చాగంటి తులసి రచనల్లో రంగులూ రాగాలూ

విజయనగరం అనగానే గంటస్తంభం గుర్తొచ్చినట్లు, మధురవాణో, గిరీశమో ఎదురైనట్లు, నోట్లో చుట్టతో దీర్ఘంగా చూస్తున్న చాసో కనబడినట్లు – ఆలోచనల్లోకి ముఖం నిండా ప్రసరించే నవ్వుతో చాగంటి తులసి కూడా వస్తుంది.

ఆమె కొన్ని రచనలు సరదాగా చదువుకునేలా సాధారణ పాఠకుడికి అనిపిస్తాయేమో కాని లోతుగా పరిశీలించినప్పుడు ప్రతీదీ విభిన్నకోణంలో ఆలోచింపజేస్తాయి.

రంగంటే ఇష్టం పేరిట సాహితీ చింతనలు అనే టాగ్‌లైన్‌తో, నలభై వ్యాసాల ఒక సంపుటి వెలయించారు తులసి. అందులో తొమ్మిది గురజాడ సాహిత్య చింతనలే. గురజాడ కవిత్వం గురించి గురజాడ కార్యకారణ సంబంధ జ్ఞానంతో హేతుబద్ధతతో ప్రజల బతుకు గురించి ఆలోచించి జీవిత వాస్తవికతను అవగాహన చేసుకున్నాడంటారు రచయిత్రి. గురజాడ సమకాలీన భారతీయ కథకుల గురించి వివరంగా తెలియచెప్పారు. పూర్ణమ్మ కథని ఎత్తుకున్న దగ్గరనుండి ముగింపు వరకూ ఏకోన్ముఖంగా అనుకున్న అంశాన్ని తీసుకు వెళ్ళడం వలన పూర్ణమ్మ కథాకావ్యాన్ని విశిష్టమైనదిగా ఆలోచన కలిగేటట్లు చేశాడంటారు రచయిత్రి. గురజాడ ప్రతిభావంతుడు కాబట్టి ఆధునిక కథానికాప్రక్రియను ఆరంభిస్తూనే వాస్తురీత్యా, శిల్ప రీత్యా పరాకాష్ఠకు చేరుకునేలా రాయగలిగాడంటారు.

ఆధునిక కావ్యాలైన తృణకంకణం, రామిరెడ్డిగారి నల్లజారమ్మ కథల లోను; అబ్బూరివారి మల్లికాంబ, నారాయణబాబు దేశమాత, శ్రీశ్రీ భిక్షువర్షీయసి వంటి కవితల లోని అనేక స్త్రీపాత్రలలో గురజాడ జాడ ఉందని రచయిత్రి సోదాహరణంగా ఈ సాహితీ చింతనలలో వివరించారు. కన్యాశుల్కంలో ‘ఎత్తడం’ పేకాట గురించి, సమాజంలో ఆ ఆట కొనసాగింపు ఆ ఆటకి చెందిన విషయాలన్నీ తెలియజేశారు. తరతమ భేదాలున్నప్పటికీ నిరసనగానో, ధిక్కారంగానో, చాకచక్యంగానో, బుద్ధి కుశలతగానో, చదువూ సంస్కారాల మేళవింపు వలన వచ్చిన తెలివిడిగానో, నిస్సహాయతలోని ఎదురుదాడిగానో, బతుకు నేర్పిన విజ్ఞతతో అణిగి మణిగి ఉంటున్నట్టే ఉంటూ సాఫల్యం చేసుకునే కార్యసాధకులుగా గురజాడ రచనలలో స్త్రీల స్వభావాలు ఉంటాయని ఒకే పేరాలో గురజాడ సాహిత్యమంతటినీ తెలియజేస్తూ ఈ వ్యాసాల్లో విశ్లేషించటం విశేషం. తులసి వ్యాసాలు చదివాక గురజాడ లోని అనేక కోణాలను పాఠకులు కూడా పరిశీలించగలుగుతారు.

కారా, చాసో, పతంజలి, రావిశాస్త్రి, ఉప్పల లక్ష్మణరావు, నారాయణబాబు, రామలక్ష్మి రచనల గురించి తాను అర్థం చేసుకున్న విధానాన్ని వివరించటంలో ఒక రచయితని ఎలా చదువుకోవాలో తెలుస్తుంది. కేవలం తెలుగు రచయితల రచనలు పరిచయాలే కాక అనేకమంది భారతీయ రచయిత్రుల సాహిత్య విశ్లేషణలను సుమారు 350 పేజీల ఈ గ్రంథంలో ఆనందంగా చదువుకోవచ్చు.

విశిష్ట చిత్రకారిణి అయిన మహాదేవివర్మ కవితలను అనువదించి, మహాదేవివర్మ వేసిన వర్ణ చిత్రాలతో పాటుగా తెలుగు సాహితీ లోకానికి చాగంటి తులసి అపురూపమైన పుస్తకంగా ప్రచురించారు. గొప్పదైన ఆత్మ సౌందర్యం, దయాగుణం కల్గిన సంస్కర్త అయిన మహాదేవివర్మ కవిత్వంలోని మూలభావాల సౌందర్యాన్ని తెలుగులోకి అనువదించటంలో సాఫల్యత సాధించింది తులసి అని డా. బాలశౌరిరెడ్డి ప్రశంసించారు.తన ముందు మాటలో ‘మూలంలోని పదసంయోజనాన్ని అది ఎక్కడెక్కడ సంస్కృత సమంగా ఉందో దాన్నంతా జాగ్రత్తగా అనువదించటంలో సాధారణంగా చాలా అనువాదాలలో కనిపించే శ్రవణ నిష్టూరత్వం కనిపించలేద’ని ప్రశంసించారు వాడ్రేవు చిన వీరభద్రుడు. అంతేకాక ఒక కవయిత్రి తన కన్నీటితో తుడిచిన వేదన మరకను ఎంతో సున్నితంగా సాహిత్యపిపాసులకు ప్రేమతో అందించారని అన్నారు.

