[2022-1-24 నాడు వ్రాయబడిన ఈ సమీక్షావ్యాసం ఈమాట పాఠకులకోసం పునర్ముద్రితం — సం.]
“కానీ, అలా పుస్తకం తగలబెడుతోంటే, సహజంగానే దుఃఖం ముంచుకొస్తోంది!” అని అన్నారు పెరుమాళ్ మురుగన్ తన నవల, మాదోరుబాగన్ (తమిళం, 2010) అనువాదం వన్ పార్ట్ ఉమన్ను (ఇంగ్లీష్ అనువాదం 2015) అతివాదులు నడివీధుల్లో కుప్పలు పోసి, తగలబెడుతోన్న కాలాన.
“పుస్తకాలు తగలబెట్టడం భలే సరదాగా ఉంటుంది,” అంటూ పుస్తకాలు మంటల్లో మండుతూంటే, ఆ మంటలార్పాల్సిన ఫైర్‌మ్యాన్, గయ్ మోంటాగ్, (Guy Montag) తనే స్వయంగా కాగితాలు మండి, మాడి మసి అయ్యేట్లుగా, పుస్తకాల కుప్ప మీదికి 451 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉష్ణోగ్రతలో మంటలను చిమ్మే, నిబద్ద అగ్నిమాపక ఉద్యోగిలా, తన వృత్తి గురించి మాట్లాడినపుడు.
అలా రే బ్రాడ్బరీ (Ray Bradbury) తన నవల,ఫారెన్‌హీట్ 451లో (ఇంగ్లీష్, 1953) ప్రధాన పాత్ర, మోంటాగ్‌ను పరిచయం రాస్తారు.
మొదటి ప్రస్తావన, మన పొరుగునున్న తమిళ రచయిత ఇటీవలి వాస్తవ స్వీయానుభవం అయితే, రెండో ప్రస్తావన రాబోయే డిజిటల్ యుగంలో కాలం చెల్లిందంటూ అచ్చు పుస్తకాలకు పట్టబోయే స్థితిగతులను ఊహిస్తూ, డెబ్బై ఏళ్ళ క్రితం, కాల్పనిక రచయిత బ్రాడ్బరీ 2049వ సంవత్సరం లోకి చూసిన చూపు.
సందర్భం ఏమైనా, అక్కడ పుస్తకాలు తగలబడ్డాయి!
రాసి, అచ్చేసి, అందించి, చదివి, దాచి, తరతరాలకు పదిలంగా అందించవలసిన, ఆ పుస్తకాలు మంటల్లో చిక్కుకొని, మాడి, మసి బొగ్గులయ్యాయి. బూడిద కుప్పలయ్యాయి.
ఈ విధాన, పుస్తకాలను తగలబెట్టడం, కాల్చివేయడం లేదా దహించడం, మానవ చరిత్రలో పుస్తకమంత పురాతనమైనది. అవి తోలు, వస్త్రం, కాగితం, మరో విధాన రాసిన రాతలయినా తగలబెట్టబడ్డాయి. మట్టి, రాయి మీద రాసిన రాతలైనా పగలగొట్టబడ్డాయి.
పుస్తకం, దానిని సృజించిన పుస్తకకర్త, ఆయాకాలాల నిషేధజ్వాలల కోరల్లో పడి, మాడి మసవుతూనే ఉన్నారు.
అది చైనా అయినా, బాబిలోనియా అయినా, మధ్యప్రాచ్యాన అయినా, శ్రీలంక అయినా క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్దంలో జెరోమియా బోధనలను తగలబెట్టారని, యూదు పవిత్రగ్రంథం తనఖా, చెబుతోంటే, క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దంలో వాటిని రచించిన కన్‌ప్యూషియన్ పండితులను సజీవ సమాధి చేసినట్లుగా వారి రచనలు తగలబెట్టిన వాడిగా చైనా క్విన్ వంశ స్థాపకుడు క్విన్ షి హువాంగ్,చక్రవర్తి, చరిత్రలో మిగిలాడు. ఆజ్టెక్, మాయన్, క్రిస్టియన్, బౌద్ధం, జైనం – ప్రపంచవ్యాప్తంగా వివిధ సందర్భాలలో పుస్తకాలు, గ్రంథాలయాలు తగలబెట్టబడ్డాయి.
సాధారణంగా, ఈ తగలబెట్టడాలన్నీ రాజకీయ, సాంస్కృతిక ఈర్ష్యాద్వేషాల్లో, స్వార్థసంకుచితత్వాల్లో, అహంకార అహంభావాల్లో వేళ్ళూనుకొని ఉంటాయి. యుద్ధాలు, రాజకీయాలు, మత విద్వేషాలు, తాత్త్విక విభేదాలు, ఆధిపత్య నిరంకుశత్వాలు — కారణాలు ఏవైనా, అక్కడ పుస్తకాలు తగలబడ్డాయి.
అలాగే, అన్ని తగలబెట్టడాలు ఒకటి కావు!
తమ ఘంటాన పుట్టిన బిడ్డలాంటి కావ్యకన్యకను, కూళలకివ్వలేక, కాటుక కంటి నీరు తుడవాలన్న నిబద్ధతలో, ఎన్నెన్ని తాటాకుదస్త్రాలు తగలబడ్డాయో మనకు లెక్కలేదు. నిరంకుశ పాలనావ్యవస్థలపై స్వేచ్ఛాజీవుల నిరసన ప్రకటన అది. కాలాల పొడవునా ఎన్నెన్ని స్వతంత్రభావనలు అలా అగ్నికి ఆహుతి అయ్యాయో! మన జైన బౌద్ధ వాజ్మయాలు ఏ మంటలలో ఆహుతి అయ్యాయో ఊహించనైనా ఊహించగలమా?
అయితే, అన్ని తగలబెట్టడాలు ఒక తరహా కావు.
“సృజించలేని వారు(నిర్మించలేని వారు) తగలబెట్టాలి. ఇది చరిత్రంత, బాలనేరాలంత పురాతనమైనది.” ముక్తాయిస్తాడు ప్రొఫెసర్ ఫేబర్ ఫారెన్‌హీట్ నవలలో.
నాజీ హయాంలో విశ్వవిద్యాలయాల్లో పుస్తకాలను తగలబెట్టడం ఆనాడు విద్యార్థిలోకాన వేళ్ళూనుకొంటోన్న నాజీ భావనకు ఒక పరాకాష్ట. ఫారెన్‌హీట్ నవల సైన్స్ ఫిక్షన్‌గా పరిగణించబడినా, ఆ నవలకు ప్రేరణ ఇలాంటి పుస్తకాల దహనకాండ అని ఇట్టే గ్రహించవచ్చును.
బడి వదిలి కళాశాలల్లో చేరిన విద్యార్ధులను, బాల్యం వీడని పసి బాలకులనుకొన్నా, చరిత్రలో అలాంటి, అప్పుడప్పుడే బాల్యం గడప దాటీదాటని విద్యార్థుల దురాగతం, దుందుడుకు చర్య, మే 10,1933లో ఆనాటి నాజీ ప్రేరిత జర్మన్ విశ్వవిద్యాలయాల్లో జరిగింది. ఐన్‌స్టీన్, ఫ్రాయిడ్, మార్క్స్, హెమింగ్వే, హెలెన్ కెల్లర్, హెచ్. జి. వెల్స్, కాఫ్కా — ఎవరి పుస్తకాలూ ఆనాటి మంటలను తప్పించుకోలేదు.
