రచనలు ఎందుకు పత్రికలకు పంపాలి? ఎప్పుడు అచ్చేస్తారో, ఎందుకు వేస్తారో, వేస్తారో వెయ్యరో కూడా చెప్పని పత్రికల దగ్గర పడిగాపులు పడే కన్నా, అనుకున్నదే తడవు ప్రచురించుకొనే వెసులుబాటిచ్చే సొంత వేదికలు, క్షణాల్లో స్పందనని కళ్ళ ముందుంచే సోషల్ మీడియా ఖాతాలే మెరుగని రాసే గుణమున్న అందరికీ అనిపించడంలో చిత్రమేమీ లేదు. అయితే, సాహిత్యవ్యాసంగం మిగతా కళలలాగా ఎవరి స్థాయి వారికి ప్రత్యక్షంగా తెలియనీయదు. ఇది నా అనుభవం, నా ఇష్టమొచ్చినట్టు రాసుకుంటాను అన్న ధోరణి సాహిత్యవ్యాసంగపు ఎదుగుదలకు అడ్డుకట్ట వేస్తుంది. చిత్రిక పట్టడం వల్ల తొలిప్రతిలోని నిజాయితీ పోతుందన్నదీ శుద్ధ అబద్ధమే. చాలామంది రచయితలకు తమ రాతలలో ఏం లోపించిందో తెలియదు. ఎవరో కొందరు మినహాయింపుగా ఉన్నప్పుడు, వారినే ఆదర్శంగా తీసుకోవడం పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం లాంటిది. ఆలోచనల్లోని స్పష్టత అక్షరాల్లోకి రావడం లేదని గమనించుకునే తెలివి అందరికీ ఉండదు. రాద్దామనుకున్న దానికి, రాసిన దానికీ ఉన్న భేదాలు తరచి చూసుకునే ఓర్పూ కొద్దిమంది ఆస్తే. కానీ అది వాళ్ళ సాహిత్య సృజనకేమీ అడ్డు కాదు. ప్రచురణకు అసలే అడ్డు కాదు. అయినప్పటికీ, రాద్దామనుకున్నదేదో రాశారో లేదో, రాసినది ఎంతవరకూ దానికది సంపూర్ణంగా స్వతంత్రంగా నిలబడగలుగుతుందో లేదో, మూడో మనిషి చేతుల్లోకి చివరిప్రతి వెళితేనే రచయితకు తెలుస్తుంది. ఒక బ్లాగుకో, సోషల్ మీడియా అకౌంట్కో మన రచనను అప్పగించే కన్నా, పత్రికకు పంపిస్తే అన్నిటికంటే ముందు, అది రచయిత, రచయిత తరఫువాళ్ళు, లేదా రచయిత ఆమోదించిన, రచయిత ఆజ్ఞలకు షరతులకు లోబడి మాట్లాడనున్న ఒకానొక ఆంతరంగిక వృత్తాన్ని దాటుకుని, రచనను వ్యక్తిగత జీవితానికి ముడిపెట్టకుండా చూడగల మరొక వృత్తంలోకి వెళుతుంది. అది, ఒక రచనను సర్వస్వతంత్రంగా నిలబెట్టి, దాని విలువను కేవలం సాహిత్య విలువ, ప్రతిభ ఆధారంగా బేరీజు వేస్తుంది. పత్రిక స్థాయి, ప్రమాణాలు మంచివైతే, రచయితకు ఒక చక్కని పరామర్శ/విమర్శ దొరుకుతాయి. పరిష్కర్తలయిన సంపాదకులతో చర్చలు సాహిత్య దృక్పథాన్ని విశాలం చేస్తాయి, అభిధనూ ధ్వనినీ మరింత బలంగా రచనలో వాడుకోవడం నేర్పుతాయి. ఇలా రచనను ఒక కొత్త చూపుతో గమనించుకునే వీలు కలుగుతుంది. ఎడంగా నిలబడి తప్పొప్పులను చర్చించే సావకాశం దొరుకుతుంది. రచన తిరస్కరించబడినప్పుడు, దానికి కారణాలు అర్థమయ్యే కొద్దీ రచనను శ్రద్ధగా గమనించడం అలవాటవుతుంది. ఇవన్నీ రచనను ఉద్వేగభరితంగా మాత్రమే కాక, తార్కికంగా కూడా బలపరుచుకునే వీలిస్తాయి. ఆలోచనల్లో స్పష్టత తెచ్చుకోవడం, అనవసరమైన పదాల, వాక్యాల ఏరివేత అలవాటుగా మారడమన్నది ఒక పరిష్కర్త సహాయంతోనే సాధ్యమవుతుంది. అలా రచనలను మెరుగు పెట్టుకొనే కొద్దీ రచనావ్యాసంగం దానికదే పదును తేలుతుంది. దీనివల్ల తెలుగు భాషకో, తెలుగు సాహిత్యానికో ఈ రోజుకీ రోజు ఏదో లాభిస్తుందన్న అత్యాశ కాదు కానీ విమర్శ తిరగలిలో నలిగితే మంచి సాహిత్యపుటలవాట్లు కొద్దిమందికయినా అబ్బుతాయని నమ్మకం.
ఈ రచయిత నుంచే...
ఇటువంటివే…
మార్చి 2022 సంచికలో ...
- #పంచనామా
- అంతా రొటీనే
- అజ్ఞాతం
- ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 5
- ఇయ్యాళ ఊళ్ళో
- ఉత్తర మొరాకో శోధనలు 4
- ఊహల ఊట 10
- ఒక కవిత కథ
- కాకవిన్ – కుసుమవిలసిత – తురిదగతి
- గడినుడి – 65
- ద డే బిఫోర్
- ధర్మం
- పుట్టగానే పరిమళిస్తూ రాలిపోయెరా!
- పూర్ణిమ తమ్మిరెడ్డి నాలుగు కథల సమీక్ష
- మనసులోని మర్మము దెలుపు . . .
- మార్చ్ 2022
- విడూడభుడి కల
- విశ్వమహిళానవల 15: జార్జ్ ఎలియట్
- వ్రాయలేనితనం
- శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 65
- స్వ