“తీర్పు”లో మరో పొర
కాఫ్కా కథలు అవాస్తవికాలు. కాని అవి మనల్ని ఎందుకు పట్టుకుంటున్నాయి? అవి మన మనసుల ‘లోని’ వాస్తవాలను పట్టుకుంటున్నాయి కనుక. మనకు తెలియకుండా మనలో దాగిన వాస్తవాలను, అంతరంగపు బావిలోకి అవాస్తవాల గాలం వేసి బయటకు లాగుతాడు కాఫ్కా. అప్పుడవి ఉబ్బిన శవాల్లా బయటపడతాయి. అవి “మన” శవాలు కనుక, మనల్ని వదలవు. “శవాలు” కనుక మనల్ని బాధపెడుతూనే ఉంటాయి. వాటిని బావిలోకి తోసేసింది మనమే కనుక, చేసిన హత్య మనల్ని వదలక వెంటాడుతూనే ఉంటుంది. ఈ అతివాస్తవికశిల్పమే మనల్ని మనకు దగ్గరచేస్తుంది.
“తీర్పు”లో తీర్పు అన్యాయమే. కథ ముగింపు స్థూలంగా అసహజమే. కాని, దాని వాస్తవ స్వరూపమేమిటి? ఈ కథలో కామం ప్రధాన వస్తువు. ప్రాణికి మూల ప్రచోదన శక్తి లైంగికమే (libidinal energy). దానికి అంగం అర్థం. సంస్కృతంలో “కామం” అర్థకామాలను రెంటినీ చెబుతుంది. భారతీయ సంస్కృతిలో ప్రేమ లేదు, కామమే ఉంది. అది వ్యక్తమయ్యే రూపంలో కామమో ప్రేమో అవుతుంది. ఉపనిషద్దర్శనం కామంతోనే మొదలవుతుంది. (“సోఒ కామయత”; “ఏకాకీ నరమతే”, “స ద్వితీయమైచ్ఛత్”. (ఆదిపురుషుడు, ప్రజాపతి) కామించెను (కోరెను): ఏకాకి రమించలేడు; అతడు జంటను కోరెను.) స్త్రీ పక్కన లేకపోతే బోర్ కొడుతుంది, “న రమతే”. ఆదిపురుషుడికి గాని, అధునాతన పురుషుడికి గాని. ఇది అనాది ద్వైవిధ్యం. స్త్రీ కావలె. కాని స్త్రీ ఊరక రాదు. ఆమె కొరకు తాను ఏదీ వదులుకోలేడు. మనిషిలోని ఈ నిత్య ద్వైవిధ్యమే “తీర్పు” కథలోనే కాదు, కాఫ్కా రచనలంతటా కనిపిస్తుంది. ఈ అనాది కామ ద్వైవిధ్యమే మూల పాపం (original sin).
“తీర్పు” కథ కాఫ్కా “ఎఫ్ కు”, “For F” (Felice Bauer) అంకితమిచ్చాడు. కాఫ్కా ఈ కథ రాయడానికి ఆరు వారాల ముందు ఫెలిస్ బోవర్ను కలిశాడు, తన స్నేహితుడు మాక్స్ బ్రాడ్ (Max Brod) ఇంట్లో. ఆమెను కలిసి ఉండక పోయి ఉంటే ఈ కథ రాసి ఉండేవాణ్ణి కాదన్నాడు కాఫ్కా. ఆమెతో కాఫ్కా వివాహం రెండుసార్లు నిశ్చయమైన తరువాత, రెండుసార్లు భగ్నం చేసుకున్నాడు. అతడు ఆమెకు చెప్పిన కారణం, తనతో ఆమె సుఖంగా జీవించలేదు. తనకు చెప్పుకున్న కారణం, తనకు సాహిత్యంతో నిశ్చయమే కాదు వివాహం కూడా జరిగిపోయింది. సాహిత్యపు కౌగిలిలో బందీ అయి ఉన్నాడు. విడిపించుకోలేడు.