ఆయా పుస్తకాలను చదవవలసిన విశ్వవిద్యాలయ విద్యార్థులు, ఆయా చదువుల సారమెల్ల గ్రహించవలసిన విద్యార్థులు, ఆయా పుస్తకాలను కుప్పలు పోసి, ఆ విద్యాలయాల ప్రాంగణాలలో, జాత్యహంకారపు కోరల్లో, జాతి విద్వేషాల మంటల్లో, దగ్ధమవుతూ ఉన్న ఆ పుస్తకాల చితిమంటల చుట్టూ కేరింతలు కొడుతూ నాట్యాలు చేసారు. ఆ దుర్ఘటన ‘నాజీ బుక్ బర్నింగ్’ గా, సమీప చరిత్రలో ఒక అవాంఛనీయ దురాగతంగా, మనకు ఓ విషాద జ్ఞాపకంగా మిగిలిపోయింది.
పైన పేర్కొన్నవన్నీ వాస్తవంలోనైనా, కల్పనలోనైనా, నిర్బంధ నిరంకుశ అమానవీయ చర్యలుగా పరిగణించబడుతున్నాయి.
ఏ విధాన చూసినా, ఏ రకంగా తూచినా, అన్నిందాలా పుస్తకం తగలబెట్టడం మానవారోగ్యానికి హానికరం.
ఇలాంటి నేపథ్యంలో, పుస్తకాలు తగలబెట్టే పండగ చేసుకొందాం అని ఎవరైనా అంటే? అది శ్రీ వేలూరి వేంకటేశ్వరరావుగారు రచించిన ‘కావ్యదహనోత్సవం’ అన్న పుస్తకం అవుతుంది.
కానీ, ఇప్పటిదాకా ప్రస్తావించిన పుస్తకాలు తగలబెట్టడాలతో తరచి చూస్తే, ఈ కావ్యదహనోత్సవ పుస్తక వైఖరి వేరుగా ఉన్నది.
వాటన్నిటికీ భిన్నంగా, స్వచ్ఛందంగా, స్వయానా ఆ కావ్యాన్ని సృజించిన కృతికర్తే, తన రచనని తనే దహించేస్తున్నాను. “పండుగ చేసుకొందాం, రండోయ్ రారండోయ్ చూడండోయ్” అని, ‘కావ్యదహనోత్సవ ఆహ్వానం’ పంపితే, అందులోనూ ఆ బృహత్కార్యం వారి విశ్వవిద్యాలయ ఆవరణలోనైతే, అది తలపెట్టిన విద్యార్థులను మందలించి, వారి అల్లరిచిల్లరలు కట్టి పెట్టించి, వారికి మంచీసెబ్బర నేర్పాల్సిన మహోపాధ్యాయుల మధ్యనే అయితే, వారికి తోడు ఆ కావ్యాన్ని అంకితం అందుకొన్న కృతిభర్త వేదికెక్కి కృతికర్త పనికి వంత పాడబోతోన్నాడంటే, మీరేం చేస్తారు? మనమేం చేస్తాం?
ఇది ఉడుకు రక్తం దుందుడుకు చర్యా? లేదూ, ఆకతాయి కుర్రాళ్ళ ఉత్తుత్తి వేళాకోళమా?
అన్నట్టు, ఇది బృహత్కార్యమా? ఒట్టి ఘనకార్యమా? అసలిది చేయదగిన పనేనా? చేయవలసిన పనా?
అదండీ, ఈ చోద్యం! ఆ కావ్యమేమిటో ఆ దహనమేమిటో! మరి, చూద్దాం రండి! ఆద్యంతమూ!
‘కావ్యదహనోత్సవం’ ఒక ప్రహసనం. ఒక సాహిత్యసభ తరహాలో ప్రదర్శించిన వ్యంగ్యరూపకం.
‘కావ్యదహనోత్సవం’ గురించి అడపాదడపా వింటూ వచ్చాను. అలాంటి రచన ఒకటి ఉందని తెలుసు కానీ, పుస్తకంలా అచ్చయ్యిందని ఈ మధ్యనే తెలిసింది. వెంటనే చదవడానికి కొంత వెనకాడిన మాట వాస్తవం.
బహుశా ఆ శీర్షికలోని మొదటి పదం, ‘కావ్యం’ అన్న చోటే నా పఠనకుతూహలం కాస్తా చతికిలబడి ఉంటుంది.
అదేదో తలపండిన పండితుల వ్యవహారం కాబోలు, టీకాటిప్పణుల చేపట్టున ఆనుకొని, అర్థతాత్పర్యాలు తెలుసుకోవాలి కాబోలు అని అపోహపడడం వలన, నా పఠనాసక్తికి, అదుగోండి అలా శీర్షిక దగ్గరే అడ్డుకట్ట పడింది.
దానికి తోడు, మితిమీరిన, గతి తప్పిన, పుస్తక దహనకాండలకు ప్రేరేపించిన సంకుచిత నిరంకుశత్వంపై నిలువెత్తు నిరసన భావం ఉందయ్యే. ఆ నేపథ్యంలో, మరొక కావ్యదహనమా అని కూడా అనిపించేదేమో. లోలోన ఎక్కడో.
ఈ సవాలక్ష సందేహాలు, సంకోచాలు పుస్తకం చేతిలోకి తీసుకోగానే, ఒట్టివని ఇట్టే తేలిపోయాయి. రాతగాళ్ళం అనుకొనే వాళ్ళమంతా ఎవరి నెత్తిన వారు వేసుకోవాల్సిన మొట్టికాయలు మాత్రం ఠపీమని వచ్చి తాకాయి.
అయితే, ఎవరి రచనలను వారే తగలబెట్టుకోవడం కూడా సాహిత్యచరిత్రలో కొత్తమీ కాదు.
చార్లెస్ డికెన్స్ తన ఉత్తరాలు, డైరీలను, ఇతర రచనలతో ఏకంగా ఓ పెద్ద చలిమంట వేయగా, నికొలోయ్ గోగోల్ తన సుప్రసిద్ధ నవల “డెడ్ సోల్స్” ద్వితీయ భాగాన్ని తనే తగలబెట్టేసాడు. చెకోవ్‌స్కి (Pytor Ilyich Tchaikovsky, 1840-93) తన రాతప్రతి, ది వొయే వొడ,ది డ్రీం ఆఫ్ ఓల్గాకు రచించిన మ్యూజికల్ స్కోర్ రాతప్రతిని తగలబెట్టేసాడు. సాకీ అతని సోదరికి తన తదనంతరం తన రచనలను భస్మం చేసే పని అప్పజెబితే, తన రచనలను చదవకుండా తగలబెట్టమని కాఫ్కా రాసిన వీలునామా గురించి మనకు తెలుసు. ఇలా, వివిధ సందర్భాలలో, ఆ యా రచయితలు తమ తమ రచనల తదనంతర అచ్చుగతులను స్పష్టపరిచారు.
ఈ ‘కావ్యదహనోత్సవం’ అలాంటిది కాదు.
ఇందులోని ప్రధానపాత్ర, కృతికర్త, తన జీవితకాలంలోనే, తన పుస్తకానికి తనే స్వయంగా దహనసంస్కారాలు చేయదలుచుకొన్నాడు. కాగా, కవిత్రయ ఖ్యాతి జ్వాలల్లో పడి తిమ్మపూడి అమరేశ్వరుడివంటి కవుల రచనలు ఎలా దగ్ధపటలం అయ్యాయో ఈ పుస్తకం ప్రస్తావిస్తుంది. ఆ కృతికర్త తన కావ్యాన్ని స్వయంగా కాల్చేసారో లేక వేరెవరి చేతనైనా కాల్చబడిందో ఆ వివరాలేవీ మనకు తెలియదు కానీ, ఈ కృతికర్త మాత్రం పూర్తి స్పృహతో తన పుస్తకానికి దహనసంస్కారాలు చేసేయ్యాలని నిర్ణయించేసుకొన్నాడు.
