తెలుగులో ఒక కవితను కాని, కావ్యాన్ని కానీ ఎలా చదవాలో చెప్పేవాళ్ళు మన సాహిత్యసమాజంలో లేరు. ఒక పుస్తకాన్ని ఎందుకు చదవాలో కారణాలు చెప్పమని అడిగితే, దాన్ని అవమానమనుకునే వాతావరణం నుండి సాహిత్యకారులు ఎడంగా జరిగినదెన్నడూ లేదు. ఒక కవిని, కావ్యాన్ని చదవకపోతే, మన జ్ఞానంలో పూడ్చుకోలేని లోటుగా ఏదో మిగిలిపోతుందని బలంగా వివరించి చెప్పగల ధైర్యవంతులు లేరు. భాష, చరిత్ర, సాహిత్యం, విమర్శ–వీటి అవసరమేమిటో, కాలానుగుణంగా వాటికి తగ్గట్టు పాఠకుడిని సన్నద్ధం చెయ్యాల్సిందెవరో మన ఆలోచనలకు అందదు. వాటికి సంబంధించిన కనీస అవగాహన, ఆయా రంగాల్లో కృషి చేస్తున్నామని రొమ్ము విరుచుకునేవారిలో కూడా కనపడదు. ఇలాంటి వాతావరణం నుంచి తప్పించి, తన లోతైన పరిశోధనలతోను, సూక్ష్మమైన పరిశీలనలతోను, బలమైన ప్రతిపాదనలతోనూ తెలుగు సాహిత్యానికి చేతన తెచ్చి విశ్వవేదికన స్థానం కలిగించిన సాహితీవేత్త వెల్చేరు నారాయణరావు. తెలుగులో కవితావిప్లవాల స్వరూపాల అధ్యయనం నుంచి సాహిత్య అనువాదాలు, విశ్లేషణల దాకా విశేషంగా పరిశ్రమించి, శోధించి వెలువరించిన వెల్చేరు సాహిత్యం పట్ల, తెలుగునాట ఈనాటికీ అనంతమైన నిశ్శబ్దం ఉంది. ఏ రంగంలోని వాళ్ళకైనా, ఎన్నేళ్ళుగానో వాళ్ళు సౌకర్యవంతంగా అనుసరిస్తున్న పద్ధతుల్లో లోపాలను ఎత్తి చూపి మార్పు అవసరమని హెచ్చరించేవారి పట్ల సుహృద్భావం ఉండదు. దానిని అడ్డుకోవడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ ఎదుటి మనిషి కృషి పట్ల నిర్లక్ష్యంగానే పరిణమిస్తాయి. రచ్చ గెలిచిన ఈ ప్రపంచస్థాయి సాహిత్యాధ్యాయి కృషికి, ఇంట దక్కిన నిరాదరణకి ఇంతకన్నా బలమైన కారణమేదీ కనపడదు. వాదభావజాలపు సంకుచిత నియమాలకు విభిన్నంగా సాహిత్యాన్ని కొత్తగా చదవడానికి, అర్థం చేసుకోవడానికి, విశ్లేషించడానికీ వెల్చేరు నారాయణరావు చేసిన ప్రతిపాదనలు విప్లవాత్మకవైనవి. సశాస్త్రీయమైనవి. వాటితో ఏకీభవించగలమా లేదా అన్నది సమస్య కాదు, కాని వాటిని విస్తృతంగా అధ్యయనం చేసి విశ్లేషించవలసిన అవసరాన్ని తెలుగు సాహిత్యలోకం ప్రయత్నపూర్వకంగానే విస్మరించడం మాత్రం సాహిత్యనేరం. ఆలస్యంగానయినా, వారికి అత్యున్నత సాహితీపురస్కారమైన ఫెలోషిప్ అందించి, సాహిత్య అకాడెమీ తన బాధ్యత నిర్వర్తించింది. గౌరవాన్ని నిలుపుకుంది. కనీసం ఈ పురస్కార వార్త మిషగా అయినా, వెల్చేరు నారాయణరావు రచనలు, సిద్ధాంతాలు తెలుగునాట చర్చలోకి తేవడం, బహుశా అదీ, ఆయన కృషికి ఒక సాహిత్యసమాజంగా మనమివ్వగలిగిన అసలైన గౌరవం.
ఈ రచయిత నుంచే...
ఇటువంటివే…
మార్చి 2021 సంచికలో ...
- 1808-1843 నాటి నిజాం రాజ్య చరిత్రలోని చిత్రకథలు 4
- Match
- ఉత్సాహానికి దూరంగా…
- కేతన ఆంధ్రభాషాభూషణము: ఒక పర్యాలోకనం – 2
- గడినుడి – 53
- గల్ఫ్ గీతం: 9. చివరి చరణం
- చలనం
- జనరల్ కంపార్ట్మెంట్
- డెఫినిషన్స్
- తలుపు తీసుకుని…
- నేనెలా రాస్తాను?
- పుస్తక పరిచయాలు
- భయోద్విగ్నక్షణంలో
- మార్చ్ 2021
- మేనక
- విశ్వమహిళానవల: 7అ. దె స్టాఎల్ ‘కొరీన్’
- శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 53
- షేక్స్పియర్ సాహిత్యలోకం: ఒక ఆలోకం
- స్పృహ