ప్రేమ కథలో విలన్ కూడా ఉండకపోతే కథ రక్తి కట్టదు. ఈ కథలో విలన్ రచయితే. కథ రచనతోనే మొదలవుతుంది, రాసేది ఉత్తరమే, అయినా రచనే కదా? కథలు రాయని జీవితమా, దాంపత్య జీవితమా? ఈ సంఘర్షణ కాఫ్కా జీవితంలో బలంగానే ఉండింది. “తీర్పు”లో కూడా ఈ సంఘర్షణ ప్రముఖం. జిఓర్గ్, రష్యాలో ప్రవాసి అయిన అతడి మిత్రుడు ఇద్దరూ వ్యాపారులే. ఏం వ్యాపారమో కథలో ఎక్కడా చెప్పలేదు. మనకు తెలిసి ఇద్దరిదీ రచనా వ్యాపారమే. ఇద్దరూ ఉత్తర ప్రత్యుత్తరాలు మాత్రం రాసుకుంటారు. ఈ కథలో, ఉత్తరాలు రాసుకోవడం రచనా ప్రవృత్తికి ప్రతీకగా గ్రహించవచ్చు మనం.
కథ అర్థకామాలతోనే మొదలవుతుంది. “మంచి వసంతకాలం. జిఓర్గ్ యువకుడు, వ్యాపారి.” (“the most beautiful time in spring. George Benderman, a young merchant”, tr. Ian Johnston) అర్థకామాలకు అనువైన సమయం. వసంతంతో పాటు కథలో విలన్ కూడా ప్రవేశిస్తాడు, అదృశ్యంగా, ఉత్తర రచన రూపంలో, నిజమే. కథలో కాదు కాని, కథ వెలుపల కొంత కథ ఉంది. అది కథా రచనా సందర్భానికి సంబంధించింది. కాఫ్కా ఈ కథను Yom Kippur రాత్రి రాశాడు. Yom Kippur యూదులకు పశ్చాత్తాప పర్వదినం. ఆ రోజు వారు ఉపవాసము, బ్రహ్మచర్యము పాటిస్తారు. ఈ సందర్భ ప్రాధాన్యం కథలో ఎక్కడైనా ప్రతిఫలించిందా? అర్థకామాలకు అనువైన సమయం వసంత ప్రస్తావనతో ప్రారంభమైన కథలో, వ్యక్తమైన ఆ అర్థకామాలకు అడుగున అవ్యక్తంగా ఉన్న వాటి ప్రతిరోధక శక్తిని, ఉపవాస బ్రహ్మచర్యాలను, కథ ఏవిధంగానైనా వాడుకుందా?
ఈ కథను అనేక కోణాలనుండి పరిశీలించారు – ఫ్రాయిడ్ చెప్పిన మానసిక లైంగిక కోణం (psychosexual angle), యూదు క్రైస్తవ కోణం, సామాజిక కోణం, ఇంకా అనేకానేకం. వీటన్నిటినీ అవసరమున్న చోట అవసరమున్నంతవరకు మాత్రమే స్పృశిస్తూ వెళదాం. మొదటిసారి ఈ కథ చదివినపుడు, మన తీర్పు తండ్రికి వ్యతిరేకం. ఇది సరి అయిన తీర్పేనా? ఇప్పుడు కొడుకు కథ చూద్దాం. కొడుకుకు వ్యతిరేకంగా సాక్ష్యం సేకరించగలమా? పాఠకుడు ఇరుపక్షాల వాదనలు వినవలె కదా?
ఈ కథలో ప్రత్యక్ష పాత్రలు రెండు, పరోక్షంలో రెండు అనుకున్నాం. పరలోకంలోని “మన అమ్మ” (“our mother”) కూడా ఒక ప్రధాన పాత్ర. (కథలో తండ్రి, చనిపోయిన తన భార్యను గురించి కొడుకుతో మాట్లాడుతూ, “మీ అమ్మ” అనడు, “our mother” అంటాడు. ఇది కీలకమైన అంశమే, ఈడిపస్ కాంప్లెక్స్ లో. ఈ నాలుగు పాత్రల లెక్క సరి అయినదా? మరొకసారి చూద్దాం.
