ఏనుగు డాక్టర్

పొద్దున ఆరు గంటలకు టెలిఫోన్ మోగితే చిరాకుపడకుండా తియ్యడం నావల్ల కానిపని. ఏప్రిల్, మే నెలలు తప్ప ఏడాది పొడవునా వర్షం. వానతోనో, మంచుతోనో ఎప్పుడూ చలిగానే ఉండే ఈ అడవి ప్రాంతంలో ఇంచుమించు అందరూ పెందలాడే పడుకుంటారు. సాయంత్రం ఏడు దాటేసరికే పల్లెటూళ్ళ మీద, మా క్వార్టర్స్‌ మీదా నడిరాత్రి లాంటి నిశ్శబ్దం కప్పేస్తుంది. ఫారెస్ట్ గార్డులు కూడా ఏడున్నర ఎనిమిదికే గుర్రుపెట్టి నిద్రపోతుంటారు. కాని, నేను రాత్రి తొమ్మిది తర్వాత ఎప్పుడుబడితే అప్పుడు జీప్ వేసుకుని ఏదైనా ఒక క్యాంపుకు వెళ్ళి నలుగురైదుగురు గార్డులను ఎక్కించుకుని అడవిలోకి వెళ్ళి తిరిగి వస్తుంటాను. నా డ్యూటీల్లో నేను ముఖ్యమైనదిగా భావించేది దీన్నే. పగలంతా ఫైళ్ళతో నిస్సారంగా గడుస్తుంది. ఆ నీరసాన్ని పోగొట్టుకొని నన్ను నేను ఒక ఫారెస్ట్ ఆఫీసర్‌గా గుర్తించుకునేది రాత్రుళ్ళు అడవిలో తిరిగేప్పుడు మాత్రమే. అందుకే నాకు రాత్రిపూట పడుకోడానికి బాగా ఆలస్యం అవుతుంటుంది.

ఫోన్ మోత ఆగిపోయింది. అత్యవసరమైతే తప్ప, పొద్దున్నే అడవిలోకి రమ్మని ఎవరూ పిలవరు. అటవీశాఖలో అందరికి అడవి వాతావరణం తెలుసు. ఎవరై ఉంటారు? ఏదైనా ప్రమాదమా? పొరపాటున చేశారేమో, సరేలే పడుకో అంది మనసు. గడ్డిని కప్పుతూ ఇసుక రాలుతున్నట్టు ఆలోచనలను కమ్ముతూ నిద్రమత్తు. మళ్ళీ పూర్తిగా నిద్రలోకి జారబోతున్నాను. ఇంతలోనే మళ్ళీ ఫోన్ మోత.

ఎవరై ఉంటారో, ఎందుకు చేస్తున్నారో అర్థమయిపోయింది. తెలివొచ్చింది. ఎలా మరిచిపోయాను? సగం నిద్రలో రోజువారీ పనుల గురించి మాత్రమే మనసు ఆలోచిస్తోంది. రిసీవర్ ఎత్తి ‘హలో’ అన్నాను. అవతల ఆనంద్.

“ఇంకా నిద్ర లేవలేదారా?”

“లేదు. రాత్రి లేటయింది.”

బాగా చలిగా ఉంది. రగ్గు లాగి కప్పుకుని కుర్చీలో కూలబడి, “చెప్పరా” అన్నాను.

“నిన్న కల్చరల్ మినిస్టరే ఫోన్ చేసి కలవడానికి కుదురుతుందా అని అడిగాడు. నాకు అప్పటికే క్లూ దొరికింది. వెంటనే వెళ్ళి కలిశాను. లాన్‌లో కూర్చొని స్కాచ్ తాగుతూ మాట్లాడుకున్నాం. ఆయన ఇంప్రెస్ అయ్యాడు. కమిటీలో అందరూ ఆశ్చర్యంతో పులకించిపోయారట. ఒకసారి పెద్దాయన్ని నేరుగా కలవడం వీలవుతుందా అని అడిగాడు. ఏం సార్ అలా అడుగుతున్నారు? అవార్డ్ తీసుకోడానికి ఇక్కడికే వస్తారు కదా అన్నాను. అది కాదు, పనిచేస్తున్న చోటే ఆయన్ని నేను కలుసుకోవాలి అని అన్నాడు. మీకు ఎప్పుడు వీలవుతుందో చెప్పండి నేను ఏర్పాటు చేస్తానన్నాను.”

“సో, అయితే?”

“అయితే ఏంట్రా అయితే? అంతా కన్ఫర్మ్ అయిపోయింది. లిస్ట్ నిన్న మినిస్టర్ ఆఫీస్‌లో ఓకే అయి ప్రెసిడెంట్ సంతకానికి వెళ్ళిపోయింది. మోస్ట్‌లీ ఈ రోజూ పొద్దున్నే ప్రెసిడెంట్ టేబుల్‌ మీదకు వెళ్ళిపోతుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు అంతా పూర్తవుతుంది. ప్రెసిడెంట్ ఈమధ్య భోజనం తర్వాత ఆఫీసుకు రావటంలేదట. సాయంత్రం నాలుగింటిలోపు ప్రెస్ రిలీజ్ ఇచ్చేస్తారు. సాయంత్రం న్యూస్‌లో ప్రకటిస్తారు.”

నా ఒళ్ళంతా బుడగలుగా మారి నేను ఎగిరిపోతున్నట్టనిపించింది.

“రేయ్, ఉన్నావా?” అన్నాడు ఆనంద్.

నా గొంతులో ఒక పెద్ద బుడగ అడ్డంపడి పగిలింది. గొంతు సవరించుకున్నాను.

“హలో…”

“ఏమైందిరా?” అడిగాడు.

“ఏమీ లేదు. థ్యాంక్స్‌ రా,” అన్నాను సన్నగా. ఆనందంతో కళ్ళు నిండుకున్నాయి. వణుకుతున్న గొంతుతో “థ్యాంక్స్ రా… రియల్లీ!” అన్నాను.

“ఏంట్రా…?”

నన్ను నేను కూడదీసుకున్నాను. కొన్ని క్షణాలు ఏడుపాగకుండా వచ్చేసింది. వెక్కిళ్ళు ఆగి కుదుటపడ్డాక “థ్యాంక్స్ రా. నేను ఎప్పటికీ మరిచిపోను… దీనికోసం ఎంతో… సరే పోన్లే. నేను ఇప్పుడు ఏం చేస్తే ఏంటి? చాలా గొప్ప కార్యం జరిగింది. నిజంగా… ఎలా చెప్పాలో కూడా తెలీడం లేదురా” అన్నాను. హఠాత్తుగా ఒక పెద్ద నీటి తొట్టె పగిలి చల్లటి నీరు జలపాతంలా నా మీదనుండి కారుతున్న భావన. లేచి చేతులు చాచి అరవాలని, దేన్నయినా గట్టిగా లాగిపెట్టి కొట్టాలని, ఈ గదంతా గంతులెయ్యాలనీ ఉంది.

“ఏమైందిరా?” వాడి గొంతులో ఆదుర్దా.

“ఏమీ కాలేదు.” నా ఏడుపు నవ్వుగా మారింది. “లేచి నిల్చుని డాన్స్ చెయ్యాలని ఉంది.”

“చెయ్ మరి. వద్దంది ఎవరు?” అని వాడూ నవ్వాడు.

“బాగుంది.”

“నిజానికి నేను కూడా ఆ మైండ్‌సెట్‌లోనే ఉన్నాను. నిన్న రాత్రి రాడానికి నాక్కూడా పదకొండు దాటింది. రాగానే నీకు నాలుగైదుసార్లు ఫోన్ చేశాను. నువ్వు తియ్యలేదు.”

“అడవిలో రౌండ్స్‌కు వెళ్ళాను.”

“అదే అనుకున్నాను. అందుకే పొద్దున్నే కాల్ చేశాను. టూ ఎర్లీ అని తెలుసు. అయినా కాల్ చెయ్యకుండా ఉండలేకపోయాను. నిజానికి నిన్నంతా సరిగ్గా నిద్రపోలేదు… ఫైనల్ కాకుండా ఎవరితోను పంచుకోలేం కదా.”

“యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్!”

“సరేలేరా… ఇదే మన ఉద్యోగం. మనకు జీతమిచ్చేదే ఇందుకు. రోజూ చేసేది మన చదువుకూ ఇష్టాలకూ సంబంధం లేని చాకిరీ. మనం చదువుకున్నదానికి సూటయ్యే పని ఎప్పుడో ఒకసారి మాత్రమే చేస్తున్నాం అనిపిస్తుంది. నిజానికి ఈ అవకాశం కల్పించినందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. చాలా తృప్తిగా ఉందిరా.” ఆనంద్ గొంతులో మార్పు.

“జాగ్రత్తరోయ్. ఏడుస్తున్నావా ఏం?” నవ్వాను.

“చాల్లే పోరా!” ఫోన్ పెట్టేశాడు.

కాసేపు ఏం చేయాలో తోచక అలా కూర్చునే ఉండిపోయాను. మనసంతా నిండిపోయి శరీరం బరువుగా తోచింది. లేచి నిల్చోలేనేమో అనిపించింది. అలాగే కదలకుండా కాసేపున్నాక మనసు తేలికపడింది. లేచివెళ్ళి కాస్త టీ కాచి కప్పులో పోసుకొని తలుపు తీసుకుని బయటికొచ్చాను. చీకట్లో అరచేతిలా వాకిట్లో కొంచం మసక వెలుతురు. అవతల చెట్లు కమ్మిన అడవిలో రాత్రి ఇంకా కొనసాగుతోంది. ఆ నిశ్శబ్దం నన్ను ఆవరించింది.

బ్లాక్ టీ ఆవిరి కప్పు పైన తేలాడుతోంది. కప్పును రెండుచేతులతో వెచ్చగా పట్టుకున్నాను. తెల్లవారుతున్న వెలుగులో వాకిట్లోని గులకరాళ్ళు మెల్లమెల్లగా తెలుపు రంగును పులుముకుంటున్నాయి. ఇంటి పైకప్పు మీద పెంకులు కదిలిన చప్పుడు. అడివిపిల్లి ఒకటి తొంగి చూసింది. కొన్ని క్షణాలు నాకేసి చూసి చూరునుండి దిగి బట్టలు ఆరేసే దండెమ్మీదుగా మరో పక్కనున్న టేకు చెట్టెక్కి కనుమరుగయింది.

నేను లేచి లోపలికెళ్ళి పళ్ళు తోముకున్నాను. ఏం చేద్దాం? సాయంత్రం వరకూ ఆగుదామా వద్దా. ఆగడమే మంచిది. కాని, ఇలాంటప్పుడు ఆయనతో అక్కడే ఉండటం నా మనసుకు బాగుంటుందనిపించింది. రోజంతా ఇక్కడ కూర్చుని ఫైళ్ళు చూస్తూనో, డిపార్ట్‌మెంటల్ జాబులకు జవాబులు రాసుకుంటూనో నిస్సత్తువతో గడపాల్సిన రోజు కాదిది. అవును, ఇవాళ పగలంతా ఆయనతోనే ఉంటే సరి. ఎందుకైనా మంచిది ట్రాన్సిస్టర్ చేత పట్టుకెళ్దాం. న్యూస్ రాగానే నేనే స్వయంగా ఆయనతో చెప్పాలి. ఆయనే ఊహించలేని ఒక క్షణంలో హఠాత్తుగా ఆయన పాదాలు తాకి కళ్ళకద్దుకోవాలి. అప్పుడు నా కంట్లో కొన్ని బొట్లయినా రాలకపోవు. అయినా పర్లేదు.

కాని, దీని వెనక నేను ఉన్నాను అని ఆయనకు తెలియకూడదు. ఎప్పుడో సహజంగా తెలియాలి. తెలిసినప్పుడు ఏం చేస్తారు? ఏమీ అనరు. లేదంటే ఎప్పట్లాగే తన పనిలో మునిగిపోతూ తలెత్తి ముఖమైనా చూడకుండా థ్యాంక్స్ అని చెప్పి కొన్ని క్షణాల తర్వాత ముఖంకేసి చూసి చిన్న చిరునవ్వు చిందించి మళ్ళీ పనిలో మునిగిపోతారేమో. సందర్భానికి సంబంధం లేకుండా బైరన్ కవిత్వం గురించో కపిలన్ పద్యం గురించో మాట్లాడటం మొదలుపెట్టొచ్చు. ఆ చిన్న చిరునవ్వు చాలు. నేనూ మనిషినేనన్నదానికి రుజువుగా. బిచ్చగాడి బొచ్చెలో పడిన బంగారు వరహా లాగా!

స్వెట్టర్ మీద విండ్‌చీటర్ వేసుకుని చేతులకు గ్లౌజులు తొడుక్కుని బైక్‌ మీద బయలుదేరాను. కాటేజీల దగ్గర పది పదిహేనుమంది టూర్‌కు వచ్చిన కుర్రాళ్ళు స్వెట్టర్లు, మంకీకేపులు వేసుకుని నిల్చుని ఉన్నారు. వారి జీప్ ఇంకా రాలేదులా ఉంది. ఈ ప్రాంతంలో అవసరమైనంత నిశ్శబ్దాన్ని పాటించాలి అన్న కనీసజ్ఞానం ఇక్కడికి వచ్చే ప్రయాణికుల్లో చాలా మందికి ఉండదు. కల్లు తాగిన కోతుల్లా అటూ ఇటూ గెంతుతూ అరుస్తూ ఉంటారు.

అడవి దారిలోకి తిరిగాను. పైన దట్టమైన ఆకులపైనుండి మంచునీటి చుక్కలు రాలుతున్నాయి. ఎండుటాకులు కప్పిన బాటలో మోటర్‌సైకిల్ చక్రపు చప్పుడుకు దారికిరువైపులా ఉన్న పొదల్లోని చిన్న చిన్న జంతువులు మేలుకుని పరుగులు తీస్తున్నాయి. దూరంగా నల్లకోతి ‘ఉబ్ బుబ్ బుబ్’ అని దండోరా మోగినట్టు గొంతెత్తింది. అది దారికాపు వీరుడు. ఉన్నవాటిల్లోనే పొడవైన చెట్టు పైకొమ్మమీద కూర్చుని నాలుగు దిక్కులూ చూస్తూ ఉంటుంది.

ఆ చెట్టు దగ్గరికొచ్చేకొద్దీ ‘ఉబ్ ఉబ్’ శబ్దం ఇంకా ఎక్కువగా వినిపించింది. కింది కొమ్మల్లో ఉన్న నల్లకోతులన్నీ పై కొమ్మలకు ఎక్కడం చూశాను. కొమ్మలనుండి కోతుల నల్లటి తోకలు ఊడల్లా వేలాడుతున్నాయి. పది ఇరవై కోతులుంటాయి. అన్నీ నాకేసి చూస్తున్నాయన్న భావన కలిగింది. నేను దాటుకుని వెళ్ళగానే సన్నని గొంతుతో దారికాపు కోతి ఆగి ఆగి ఏదో సంకేతం పంపింది. అది విని దాక్కున్న పిరికి జింకలన్నీ పొదలనుండి బయటికొచ్చి మళ్ళీ ఆకులు నమలడం మొదలుపెట్టాయి.

చెక్‌డామ్ దాటాను. నీటి మీద ఆవిరి బద్దకం పాటిస్తోంది. పక్కకి చీలిన నల్లటిరాళ్ళు పరిచిన బాట దాదాపు వందేళ్ళ క్రితం బ్రిటీష్‌వాళ్ళు గుఱ్ఱాలమీద వెళ్ళడానికి వేసింది. దానిపైన జీపు కష్టంమీద నడుస్తుంది కానీ బైకు నడవదు. బైకు దిగి నడక సాగించాను.

నాలుగేళ్ళక్రితం ఈ బాట చివరున్న కొండలోయలోనే మొదటిసారి ఏనుగు డాక్టర్ డా. కృష్ణమూర్తిని కలిశాను.


నేను ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో చేరి అప్పటికి రెండేళ్ళే అయింది. ఒక ఏడాది కున్నూరు, ఎనిమిది నెలలు కళక్కాడు, రెండున్నర నెలలు కోయంబత్తూరులో ఉద్యోగం చేసి అప్పుడే ఈ టాప్‌స్లిప్‌కు వచ్చాను. మొదటి నాలుగు రోజులు ఆఫీసుని తెలుసుకోవడంలోనే గడిచిపోయాయి. మొదటి పెద్దపని ఒకరోజు పొద్దున, నేనింకా ఆఫీసుకు వెళ్ళకమందే, మారిముత్తు ఇంటికొచ్చి చెప్పిన వార్తతోనే మొదలైంది. కొండలోయలో ఒక ఏనుగు శవం పడి ఉండటాన్ని అడవిలోకి రౌండ్స్‌కి వెళ్ళిన గార్డ్‌లు చూశారట. పై అధికార్లు సహాయకులతో తెల్లవారుజామునే వెళ్ళిపోయారట.

నేను స్నానం చేసి బట్టలు తొడుక్కుని జీప్ వేసుకుని ఆ స్థలానికి చేరుకోడానికి కొంచం ఆలస్యం అయింది. నాకు మారిముత్తు చెప్పినదానిలో ఉన్న తొందర బోధపడలేదు. నిదానంగా దారి పక్కన పచ్చిక మేస్తున్న అడవి ఎద్దులను, ఎనుములనూ చూసుకుంటూ, చిందరవందరగా రాళ్ళు లేచిపోయిన ఆ ఎగుడుదిగుడు గుఱ్ఱాల బాటలో కుదుపులు భరిస్తూ నేను చేరుకునేసరికే అందరూ అక్కడ ఉన్నారు.

“ఎవరెవరొచ్చారు?” అని అడిగాను.

“డీయాపు అయ్యగారు ఉన్నేరు, సార్. ఇక్కడ గెస్టవుసు లోనే ఉన్నేరు. ముందే ఏనుగు డాట్టరూ వచ్చుంటారు. ఆయన పైన ఏనుగుల కేంపులోనే ఉంటారు సార్. ఆయినే ముందుగా వస్తారు… అవును సార్.”

డీయాపు అంటే డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అని అర్థమయింది కాని ‘ఏనుగు డాక్టర్’ అన్న పేరు మాత్రం నేను అప్పుడే విన్నాను. దానికి అర్థం టాప్‌స్లిప్‌లో ఏనుగుల కేంపు కోసం ప్రభుత్వం నియమించిన ఒక వెటర్నరీ డాక్టర్ అని అనుకున్నాను. నా జీప్ ఆ ప్రాంతాన్ని సమీపించగానే నా పేగులు దేవుకుని డోకు వచ్చేంత దుర్వాసన! అది గాలిలో గడ్డకట్టినట్టుగా ఉంది. నన్ను ముందుకు కదలనీయకుండా అడ్డుపడుతున్నట్టు, దాన్ని నేను నా శరీరంతో కోసుకుంటూ ముందుకు పోతున్నట్టూ అనిపించింది. ముందుకు వెళ్ళినకొద్దీ ముక్కే కాదు, నా శరీరంలోని అన్ని అవయవాలూ ఆ వాసన పీలుస్తున్నట్టుగా అనిపించింది. గుండ్రించి గుండ్రించి ఒంట్లో వణుకు వచ్చేసింది. చేతిగుడ్డతో ముక్కుని, నోటిని అదుముకున్నాను.

