“తెలుగు కథానిక సుసంపన్నమై భాసిస్తూ ఉన్నదంటే అందుకు ముఖ్యకారణం కొన్ని దశాబ్దాల పాటు ఆ ప్రక్రియపట్ల శ్రద్ధాసక్తులు కలిగి ఉండి, దానిని జీవితేశ్వరి వలె కొందరు రచయితలు ఆరాధించి ఎడతెగకుండా రచన చేస్తూ రావడమే. అట్టి వారిలో శ్రీ నెల్లూరి కేశవస్వామిగారు ఒకరు.” అంటారు డి. రామలింగంగారు.
ఇల్లిందల సరస్వతీదేవి కథల్లో హైదరాబాద్ సంస్థానం, నవాబుల పతనం మొదలైన అంశాలపై రాసిన అయిదారు కథలు చదివినప్పుడు కొంత ఉత్సుకతతో ఆనాటి కథలు దొరికితే బాగుండు అనుకున్నాను.
ఎందువలనో నెల్లూరి కేశవస్వామి కథల గురించి ఆలోచించలేదు. మళ్ళీ హైద్రాబాదు విషాదం, ఆసఫ్ జాహీ సంస్థానం విలీనగాథ పుస్తకాలు చదివాక మళ్ళీ అనుకున్నాను అప్పటి కథలేవైనా దొరుకుతే బాగుండని.
అనుకోకుండా నాచేతిలోకి నెల్లూరి కేశవస్వామి ఉత్తమ కథలు పుస్తకం వచ్చింది. ఇందులో పదకొండు కథలు అంతకుముందు 1981లో చార్మినార్ కథలసంపుటిగా వెలువడినవే. అవి గాక మరో పది కథలు వున్నాయి. ముందు ఈ కథల గురించి వివరిస్తాను. ఈ పది కథలు పది వైవిధ్యమైన అంశాలతో ఒకింత వ్యంగ్యాత్మక హాస్యంతో ఉన్నాయి. వాటిలో ‘ప్రజా, ఉద్యోగి, మంత్రి’ కథ ప్రజలకు మంత్రికీ మధ్య నలిగిపోయిన ఉద్యోగి కథ.
పరీక్ష కథలో ఛాందసుడైన ఉద్యోగికి ఉన్న ఒక అలవాటు సాయంత్రమయేసరికి నిషానిచ్చే ద్రవం కావాలి. కానీ ఉద్యోగ కార్యార్థియై ఇతరమతస్తులైన ఇన్‌స్పెక్టర్, డ్రైవరుతో వెళ్ళాల్సి రావటం, అనేక కారణాల వలన ఆలస్యం కావటంతో ఆ రాత్రి అక్కడే ఉండాల్సి రావటం, తాను వండుకొని తినలేక, ఇతరమతస్తులైన వారిచేతి నీళ్ళు కూడా తాగలేక, రాత్రికి మందు దొరక్క ఎలా అలమటించాడో వ్యంగ్యాత్మకంగా రాసిన కథ. చదువుతున్నంత సేపూ ఆనాటి పరిస్థితులు, ఛాందసత్వం, దానివలన వచ్చే యిక్కట్లు దృశ్యమానమౌతాయి.
1944 భారతిలో పడిన ‘అతిథి’ కథలో ఆర్థిక పరిస్థితుల రీత్యా ఇంటికి అతిథులు వస్తే బెంగ పెట్టుకొనే రోజులు కనిపిస్తాయి. అందువలన వచ్చినవాళ్ళు ఇంట్లో తిష్టవేయకుండా, మర్యాదగా ప్లాను వేసి పంపించడాన్ని హాస్య ధోరణిలో రాశారు కేశవ స్వామి. స్వాతంత్రోద్యమంలో తాను కూడా పాల్గొన్నాననే ఉత్సాహంలో స్కూలు నుండి వచ్చి గర్వంగా తల్లితో తన ఘనకార్యం చెప్తుంటే, స్కూలు ప్రిన్సిపాల్ నుండి ఫిర్యాదు అందుకొన్న తండ్రి ఉగ్రుడై మూర్తిని చావబాదుతే అతని ఉత్సాహం ‘పాలపొంగు’లా చల్లారిపోతుందంటారు రచయిత.
