[ఆగస్ట్ 5, 2024న పి. వి. రమణారెడ్డిగారి స్మృత్యర్థం, వర్ధమాన సమాజం, నెల్లూరువారు ఏర్పాటుచేసిన రవీంద్రనాథ ఠాగూరు జయంతి సభలో రచయిత చేసిన ప్రసంగపాఠం, కొన్ని మార్పులతో.]
భూగోళానికి అవతలి వైపున ఉన్నప్పుడు, ఈనాటి కార్యక్రమానికి వక్తగా రమ్మని, వినయగారి పిలుపు వచ్చింది. వినయగారు రవీంద్ర సంగీతాన్ని సాధన చేస్తున్నారు. వారి తాతయ్య పి. వి. రమణారెడ్డిగారు ఇప్పుడు మనమధ్య లేకపోయినా, వారు ఏర్పరిచిన రవీంద్ర జయంతి సభాకార్యక్రమ సంప్రదాయాన్ని క్రమం తప్పకుండా నిలబెట్టాలని వారి కుటుంబమంతా ప్రయత్నిస్తున్నారని అర్థమయింది. వారికి అభినందనలు. అందులో నన్ను ఒక భాగం చేసినందుకు ధన్యవాదాలు. అందుకు వర్ధమాన సమాజం వేదిక కావడం మరింత సంతోషంగా ఉంది. పాతికేళ్ళ క్రితం నెల్లూరులో రేగడివిత్తులు నవలను ఆవిష్కరించినది వర్ధమాన సమాజం వేదిక మీదే.
అన్నిటికీ మించి, ఆ మహోపాధ్యాయుడు రవీంద్రుని రచనలను మరొకసారి చదివే సందర్భం రావడం మరింత సంతోషం.
వినయగారి ఆహ్వానం నాకు ఏడాది క్రితమే అందింది. ఈ రోజుటి శీర్షిక గురించి అప్పుడే అనుకొన్నాను. అందుకోసం నాలో నేను తర్జనభర్జన పడిన మాట వాస్తవం. ఎందుకంటే, నవలాకథనాల అధ్యయనం నా అభిమాన విషయం. చోఖేర్ బాలి (1903), నౌకా డూబి (1906), ఘరే బైరే (1913), గోరా (1916), చార్ అధ్యాయ్ (1934) – వేటికవే అద్భుతమైన నవలా కథనాలు. చిత్రాంగద (1893), చండాలిక (1938) నృత్యనాటికల సంగతి సరే సరి. ఇక, గీతాంజలి (1913) మాట మాత్రం చాలు.
శాంతి నికేతన్ అంటే నాకు ఎంత ఇష్టమో, పల్లెపట్టున వ్యవసాయ ప్రయోగాలు చేసిన శ్రీ నికేతన్ అంటే అంతే గౌరవం. అయితే, అలాంటి గంభీరమైన అంశాలను కాకుండా, ఇవ్వాళ ఎంపిక చేసుకొన్న అంశం, రవీంద్రుడి కలానికి బాల్యంతో ఉన్న బాంధవ్యం. ‘బొమ్మలగూటిలో ఠాగూరు’ అన్న శీర్షికతో రవీంద్ర సాహిత్యంలోని ‘బాల్యం’ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను.
ఒకసారి విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు, వారి తొమ్మిదేళ్ళ మనవరాలు, నందినికి రవీంద్రులు ఒక ఉత్తరం (8 మే, 1930) రాశారు. అందులో అంటారు కదా, ‘ఇక్కడ చాలా మంది నన్ను కలవడానికి వస్తున్నారు. నన్ను చుట్టేస్తున్నారు. నాకు ఎక్కడికైనా సంతోషంగా మాయమై పోవాలనిపిస్తుంది. నన్ను నీ బొమ్మలగూటిలో దాచి పెడతావా?‘
ఒక చిన్నపిల్లాడిలా మరో చిన్నారిని ఎంతో అమాయకంగా అడిగిన ఆ ప్రశ్నలోని పదాల పసితనం వెనక, ఎంతటి లోతైన భావన ఉందో కదా! ఆ ఉత్తరంలో మాత్రమే కాదు. ఠాగూరు పదేపదే పసితనపు పచ్చదనంలోకి వెళ్ళి, దాక్కున్నారా అని అనిపిస్తుంది, రవీంద్ర సాహిత్యాన్ని[1]Poems On Life, Rabindranath Tagore, Mohit Kumar Ray (2007). దగ్గరగా చూసినపుడల్లా. అందుకే ఈ పూట, ఆ బొమ్మల గూటిలో దాగిన ఠాగూర్‌ని పరామర్శించే సాహసం చేస్తున్నాను.
జగమెరిగిన బహుముఖ ప్రజ్ఞాశాలి రవీంద్రనాథ ఠాగూరు జన్మతః జమీందారు. కులీన వంశస్తుడు. అయినా ఆ జొరొసొంకో మాంత్రికుడు తన ఎనభైవ పుట్టినరోజునాడు తనను తాను ఇలా పరిచయం చేసుకొంటారు[2]Lipika, Translation by Aurobindo Bose, Peter Owen Limited, London, 1977. Rupa & Co., 2002.
నేను ద్విజుడను కాను.
ఏ పవిత్ర జంధ్యమూ వేయలేదు.
నేనొక సంచారిని మాత్రమే! (On my Birthday, 23 February, 1941)
నిజమే, ఆ బ్రహ్మ సామాజికుడు, ఆ శాంతి నికేతన తాపసి ఒక నిత్యాన్వేషి. ఆ మహోపాధ్యాయుడు ఒక నిరంతర విద్యార్థి. మరి, పాఠాలు నేర్చుకోవడానికి పదే పదే వారు వెళ్ళిన పాఠశాల ఏదీ? శాంతి నికేతనమేనా?
ఈ విద్యాలయం నా జీవిత సాధనా స్థలం. నా దైవం ఇక్కడే ఉంది. నా ముక్తి ఇక్కడే. ఇది కేవలం ఒక బడి మాత్రమే కాదు. (Letter to a parent, 30 April, 1912.)
ఠాగూరు ఆ బడిలోనే పాఠాలు నేర్చుకొన్నారా? వినమ్రంగా ఆయన ప్రణమిల్లినది ఏ దైవత్వం ముందు? బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు. ఆ బ్రహ్మచర్య ఆశ్రమం (శాంతి నికేతన్ బడి ఈ పేరుతోనే ప్రారంభం అయ్యింది) బాలబాలికల్లో ఆయన బ్రహ్మత్వం చూడగలిగారా?
ఠాగూరు అంటారు, ప్రతి శిశువు ఒక సందేశాన్ని తీసుకొస్తాడు. భగవంతుడు ఇంకా మనిషిపట్ల నిరాశ చెందలేదు అని. అలా ఆశాదీపాల్లాంటి పిల్లలు బ్రహ్మకు వార్తాహరులన్న మాట. బాలవాక్కు బ్రహ్మవాక్కే మరి!
అయితే, శాంతి నికేతన్ బడి 1901లో ప్రారంభించబడింది. అప్పటికే రవీంద్రుడు సుప్రసిద్ధ సాహితీవేత్త. ఆ బడి గడపలో నిలబడి, ఆ బడి ప్రారంభానికి అటూ ఇటూ వచ్చిన రవీంద్ర సాహిత్యాన్ని పరిశీలిద్దాం.
కథనశాస్త్రం ఏ కథనాన్ని అధ్యయనం చేస్తున్నా, అందులోని కథన మూలకాలను అన్వేషిస్తుంది. అవి ఆ కథనానికి పనిముట్టు లాంటివి. రవీంద్ర సాహిత్యంలో ‘బాల్యం’ ఒక కథన మూలకం అవుతుందేమో చూద్దాం.