బండి దిగగానే పక్కకు వెళ్ళి వాంతి చేసుకున్నాను. కొంతసేపు అలా కూర్చుండిపోయాను. లేచి నిల్చుంటే కళ్ళు తిరిగాయి. అయినా నా బలహీనతను బయటికి కనిపించనీయకూడదని చొక్కా సర్దుకుని ఛాతీ విరుచుకొని నడిచాను. పబ్లిక్ సర్వీస్ పరీక్షలు రాసి పైపదవుల్లోకి వచ్చే అధికారులమీద కింది స్థాయి ఉద్యోగులకు ఒకరకమైన ద్వేషం, చిన్నచూపూ ఉంటాయి. వాళ్ళేమో ఊపిరి బిగబట్టుకుని భారం మోసుకుంటూ ఒకరితో ఒకరు పోటీలుపడి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉంటే, ఎగురుకుంటూ వచ్చి ఆ నిచ్చెన మీది పైమెట్టులో కూర్చుంటున్నాడే అన్న అసహ్యభావం అది.

అది నిజమే. వాళ్ళ చేతులూ కాళ్ళతోనే మేము సాగగలం. వాళ్ళను మా బుర్రతో ఆడించాలి. మేమే వాళ్ళ మీద ఆధారపడినప్పటికీ వాళ్ళే మా మీద ఆధారపడుతున్నట్టు భ్రమింపజేసి వాళ్ళను నమ్మించాలి. మాకు ఇచ్చే శిక్షణంతా దానికే. పైనుండి కిందకి వచ్చి తాకే ప్రభుత్వ అధికారపు వేళ్ళు మాత్రమే మేము. ఒక రకంగా వాళ్ళను కనిపెట్టి ఉండే గూఢచారులం, వాళ్ళకు ఉత్తరవులు జారీ చేసే ప్రభుత్వపు నాలుకలం లేదా అవసరం వచ్చినప్పుడు చర్నాకోళ్ళం.

అక్కడ మిట్టమీద గుమికూడి ఉన్న చిన్న గుంపులో అందరూ ఊడెకొలాఁ పులిమిన గుడ్డలను ముక్కులకు అడ్డంగా కట్టుకుని ఉన్నారు. ఒక ఉద్యోగి వేగంగా వచ్చి నాకూ ఒక గుడ్డ ఇచ్చాడు. దాన్ని ముక్కుకు అడ్డంగా కట్టుకున్న వెంటనే కొన్ని క్షణాలపాటు ఆ ఘాటుకి ముక్కుపుటాలు మండిపోయాయి. ఉన్నట్టుండి మళ్ళీ ఆ దుర్వాసన పెల్లుబికింది. గుమిగూడిన జనం కొంచం కదిలినప్పుడు చూశాను. కొన్ని క్షణాలు నాకేమీ అర్థం కాలేదు. ఇరవై అడుగుల పొడవు, పదడుగుల వెడల్పూ ఉన్న బురదలో మోకాళ్ళదాకా రబ్బర్ బూట్లు వేసుకుని, సఫారీ టోపీ పెట్టుకున్న ఒక పెద్దాయన ఒక మడ్డుకత్తి పట్టుకుని ఉన్నాడు. అతని బట్టలు, చేతులు, ముఖం అంతా బురద కొట్టుకుపోయి నల్లగా కారుతోంది. అతనొక పేడగుంటలో ఉన్నట్టు కనిపించింది.

మరి కొన్ని క్షణాల్లో నాకక్కడ ఏం జరుగుతోందో అర్థం అయింది. అది చాలా రోజులుగా కుళ్ళుతున్న ఏనుగు శవం. దాన్ని కోసి నాలుగు పక్కలకీ విప్పదీసిన గుడారంలా పరిచిపెట్టారు. నాలుగు కాళ్ళూ లాగి విప్పదీసున్నాయి. తొండమూ తలా పరిచిన చర్మం వెనక నీల్గి ఉన్నాయి. ఏనుగు ఒంటి లోపల కుళ్ళిన మాంసం పేడదిబ్బలా, బురదలా ఉంది. ఆ దిబ్బలో కదలికలు కూడ కనిపించాయి. బురద బుడగలతో పొంగుతున్నట్టు ఉంది. మొత్తం తెల్లటి పురుగులు లుకలుకలాడుతూ. పురుగులు అతని కాళ్ళమీద మోకాళ్ళదాకా పాకుతూ కిందపడుతూ ఉన్నాయి. మధ్యమధ్యలో మోచేతుల మీదకి, మెడ మీదకీ పాకుతున్న పురుగుల్ని తుడుచుకుంటూ పని చేస్తున్నాడు.

ఇక అక్కడ నిల్చోవడం నా వల్ల కాలేదు. చూపు తిప్పుకుని వెనక్కి జరిగాను. ఏం జరిగిందో తెలీదు. హఠాత్తుగా నా కాళ్ళకిందున్న నేలను ఎవరో లాగేసినట్టు నేను వెల్లకిలా పడిపోయాను. ఎవరివో అరుపుల మధ్య నన్ను ఇద్దరు మోసుకుంటూ జీపు దగ్గరకు తీసుకురావడం తెలిసింది. నేను తల పైకెత్తాలని ప్రయత్నించినప్పుడు మళ్ళీ గుండ్రించుకుని వచ్చింది. నన్ను పట్టుకుని ఉన్న వ్యక్తి మీదనే వాంతి చేసుకున్నాను. అతని చొక్కాను పట్టుకుని ఉన్న నా చేతులు వణకసాగాయి. మళ్ళీ కళ్ళు మూసుకున్నాను. ఎక్కడికో పాతాళానికి జారిపడిపోతున్నట్టుగా ఉంది.

‘ఆయన్ని రూముకు తీసుకెళ్ళి పడుకోబెట్టండ్రా’ అంటున్నాడు జిల్లా అధికారి. నన్ను జీపు వెనుక సీట్లో పడుకోబెట్టి తీసుకు వెళ్తున్నారు. కళ్ళు తెరిస్తే పైన ఆకులు నిండిన ఆకాశం, పాచి కమ్మేసిన నీరులా వెనకకు వెళ్తూ కనిపించింది. ఆకుల చూరుని దాటుకుని వచ్చిన వెలుతురు కళ్ళలో సూటిగా పడేసరికి కళ్ళు చికిలిస్తూ లేచి కూర్చున్నాను. కాళ్ళు పైకెత్తి సీట్లో పెట్టుకుని కిందకు చూశాను. ఒక సిగరెట్ బట్‌ని పురుగు అని భ్రమపడి వణికిపోయాను. సీటు, చొక్కా అంతా గట్టిగా చేత్తో విదిలించాను. మళ్ళీ సందేహం వచ్చి విండ్‌చీటర్ విప్పి విదిలించాను. దాన్ని మళ్ళీ వేసుకోవాలనిపించలేదు.

నా గదికి వచ్చి పడుకున్నాను.

“టీ ఏవైనా కాచమంటారా సార్?” అడిగాడు మారిముత్తు.

వద్దన్నాను. మళ్ళీ గుండ్రించుతూనే ఉంది. కళ్ళు మూసుకున్నాను. ఆలోచనల్ని బలవంతంగా లాగి పట్టుకున్నాను. ఎంత లాగిపట్టినా కోసి పరచబడిన ఆ పెద్ద ఏనుగు నల్లటి శవమే కళ్ళముందు తెరలాగా కనిపిస్తోంది. మాంసపు బురదలో మగ్గని కర్రల్లాగా ఎముకలు. విల్లులా వంగిన పక్కటెముకలు… పక్కకు తిరిగి పడుకున్నాను. ఇంకేదైనా ఆలోచించమని నా మనసుకు చెప్తూనే ఉన్నాను. అయితే అది మళ్ళీ మళ్ళీ దాన్నే ఆలోచిస్తోంది.

నిద్రలోకి జారుకున్నాను. పురుగులు మాత్రమే ఉన్న ఒక పెద్దగుంటలో పడి మునిగిపోతున్నాను. కేకపెట్టి లేచి కూర్చున్నాను. ఒళ్ళు చెమటలో తడిసి వణుకుతోంది. లేచి నా పెట్టె తెరచి లోపలున్న టీచర్స్ విస్కీ బాటిల్ ఓపెన్ చేసి గ్లాస్ కోసం వెతికాను. కనిపించిన టీ కప్పులోనే ఒంపుకుని జగ్గులోని నీళ్ళు కలిపి గటగటా తాగేశాను. ఒంట్లో వణుకు. తలవంచుకుని కూర్చున్నాను. మళ్ళీ కొంచం ఒంపుకుని తాగాను. నేను మామూలుగా తాగే మోతాదుకంటే నాలుగు రెట్లెక్కువ తాగేశాను. పొట్టలో ఆసిడ్ ఉడుకుతున్నట్టుగా ఉంది. నోట్లో ఆసిడ్ చేదు.

కాసేపటికి నా తల బరువు ఇక మోయలేనన్నట్టు నా మెడ అల్లాడిపోయింది. వెల్లకిలా పడుకున్నాను. పైనున్న దూలాలు, అడ్డకర్రలు, పెంకులు కిందకి దిగి వచ్చి చేయి చాచితే తాకేంత దూరంలో ఉన్నాయి. నా చేతులు, కాళ్ళు నా ఒంటినుండి ఊడిపోయినట్టు కదలికలు లేకుండా పడివున్నాయి. రెప్పలను లక్కతో అంటించినట్టు నిద్ర వచ్చి కప్పేసింది.

పురుగు ఒకటి నా మీద ఎక్కి నా ముఖాన్ని తాకినప్పుడు మెలుకువ వచ్చింది. నోరు చేదుగా ఉంది. లేచి కాస్త నీళ్ళు తాగుదాం అనుకున్నాను. ఆ ఆలోచనకూ ఒంటికీ సంబంధమే లేనట్టు ఉంది. నడిజాము. తలుపు వేసి ఉంది. మారిముత్తు నా మంచానికి దోమతెర కట్టి వెళ్ళినట్టున్నాడు. లేచినప్పుడు కాళ్ళు రబ్బరు కాళ్ళలా ఊగాయి. పడిపోతానేమోనని గోడని పట్టుకునే బాత్రూముకు వెళ్ళాను. మళ్ళీ గోడ పట్టుకునే వంటగదికి వెళ్ళాను. భోజనం మూతపెట్టి ఉంది. ప్లేట్ తీసి చూస్తే ఆకలి తెలిసింది.

తెచ్చి డైనింగ్ టేబిల్ మీద పెట్టుకుని తినసాగాను. నాలుగో ముద్ద నోట్లో పెట్టుకుంటుండగా అన్నమంతా తెల్లటి పురుగుల్లా కనిపించింది. గబుక్కున తింటున్న అన్నం మీదే వాంతి చేసుకున్నాను. ప్లేట్ తీసుకెళ్ళి సింకులో పడేసి నోరు కడుక్కుని వచ్చి కూర్చున్నాను. తలమీద టపటపా కొట్టుకున్నాను. వెంటనే కారేసుకుని పొళ్ళాచ్చికి, అక్కణ్ణుండి తిరునెల్వేలి వెళ్ళి, నాంగునేరి చేరుకుని అమ్మ ఒడిలో తలవాల్చుకొని పడుకోవాలి అనిపించింది. తలను గట్టిగా ఊపుకున్నాను. ‘ఏంటీ నరకం? చచ్పిపోతున్నాను!’ అని గట్టిగా అరిచాను, కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

ఆవేశంగా లేచి మిగిలిన విస్కీనీ నీళ్ళతో కలిపి పొట్ట, రొమ్ము, ముక్కు, చెవులు మండుతున్నా, కళ్ళలో నీళ్ళొస్తున్నా, వైరాగ్యంగా తాగేశాను. మంచంమీద కూర్చుని నిద్రకోసం చూశాను. నా చేతులు కాళ్ళంతా పురుగులు పాకుతున్నట్టు అనిపించింది. జ్వరంలా కాగిపోతున్న ఒంటిని ఒక్కో పురుగు చల్లగా తాకి నన్ను విదిలించుకునేలా చేస్తోంది. పరుపు పురుగులతో నింపబడినట్టు అనిపిస్తోంది. పురుగుల గుంటలో పడి పురుగులతో కప్పబడిపోయాను. మరుసటి రోజు బాగా పొద్దుపోయి లేచాకగానీ నేను తేరుకోలేకపోయాను.

మర్నాడు ఆఫీసుకు వెళ్ళగానే ఏనుగు డాక్టర్ గురించి వివరాలు తెలుసుకున్నాను. ఒక్కొక్కరి దగ్గరా ఒక్కో కథ ఉంది ఆయన గురించి చెప్పడానికి!

డాక్టర్ వి. కృష్ణమూర్తి అటవీశాఖలోకి జంతువైద్యుడిగా ముప్పై ఏళ్ళక్రితం ఇక్కడికి వచ్చారు. అడవి మృగాలకూ ఇతర పెంపుడు జంతువులకూ వైద్యం చెయ్యడమే ఆయన ఉద్యోగం. అయితే క్రమేణా ఏనుగుల స్పెషలిస్టుగా మారిపోయారు. తమిళనాడు అటవీశాఖలో ఏనుగుల గురించి అన్నీ తెలిసిన వైద్యనిపుణుడిగా ఎదిగిపోయాక ఏనుగులకు ఎక్కడ ఏం సమస్య వచ్చినా ఆయన రావాల్సిందే అన్న పరిస్థితి వచ్చింది. తమిళనాడే కాదు భారతదేశమంతా ఏనుగుల విషయం అంటే ఆయనే అన్నట్టు మారిపోయింది. ఒక దశలో చాలా ప్రపంచ దేశాలకు ఏనుగుల విషయంలో ఆయనే మెడికల్ అడ్వయిజర్. డాక్టర్ కృష్ణమూర్తి వేయికి పైగా ఏనుగులకు ఆపరేషన్ చేసి ఉంటారు. మూడువందలకు పైగా ఏనుగులకు డెలివరీలు చేశారు. వందల కొద్ది ఏనుగుల శవాలకు శవపరీక్ష చేశారు. ఏనుగుశవాలకు ఇప్పుడున్న శవపరీక్ష పద్దతి ఆయన కనిపెట్టిందే. ఎముకలు విరిగిన ఏనుగులకు ఇనుప ఎముకలు అమర్చడం, కట్టు కట్టడం వంటి ఆపరేషన్లు చాలా చేశారు. ఏనుగుల ఆరోగ్య సంరక్షణ గురించి ఆయన రాసిన పద్ధతులనే భారతదేశమంతా అటవీశాఖవారు పాటిస్తారు. కొన్ని చిన్నచిన్న మార్పులతో దానినే ఖడ్గమృగాలకూ వాడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఏనుగు ప్రేమికులకూ పరిశోధకులకూ ఆయన డాక్టర్ కె. వందలాది పుస్తకాల్లో ఆయన గురించి రాసున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఫారెస్ట్ డాక్యుమెంటరీలు తీసే హ్యారీ మార్షల్ ‘డాక్టర్ కె.’ అనే పేరిట బీబీసీకోసం ఒక డాక్యుమెంటరీ చేశాడు. నిజానికి డాక్డర్ కె. ఒక సమకాలీన చారిత్రక పురుషుడు!

ఆ తర్వాత రెండువారాలకు ఏనుగుల క్యాంపుకు జీప్‌లో వెళ్తుంటే ఆ సన్నటి దార్లో నాకు ఎదురుగా డాక్టర్ కె. జీప్‌లో వస్తూ కనిపించారు. నా జీప్‌ను పక్కకు ఆపి, ఆయన జీపుకు దారిస్తుంటే ఆయన నన్ను చూసి చిన్నగా నవ్వి, మారిముత్తుతో “ఏం మారీ, నల్లపూస అయిపోయావే!” అన్నారు.

“వస్తానయ్యా” అన్నాడు మారిముత్తు.

“వచ్చేప్పుడు అల్లం ఉంటే పట్టుకరా” అన్నారు డాక్టర్ కె.

మళ్ళీ నన్ను చూసి చిరునవ్వు చిందించి వెళ్ళారు. మీసాల్లేని కోలముఖం. నుదురూ బట్టతలా కలిసిపోయి రెండు పక్కలా నెరిసిన దట్టమైన జుట్టు. సూటి ముక్కు. ఉత్సాహం తొణికిసలాడే చిన్నపిల్లాడి కళ్ళు. చెవుల్లో విచ్చుకున్న జుట్టు. చిన్న నోటికి రెండువైపులా ముడత చారలు – అవి ఆయన వయసుకూ వ్యక్తిత్వానికీ ఒక గాంభీర్యాన్ని, గౌరవాన్నీ ఇస్తున్నాయి. అయితే నవ్వు మాత్రం ముత్యాల పలువరుసతో ప్రేమ ఒలికిస్తూ ఉంది.

ఆయన వెళ్ళిపోయాకే గ్రహించాను, ఆయనకు నేను నమస్కారం పెట్టడమో సమాధానంగా నవ్వడమో చెయ్యలేదని. నాలుక కరుచుకుంటూ ‘ప్చ్’ అన్నాను.

“ఏం సార్?” అనడిగాడు మారిముత్తు.

“చీమ” అన్నాను.

“అవును సార్! ఈ పైనున్న పువ్వుల్లో ఒట్టి చీమలు సార్. మీద పడ్డాయంటే కొరికేస్తాయి సార్. చిన్న చీమలే అయినా విషం సార్. కొరికిన చోట దద్దుర్లు వచ్చేస్తాయి సార్. అవును సార్.”

నేనప్పటికి దాదాపు పదిహేను రోజులుగా డాక్టర్‌గారి గురించే ఆలోచిస్తున్నాను. అయితే ఆయన ప్రత్యక్షంగా ఎదురుపడినప్పుడు మాత్రం నాకు బుర్ర పనిచేయకుండా పోయింది. పుస్తకంలో చూసిన బొమ్మో, చదివిన పాత్రో హఠాత్తుగా మనకేసి చూసి స్నేహంగా నవ్వినప్పుడు కలిగే షాక్!

ఆయన ఏమనుకుని ఉంటారు? హోదాలో నేను ఆయనకంటే పై అధికారిని. అధికారమదం అనుకుని ఉంటారా? గాయపడి ఉంటారా? అయితే ఆయన ముఖం చూస్తే అలాంటివి పట్టించుకునేవారిలా అనిపించలేదు. మళ్ళీ ఆయనని కలవాలి. ఆయనంటే నాకున్న అభిమానాన్నీ గౌరవభావాన్నీ తెలియజెయ్యాలి అనుకున్నాను. వెంటనే జీప్ తిప్పు అని చెప్పడానికి నోరు తెరిచాను. ఎందుకో చెప్పలేదు.