అదుగోండి అక్కడ మొదలవుతుంది అసలు ప్రహసనం.
ఏమైనా, ఎప్పుడో చదవవలసిన ఈ’కావ్యదహనోత్సవం’ పుస్తకం, ఈ సంక్రాంతికి ముందు రోజున, అందరూ భోగిమంటల్లో చలి కాచుకొంటుంటే, నా దగ్గరికి పండుగ కానుకలా వచ్చి చేరింది.
మొదట పేజీలోనే అర్ధం అయ్యింది, మొదట దహించాల్సింది ఇన్నాళ్ళు నాలో పేరుకు పోయిన అపోహలనే అని.
నిజమే, ఈ పుస్తకం శీర్షిక సూచిస్తోన్నట్లుగా, ఇది కావ్యానికి, కవిత్వానికి, కవి లోకానికి, కవుల తీరుతెన్నులపై, కవిత్వ విమర్శపై ఎక్కుపెట్టిన వ్యంగ్యాస్త్రమే అయినా, ఇందులో లేవనెత్తిన అంశాలు కవిత్వానికే పరిమితం కావు. ఏ రచనకైనా, ఆ మాటకొస్తే ఏ కళాసృజనకైనా వర్తిస్తాయన్న సంగతి ఈ పుస్తకం చదవడం మొదలెట్టగానే, ఇట్టే తెలుస్తుంది.
ఈ పుస్తకం తలపండిన పండితులను ప్రేక్షకులను చేసి, ఆనాటి ఔత్సాహిక యువబృందం వేదిక ఎక్కి, వివరంగా విప్పి చెప్పిన ఆధునిక పాఠం. నిజాయితీగా, నిర్భయంగా.
‘ఇన్నోసెంట్లీ బ్రిల్లియంట్!’ అన్న ఒక్కమాటే అనుకొన్నాను. పుస్తకం ఆఖరు పుట దాకా చదవడం పూర్తి చేసేటప్పటికి.
నిజమే మరి, ఆరు దశాబ్దాల క్రితపు మాట. ఆనాటి యువబృందం ఎంత అమాయకంగా తమ మేధోప్రతిభను, వాదనాపటిమను ప్రకటించుకొన్నారు కదా!
అప్పటికి సాహితీవిమర్శలో వేళ్ళూనుకోని ఆధునికానంతర భావనలను వారు ఎలా ఆలోచించగలిగారు? వారి దుడుకు వాదనలను వారి గురువుల చేత ఎలా ఒప్పించగలిగారు? ప్రేక్షకులను ఎలా మెప్పించగలిగారు? వారి నియో రియలిస్టిక్ (నయా వాస్తవిక) నటనతో ఎలా ఆకట్టుకోగలిగారు?
దానా దీనా, కావ్యదహనోత్సవం ఒక చారిత్రక సందర్భం.
ఇటు సాహిత్యంలో అటు సాహితీవిమర్శలో, నిర్ద్వంద్వంగా.
ఈనాటి ఇరవై ఒక్కళ్ళ విద్యార్థులు, ఇంతటి సమాచారయుగంలో పెరుగుతూ కూడా, ఇంత స్పష్టంగా, నిబ్బరంగా, తొణుకూబెణుకూ లేకుండా తమ భావాలను వ్యక్తపరుచుకోగలరా అని ఓ పక్క ఆశ్చర్యపోతున్నా, అరవయ్యయిదేళ్ళ క్రితపు యువబృందంలో ఇంతటి ఆధునిక ఆలోచనలు ఎలా రూపుకట్టాయో తెలుసుకొంటున్న కొద్దీ ఎంతో విస్మయం కలుగుతుంది. వారి స్పష్టతకు, చొరవకు, మనోనిబ్బరానికి.
ఆనాటి అధ్యాపకులు విద్యార్థుల మధ్య మేధాసంబంధాలు ఎలా ఉన్నాయో పరిచయం కలుగుతుంది.
ప్రదర్శన చూస్తుంటే ఎంత హుషారు కలుగుతుందో గానీ, చదువుతున్నంతసేపూ తెలియకుండానే ఒక నవ్వు కదలాడుతుంది. ఈ ప్రహసనకారుడు చురుకైన వ్యంగ్యసంభాషణల్లో సునిశిత హాస్యం చక్కగా మేళవించారు మరి.
వేలూరిగారు వివరంగా రాసిన మున్నుడి ద్వారా, ఈ ప్రతీకాత్మక వ్యంగ్యరూపకం ఒక సాహితీ సంభాషణలో మొదలయ్యిందని తెలుస్తుంది. అబ్బూరి రామకృష్ణారావుగారు, బొమ్మకంటి శ్రీనివాసాచార్యగారు, వెల్చేరు నారాయణరావు గార్ల మధ్య జరిగిన సాహితీచర్చలో, ఈ రచన మూల భావనలు మొలకెత్తాయి. అ సంభాషణ సారాంశాన్ని వేలూరిగారు, తదితర ఏలూరు సాహితీ మిత్రబృందంతో వెల్చేరుగారు చర్చించడం, వారందరూ పూనుకొని ఒక ప్రహసన రూపకప్రదర్శనకి నాంది పలకడం, వెంటవెంటనే జరిగి పోయాయి. వేలూరిగారే వివరించినట్లుగా, వెల్చేరుగారి ప్రోద్బలంతో ఈ నాటకం వేద్దాం అనుకొన్నారు. ఆనాటి ప్రదర్శనకై స్క్రిప్ట్ రాసుకోలేదు కనుక ఈ ప్రదర్శన తొలిప్రతి అలభ్యం.
శంకరమంచి సత్యంగారు కృతికర్తగా, వేలూరిగారు కృతిభర్తగా, వడ్లపట్ల దయానందంగారు సభాధ్యక్షుడిగాను, మొదటిసారి 1957లో ఏలూరులో ఈ ప్రహసనాన్ని ప్రదర్పించారు.
1960 ఆరంభంలో, వేలూరిగారు ఆంధ్రవిశ్వవిద్యాలయంలో న్యూక్లియర్ ఫిజిక్స్ ఉన్నత విద్యార్థిగా ఉన్న రోజుల్లో, తమ తొలి ప్రయత్న విశేషాలను, ప్రేక్షకుల స్పందనను బొమ్మకంటి శ్రీనివాసాచార్యగారితోనూ, తన మిత్రులతోనూ పంచుకోవడంతో, మరొకమారు ఈ ప్రహసనాన్ని ప్రదర్శిస్తే బావుంటుందేమోనన్న ఆలోచన వారందరిలో సహజంగా మొదలయి, బలపడిన క్రమాన్ని వివరిస్తారు.
విశ్వవిద్యాలయ వేదికపై ప్రదర్శించాలన్న తలంపుతో, దృష్టితో, స్క్రిప్ట్‌ను రాసి, అదే ఏడాది డిసెంబరు నాటికి సుమారు వెయ్యిమంది ప్రేక్షకుల ముందు, కావ్యదహనోత్సవాన్ని ప్రదర్శించారు.