బాల్యం అనగానే, ముచ్చట గొలిపే ముద్దుగారే లేతప్రాయం గుర్తుకు వస్తుంది. పిల్లల అమాయకత్వం, వారి చిలకపలుకుల చిలిపి మాటలు, అమ్మానాన్నల మమకారం గుర్తొస్తాయి. లాలిపాటలు, గాలిపటాలు గుర్తొస్తాయి. పిల్లల గారాం మారాం, వారి అల్లరి అలకలతో బాటు వారి కొంటెపనులు, తుంటరిచేష్టలు, మొండితనం, మంకుపట్లు గుర్తుకొస్తాయి. కొండొకచో వీరంగాలు వీపుదెబ్బలు తప్పవు. అలాగే, తొడపాశాలు, చెవిమెలివేతలు, గోడకుర్చీలు గుంజీళ్ళు గుర్తొస్తాయి. ఇక, పిల్లలెక్కడ ఉన్నా, వారు స్పృశించే మొదటి అంశాలు అమ్మ, ఆకలి, ఆటలు. పిల్లలంటే కనుల నిండా కలలు. కాళ్ళనిండా పరుగులు. పిల్లలకు చీకటంటే భయం. కథలంటే ప్రాణం.
పిల్లలకు కొన్ని సహజ లక్షణాలున్నాయి. హేతుత్వ శక్తి, ప్రశ్నించే గుణం, ఆసక్తి, కుతూహలం, ఊహ, కల్పన, ఆశ, నమ్మకం, తగిలిన గాయాల మరుపు, కొత్త స్నేహాలను కలుపుకోవడం, సహజంగా ప్రేమించగలగడం, ప్రకృతి పట్ల ప్రేమ, కరుణార్ద్రత, నేర్చుకొనే గుణం ఇలాంటివే మరెన్నో.
ఠాగూరు రచించిన, శిశు సంకలనంలో (The Crescent Moon)[3]The Crescent Moon ఉన్న నలభై కవితలూ అచ్చంగా ఇలాంటి బాల్యాన్ని ప్రతిఫలించేవే. కాలాలను, ప్రాంతాలను దాటి, అరమరికలు లేని ఆ పకపకలాడే బాల్యం, వాక్యాల నడుమ బుడిబుడినడకలు నడుస్తూ, మనలను ఇట్టే మురిపిస్తుంది. కాగితపు పడవల్లో నక్షత్రకాంతులలో పారిజాతాల పరిమళాలను నింపుకొంటూ, నిద్రాదేవతలు కనురెప్పల్లో నింపే కలలను మననం చేసుకుంటూ, ఠాగూరు తన పాఠకుల చిటికెనవేలు పట్టుకొని, తనతో పాటు తన బొమ్మల గూటిలోకి లాక్కెళతారు. అచ్చంగా పైడ్ పైపర్ (Pied piper of Hamelin) లాగా. ఆ లోకంలో పిల్లిమొగ్గలు, కుప్పిగెంతులు వేయనివారుంటారా? కోతికొమ్మచ్చులు, ఉప్పుమూటలు, బిళ్ళంగోడులు, గుర్రపుస్వారీలు, కత్తియుద్ధాలు తెలియనివారుంటారా? అల్లరి చేయనివాళ్ళు అసలే ఉండరు.
నిజమే, బాల్యం అనగానే, అసంకల్పితంగా ఒక చిన్న చిరునవ్వు మన ముఖాన కదలాడుతుంది. మమతానురాగాలతో ముడిపడిన సంతోషకరమైన రోజులవి. నిర్భయంగా నిశ్చింతగా అమ్మ ఒడిలోనో నాన్న భుజానో నిద్ర పోగలిగే రోజులవి. అలాంటి బాల్యం, శిశు సంకలనంలో ప్రతిపదంలో పలకరిస్తుంది. ఈ కవితల్లో –
మట్టిలో పొర్లాడుతూ, విరిగిన కొమ్మలతో అలుపెరగకుండా ఆనందంగా ఆడుకొనే పాపాయిల్లో ఆనందం సంతృప్తి చూస్తాం (ప్లే థింగ్స్); కాగితం పడవల్లో పారిజాతాలు నింపి, దూరతీరాలకు సందేశాలు పంపే చిన్నారుల చిగురంత ఆశలు కనబడతాయి (పేపర్ బోట్స్); సముద్రం ఒడ్డుకి వెళ్ళలేకపోతే, ఆ సముద్రాన్నే అలలు అలలుగా అమ్మ ఒడిలో ఒంపే గడుగ్గాయలను చూస్తాం (క్లౌడ్స్ అండ్ వేవ్స్); పెద్దయ్యాక ఏమేం పనులు చేయాలనుకొంటున్నారో తెలుస్తుంది (వొకేషన్ & ది ఫర్‌దర్ బ్యాంక్); పెద్దయితే జరగబోయేది ఏమిటో కూడా ఆ ఆరిందాలకు తెలుసు (ద లిటిల్ బిగ్ మ్యాన్).
నేనెక్కడ నుంచి వచ్చాను? నన్నెక్కడనుంచి తెచ్చావు? అని అమ్మను నిలదీసే పాపాయి కనబడుతుంది (ది బిగినింగ్); పాపాయి నా కనుపాపల్లో ఉన్నాడు. నా గుండెల్లో… నా అంతరాత్మలో నిండిపోయి ఉన్నాడు. అనే అమ్మ గొంతులోని ఆర్ద్రత మనలను తాకుతుంది (ది ఎండ్); నా చిన్నారి కనురెప్పల్లో నిద్రను దొంగిలించిన వారెవరు? అని గద్దించే నాన్న కనబడతాడు (స్లీప్ స్టీలర్). కదంబం చెట్టు కొమ్మల్లో చిక్కుకుపోయిన పున్నమి చంద్రుడిలో, అమ్మ ముఖాన్ని చూసే అమాయకపు పసిబిడ్డలు కనబడతారు (ఆస్ట్రోనమర్); అమ్మా, పాపాయి ఒట్టి ముద్దపప్పు. ఆమెకి వీధిలో దీపాలకీ ఆకాశంలోని నక్షత్రాలకీ తేడా తెలియడం లేదు, అంటూ చాడీలు చెప్పే అన్నలు కనబడతారు (సుపీరియర్); కాలంలో కలిసిపోయిన బిడ్డను కలలోనైనా, తిరిగి రమ్మని పిలిచే తండ్రి ఆర్ద్రత కనబడుతుంది – తిరిగి వచ్చేయి, చిట్టితల్లీ, లోకం నిద్రపోతోంది. ఎవరికీ తెలియదు. తారలు తారలను చూసుకొనే ఆ వేళలో (ది రికాల్); పాపాయీ నిన్నెక్కడికి సాగనంపాను? ఆ పిల్లల లోకంలో ఏ మూలనో నాకూ చోటివ్వవా? అన్న ఒక అభ్యర్థన వినబడుతుంది (బేబీస్ వర్‌ల్డ్); నక్షత్ర లోకం నుంచి అమ్మ దుఃఖాన్ని చూస్తోన్న పాపాయి అమ్మతో అంటుంది – నేనొక కలనై పోవాలి. మూసిన నీ కనురెప్పల సందుల్లోంచి నీ నిద్రలోతుల్లోకి జారిపోవాలి (ది ఎండ్).
ఇక ఈ శిశు సంకలనంలో ఆఖరి కవిత, ది లాస్ట్ బార్గెయిన్ ఆసక్తికరంగా ఉంటుంది.
‘రండి. నన్ను ఉద్యోగంలోకి తీసుకోండి‘ అని కవి అనగానే, ఒక రాజుగారు దర్పంతో, ఒక వృద్ధుడు సంపదతో, ఒక నవయువతి యుక్తితో, తాము ఇవ్వబోయే జీతభత్యాలను సకల సౌకర్యాలను వివరిస్తారు. కవి అదే వరసలో ఒక్కొక్కరి ప్రతిపాదనను నిరాకరిస్తాడు. అలా సాయంకాలమయింది. ఇంకా కవి ఏ కొలువులోనూ కుదురుకోలేదు. ఆ సాయం సంధ్య వెలుగులో-
సూరీడు ఇసుకలో మెరుస్తున్నాడు.
సముద్రం అలలుగా విరిగి పడుతోంది.
ఒక చిన్నారి గవ్వలతో ఆడుకొంటున్నాడు.
అతను తలెత్తి, ఎంతో తెలిసినవాడికి మల్లే అన్నాడు.
“నీకు ఉద్యోగం ఇస్తున్నా! జీతం లేకుండా!”
ఆనాటి పిల్లల ఆటలో నాటుకొన్న ఆఖరి బేరం.
నన్ను స్వతంత్రుణ్ణి చేసింది.