అలానే పదిరోజులు గడిచిపోయాయి. ఆ పదిరోజులూ మనసులో వందలసార్లు వందలాది మాటలతో ఆయనకి క్షమాపణలు చెప్పుకున్నాను. అయితే ఆయనని నేరుగా కలిస్తే మాట్లాడగలను అనే అనిపించలేదు. రెండుసార్లు ఆయన ఇంటిదాకా వెళ్ళి తిరిగి వచ్చేశాను. నా ఈ మొహమాటం దేనివల్ల అన్నది నాకే తెలీడంలేదు. అడవిలో ఏనుగు డాక్టర్ అంటే అందరికీ అభిమానం, దగ్గరితనం ఉంది. చాలామంది ఆయన దగ్గరే జ్వరానికి, దెబ్బలకూ మందులు తీసుకుంటున్నారు. రోజూ పొద్దున్నే పాత కంబళ్ళు కప్పుకున్న గిరిజన ముసలమ్మలు చేతిలో సీసాలతో మందులకోసం ఆయన ఇంటివైపుకు వెళ్తుండటం చూశాను.

“ఈ ముసలోళ్ళకు ఏ రోగమూ రొస్టూ లేదు సార్! ఏనుగు డాక్టర్ ఇచ్చే రొట్టెలు, చెక్కెరపొడి రుచి మరిగారు సార్. వాటికోసమే వెళ్తున్నారు సార్. అవును సార్” అన్నాడు మారిముత్తు.

ఆఫీస్ క్లర్క్ షణ్ముఖం వాడికి వంత పాడుతూ, “నిజమే సార్! ఆయన వీళ్ళను పరామర్శించి మంచి చెడులు అడిగి కనుక్కుంటారు సార్. వీళ్ళు కష్టసుఖాలు చెప్తే ఆయన నెమ్మదిగా విని నాలుగు మంచి మాటలు చెప్పి పంపిస్తాడు సార్. దాని కోసం వెళుతున్నారు. అయితే మంచి హస్తవాసి ఉన్న డాక్టర్ సార్! నాకు కాల్లో ఒకసారి గడ్డ వస్తే దాన్ని చీరి మందు పెట్టి బాగుచేశారు సార్” అన్నాడు.

“అవన్నీ ఎద్దులకు వేసే మందులు సార్!” అన్నాడు మారిముత్తు.

“అరే!”

“నిజం సార్! చాలావరకు మనుషులకి, గొడ్లకీ ఒకే మందే ఇస్తారు సార్! డాక్టర్ డోస్ తగ్గించి ఇస్తాడు సార్. కొన్నిసార్లు ఊరికే మంచినీళ్ళ సూది వేసి శొంఠి, మిరియాలు, పసరాకులు ఇచ్చి పంపిస్తుంటారు సార్!” అన్నాడు షణ్ముఖం.

“ఏనుగు డాక్టర్ అంత పెద్ద ఏనుగులకే మందులిస్తున్నారు, ఇంతోటి మనుషులకు ఇవ్వడం ఆయనకొక లెక్కా సార్? ఏనుగు పెద్దదా, మనిషి పెద్దా సార్? అవును సార్!” అన్నాడు మారిముత్తు.

ఒకసారి ఆయన జీప్ రోడ్డు మీద వెళ్తుంటే ఉద్యోగుల క్వార్టర్స్‌లో ఉండే పిల్లలు ‘ఏనుగు డాకటర్! ఏనుగు డాకటర్’ అని కేకలేస్తూ జీప్ వెనుక పరుగులు తీయడం చూశాను. ఆయన జీపు ఆపి ఒక్కో పిల్లాణ్ణి, పిల్లనీ పలకరిస్తూ ఏదో అడుగుతుంటే మెలికలు తరిగిపోతూ, చేతులు ఊపుతూ, ఒకరిమీదొకరు ఒరుసుకుపడిపోతూ జవాబులు చెప్తున్నారు ఆ అల్లరి మూక. మధ్యలో కేరింతలు, గట్టిగా నవ్వులు. ఆయన అక్కణ్ణుండి వెళ్ళేంతవరకు నేను దూరంగా ఆగి అదంతా చూశాను.

ఆయన నిరాడంబరత, అంకితభావాల గురించిన వింటున్నకొద్దీ ఆయన మీద గౌరవం పెరిగిపోసాగింది. అయితే ఆ భావనలే ఆయనను కలవకుండా నన్ను ఆపుతున్నాయి. నాకు తెలియని ఒక చారిత్రక కాలంలో ఉండి నేను ఆయనని చూస్తున్నానన్న భావన. అశోకుడో, అక్బరో, గాంధీనో నాతో మాట్లాడుతున్నట్టు! దాన్ని ఎలా ఎదుర్కోవాలి? నా దగ్గర సరైన మాటలు లేవు! అయితే నేను ఆయనతో మాట్లాడటానికి మాటలు తయారుచేసుకున్నాను. నా ఊహాలోకాలలో ఆయనను రకరకాలుగా కలిశాను. రకరకాలుగా పరిచయం చేసుకున్నాను. చివరికి అర్థమయింది, కాకతాళీయంగానే ఆయనను కలవగలను తప్ప ప్రయత్నించి కాదు. చివరకు అలానే జరిగింది.

ఒకరోజు జీప్‌ దిగి అడవిని చూస్తూ ఉన్నప్పుడు పెద్ద చాటతో విసిరినట్టు ఒక శబ్దం వినిపించి పైకి చూశాను. గ్రేట్‌హార్న్‌బిల్! ఆశ్చర్యపోయి అలా ముందుకు అడుగులేశాను. చాలా ఎత్తయిన కొమ్మ మీద వాలివుంది. ఆ పక్షి గురించి విన్నాను కానీ ఎప్పుడూ చూడలేదు. తెల్లపంచకు పైన నల్లకోటు వేసుకున్న బట్టతల మనిషిలాంటి పక్షి. బాపూ గీసే ముసలి ప్లీడర్ బొమ్మ గుర్తొచ్చింది. పెద్ద గిన్నెకోడి అంత ఉంది.

ఎగురుకుంటూ వచ్చి కొమ్మమీద కూర్చున్నప్పుడు దాని రెక్కల వెడల్పు చూసి ఆశ్చర్యపోయాను. పెద్ద కొబ్బరి చిప్పని బోర్లా పెట్టినట్టు ఉన్న ముక్కుతో కొమ్మమీద కూర్చుని ‘గ్యావ్’ అని నెమ్మదిగా అరిచింది. గ్రేట్‌హార్న్‌బిల్ ఎప్పుడూ జంటతోనే ఉంటుందని తెలుసు. పైనున్నది మగపక్షి. ఇక్కడే ఎక్కడో ఆడపక్షి ఉంటుంది. నాలుగువైపులూ వెతికాను. పొదలో చప్పుడు చెయ్యకుండా కూర్చుని ఉంది. అంత స్పష్టంగా కనిపించడం లేదని అవతల వైపుకు నడిచాను. ఏం జరిగిందో తెలియలేదు, కరెంటు షాక్ కొట్టినట్టు అయింది. నా మోచేయి మీద మంట మొదలైంది. దురదా మంటా నొప్పా అని తెలియని వింత బాధ. నా పక్కనున్న ఆ చెట్టును చూడగానే తెలిసిపోయింది. మందారాకు ఆకారంలో సన్నటి వెంట్రుకల్లాంటి ముళ్ళతో నిండిన ఆకులు. దురదగొండి మొక్కా?

ఏం చెయ్యాలో అర్థంకాలేదు. మామూలుగా దురదగొండి నడుము ఎత్తే ఉంటుంది. ఇదేమో పొడవుగా పెద్ద ఆకులతో ఉంది. వేరే ఏదైనా విషపు మొక్కా? ఒళ్ళంతా దురద పుడుతోంది, దద్దుర్లు కూడానూ. దురదకంటే భయం ఎక్కువైంది. గాబరాపడుతూ పక్కనే ఉన్న క్వార్టర్స్‌కు వెళ్ళి మారిముత్తును కలిశాను.

“ఏనుగు డాక్టర్‌కి చూపెడదాం సార్!” అన్నాడు.

“వేరే డాక్టర్ దగ్గరకు వెళ్దామా?” అన్నాను.

“అలా అయితే మనం ఊర్లోకెళ్ళాలి సార్. ఈయనయితే ఇక్కడే ఉన్నారు. ఐదు నిముషాల్లో కలిసి సూదేసుకోవచ్చు… మీరేమో టవున్నుండి వచ్చారు. మేము ఇక్కడే పడున్నాము. మాకేమీ అయ్యేదిలేదు సార్. అవును సార్!” అన్నాడు.

నేను వద్దు అని స్పష్టంగా చెప్పేలోపే జీప్ ఎక్కించి డాక్టర్ కె. దగ్గరకు తీసుకెళ్ళిపోయాడు. అదీ మంచికే అనుకున్నాను. ఇప్పుడు ఆయన్ని కలుసుకోడానికి ఒక కారణం ఉంది. డాక్టర్‌ని కలుసుకోడానికి రోగికి హక్కు ఉంది కదా? అయితే నా మనసులో అలజడి మొదలైంది. ఆ సమయంలో నా ఒంటి దురదలు, మంటలు కూడా కాసేపు మరిచిపోయాను.

అనుకున్నట్టే డాక్టర్ కె. ఆయన క్లినిక్ అనిపించుకునే ఒక రేకుల కొట్టాంలోనే ఉన్నారు. నాలుగైదు జింకలు ఒక చిన్న కంచెలో నిలకడలేకుండా తిరుగుతున్నాయి. బయట ఏనుగొకటి చెఱకుమోపు నుంచి ఒక్కో గెడా లాక్కుంటూ కాలికింద పెట్టి విరుచుతూ నెమ్మదిగా తింటూవుంది. దాని పక్కనే మావటీ బెంచీమీద నిద్రపోతున్నాడు.

డాక్టర్ కె. గొంతుక్కూర్చుని శ్రద్ధగా ఏదో ద్రవాన్ని పిపెట్‌లోకి తీసుకుంటూ ఉన్నారు. నన్ను చూడగానే తలపైకెత్తి చిరునవ్వు చిందించి చేస్తున్న పనిని కొనసాగించారు.

“డాక్టరయ్యా ఉన్నారా! ఆఫీసరుగార్ని దురదగొండి కొరికేసింది. ఆయనేమో ఇష్టమొచ్చినట్టు అడవిలోకి దూరెలిపోయాడు. మనకు ఇవేవీ లెక్క కాదు. ఆయన కొత్త కదాండీ. చాలా దురదగా ఉందిరా మారీ అన్నాడు. నేనన్నానూ, ‘మాకు ఇలాంటివి తాకినా ఏంకాదు… మీరు మాత్రం ఏనుగు డాక్టర్‌ దగ్గర చూపించుకోండి’ అని తీసుకొచ్చాను. అవునండీ!” అన్నాడు మారిముత్తు.

ఆయన నా వైపుకు తిరిగి, “ఇది అడవి మొక్క. ఊరిలో ఉండే దురదగొండికి మరో వర్షన్… ఇప్పుడు మీకు అవసరం అయితే యాంటీ అలెర్జిటిక్ ఇంజెక్షన్ ఒకటి ఇవ్వగలను. లేదంటే ఐస్‌వాటర్‌లో కడుగుతూ ఉండచ్చు. ఏది చేసినా చెయ్యకున్నా గంటలో తగ్గిపోతుంది,” అంటూ పిపెట్‌ని ఫ్రిజ్‌లో పెట్టి తలుపేసి వచ్చి నా చేతిని నడుమునీ చూశారు. “ఏం కాదు… ఒక గంటలో దీని తీవ్రత పోతుంది. రేపటికి పూర్తిగా నయమైపోతుంది. గీరుకున్నారా?”

“అవును” అన్నాను.

ఆయన చిన్నగా నవ్వి, “ఒక పని చేయండి. గీరుకోకుండా ఉండేందుకు ప్రయత్నించండి. దురదగానే ఉంటుంది, తెలుసు. దురద పుడుతున్న భాగంలో ఏం జరుగుతుందో జాగ్రత్తగా మనసుని అక్కడే నిలిపి గమనిస్తూ ఉండండి. మీ మనసెందుకు ఇంత ఆదుర్దా పడుతోంది? ఎందుకు దీన్ని వెంటనే నయం చేసుకోవాలనుకుంటున్నారు? ఇలాంటివన్నీ ఆలోచించండి! సరేనా? ఇవన్నీ కాదు. ఇప్పటికిప్పుడే ఇంజెక్షన్ కావాలంటే ఇస్తాను, ఇఫ్ యూ ఇన్సిస్ట్,” అన్నారు.

“లేదు, వద్దు. నేను మనసు పెట్టి గమనిస్తాను.”

“గుడ్. రండి, టీ తాగుదాం.”

“ఈ జింకలకేమైంది?” అని అడిగాను.

“ఏదో ఇన్ఫెక్షన్. అందుకే పట్టుకుని తీసుకురమ్మన్నాను. నాలుగైదురోజుల్లో ఏంటి అనేది చూడొచ్చు. ఇప్పుడే శాంపుల్స్ తీశాను. కోయంబత్తూరుకు పంపించి కల్చర్ టెస్ట్ చేసి చూడాలి. మీరు దక్షిణాదివారా?”

“అవును తిరునెల్వేలి వైపు. నాంగునేరి.”

“మా అమ్మవాళ్ళ పూర్వీకం అక్కడే. నవతిరుపతుల్లో ఒకటి. అక్కడున్న పెరుమాళ్ళుకు కూడా మంచి పేరొకటి ఉంటుంది. చెప్తాను ఉండండి. ఘనమకరకుండలకర్ణనాథుడు!”

“దక్షిణతిరుప్పేరై! 108 దివ్యదేశాల్లో ఒకటి కూడానూ.”

“అవును. వెళ్ళారా?”

“చాలాసార్లు. చాలా పురాతనమైన క్షేత్రం.”

“ఎస్, ఒక అగ్రహారం కూడా ఉంది… ప్రాచీనత పెద్దగా మారలేదు. కూర్చోండి” అని టీ కాచడానికి వెళ్ళారు.

స్టవ్ వెలిగిస్తూనే “నొప్పులమీద దృష్టిపెట్టి గమనించడం అన్నిది ఒక మంచి అలవాటు. అలాంటి ధ్యానం మరొకటి లేదు. మనం ఎవరం, మన మనసూ బుద్ధీ ఎలా పనిచేస్తాయి అన్నది మన నొప్పి చెప్పేస్తుంది. నొప్పంటే ఏంటి? మామూలుగా ఉండటం కంటే కొంచం వేరేలా ఉండే స్థితి! అయితే నొప్పి వచ్చినప్పుడు మామూలు స్థితికి రావాలని మన మనసు తపించిపోతుంది… అదే నొప్పితో వచ్చిన చిక్కు! నొప్పిమీద దృష్టి పెట్టి గమనిస్తేనే సగం నొప్పి పోతుంది… వెల్, భరించలేనంతగా హింసించే నొప్పులు ఉన్నాయి కాదనను. కాని, మనిషి ఏరకంగానూ గొప్ప కాదు. హి ఈజ్ జస్ట్ అనదర్ యానిమల్ అని తెలిపేవి అలాంటి నొప్పులే!” అని చెప్పుకుపోయారు.

పాలు లేని టీ కాస్తూ కూర్చుని మాటలు కొనసాగించారు.

“నిజానికి మనిషే అన్నిటికన్నా బలహీనమైన జంతువు. రోగాన్ని, నొప్పిని భరించడంలో జంతువులు చూపించే ఓర్పుని, గాంభీర్యాన్ని చూస్తే కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. ప్రాణం పోయేంత నొప్పి ఉన్నా ఏనుగు ఏడవదు. తపించదు. కళ్ళు మాత్రం సగం మూసుకుని ఉంటుంది. శరీరంలో అక్కడక్కడా సన్నటి వణుకు కనిపిస్తుంది, అంతే! నిజానికి ఏనుగుకు మత్తుమందు ఇవ్వకుండానే సర్జరీ చెయ్యొచ్చు. అంత నెమ్మదిగా సహకరిస్తుంది. కానీ అలా చెయ్యము. వాట్ ఎ బీయింగ్! దేవుడు ఏనుగులను తను మంచి క్రియేటివ్ మూడ్‌లో ఉన్నప్పుడు సృష్టించి ఉంటాడు…”

ఆయనతో మాట్లాడటం మొదలుపెడితే నాలుగో వాక్యంకల్లా ఏనుగు గురించి ప్రస్తావన తీసుకొచ్చేస్తారు అని చాలా మంది చెప్పారు. నాకు అది గుర్తురాగానే చిన్న నవ్వు వచ్చింది.

“ఏనుగే కాదు, చిఱుతలు, అడవి గేదెలూ అంతే. వాటికి తెలుసు!”

“అవును, ఆవు ఈనేటప్పుడు చూశాను. కళ్ళు మాత్రం అటు ఇటు తిప్పుతూ తలవంచుకుని నిల్చుని ఉంటుంది.”

“అవును, అవి జీవనయానంలో సహజమైన సంఘటనలేనని వాటికి తెలుసు. మనిషే గోల చేసేస్తాడు. మందు ఎక్కడ, మాత్ర ఎక్కడ అని గగ్గోలు పెట్టేస్తాడు. చేతికి దొరికినదాన్ని తినేసి మరో రోగాన్ని తెచ్చుకుంటాడు. మేన్ ఈజ్ ఎ పేథెటిక్ బీయింగ్, చదివారా?”

“చదివాను” అన్నాను.

“యూ షుడ్ రీడ్ గాంధీ! ఈ జెనరేషన్ ఆలోచనలను ప్రభావితం చెయ్యగలిగే శక్తి గల ఒకే ఒక థింకర్ ఆయన! ప్రతి విషయం మీదా ఒరిజినల్‌గా ఏదో ఒకటి చెప్పి వెళ్ళారు. నా ఫేవరెట్ గాంధీ, అరవిందో. ఆ పైన చేతికి దొరికే పుస్తకాలన్నీ” అంటూ నా చేతికి టీ కప్పు ఇచ్చారు. నాకు ఒంట్లో వణుకొచ్చింది. టీ కప్పు చేతిలో పట్టుకోవడానికే ఏదోలా ఉంది. కప్పు బయటంతా మురికిగా ఉన్నట్టు అనిపిస్తోంది. ఒక క్షణం కళ్ళు మూసుకుంటే పురుగులు తిరుగుతున్నట్టు భ్రమ.

ఛీ ఛీ నా మనసెందుకు ఇలా ఆలోచిస్తోంది? ఆయన డాక్టర్. మందులతో చేతులు కడుక్కోవడం తెలిసినవారు. పైగా ఆయన ఆ శవపరీక్ష చేసి నెల దాటింది. లేదు, ఆయన వేళ్ళ గోళ్ళ సందుల్లో ఆ మురికి ఉంటే? ఇలా ఎలా ఆలోచిస్తున్నాను నేను? ఏమైంది నాకు? పింగాణీ కప్పు మీదున్న నల్లటి చుక్కని చేత్తో రుద్దాను. ఎందుకో తాగాలంటే మనసొప్పుకోవటంలేదు. ఇది ఆయన గమనిస్తున్నారా? ఇదొక మానసిక రుగ్మత. లేదు, ఈయనకు అసహ్యాలుండవు, జుగుప్స కలగదు. కాసేపటి క్రితం కూడా ఏదైనా ఒక జుంతువు నసిని చీరి ఉంటారు. చేతులు కడుక్కున్నారా? అవును, కడుక్కున్నారు. అయితే?