ముందు, రష్యాలో మిత్రుడి విషయం చూద్దాం. ఇతన్ని పరిశీలిస్తే, జిఓర్గ్ పాత్ర స్వరూపం మరింత స్పష్టమవుతుంది. రష్యాలో ఉన్న మిత్రుడికి ఉత్తరం రాయడంతో మొదలవుతుంది కథ. ఉత్తరం మిత్రుడికేనా? జిఓర్గ్ తను రాసిన ఉత్తరం గురించి తండ్రికి చెప్పడానికి ఆయన గదికి వెళ్ళి ఏమన్నాడు? పీటర్స్బర్గ్ కు ఉత్తరం రాశానన్నాడు. ఊళ్ళకు ఉత్తరాలు రాయం. వ్యక్తులకు రాస్తాం. సహజంగానే తండ్రి ఈ అసహజతను గుర్తించడమే కాక, గుర్తించినట్టు కొడుకుకు ప్రకటిస్తాడు, “పీటర్స్బర్గ్?”. ఇంక కొంత సంభాషణ సాగాక, “నీకు పీటర్స్బర్గ్ లో ఒక మిత్రుడున్నాడా?”, అని ఆశ్చర్యం ప్రకటిస్తాడు. తండ్రి పెద్దవాడైనాడు, మతిమరుపు అనుకున్నాడు కొడుకు. అతన్ని గుర్తు తెప్పించడానికి ప్రయత్నిస్తాడు. కొంత సేపటికి తండ్రి, కుండ బద్దలు కొట్టినట్టు, “నా దగ్గర నాటకాలాడకు. నీకు పీటర్స్బర్గ్ లో మిత్రుడే లేడు”, అంటాడు. ఇంక కొంత సేపటికి, “వాడు నీకు మిత్రుడు కాదు”, అంటాడు. “నీవే వాణ్ణి పరదేశానికి తరిమేశావ”ంటాడు. నీ పెళ్ళి విషయం, వ్యాపారం వాడికి తెలియకుండా దాచి, వాణ్ణి వంచిస్తున్నావంటాడు. “అతడు నాకు కొడుకు లాంటివాడు, నీకంటే నాకు ఇష్టమైన కొడుకు అయ్యేవాడు”. ఇది తండ్రి తన కొడుకు మిత్రుణ్ణి గురించి అన్న మాటలు. దీన్ని బట్టి మనమేమి అర్థం చేసుకోవలె?
ఆ మిత్రుడసలున్నాడా? లేకపోతే, లేని మిత్రుణ్ణి తన కొడుకు మోసంచేయడమేమిటి? పైగా, “నీవు వాడికి ఉత్తరాలు రాయడమేమిటి? నేను వాడికి ఉత్తరాలు ఎప్పటికప్పుడు రాస్తూనే ఉన్నాను. వాడికంతా తెలుసు. అసలు నీవు రాసే అబద్ధాలు వాడు చదువుతాడనుకుంటున్నావా? నీ ఉత్తరాలు ఎడంచేత్తో నలిపేస్తూ, కుడిచేత్తో నా ఉత్తరాలు పట్టుకుని చదువుతాడు”, అంటాడు.