అదుగోండి, అలా ఈ కవితాసంకలనం ఆఖరుకు వచ్చేటప్పటికి, బాల్యంతో తనకు కుదిరిన చెలిమిని ఠాగూరు చాలా స్పష్టంగానే ప్రకటించారు. ఆటలపాటల పిల్లల యాజమాన్యంలో ఆ జీతం లేని ఉద్యోగం, వారినెంత స్వేచ్ఛాజీవిని చేసిందో కదా!
ఠాగూర్ కథ భిఖారిణి (ది బెగ్గర్ ఉమన్, 1877) ఆధునిక బెంగాలీ కథానికను రూపుదిద్దింది. ఠాగూరు ‘సాధన కాలం’గా వర్ణించే, 1891 – 1895 సంవత్సరాల మధ్యకాలంలో, ఎన్నో ముఖ్యమైన కథలు వచ్చాయి. పోస్ట్ మాస్టర్ (1891), కాబూలీవాలా (1892), ఛూటి (1892), అతిథి (1895) మొదలయిన వాటన్నిటిలో బాల్యమే[4]Stories from Tagore, MacMillan Co., 1918.[5]Tagore, Rabindranath (2010). Chattopadhyay, Ratan Kumar, ed. Selections from Galpaguchchha (3 volumes) Orient Blackswan. ప్రధాన వస్తువు.
ఈ కథలలో మురిపాల బిడ్డలతో పాటు, అనాథలు, తల్లిలేని బిడ్డలు, ఒంటరి తల్లినో తండ్రినో కలిగినవారు, వైకల్యం ఉన్నవారు కనబడతారు. అలాగే, పారిపోయిన పిల్లలు, నదిలో కొట్టుకు పోయిన పిల్లలు, కుటుంబ హింసకు నిరాదరణకు గురయిన పిల్లలు, నిద్ర కరువైన పిల్లలు కనబడతారు. పిల్లల ఇంటి బెంగ, ఎడబాటు, నిస్సహాయత, అభద్రత, భయం, ఆందోళన కథావస్తువులవుతాయి.
ఛూటి[6]రవీంద్రనాథ్ ఠాగూర్ కథలు, అనుసృజన: చంద్రలత (2018). పట్టుదారాల చెట్టు (బోలాయి), సరికొత్త బొమ్మలండి (నోతన్ పుతుళ్), చిలకమ్మ చదువు (తోతాకహానీ), కోరిక తీరిందోచ్! (ఇచ్ఛాపూరణ్), పొరపాటు స్వర్గం (భూలో స్వర్గ్),ఒకానొక అప్సరస (పరీర్ పరిచయ్), నల్లగుమ్మడి కాయ్! పచ్చి మిరపకాయ్! (ఇదురేర్ భోజ్). అనే కథలో, అమ్మ ఆదరానికై పరితపించే ఫతిక్ చక్రవర్తి, ఆమె నిరాదరణకు గురై, ఆమెకు దూరంగా, మేనమామతో బాటు కలకత్తా నగరానికి చేరుతాడు. పల్లెపట్టున పెరిగిన ఫతిక్, పట్టణపు ఇరుకు మనుషుల దాష్టీకాలలో ఇమడలేక, ఉక్కిరిబిక్కిరవుతాడు. పల్లెలోని అమ్మ ఆదరణ కోసం పరితపిస్తాడు. మేనమామ సెలవుల్లో ఇంటికి పంపుతానంటాడు. అప్పటి దాకా వేచి ఉండలేని దిగులుకు తోడు, ఫతిక్ జ్వరపడతాడు. ఇంటి బెంగతో మేనమామ ఇంటినుంచి పారిపోయిన ఫతిక్, జబ్బు తీవ్రమై కుప్పకూలిపోయే పరిస్థితుల్లో పోలీసులకు దొరుకుతాడు. అప్పటికే అతని పరిస్థితి విషమించింది. ఫతిక్ కళ్ళు మూతలు పడే వేళకి తల్లి కనబడుతుంది. ‘అమ్మ వచ్చింది. ఇక సెలవులు వచ్చేశాయి’ అంటూ, నిశ్చింతగా కనురెప్పలు వాలుస్తాడు. ఆ సెలవు శాశ్వతమన్నది విషాదసత్యం. తల్లి ప్రేమకై ఫతిక్ పడే తపన గుండెలని పిండేస్తుంది.
తిరిగి వచ్చిన కోకాబాబు (కోకా బాబూస్ రిటర్న్, 1891) కథలో రాయ్‌చరణ్, కాబూలీవాలా (1891) కథలోని కథకుడు మిని నాన్న, ఇంటింటికీ తిరిగి ఎండు ఫలాలు అమ్మే రహమత్ – ఇవి ముగ్గురు నాన్నల కథలు.
రాయ్‌చరణ్ జమీందారుగారికి పరమ విధేయుడైన పనివాడు. జమీందారు కొడుకు అనుకూల్ పసిబిడ్డగా ఉన్నప్పుడు చేరుతాడు. అనుకూల్‌ను ఎంతో మమకారంతో పెంచుతాడు. అతని పెళ్ళై, అతనికి పిల్లవాడు కోకాబాబు పుట్టినపుడు, అనుకూల్ పసితనం తిరిగి వచ్చిందని రాయ్‌చరణ్ సంతోషిస్తాడు. ఎంతో శ్రద్ధగా కోకాబాబు పెంపకంలో సాయపడుతుంటాడు. ఒకరోజు చిన్నారి కోకాబాబుని నది ఒడ్డుకు వ్యాహ్యాళికి తీసుకెళ్ళినపుడు, కోకాబాబు కనబడకుండా పోతాడు. అందరూ ఉరకలు పెడుతున్న పద్మానదిలో కొట్టుకు పోయాడని భావిస్తారు. ‘నా బిడ్డను నువ్వేమైనా ఎత్తుకెళ్ళి దాచిపెట్టావా? తిరిగి ఇచ్చేయి!’ అంటూ కోకాబాబు తల్లి కన్నీరుమున్నీరుగా ఏడుస్తుంది. రాయ్‌చరణ్‌ను ఉద్యోగంలోనుంచి తీసేస్తారు. జరిగిన ప్రమాదం తన నిర్లక్ష్యం వలనేనన్న అపరాధభావనతో, గుండె పగిలి, పల్లెకు తిరిగి వెళ్ళిన రాయ్‌చరణ్‌కు కొడుకు పుడతాడు. ఆ పురుడులో రాయ్‌చరణ్ భార్య చనిపోతుంది. కోకాబాబే తన బిడ్డగా తిరిగి వచ్చాడని భావించిన రాయ్‌చరణ్, పుట్టినబిడ్డను కోకాబాబుగానే భావిస్తూ, ఓ జమీందారు బిడ్డలాగే పెంచుతాడు. ఆ బిడ్డ కూడా రాయ్‌చరణ్‌ను తండ్రిలా కాకుండా సేవకుడిలా చులకనగా చూస్తుంటాడు. చివరికోనాడు, ఆ పిల్లవాడే తాను ఎత్తుకెళ్ళి పెంచిన కోకాబాబని అనుకూల్ దంపతులకు తిరిగి అప్పజెబుతాడు. ఆ పిల్లవాడు తండ్రి ముఖం చూడడానికి కూడా ఇష్టపడడు. అనుకూల్ కొంత డబ్బు పంపినా, ఆ చిరునామాలో ఎవరూ లేరని తిరిగి వస్తుంది. రాయ్‌చరణ్ ఏమయ్యాడో ఎవరికీ తెలియదు, పద్మానది ఒడ్డున అదృశ్యమైన కోకాబాబుకు మల్లే.
ఈ కథ జమీందారుకు పరమవిధేయుడైన పనివాడి కథలాగా అనిపించే తరగతుల అంతరాల కథ. రాయ్ చరణ్‌ను పరిచయం చేసేప్పుడే, అతను జమీందారు కులంవాడే అని చెప్పడంతోనే, ఆఖరున అతని బిడ్డను జమీందారుకు అప్పజెప్పడంలోని సాధ్యాసాధ్యాలను ఠాగూరు స్పష్టంగా చెప్పారు.