అయితే ఈ కథలన్నీ ఒక ఎత్తు. చార్మినార్ కథలు మాత్రం నెల్లూరి కేశవస్వామిని కథనరంగంలో అత్యున్నత స్థాయికి చేర్చాయని చెప్పదగినవి.
స్వాతంత్య్రానంతరం హైద్రాబాద్ సంస్థానం భారత యూనియన్‍లో విలీనం అయ్యాక ఈ ప్రాంతమంతా పాత కొత్తల కలయికలతో అలవరచుకొన్న జీవనవిధానం అక్షరబద్ధం చేసిన కథలే చార్మినార్ కథలు. కొత్త జీవనవిధానంలో పాత అలవాట్లు మానుకోలేక పాలకసంస్కృతి, ప్రాభవం కలగలసిన హైదరాబాదు సంస్కృతిని నిలువెత్తున చూపిన కథలివి. అవి ఫ్యూడల్ సంస్కృతిగా కూడా చెప్పుకోవచ్చును.
ఈ నేపథ్యంలో రాసిన కథలు చదివినపుడు ఎన్నడూ ఎరగని అనుభూతికి లోనవుతాం. అది ఒక మంచి కథ చదివిన సంతోషమా? కాదు. కథాంశంలోని దుఃఖమా? అదీకాదు. ప్రతీకథా చదివిన వెంటనే మరోకథ చదవలేము. కథ చదివిన తర్వాత కొంతసేపు కళ్ళుమూసుకుని మౌనముద్రలోకి వెళ్ళిపోతాం. మూసుకున్న కళ్ళ వెనక మన ఆలోచన దేవిడీలను చుట్టబెడుతుంది. మెహబూబ్ కి మెహందీలు, కోఠీలలోకి తొంగిచూసి ఆ పరదాలకు అంటుకున్న తడిని తాకుతుంది. నవాబులు, బేగంసాహెబాలు, ఖాజీలు, హకీం సాహెబులను గమనించి పక్కకు తప్పుకుంటుంది మన ఆలోచన కూడా. అంతలోనే షల్వార్లు, జలతారు చమ్కీలు, ముఖమల్ స్లిప్పర్లు తోడుక్కోవాలని ముచ్చటపడుతుంది. పరదాలను ఎత్తిపట్టి, ఆ జీవిత సంఘటనలను, సన్నివేశాలను కళ్ళముందుకు తెస్తుంది. అక్కడ జరుగుతోన్న ముజ్రాలు లీలగా వినిపిస్తాయి. ఇలా ఇలా ఎన్నో భావ సంచలనాలు మన మనసులో కూడా సంచలనం కలిగించటంతో ఒక కొత్త అనుభూతికి లోనవుతాం. అవి పాఠకులు ఎవరికి వారు అనుభవించాల్సిన అనుభూతి.
నవాబుల ఇళ్ళల్లో దాసీలను ఆటవస్తువులుగా వాడుకునే ఆచారం కాలం మారినా మానలేదు. పెద్దకొడుకు కోసం ఏర్పాటైన దాసి ప్రసవవేదనతో కనలేక ప్రాణం వదులుతుంది. రెండవ కొడుక్కోసం ఏర్పాటైన జుగ్నూకి గర్భం రాగానే ప్రవాసంలోకి పంపబడి తిరిగి వచ్చేసరికి యాంత్రికంగా మారుతుంది. ఆలీగఢ్‌లో చదువుతోన్న చిన్నకొడుకు సుల్తాన్ ఈ ఆచారాలకు జుగుప్స చెంది, తన కోసం కేటాయించబడిన షేరీని దాసిగా తీసుకెళ్తున్నానని చెప్పి దూరప్రాంతాలకు వెళ్ళిపోయి వివాహం చేసుకొని షేరీకి ఆ అనాచారం నుండి ‘విముక్తి’ కలిగిస్తాడు.కథ చదువుతున్నంతసేపూ ప్రతిభావంతులైన దర్శకుని చలనచిత్రం చూస్తోన్న అనుభూతి కలుగుతుంది.
