పూర్ణిమ తమ్మిరెడ్డి రాసిన కథలనుంచి ఒక నాలుగు కథలను ఎంచుకుని వాటిని పరిశీలించదలచుకున్నాను. ఆ నాలుగు కథలు ఇవి: 1. ఒక సంస్కారవంతమైన కథ, 2. ఎడిట్ వార్స్, 3. కెరీర్ ఓరియంటెడ్ మాన్, 4. ఏనాడు విడిపోని ముడి వేసెనె.
ఈ నాలుగు కథలు వస్తుపరంగా ప్రయోగాత్మకమైన కథలు. స్వీకరించే వస్తువు కొత్తదైనప్పుడు, మూస వస్తువుల్ని కాదని కొత్త వస్తువులతో కథలు రాసినప్పుడు ప్రయోగమే అవుతుంది మరి! అన్ని కథలు సమకాలీన కథలు. ఇవాల్టి కథలు. ఆధునిక సమాజంలో సంభవిస్తున్న మార్పులే ఆమె కథలకి వస్తువులు. ఇక కథలు వస్తుపరంగానే కాకుండా, రూపపరంగా వైవిధ్యాన్ని, విలక్షణతనీ కూడా కలిగివున్నాయి. రచయిత్రి పూర్ణిమ చూసే దృష్టిని బట్టి ఆ వైవిధ్యం, విలక్షణత వాటికి వచ్చాయి.
మొదటి కథ ఒక సంస్కారవంతమైన కథ ఆలోచనాత్మకమైంది. ఇందులో కథ రాసే రచయిత్రికి కూడా పాత్ర ఉంటుంది. సమాజంలో జరుగుతున్న మార్పులకీ, సంఘటనలకీ అందరూ ఆలోచించి సమాధానాలు వెతికే విధంగా కాకుండా విభిన్నంగా, ఛాందస భావాలకి వ్యతిరేకంగా పరిష్కారాలు చూపే రచయిత్రులు ఎదుర్కొనే సమస్యలు ప్రసావించబడ్డాయి. పెళ్ళికి ముందు ఆమె రాసిన రాతలకి ఆమెని పెళ్ళి చేసుకోవాలనుకున్న యువకుడి తరపువాళ్ళు ఎంత అభ్యంతరం పెట్టారో చూపబడింది. ఆ రాతలన్నీ ఫిక్షన్ అని, ప్రాస్టిట్యూట్‌ని గురించి విపులంగా రాసిన రచయిత్రి ప్రాస్టిట్యూట్ అవ్వాల్సిన పనిలేదని చెప్పినా వాళ్ళు వినిపించుకోలేదు. అమాయకురాలా పాపం? కానీ రాసేటప్పుడు అలా బరితెగించి విపులంగా ఎలా రాసింది? అని ప్రశ్నించారు. పెళ్ళయిన తర్వాత ఆ బ్లాగుల్లో రాయడం మానేయాలని అత్తమామలు ఆంక్షలు పెట్టారు. పెళ్ళికి ముందే ఇన్ని ఆంక్షలు, ఇక పెళ్ళయితే ఏం చేస్తారోనని రచయిత్రి అన్నయ్య సంబంధానికి ఒప్పుకోలేదు. రచయిత్రి బ్లాగు డిలీట్ చేసింది. తర్వాత అదృష్టవశాత్తూ ఆమెని అర్థం చేసుకునే భర్త లభించాడు.