అలాగే, కాబూలీవాలా ఇద్దరు నాన్నల కథ. కథకుడి మురిపాల కూతురు, ఐదేళ్ళ మిని వసపిట్ట. కాబూలు ప్రాంతాల నుంచి వచ్చి, ఇంటింటికీ తిరిగి ఎండు ఫలాలు అమ్ముకొనే హజారా వ్యాపారి రహమత్‌తో స్నేహం చేస్తుంది. మిని తల్లికి ఇలా అపరిచితులతో పాప స్నేహం చేయడం పొసగదు. కథకుడు మాత్రం ఆ స్నేహాన్ని ప్రోత్సహిస్తాడు. ఓ రోజు, రక్తసిక్తమైన కాబూలీవాలాను పోలీసులు రోడ్డు మీద సంకెళ్ళు వేసి, లాక్కెళుతూ ఉంటారు. అప్పుడు కూడా కాబూలీవాలా మినికి వీడ్కోలు చెప్పి వెళ్ళడానికి వస్తాడు. మిని తల్లి భయపడినా, కథకుడు అతనిని కలవనిస్తాడు. జైలు కాలం ముగిశాక, కాబూలీవాలా నేరుగా చిట్టితల్లి మినిని కలవడానికి వస్తాడు. ఆ రోజు మిని పెళ్ళి రోజు. కథకుడు మినిని కలవమన్నాడు. అయితే కాబూలీవాలా చిన్నారినేస్తం అక్కడ లేదు. కళకళలాడుతూ సిగ్గుతో మౌనంగా ఉన్న పెళ్ళికూతురు మినిని చూసి, మాటపెగలని కాబూలీవాలా కళ్ళు ధారాపాతమవుతాయి. సరిగ్గా మిని ఈడున్న తన కూతురి కోసమే ధనం సంపాదించడానికి, ఆమెను వదిలి, కాబూలీవాలా దూరదేశం, కలకత్తాకు వచ్చాడు. అతను చిన్నారి మినిలో వదిలివచ్చిన తన కన్నబిడ్డను చూసుకొన్నాడని కథకుడు గ్రహిస్తాడు. ఇక, కాబూలీవాలా ఇంటికి తిరిగెళ్ళి బిడ్డకు పెళ్ళి చేసే కాలం వచ్చిందని గుర్తు చేస్తూ, కథకుడు ఆమెకు పెళ్ళికానుకలు ఇచ్చి, కాబూలీవాలాను సాగనంపుతాడు. మినిని కాబూలీవాలా ఆశీస్సులు తీసుకోమంటూ. మిని తల్లికి ఆ కాబూలీవాలాతో ఆనాటి తన ఐదేళ్ళ బిడ్డ స్నేహం ఇప్పుడు అర్థమవుతుంది. ఒక నాన్నకు మరొక నాన్న మనసు ఎప్పుడో అర్థమయింది.
ఒక పిల్లవాడితో ముడిపడిన, ఒళ్ళు గగుర్పొడిచే కథ ఒకటి ఆ కాలంలోనే వచ్చింది – సంపత్తీ సమర్పణ్ (1891-92). జగన్నాథ్ అనే పరమ లోభికి గోకుల్ చంద్ర మనవడు. జబ్బు పడిన కోడలి వైద్యానికి డబ్బు ఖర్చుపెట్టకూడదని ఆ పిసినారి మొండికెత్తడంతో ఆమె దక్కదు. మనసు విరిగిన కొడుకు, బృందావన్, తండ్రితో సంబంధాలు తెంచుకొని, గోకుల్‌ను తీసుకొని పట్నం వెళ్ళి పోతాడు. జగన్నాథ్ ఆ ఊరికి పారిపోయి వచ్చిన నితాయ్ అనే పిల్లవాడితో స్నేహం చేస్తాడు. ఒక రోజు నితాయ్ తండ్రి అతనిని వెతుకుతూ ఆ పల్లెకు వచ్చాడని తెలుస్తుంది. నితాయ్‌కి తిరిగివెళ్ళడం ఇష్టం లేదు. ఆ రాత్రి తండ్రికి కనబడకుండా దాచిపెడతానని, జగన్నాథ్ నితాయ్‌ని నేలమాళిగలో బంధిస్తాడు. అక్కడ కుప్పలు పేర్చిపెట్టిన బంగారం, ధనానికి కాపలా కాసే యక్షుడిగా మారమని క్షుద్రపూజ చేస్తాడు. తీరా నితాయ్ తన మనవడని తెలిసేసరికి జగన్నాథ్ మతి చలిస్తుంది. నిధినిక్షేపాల చుట్టూ అల్లుకొన్న ఈ మూఢనమ్మకాలకు పిల్లలను బలి చేయడం, పోగుబడ్డ సంపదల వారసుల విషాదాంతగాథలు ఈనాటికీ వినబడడమే దారుణం.
అటు ఫతిక్, ఇటు నితాయ్, తమకు హాని చేసేవారిని కూడా అంతటి మమకారంతో చేరువయ్యారే, అదీ పసితనపు సహజ మమకారం అంటే. ప్రమాదాన్ని, పర్యవసానాలను ఊహించలేని అమాయకపు బాల్యం అది. మాయమాటలతో ఆగంతకులు దగ్గరయ్యి, ఎక్కడ తమకు హాని చేస్తారేమో అని ఊహించలేని వయసు అది. కపటం ఎరగని బాల్యం అది. అందుకే, కాబూలీవాలా కథలో చిన్నారి మిని అపరిచితుడితో చేస్తోన్న స్నేహం గురించి తల్లి వెనకాడింది. అమ్మ భయాలు సహజమైనవే. చిన్నారి మినికి ఆ జంకూగొంకూ లేవు. ఆప్యాయంగా పలకరిస్తే అదే చాలు. చిన్నారి నితాయి అయినా అంతే. అయితే, సంపత్తీ సమర్పణ్‌లో నీతాయి బాగోగులు చూడవలసిన సొంతవారే, ఆ చిట్టితండ్రికి భయానకమైన హాని చేశారు.
తనవారెవరు? పరాయివారెవరు? ఆ సూక్ష్మం తెలియవలసింది పిల్లలకా? పెద్దలకా?
రవీంద్రుడి కలం ఆడపిల్లల పాత్రలను తీర్చిదిద్దడంలో ఎంతో నైపుణ్యాన్ని చూపుతుంది. చాలా ఇష్టంగా, ఎంతో మమకారంతో వారీ పాత్రలను రూపొందించారనిపిస్తుంది. నది మెట్లు (ది రివర్ స్టెయిర్స్ 1884) కథలో యుక్త వయస్కురాలైనపుడు పునర్వివాహ సంసార జీవితం అన్న ఊహామాత్రానికే సుడిగుండాల గంగ ఒడిని చేరిన బాలవితంతువు ఎనిమిదేళ్ళ కుసుమ్; పోస్ట్ మాస్టర్ కథలో పాఠం చెప్పిన పంతులుకే సంరక్షకురాలైన పన్నెండేళ్ళ రతన్; ఖాతా (ది ఎక్సర్ సైజ్ బుక్, 1891) కథలోని ఏడేళ్ళ ఉమ – కనబడ్డచోటల్లా గిలికే ఉమకు కావాల్సిందల్లా తనకంటూ రాసుకోవడానికి ఒక నోట్‌బుక్; అమ్మానాన్నలు ఆడిన అబద్దానికి తాను బలయిన శుభ (1892) కథలోని పుట్టుమూగ సుభాషిణి; ఒంటరి తండ్రైన సంపాదకుడికి (ది ఎడిటర్, 1893) తల్లయిన తల్లి లేని బిడ్డ ఆరేళ్ళ ప్రభ; తన ఈర్షాసూయలు, కోపతాపాలు దాచుకోలేని తొమ్మిదేళ్ళ చారుశశి (అతిథి, 1895)… వారి ముద్దుమురిపాల ముచ్చట్లు, కనురెప్పల దాగిన కలలు, అలకలు అహంకారాలతో సహా ఇలా ప్రతి సంవేదనను ఆ చిన్నారుల సజీవ బాల్య ప్రతీకలుగా ఎంతో వాత్సల్యంతో రవీంద్రులు మలిచారు.
పదహారేళ్ళ తారాపద (అతిథి) లోని సంస్కారి, అన్వేషకుడు మనలను ఎంతగా కట్టిపడేస్తాడో, నదిమెట్ల సాక్షిగా పెరిగిన కుసుమ్ నదిలోని సుడిగుండాల్లోకి అంతగా తనతోపాటు మనలను తీసుకెళుతుంది.