ఈ రూపక రచన ఎలా సంభవించిందో, అంచెలంచెలుగా దానిని ఎలా మెరుగుపరుచుకొంటూ పోయారో, వేలూరిగారే స్వయంగా తమ ముందుమాటలో వివరించారు. ఆ వివరణతో పాటే, కొట్టివేతలు, దిద్దుళ్ళు, సవరణలతో సహా చేతిరాతలో ఉన్న రాతప్రతినీ, ఏ పేజీకి ఆ పేజీ ఈ పుస్తకంలో అచ్చువేయడం విశేషం.
ప్రత్యక్ష పాత్రలు వేదిక మీదున్న కృతికర్త, కృతిభర్త, సభాధ్యక్షుడు, సభా (నిర్) వాహకుడు. వీరు కాకుండా ప్రార్ధనా గీతం పాడి, చేయని ఉపన్యాసం చదివే వ్యక్తి ఒకరు. పరోక్ష పాత్రలేమో, చేయని ఉపన్యాసకర్త, పాఠక విమర్శకుడు.
మరొక ముఖ్య పరోక్షపాత్ర కృతికర్త పినతల్లి కూతురు, విద్యార్థిని. ఆ పినతల్లి కూతురు వేదిక మీదో ముందో ఎక్కడా కనబడక పోయినా, ఈ ప్రహసనంలో ప్రస్తావనకు వచ్చే ఏకైక స్త్రీ పాత్ర. ఆమె ప్రభావం చేతనే, కృతికర్తకు నిర్ణయాలు స్పష్టపడ్డాయి. తాను రాసిందే మహాకావ్యమనీ, తానే మహాకవిననీ విశ్వసించే కృతికర్త నమ్మకాలన్నీ ఒక్క సారిసారిగా తలకిందులయిపోయాయి. అలా ఈ సాహసానికి మూలకారణం ఆ పినతల్లి కూతురు చేయించిన తలంటు స్నానమే కదా!
అలాగే, ఇతర పరోక్షపాత్రలు సాహితీ పీఠాధిపతి, హైస్కూల్ హెడ్ మాష్టారు.
రావిశాస్త్రిగారివంటి సాహితీవేత్తలు సభలో ప్రేక్షకులుగా కూర్చుని ఉండగా, అచ్చమైన సాహితీ సభలా నిర్వహించిన ఈ ప్రహసనం ఏమిటో చూద్దాం.
అసలు ఈ కావ్యదహనోత్సవం మూలం ఏమిటో, అధ్యక్షుడి ప్రారంభోపన్యాసంలో పరిచయం చేస్తారు.
“అచ్చుయంత్రం వేల, లక్షల పుస్తకాలు ప్రజల మీదకు పడేస్తున్నది. ఈ యాంత్రికయుగంలో ఎప్పటికైనా గ్రంథ దహనోద్యమం ప్రారంభం కాక తప్పదు.”
ఎందుకంటే, “అచ్చు యంత్రాలు లేని రోజుల్లో, మంచి గ్రంథాలు నిలిచి చెత్త గ్రంథాలు పోయేందుకు ఎవరూ ప్రత్యేకంగా శ్రద్ధ వహించాల్సిన అవసరం లేకపోయేది. గ్రంథంలో గుణం లేకపోతే లేఖకులు తిరిగి రాసుకొనే వారు కారు.” అంటే, ఈ కావ్యదవానోత్సవం పొల్లు గింజల్ని చెరిగివేసి, ఆ తప్పులనీ తాలుల్నీ తగలేసి, గట్టి ధాన్యాన్ని కుప్పవేసుకొనే ప్రక్రియ అన్నమాట.
“మనిషి పుట్టక మునుపు గర్భాదానంనుంచి మొదలుపెట్టి, మరణానంతర అంతిమసంస్కారంవరకూ, పదహారు సంస్కారాలు (షోడశ కర్మలు) చేయడం సాంప్రదాయం పాటించేవారి ఆనవాయితీ”, అధ్యక్షుడి మాటలను మరింత బలపరుస్తూ ప్రధాన వాహకుడు అంటాడు,” కావ్యం పుట్టక ముందే కృత్యభ్యర్థనోత్సవంతో ప్రారంభిస్తున్న ఈ కావ్యజాతికి షోడశ కర్మలు ఎందుకు జరపకూడదు?”
“నన్నయ్యకు ముందే చాలా కావ్యాలు ఉండి ఉండాలి. అలా పుట్టి ఉంటే, అవన్నీ చనిపోయాయని ఒప్పుకోక తప్పదు కదా! ఎన్ని వందల వేల కావ్యాలు పుట్టి మరణించాయో మనకు తెలియదు. చచ్చిపోయినవి చచ్చిపోగా, మిగిలి ఉన్నవే మన దాకా వచ్చినాయి.”
అదండీ తెలుగు సాహిత్య సంక్షోభం అనదగ్గ Y1K సమస్య ప్రస్తావన. అట్లా ఉన్నవన్నీ తగలేసుకొని, నన్నయ్యను ఆదికవిని చేసి ఊరుకొన్నాం కదా. అయినా, ఉన్న పళంగా పుస్తకాలు తగలబెట్టడం అంటే మాటలా?
ముందుగా వేదిక మీద సభాధ్యక్షుల మాట విందామా?
“బతికినన్నాళ్ళు వ్రాసిన కావ్యాల్లో ఎవడి కావ్యం చెడ్డదని అన్నా, మనని వాళ్ళు చచ్చినా బతకనీయరు. ఏ ఒక్కడు రాసిన కావ్యాన్ని ఇంకొకడు తగలబెట్టడానికి మన రాజ్యాంగం సమ్మతించదు.”
మరెలా చెత్తను తగలెయ్యడం?
“ఆయా కృతికర్తలే ముందుకు వచ్చి, ఎవరికి వారు ఆత్మశుద్ధితో ఆనెస్టుగా, తమ తమ కావ్యాలని పరీక్ష చేయించుకొని, వాటిలో క్షుద్రకావ్యాలని తేలిపోయిన వాటినన్నింటినీ నిస్సంకోచంగా దహనం చేయడం,” ఎంత అపూర్వమైనా, అనాలోచితం ఎంత మాత్రం కాదని గ్రహించాలి.
అదండీ ఈ ప్రహసనం ప్రధానంగా చెప్పదలుచుకొంది.
గంతకు తగ్గ బొంతలా కృతికర్త తన కావ్యాన్ని తగలబెట్టాలని నిశ్చయించుకొంటే, ఆ కావ్యాన్ని ఎంత ఉత్సాహంగా అంకితం తీసుకొన్నాడో, అంతే ఉత్సాహంగా తగలబెట్టడానికి వచ్చారు కృతిభర్తగారు!
కావ్యాన్ని తగలబెట్టుకొంటే పెట్టుకొంటే పెట్టుకొన్నాడు కానీ, పనిలో పనిగా, ఆ కావ్యం గురించి, కృతిభర్త ఉదారత్వం గురించి నలుగురూ చేసిన పొగడ్తలను కూడా తగలబెట్టడం మాత్రం వారికి చివుక్కుమనించింది. కృతిభర్తలోని ఈ “దింపుడు కళ్ళం ఆశ”ను అధ్యక్షుల వారు ప్రస్తావిస్తూనే, పుస్తకాన్ని తగలబెట్టబోయే ముందు ఆ ఆఖరి ఏడుపేదో ఏడవమని కృతికర్తను “అంత్యాలాపన” చేయడానికి ఆహ్వానిస్తారు గౌరవనీయ అధ్యక్షుల వారు.