ఇక జిఓర్గ్ ఏమంటాడో చూద్దాం. అతని మాటల్లోనే, అతడు మిత్రుడికి రాసిన ఉత్తరాలలో రాయవలసిన విషయాలేవో రాస్తూ వచ్చాడు. మూడు ఉత్తరాలలో, ఊళ్ళో ఎవరెవరివో పెళ్ళిళ్ళ గురించి రాశాడు కాని, తన పెళ్ళి గురించి రాయలేదు. ఈ ఉత్తరంలో కూడా తన పెళ్ళి ప్రధాన విషయం కాదు. చివరి వరకు దాచిన పెళ్ళి వార్త, ఉత్తరంలో కూడా చివరవరకు వాయిదా వేసి, చివర రాశాడు. ఇది వంచన అంటాడు తండ్రి. కొడుకు, మిత్రుణ్ణి బాధపెట్టకూడదని ఇంతవరకు దాచానంటాడు. ఈ మిత్రుడి విషయంలో మరో సాక్షిని కూడా ప్రశ్నించాలి. ఫ్రీడా “నీ మిత్రుడు రాకుండా నీవు పెళ్ళెలా చేసుకుంటావు?”, అంటుంది. అంతే కాదు, “నీ మిత్రుడు ఆ పరిస్థితిలో ఉంటే, నీవసలు పెళ్ళి చేసుకోకూడదు”, అంటుంది. ఇది మరీ ఆశ్చర్యం. ఏ వధువైనా, ఎంత సౌజన్యమూర్తి అయినా, ఇలా అంటుందా? అసలెవడు ఈ మిత్రుడు? అతని విషయంలో ఆమె కెందుకంత ఆసక్తి? అపార్థం చేసుకోకండి. ఆమె ఆసక్తి మిత్రుడి గురించి కాదు, కాబోయే భర్తకు తన యందు నిబద్ధత గురించి. పెళ్ళి అయిన తరువాత తనతో కూడా దాపరికం లేకుండా ఉంటాడా? మిత్రుడి దగ్గర ఇన్ని విషయాలు దాచినవాడు, ఏ కారణమైనా చెప్పొచ్చు, రేపు తన దగ్గర దాచడా?
ఈ ప్రవాసమిత్రుడు, తండ్రికి చాలా ఇష్టమట. నిజమా? కొడుకు అందుకు విరుద్ధంగా, “నీకు నా మిత్రుడంటే ఇష్టం ఉండదు. అందుకే నీ దగ్గర దాచాన”ంటాడు. దానికి విరుద్ధంగా కూడా అంటాడు కొడుకు, “నీవు అతనితో బాగా మాట్లాడేవాడివి కూడా”, అని. తండ్రి అంటాడు, “అతడికోసం నేను ఏడవలేదనుకుంటున్నావా?” (“Do you imagine I didn’t cry over him?”). ఆ మిత్రుడు చచ్చిపోయాడు, వాడికోసం నేను ఏడ్చాను కూడా అంటున్నాడు. అంటే ఏమిటి అర్థం? నీలోని రచయితను నేను ఆమోదించలేనని, ఆమోదించలేదని నీ అభియోగం. అది సరికాదు.
ఇంతకూ ఈ ప్రవాసమిత్రుడి విషయం తేల్చవలసిందే. ఇతడు వాస్తవంగా లేడు. తండ్రి చెప్పిందే నిజం. జిఓర్గ్ తనలోని ఒక భాగాన్ని, తనకు దూరంగా, పరదేశానికి ప్రవాసం పంపాడు. అతణ్ణి ఆమోదించలేడు. తనకు జీవితంలో స్థిరపడాలని, వ్యాపారంలో వృద్ధి చెందాలని, పెళ్ళి చేసుకోవాలని ఉంది. తనలోని ఆ “మిత్రుడు” తనకు అమిత్రుడు. అందుకే అతడికి ప్రవాసం. అక్కడ అతడూ “వ్యాపారం” చేస్తున్నాడు. అతడిది రచనా వ్యాపారం.
తనలోని రచయితకు తనకు జరిగే ఘర్షణలో జిఓర్గ్ తండ్రి, కాబోయే భార్య నష్టపోతారు. కష్టానికి నష్టానికి తాను కారకుడు. కనుక శిక్షార్హుడు. ఇంతకూ, తేలిందేమిటంటే, కథలో ఒక పాత్ర తగ్గిపోయాడు. ప్రవాసమిత్రుడు లేడు, తిరిగిరాడు. నలుగురు ముగ్గురైనారు. చివరకు కథలో ఎందరు మిగులుతారో చూద్దాం.