ఇలా రాసే రచయిత్రులకీ, రచయితలకూ సమాజంలోని వ్యక్తులు వేరువేరుగా స్పందిస్తారని వ్యత్యాసం చూపిస్తారని కూడా కథలో చెప్పబడింది. ఫేస్‌బుక్, వాట్సాప్‌ల్లో రచయిత్రి ఎన్నో మాటలు, విమర్శలు, విసుర్లు పడవలసివస్తుంది. కొందరు ఆమె భర్తకి మెయిల్ చేసి ఆవిడ ఇలా రాస్తుందంటే ఎలాంటిదో ఆలోచించుకో అని కూడా రాశారు. ఇక విభిన్నంగా రాసే రచయితల గురించి చూద్దాం! ఒకాయన కథలో నాకు ఫలానా ఆడదానిపై ఆపుకోలేని కోరిక కలిగింది అని రాశాడు. ఇంకొకాయన ఒకానొక ఆడదానికి ఆపుకోలేని కోరిక కలిగిందని రాశాడు. అక్కడే వచ్చింది చిక్కు! అది పెద్ద దుమారం లేపింది. మొదటిదాన్ని ఆమోదించిన పాఠకులు రెండోదాన్ని ఒప్పుకోలేకపోయారు.
ఇక పాత్రల దగ్గరికి వస్తే ముప్ఫయి దాటిన ఒక అబ్బాయి, ఒక అమ్మాయిల మధ్య పెళ్ళిచూపులు జరుగుతాయి. వాళ్ళిద్దరికీ అప్పటివరకు ఎందుకు పెళ్ళి కాలేదంటే బాధ్యతల వలన అబ్బాయికి, అందచందాలు, కట్నం విషయంలో అమ్మాయికి పెళ్ళి కాలేదు. వాళ్ళిద్దరూ మాచ్‌మేకింగ్ ప్రాసెస్‌లో ఎందరినో కలుసుకుని వేసారిపోయారు. జాతకాలు కలవలేదని అబ్బాయి తరపువాళ్ళు ఈ సంబంధం కూడా తిరగొట్టారు. అయినా అబ్బాయి కోరిక మీద వాళ్ళిద్దరూ రెస్టారెంట్‌లో కలుసుకున్నారు. జాతకాలు బోగస్, మనస్సులు మాయ, నిఖార్సైనవి మన శరీరాలు మాత్రమే! అవి కలవాల్సినవి అన్నాడు అబ్బాయి.
దానికి అమ్మాయి ఎలా స్పందించింది? అది రాయడానికి రచయిత్రి చాలా సందేహించింది. ధైర్యంగా రాయలేకపోయింది. చివరికి ఇన్‌డైరెక్టుగా అమ్మాయి పాత్ర తన నిర్ణయం తీసుకున్నట్లు రాసింది. జరిగిందేమిటంటే అబ్బాయి కోరిక మన్నించింది అమ్మాయి. వాళ్ళిద్దరూ ఇంకో ఊర్లో కలుసుకుని రాత్రి గడిపారు. అబ్బాయిని ప్రేమించకపోయినా అమ్మాయి అతనితో గడపడానికి ఇష్టపడింది. ఇక్కడ అలా కలుసుకోవడం సబబేనా కాదా? అన్న ప్రశ్న వస్తుంది. దానిమీద సుదీర్ఘమైన చర్చ జరిగే అవకాశం ఉంది. అది వదిలేస్తే రచయిత్రి కథకు ఇచ్చిన ముగింపు బాగుంది. కథను తనకు నచ్చే విధంగా రాసుకునే అధికారం, తనకిష్టమైన రీతిలో ముగింపు ఇచ్చే స్వేచ్ఛ రచయిత్రికి ఉండాలి. ఆ అధికారాన్ని, స్వేచ్ఛని గౌరవించే భర్త లభించడంతో సంస్కారవంతమైన కథగా ముగుస్తుంది. ఈ కథలో రచయిత్రి అన్నను, భర్తను అభ్యుదయ భావాలు కలవారిగా చూపించడం విశేషం! ఇది స్త్రీవాద రచన.