‘నాన్నలా నేను సంరక్షించవలసిన నా చిట్టితల్లి, నా బాగోగులు చూసే అమ్మలా ఎప్పుడు ఎదిగిందీ!’ అని ప్రభ తండ్రి (ది ఎడిటర్) ఓ శుభోదయాన ఆశ్చర్యపోతాడు. అప్పటికే ప్రభ తన బాల్యమాధుర్యాన్ని కోల్పోయింది. ఆరేళ్ళకే ఆరిందాలాగా కుటుంబాన్ని చక్కదిద్దుతోంది. ఆ తండ్రి గ్రహింపు ఒక్క ప్రభకే పరిమితం కాలేదు. ఎందరో పిల్లలు అచ్చంగాయలు, దాగుడుమూతలు ఆడుకోవాల్సిన పసితనంలో, కుటుంబ బాధ్యతలు మోసే పెద్దవాళ్ళయి పోయారు. చాలా సహజంగా తమ బాల్యాన్ని వారు కోల్పోయారు. ప్రభ తండ్రి ప్రశ్న అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంది. వాటికి సమాధానాలు ఆనాటి బెంగాల్ సమాజంలోని బాలికల స్థితిగతులలో ఉన్నాయి. వారిపై ఉన్న కట్టడి కట్టుబాట్లలో ఉన్నాయి. అవిద్య, బాల్యవివాహాలు, బాలవితంతువులు, బాలెంత మరణాలు, శిశు మరణాలు, కుటుంబ బాధ్యతలు ఒక పక్క, అప్పుడప్పుడే ఇంటా బయటా చదువు సంస్కారాలతో ముడిపడి విస్తరిస్తోన్న చైతన్యభరిత బాలికాప్రపంచం మరోపక్క. అందుకే, చారుశశి ప్రకోపాలపై కోపం రాదు. అలా సంకుచితంగా పెరిగిన ఆమె పెంపకపు నేపథ్యం అర్థమవుతుంది. తనకేం కావాలో స్పష్టత కలిగిన తారాపద ఒక కొలమానం అవుతాడు. భిన్ననేపథ్యాలు కలిగిన ఇద్దరిని అర్థం చేసుకొనేలా సమాంతరంగా చిత్రించిన నైపుణ్యం రవీంద్రునిది.
బాల్యాన్ని కోల్పోయిన పిల్లలను గురించి రాసినంత సూక్ష్మంగా, పెద్దలలో వీడని బాల్యాన్ని చిత్రిస్తారు ఠాగూరు. ఠాగూరు ప్రధాన పాత్రలు ముఖ్యంగా స్త్రీ పాత్రలలో కొందరు, బాలికల్లా ప్రవర్తిస్తారు. ఠాగూరు నవలలలో వీరంతా కనబడతారు.
ఛోఖెర్ బాలి నవలలోని కపటం ఎరగని ఆశాలత, కంటిలో నలుసయిన వినోదినితో అరమరికలు లేని స్నేహం చేస్తుంది, అచ్చంగా కాబూలీవాలాతో స్నేహం చేసిన అయిదేళ్ళ మినీ లాగానే; అలాంటి పర్యవసానాలు ఊహించలేని స్నేహమే ఘరే బైరే లోని విమల, ఆమె భర్త నిఖిలేశ్ స్నేహితుడైన సందీప్‌తో చేస్తుంది. ఆ అవగాహనారాహిత్యపు పర్యవసానాలతో బాటూ ఎదిగిన ఆమె, ఆ క్రమంలో తన భర్త నిఖిలేష్‌ని కోల్పోతుంది; తనను తాను సరిదిద్దుకోకుండా ఎదిగిన మొండి పిల్ల చారుశశినే పెద్దయ్యాక వినోదిని ఏమో అనిపిస్తుంది.
ఈ ఛోఖెర్ బాలి నవలలోని అసలు కీలకం మహేంద్ర స్వార్థ భరిత ప్రవర్తన. అతిగారాబంలో పెరిగి, ఇష్టాపూర్వకంగా ప్రవర్తిస్తూ, ఏ మాత్రం ఎదగడానికి సిద్ధపడనివాడు. తన చుట్టూ ఉన్నవారందరి జీవితాలు అతని ఆటకాయితనం అనే విషాదపుసుడిలో పడతాయి. నచ్చిన బొమ్మ తనకే దక్కాలని హఠం వేసే పిల్లవాడు మహేంద్రలో ఆద్యంతం కనబడతాడు. పంతంపట్టి సాధించుకొన్న ఆ బొమ్మ దక్కిన తరువాత, కాసేపు ఆడుకొని విరగ్గొట్టి, పక్కన పడేసే ఆకతాయి పిల్లల తీరు అది. ఆ ఆధిపత్యం, అహంకారం, తన మాటే నెగ్గాలన్న మంకు పట్టుదల, సాటివారి పరిస్థితులను మనోభావాలను పరిగణించని మూర్ఖత్వం… మోతాదు మారినా… ఘరే బైరే నవలలో తీవ్రభావాల ఉద్యమకారుడు సందీప్ లోనూ కనబడుతుంది.
అలాంటి పెద్దలలో కరుడుగట్టిన ఎదగని పిల్లల మనస్తత్వాలను ఠాగూరు ఎంతో సున్నితంగా, స్పష్టంగా చిత్రించారు. అంతెందుకు, సంపాదకుడు తన అయిదేళ్ళ పాప తన సంరక్షకురాలయ్యిందని ఎప్పుడు గ్రహించాడో, అప్పుడు కదా ఎదగడం మొదపెట్టాడు. ఎవరిలోనైనా ఆ గ్రహింపు రావడమే అసలు సవాలు. వారిలో అదే ఎదుగుదలకు ఆరంభం.
చదువుపై ఠాగూర్ రాసిన కథలలో అనేకం శాంతి నికేతనానికి ముందు వచ్చినవి. ఎక్సర్‌సైజ్ నోట్‌బుక్ , పోస్ట్ మాస్టర్ – బాలికావిద్య గురించయితే, ఛూటి చదువుకోసం పల్లె వీడవలసి వచ్చిన పిల్లవాడికి ప్రతీక. శాంతి నికేతనానికి తరువాత వచ్చిన తోతా కహానీ (1918) విద్యావిధానంపై వ్యంగ్యాస్త్రం. నొతొన్ పుతుళ్ (1921) ఎంత తెలిసిన విద్యనైనా కాలానికి అనుగుణంగా ఆధునీకరించుకోవాల్సిన నైపుణ్యాల ఆవశ్యకత గురించి చర్చిస్తే, ఇదురేర్ భోజ్ (1941) ఆకతాయి పిల్లల అల్లరిని అర్థం చేసుకునే పంతులుగారి విజ్ఞతని పరిచయం చేస్తుంది. ఇచ్ఛాపూరణ్ (1895) తారుమారయిన శరీరాలతో తండ్రీకొడుకు సుబల్, సుశీల్ మధ్య జరిగిన హాస్యభరితమైన అనుభవాలను చిత్రిస్తూ, ఏ వయసుకు ఆ ముచ్చట అన్న మాటను స్పష్టపరుస్తుంది. బడి ఎగ్గొట్టాలనుకొనే సుశీల్, బడిపంతులిని దడిపించాలనుకొనే బిచ్ కన్ మిత్రబృందపు అమాయకపు అల్లరి కూడా ముచ్చటగానే అనిపిస్తుంది. బాల్యాన్ని అనేకరూపాల్లో, నానా రకాలుగా, పలు కోణాల్లో, బహువిధాలుగా సర్వాంగసుందరంగా రవీంద్రుడు తన సాహిత్యంలో తీర్చిదిద్దారు. ఇవి మచ్చుతునకలు మాత్రమే.
శాంతి నికేతనానికి రవీంద్రుడు ఒంటరిగా రాలేదు. కుసుమ్, రతన్, మిని, ఉమ, ప్రభ, శుభ, ఫతిక్ చక్రవర్తి, నీతాయి, సుశీల్… వీరందరితో పాటు శాంతి నికేతనపు గడపలో అడుగు పెట్టారు. వారికి అమల్, సుధ, బోలాయి, బిచ్ కన్ తదితరులు జతకలిశారు. వారందరు రవీంద్రుని చేయి పట్టుకొని, అతనితో పాటే నడుస్తూ బుడిబుడి నడకలేస్తూ, ఆ పిల్లల ప్రపంచాన్ని ఎంత అందంగా నిర్మించారో కదా!