కళ్ళు మూసుకుని టీ కప్పు నోట్లోకి ఒంపేసుకుని గటగటా తాగేశాను. గొంతులో మంట.

“ఓ మై… చల్లారిపోయిందా? ఇంకొకటి కాచనా వేడిగా?”

“వద్దు చాలు.”

“నేనే వేడిగా తాగుతాను అనుకుంటాను. మీరు నాకంటే వేడిగా తాగేలా ఉన్నారు.”

ఆ వేడి టీ నా నరాల్లోకి వెళ్ళాక నా ఒళ్ళంతా ఒక ఆలోచన మొదలైంది. ఎందుకింత జుగుప్స? నా ఒంటిలో ఉన్నదీ అదే రసి, మాంసమే కదా? శ్లేష్మాలు, ద్రవాలు, మలం, మూత్రం… నేనూ అంతే కదా! అయితే?

“మీరు ఆ రోజు కళ్ళు తిరిగి పడిపోయారు కదా?” అని అడిగారు డాక్టర్ కె.

మనసులు చదివేసే ఆయన విద్యకు ఆశ్చర్యపోతూ “అవును సార్” అన్నాను.

“అడివిలో చనిపోయే ప్రతి జంతువునీ పోస్ట్‌మార్టమ్ చేసి తీరాల్సిందే అని నేను ముప్పై ఏళ్ళుగా పోరాడుతూనే ఉన్నాను. శవం ఎంత కుళ్ళిపోయి దొరికినా సరే! అదివరకు అలా చేసేవాళ్ళు కాదు. సీ, పెద్ద జంతువుల మరణాల్లో ప్రతీ మూడింటిలో ఒకటి హత్యే! మనిషి చేసే హత్య!” అని కొనసాగించారు. “ఒకప్పుడు అంటువ్యాధిని పసిగట్టేలోపే సగం జంతువులు చచ్చిపోయేవి” అని బాధపడ్డారు.

“బాగా కుళ్ళిపోతే?” అడిగాను నేను.

“ఏదైనా ఒక ఎవిడెన్స్ కచ్చితంగా దొరుకుతుంది. కనుక్కోడానికి ఒక మెథడాలజీ ఉంది. ఐ రోట్ ఇట్.”

“తెలుసు డాక్టర్” అన్నాను.

“పురుగుల్ని చూసి భయపడ్డారు కదా? పురుగుల్ని చూస్తే చాలామందికి భయం. ఆ భయం ఎందుకు కలుగుతుందో దాని మీద దృష్టి పెట్టి క్షుణ్ణంగా ఆలోచిస్తే దానిని దాటేయొచ్చు. భయాన్ని, అసహ్యాన్ని, జుగుప్సని, అనుమానాన్నీ ఎదురుతిరిగి నిలబడి దాని మీద దృష్టిని కేంద్రీకరించి గమనిస్తే అవి నిలవవు, రాలిపోతాయి. ఇక్కడ నల్లగా చింతగింజంత సైజులో ఒక జోరీగలాంటి ఈగను చూసుంటారు. అవి ఎక్కడయినా ఉంటాయి. మనం వాటితో సహజీవనం చేస్తున్నాం. అవి మన అన్నం మీద కూడా వాలొచ్చు. దాన్ని అవతలకు తోలేసి తినాలి. అంతే!” డాక్డర్ కె. నవ్వారు. “ఆ ఈగ ముందు దశే మీరు చూసిన ఆ పురుగులు. ఈగను ఎదిగిన మనిషి అనుకుంటే, ఆ పురుగు పసిబిడ్డ. పసిబిడ్డలమీద ఎందుకు అంత అసహ్యం? వాళ్ళను చూస్తే ఎందుకంత జుగుప్స?”

నాకు మాటలు రాక అలా చూస్తూనే ఉన్నాను.

“పురుగులన్నీ పసిపిల్లలే. నడవలేవు, ఎగరలేవు. ఇష్టమొచ్చినట్టు అలా పాకుతుంటాయి. వాటికి తెలిసింది ఒకటే, తినడం. తింటూనే ఉంటాయి. చిన్నపిల్లలూ అంతే. పసిపిల్లాడు తినే ఆహారంతో ఆ పిల్లాడి బరువుని పోలిస్తే మీ బరువుకి మీరు రోజుకి ముప్పై లీటర్ల పాలు తాగాలి!” గట్టిగా నవ్వు. “వాటికి అలాంటి ఆర్డర్. గబగబా దొరికింది తిని ఎదిగే మార్గం చూడు అని… పిచ్చి ఫిలాసఫీ అనిపిస్తోందా?”

“లేదు.”

ఆ రోజంతా ఆయనతో మాట్లాడుతూనే ఉన్నాను. ఆయనలాంటి చక్కని మాటకారిని నేను చూడలేదు. కాలక్షేపం, తత్వం, సాహిత్యం, విజ్ఞానశాస్త్రం అని ఒక అంశంనుండి మరో అంశానికి జంప్ చేస్తూ! జేమ్స్ బాండ్‌లాగా కార్ నుండి హెలికాప్టర్‌కి ఎగిరి, ఆక్కణ్ణుండి బోట్‌లోకి దూకి, ఒడ్డుచేరుకుని, అక్కణ్ణుంచి బైక్ ఎక్కి వేగంగా వెళ్ళిపోతున్నట్టు భ్రమ కలుగుతోంది. ఆ రోజునుండి వారానికి మూడు రోజులైనా ఆయన్ని కలవడానికి వెళ్ళేవాణ్ణి. పుస్తకాలు ఇచ్చేవారు. వాటిగురించి సుదీర్ఘంగా చర్చించేవారు.

ఆయనతో కలిసి నేను జంతువుల్ని అలవాటు చేసుకున్నాను. మాలిమి చేసిన ఏనుగు కాలిమీద అడుగుపెట్టి పైకి ఎక్కి ఏనుగు కుంభస్థలం మీద కూర్చుని అడవిలో తిరిగాను. మనిషి దాని మీద ఎక్కగానే తన ఎత్తుని, ఆ మనిషి ఎత్తునీ లెక్కవేసుకుని చెట్లకింద జాగ్రత్తగా నడిచి వెళ్ళే దాని సూక్ష్మబుద్ధిని చూసి విభ్రాంతి చెందాను. డాక్టర్ కె. ఒక ఎలుగుబంటి కాలికి కట్టు కట్టినప్పుడు ఆయనకి సాయంగా దాని కాళ్ళను లాగి పట్టుకున్నాను. జింకల పేడకళ్ళను పాలిథీన్ బ్యాగుల్లో సేకరించి శాంపుల్స్ కోసం తెచ్చి ఇచ్చాను. ఒకే నెలలో పురుగులు, చిన్నచిన్న జంతువులను పసిపిల్లల్లా చూడటానికి నా మనసు అలవాటుపడిపోయింది.

మెత్తగా బొద్దుగా బిలబిలమని ఆత్రంగా తింటూ కదులుతూ ఉండే పురుగుల గుంపులో ఎన్ని చిన్న చిన్న ప్రాణాలు, బతకడానికై అవి పడే తపన, వాటి ఆవేశం చూస్తే మనసు ఆశ్చర్యంతో నిండిపోతుంది. తెల్లటి రంగులో ఎగసేందుకు సిద్ధపడుతున్న మరుగుజ్జు జ్వాలలా అవి? అణువంతైనా ఖాళీలేకుండా అంతుచిక్కని మహత్వంతో నిండిపోయినదే ఈ ప్రపంచం అని అప్పుడు అనిపించి ఒళ్ళు పులకించింది. భుజించు అన్న ఒక్క ఆజ్ఞమాత్రమే ఉన్న బొట్టంత ప్రాణం! ఆ బొట్టు లోపలే రెక్కలు, గుడ్లు, భావితరాలు. ప్రతి క్షణమూ కలిగే ఆపదలను జయించి పైకిలేచి నశించిపోకుండా బ్రతికే ఊహకు అందని సమష్టి ప్రజ్ఞ!

పురుగులను మనిషి ద్వేషించకూడదు అంటారు డాక్టర్ కె. మనిషి చేసే తప్పేంటంటే పురుగుల్ని విడివిడిగా చూసి తనతో పోల్చుకుని చూస్తాడు. పురుగులు సమస్తమైన జ్ఞానాన్ని, చిత్తవృత్తిని కలిగినవి. కోట్లాది సంఖ్యగలవి పురుగులు. రోజురోజుకీ తమని తాము నూతనంగా మార్చుకుంటూ ఉండే మహాసమూహం పురుగులది. వాటితో పోలిస్తే మనిషి సమూహం చాలా చిన్నది. మనిషి చేసిన పురుగుమందుని ఎదుర్కొనేది ఒక్క ఒంటరి పురుగు కాదు. ఒక పెద్ద పురుగుల విశ్వం. వాటి సారాంశంగా ఉండే అతి బ్రహ్మాండమైన పురుగుచిత్తం. ఆ చిత్తం తమని నిర్మూలించడానికి మనిషి వాడే పురుగులమందుని కొన్ని నెలల్లో ఇట్టే జయించేస్తుంది.

ఒక తెల్లటి పురుగుని చేతిలోకి తీసుకున్నప్పుడు అది మెలికలు తిరుగుతూ వేలు పైకి ఎక్కేప్పుడు ఒక పసిబిడ్డను ఎత్తుకునేప్పుడు కలిగే అనుభూతి కలిగేది. అతి మృదువైన చాలా సాధారణమైన ఒక ప్రాణం. కానీ ఈ బుల్లి ప్రాణం అంతంలేని సామర్థ్యాలనూ మహోన్నతమైన శక్తినీ తనలో ఇముడ్చుకున్నది! ఒక బ్రహ్మాండానికి ప్రతినిధి. కొన్నిసార్లు పురుగుని ముఖం దగ్గరకు తెచ్చి దాని కళ్ళను చూసేవాణ్ణి. ఆహారాన్ని తప్ప మరోదాన్ని చూడాల్సిన అవసరంలేని కళ్ళు. వీటికి ఏం తెలుస్తుంది అనిపించేది. అవి చిన్నగా మెరిసే అణువంత కళ్ళు. ఆ కళ్ళద్వారా ఒక పెద్ద పురుగుల మహాసముహమే నన్ను చూస్తోంది. దాన్ని చూసి నవ్వుతున్నాను. ఒక రోజు నువ్వు నన్ను కూడా తిని ఎదగవచ్చు. పరవాలేదు. ఈ భూమ్మీద నేనూ నువ్వూ ఒకటే! బుజ్జిపిల్ల, చిట్టిపిల్ల అని ముద్దు చెయ్యాలనిపిస్తుంది.

డాక్టర్ కె. సాహిత్యంలో అపారమైన ఆసక్తి కలవారు. జబ్బంటూ వెతుక్కుని వచ్చే గిరిజన ముసలమ్మను సైతం నిరాశ చెందనివ్వరు, ఏ జుంతువుకీ వైద్యాన్ని రేపటికి అని వాయిదా వెయ్యరు. అంత నిర్విరామంగా శ్రమిస్తూనే ప్రపంచప్రసిద్ధమైన విజ్ఞాన పత్రికలకు గొప్ప గొప్ప పరిశోధనాపత్రాలు రాస్తుంటారు. ఆ వ్యాసాలు ప్రచురించబడిన పత్రికలు ఆయన అలమరాలో క్రమపద్ధతిలో సర్ది ఉంటాయి. ఆ పత్రికల్లో మిగిలిన వ్యాసాలు అర్థంకాని విజ్ఞానపుఘాటుతో ఉంటే డాక్టర్ కె. రాసిన వ్యాసాలు మాత్రం కచ్చితమైన శైలిలో సన్నటి హాస్యంతో కలగలిపి కవితలతో ఉదాహరించబడి ఆసక్తికరంగా ఉంటాయి. ఆయనకు అత్యంత ఇష్టమైన కవి లార్డ్ బైరన్.

ఒకసారి నేనూ ఆయనా అడవిలోకి వెళ్తున్నాము. ఉన్నట్టుండి డాక్టర్ కె. చేతులతో సైగ చేశారు. జీప్ ఆగింది. ఆయన మాట్లాడకుండా చెయ్యి చూపించిన పొదలో ఒక ఎర్రకుక్క చెవులు కనిపించాయి. డోల్ అని పిలుస్తారు వాటిని. గుంపులుగా తిరుగుతాయి. అవి మమ్మల్నే గమనిస్తున్నట్టుగా అనిపించింది. ఆయన మరో చోట చేయి చూపించారు. అక్కడ ఇంకో ఎర్రకుక్క కనిపించింది. కొన్ని నిమిషాల్లో ఆ ప్రదేశమంతా స్పష్టంగా కనిపించింది. ఆరు ఎర్రకుక్కలు ఆరు దిక్కుల్లో నిల్చుని మధ్యలో ఉన్న మరో ఎర్రకుక్కని కాపలా కాస్తున్నాయి.

“అక్కడ ఆ గుంపు నాయకుడో లేక పిల్లలు ఈనిన తల్లో కదలలేక పడి ఉంది” అని ఇంగ్లీషులో చెప్పారు డాక్టర్ కె. కళ్ళను వాటిమీద కేంద్రీకరించి సన్నని గొంతుతో “ఇక్కడే ఉండండి. కదలకండి. చేతులు పైకెత్తకండి. నేను మాత్రం వెళ్ళి చూసి వస్తాను” అన్నారు.

నేను కంగారుగా “ఒక్కళ్ళేనా?” అన్నాను.

“వాటికి నేను తెలుసు” అన్నారు ఆయన.

“లేదు డాక్టర్, ప్లీజ్… ఎర్రకుక్కలు చాలా ప్రమాదకరమైనవని చెప్తారు.”

“కచ్చితంగా ప్రమాదకరమైనవే. బట్, దిస్ ఈజ్ మై డ్యూటీ” అని మెల్లగా తలుపు తెరచుకుని దిగి ఎర్రకుక్కల వైపుకు నడిచారు.

చల్లటి గాలి విసురు నన్ను దాటుకుని వెళ్ళింది. చేతులతో మెల్లగా నా బెల్టుకు ఉన్న గన్నుని తాకాను. దాని చల్లటి స్పర్శ నాకు కాస్త ఉపశమనాన్ని ఇచ్చింది. డాక్టర్ కె. గట్టు ఎక్కి కుక్కల్ని సమీపించారు. పొదలోనుండి మొదట చూసిన కుక్క తలపైకెత్తి చెవుల్ని ముందుకు రిక్కించి ఆయన్ని చూసింది. ఆయన దగ్గరకు వస్తున్న కొద్దీ తలను కిందకు వంచి మోర చాచి, పళ్ళు బయటపెడుతూ ఆయనని తీక్షణంగా చూసింది. మిగిలిన కుక్కలు కూడా నెమ్మదిగా ఆయన వైపుకు రావడం చూశాను. కొన్ని నిముషాల్లోనే ఆయనను ఆ ఆరు కుక్కలూ చుట్టుముట్టాయి.

డాక్టర్ కె. మొదటి ఎర్రకుక్క దగ్గరకు వెళ్ళి కదలకుండా నిల్చున్నారు. కొన్ని నిముషాలు ఆ కుక్కా ఆయనా మౌనంగా ప్రార్థిస్తున్నట్టుగా అలానే నిల్చున్నారు. తర్వాత ఆ కుక్క తన ఒంటిని వంచి దాదాపు పాకుతున్నట్టుగా ఆయనను సమీపించింది. మోర చాచి ఆయన్ని వాసన పీల్చింది. ఒక్క ఉదుటున వెనక్కివెళ్ళి మళ్ళీ వచ్చి వాసన పీల్చింది. ‘హూహూహా’ అని ఏదో చెప్పింది. మిగిలిన కుక్కలు తలలు పైకెత్తుకున్నాయి.

మొదటి కుక్క ఆయన దగ్గరకు వచ్చి బూట్లను నాకింది. తర్వాత అది ఆయన మీద కాలు పెట్టి చేతిని వాసన చూసింది. మెల్లిగా దాని ధోరణి మారింది. మనల్ని ఆహ్వానించే పెంపుడు కుక్కలా ఒళ్ళు వంచి తోకను ఊపింది. ఆయనకేసి చూస్తూనే తోక ఊపుకుంటూ పక్కకు నడిచి గెంతుకుంటూ కొంచం దూరం వెళ్ళి, చెవులు వెనక్కి రిక్కించి వేగంగా తిరిగి మళ్ళీ ఆయన దగ్గరకు వచ్చి నిల్చుని, మళ్ళీ తుళ్ళుతూ పరుగుతీసింది. ఆయనని ఒక ప్రత్యేక అతిథిలా అది భావించడం తెలుస్తోంది. ఆయన రావడంతో సంబరపడిపోతోంది. ఆయన తనదగ్గరికి వచ్చారు అన్న గౌరవాన్ని ఎలా అందుకోవాలో దానికి అర్థంకావటంలేదు.

మిగిలిన కుక్కలు తోకలు ఊపుతున్నాయి. తర్వాత ఇంకో కుక్క మొదటి కుక్క నిల్చున్న చోటకు వచ్చింది. మిగిలిన నాలుగు కుక్కలూ వాటి పాత స్థానాలకు వెళ్ళిపోయాయి. డాక్టర్ కె. వంగి పొద లోపల ఏదో చూస్తుండటం కనిపించింది. తర్వాత ఆయన అక్కడే కూర్చున్నారు. అక్కడ ఆ కుక్క కువ్ కువ్ కువ్ అంటూ ఏదో చెప్తుండటం వినిపించింది. అర్ధగంట తర్వాత డాక్టర్ కె. తిరిగి వచ్చారు. జీప్‌ ఎక్కి కూర్చుని “పదండి, వెళ్దాం” అన్నారు.

“ఏమయింది సార్?” అన్నాను.

“అక్కడ వాళ్ళ నాయకుడు గాయాలు తగిలి పడి ఉన్నాడు.”

“ఎలాంటి గాయాలు?”

“చిఱుత చేసుండవచ్చు అనుకుంటాను. కుడితొడలో కండ మొత్తం లేచిపోయింది. ఎముక విరిగిపోయుండచ్చు…”

“మనమేం చెయ్యాలి?”

“ఏమీ చెయ్యనక్కర్లేదు. అది వాటి జీవితం, వాటి ప్రపంచం… మనం చూడాల్సింది మూడు విషయాలే. ఆ కుక్కని మనుషులు ఏమైనా చేశారా అన్నది మొదటిది. అలా చేసివుంటే నేరస్తుడ్ని వెతికి పట్టుకుని దండించాలి. రెండు, మామూలుగా ఉండేవి కాకుండా కొత్తవేవైనా అంటువ్యాధులు ఉన్నాయా అని చూడాలి. ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలి.”

“దాన్ని అలానే వదిలేసి వెళ్ళిపోతున్నాం కదా? అది చచ్చిపోతే?”