ముజ్రాలు చేసే రాధకి ఆమెతల్లి ఒక షేక్‌తో ‘కన్నెరికం’ చేయతలపెడితే రాధ తాను ప్రేమించిన సంగీతగురువుతో పారిపోయి దురదృష్టవశాత్తు పోలీసులకి చిక్కి అక్కడ కన్యాత్వంను కోల్పోవడాన్ని చదివి భారమైన గుండెలతో నీరైపోతాము.
రాధ చెల్లెలు రమణి పాట విన్న నవాబుగారు ఆమెని తన దేవిడికి తీసుకురమ్మని ప్రతిరోజూ కారు పంపుతుంటారు. రమణి దేవిడీకి వెళ్ళి పాటలు పాడి నవాబుతో కలసి విందారగించి తిరిగి వస్తుంటుంది. నవాబు రమణిని ‘రూహీ’ అని ఆప్యాయంగా పిలుస్తాడు. నవాబు కొడుకు వచ్చి రూహీని చూసి విస్తుపోయి ఆమెని దేవిడీలోని ఒక గదిలోకి తీసుకువెళ్ళి అక్కడ ఒక తైలవర్ణచిత్రాన్ని చూపించి ఆమె తన సోదరి ‘రూహీ ఆపా’ అని చెప్తాడు. నవాబుకి తనపై గల ఆత్మీయతకు కారణం తెలుసుకొంటుంది రమణి. అంత వరకూ నవాబు కొడుకు సలీంపై ప్రేమ భావన పెంచుకొన్న రూహీ భరించలేక వెళ్ళిపోతుంది. ఈ కథ ఉత్కంఠభరితంగా ఉండటమే కాకుండా సంఘటనలను ఒక స్క్రీన్ ప్లేలా రచయిత పాఠకులకు దర్శింపజేస్తాడు. పాఠకులు కూడా కథతో పాటు ప్రయాణం చేసిన అనుభూతి పొందేలా రాయడంలో నెల్లూరి కేశవస్వామి రచనా విన్యాసం అద్భుతంగా వుంటుంది.
షరీఫా అనే చిన్న కథని ఉత్తమపురుషలో రాశాడు రచయిత. అతన్ని రిక్షాలో ఉన్న షరీఫా అనే వేశ్యతో ఆమె ఇంటికి తీసుకువెళ్తాడు రిక్షావాలా. షరిఫాని కౌగలించుకుని ఆమె పాలిండ్లని తాకేసరికి చివ్వుమని పాలు అతని ముఖాన్ని తడుపుతాయి. అంతలో పక్కనే పరదాలోవున్న బాబు ఏడుస్తాడు. ఆ వ్యక్తి ఆమెకు డబ్బు ఇచ్చి వెళ్ళిపోబోతే ఆమె ఉగ్రరూపంలో ఆ డబ్బు రిక్షావానితో పంపించి ‘బిక్షగాళ్ళం కాదు’ అంటుంది. రిక్షావాడు ‘ఆమె తన భార్య’ అని చెప్పేసరికి అతను విస్తుపోయి డబ్బు నీ కొడుకుకి కానుకగా ఇస్తున్నానని అనడంతో కథ ముగుస్తుంది. మనసుని చెమ్మ చేసే ఈ కథ కథాకాలం ఖచ్చితంగా తెలియక పోయినా 40-50లలో రెండవ ప్రపంచ యుద్ధానంతరం సామాన్య జనం ఆర్థిక అవసరాల ఆటుపోట్లతో అతలాకుతలం అవుతోన్న కాలం కావచ్చు. దీని ప్రభావంలో ఒక బీద ముస్లిమ్ కుటుంబ నేపథ్యంగా చెప్పిన చిన్న కథ ఇది.