అలాగే, పిల్లల ప్రపంచపు కథల్లోని పాత్రలన్నీ రవీంద్ర సాహిత్యంలో కొత్త రూపాలు దిద్దుకొంటాయి. పిల్లల ఊహల్లోని అభూతకల్పనలన్నీ రవీంద్ర కథన మూలకాలవుతాయి.
భూలో స్వర్గ్ (1921)[7]A Wrong Man in Workers’ Paradise. Bhavani Bhattacharya, The spectator, 1931. మనం ఎరిగిన సాంప్రదాయ స్వర్గం కాదది. అది తీరిక ఎరగని పనిమంతుల స్వర్గం. ఆ పనిమంతుల స్వర్గంలోకి వెళ్ళిన, పరమ బద్ధకస్తుడిలా అనిపించే ఓ పనీపాటా ఎరగని కళాకారుడి కథ అది.
చిన్ననాటి కథల లోకంలోనే బందీ అయిన ఓ రాజకుమారుడు, పెళ్ళి చేసుకొంటే అప్సరసనే చేసుకొంటానని పట్టుబడతాడు. దానికి మూలం మంత్రిగారి కొడుకు నవీన్ నమ్మబలికిన మాటల మాయాజాలం. రాకుమారుడు రాను రాను ఆ ఊహలే నిజమని నమ్మతాడు. నవీన్ చేసిన వర్ణనలకు సరితూగే యువతి ఎక్కడుందో కూడా చెబుతాడు. జానపదకథల్లో లాగానే, నట్టడవిలో వెన్నెల రాత్రి సెలయేటి ఒడ్డున నిలబడి, తన కడవలో నీరు నింపుకొంటున్న ఒక గిరిజన యువతి కజరినే మారురూపంలో ఉన్న దివ్యలోకపు అప్సరసగా భావిస్తాడు. ఆమెను తన గుఱ్ఱం మీద ఎక్కించుకొని అంతఃపురానికి తీసుకొస్తాడు. రాజ్యానికి పట్టపు రాణిని చేస్తాడు. రాకుమారుడు తప్ప అందరూ కజరి ఎవరో గ్రహిస్తారు. నవీన్ చేస్తున్నదేమిటో కూడా గ్రహిస్తారు. తన ఊహల్లో తానే మునిగిపోయిన ఆ రాకుమారుడు రాకుమారుడి భ్రమ ఎలా పటాపంచలు అవుతుందో అవదో తెలియాలంటే పరీర్ పరిచయ్ (1928) చదవాలసిందే. ఇది రాజుగారి దేవతా వస్త్రాల (The Emperor’s new clothes) కథను గుర్తుచేసే కథ.
ఇలా, రవీంద్రసాహిత్యంలో అడుగడుగడునా పిల్లల లోకంలోని అభూతకల్పనలు, అద్భుత సాహసాలు కనబడతాయి. ప్రాచీన గాథలెన్నో సరికొత్త రూపురేఖలతో పలకరిస్తాయి. రాకుమారులు, రాకుమార్తెలు, ఇచ్ఛాపూరణ్ ఠాకురాణీలు, నిద్రాదేవతలు, అప్సరసలు, యక్షులకు కొదవలేదు. కుట్రలు కుతంత్రాలు మంత్రాంగాలు, గూడు పుఠాణీలు, వాటిని భగ్నం చేసే చాతుర్యం కలిగిన కథానాయకుల ప్రస్తావన సంగతి సరేసరి.
బెంగాలీ సంస్కృతిలో పిల్లలకే చెందిన జానపదాలు, ఆటలుపాటలు ఎన్నో ఠాగూరు రచనల్లో సహజంగా ఒదిగిపోతాయి. సాత్ భాయీ చంపా కథలో సంపెంగపూవులుగా (చంపా కుసుమాలు) మార్చబడిన తన ఏడుగురు అన్నదమ్ములను శాపవిముక్తులను చేసే చెల్లెలు పారుల్ కథ ఎవరికి నచ్చదు? చెల్లెలి వలన నిజరూపాలు పొందిన ఆ అన్నదమ్ములకే కాదు అందరికీ నచ్చుతుంది. పారుల్ పుష్పం లాగానే ( Garlic vine, Mansoa alliacea). ఘంటాపథంగా.
పారుల్ ప్రస్తావన వచ్చిందంటే, అమల్ గురించి మాట్లాడాల్సిందే.
ఎనిమిదేళ్ళ అమల్ పోస్ట్ ఆఫీస్ (1912) నాటకంలో ప్రధాన పాత్ర. కోలుకోలేని జబ్బున పడిన అమల్ ఆఖరి రోజుల కథ అది. అమ్మానాన్నలను కోల్పోయి పెంపుడు తండ్రి మాధవ్ సంరక్షణలో ఉన్నాడు. గాలీ వెలుతురు సోకని గదిలో ఉంచడమే అమల్ జబ్బుకు చికిత్స అని వైద్యుడు అంటాడు. అలా గదికే పరిమితం చేయబడిన ఒంటరి పిల్లవాడి కథ ఇది. రోడ్డువారగా కిటికీ సందులోంచి, ఆ దారిన వెళ్ళే వారితో స్నేహం చేస్తాడు. పెరుగమ్మే వ్యక్తి, పూలమ్మే సుధ, కావలివాడు, జాఫర్ /ఫకీరు, గ్రామాధికారి, వీధిలో ఆటలాడుకొనే పిల్లలు… ఇలా అందరినీ పలకరిస్తాడు. వారి కబుర్లకు తన ఊహల రంగులద్దుతాడు. కల్పనల పుప్పొడి జాజర చల్లుతాడు.
వీరిలో జాఫర్ అంటే మాధవ్‌కి ఇష్టం ఉండదు. ఎందుకో గానీ అమల్ జాఫర్‌తో మాట్లాడడం మాధవ్‌కు నచ్చదు. అది గ్రహించిన జాఫర్ మారువేషంలో ఫకీరు లాగా వచ్చి మరీ అమల్‌తో స్నేహం కొనసాగిస్తాడు. అమల్‌తో స్నేహం చేసిన వారందరిలోనూ, మినితో స్నేహం చేసిన కాబూలీవాలా కనబడతాడు.
అమల్ కిటికీలోంచి చూడగలిగేవే కాక, ఊహల్లోనూ చూడగలడు. కొండలను,వాటి పక్కని ఎర్రటి మట్టి బాటను, దానిపై నడిచి వెళ్ళే మనుషులను, దాని పక్కని అడవిని, అడవిలో పూలను, ఆకాశంలో రంగులను, మబ్బులను, పక్షులను, గాలిపటాలను, నక్షత్రాలను, ఇలా అమల్ చూడగలిగినవీ ఊహించగలిగినవన్నీ చూస్తాడు. ఒకరోజు, అమల్‌కు దూరాన కొండమీద మీద రెపరెపలాడే జెండా కనబడుతుంది. అది కొత్తగా కట్టిన పోస్ట్ ఆఫీస్. రాజుగారు పిల్లలందరికీ ఉత్తరాలు రాస్తారని వింటాడు. ఆ రాజుగారి ఉత్తరం తనకు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటాడు. గ్రామాధికారిది ఏడిపించే మనస్తత్వం. ఖాళీ కాగితం తీసుకొచ్చి, ‘ఇదుగో రాజుగారి ఉత్తరం’ అని పిల్లవాడితో పరాచికాలాడుతుంటాడు. చివరికి నిజంగానే, రాజుగారి ఉత్తరం తీసుకొని వార్తాహరుడు వస్తాడు. ఆ రాత్రికి రాజుగారే స్వయంగా వచ్చి, అమల్‌ను కలుస్తాడని వార్త అందిస్తాడు. ఆ వెనకే రాజవైద్యుడూ వస్తాడు. వచ్చీరాగానే, అప్పటిదాకా చీకట్లో మగ్గుతున్న అమల్ చుట్టూ దించిన తెరలను, పరదాలను, కిటికీ రెక్కలను బార్లా తెరవమని, గదిలోకి గాలీ వెలుతురు ధారాళంగా రావాలని ఆదేశిస్తాడు.