ఇక కృతికర్త వంతు. తన కావ్యం, అగ్నిశంఖాన్ని ఎందుకు దహనసంస్కారాలు చేయాలని అనుకొన్నాడో పాఠకులకు, అదేనండి ప్రేక్షక మహాశయులకు, వివరణ ఇచ్చే సమయం.
“సత్యనిష్ఠ, సాహితీ ప్రీతి కలిగి, సాహిత్య సమస్యలని నిష్కపటంగా చర్చించే ఉదాత్త సాహితీసభ”లు ఉండడమే మహద్భాగ్యం అంటూ, తానెలా కవినయ్యాడో, ఆ కావ్యాన్ని ఎలా రాశాడో, ఎలా అంకితం ఇచ్చాడో అతను చెపుతూ పోయాడు.
“విలపామి” అన్న ఖండకావ్యంతో కవిగా అవతరించాడు. “నీవు మహాకవివి. అచ్చం షెల్లీ పద్యాలకు మక్కికి మక్కీగా ఉన్నాయి!” అని పొగిడారందరూ.
పైకి అనలేదు కానీ, ఆ కావ్యం పి. బి. షెల్లీ ‘ఎడొనాయిస్’కు అనువాదమే కదా. “స్వంతం అని రాసిన ప్రతి పద్యానికి, గేయానికి ఏదో ఒక ఆంగ్లమూలం ఉన్నది.” అలా “ఛందః కవిత్వంలో సాహిత్యోద్యమంలో” ఎలా దిగబడ్డాడో వివరించాడు. వెంటనే కవుల యూనిఫార్మ్, ట్రేడ్ మార్కులయిన, “గ్లాస్కో పంచలు లేదా పెద్ద జరీ పంచలు, శాండో బనీను, తెల్లటి మల్లెపూవులాంటి లాల్చీలు, నగిషీ చెక్కిన చెప్పులు” అతని వంటిమీదికి వచ్చి చేరాయి.
“సర్వ యువకవి బంధువు” అయిన “పీఠాధిపతి” ఒకరు పీఠికతో సత్కరించాడు. “తన గీతి అరవజాతిని పాటకులుగా తీర్చి దిద్దిన తెలుగు వాణి” అని పొగిడించుకొన్నాడు.
ఇక, ఆ కావ్యం అచ్చుకయ్యే ఖర్చునిచ్చి, పుస్తకావిష్కరణ మండపంలో వెయ్యిన్నూట పదహార్లు చదివించిన గోపాలరెడ్డికి ఆ ‘అగ్నిశంఖం’ కావ్యాన్ని అంకితం ఇచ్చాడు.
మనలో మాట! ఆ లెక్కన, పాపం ఆ కృతిభర్త కన్యాశుల్కం చెల్లించుకొన్నాడన్న మాట!
అంతా బాగానే ఉందిగా, మరి ఉన్నట్టుండి, ఇలా ఉత్తి పుణ్యానికి ఆ కృతికర్త తన కావ్యాన్ని ఎందుకు తగలబెట్టాలనుకొన్నాడు?
“నా రచనల మీద మమత్వం చాలారోజులు నన్ను అంధుణ్ణి చేసింది.”
అదుగోండి అప్పుడే, అలా గుడ్డివాడయినప్పుడే అదే విశ్వవిద్యాలయ విద్యార్థిని అయిన కృతికర్త పినతల్లి కూతురు ఘాట్టిగా మొట్టికాయేసి, ఆ పై అతని నెత్తిన పాలు పోసింది! కళ్ళు తెరిచి తనను తాను చూసుకొనేలా చేసింది. ‘చిన్న పిల్ల అయితేనేం’ గంటసేపు వాదించేసి, కృతికర్త మెడలో గంట కట్టేసింది.
అంతకు మునుపే, ఒక సాహితీ సభాధ్యకుడైన హెడ్మాష్టారుగారు ఓ వాడి ప్రశ్న విసిరేశారు. చీకట్లోకి బాణం వేసినట్లుగా, “బాబూ! అన్నన్ని మాటలు వాడావు. వాటన్నిటి అర్థాలు నీకు తెలుసునా?” అన్నాడు.
ఆ ప్రశ్న ఎలాంటిదంటే, అప్పుడు కదా అకవిత్వపు కుహరంలో పడి, గాఢాంధకారంలో మునిగిపోయి, అదే లోకం అనుకొంటున్న వాడి కళ్ళముందు మిరుమిట్లు గొలిపి, ఆ పాకుడు బావిలోంచి కృతికర్త జుట్టుపట్టి లాగి మరీ క్షేమంగా బయటపడేసినటువంటి ప్రశ్న అప్పుడు కదా కృతికర్తకి, “కవిత్వానికి కూడా ఆలోచించాలని తోచింది. మాటలకు అర్థాలు తెలియాలనిపించింది.”
“ఈ పీడకల లాంటి తన అనుభవానికి” మూలమేమిటో కూడా అతను గ్రహించినట్టే ఉన్నాడు.
“వందల ఏళ్ళు మనం దాస్యంలో ఉండడం వల్లనయితేనేమి, మన స్వబుద్ధితో ఆలోచించే అలవాటు ఎప్పుడో వదిలేయడం వల్లనయితే నేమి, మనం కృతకమైన బ్రతుకులు బ్రతకడానికి అలవాటుపడ్డాం. వెనకటి తరం వాళ్ళని నిందించి ప్రయోజనం లేదు.ఇక ముందయినా, నాటకాల్లో పాత్రల్లా బ్రతికే ఈ పద్ధతికి స్వస్తి చెప్పాలి.”
అదండీ అసలు సంగతి.
పై నుంచి కృతికర్త అంటున్నాడు కదా, “ఇది ప్రజాస్వామ్యం. ఎవరికి వాడే సర్వజ్ఞుడు.”
ఇక సాహిత్యానికి, సాహిత్యకారుడికి పనేం ఉంది?
అసలే కవి. కవిత్వం వదిలేస్తే, ఆ పై మరేం చేస్తాడు? అన్న సందేహానికీ, అడక్క ముందే అతనే జవాబిచ్చాడు.
“సాహిత్యంతో సంబంధం పెట్టుకోను అంటే, ఇక సినిమాలకి మాటలు పాటలు రాస్తాననుకోనని కాదు. ఆ పని చెయ్యను!” అని హామీ కూడా ఇచ్చాడు.
అదుగోండి అక్కడే, ముందు వరసలో కూర్చున్న రావిశాస్త్రిగారికి కోపం వచ్చింది. ఆ ఒక్క వాక్యం శ్రీశ్రీని ఉద్దేశించినట్లుగా ఉందని, కుర్రాళ్ళ వేళాకోళాలకి హద్దుపద్దూ లేదా అని అన్నట్టుగా వారు అసహనంతో కొంత చిర్రుబుర్రులాడారట. ప్రహసం ప్రదర్శన పూర్తయ్యాక, వేదిక మీద ప్రేక్షక స్పందన చెప్పేటప్పుడు. పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఎంత మాటంటే అంత మాట అనేయడమే! హన్నన్న!
అసలే కుర్రకారు. ఆ పై అభ్యుదయవాదులు. ఎవరిని మాత్రం వదులుతారు? అదీ, వ్యంగ్యానికి ఉన్న బలం!
ఈ రూపకంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న ప్రతి ఒక్కరూ, ఆ దరిమిలా తెలుగు సాహిత్యం అభ్యుదయపథాన సాగడంలో ముఖ్యపాత్ర వహించినవారే.