అనువాదం చేయటమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. మరో భాషలోని కథనైనా కవితనైనా తెలుగు లోనికి అనువాదం చేసేటప్పుడు మూలరచయిత అంతరంగాన్నే కాక మూల రచనలోని ఎసెన్స్‌ను కూడా ఆకళింపు చేసుకొని భావస్ఫోరకంగా అనువదించడం నిజానికి కత్తిమీద సామే. అది చాగంటి తులసి సునాయాసంగా చేయగలరనేదానికి ఆమె ఒరియా భాష నుండి తెలుగు లోనికి అనువదించిన కథలే తార్కాణం.

మహాదేవి వర్మ మూలకవితలను, ఆ వెంటనే తన అనువాదాన్ని రెండింటినీ ప్రచురించి పుస్తకంగా వేశారు చాగంటి తులసి. మహా కవయిత్రి మహాదేవి వర్మ గీతాలు పేరిట వున్న తెలుగు అనువాద కవితలు కూడా తేలికైన అచ్చతెలుగు పదబంధాలతో వుంటాయి.

బ్రద్దలు కొట్టు క్షితిజాన్ని
అవలోకిస్తాను నేనూ
అవతలవైపు ఏముందో!
ఎందుకని నన్ను చుట్టబెట్టి
బంధిస్తోంది ప్రాచీరమై
నాశ్వాస ఈవేళ
– అంటూ ఇవి స్వీయకవితలేనేమో అనేలా అనువాదం చేసి తెలుగు పాఠకులకు తులసి పరిచయం చేశారు.

ఇంక కథలు దగ్గరకు వస్తే స్త్రీవాదం ఇంకా వేళ్ళూనక ముందే వచ్చిన యాష్ ట్రే (1976) కథలో స్త్రీ ఆత్మ గౌరవం, ఉన్నత వ్యక్తిత్వానికి అద్దం పడుతూ, సమాజంలో ఆలోచనలో కొత్తగా మార్పు చెందుతోన్న స్త్రీ పాత్రగా మలిచారు. ఈ కథ అనేక సంకలనాలలో చేరటమే కాకుండా అనేక భాషల్లోకీ అనువాదమైంది.

సమాజం వలయంలో ఇమడలేని వ్యక్తుల బాధ్యతారాహిత్యాన్ని, పలాయనబుద్ధిని వలయం కథ చెబుతుంది. మానవసంబంధాల మధ్య డబ్బు నిర్వహిస్తున్న పాత్రను విమర్శనాత్మకంగా తులసి తన అనేక కథలలో స్పష్టం చేశారు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో స్త్రీ పురుషుల మధ్య ఆర్థిక సంబంధాల పెత్తనాన్ని స్త్రీ పురుష అసమానత్వాన్ని, ఆడపిల్లల పెంపకం, చదువు, ఉద్యోగం, పెళ్ళి, ప్రవర్తన మొదలైన అంశాలలో మధ్యతరగతి ఆర్థిక, సామాజిక పరిస్థితుల ప్రభావం, దానిని ధిక్కరించడానికి స్త్రీలు చేసే పోరాటాలు చిన్న దేవేరి, యాష్ ట్రే, వలయం కథలలో గమనించవచ్చు. అమాయకపు ఆడవాళ్ళపై జరిగే మగాళ్ళ దాష్టీకాన్నీ, దానికి వంత పాడే కొందరు ఆడవాళ్ళ పాత్రనీ ఆడదాయికి నోరుండాల, శరణ్యం కథలలో రచయిత్రి అక్షరీకరించారు.

ఇవన్నీ ఒక ఎత్తయితే ఇటీవల అయిదారు నెలలు క్రితం వరకూ ఈమాట అంతర్జాల పత్రికలో వ్రాస్తున్న ఊహల ఊట పేరిట అందించిన బాల్యజ్ణాపకాలు ఇంద్రధనుస్సు మీద విహరించేంత ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఉత్తరాంధ్ర మాండలిక సొబగుని, సుమారు అరవై ఏళ్ళక్రితం ఇళ్ళల్లో వాడిన వస్తు పరిచయం, ఆటలూ పాటలూ, బ్రాహ్మణ కుటుంబాలలోని వ్యావహారిక పదాలతో కూడిన కబుర్లనీ చదువుతోన్న పాఠకులు కూడా బాల్యపు తొడుగులోనికి దూరిపోయి తులసితో పాటు వారు కూడా చేయి చేయి కలిపి తిరిగిన అనుభూతిని కలిగిస్తాయి.

చివరగా, బతుకు గతుకుల్లో గట్టి దెబ్బ తగిలినప్పుడు అవి కరిగి బయటకు తేలతాయి. నమ్మినవాళ్ళకు దేవుడు ఒక ఆసరా. నాకు నేనే ఆసరా, నాకు నేనే బలం అనుకుంటే, మనసును స్వాధీనపరచుకోగలిగితే, కార్యకారణ సంబంధాలను హేతుబద్ధతతో వివేచించగలిగితే దారి స్పష్టమవుతుంది – అనే చాగంటి తులసి నవల, కథ, అనువాదం, వ్యాసం, ఇలా ఏ రచన చేసినా ఆమెదైన శైలీ, దృక్పథం వెల్లడౌతుంది.