రచనా వ్యాసంగానికి పెళ్ళికి ఈ కథలో ఉన్నంత వైరుద్ధ్యం, ఎన్నికలో ఇంత ఘర్షణ అవసరమా? ఈ రెంటిలో ఏదో ఒక దానినే ఎన్నుకొని తీరాలా? కీర్కెగాడ్, కాఫ్కాలవంటివారికి ప్రత్యేకమనదగినదా? లేక వారి అనిర్దిష్టమైన లైంగికసమస్యను దాచడానికి ఇది ఒక నెపమా? ఫ్రాయిడ్ సిద్ధాంతం దృష్టిలో దీనిని పరిశీలించవచ్చు. తండ్రికొడుకులకు మధ్య తల్లి విషయంలో స్పర్ధగా మొదలై తాదాత్మ్యతగా (identity) పరిణమిస్తుందన్నది ఆ సిద్ధాంతం. అది కథలో స్పష్టమే. ఆ స్పర్థలో కలిగిందే జిఓర్గ్ వివాహ వైముఖ్యం కావచ్చు. ఆ అపరాధ భావం కథ ముగింపుకు కారణం కావచ్చు. తండ్రి కొడుకును చాలా తీవ్రమైన నింద చేస్తాడు కొడుకు, శీలంలేని స్త్రీ వలలో పడి తల్లి స్మృతిని అపవిత్రం చేస్తున్నాడని. నేరం ఇద్దరిదీ. కనుక ఇద్దరూ పంచుకున్నారు. తండ్రి తీర్పు మాత్రమే చెప్పాడు. దాని అమలు చేయవలసిన అవసరం లేదు కొడుకుకు. తండ్రి ఫ్రాయిడ్ దృష్టిలో సూపర్ ఈగో (superego). అది ఎప్పుడూ అతి కఠినంగానే తీర్పు ఇస్తుంది. కాని ఈగో (ego) దానిని సమన్వయించుకోవలె. జిఓర్గ్ ఆ సమన్వయం చేసుకోలేదు. (భారతీయ భావనలో ఫ్రాయిడ్ చెప్పిన ఇడ్, ఈగో, సూపర్ ఈగోలకు సమానార్థకాలు కాకపోవచ్చు. కాని ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఈ పనులు చేస్తాయి. బుద్ధి ఒక్కొకసారి అతిగా బుద్ధి చెప్పాలని చూస్తుంది. మనసు ఇంద్రియ బుద్ధులను సమన్వయపరచాలి. బుద్ధికి కూడా బుద్ధి చెప్పవలసి ఉంటుంది. అలా జరగలేదు కాఫ్కా కథలో. తండ్రి కొడుకులిద్దరూ తప్పు చేశారు. (ఈ తప్పుకు పరిష్కారం కాఫ్కా ఎలా చేశాడో చివర చూద్దాం.)
ఇప్పుడు మరో పాత్ర కూడా నిష్క్రమించాడు. తండ్రి కూడా లేడు. అతడు జిఓర్గ్ బుద్ధి (superego). ఇద్దరు మిగిలారు. జిఓర్గ్, ఫ్రీడా. జిఓర్గ్ నలుగురిలా సుఖజీవనం, జీవనసుఖం కోరుకున్నాడు. అతడు కోరిన “సాధారణ” జీవితానికి ప్రతీక ఫ్రీడా (Frieda). అది అందదేమోనని అతడి ఆందోళన, అతనిలో ఘర్షణ. అతడి ఆత్మహత్యలో కూడా లైంగికస్ఫురణ. (“నీళ్ళలో మునిగి చావు” అన్నది తండ్రి విధించిన శిక్షారూపం. “నీళ్ళలో మునగడం” రతి స్ఫురణ. కాఫ్కా వాడిన జర్మన్ పదం (Verkehr) రెండర్థాలనిస్తుంది. ఈ కథ ముగింపులో నది వంతెనపై ట్రాఫిక్ ను, లైంగికక్రియను కూడా స్ఫురించే పదం వాడాడు కాఫ్కా. (Verkehr – traffic or transport, but also association, communication, dealings (in a commercial sense) or intercourse (in all meanings of the term). వంతెన కడ్డీ పట్టుకుని వేలాడుతున్నవాడు, ట్రాఫిక్ రొద కోసం ఆగి, అప్పుడు చేతులు వదిలేశాడు. రొద ఎందుకు అవసరం? (“his hands were getting weak. Between the posts he spotted an autobus that would easily drown out his fall.”) “Fall” – ఆదమ్ (Adam) “పతనం”. నది చేసే రతి కూజితాలు రొదలో మునిగిపోవడానికి. ఆ “పతనమే” మనిషి కోరుకునేది, వంతెన కింద. జిఓర్గ్ కోరుకున్నది. ఈ “పతనం” వంతెనపై నిరంతరం సాగే రొద (Verkehr, traffic), వంతెన కింద, పై రొదలో లయమైన రొద (Verkehr, intercourse, రతి). ఈ పతనం మనిషి కోరుకునేది, లోకం నుండి దాచుకోవలెనని కోరుకునేది కూడా. ఈ “తీర్పు” అమలు, నీళ్ళలో మునిగి చావడం, ఒక స్థాయిలో శారీరకవాంఛాసాఫల్యం. ఈ విశ్లేషణ కథకున్న అనేకార్థాలలో ఒకటి మాత్రమే.