మరి, ఇంత బాహాటంగా కావ్యసన్యాసం చేసిన కవి ప్రసంగం, లా పాయింటులు తీసిన పాఠక ప్రతినిధి మాటలు విని, అధ్యక్షుల వారు ఊరుకొంటారా? అడగాల్సిన ఒక్క మాటా అడిగేసారు.
“తెలివైన బుద్ధిమంతులయిన యువకులందరికీ సాహిత్యద్వేషం కలిగిస్తే, ఈ తెలుగు సాహిత్యం గతి ఏమయిపోతుంది?”
కవి తిలోదకాలు ఇచ్చేసాడయ్యే, ఆ ప్రశ్నకు సమాధానం అతని నుంచేం వస్తుంది. అది, ప్రేక్షకుల్లో కూర్చుని ఉండి, వేదిక మీదకు రాసి పంపిన ఒక పాఠకుడి చిట్టీ(నోట్) నుంచి వచ్చింది.
“రాసుకొన్న కవి అయితే మాత్రం అచ్చు వేసి జనాల మీదకి వదిలిన తరువాత తనకి తగలబెట్టే హక్కు ఉందా? ఆయన్ని ఒరవడిగా పెట్టుకొని, కవితాకళని ఉపాసిస్తున్న మాలాంటి వాళ్ళని పరిహసించడానికి, కావ్యాలలో మంచీ చెడ్డలని నిర్ణయించే హక్కు మహాజనానిదే కానీ మరెవ్వరికీ లేదు! కావ్యం అచ్చు వేసిన తరువాత ఆ కావ్యం అకావ్యం అనే హక్కు అతనికి లేదు”.
ఇక, ఈ కావ్యదహనోత్సవ సభకు తిలాంజలి పలికిన ఆఖరి ప్రధాన (నిర్) వాహకుడు, పాఠకుని అభిప్రాయానికి స్పందిస్తూ, సభను ముక్తాయించారు. “ఈ రామారావులాంటివారే ఈనాడు సాహిత్య రంగంలో అవ్యవస్థకు మూలకారణమనీ, కవి గారి కావ్యాల మీద ఆ కవిగారికే లేని అభిమానం, ఈయన కెందుకు?” అంటూ.
ఇది వీర పాఠకులు అందరిపైనా వేసిన చురక. చదివినా చదవకపోయినా, ఆ కావ్యం విలువెంతో, ప్రయోజనమేమిటో, ప్రభావమేమిటో తెలియకపోయినా, ఆ ఉత్తుత్తి కావ్యాన్ని తమ నెత్తిన పెట్టుకు ఊరేగే వారు అన్ని కాలాల్లో ఉంటారు కదా. భజనబృందం లాగా, వారిని చెళ్ళున చరిచిన చరుపు.
సరిగ్గా ఇక్కడే, ఈ ప్రహసనంలో టి.యెస్. ఎలియట్ ప్రస్తావన సముచితం అనిపిస్తుంది. రోలాన్ బార్తా పాఠక ప్రధాన వాదనకు ప్రతివాదనగా వారు చేసిన ‘ఇంటెన్షనల్ ఫాలసీ’ గుర్తొస్తుంది.
పాఠకదృష్టి ఎంత సులువుగా ప్రభావితం కావచ్చో కదా, మరి సాహిత్యం విలువలను నిర్ధారించడానికి కేవలం పాఠకదృష్టి ప్రామాణికం అవుతుందా? అదీ ప్రశ్న.
అందుకే, నన్నయ్యనుంచి ఎలియట్ దాకా వేలూరిగారు ఈ ప్రహసనంలో చేసిన ప్రస్తావనలు, ఉల్లేఖనాలు నన్నెంతగానో ఆశ్చర్యపరిచాయి. ఎప్పుడో ఆరుదశాబ్దాల క్రితం, ఏలూరులోనూ విశాఖ తీరాన, ఇంకా పట్టభద్రులు కాని కుర్రాళ్ళలో ఇంతటి విమర్శా, దార్శనికతా అని. ప్రపంచ సాహితీవిమర్శలో ఈ సిద్ధాంతాలు రాక మునుపే, ఈ ఆలోచనలన్నీ ఎంత సహజంగా చేశారో కదా అని ముచ్చట పడకుండా ఎలా ఉండగలను?
కాగా, రామారావుగారికి అభిమానం ఎందుకో కాలం నిరూపించింది. ఆనాడు సామాన్య పాఠకుడి తరపున గొంతెత్తిన ఆయన సుప్రసిద్ధ భాషాశాస్త్రజ్ఞుడు (లింగ్విస్ట్), సాహితీ విమర్శకుడు చేకూరి రామారావుగారు కావడం యాదృచ్ఛికం కాదు. తన చేరాతలతో ఆనాటి బాధ్యతాయుత పాఠకస్పూర్తిని కొనసాగించారు కదా!
కృతికర్త న్యూక్లియర్ ఫిజిసిస్ట్, భౌతిక శాస్త్రజ్ఞులు, అధ్యాపకులైన శ్రీ వేలూరి వేంకటేశ్వరరావు గారయితే, కృతిభర్త సామాజిక శాస్త్ర అధ్యాపకులు బంగోరెగా సుప్రసిద్ధులయిన బండి గోపాలరెడ్డిగారు, సభాధ్యక్షులు మేడేపల్లి వరాహ నరసింహ స్వామిగారు తెలుగు భాషా సమితి వేదాంత విభాగంలో సంపాదకుడు. ప్రధాన వాహకుడు ఎ. సత్యమూర్తిగారు సభకు ‘తిలాంజలి’ పలికితే, ఈ సభను శ్రీశ్రీ “చేదుపాట”తో మొదలు పెట్టారు సి. సత్యనారాయణగారు. ఈ రచనకు సహకారం అందించిన వారు శ్రీ బొమ్మకంటి శ్రీనివాసాచార్యగారు. వెల్చేరు నారాయణరావు అందించిన ప్రోత్సాహానికి, ఈ రాతప్రతిని భద్రపరిచి ఉంచిన పెన్మత్స సూర్యనారాయణ రాజుగారికి ధన్యవాదాలు.
ఈ ప్రదర్శన జరిగినపుడు వీరందరిలో చేకూరి రామారావుగారు ఒక్కరే తెలుగు విద్యార్థి కావడంతో, ఆఖరు నిమిషాన వారిని వేదిక మీదకి వద్దని నివారించి, వారి మాటలను మరొకరు చదివేలా చేసిన ఆనాటి విశ్వవిద్యాలయ పరిస్థితులు కూడా అర్థం చేసుకోవాలి. అప్పటికీ ఇప్పటికీ, వివిధ విభాగాల అధ్యాపకుల రాజకీయాలలో విద్యార్థులు నోరువిప్పలేని పరిస్థితుల గురించి. వారి భవిష్యత్తుకు భంగం కాకుండా, వారి అభిప్రాయలను వ్యక్తపరుచుకొనే మార్గాలను, వెసులుబాటును కల్పించిన వారి శ్రేయోభిలాషులయిన అధ్యాపకుల ఔన్నత్యం గురించి తెలుస్తుంది. ఆ గౌరవంతోనూ, ఆ కృతజ్ఞతతోనే కదా, విజ్ఞులైన వేలూరిగారు బొమ్మకంటి శ్రీనివాసాచార్య గారిచ్చిన సహకారాన్ని ఎంతో వినమ్రతతో, ఈ పుస్తకం శీర్షికలోనే ప్రకటించారు.
