్లో, రావినూతలలో ప్రతి ఇంట్లో, వానాకాలంలో జరిగే తంతు కవితాత్మకంగా చెప్పాడు కనుక.

    చివరికే మనిపించిందంటే, రాయల్ని అర్థం చేసుకోవాలంటే నాలాటి సగటు పాఠకుడికీ అగచాట్లు తప్పవు. కాని పడితే, కె.వి.యస్., పరుచూరి, చీమలమర్రి, ఆరుద్ర, వావిళ్ళ వగైరాల సాయం వుంటే, కొన్ని రత్నాలు దొరక్కపోవు!

    కృతజ్ఞతలతో,
    కొడవళ్ళ హనుమంతరావు

« 1 ... 1432 1433 1434 1435 1436 ... 1555 »