మొదట్లో ఓసారి ‘సంపెంగ పూవుల మంత్రవిముక్తి చేసిన వారి సోదరి పారుల్ రాకుమారిలాగా సుధ తనను చూసుకొంటుందా జ్ఞాపకం పెట్టుకొంటుందా’ అని అడుగుతాడు. వెంటనే సుధ ‘నేను పారుల్‌ని కాను! సుధని!’ అని ఖచ్చితంగా సమాధానం ఇస్తుంది. ఆ రోజు చీకటిపడే వేళకి, సుధ పూలు తీసుకొని అమల్ దగ్గరికి తిరిగి వచ్చేసరికి, అమల్ కళ్ళు మూతలు పడుతున్నాయి. నిద్రకమ్ముకొస్తూ ఉంటుంది. రాజవైద్యుడు దీపాలను ఆర్పేసి, నక్షత్రకాంతులను ఆ గదిలో నిండనీయమంటాడు. ‘అమల్‌ను సుధగానే ఎప్పటికీ జ్ఞాపకం పెట్టుకొంటాను’ అని అంటుంది. ఆ మాటను తన మాటగా రాజవైద్యుడిని అమల్ చెవిలో చెప్పమంటుంది. అమల్ కళ్ళు మూతలు పడ్డాయి. ఆ మాటే ఆఖరు. ఆ నాటకానికి. అమల్ జీవితానికి.
పెంపుడు తండ్రి రాత్రికి రాజుగారు వచ్చినపుడు అమల్‌ను తమ ఆర్థిక పరిస్థితికి తగ్గ కానుకలు అడగమంటూ ఆరా తీస్తాడు. ‘రాజుగారిని ఏమి ఇవ్వమని అడుగుతావ్?’ అమల్ అంటాడు ‘ఇంటింటికీ తిరిగి సందేశాలిచ్చే పోస్ట్‌మాన్‌ని చేయమని అడుగుతాను.’
పోస్ట్ ఆఫీస్ నాటకం ప్రపంచ సాహిత్యంలో ప్రత్యేకస్థానం పొందింది. ఈ నాటకాన్ని జీవితానికి మరణానికి మధ్యన ఒక లోతైన ప్రతీకాత్మక సంభాషణగా భావిస్తారు. జీవితం పట్ల ప్రేమ, నమ్మకం, ఆశ కనబడతాయి. ఆ అర్థరాత్రి అమల్ వద్దకు రాబోతున్న రాజుగారు మృత్యువు, భగవంతుడు, మరెవరెయినా కావచ్చు. నక్షత్రాల దారిలో అమల్ నడిచివెళ్ళే ఆ ఆఖరి నడకకు ఎంత చక్కటి సొబగులద్దారో, ఆవలితీరాన అమల్ అమ్మానాన్నల చిరునవ్వుల వెలుగులో మురిసిపోతూ. అటు ప్రేక్షకులయినా ఇటు పాఠకులయినా గుండె చిక్కబెట్టుకొని, కళ్ళు తుడుచుకొని, నవ్వుతూ అమల్‌ను సాగనంపాల్సిందే.
చావు పుటుకల గంభీర తాత్విక చర్చకు, ఠాగూరు ఎంచుకున్న కథన మాధ్యమం – మరణశయ్యపై ఉన్న ఒక చిన్న పిల్లవాడు.
జీవితం నవ్వుతుంది,
మరణపు గిలక్కాయను ఆడిస్తూ
పరుగులు పెడ్తోన్న చిన్నపిల్లలా. (Poems On Life)
రవీంద్రసాహిత్యానికి విశ్వవ్యాప్త ఆదరణ ఎలా లభించింది అనగానే, చటుక్కున అనే మాట 1913లో నోబుల్ పురస్కారం అందుకొన్న గీతాంజలి, దానిలోని తాత్వికత అని. అయితే,అంతకన్నా ముందే 1912లోనే ప్రముఖంగా ప్రదర్శించబడిన, పోస్ట్ ఆఫీస్ నాటకం[8]W. B. Yeats was instrumental in having a performance of Tagore’s play, The Post Office, performed at the Abbey Theatre in Dublin in October 1913. యూరప్‌ను జయించింది. శిశు కవితల ఇంగ్లీషు అనువాదం ది క్రెసెంట్ మూన్[9] Thomas Surge Moore, మేరీ మూర్ చేసిన ఫ్రెంచ్ అనువాదం ల జ్యూన్ లూన్ (La Jeune Lune)[10]Marie Sturge Moore, translated Tagore’s The Crescent Moon into French La Jeune Lune, 1924. పాశ్చాత్యుల హృదయాలను కొల్లగొట్టింది.
‘ఈ రెండింటి అంశాలు మానవులయిన వారెవరినైనా స్పృశించగలిగేవి. అవి అందరికీ చెందినవి’ అని 1913లో గ్లోబ్ పత్రిక[11]‘The Globe’ in its review (1913) described it as ‘a revelation more profound and more subtle than that in the Gitanjali,’ and ‘The Nation (1913) found in it ‘a vision of childhood which is only paralleled in our literature by the work of William Blake.’ ప్రశంసలు కురిపించింది. వాటిలోని రచనలన్నీ బాల్యంతో ముడిపడినవే. అదీ బాల్యం కథన మూలకమైన రవీంద్ర సాహిత్యపు ఇంద్రజాలం. చమత్కారం.
పిల్లల మనస్తత్వాన్ని, స్వభావాలను, ప్రవర్తనను సూక్ష్మంగా తెలిసిన ఠాగూరు బాల్యాన్ని చిత్రీకరించడంలో అద్భుతమైన నైపుణ్యాన్ని చూపుతారు. అయితే, ఈ బాల్యప్రధాన రచనలన్నీ పిల్లలకోసం రాసినవి కావు. వారి చుట్టూ ఉన్న పెద్దలకు పిల్లలతో చెప్పిన పాఠాలు. సంపత్తీ సంపర్పణ్‌లో కథాంశం నీతాయి అమాయకపు మమకారం కాదు. అతని తాతయ్యలో కరడు కట్టిన లోభిగుణం. ఫతిక్ చక్రవర్తి ఇంటి బెంగ కాదు, అతనిని ఇంటికి దూరం చేసిన అతని కుటుంబ నిరాదరణ చర్చనీయాంశం.
అయితే మటుకు, అంత భీభత్సంగా నీతాయిని నేలమాళిగలో భూస్థాపితం కానివ్వాలా? అంత దారుణంగా ఫతిక్ కన్నుమూయాలా? రాజవైద్యుడు వచ్చాడుగా, అమల్‌ను బతికించడా? ఎంత జనన మరణాల నడుమ జీవితంపై తాత్విక ప్రతీకకు అయినా, అమల్ మరణం అవశ్యమా? ఎంతటి కరుడుగట్టిన హృదయంలోనైనా కరుణార్ద్రతలను తట్టి లేపగల శక్తి పసితనానికి ఉంది. ఆ విషాదాంతాలు చివుక్కుమనిపించని గుండె ఉంటుందా? చెమర్చని కళ్ళు ఉంటాయా? అంత దారుణంగా చెబితేగానీ జరిగిన అమానుషం అర్థం కాదని కాబోలు. అందుకు, బాల్యం ఒక పదునైన ములుకులా అందివచ్చింది. నిఖార్సైన కథన మూలకమయింది.
అందుకే, జీవన మరణాల మార్మిక సంబంధాన్ని గిలక్కాయను ఆడిస్తూ పరుగులు పెడ్తోన్న చిన్నపిల్లల నవ్వుతో చెప్పగలగడం, బాల్యంలో తాత్వికత చూడగలిగిన రవీంద్రునికే సాధ్యపడింది.