ఇక, బంగోరె గారి పేరు సాహిత్య పోషకులయిన, అప్పటి ముఖ్యమంత్రి, సాహితీవేత్త బెజవాడ గోపాలరెడ్డి గారిని పోలి ఉండడం, వారు అప్పుడు ప్రభుత్వ ప్రతినిధిగా ఉండడంవల్ల, ఈ వ్యంగ్య రూపకానికి సహజ చమత్కారాన్ని అబ్బింది.
ఈ రచనను చదవగానే, మొదట గుర్తొచ్చింది. రోలాఁన్ బార్తా (Roland barthes) ది డెత్ ఆఫ్ ఆథర్ (1967). ఆ వెంటనే, ఖలీల్ జిబ్రాన్ సుప్రసిద్ధ ‘ప్రాఫెట్’ లోని ‘ఆన్ చిల్డ్రన్ (1923).
ఎందుకంటే, ఈ ప్రహసనంలో ఎంతో యథాలాపంగా ప్రస్తావించిన విలపామి, షెల్లీ ‘ఎడొనాయిస్’కు (1821) మచ్చుకు మచ్చు అనువాదం అని చెప్పుకొన్న ఆ విషాదగీతి ఇలా మొదలవుతుంది.
“నేను ఎడొనాయిస్ కోసం విలపిస్తున్నాను.
అతను మరణించాడు.”
అవును. కవి మరణించాడు. కవి మరణానికి కారణమెవ్వరు?
ఆ నేపథ్యంలో, వేలూరిగారు ఈ “కవి మరణించాడు” కవితను యథాలాపంగా ప్రస్తావించారని అనుకోలేం కదా? అయితే బార్తా ‘రచయిత మరణించాడు’ అన్న వ్యాసం ఆ తరువాతెప్పుడో వచ్చింది. ఈ సిద్ధాంతం ప్రధానంగా చెప్పేది. ఏ రచన అయినా పాఠకుల పఠన సృజనతోనే పూర్తవుతుంది అని. ఒక రచన అర్థాన్ని, అంతరార్థాన్ని, పరమార్థాన్ని నిర్ధారించేది పాఠకులేననీ, ఇకపై రచయిత పాత్ర, ఆ రచనను రచించడంతో ముగుస్తుందని చెప్పాడు.
అవును. కవి మరణించాడు. కీట్స్ మరణవార్త వినగానే షెల్లీ విషాద స్పందన ఆ కవిత. ఆ దరిమిలా షెల్లీ కవితే కదా కీట్స్‌ను చిరంజీవిని చేసింది. సున్నితమనస్కుడైన కవిని ఘాటైన విమర్శకులు ఎలా నిర్దాక్షిణ్యంగా మాటలతో తగలబెట్టగలరో ఎలుగెత్తి లోకానికి చెప్పినవాడు షెల్లీనే కదా. విమర్శకులు కీట్స్‌ను చితిమంటల్లోకి పడేస్తే, పాఠకులు అతనిని పాలపుంతల్లో పొదిపి, పూలపల్లకీల్లో ఊరేగించారు.
ఆ సందర్భంలో సాహిత్యం, సాహితీకారులు, సాహితీవిమర్శలపై విస్తృతంగా జరిగిన చర్చలు వాదోపవాదాలన్నీ ఒక్కసారిగా గుర్తుకొచ్చాయి.
కవి, అకవి, కుకవి, సుకవి, మహాకవి అని తీర్మానించేది ఎవరు?
ఈ ‘కావ్యదహనోత్సవం’లో తనను తాను మహాకవిని అనుకొన్న కవిగారు, అకవిగా ప్రకటించుకునే క్రమంలో, అనేక మౌలిక ప్రశ్నలు లేవనెత్తుతారు. వాటి సమాధానాలను స్వయంగా ఎవరికి వారిని అన్వేషించమని ప్రేరేపించడమే ఈ ప్రహసనం నిర్వర్తించిన సాహితీ ధర్మం.
ఆ నేపథ్యంలో, వేలూరిగారు ఈ “కవి మరణించాడు” కవితను యథాలాపంగా ప్రస్తావించారని అనుకోలేం కదా?
తన కావ్యానికి దహనసంస్కారాలు చేస్తూనే, ఇక సాహిత్యంతో సంబంధం పెట్టుకోనని, కవిగా తన మరణాన్ని ప్రకటించాడు కదా ఈ కృతికర్త.
అయితే, అందుకు భిన్నంగా ఈ ప్రహసనం రచననూ, రచయిత జీవించమని చెబుతుంది. ఆరోగ్యకరంగా, పటిష్టంగా.
“నిష్కపటంగా, సత్యనిష్ఠతో, సాహితీ ప్రీతితో” జీవించమని నిర్దేశిస్తుంది.
ఇంత లోతుపాతులున్న రచన కాబట్టే కదా, ఈ ‘కావ్యదహనోత్సవం’ ఒట్టి వేళాకోళం అని కొట్టి పారేయలేకపోవడం. మళ్ళీ మళ్ళీ తరిచి చూడడం.
కావ్యరచనకు కావలసింది పైపైన తెచ్చిపెట్టుకొనే కృత్రిమాలు కావనీ, “కవుల యూనిఫాంలు, ట్రేడ్ మార్కులు, ఛందః కవిత్వం, కృతిభర్తలు, సాహిత్యపీఠాలు, వాటి పీఠాధిపతులు, ఇవేమీ అవసరం లేదని చెబుతుంది.
ఈ కావ్యదహనోత్సవానికి వేసిన ఆహ్వానం, ఆ ఆహ్వానానికి తిరుగు టపాలో, “విష్ ది క్రిమేషన్ ఏ సక్సెస్” అంటూ శ్రీశ్రీ అంతటి వారి టెలిగ్రాం స్పందన. అన్నట్లు, ఆ కాలాన టెలిగ్రాం వచ్చిందంటేనే మరణవార్త మోసుకొచ్చినట్టు. ఆ చమత్కారం చూడండి. ఏదో కాలేజీ కురాళ్ళ వేళాకోళం అనుకోకుండా, ఏ కార్డ్ ముక్కో రాసిపడేయకుండా, శ్రీశ్రీ ఎంత చతురతో, సమయస్ఫూర్తితో స్పందించారో.
ఈ ప్రహసనంలోని కథన ప్రయత్నాలు కొత్తగా ఉన్నాయి. కల్పనకు వాస్తవానికి మధ్యన హద్దులు చెరిగిపోయాయి. ఈ కథన చమత్కారం వలన, వేదిక మీద జరుగుతోన్నది ఉత్తుత్తి ప్రహసనం కాదు, నిజంగా జరుగుతుంది అని అనిపిస్తుంది. పాత్రలన్నీ ఆయా నటుల నిజనామధేయాలతో ఉన్నాయి.
సంభాషణలన్నీ ఎవరికి వారు అప్పటికప్పుడు సహజంగా మాట్లాడుతున్నట్టుగా ఉన్నది. ఎవరైనా రచయిత రాసిన స్క్రిప్ట్‌కు అనుగుణంగా వేదిక మీద సాగుతోన్న నటన అని తోచదు. ఈ కథనప్రయోగం అర్ధం అవుతోన్నకొద్దీ, ఈ రచన ప్రాధాన్యత తెలుస్తుంది.
ఉదాహరణకు, చేకూరి రామారావుగారి పాత్ర. పాఠకుడి పాత్ర. ఒక సాహిత్యాభిమాని పాత్ర.