కాఫ్కా కథల విశ్లేషణ ఫ్రాయిడ్ కలల విశ్లేషణ వంటిదే (Freud’s “Interpretation of Dreams”). వాస్తవవిశ్లేషణ వలె ఉండలేదు. కల దేనిని దేనిగా మారుస్తుందో, దేనిని దేనితో కలుపుతుందో గుర్తించడం సులభం కాదు. నమ్మడం అంతకన్నా సులభం కాదు.
స్ఖలనము, లేఖనము: శారీరకవాంఛతో అన్వయించిన అర్థం చూశాము, కథ ముగింపు సన్నివేశంలో. అదే సన్నివేశం మరో అర్థాన్ని కూడా స్ఫురింపజేస్తుంది. కాఫ్కా రచనల్లో అంతటా రచనా ప్రవృత్తి, దాని అభివ్యక్తి, అంతస్స్రోతస్సుగా సాగుతుంది. కేవలం రచయిత మానసికస్థాయిలో మాత్రమే కాదు. రచన తాత్త్వికరూపం కూడా తన రచనా విషయమే. ఈ కథలో కూడా రచయిత, రచనా ప్రవృత్తి, రచనా ప్రక్రియ కూడా ఒక సమాంతరవస్తువు. కథ మొదలయిందే “లేఖ”తో. మనసులోని మాట చెప్పడంలోని (రాయడంలోని) కష్టం కథ మొదటే ఆవిష్కృతమయింది. ఆ లేఖ రాయడం విషయం చెప్పడానికి కాదు, దాచడానికి. లేఖనంలోని అసత్యంతోటి అంతస్సంఘర్షణతో కథ మొదలయింది. పెళ్ళి తన రచనలకు విఘాతమని రచయిత అనుకుంటాడు. అనుకునే, తాను (తనలోని రచయిత) రష్యా వెళ్ళిపోయాడు. ఇక్కడ అతడికి అనువు కాదు. కథ ముగింపులో లేఖనము, స్ఖలనము సమ్మిళితమైనాయి. ఈ కథ చివరి వాక్యం రాసేటపుడు తనకు “బలమైన స్ఖలనం తోచింది” (“had thought of a strong ejaculation”) అని కాఫ్కా తనతో అన్నాడని బ్రాడ్ చెప్పాడు. ఇక్కడ “తోచింది” (“thought”) అన్న పదం కూడా గమనించవలసినదే. ఆ పదం రచనను స్ఫురింపజేసేది.