“చావదు… అయితే ఆ కుక్క ఇకనుండి నాయకుడు కాదు. బహుశా నన్ను తీసుకెళ్ళింది గుర్తుందా? అదే ఇకనుండి నాయకుడు.”

“మనమేదైనా మందు వేస్తే?” అని అడిగాను.

“ఏం మందు? మనం వాడే ఆంటీబయాటిక్సా? అడవి జంతువులకుండే రెసిస్టన్స్ ఎంతో తెలుసా? ఈ మందులు వేసి అలవాటు చేస్తే ఆ పైన మనం అడవుల్లో కూడా ఊళ్ళల్లోలాగా ప్రతీ రెండు మైళ్ళకొక ప్రాథమిక వైద్యశాల పెట్టాల్సిందే.”

నేను నిట్టూరుస్తూ “ఆ కుక్క మిమ్మల్ని గుర్తుపట్టడం అమేజింగ్!” అన్నాను.

“కుక్కంటే ఏమనుకున్నావు? సచ్ ఎ డివైన్ యానిమల్… మనిషి తనను తాను పెద్ద పుడింగి అనుకుంటాడు. జంతువులకు ఆత్మ ఉండదు, జ్ఞానం ఉండదు అని! మనిషి తన హీనమైన బుద్ధితో ఒక స్వర్గాన్నీ దేవుణ్ణీ సృష్టించి పెట్టాడే, అందులో జంతువులకు చోటులేదంట. నాన్సెన్స్!” డాక్టర్ కె. ముఖం ఎరుపెక్కింది. “బైరన్ కవిత ఒకటుంది. ‘ఒక కుక్క సమాధి మీద రాయబడిన వాక్యం’ అని చదివావా?”

“లేదు.”

ఆయన ఎరుపెక్కిన ముఖంతో అడవినే చూస్తూ ఉండిపోయి ఉన్నట్టుండి మంత్రపఠనంలా చెప్పసాగారు…

“When some proud son of man returns to
earth, Unknown to glory, but upheld by birth…”

ఆ లైన్లు ఈయన గురించి కూడా అయివుంటాయనిపించింది.

కుక్క జీవితంలో గొప్ప స్నేహితుడు
ఆహ్వానించడంలో ప్రథముడు! రక్షించడంలో తొలివాడు!
వాడి నిజాయితీగల హృదయం యజమానికే సొంతం,
యజమాని కోసమే శ్రమిస్తాడు, తిని బ్రతుకుతాడు!

ఆ లైన్‌లు డాక్టర్ కె. జీవితానికి చాలాసార్లు ఆపాదించి చూసుకున్నాను. స్నేహమే ఆత్మగా ఆకృతి చెంది మెరిసే కళ్ళతో స్నేహమే తోకగా స్నేహమే చెపులుగా స్నేహమే అరుపులుగా స్నేహమే చల్లని ముక్కుగా నా కళ్ళముందు ఒక కుక్క నిల్చుంది. నేను నీకే అంది. నువ్వే నేను అంది. నువ్వు నన్ను నమ్మవచ్చు, దేవుడితో సమానంగా, అంది. ఎందుకంటే దైవత్వం అంటూ ఒకటి ఉంటే అందులోనుండి తొణికి పడిన ఒక బొట్టును నేను! అంది.

పక్కనే ఉన్న దాన్ని పట్టించుకోకుండా దేనికోసమో తపించిపోతూ దిగంతానికేసి చూస్తూ ఒక అల్పుడు నిల్చుని ఉన్నాడు. వాడే నేను. జీవితాంతం అన్వేషించేవాడిగా – అధికారాన్ని, సుఖాన్ని, గుర్తింపుని! గుర్తింపుకోసమై చదరంగాలు, ఎత్తుగడలు, జట్టులు కట్టడాలు, కృత్రిమమైన నవ్వులు, అర్థంలేని వేలాది మాటలు. ‘Man, vain insect!’ అనే బైరన్ గర్జనని ఆరోజు ఆ అడవిలో, ఎగసే జ్వాలలా ఎరుపెక్కిన డాక్టర్ కె. గొంతుగా విన్నాను. పిడుగులు రాల్చే వేగంతో ఆకాశమే చూపుడువేలు చాచి మనిషికి చెప్పింది: ‘నీ ప్రేమ స్వార్థం. నీ స్నేహం మోసం. నీ నవ్వు అబద్ధం. నీ మాటలు గాలిలో మేడలు.’

నాకు తెలీకుండానే కళ్ళలో నీళ్ళు నిండాయి. నేను అన్న ఆలోచనే సిగ్గుపడేలా చేసింది. నా శరీరం కుళ్ళిపోయి దుర్వాసన వస్తున్నట్టు తోచింది. మురికి చొక్కాని తీసి విసిరేసినట్టు నన్ను వదిలించుకుని నాలుగు కాళ్ళతో ఆ అతిస్వచ్ఛమైన పచ్చని గడ్డినేల మీదకు ఉరకాలనిపించింది. ఈ గాలీ ఈ ఎండా నన్ను అపరిచితుడని వెలివేయకుండా తమలోకి పొదవుకుంటాయి. అక్కడ నొప్పి ఉంటుంది, రోగం ఉంటుంది, మరణం ఉంటుంది. అయితే నీచత్వం, హీనత్వం లేదు. అణువంతైనా హీనత్వం ఉండవు. ‘నిన్ను క్షుణ్ణంగా తెలిసిన అందరూ నిన్ను అసహ్యించుకుని వెళ్ళిపోతారు. ప్రాణమున్న నీచమైన మురికి నీవు’ నేను వెక్కి వెక్కి ఏడుస్తూ జీపు ఆపేశాను. డాక్టర్ కె. నా వైపుకైనా చూడకుండా ఘనీభవించిన జ్వాలలాగా అలా కదలకుండా కూర్చుని ఉన్నారు.

మనిషి నీచత్వాలు చెంపమీద కొట్టినట్టు ప్రతిరోజూ చూడాలంటే మీరు అడవిలో ఉండాలి. చాలావరకు ఇక్కడికి విహారయాత్రకు వచ్చేవాళ్ళు చదువుకున్నవాళ్ళు, బాధ్యతగల పదవుల్లో ఉన్నవాళ్ళు. వాళ్ళు బయలుదేరేప్పుడే వేయించిన చిరుతిళ్ళతోబాటు మద్యం సీసాలూ తెచ్చుకుంటారు. వచ్చే దారిపొడవునా తాగుతూ తింటూ వస్తారు. వాంతులు చేసుకుంటారు. కొండలోయల నిశబ్దవిస్తీర్ణాలను కార్ హారన్‌ అనే శబ్దశరాలు విసిరి చించేస్తారు. వీలైనంత ఎక్కువ వాల్యూమ్‌లో కార్ స్టీరియోని అరిపిస్తూ పిచ్చిగంతులు వేస్తూ కేకలు పెడతారు. పెద్ద కొండలోయల్లో బండ గుహల్లో గట్టిగా బూతుల కచేరి చేస్తారు.

ప్రతి అడవి జంతువునీ అవమానిస్తారు. దారిపక్కనుండే కోతులకు జామపండుకోసి కారప్పొడి నింపి ఇస్తారు. జింకలమీదకు రాళ్ళు రువ్వుతారు. ఏనుగు అడ్డొస్తే పెద్దగా హారన్ మోత మోగిస్తూ దాన్ని భయపెట్టి రెచ్చగొడతారు. అన్నిటికంటే కూడా ఎంత ఆలోచించినా నాకు అర్థంకాని ఒక విషయం ఏంటంటే, ఖాళీ సీసాలను ఎందుకంత మూర్ఖంగా అడవిలోకి విసురుతారన్నదే! బళ్ళను ఆపి చెకింగ్ చేశాక, మందుసీసాలతో వచ్చేవారిని దింపి బెల్ట్‌తో రక్తం వచ్చేలా కూడా కొట్టాను. బట్టలు ఊడదీసి చలిలో ఆఫీసు ముందు కూర్చోబెట్టాను కూడా. ఎంత చేసినా అడవి బాటలో ఇరువైపులా సీసా పెంకుల్ని అరికట్టడం అసాధ్యంగానే ఉంది.

అన్ని జంతువులకంటేనూ ఏనుగులకు చాలా ప్రమాదకరం ఈ సీసాపెంకులు. ఏనుగు పాదాలు ఇసుక బస్తాల్లా మెత్తగా ఉంటాయి. విసిరిన ఖాళీసీసాలు ఏ చెట్టుకో తగిలి పగిలి చెట్లకింద గాజు పెంకులుగా పడివుంటాయి. ఏనుగులు తమ బ్రహ్మాండమైన బరువుతో వాటి మీద పాదం మోపగానే గాజు పెంకు క్షణంలో పాదం లోపల గుచ్చుకుంటుంది. రెండు అడుగులు వెయ్యగానే ఆ పెంకు పూర్తిగా పాదం లోపలకి వెళ్ళిపోతుంది. ఆ పైన ఏనుగుకు నడవడం అసాధ్యం. రెండే రోజుల్లో ఆ గాయం చీము పట్టేస్తుంది. పురుగులు పట్టేస్తాయి. పురుగులు మాంసాన్ని తొలుచుకుంటూ చీముని లోపలికి తీసుకుపోతాయి. ముఖ్యంగా రక్తనాళాలనో, ఎముకనో చేరుకుంటే ఇక ఆ ఏనుగు ప్రాణాలతో ఉండదు.

వాచి బరువెక్కి చీము కారే కాలిని ఈడ్చుకుంటూ కొన్ని రోజులు ఏనుగు అడవిలో అల్లల్లాడుతుంది. ఒక దశలో కదల్లేక ఏదో ఒక చెట్టుకు ఆనుకుని నిల్చుంటుంది. రోజుకు ముప్పై లీటర్ల నీళ్ళు తాగి, రెండువందల కేజీల ఆహారం తిని, యాభై కిలోమీటర్లు నడచి జీవించే జంతువు అలా ఒకచోట ఐదు రోజులు నిల్చుని ఉంటే చిక్కిపోయి పాడైపోతుంది. పలుచబారిన చర్మంలో వెన్ను ఎముక నిక్కపొడుచుకుంటుంది. దవడ ఎముకలు పైకి తేలతాయి. చెవుల కదలిక క్రమేణా తగ్గిపోతుంది. నుదుటి చర్మం ముడతలుపడి మదజలం ఇంకిపోతుంది. నెమ్మదిగా తొండాన్ని నేలమీద ఊనుకుంటుంది. క్రమేణా ఏనుగు నేల కూలిపోతుంది. మరుసటి రోజు వెల్లకిలా పక్కకు ఒరిగి బండరాయిలాంటి పొట్ట పైకి తిరిగిపోయి పడివుంటుంది. తోక, తొండమూ మాత్రం కదుపుతూ కళ్ళు తెరిచి మూస్తూ వణికిపోతూ ఉంటుంది. మిగిలిన ఏనుగులు దాని చుట్టూ చేరి తలలు ఊపుతూ ఘీంకరిస్తూ ఉంటాయి.

ఆ తర్వాత ఏనుగు చచ్చిపోతుంది. తొండపు చివరి కదలిక ఆగిపోయాక కూడా చాలా రోజులు ఏనుగుల గుంపు దాని చుట్టూ నిల్చుని రోదిస్తూ ఉంటుంది. నమ్మకం నశించాక శవాన్ని అక్కడ విడిచిపెట్టి కొన్ని కిలోమీటర్ల అవతల కొత్త ప్రదేశానికి వెళ్ళిపోతాయి. ఏనుగు తోలు మందం కావడంతో ఆ శవం కుళ్ళేంతవరకు ఏ మృగాలూ తినలేవు. అది తొందరగానూ కుళ్ళిపోదు. కుళ్ళిపోయిన శవాన్ని వెతుక్కుంటూ ముందుగా ఎర్రకుక్కలు వచ్చి నోటి భాగాన్ని, పాయువునీ చీల్చుకు తింటాయి. తర్వాత గద్దలు వాలి తింటాయి. ఆపైన గుంటనక్కలు గుంపులు గుంపులుగా చాలా దూరంనుండి వెతుక్కుంటూ వస్తాయి. మనిషికంటే నూటడెబ్బై రెట్లు అధికమైన న్యూరాన్ల బుర్ర కలిగిన అడవిరారాజు ఒట్టి ఎముకలుగా మట్టిలో మట్టిగా కలిసిపోతాడు.

ఒకసారి ముదుమలలో ఒక ఏనుగుకు కాలు వాచిపోయి అడవిలో అల్లాడుతున్నట్టు వర్తమానం వచ్చినప్పుడు డాక్టర్ కె.తో బాటు నేనూ వెళ్ళాను. అడవిలో ఆ ఏనుగు ఉన్నచోటుని కుఱుబర్లు అనే కొండజాతి తెగవారొకరు అదివరకే కనుగొని ఉండటంతో వాళ్ళను జీపులో ఎక్కించుకుని అడవిలోకి వెళ్ళాము. అదీ ఒక పాత గుఱ్ఱపు బండి దారే. చాలా దూరం ప్రయాణించాక, జీపు ఆపేసి నేను, డాక్టరు, తుపాకులతో ఇద్దరు ఫారెస్టు గార్డులు, ఇద్దరు కుఱుబర్లు సరంజామాతో కొండలోయలోకి దిగి నడిచాము.

తాకితే కోసుకుపోయే వెదురు ఆకులను పక్కకు తోసుకుంటూ డాక్టర్ కె. ముందు నడిచారు. నేలమీద వేర్లు కాళ్ళకు అడ్డు తగిలాయి. నేను కొమ్మలు పట్టుకుని నడుస్తున్నాను. డెబ్బై ఏళ్ళు దగ్గరబడుతున్నా ఆరోగ్యమైన దృఢమైన దేహం డాక్టర్ కె.ది. అడవి ఆయనకు చేపకు సముద్రంలాగే. కాసేపు నడిచాక గాల్లో ఏనుగుల వాసన తెలిసింది. అప్పటికే ఏనుగులు మమ్ముల్ని చూసేశాయి అని తెలిసింది. సన్నటి ఘీంకారాలు వినిపించాయి. ఇంకాస్త ముందుకెళ్ళాక రెండుపక్కలా వెదురు చెట్లున్న ఒక చిన్న కాలువ. దాని అవతల ఆకుపచ్చగా ఎండని నింపుకున్న పచ్చిక నేల. ఆ పచ్చికలో పన్నెండు ఏనుగులు గుంపుగా నిల్చుని ఉన్నాయి.

ఇంకా ఎక్కువ సంఖ్యలో కూడా ఉండచ్చు అనుకుని ఆగి నెమ్మదిగా చూస్తే మరో ఆరు ఏనుగులు కనిపించాయి. మరింత నిశితంగా చూస్తే నాలుగు గున్న ఏనుగులు కూడా ఉన్నాయని తెలిసింది. డాక్టర్ కె. తన పనిముట్లను తీసి ఒంటికి తొడుక్కున్నారు. వాటిల్లో ఒకటి చిన్న ఎయిర్ గన్. మాత్ర కొంచం పెద్దగా ఉంది. ఏనుగును టెలిస్కోప్‌లో కాసేపు పరీక్షగా చూశారు. దాని బరువును అంచనా వేస్తున్నారని అర్థం అయింది. బరువుని బట్టే ఎంత మత్తుమందు అన్నిది నిర్ణయిస్తారు.

ఆయన తనపనిలో పూర్తిగా నిమగ్నుడయి పనిచేస్తుండటం చూస్తూవున్నాను. అంతా సిద్ధం చేసుకున్నాక “మీరిక్కడే ఉండండి. నేను వెళ్ళి చూస్తాను” అన్నారు.

ఆయనతో ఇలాంటప్పుడు ఏమీ చెప్పలేం అని నాకు ఇదివరకే తెలుసు.

“ఒక పెద్ద చెట్టుకు ఆనుకుని నిలుచుని ఉంది. అక్కడే కింద పడితే దెబ్బ తగులుతుంది. దాన్ని నెమ్మదిగా కాస్త మెత్తగా ఉన్న చోటికి తీసుకు రావాలి. మిగిలిన ఏనుగులకు నేను ఏమి చెయ్యబోతున్నానో తెలియదు. కాబట్టి రెసిస్ట్ చెయ్యవచ్చు.”

“ఏనుగులకు తెలుసా ఈ గాయానికి కారణం మనుషులేనని?”

“కచ్చితంగా… చాలా బాగా తెలుసు.”

“మరి ఎలా?”

“చూద్దాం…” అంటూ డాక్టర్ కె. మెల్లగా కిందకు దిగి కాలువ దాటి బురదనేల మీదకు చేరుకున్నారు. ఏనుగులు తొక్కడంతో బురదలో పెద్ద పెద్ద గుంటలు పడిపోయి ఉన్నాయి. గుంటలను తప్పించుకుంటూ జాగ్రత్తగా అడుగులు వేస్తూ వాటిని సమీపించారు. ఏనుగుల గుంపుకు మధ్యలో ఉన్న పెద్ద పిడియేనుగు ఘీంకరించింది. అది విని ఇతర ఏనుగులూ ఘీంకరించాయి. ఒక ఏనుగు డాక్టర్ కె. వైపుకు వస్తోంది. దాని చెవులు వేగంగా ఊగుతున్నాయి. తలను కూడా వేగంగా ఊపుతూ వస్తోంది. డాక్టర్ కె. కదలకుండా నిల్చున్నారు. అది అంతటితో ఆగకుండా హెచ్చరించే రీతిలో ఘీంకరించుకుంటూ ఇంకో రెండు అడుగులు ముందుకు వేసింది.

ఏనుగు తలను అలా ఊపుతుందంటే అది హెచ్చరిస్తోంది, దాడి చెయ్యబోతున్నాను అని చెప్తోంది. నా గుండె చప్పుడు నా చెవులకు వినిపించింది. పరుగెట్టుకెళ్ళి డాక్టర్ పక్కన నిల్చుకోవాలి అని ఆలోచన కలిగింది. నా కళ్ళముందే డాక్టర్‌ని విధ్వంసం చేస్తుంటే నేనిక్కడ ఊరకే చూస్తూ ఉండిపోయి, ఆయన శవాన్ని మోసుకుంటూ వెనుతిరగాల్సిన పరిస్థితి వస్తే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను. అయితే నా ఒంటిలో అవయవాలు కదలటం లేదు. నాలుక ఎండిపోయి మాటలు కూడా రావడంలేదు.

డాక్టర్ కె. కదలకుండా నిల్చుని ఉన్నారు. ఏనుగూ కదలకుండా నిల్చుని ఉంది. తక్కిన ఏనుగులు అన్నీ ఆయననే దీక్షగా చూస్తున్నాయి. డాక్టర్ కె. రెండు అడుగులు ముందుకు నడిచారు. ఆ ఏనుగూ దగ్గరకొచ్చింది. అయితే తల ఊపడం లేదు. తన కుంభస్థలాన్ని వంచింది. ఇది హెచ్చరికే. డాక్టర్ కె. నెమ్మదిగా ఇంకొంచం ముందుకు వెళ్ళారు. అది కదలకుండా నిల్చుంది. చాలాసేపు అలానే! ఏం జరుగుతుందో తెలీడం లేదు. కొన్ని గంటలు గడిచాయని అననిపించింది.