ఈ కథ మనకి డిసెంబర్, 2021లో వచ్చిన కల్పనారెంటాల కథా సంపుటి అయిదోగోడలో అదే పేరుతో రాసిన కథని మనకు గుర్తుకు తెస్తుంది. అందులో భర్త చనిపోయిన శారద వెంటనే ఒక తోడు కావాలని కోరుకోవడం, ప్రకటన ఇవ్వడం, భార్య చనిపోయిన మగవాడు తోడు కోసం పెళ్ళి చేసుకొనడానికి పెద్దగా అభ్యంతరం చూపని కూతురు మొదట దీన్ని ఆమోదించలేకపోవడం కథా వృత్తాంతం. కథలో రచయిత్రిని శారద పాత్ర నిలదీసి ప్రశ్నించడం కథకు హైలైట్! ముందుగా ఆనందంగా జీవితాన్ని ఎంజాయ్ చేయడం కోసం తోడు వెతుకుతున్నట్టు రాసి తర్వాత సామాజిక సేవాకార్యక్రమాలు చేయాలనే ఉత్సాహం ఉన్నవారికీ, సంగీతం సాహిత్యాలలో అభిరుచి ఉన్నవారికీ ప్రాధాన్యత ఇస్తామని ప్రకటనలో చేర్చడం స్త్రీ ఎందుకు పెళ్ళి చేసుకోవాలో ముందే నిర్ణయించి సరిహద్దు గీసినట్టు కాదా? శారీరక సుఖం కోసం తోడు కావాలని కోరుకోవడం మొగవాడి విషయంలో ఆమోదింపబడినపుడు స్త్రీ విషయంలో ఎందుకు మారింది? రెండు కథలలోనూ స్త్రీ ల విషయంలో నిజాలను నిక్కచ్చిగా రాయడానికి రచయిత్రులు ఎలా వెనుకంజ వేశారో చూపబడింది.
రెండవ కథ ఎడిట్ వార్స్ దేశ రాజధానిలో జరిగిన మతకలహాలు నేపథ్యంగా రాసిన కథ. అన్ని అంశాలను, కలహాల ముందు వెనుక జరిగిన సంఘటనలను క్షుణ్ణంగా పరిశీలించి ప్రజల ముందుకి నిజాలను తెస్తుంది ఇన్‌ఫర్‌మేషన్ సైట్ వికీపీడియా. అందుకు సహాయపడుతుంటాడు ‘అలక్ వి42’ అనే ఐ.డి.గా మారిపోయి వ్యాసాలు రాసే ఒక అజ్ఞాత వ్యక్తి! దేశ రాజధాని నైరుతి ప్రాంతంలో మార్చి 2020లో జరిగిన మారణహోమం, విధ్వంసానికి ముఖ్యకారణం కచటతపలు (అధికార పార్టీకి సంబంధించిన వర్గం). వారు గజడదబలనే (మైనారిటీ కమ్యూనిటీవారు) వర్గాన్ని వెంటాడి, వేటాడి చంపారు. చనిపోయినవారిలో ఎనభై శాతం గజడదబలే!
ఇది శాంతియుతంగా జరుగుతున్న గజడదబల ర్యాలీపై ఉన్నట్టుండి రాళ్ళదాడి జరిపి, చెల్లాచెదురైన మనుషులని రాళ్ళతో కొట్టడంతో ప్రారంభం అయింది. మృతులలో పోలీస్ ఆఫీసర్లు, జర్నలిస్టులు, స్టూడెంట్లు కూడా ఉన్నారు. ధ్వంసమైన ఆస్తుల తీవ్రతను తెలియచెప్పే అసలు ఫోటోలను మార్ఫ్ చేసి, వాటిలో బాధితులకు చెందిన కొందరిని ఫోటోషాప్ చేశారు హింసను ప్రేరేపిస్తున్నట్టు అర్థం వచ్చేలా.
నిజాలు బయటపెట్టిన వికీపీడియా పేజీని తారుమారు చేశారు. చనిపోయిన చాలామందికి క్రిమినల్ రికార్డులున్నాయనో, వాళ్ళు శత్రుదేశంవాళ్ళు పంపిన టెర్రరిస్టులనో ఫేక్ ఫోటోలు పెట్టారు. చివరకు వికీపీడియాని అవకతవకల, అవినీతి సంస్థ అన్నారు. ‘అలక్ వి42’ ఉద్యోగం ఊడింది. ఫేస్‌బుక్, ట్విట్టర్ అకౌంట్లలో ట్రోలింగ్ మొదలైంది. ఇదీ క్లుప్తంగా జరిగిన కథ.
