గమనం

లోపల దీపం వెలగకూడదు
ఎవరి ప్రతిబింబం వారికే
అడ్డు నిలవ కూడదు.

కారు చీకటిగానే ఉండాలి
కాంతి మొత్తం రోడ్డుమీదే .

ఇల్లేముంది
ఒళ్ళంతా కప్పుకుని
ఒకచోట ముడుచుకు కూచుంటుంది.
మూత పెట్టిన వెలుగులతో
తలపోతలో మునిగి ఉంటుంది.

వేగంగా కదిలే వాహనానికి మాత్రం
బయటి ప్రపంచంతోనే పని
వెలిగే రెండు కళ్ళు చూపించే
ముందరి దారితోనే పని.

గమనం తప్పదన్నప్పుడు
గతం బాధించ కూడదు
పదే పదే అద్దంలో కనబడి
ప్రశ్నించ కూడదు.