ఏ రచనైనా ఆ రచయిత జ్ఞానం, అనుభవం, దార్శనికతల ముప్పేట అంటారు. ఒక విషాదమేఘం రవీంద్రుని జీవితంపై ఎప్పుడూ ఆవరించి ఉంది. 1875లో తల్లి శారదాదేవిని కోల్పోవడంతో పధ్నాలుగేళ్ళ ఠాగూరు తల్లి లేని బిడ్డ అయ్యారు. తొలినాళ్ళలో ఠాగూరుకు సాహితీ స్పూర్తి అని భావించే వారి వదిన, కాదంబరి దేవి, 1884లో అకాల మరణం చెందారు. 1902లో భార్య మృణాళిని దేవిని కోల్పోయి ఠాగూరు ఒంటరి తండ్రి అయ్యారు. 1903లో కన్నబిడ్డ రేణుకను కోల్పోయారు. ఆ వెంటనే, 1905లో తండ్రి మహర్షి దేవేంద్రనాథ ఠాకూరుని, మరొక బిడ్డ మాధురీలతను 1918లో కోల్పోయారు. 1932లో మనవడు నితీంద్రనాథ్‌ను పోగొట్టుకొన్నారు. అలా, ఠాగూరు జీవితంపై ఎప్పుడూ ఒక దుఃఖపు ఛాయల నీలి మేఘం కమ్ముకొని ఉందనిపిస్తుంది. ఆ విషాదానికి సమాంతరంగా వారి సాహితీప్రస్థానం జరిగిందా అని అనిపిస్తుంది. ఆ విషాదఛాయలు వారి కలంలో అంతర్లీనమై పోయాయనిపిస్తుంది. సున్నితమైన ఆ కవి హృదయం ఎంత తల్లడిల్లి ఉంటుందో, ఆ దుఃఖభారాన్ని ఆయన ఎలా దాటి వచ్చారో… ఊహకు అందదు. బహుశా అప్పుడే ఆయన బొమ్మల గూటిలో తలదాచుకోసాగారేమో!
1901 శాంతి నికేతన స్థాపన జరిగింది. 1903లో శిశు, ఛోఖెర్ బాలి వచ్చాయి. అదే ఏడాది ఠాగూరు ఒంటరి తండ్రి అయ్యాడు. కన్నబిడ్డ రేణుకను పోగొట్టుకొన్నాడు. అకాల కాలధర్మం చెందడంతో పోగొట్టుకొన్న ఠాగూరు ఏకైక మనవడు, నితేంద్రనాథ్ పుట్టిన 1912 లోనే, ‘పోస్ట్ ఆఫీస్’ వచ్చింది. బిడ్డను కోల్పోయిన ఏడాదే, శిశు బెంగాలీలో అచ్చయ్యింది. ‘పాపాయీ నిన్నెక్కడికి సాగనంపాను? ఆ పిల్లల లోకంలో ఏ మూలనో నాకూ చోటివ్వవా?‘ అన్న అభ్యర్థన ఆ గర్భశోకానిది కాదా? (బేబీస్ వర్‌ల్డ్)
– ‘నా పాపాయిలోకపు హృదయంలో/ ఏదో ఒక నిశ్శబ్దమైన మూలన దాగిపోవాలనుకొంటున్నాను.‘(బేబీస్ వర్‌ల్డ్)
– ‘జీవితం ఒక సత్యం. ముఖ్యమైంది. జీవితంతో లోతైన నిజసంబంధాన్ని ఏర్పరుచుకోగలిగినప్పుడే, మానవుడు పరిపూర్ణుడవుతాడు.‘
– ‘నేను ఈ పుడమి కవిని. ఈ నేల మీద ధ్వనులన్నీ నా వేణువులో నిండి స్వరాలుగా ప్రతిధ్వనిస్తాయి. ఈ రాగసాధనలో ఎన్నెన్నో ధ్వనులను స్పృశించనే లేదు. ఎన్నో స్వరాలు తప్పిపోయాయి.‘ (On my Birthday, Lipika, 1941)
ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి ఇంకా నేర్వవలసిన పాఠాలకై వేచి ఉన్నారు. అచ్చంగా అప్పుడే ఓనమాలు నేర్వడం మొదలెట్టిన పిల్లవాడిలా. అలా నేర్చుకోవడానికి సుముఖంగా ఉండడం పిల్లల సహజస్వభావం కాదూ? పసితనానికి ప్రకృతికి ఉన్న అవినాభావ సంబంధాన్ని, ఆ సమీకరణాన్ని అర్థం చేసుకునే క్రమంలోనేగా జీవితం అర్థం అవుతూ వస్తుంది.
అది, రవీంద్రుని కథ బోలాయిలో (1928) స్పష్టపడుతుంది. అప్పుడే మట్టిలో నుంచి పుట్టిన నునులేత మొలకలను పలకరించే పిల్లవాడు బోలాయి. ఈ పిల్లవాడి వయస్సు అంటే, నిజ వయస్సు, ఈ చెట్టూచేమా సమస్తజంతుజాలం పుట్టిన కోట్లాది ఏళ్ళ క్రితం మట్టిని తొలుచుకొని మొదటి విత్తులోని అంకురం నాటిది. అంతలా ప్రకృతితో మమేకమైపోయే ఆ తల్లి లేని బిడ్డ, బిడ్డలు లేని పిన్ని ఒడికి చేరాడు. ఓ రోజు ఒక చిన్న మొలక బోలాయి కంట పడింది. అది పెరిగి చెట్టయ్యాక పట్టుదారాలు ఇచ్చే బూరుగ దూది మొలక. అతని బాబాయి అదే మొక్క, అడ్డదిడ్డంగా దారి కడ్డంగా పెరిగితే రాకపోకలకు ఇబ్బంది అని భావిస్తాడు. బోలాయి చదువులకని సిమ్లా బడికి వెళ్ళినపుడు, ఆ చెట్టును కొట్టేయిస్తాడు. బాబాయికి అది అడ్డదిడ్డంగా పెరగబోయే ఒక కలుపుమొక్క. పిన్నికి తన ఒడిని వదిలి వెళ్ళిన బోలాయ్ పసితనపు పచ్చదనానికి ప్రతిరూపం. ప్రకృతికీ మనిషికీ నడుమ ఉన్న సంబంధాన్ని అందంగా, సున్నితంగా, మనోజ్ఞంగా ఆవిష్కరించిన కథ ఇది. పసితనానికి పచ్చదనానికి ఉన్న సంబంధానికి ఈ కథ ఒక ప్రతిరూపం. బోలాయి ఒక మొక్కను పెంచినా, పిన్ని ఒక బిడ్డను పెంచినా, ఆ మానవ స్పర్శలోని అనుభవాన్ని, గాఢతను, సున్నితత్వాన్ని అర్థం చేసుకోవడం అన్నదే ఈ కథకు జీవం.
పిల్లల ప్రవర్తనను, స్వభావాలను, మనస్తత్వాల మర్మమెరిగిన ఠాగూరు, బాల్యపు అందాన్ని, ఆనందాన్ని, కరుణార్ద్రతను, కపటం లేనితనాన్ని చిత్రీకరించడంలో అపూర్వమైన నైపుణ్యం చూపుతారు. అయితే, ఈ పిల్లలు ప్రధానపాత్రలుగా గల ఠాగూరు రచనలన్నీ పిల్లలకోసం రాసినవి కావు. పిల్లల తరుఫున పెద్దలకు నేరిన పాఠాలు. ప్రకృతిలో మమేకం అవడమే ఆ గాయపడిన పసిబిడ్డలు నేర్చిన బతుకుపాఠం. నేర్పుతున్న పాఠాలు.
‘దిగంతాల సముద్రాల ఒడ్డున ఎల్లలెరుగని పిల్లలు కలుసుకొంటున్నారు‘ (ఆన్ ది సీ షోర్). అలా, సర్వకాల సార్వజనీనత కలిగిన, ప్రకృతితో ముడిపడిన బాల్యం రవీంద్రుని సహజ కథన మూలకమవుతుంది. అందుకే కాబోలు ఎంతటి కారు మేఘం తన జీవితంపై ఆవరించి ఉన్నా, ఆ స్థితప్రజ్ఞుడు రవీంద్రులు అంటారు. ‘నా జీవితంలో కమ్ముకొంటున్న మేఘాలు, ఇక కుంభవృష్టిని మోసుకురావడం లేదు. వరదను తీసుకురావడం లేదు. నా సాయంసంధ్యకు రంగులద్దుతున్నాయి‘ (స్ట్రే బర్డ్స్ 1916).
కారుమేఘాలకు రంగులద్దగల నైపుణ్యం ఆ బాల్యపు చమత్కారం కాక మరేమిటి? బాల్యం ఒక ఉపశమనం. ఒక ఓదార్పు. ఒక ఆశ. ఒక నమ్మకం. అదుగో, రవీంద్రునిలో ఒక కన్న తండ్రి, ఒక పండిన తాతయ్య, ఒక ఉపాధ్యాయుడితో బాటు ఒక పసిబాలకుడు కనబడుతున్నారు.
అసలు, రవీంద్రుడు బొమ్మలగూటిని వదిలి వెళ్ళిందెపుడు?
అధస్సూచికలు