రామారావు అన్న పేరుతోనే ప్రేక్షకుల మధ్యనుంచి ఒక చీటీ పంపడంవంటివి యథాలాపంగా, గంభీరంగా జరుగుతుండడంతో, అదొక కల్పన అనీ, వేళాకోళం చేస్తున్నారనీ, వ్యంగ్యాలు పడుతున్నారనీ అనిపించడం కన్నా, ఒక యథార్థ సభాసందర్భంలాగానే ఉన్నది.
ఈ కథనవిధానం గమనిస్తుంటే, ప్రపంచయుద్ధాల అనంతరం సినిమాలలోనూ, ఇతర ప్రదర్శన కళల్లోను ఉప్పెనలా వచ్చిన ఇటాలియన్ నియో రియలిజం గుర్తుకు వచ్చింది.
అందులోనూ, వేలూరిగారు ప్రహసనం మూలప్రతిని తయారు చేసి, ఎవరి సంభాషణను వారు అవగాహన వేసుకొని, చర్చించి, ఆయా నటులు వారి భావాలకు, భాషకు తగ్గట్టుగా, ఆ సంభాషణలో మార్పులు చేర్పులు చేసుకొనేట్టు ప్రోత్సహించారు. ఇదెంత ప్రజాస్వామిక పద్ధతి! ప్రజానాటకానికి ఇలాంటి స్వేచ్ఛ మూలం కాదా!
ఇక, ఎవరి వేషభూషలు వారివే. దానితో, అక్కడ జరుగుతున్నది వాస్తవమేనన్న భావన ప్రేక్షకులకు కలగడంలో ఆశ్చర్యం ఏముంటుంది?
ఆ విధంగా బహుశా తెలుగులో నయా వాస్తవిక నాటకాలకు ఈ ప్రహసనం శ్రీకారం చుట్టిందని అనవచ్చునేమో.
మరి నిజంగానే, అగ్నిశంఖం కావ్యాన్ని వేదిక మీద చింపి పోగులు పెట్టి, అగ్గిపుల్ల గీసి తగలబెట్టారా? ఆ వెయ్యిమంది ప్రేక్షకుల సాక్షిగా? అసలు అగ్నిశంఖం అన్న కావ్యం నిజమా? అదీ కల్పనేనా? అన్న సందేహాన్ని తొలగించడానికి మచ్చుకు రెండు కవితలు చదివి మరీ వినిపిస్తారు, పాఠకులుగారు. అవి ఇలాంటి అలాంటి కవితలు కావు మరి!
అంత మాత్రాన ఆ కావ్యం నిజమేని నమ్మలేం కదా? కళ్ళారా ఆ పుస్తకం ప్రతిని చూడాల్సిందే. ఒక్క ప్రతినైనా అట్టిపెట్టనంటున్నారే ఆ కృతికర్త. అగ్నిశంఖం నిప్పులపాలయినట్టేనా?
నిజానిజాలు తెలియాలంటే, ‘కావ్యదహనోత్సవం’ చదవాలసిందే! మరో మార్గం లేదు.
అయినా, సాహితీ చెత్త పేరుకుపోవడంలో తప్పు నాది కాదంటే నాది కాదు అనుకొనే కాలాల్లో, తప్పెవరిదైనా తప్పులు, తాలులు తగలబెట్టాల్సిందే అన్న కృతికర్త కృతనిశ్చయం ముచ్చట వేయకుండా ఎలా ఉంటుంది?
మొత్తానికి, అక్కడ పుస్తకం తగలబడింది.
అభ్యుదయవాదులయిన ఈ యువబృందం తెలిసి చేసినా తెలియక చేసినా, సంప్రదాయ కథనచట్రంలో నుంచే అనేక ఆధునిక, ఆధునికానంతర, వలసానంతర, నయావాస్తవిక భావనలకు నాంది పలికారు.
“రచయిత మరణించాడు” అంటూ ఎలుగెత్తిన బార్తా చేసిందల్లా, అప్పటిదాకా సాహితీ ఉత్పత్తికి ఒక వినియోగదారుడుగా భావించే పాఠకుడిని, ‘నీవు సాహితీ ఉత్పత్తిదారుడివి’ అని విప్పి చెప్పడమే. సాహిత్యంలో పాఠక భాగస్వామ్యం ఎంత ముఖ్యమో ఈ పాఠకప్రధానసిద్ధాంతం ప్రకటిస్తుంది. ఈ ప్రహసనంలోని పాఠక ప్రతినిధి పాత్ర పోషించినదీ సరిగ్గా అలాంటి పాత్ర. పైనుంచి, రచన రచయిత స్వంతమా? అది పాఠకుల స్వంతమా? అన్న ప్రశ్నను లేవనెత్తారు.
దానికి ఖలీల్ జిబ్రాన్ వద్ద సమాధానం దొరుకుతుంది. లక్ష్యాన్ని ఛేదించడానికి సారించిన బాణం ఎంత వాడిదైనా, ఎక్కుపెట్టే విల్లు బలిష్టమైనది స్థిరమైనది కావాలి కదా!
పిండికొద్దీ రొట్టె లాగా, రచయిత సామర్థ్యాన్నిబట్టిగా రచన. అలాగే, పాఠకునిబట్టి!
ఈ ప్రహసనం రచన, రచయిత, పాఠకుడు, విమర్శకుడు, వీరందరి నడుమ ఎప్పటికప్పుడు తాజాపరుచుకోవాల్సిన సమీకరణాన్ని గుర్తించేటట్టు, గ్రహించేటట్టు చేస్తుంది.
ఆ రూపేణా, అన్ని తగలబెట్టడాలు ఒకటి కావు. ఇక్కడ పుస్తకం తగలబెట్టడం తథ్యం!
అవునండి. నిజమే. ఎన్నన్ని అసంగత పదాలనీ, అసందర్భవాక్యాలని, అవాంఛిత కావ్యాలనీ తగలబెట్టాల్సి ఉందో కదా!
తెలుగుచేలల్లో మంచి సాహిత్య పంట పండించడానికి!
ఇంతా జేసి, ఇది ఎంత పుస్తకమనీ? వ్రాతప్రతితో పాటు అచ్చువేసినా, ఎనబై పుటలన్నా లేవు. మర్రివిత్తనంలాంటి దన్నమాట. నలుసంత విత్తులో వటవృక్షం దాగి ఉన్నట్టుగా.
నిస్సందేహంగా, సాహిత్యంతోనూ, కళలతోనూ ముడిపడిన వారందరూ ఒక పాఠ్యపుస్తకంలా చదవవలసిన ప్రహసనం ఈ ‘కావ్యదహనోత్సవం.’
ఎన్నెన్ని విషయాలు నేర్చుకోవాల్సి ఉందో! ఎన్నెన్ని విషయాలు మార్చుకోవాల్సి ఉందో!
రచయిత శ్రీ వేలూరి వేంకటేశ్వరరావుగారికి వినమ్ర వందనాలు.
దాదాపు అరవై ఏళ్ళ తరువాత అయినా, ఆనాటి రాతప్రతితో సహా ఈ పుస్తకం అచ్చువేయడం, ఎంతో బావుంది.
తెలుగు సాహిత్యంలోని ఒక చారిత్రక ఘట్టాన్ని కళ్ళ ముందు కలకాలం నిలిపినందుకు, ముద్రాపకులు శ్రీ గొర్తి సాయి బ్రహ్మానందంగారికి ధన్యవాదాలు.
కావ్యదహనోత్సవం, ప్రహసనం.
రచన: శ్రీ వేలూరి వేంకటేశ్వరరావు (1960), ప్రచురణ: 2020 ప్రదర్శన: ఆంధ్ర విశ్వవిద్యాలయం, వాల్తేరు, 12.12.1960