ఏం జరిగిందో ఆ ఏనుగు వెనక్కి నడిచింది. పెద్ద పిడియేనుగు డాక్టర్ కె.ని చూసి ఒకసారి ఘీంకరించి తోకను తిప్పింది. తర్వాత ఒక్కో ఏనుగూ వెనక్కి తిరిగి అవతలి వైపు లోయలోని వెదురు పొదల్లోకి వెళ్ళిపోయాయి. చివరి ఏనుగు కూడా తోక ఊపుతూ పచ్చని వెదురు ఆకుల్లో కలిసిపోయింది. మేము నమ్మలేక చూస్తూ నిల్చున్నాము. డాక్టర్ చేయి పైకెత్తి మమ్మల్ని రమ్మని పిలిచారు. మేమందరం కాలువలో దిగి దాటుకుని అక్కడికి వెళ్ళాము.

మమ్మల్ని చూడగానే గాయపడిన ఏనుగు కోపంగా తలను తిప్పుతూ ముందుకు రాడానికి ప్రయత్నించింది. మెల్లగా ఘీంకరించింది. డాక్టర్ మమ్మల్ని దగ్గరకు రమ్మన్నారు. ఫారెస్ట్ గార్డులు అక్కడే ఆగారు. నేను, కుఱుబర్లమూ వెళ్ళాం. ఏనుగు తను ఆనుకుని ఉన్న చెట్టు హఠాత్తుగా ఊగిపోయేలా తల పెకెత్తుకుంటూ మా వైపుకు వచ్చింది. దాని వెనకటి కాలు వాచిపోయి తక్కిన కాళ్ళకంటే రెండింతలుగా ఉంది. ఆ కాలును పైకెత్తలేకుండా ఇంచుమించు ఈడ్చుకుంటూ మాత్రమే కదలగలుగుతోంది.

అది నాలుగడుగులు ముందుకు రాగానే డాక్టర్ దాన్ని కాల్చారు. మందు సరిగ్గా దాని భుజం మీద కండభాగంలోకి దూసుకెళ్ళింది. ఏనుగు ఒళ్ళు వణికిపోతూ అలా నిల్చుండిపోయింది. దాని చెవుల కదలిక ఆగింది. మళ్ళీ వేగంగా చెవులు ఊపింది. నెమ్మదిగా ఆ కదలికలు ఆగిపోయాయి. ముందరి కాలును లేపి మడిచి ఊపింది. అలా పక్కకి ఒరిగి బురదలో పెద్ద శబ్దంతో మోదుకుని పచ్చిక నేలమీద పడింది. దాని తొండమే ఆ గడ్డి మీద మరొక జంతువు అన్నట్టు పొర్లింది. తొండం చివరి భాగాన్ని పైకెత్తి ముక్కుతో మమ్మల్ని వాసన పట్టాక కదలికలు కోల్పోయింది.

డాక్టర్ కె. ఏనుగు పక్కనే కూర్చుని చకచకా పనులు మొదలుపెట్టారు. నేను ఆయనకు సాయపడ్డాను. మా చుట్టూ వెదురు పొదల్లో నిల్చుని ఆ ఏనుగులన్నీ మమ్ముల్ని తీక్షణంగా చూస్తున్నాయని మరోసారి అనిపించింది. నా వీపు మీద చల్లటి గాలిలా వాటి చూపులు తాకుతున్నట్టు అనిపించింది. ఏదైనా ఒక దశలో ఆ ఏనుగులకు మేము ఏదో తప్పుగా చేస్తున్నామని అనిపిస్తే ఏమవుతుంది? మా పరిస్థితి ఏంటి?

ఏనుగు కాల్లో పగిలిన బీర్ సీసా ఒకటి పూర్తిగా దిగిపోయి ఉంది. దాని చుట్టూ చీము పట్టేసి పురుగులు పట్టి చిన్న తేనె గూడులా చీముతో ఉబ్బిపోయి ఉంది. డాక్టర్ కె. కత్తితో అక్కడ చీరగానే పెద్ద పెరుగుకుండ పగిలినట్టు చీము కారసాగింది. తేనెతుట్టెలా చిన్నచిన్న రంధ్రాలనుండి తెల్లటి పురుగులు కదులుతున్నాయి. డాక్టర్ ఆ చీము పట్టిన భాగాన్నంతా గొడ్డలిలాంటి ఒక కత్తితో కోసి తీశారు. పురుగులు నా చేతిమీదకి ఎక్కాయి. వాటిని విదిలించాను. పైనున్న చీము మొత్తం కోసి తీశాక బీర్ సీసా లోతుగా పాతుకుపోయున్న మాంసాన్ని కత్తితో మళ్ళీ కోసి విరిచి సీసాని లాగారు. ఆశ్చర్యంగా ఉంది ఇంచుమించు నా చేతి పరిమాణమంత సీసా.

“ఒక వారమే అయుంటుంది, బతికిపోయింది!” అన్నారు డాక్టర్ కె.

సీసాను తీయగానే ఇంకా చీము కారసాగింది. ఆ భాగంలో మాంసాన్ని కోసి తీసి చీమంతా తుడిచారు. చీము వాసన తగ్గి రక్తపు వాసన రాసాగింది. రక్తం ఊరి ఎర్రగా కారసాగింది. పుండంతా రక్తంతో తడిసిపోయింది. తలగడా అంత దూది తీసుకుని దాన్ని మందులో తడిపి లోపల పెట్టి పెద్ద బ్యాండేజ్ నాడాతో చుట్టి కట్టారు. గట్టిగా అంటుకుంది. దాని కాల్లో గుడారం గుడ్డలా ఉన్న చర్మంమీద చిన్న స్టీలు క్లిప్ పెట్టి బ్యాండేజ్ అంటించి గట్టిగా కట్టారు. తర్వాత నల్లటి బురదతో తెల్లటి కట్టుమీద బాగా పూశారు.

మళ్ళీ ఈ ఏనుగును పసిగట్టేందుకు వీలుగా ఒక సిగ్నల్ ట్రాన్స్‌మిటర్ దాని చెవిలో పోగులా గుచ్చారు. పనంతా అయింది. మా చేతులు, బట్టలు అంతా రక్తం, చీము కొట్టుకుపోయింది. పురుగుల్ని విదిలించుకుని తెచ్చిన వస్తువులను సేకరించుకుని బయలుదేరాము. కాలువలో చేతులు కడుక్కుంటూ ఉంటే ఘీంకరిస్తూ ఒక్కో ఏనుగూ దిగి వచ్చి ఆ ఏనుగు చుట్టూ నిల్చున్నాయి. ఆ పెద్ద పిడియేనుగు కింద పడి ఉన్న ఏనుగు కాలిలోని పెద్ద బ్యాండేజ్‌ని తన తొండంతో తడిమి పరిశోధించి మెల్లగా ఘీంకరించింది. మిగిలిన ఏనుగులూ వంతపాడాయి. కొన్ని ఏనుగులు అక్కడ చిందిన రక్తాన్ని వాసన చూశాయి. ఒక ఏనుగు అక్కడినుండి మమ్మల్ని చూస్తూ తని చెవులను ముందుకు రిక్కించింది.

“బ్యాండేజ్‌ని ఊడపీకేయదు కదా?” అని అడిగాను.

“దానికి తెలుసు. అయితే ఏనుగుకు మామూలుగా తెల్లరంగు నచ్చదు. బురద రాయకుంటే దానివల్ల కాదు. నిలకడగా ఉండదు. బ్యాండేజ్‌ని కెలుకుతూ ఉంటుంది” అన్నారు డాక్టర్ కె.

“నయమైపోతుంది కదా?”

“మోస్ట్‌లీ పదిహేను రోజుల్లో ముందులాగా అయిపోతుంది. ఏనుగుకు రెసిస్టెన్స్ పవర్ చాలా ఎక్కువ. మామూలు ఆంటీబయాటిక్ కూడా చాలా అపారంగా పనిచేస్తుంది” అని అన్నారు డాక్టర్.

ముదమలనుండి వెనుతిరిగి టాప్‌స్లిప్‌కు వస్తూ ఉంటే డాక్టర్ కె. అన్నారు. “వాట్ ఎ డివైన్ బీయింగ్! ఎప్పుడైనా తమిళనాడులో ఏనుగు అన్న ప్రాణి లేకుండా పోతే ఆ తర్వాత మన సంస్కృతికి అర్థమేముంటుంది? మన ప్రాచీన సంగం సాహిత్యాన్నంతా తగలబెట్టేయాల్సిందే!”


నేను వెళ్ళిన సమాయానికి డాక్టర్ కె. ఇంట్లోనే ఉన్నారు. ఇంటి ముందున్న టేకు చెట్టుకింద సెల్వా అనొక పెద్ద మగ ఏనుగు నిల్చుని ఉంది. పడవలాంటి తన పెద్ద దంతాలను టేకుమానుకు రాస్తూ దాని తోలు విప్పదీసేస్తూ ఉంది. నన్ను చూడగానే చెవులు రిక్కించి తొండం పైకెత్తి వాసన పట్టి తర్వాత ‘బమ్మ్’ అని నాకు గుడ్మార్నింగ్ చెప్పి మళ్ళీ చెవులు ఊపడం మొదలుపెట్టింది.

డాక్టర్ ఈ సమయంలో ఇంట్లో ఉండటం ఆశ్చర్యమే. నా చెప్పుల చప్పుడు విని లోపలనుండి తొంగి చూస్తూ “రా రా” అని స్వాగతం పలుకుతూ “ఏమిటి ఈ టైమ్‌లో?” అని అడిగారు.

“నేను కదా ఆ ప్రశ్న అడగాల్సింది? ఏంటి ఇంకా ఇంట్లో ఉన్నారు అని?”

“నేను పొద్దునే వచ్చాను. ఒక మొగ ఏనుగుకు సర్జరీ ఉండింది. రామన్ అని పేరు. తొడలో పెద్ద గడ్డ. ఏజ్డ్ ఫెలో. నాకూ వాడికీ ముప్ఫై ఏళ్ళ స్నేహం. నిదానమైనవాడు. మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ వాడిది. ఇంకో పదేళ్ళు కూడా బతగ్గలడు” అన్నారు నవ్వుతూ.

నేను కూర్చున్నాను.

“టీ?” అడిగారు డాక్టర్.

“నేను చేసుకుంటాను” అన్నాను.

“నీకు మాత్రం చేసుకో. నేను తాగేశాను.”

నేను టీ చేస్తుండగానే నా చేతులు వణుకుతుండటం గమనించాను. కప్పు ఎక్కడ జారవిడుస్తానో అనిపించింది.

నా గాభరాను గమనించి “కొత్తగా ఏదైనా ప్రణయమా?” అని అడిగారు డాక్టర్.

“లేదు సార్.”

ఆయన లేచి ఒళ్ళు విరుచుకుంటూ “ప్రాచీన సాహిత్యంలో ప్రకృతి గురించిన వర్ణనలు చాలావరకు సరిగ్గానే ఉంటాయి. అందునా కపిలన్ మరీను. చాలా నిశితంగా ఉంటుంది అతని పరిశీలన. ‘చిరుకొర్ర పంటగాచే కాపుచేతి దివిటీనుండి జారిన నిప్పుకణముగని వెరసిన ఏనుగు, వ్యోమండలమున జారిన చుక్కను గనీ వెరసె’ (‘చిఱుతినై కాక్కుం సేణోన్ ఞెగిళియిన్ పెయర్ంద నెడునల్ యానై మీన్‌పడు చుడర్ ఒళి వెరూఊమ్’.)

“దానికి అర్థం ఏంటి?”

“కొర్రపంటని కాపుకాస్తున్న రైతు చేతి దివిటీనుండి పడిన నిప్పుకణం చూసి భయపడ్డ ఏనుగు నేలకు రాలే నక్షత్రాలను చూసి కూడా భయపడుతుందట” అని వివరిస్తూ నవ్వారు డాక్టర్ కె.

నేను చిన్నగా నవ్వాను.

“ఏనుగుకే కాదు అన్ని జంతువులకూ వర్తిస్తుంది. ఒక బొమ్మ తుపాకిని రెండోసారి పట్టుకెళ్తే కోతి కనిపెట్టేస్తుంది. టేప్‌రికార్డర్‌లో మరొక ఏనుగు గొంతును రికార్డు చేసి వినిపిస్తే తొలిసారి వినగానే పసిగట్టేస్తుంది… ఏం చేస్తున్నావు? యూ ఆర్ నాట్ లిజనింగ్!”

“ఏమీ లేదు,” అన్నాను.

“లేదు. యూ ఆర్ నాట్ నార్మల్. కమాన్, ఏంటి చెప్పు?”

“అది కాదు సార్…”

“విషయమేంటో చెప్పు?” అని నా కళ్ళలోకి చూశారు డాక్టర్ కె.

నేను ఆయన దగ్గర ఏదీ దాచింది లేదు. వెంటనే అంతా అప్పజెప్పేశాను. రెండు ఏళ్ళకు ముందు వచ్చిన ఆలోచన. ఆయనకు ఒక పద్మశ్రీ పురస్కారం ఇప్పించాలని. నేనే ఆయన గురించి అన్ని వివరాలూ సేకరించి తగిన రీతిలో పొందుపరచి సాంస్కృతిక మంత్రిత్వశాఖకి పంపించాను. అప్పుడు ఆయన పేరు లిస్ట్‌లో రాలేదు. ఎవరూ పట్టించుకోలేదు.

కాబట్టి మరుసటి ఏడాది లాబీయింగ్ మొదలుపెట్టాను. నా స్నేహితులు ముగ్గురు ఇంగ్లీషు పత్రికల్లో ఉన్నారు. ఏడెనిమిది మంది సెంట్రల్ గవర్నమెంట్‌లో ఉన్నారు. దానికోసం సంవత్సరం పాటు పనిచేశాను. స్నేహితులందర్నీ వాడుకున్నాను. లోపలికి వెళ్ళాక పలుమార్గాలు కనిపించాయి. ఈ అడవుల్లో డాక్టర్ కె.కు ఎలా దారులు తెలుసో అలా అధికార వర్గాల్లో దారులు తెలుసుకున్నాను. చివరిదాకా తీసుకెళ్ళి చేర్చేశాను.

నిజానికి ఇంత పెద్ద పనిని సులువుగా చెయ్యడానికి తోడ్పడింది డాక్టర్ కె. వ్యక్తిత్వమే. అరకొర ఆసక్తితో వినేవారి మనసును ఆవేశంతో ఎలా ఆకట్టుకోవాలో డాక్టర్ కె. వ్యక్తిత్వాన్ని చూసే నేర్చుకున్నాను. అల్పమైన తమ జీవితంలో ఒక గొప్ప పని చెయ్యడానికిగల అవకాశంగా దీన్ని వాళ్ళ ముందుంచాను. వినేవారి మనసు ఇంకా పూర్తిగా రాయిగా మారిపోలేదు, ఇంకా అది మెత్తదనాన్నీ చెమ్మనూ దాచుకుని స్వచ్ఛమైనదిగానే ఉంది అని వాళ్ళకే తెలియజేశాను. ఈ ఘనకార్యం చెయ్యడం ద్వారా తాను ఇంకా ఎన్నో గొప్పపనులు చేయగలిగే మంచి వ్యక్తేనని వాళ్ళను వాళ్ళు భావించుకునే ఒక సందర్భాన్ని సృష్టించాను. అలా చేయడంవల్ల నా కోరిక ఒక్కో మెట్టూ ఎక్కింది. అది ఎక్కిన ప్రతి మెట్టులోనూ ఎవరో ఒకరు డాక్టర్ కె. గురించి మనసు కరిగి మాట్లాడారు. ఎక్కడో అడవుల్లో ఉండే ఆయన కాళ్ళకు మొక్కుతున్నాం అన్నారు.

రేడియోలో న్యూస్ రావడానికి ఇంకా కొన్ని గంటలే ఉన్నాయి. “అప్పుడు నేను మీతో ఉండాలి సార్” అన్నాను.

నేను ఊహించినట్టే ఆయన దాన్ని నవ్వి తోసేయలేదు. అందుకని అనాసక్తంగా తన పనుల్లో మునిగిపోనూ లేదు. నన్నే చూస్తూ ఉన్నారు. తర్వాత పెద్దగా నిట్టూర్చి తన పుస్తకాన్ని తీసుకున్నారు.

“ఏం డాక్టర్?” అన్నాను.

“ఏంటి?” అన్నారు.

ఆయన కళ్ళల్లోని ఉగ్రత నన్ను కొంచం వణికించింది. నేను మెల్లగా “మీరేమీ చెప్పలేదే…” అన్నాను.

ఆయన “లేదూ…” అని, “ఏమీ లేదులే” అన్నారు.

“చెప్పండి డాక్టర్, ప్లీజ్” అన్నాను.

“లేదు… నీకు ఈ పవర్‌గేమ్‌లో ఇంత ఆసక్తి ఉందని ఊహించలేదు నేను. నీ గురించిన నా అంచనాలే వేరేగా ఉండేవి. సరేలే…” అని ఆపేశారు.

“డాక్టర్…” అని చెప్పబోయాను.

“నేను ఆర్గ్యూ చెయ్యడంలేదు. నాకు అది రాదు… లీవ్ ఇట్” అని నేను ఇదివరకు ఆయన దగ్గర చూడని ఒక కోపంతో చెప్పారు. కాసేపు మౌనం.

“సీ, ఈ అడవిలో నేను ఇదివరకు కనీసం ముప్ఫై నలభైమంది ఆఫీసర్స్‌ని చూశాను. ఎవరూ కొన్ని రోజుల తర్వాత అడవిలో ఉండరు. సిటీకి వెళ్ళిపోతారు. ఏదైనా ఒక కారణం చెప్తారు. అడవిని విడిచి ఫిజికల్‌గా వెళ్ళిపోగానే మెంటల్‌గా కూడా అడవిని వదిలేస్తారు. ఆ తర్వాత వాళ్ళకు అడవి కేవలం ఒక జ్ఞాపకం మాత్రమే. ఎందుకు అలా అని ఆలోచించాను. ఒకే కారణం! ఈ అడవిలో అధికారం లేదు. అధికారాన్ని మనిషి రెండురకాలుగా వాడుకుని సంతృప్తి చెందుతాడు. కింద ఉండేవాళ్ళమీద దాన్ని ప్రయోగించడం, పైన ఉన్నవాళ్ళను చూసి కొంచం కొంచంగా పైకి ఎక్కుతూ ఉండడం. రెండూ చాలా థ్రిల్‌ను ఇచ్చే ఆటలు. అడవిలో ఈ రెంటికీ దారి లేదు. అడవి మీ అధికారం కిందే నడుస్తుంది అన్నది ఆ పనికిమాలిన పేపర్లలోనే. నిజానికి అడవి పోకడ అనే అధికారంలోనే మీరు ఉన్నారు. ఇదిగో బయట నిల్చుని ఉన్నాడే సెల్వా, వాడు మీ అధికారం కిందనా ఉన్నాడు? ఈ అడవిలో వాడే రాజు. వాడి ముఖాన ఉందే, ఆ ఆరడుగుల దంతమే వాడి దండం. మనుషులతో సుముఖంగా ఉన్నాడంటే ఆ రాజుకి మనుషులమీద దయ, కరుణ, మంచి అభిప్రాయం ఉందని అర్థం… ఇక్కడ మీకు పైకి ఎక్కే అవకాశం లేదు. ఇక్కడున్నప్పుడు ఎక్కడో నగరాల్లో నియోగించబడిన మీ సాటి ఆఫీసర్లు పరుగు పందెంలో మిమ్నుల్ని దాటుకుని ముందుకు వెళ్ళిపోతున్నారని అనిపిస్తూనే ఉంటుంది. అందుకే ఇక్కడినుండి పారిపోతారు. అడవి గురించిన మీ బాధ్యతలను విదిలించుకుని వెళ్ళిపోతారు. నువ్వు అలా అందరిలా ఉంటావు అనుకోలేదు. వెల్!”