తిండికి బట్టకి లోటులేకుండా ధనవంతుడిగా బతకటమేనా, లేదా ఏమి ఉన్నా లేకున్నా సంతృప్తిగా బతకడమా? ఏది అదృష్టం అంటే అనేటువంటి విచికిత్సను రేపే కథే ‘అదృష్టం’. దాసిగా ఉన్న లచ్చుకి నవాబు ద్వారా పుట్టినవాడు పాషూ, లచ్చు పాలతో పెరిగినవాడు నవాబు పాషా. నవాబు పాషా దాసి పుత్రుడిగా పాషూని హింసిస్తూవుంటాడు. తనతో ఆడుకున్న గుడ్డీరాణి నవాబు భార్య అవుతుంది. నవాబు వల్లనే తాను పుట్టానని తెలుసుకున్న పాషూ ప్రతీకారంతో రగిలిపోతాడు. చివరకు గుడ్డీరాణి తన పొందు ఆశించటంతో పాషూ పగతీరుతుంది.
ఈ కథలో నవాబు కొలువులో పనిచేసే స్త్రీ పురుషులకు బతుకు ఏ విధంగా కత్తి మీద సాములా క్షణక్షణం భయంగా సాగుతుందో చిత్రించారు రచయిత. ఆత్మీయతలు ఛిద్రం కావటాన్ని ప్రతిభావంతంగా చూపారు. పరదాల వెనక మరుగు పడిన జీవితాలను, సంఘటనలను, సన్నివేశాలనూ మన కళ్ళముందు చలన చిత్రాల్లా దృశ్యీకరణ చేస్తారు రచయిత. నవాబుల ఇళ్ళల్లో దాసీలను ఆటవస్తువులుగా ఆడుకొనే ఆచారాల్ని, ఆటపూర్తి కాగానే ఆ వస్తువును విసిరిపారేయటం మామూలేననేది పాఠకులకు విభ్రమ కలిగిస్తుంది.
17 సెప్టెంబర్ 1948, పోలీస్ యాక్షన్ జరిగిన మూడోరోజు నుండి సుమారు నాలుగురోజులుగా జరిగిన సంఘటనలు, రజాకార్లుగా మారిన ఉన్నతోద్యోగులైన ముస్లిమ్ యువకులు భారత సైన్యం చేతిలో పడితే ఏమౌతామోనని క్షణం యుగంగా అజ్ణాతంలోకి పోవటం, మెజారిటీగా ఉన్న హిందువులు కూడా ఎప్పుడేమౌతామోనని ప్రాణాల్ని పిడికిట్లో పెట్టుకు బతకడం, మంచి స్నేహితులైన హిందు ముస్లిమ్ యువకులు రాజకీయపరిణామాల నడుమ మానసికంగా నలిగిపోవటం – పాఠకులు కూడా చదువుతున్నంతసేపూ ఒక ఉత్కంఠతో ఒక ద్వైదీభావనకు లోనైపోతారు. ఈ కథలలో స్వామి అనే హిందు యువకుడు రచయితే కావచ్చు. తన స్వానుభవంలోని సంఘటననే ఒక కథగా అక్షరీకరించి ఉండొచ్చుననేలా గొప్ప కథగా ‘యుగాంతం’ను అక్షరబద్ధం చేశారు. ఈ కథ ఒక సంస్కృతిని, ఒక చరిత్రని నిక్షిప్తం చేసుకున్న గొప్పకథగా కథాసాహిత్యంలో నమోదు చేయాల్సిన కథ.