తీర్పుకు తిరిగి వద్దాం. తండ్రి కొడుకులు ఇద్దరూ తప్పు చేశారు. ఆ తప్పులను కాఫ్కా ఎలా పరిష్కరించాడు? కుటుంబంలో కాదు, లోకంలో కాదు, తప్పు లేకుండా ఒప్పు ఉండదు. అన్యాయం లేకుండా న్యాయం ఉండదు. అసత్యం లేకుండా సత్యం ఉండదు. ఇది కల్తీ లోకం. ఈ కల్తీ అస్తిత్వవాద సత్యం. ఈ సత్యాన్ని ఈ కథలో కాఫ్కా ఎలా చెప్పాడో చూద్దాం. జిఓర్గ్ చాలా పశ్చాత్తాపం పొందాడు, పెద్దవాడైన తండ్రిని శ్రద్ధగా చూచుకోలేదని. ఆయనను తన చేతుల్లోకి తీసుకుని తన గదిలో తన పక్కమీద పడుకోబెట్టడానికి తీసుకెళుతున్నాడు. తీసుకెళుతున్నపుడు, తండ్రి తన గుండెపైన వేలాడుతున్న గడియారపు గొలుసుతో ఆడుకుంటున్నట్టు అనిపించింది. గొలుసు విడిపించి ఆయనను పక్కమీద పడుకోబెట్టడం కష్టమయింది. “the father was playing with his watch chain. He held the chain so firmly that he could not immediately lay him onto the bed.” “his father was playing with his watch chain on his chest” “the old man on his breast was playing with his watch chain” ఇన్ని విధాల అనువాదాలు చేశారు ఇంగ్లీషులో. ఇందులో ఒకటి సరి అయిన అనువాదం కాదు. తప్పు అనువాదం కూడా. కాని ఆ తప్పు ఒక ఒప్పును ఆవిష్కరిస్తున్నది. “the old man on his breast” సరి అయిన అనువాదం కాదు. కాని ఆ తప్పు, ముసలి తండ్రిని కొడుకు గుండెలపై చంటివాణ్ణి చేసింది. కొడుకు గుండెపై జేబు గడియారపు గొలుసు వేలాడుతూంది. ఆ గొలుసుతో ఆడుతున్నాడు ముసలాడు. (“an seiner Brust der Vater mit seiner Uhrkette spiele”). గొలుసుతో ఆడుతున్న తన తండ్రిని చేతులమీద నుండి తీసి పక్కపై పడుకోబెట్టడం “కష్టమయింది”. ఏమిటా కష్టం? బృహత్కాయుడు తండ్రి. (‘“ still a giant!”). తండ్రి బరువైనాడా? లేక అతడు బలంగా పట్టుకున్న గొలుసు విడిపించడం కష్టమైందా? ఏ భారతీయ తల్లినడిగినా చెబుతుంది ఆ కష్టమేమిటో. చంటివాణ్ణి ఒడిలో నుండి తీసి పక్కపై పడుకోబెట్టబోతుంటే, బుల్లి చేతులతో వాడు తన మెడలోని మంగళసూత్రంతోనో చంద్రహారంతోనో ఆడుకుంటుంటాడు. ఆ చిన్న చేతుల నుండి “గొలుసు” విడిపించడం సులభమేమీ కాదు, ఇద్దరికీ. కథలో తండ్రి చంటివాడైనాడు. కొడుకు తల్లి అయ్యాడు. (“అతడికోసం నేను ఏడవలేదనుకుంటున్నావా?” “Do you imagine I didn’t cry over him?” అంటాడు తండ్రి తన “ప్రవాసి కొడుకు” గురించి.) ఈ గొలుసు, ఈ కథలో ప్రాణభూతమైన ప్రతీక. తండ్రికొడుకులు ఇద్దరిలో లోపాలుంటాయి. కాని బంధం ఏమవుతుంది? తండ్రికొడుకుల బంధమే కాదు, ఏ బంధమైనా విడిపించడం సులభం కాదు. తండ్రి ప్రేమ నిజం, స్వార్థమూ నిజం. అట్లాగే కొడుకు ప్రేమ నిజం, స్వార్థమూ నిజం. బంగారమే కాదు, ప్రేమ కూడా కల్తీ. రాగి కలిస్తేనే, బంగారం గొలుసు