చేతులు విప్పి అరిచేతులు పైకి పెట్టుకుని నిలకడ లేకుండా నడిచారు. మళ్ళీ కోపంగా “సీ, ఈ బిరుదు, ఏంటదీ, బ్రహ్మశ్రీనా?”

నేను మెల్లగా “కాదు పద్మశ్రీ” అన్నాను.

“సరే! అది… దాన్ని పెట్టుకుని ఈ అడవిలో ఏం చేసుకోవాలి? బయటున్న సెల్వాగాడి దగ్గరకు వెళ్ళి దాన్ని చూపించి, చూడరా ఇకనుండి నువ్వు నాతో గౌరవమర్యాదలతో నడుచుకోవాలి. నేను బ్రహ్మశ్రీని అని చెప్పుకోవాలా? ఈ అడవిని అర్థంచేసుకుంటే నువ్వు ఇక్కడ ఏమైనా చెయ్యగలుగుతావు. అడవిని అర్థంచేసుకోవాలంటే అడవిలో బతకాలి. ఇక్కడ బతకాలంటే మొదటగా చెయ్యాల్సింది దేశంలో ఉండే డబ్బు, పేరు, హోదా, అధికారం, లొట్టు, లొసుగులు అన్నిటినీ దులిపివేసుకొని నువ్వు కూడా ఈ కోతుల్లాగా, ఏనుగుల్లాగా ఇక్కడ ఉండాలి. నీకు వీళ్ళు తప్ప ఇంకో బంధం ఉండకూడదు. వెళ్ళు, వెళ్ళి బయట చూడు. అక్కడ నిల్చుని ఉన్నాడే సెల్వా… వాడిలాంటి ఒక బంధువు నీకు ఎవరైనా ఉన్నారా? ఆ ఠీవి, ఆ కారుణ్యం! లోభత్వం, అల్పత్వం లేని సముద్రమంత విశాలమైన మనసు! వాటిని అర్థంచేసుకోగలిగితే ఏ మనిషి నీకు లెక్క అవుతాడు చెప్పు? ప్రధానా, రాష్ట్రపతా? ఆ ఏనుగుకు నువ్వు తెలుసు అన్నదానిలోని ఆనందం తెలుసుకుంటే ఢిల్లీలో ఉండే పనికిమాలినవాళ్ళు కాగితం మీద రాసి ఇచ్చేది గొప్పగా అనిపిస్తుందా?”

ఆయన ముఖంలో ఆ రక్తపు ఎరుపు రంగుని చాలా రోజుల తర్వాత చూశాను. జీప్‌లో కూర్చుని బైరన్ కవిత చెప్పినప్పుడున్న ఆ జ్వాలా రూపంలో ఉన్నారు. ‘Man, vain insect!’ అంటూ మహా పెద్ద ఏనుగు ఘీంకారంలా బైరన్ నినాదం విన్నాను. తల వంచుకుని కూర్చుని ఉన్నాను. తర్వాత లేచి బయటకు నడిచాను. వెనకనుండి డాక్టర్ కె. “ఆగు” అన్నారు. నేను ఇబ్బందిగా నిల్చుండటం చూస్తూ “ఐయామ్ సారీ” అన్నారు.

నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. నేను తలవంచుకుని నన్ను నేను అణుచుకుంటూ సన్న గొంతుతో “నేను అలా అనుకోలేదు డాక్టర్… నేను మిమ్మల్ని బయటకు తెలియపరచాలి అనుకున్నాను. ఇదిగో ఈ అడవికి వచ్చేంతవరకు తెలియదు ఇక్కడ ఇలాంటి ఒక దివ్యమైన జీవితం ఉంటుంది అని. ఒక కొత్త లోకాన్ని చూడబోతున్నానని ఊహించలేదు. నన్ను నమ్మండి డాక్టర్. నాకు ఎలా చెప్పాలో తెలీడంలేదు… అయితే ఒకటి మాత్రం చెప్పగలను. నేను ఎక్కడ ఉన్నా మీరు నా గురించి గర్వించేలాగానే ఉంటాను. ఎప్పటికీ మీతో గడిపిన కాలానికి, మీ వల్ల సంపాయించుకున్న జ్ఞానానికీ ద్రోహం చెయ్యను. ఐ ప్రామిస్ డాక్టర్.

ఇక్కడికి వచ్చి అనుకోకుండా మిమ్ముల్ని కలుసుకునేంత వరకు నాకు తెలియదు డాక్టర్. నేను బడిలోనూ కాలేజీలోను ఇది చదువుకోలేదు. నాకూ నాలాగా ఈ తరంలో వారికీ చెప్పబడేది ఒకటే; బాగా చదువుకో, ఉద్యోగానికి వెళ్ళు, డబ్బు సంపాయించు, డబ్బుతో పెద్దమనిషిగా బతికి చూపించు అన్నదే! చదువుకునేంతవరకు నాకు తెలిసిందల్లా బాగా మార్కులు తెచ్చుకుని అమెరికాకు వెళ్ళి సంపాదించినవాళ్ళు మాత్రమే జీవితంలో గెలిచినవాళ్ళు అని. నాలా లక్షలాదిగా బయట తయారవుతున్నారు డాక్టర్. ఆశయాలే లేని జెనరేషన్. త్యాగం అంటే అర్థమే తెలియని జెనరేషన్… ఎంతో మహోన్నతమైన సంతోషాలు ఈ భూమ్మీద ఉన్నాయన్నదే ఎరగని జెనరేషన్.

ఈ అడవులకు విహారయాత్రకు వచ్చి రోడ్డు పొడవునా వాంతులు చేసుకుంటూ, బీర్ సీసాలు పగలగొట్టి ఏనుగు కాళ్ళకింద వేసి వెళ్తున్నాడే వాడూ మన సమాజంలోనే బతుకుతున్నాడు డాక్టర్. వాడే ఐటీ కంపెనీల్లోనూ, మల్టీ నేషల్ కంపెనీల్లోనూ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నాడు. నెలకి లక్షలు సంపాయిస్తాడు. గడగడా ఇంగ్లీష్ మాట్లాడుతాడు. కాబట్టి తాను పుట్టుకతోనే మేధాని అనుకుంటాడు. తెలిసో తెలియకనో అలాంటివాళ్ళ చేతుల్లోనే కదా ఈ దేశం, ఈ దేశపు అడవులూ ఉన్నాయి? వాళ్ళలో పదిశాతం మందికైనా ఇలాంటొక గొప్ప జీవితం, ఇలాంటొక డివైన్ వరల్డ్ ఈ అడవిలో ఉందని తెలియాలి అనుకున్నాను.

డాక్టర్, నేటి యువతలాంటి ఒక శాపగ్రస్తమైన జెనరేషన్ ఇండియాలో ఎప్పుడూ లేదు. వాళ్ళ ముందు ఉన్నదంతా ఒట్టి కట్-అవుట్ మనుషులు. ఆశయమో, లక్ష్యమో, ఒక కలో లేని నకిలీ ముఖాలు. వాళ్ళందరూ కేవలం గెలిచినవాళ్ళు డాక్టర్. దొంగిలించో మోసం చేసో డబ్బు, పేరు, అధికారం సంపాదించినవాళ్ళు. వాళ్ళను ఆదర్శంగా తీసుకుని భావితరాలు ఈ పందెంలో పరుగులు తియ్యడానికి సిద్ధమవుతున్నాయి. ఆ పిల్లలకు ‘చూడండి ఇలాంటొక ఆదర్శజీవితానికి ఇంకా ఈ సమాజంలో చోటుంది’ అని చెప్పాలి అనుకున్నాను డాక్టర్. ఇంకా ఇక్కడ గాంధీ జీవించడానికి జానెడు చోటుంది అని ప్రపంచానికి చూపించాలనిపించింది. పదిమంది గుర్తించినా కూడా చాలు డాక్టర్.

ఆ అల్పమైన బిరుదుని మీకిప్పించి మిమ్ముల్ని గౌరవించేయొచ్చు అనుకునేంత అజ్ఞానమైతే నాకు లేదు డాక్టర్. నేను మీకు అలాంటొక గుర్తింపుని తెచ్చి అలా భావితరాలకు ఒక ఆదర్శమూర్తిని పరిచయం చెయ్యాలనుకున్నాను. నేనూ నా జెనరేషనూ మిమ్ముల్ని గుర్తించామని మీకు తెలియచెయ్యడానికి ఏం చెయ్యాలని ఆలోచించాను. దాన్ని గురుదక్షిణగా మీ పాదాల దగ్గర సమర్పించాలనుకున్నాను. ఈ నా కోరికకు ఆనంద్ కూడా నాతో చేయి కలిపాడు. అందుకోసమే ఇది చేశాం. అది తప్పు అయితే సారీ, డాక్టర్.”

మాట్లాడేకొద్దీ సరైన మాటలు నాకు తోడయ్యాయి. నా ఈ ఆలోచనకి వెనక ఉన్న కారణాలు స్పష్టమయ్యాయి. మనసు తేలికైంది. మాట్లాడటం ముగించి తలవంచుకుని కూర్చున్నాను.

డాక్టర్ కె. నవ్వి “ఓకే, ఫైన్! దట్స్ ఎనఫ్ షేక్స్‌పియర్… నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నాను, వస్తావా?” అని అడిగారు.

హోరుగాలికి మంచు రాల్చుకున్న చెట్టులా నేను ఆ మాటలు రాల్చుకున్నాక తేలికబడి నవ్వి ఆయనతో బయలుదేరాను. సెల్వాని తీసుకుని ఏనుగుల క్యాంపుకు వెళ్ళాము. సెల్వాగాడు ఏనుగుల క్యాంపుకు తొందరగా వెళ్ళాలని ఎంత ఉవ్విళ్ళూరుతున్నాడన్నది వాడిన కదిపినప్పుడు వాడి హుషారులో అర్థమయింది. వాడు ఏనుగుల క్యాంపుకు చేరుకోగానే వాడికి స్వాగతం పలుకుతూ ఏడెనిమిది గొంతులు వినిపించాయి.

“యూ నో, హీ ఈజ్ ఎ రియల్ టస్కర్! ఎ కేసనోవా!” అన్నారు డాక్టర్ కె.

నేను నవ్వాను. డాక్టర్ లోపలికి వెళ్ళగానే నలభైయెనిమిది తొండాలు పైకి లేచి ఆయన్ని ఆహ్వానించాయి. వాటితో ముద్దుగా మాటలు చెప్తూ పనుల్లో నిమగ్నమయ్యారు డాక్టర్. ఒక్కో ఏనుగును చూసి పరిశీలించి రిపోర్టులు తయారుచేస్తున్నారు. ఆయన చెప్తూ ఉంటే నేను రాశాను. మధ్యలో కొంచం షెల్లీ, కంబన్, పరణన్, కపిలన్, కొంచం అమెరికన్ ఫిజిక్స్ క్లబ్బుల గురించిన హాస్యాలు. మధ్యాహ్నం చేతులు కడుక్కుని చపాతీ రోల్ తిన్నాం. లోపల నాకు మాత్రం చికెన్. డాక్టర్ కె. శాకాహారి.

సాయంత్రం వరకు రేడియో గురించి మరిచిపోయాను. నాలుగున్నరకు సెల్వరాజ్ నన్ను వెతుక్కుంటూ వచ్చి “సార్, ఢిల్లీ నుండి రెండు మూడుసార్లు ఫోన్‌లు చేశారు సార్. డాక్టర్ సార్ ఇంటికి వెళ్ళారు, అక్కడికి చెయ్యమని చెప్పాను సార్. అక్కడా ఎవరూ ఫోన్ తియ్యలేదని చెప్పారు సార్. మిమ్ముల్ని ఫోన్ చెయ్యమన్నారు సార్” అని చెప్పాడు.

నేను జీప్ వేసుకుని డాక్టర్ ఇంటికి వెళ్ళి ఆనంద్‌కు ఫోన్ చేశాను. ఫోన్ తియ్యగానే “సారీ రా… ఎలా చెప్పాలో తెలీడం లేదు” అని విచారపడుతున్నాడు. నేను వచ్చే దార్లోనే ఊహించాను. అయినప్పటికీ బాధతో నా ఒళ్ళు నీరసపడిపోయింది. గుండె బరువైపోయింది, నిలబడలేక చెయిర్‌లో కూర్చున్నాను.

“మినిస్టర్ నిన్ననే మరొకరి పేరు చేర్చేడటరా… దాన్ని దాచి నా పల్స్ చూడటానికే నన్ను పిలిచి అలా తేనె పూసిన మాటలు మాట్లాడినట్టున్నాడు… గుంటనక్కరా వాడు. అసలు ఊహించనే లేదు ఇలా జరుగుతుందని. అసలు పనికిమాలిన నటులకు కూడా ఇస్తున్నారు. సారీ రా… వచ్చే ఏడాదికి చూద్దాం.”

“పరవాలేదురా. నువ్వేం చేస్తావ్ అలా జరిగితే!” అన్నాను.

“ఆ ముసలి నక్క…” అని ఆవేశంగా చెప్పబోయాడు.

“నక్క ఇలాంటివి చెయ్యదురా. బై!” అని ఫోన్ పెట్టేశాను.

తలపట్టుకుని కాసేపు కూర్చుండిపోయాను. డాక్టర్ కె. దీన్ని అసలు పట్టించుకోరు, ఆయనకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మళ్ళీ ఏనుగుల క్యాంపుకు వెళ్ళేప్పుడు దాని గురించే ఆలోచించాను. నన్ను ఒక యంత్రంలో పడేసి చిలుకుతున్నట్టు తొలుస్తున్నది ఏమిటిది? నేను ఏం కోరుకున్నాను? ఇలానే ఉంటారన్నది నాకు తెలియనిదా? నిజానికి నేను లోపల మరేదో ఆశించాను. ఇలాంటొక గొప్ప ఆదర్శజీవితం వెలుగులోకి వస్తే మనుషుల లోపల గడ్డకట్టుకొనిపోయిన మంచితనాన్ని వెళ్ళి తాకుతుంది అనుకున్నాను. గాంధీ బలం అదే. అన్ని ఆదర్శాలూ నెగ్గేది ఆ అంశాన్ని ఆధారం చేసుకునే. ఈ కాలంలో దాన్ని నేను పరీక్షించాలి అనుకున్నానా? ఈ కాలంలో కూడా ఆ ఊట ఎక్కడో చెమ్మగానే ఉంటుంది అనుకున్నానా?

దార్లో ఒక పచ్చిక ప్రదేశంలో ఆగాను. దిగి నిల్చున్నాను. పచ్చికలో పడమటి సూర్యుడు మెరుస్తున్నాడు. రెక్కలు విప్పారుస్తూ చిన్న చిన్న పురుగులు, తుమ్మెదలు ఎగురుతున్నాయి. ఆ పచ్చికబయలు కళ్ళను నింపింది. పచ్చికంటే చెమ్మ. చెమ్మ అంటే జీవం… ఏవేవో ఆలోచనలు. మనసులో ఆవేశం, బాధ ఉప్పొంగింది. బుద్ధి ఎంత ఆపినా మనసు వినదు. అడ్డుకట్టలు తెంచుకున్నాయి. అక్కడ, ఆ ఏకాంతంలో నిల్చుని వెక్కి వెక్కి ఏడ్చాను. ఏడుపుతో పశ్చాత్తాపాన్ని కన్నీళ్ళుగా పైకి ఎగచిమ్మేవాడిలా చాలాసేపు ఏడుస్తూనే ఉన్నాను.

ఎప్పటికో ఏడుపు మౌనాన్ని చేరుకున్నది. నా నిట్టూర్పులో ఆ నిశ్శబ్దాన్ని గ్రహించి నేను తిరిగి జీపెక్కినప్పుడు పది మైళ్ళు పరిగెట్టినవాడిలా అలసిపోయినట్టు అనిపించింది. నేరుగా ఏనుగుల క్యాంపుకు వెళ్ళి గున్న ఏనుగు కొలతలు తీసుకుంటున్న డాక్టర్ కె. పక్కన వెళ్ళి నిల్చున్నాను.

నన్ను తిరిగి చూసిన వెంటనే కనిపెట్టేశారు. “ఏంటి బెలూన్ పేలిపోయిందా?” అని అడిగి నవ్వుతూనే “అయితే ఇక ముందరున్న పని చేసుకోవచ్చు కదా?” అన్నారు.

ఆయన సామీప్యంలో కొన్ని నిముషాల్లోనే నేను మామూలుగా అయ్యాను. సాయంత్రం చీకటి పడేంతవరకు అక్కడ పనులు సరిపోయాయి. ఆ తర్వాత నేను డాక్టర్ కె. జీప్‌లో ఆయన ఇంటికి వచ్చాము. దార్లో ఆయన రాయాలనుకుంటున్న ఒక రిసర్చ్ వ్యాసం గురించి మాట్లాడారు.