కొన్ని కథల్లో చదువుకొని కొంత ఆధునిక భావజాలంగల ముస్లిమ్ యువకుల పాత్రల్ని కూడా ప్రతిభావంతంగా రూపొందించారు కేశవస్వామి. అటువంటి పాత్రలలో ఇమ్రాన్ ఒకడు. రక్త సంబంధ వివాహాలకు వ్యతిరేకి అయినా తండ్రి మాటకు తలవంచి పెద్దనాన్న కూతురు నజ్మాను పెళ్ళి చేసుకుని విదేశాలకు చదువు నిమిత్తం వెళ్తాడు. నజ్మా గర్భవతిగా వున్నప్పుడు తీవ్ర అనారోగ్యంపాలు కావటంతో వంశాకురం కోసం చర్చ జరుగుతుంది. ఆపరేషన్ వలన తల్లీబిడ్డలలో ఒక్కరినే బతికించగలం అని డాక్టర్లు చెపుతారు. బిడ్డ ఆపరేషన్లో పోయినా నజ్మా బతకాలనే ఇమ్రాన్ కోరిక ప్రకారం నజ్మా బతుకుతుంది. మతాచారం ప్రకారం వంశాకురం కోసం ఇమ్రాన్‌పై జరిగే ఒత్తిడి తెలిసి నజ్మా ఆత్మార్పణం చేసుకుంటానని చెప్పి ఉత్తరం రాయటంతో కథ ముగుస్తుంది. ఆత్మహత్య పరిష్కారంగా – ఒకప్పుడు చాలా కథలు నవలలు వచ్చాయి. అప్పటి పరిస్థితులకు అదే సమాధానమేమో. ఈ రచయిత కూడా అలాగే రాయటం అంత సమంజసంగా నాకు అనిపించలేదు.
కేశవస్వామి రాసిన ‘చతురస్రం’ ప్రత్యేకంగా చెప్పవలసిన కథ. ఇందులో కథ వెంకట్రావు చుట్టూ నడుస్తూ తాత్విక చింతన పాఠకులని కల్లోలపరుస్తుంది. వెంకట్రావు ఒక గదిలో ఒంటరిగా మానవ సంబంధాలపై విసుగుతో జీవితంపై విరక్తి చెంది ఉంటాడు. వెంకట్రావుకు విందులూ వినోదాల్లో హాయి దొరకదు. దేశాటనలో హాయి దొరుకుతుందేమోనని అన్వేషిస్తాడు. ఆ సందర్భంగానే రైల్లో ప్రయాణిస్తూ లేచేసరికి ట్రైన్ యాక్సిడెంట్‌తో అరుపులు, కేకలు, ఏడ్పులు, పెడబొబ్బలూ వినిపిస్తూ ఉంటాయి. కొంతమంది యాక్సిడెంట్ అయిన బోగీల దగ్గర సహాయం చేయటానికి పరిగెడుతుంటారు. కానీ వెంకట్రావు సహాయం చేయడానికి వెళ్ళడు. వాళ్ళకు సాయం చేయడానికి నేనెందుకు వెళ్ళాలి అనుకుంటాడు. దెబ్బలు తగిలినవాళ్ళను చూసి మిగిలినవాళ్ళు రోదిస్తుంటే… వాళ్ళను చూసి నేనెందుకు బాధపడాలి, నేనెందుకు సానుభూతి చూపించాలి అని తన జీవితాన్ని గుర్తు చేసుకుని తన బాధల్ని, తన సంపాదన కోసం బంధువులతో గొడవల్నీ వెంకట్రావు గుర్తు తెచ్చుకుంటాడు. చతురస్రం కథ సంఘటనాత్మకంగానేకాక కవితాత్మకంగా సాగుతుంది. కథ వెంకట్రావు చుట్టూ తాత్విక చింతనతో నడుస్తూ వుంటుంది. మనిషికి హాయి అనేది ప్రేమలో, ఇతరులకు సాయం చేయడంలోనే ఉందని రచయిత చివరకు చెప్తాడు. మానవ సంబంధాలపై విసుగు చెందిన వెంకట్రావుకు ఆ మానవ సంబంధాల్లోనే హాయి ఉందని చెప్పడం ముఖ్యంగా ఈ కథా వస్తువులోని ప్రత్యేకత.
ఈ విధంగా నెల్లూరు కేశవస్వామి రాసిన ప్రతీ కథా చదివిన తర్వాత పాఠకులకు ఒక ఆలోచనా, ఒక తాత్విక చింతనా మనసునిండా ఆవహిస్తాయి. కొంతకాలంవరకూ వెంటాడుతూనే ఉంటాయి. చరిత్రా సంస్కృతుల తలుపులు తెరిచి చూపిన కథకుడు నెల్లూరి కేశవస్వామి.
(ప్రతులకు: అమెజాన్.ఇన్)