లాగినా తెగదు. కాఫ్కా బంధాల గురించి చెప్పడం లేదు. లోకంలోని కల్తీ అనే అస్తిత్వవాద సత్యం గురించి చెబుతున్నాడు. “ఉన్నవి రెండే. నిజము, అబద్ధాలు. నిజం విడదీయరానిది, కనుక తనను తాను గుర్తించలేదు; దానిని గుర్తించదలచినవాడు అబద్ధం కావలె.” (Notebooks). సత్యాసత్యాలు, న్యాయాన్యాయాలు ద్వంద్వాలు. ఒకటి లేకుండా మరొకటి ఉండదు. కల్తీలేని సత్యము, కల్తీలేని న్యాయము లోకంలో దొరకదు. ఇదే తండ్రి కొడుకుతో కోపంలో పలికిన నిజం: “ఇంతవరకు నీకు నీవు మాత్రమే తెలుసు! నిజానికి నీవు ఒక అమాయకపు పిల్లవాడివి, కాని అంతకంటే నీవొక దయ్యపు మనిషివి”, అంటాడు ఈ కథలో తండ్రి కొడుకుతో. ప్రతి మనిషిలో ఒక దయ్యం దాగి ఉంది. ఇదీ అసలు తీర్పు. అస్తిత్వవాదము, అసంబద్ధవాదము జీవితం అర్థం కాదని, జీవితానికి అర్థం లేదని అంటాయి. అలా అని, వ్యర్థంగా జీవితం గడపమన్నది వారి వాదం కాదు. అలాంటి జీవితం సార్థకం చేసుకోడానికి మనుషుల సంబంధాలు బంధాలు కాకుండా అనుబంధాలు కావలె అంటాడు కాఫ్కా. ఆ అనుబంధాన్ని సూచించేదే ఈ కథలోని బంగారు గొలుసు. సృష్టిలోని వ్యర్థాలన్నీ తొలగిస్తే, అట్టడుగున మిగిలేది ఈ ప్రేమ. దాన్ని గుర్తించమంటాడు కాఫ్కా.
కాఫ్కా రచనల్లో ప్రధానంగా గమనించవలసింది అతని రచనా విధానంలోని మర్మం. జీవిత వాస్తవం బుద్ధికి అందడం లేదు. ఈ అందని అసంబద్ధతను చెప్పడానికి అతడు అవ్యక్తాన్ని ఆశ్రయిస్తాడు. అవ్యక్తం (subconscious) స్వప్నంలో వ్యక్తమయ్యేది. అసంబద్ధ వాస్తవాన్ని వ్యక్తంచేయడానికి ఈ అవ్యక్తాన్ని, స్వాప్నిక వాస్తవాన్ని ఆలంబనం చేసుకుంటాడు. ఈ “తీర్పు” కథలో ముగింపు అటువంటి స్వాప్నిక వాస్తవం. హేతువాద వివరణకు లొంగదు. అదే కాఫ్కా, ఫెలిస్ బోయర్ (Felice Bauer)తో అన్నది. “నీకేమైనా అర్థమయిందా ఈ కథ? నాకైతే కాలేదు.” (!) ఫ్రాయిడ్ అవ్యక్త సిద్ధాంతం చెబితే, కాఫ్కా అవ్యక్తాన్ని సాహిత్యం చేశాడు. ఈ కథ సంకుల భావాల సంకలనం. ఇందులో యూదు-క్రైస్తవ సంవాదం ఉంది, కళ-జీవితము మధ్య సంఘర్షణ ఉంది, కుటుంబాలలో సాధారణమైన తండ్రి-కొడుకుల ఘర్షణ ఉంది, వివాహము-సాహిత్య సృష్టి వైరుధ్యం ఉంది, అన్నిటినీ పరచుకుని మనిషి ఒకే వ్యక్తి అన్న భ్రాంతిని (unitary self) తీవ్రంగా ప్రశ్నించడం ఉంది. ఈ చివరి అంశంలో ఇతడు, పిరాండెలో ఒకే అంశాన్ని కావ్య వస్తువుగా గ్రహించారనిపిస్తుంది. అయితే పిరాండెలో విధానం వేరు. అతడు అతి గహనమైన తాత్త్వికవిషయాన్ని హాస్యాశ్రయం చేశాడు, మహామాయకు ముసుగువేసి రంగస్థలం మీదికి దించాడు. కాఫ్కా అడుగడుగునా ఆ మహామాయకు అవతలి తత్త్వాన్ని దర్శించాడు, కాని దారి చెరిపేశాడు.
(ఇంతటితో కాఫ్కా గురించిన చర్చ అయిపోయింది. వచ్చే సంచికలో హైడెగర్ అస్తిత్వవాద సాహిత్యం గురించి చర్చిద్దాం)