“మనిషి నాగరికతలో ఒక దశలో పెంపుడు ఏనుగులు అవసరమయ్యాయి. పెద్ద బరువులు మొయ్యడానికి అవి లేకుంటే కుదరదు. ఏనుగు లేకుంటే తంజావూర్ మహాగోపురం లేదు. అయితే ఈ రోజుల్లో మనిషికి ఏనుగు సాయం అక్కర్లేదు. ఏనుగుకంటే పలురెట్లు శక్తివంతమైన క్రేన్‌ల యుగం ఇది. నేడు ఏనుగులు కేవలం అలంకరణ కోసమూ మతసంబంధమైన ఆచారాలకోసమూ అడవి బయట పెంచబడుతున్నాయి. జంతు ప్రదర్శనశాలల్లో వినోదం కోసం బంధించబడుతున్నాయి. దేవాలయాల్లో ఏనుగుల పెంపకాన్ని నిషేధించాలి. దేవాలయాలు ఏనుగులకు తగిన చోటే కాదు. ఏనుగుల కళ్ళకు ఎప్పుడూ పచ్చని ఆకులు, చెట్లు మాత్రమే కనబడుతూ ఉండాలి. ఆ కాలంలో ఏనుగుని సంస్థానాల్లో పట్టపు ఏనుగుగా వాడుకున్నారు. ఈ రోజుల్లో దేవాలయాల్లో ప్రసాదాలతో ఏనుగుని పోషించేయవచ్చు అనుకుంటున్నారు. అంత పెద్ద బ్రహ్మాండమైన జీవికి పదిపైసలు చేతికిస్తున్నారు ఈ అల్పసన్యాసులు. నాన్సెన్స్! దాని ముందర నువ్వేంటి అని నీకు తెలిస్తే ఆ సత్తు బిళ్ళని దానికి భిక్షగా వెయ్యడానికి నీకు చేతులు ఎలా వస్తాయి? గుడి ఏనుగుల్లా హీనంగా ట్రీట్ చెయ్యబడి, అవమానపడి పస్తులుండే జీవి ప్రపంచంలో మరోటి లేదు. కచ్చితంగా నిషేధించి తీరాలి. మతమూ ఆచారాలూ అని కొంతమంది దానికి ఒప్పుకోకపోవచ్చు. నూరేళ్ళ క్రితం దేవదాసీ ఆచార నిషేధాన్ని కూడా ఎదిరించారు అలానే. ఏనుగుని స్వతంత్రంగా వదిలేయాలి. వాడు అడవికి రాజు. వాడిని ఊళ్ళో పోర్టర్‌గానూ భిక్షగాడిగానూ వాడుకోవడం మానవ జాతికే అవమానం. మనవాళ్ళకి ఇదంతా చెప్తే అర్థం కాదు. మనవాళ్ళకి అడవి తెలియదు. మందు కొట్టడానికి, వ్యభిచారం చెయ్యడానికేగా మనవాళ్ళు అడవికి వచ్చేది? యూరోపియన్ పత్రికల్లో దీని గురించి మాట్లాడాలి. వాళ్ళు చెప్తే మనవాళ్ళు వింటారు. ఇప్పటికీ మనవాళ్ళకి గురువులు వాళ్ళే…”

ఇంటికి వెళ్ళగానే ఆయన రాసిన ఆ థీసీస్ తీసి నా చేతికిచ్చారు “చదివి చూడు… ఇవాళ పొద్దున కూడా ఇదే రెడీ చేస్తూ ఉన్నాను” అన్నారు.

టైప్ చేయబడిన డెబ్బై పేజీల థీసీస్. నేను చదవసాగాను. ఎన్నో ఏళ్ళు శ్రమపడి వివరాలు సేకరించి ఉన్నారు డాక్టర్ కె. భారత దేశంలోని రెండువందలకు పైబడిన దేవాలయాల్లో ఏనుగుల వివరాలు, వాటి ఆరోగ్యపరమైన రిపోర్టులు, మానసిక స్థితి గురించిన రిపోర్టులు, చదివి, తయారుచేసి రాయబడిన థీసీస్. వాటి నిర్వహణలో జరుగుతున్న కుంభకోణాలూ పెద్ద సమస్యగానే ఉన్నాయి. వాటికి అవసరానికంటే చాలా తక్కువ ఆహారమే ఇస్తున్నారు. చాలావరకు భక్తులు వేసే భిక్షాన్నమే వాటికి ఆహారం. కొన్ని పెద్ద దేవాలయాల్లో భక్తులు విసిరేసే ఎంగిలి విస్తర్లు, ఎంగిలి మెతుకులే వాటికి ఆహారం!

రాత్రయింది. “ఇప్పుడు ఏం వెళ్తావు. ఇక్కడే ఉండిపో. యు లుక్ టయర్డ్!” అన్నారు డాక్టర్.

నేనూ అదే అనుకున్నాను. చాలాసార్లు నేను డాక్టర్ ఇంటిలోనే ఉండిపోతాను. ఇక్కడ నాకు ఒక పరుపు, ఒక కంబళీ కూడా ఉన్నాయి. నేను పడుకుని చదవడం మొదలుపెట్టాను. డాక్టర్ కె. అర్ధగంటలో వంట చేశారు. ఇద్దరం ఏం మాట్లాడకుండా తిన్నాం. బయట హోరుగాలి చెట్లను ఊపేస్తూ ఉంది.

“ఇప్పటికిప్పుడే దేవాలయాల్లో ఏనుగుల్ని నిషేధించేస్తారు అని నేను నమ్మను. ఇది ప్రజాస్వామ్యం. న్యాయస్థానాల్లో చిత్తశుద్ధిలేదు. ఏ మార్పు రావాలన్నా సమయం పడుతుంది. అయితే ప్రారంభం చేసిపెడదాం. ఎప్పుడైనా వాళ్ళకు న్యాయం జరుగుతుంది. అప్పుడు గుళ్ళల్లో కట్టబడిన అందరూ అడవిని చేరుకుంటారు.”

“అప్పటివరకు ఇంకో ప్లాన్ పెట్టుకుని ఉన్నాను…” అన్నారు డాక్టర్ కె.

“ఏంటది?”

“ఏడాదికి ఒకసారి దేవాలయాల్లో ఉండే ఏనుగుల్ని పక్కనే ఉన్న అడవుల్లోకి తీసుకెళ్ళి నెల రోజులు అడవిలో పెట్టాలి. ఒక నెల రోజులు అడువుల్లో వదిలితే చాలు ఏనుగు చాలా బాగా రికవర్ అవుతుంది. అది వనప్రాణి. అడవికోసం అది లోలోపల తపించిపోతూ ఉంటుంది. చెట్లను, మొక్కలను, పచ్చికను, నీటిని చూస్తేనే దానికి ఉత్సాహం వచ్చేస్తుంది… రిపోర్ట్ చూశావు కదా? దేవాలయాల్లో ఏనుగులు ఎప్పుడూ టెన్షన్‌గానే ఉంటాయి. వాటిల్లో చాలా వాటికి సివియర్ డయబెటీస్ ఉంది. వాటికి దెబ్బలు తగిలితే ఆ పుండ్లు మాననే మానవు.”

డాక్టర్ మరొక ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారుచేసి ఉన్నారు. గవర్నమెంటుకు దానిని సమర్పించనున్నారు. దేవాలయాల్లోని ఏనుగుల్ని అడవికి తీసుకొచ్చి రీజువనేట్ చేసి తిరిగి పంపడానికి ఇంప్లిమెంటేషన్ గైడ్‌లైన్స్, ఖర్చులు, రెస్పాన్సిబిలిటీస్ డెలిగేషన్ అని వివరంగా ఉన్నాయి. చిన్న లూప్‌హోల్‌కు కూడా అవకాశంలేని సంపూర్ణమైన రిపోర్ట్!

“ప్యారిస్ జూకు నేనొక రిపోర్ట్ ఇచ్చాను. దాన్నుండే నేను దీని తయారుచేశాను” అని అన్నారు.

నేను అప్పుడు ఈయనకు ఆ బిరుదు దొరికుంటే బాగుండేది అనుకున్నాను. అది ఆయనని మరింత వెలుగులోకి తెచ్చి ఉండేది. ఆయన రాత, మాట మరింత దూరం చేరుండేవి.

రాత్రి పదైంది. పడుకున్నాను. పడుకోగానే పశ్చాత్తాపం, మనసులోని వెలితి నన్ను కప్పేశాయి. మళ్ళీ ఏడుస్తానేమోనని భయమేసింది. కళ్ళు మూసుకుని ఏదేదో ఆలోచిస్తున్నాను. అలసట కారణంగా ఆలోచనలు తెగి నిద్రలోకి జారుకున్నాను. ఎప్పుడో మెలుకువ వచ్చినప్పుడు గదిలో వెలుతురు. డాక్టర్ కె. స్వెట్టర్ వేసుకుంటూ ఉన్నారు. నేను తల పైకెత్తి “డాక్టర్!” అన్నాను.

“బయట ఏదో శబ్దం వినపిస్తోంది… ఏనుగుల వాసన కూడా వస్తోంది,” అన్నారు.

“ఏనుగుల గుంపేదైనా వచ్చుంటుందా?” అని అడిగాను.

“మామూలుగా ఇటువైపుకు రావు. ఏదైనా కారణం ఉండాలి,” అంటూ టార్చ్ లైట్ తీసుకున్నారు.

నేను లేచి నా స్వెట్టర్ వేసుకుని ఆయనతో బయలుదేరాను. బూట్లు వేసుకుని బయటకు దిగాము. చీకటి పెద్ద తెరలా ఎలాంటి వెలుతురు మరకా లేకుండ స్వచ్ఛంగా ఉంది. ఆ చీకటిలో కాసేపటికి కొన్ని మరకలు కనిపించాయి. ఆ మరకలు కలిసి అడవి అంచుగానూ పైన ఆకాశంగానూ మారాయి. అడవి చెట్లు ఆకులపై నక్షత్రరాశులు మెరుస్తున్నాయి.

ఇంతలోపే డాక్టర్ కె. ఏనుగును చూసేశారు. “గున్న! రెండేళ్ళుంటుంది” అన్నారు.

“ఎక్కడ?” అడిగాను.

“అదిగో” అని చూపించిన చోట కొన్ని క్షణాల తర్వాత నేనూ ఆ ఏనుగు పిల్లను చూశాను. నా ఎత్తే ఉంటుంది. చిన్న దంతాలు తెల్లగా కనిపించాయి. దాని చెవుల కదలిక కూడా కనిపించింది.

“ఈ వయసులో ఒంటరిగా రాదే!” అంటూ “రా వెళ్ళి చూద్దాం” అని ముందుకు సాగారు డాక్టర్ కె.

చీకట్లో టార్చ్ వేస్తే ఆ తర్వాత చుట్టు పక్కల ఏమీ కనిపించదు కాబట్టి చీకట్లోనే వెళ్ళాము. కొన్ని నిముషాల్లో గడ్డిపోచలు కూడా స్పష్టంగా కనిపించసాగాయి.

ఏనుగు పిల్ల మెల్లగా గూగూమంటూ తొండాన్ని పైకెత్తి వాసన పడుతోంది. “ఈజీ ఈజీ” అన్నారు డాక్టర్ కె. ఏనుగు పిల్ల మెల్లగా ముందుకు వచ్చింది. అది కుంటుతున్నట్టు ఉంది.

“గాయపడినట్టుంది” అన్నాను.

“ఊఁ” అన్నారు డాక్టర్ కె.

గున్న ఏనుగు మళ్ళీ ఆగి జెర్సీ ఆవు అరిచినట్టు గూమంది. మళ్ళీ తూలుతూ ముందుకు నడిచింది. డాక్టర్ కె. నన్ను ఆగమని చెప్పి దాని దగ్గరకు వెళ్ళారు. ఆయన దగ్గరకు వెళ్ళగానే తన తొండాన్ని ఉయ్యాలలా ఊపి తలను తిప్పుతూ ఆహ్వానించింది. ఆయన వెళ్ళి దాని దంతాలు తాకగానే అది తన తొండాన్ని ఆయన భుజమ్మీద వేసింది.

“రా” అన్నారు డాక్టర్ కె.

నేను దగ్గరకు వెళ్ళాను. ఆయన ఆ ఏనుగుపిల్లను చేత్తో తడుతూ తడుముతూ ఊరడిస్తున్నాడు. అది తన తొండాన్ని ఆయనను దాటుకుని నా మీదకు చాచి నన్ను పరిశోధించడానికి ప్రయత్నించింది. నేను వెనక్కి జరిగాను.

“వీడిని పడుకోబెట్టాలి. ఇప్పుడు వాడికి చెప్తే అర్థం కాదు. నువ్వు వెళ్ళి నా కిట్ తీసుకుని రా” అన్నారు డాక్టర్ కె.

నేన గదికి పరిగెట్టి ఆయన పెద్ద పెట్టెను తీసుకొచ్చాను. డాక్టర్ కె. దాని నోటిలో ఇంజెక్షన్ ఇచ్చారు. కాసేపు అది పిల్ల ఏనుగులు చేసే సహజమైన చేష్టలన్నీ చేసింది. తొండాన్ని తన ముందరి కాళ్ళ మధ్య ఉయ్యాలలా ఊపి ముందుకు వెనక్కి తన దేహాన్ని కదిలించింది. తలను అడ్డంగా ఊపుతూ నన్ను తెలుసుకోడానికి కొన్నిసార్లు ప్రయత్నించింది. తర్వాత దాని ఆటలు తగ్గిపోయాయి. మెల్లగా పక్కకు ఒరుగుతూ కూర్చున్నట్టు ఒరిగి కాళ్ళు చాపుకుని పడుకుంది. తొండంలో బుస్ బుస్ మంటూ ఊపిరి వేగంగా నా రొమ్మును తాకింది.

“లైట్” అన్నారు డాక్టర్.

నేను టార్చ్ పట్టుకున్నాను. అనుకున్నట్టే అయింది. మళ్ళీ బీర్ సీసానే. అదృష్టవశాత్తూ ఈ సారి సీసా పూర్తిగా దిగలేదు. పాదం మధ్యలో కాక కాస్త పక్కన గుచ్చుకోవడం వల్ల, ఏనుగు ఎక్కువ బరువు లేకపోవడం వల్ల, ఎక్కువరోజులు కాకపోవడం వల్ల, సీసా పూర్తిగా లోపలికి వెళ్ళలేదు. డాక్టర్ దాన్ని పట్టుకుని లాగారు. రక్తం ఆయన చేతిని తడిపింది. సీసా అంచుని చేత్తో తడిమి ‘లోపల సీసా ముక్కలేమీ విరిగిపోలేదనే అనుకుంటున్నాను’ అన్నారు. అయినా గాయం లోతులో చేయి పెట్టి చూస్తూనే ఉన్నారు.

“వెల్. అల్మోస్ట్ క్లీన్… హీ ఈజ్ లక్కీ” అని దూదిని మందులో ముంచి లోపలికి దోపి కట్టు కట్టారు.

“గంటలో లేచేస్తాడు. తెల్లారేసరికి ముదుమలకి తిరిగి వెళ్ళిపోతాడు” అన్నారు.

“ముదుమలకా?” అని అడిగాను.

“అవును అక్కడ్నుండేగా వచ్చాడు. నువ్వు వీడ్ని చూశావు!”

“వీడినా?”

“అవును. ఏడాదిన్నర క్రితం మనం ముదుమలలో ఒక ఏనుగుకు ఇలాగే సీసా తీశాం కదా? అప్పుడు ఆ పెద్ద మద్దిచెట్టు కింద నిల్చున్నది వీడే. అప్పుడు చాలా చిన్న పిల్లాడు. గేదె దూడలా ఉన్నాడు అప్పుడు” అన్నారు.

“ఎలా తెలుసు?” అని అడిగాను.

“ఏం, అక్కడ చూసిన ఒక మనిషిని మళ్ళీ ఇక్కడ చూస్తే చెప్పలేవా ఏంటి?”

డాక్టర్ లేచి చేతుల్ని దూదితో అదిమి తుడిచి పేపర్ సంచిలో వేశారు.

“ఇంత దూరం మిమ్ముల్ని వెతుక్కునా వచ్చాడు? అమేజింగ్!” అన్నాను.

“పాపం చాలా నొప్పి ఉండి ఉంటుంది” అన్నారు డాక్టర్ కె.

ఏనుగులు గుర్తుపెట్టుకుని గుర్తుపట్టి వెతుక్కుని వెళ్ళడం గురించి చాలానే విన్నాను. మూడు వందల కిలోమీటర్లు కూడా వెళ్తాయని విన్నాను. అవి చిన్న చిన్న వివరాలు కూడా మరిచిపోవు. అయితే ముదుమలనుండి జీప్‌లో తిరిగొచ్చిన మమ్ముల్ని అవి ఎలా కనిపెట్టాయన్నది నాకు అర్థంకాలేదు. మమ్మల్ని అవి ఆరోజు అడవిలో వాసన పట్టి ఉండచ్చు. ఇక్కడికి ఇదివర్లో ఎప్పుడైనా వచ్చినప్పుడు గుర్తుపట్టి ఉండచ్చు.

అయినప్పటికీ ఒక పిల్ల ఏనుగు ఇంత దూరం రావడం అన్నది చాలా చాలా ఆశ్చర్చం కలిగిస్తుంది. మేము ఇల్లు చేరుకోగానే డాక్టర్ కె. అడవికేసి తీక్షణంగా చూశారు. చీకట్లో నల్లటి కదలికలు. ఆ పెద్ద ఏనుగు గుంపు మొత్తం నిల్చుని ఉండటం కనిపించింది. నేను టార్చ్ వేయబోయాను. నో! అన్నారు డాక్టర్ కె. ఏడాదిన్నర క్రితం కాలు దెబ్బతగిలిన ఆ పెద్ద ఏనుగును కుంటుతూ నడిచే దాని నడకనుబట్టి గుర్తుపట్టగలిగాను. అవన్నీ ముందుకు వచ్చి అర్ధచంద్రాకారంలో చెవులు ఊపుతూ నిల్చున్నాయి.

“వచ్చి తీసుకెళ్ళిపోతాయి, నువ్వు రా” అని డాక్టర్ చెప్తూ వెనక్కి తిరిగినప్పుడు ఉన్నట్టుంది ఇరవైకి పైబడిన ఘీంకారాలు కోరస్‌గా పెద్ద ఎత్తున వినిపించాయి. నా ఒళ్ళు పులకరించింది! కళ్ళనుండి నీళ్ళు కారిపోయాయి. గుండెలో ఏదో సందడి. చేతులెత్తి దణ్ణం పెడుతూ ఒక మాటయినా గుర్తుకురానివాడిలా నిశ్చేష్టుడై నిల్చున్నాను. ఏనుగుల గుంపు తొండాలను పైకెత్తి కలిసికట్టుగా మళ్ళీ మళ్ళీ ఘీంకరించాయి. అవును, దేవదుందుభులు మ్రోగాయి! గగనభేరీ మోగింది! నల్లటి మేఘాలు కమ్ముకున్న ఆకాశమంతా ఏనుగు ముఖపు ఆకారమున్న దేవతల దరహాసాలతో నిండిపోయింది.

“రా” అని చెప్పి లోపలికి వెళ్ళారు ఏనుగు డాక్టర్.

(కథ మూలం: యానై డాక్టర్)


జయమోహన్

రచయిత జయమోహన్ గురించి: జయమోహన్ 1962 ఏప్రిల్ 22న కేరళ-తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో కన్యాకుమారి జిల్లాలో జన్మించారు. ఆయన తల్లితండ్రులు మలయాళీలు. ఇరవై రెండో ఏట వామపక్ష, సామ్యవాద సాహిత్యం మీద ఆసక్తి కలిగింది. ఆ రోజుల్లోనే రాసిన ఖైది అనే కవిత; నది‌, బోధి, పడుగై వంటి కథలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అప్పుడు రాసిన రబ్బర్‌ అనే నవల అకిలన్‌ స్మారక పురస్కారం అందుకుంది. ఈయన రచనలన్నీ మానసిక లోతులను వివిధ కోణాల్లో అద్దం పట్టేవిగా ఉంటాయి. 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని తన సిద్ధాంతానికి విరుద్ధమంటూ తిరస్కరించారు. ...