నిజాలకు మసిపూసి మారేడుకాయ చేసి వర్చువల్ రియాలిటీ వికృతరూపం చూపించిన వినూత్న కథ ఇది. ఇందులో వస్తువు మాత్రమే కాదు అది ప్రతిపాదించిన తాత్వికత కూడా చాలా సమకాలీనమైనది. నూటికినూరుపాళ్ళు ఇవాల్టిదైన ఈ కథలో సత్యం ఎంత పెళుసుబారిందో చూపబడింది. రచయిత్రి ఎంత తటస్థంగా ఉండాలనుకున్నా తనవైన అభిప్రాయాలు, దృక్పథాలు దాచుకోలేకపోయింది. నిజాలు హత్యకు గురవుతున్న క్రమం పట్ల రచయిత్రికున్న ఆగ్రహం కథలో మనకు కనబడుతుంది. ఫాసిస్టు పాలకులు నిజాలను గల్లంతు చేయడానికి ఎన్ని ఎత్తుగడలు వేయగలరో చూపించారు. దానికి ఆమె వ్యంగ్యాన్ని ఆయుధంగా వాడుకున్నారు. ఎక్కడా వర్గాల పేర్లు బయటపెట్టకుండా జరిగిన దాన్ని నిర్భయంగా, చాకచక్యంగా, విపులంగా రాయడం పూర్ణిమగారికే చెల్లింది! అసలు ఒక రచయిత్రి ధైర్యంగా ఇలాంటి కథ రాసిందంటేనే ఆశ్చర్యం కలుగుతుంది! ఈ కథని ఈమాట వెబ్ మాగజైన్ వాళ్ళు నిస్సంకోచంగా ప్రచురించడం ముదావహం!
మూడవకథ కెరీర్ ఓరియంటెడ్ మాన్ స్త్రీల ఆధిపత్యంలో అంటే మేట్రియార్కల్ సొసైటీ డామినేషన్‌లో పురుషుల జీవితాలు ఎలా ఉంటాయో చెప్పింది. ఈ కథ ఇన్‌డైరెక్టుగా నేటి పురుషాధిక్య సమాజంలో అంటే పేట్రియార్కల్ సొసైటి డామినేషన్‌లో మహిళల పరిస్థితి ఎలా ఉందో చెప్తుంది. ప్రస్తుత పరిస్థితులకు రివర్స్‌గా ఆలోచించి రాసిన కథ. ఇందులో కథానాయకుడు పడుతున్న, అనుభవిస్తున్న పరిస్థితులన్నీ స్త్రీలు పడుతున్న బాధలూ, ఇబ్బందులే! నిజానికి ఇది స్త్రీవాద కథ!
నాల్గవ కథ ఏనాడు విడిపోని ముడి వేసెనె ఆబ్‌స్ట్రాక్ట్‌గా ఉంది. చెప్పే విషయం ఏమిటో స్పష్టంగా తెలియదు. ఒక యువతీయువకుల జంట. అతనిలో ఏదో తెలియని బాధ వంటిది ఉంది. అది ఆమె అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ అతను ఆమెను దగ్గరికి రానివ్వడు. వారిద్దరి మధ్య దూరం రగ్గులోని ఊలు దారాలుగా చూపబడింది. కథ ముగింపు మాత్రం జంటని దగ్గర చేసి సుఖాంతంగా ముగిసిందని తెలుస్తుంది.
కథల్లో నచ్చని అంశాలు కూడా ఉన్నాయి. కొన్నిసార్లు కథల నిడివి అనవసరమైన విషయాలతో పొడిగించారని అనిపిస్తుంది. ఉదాహరణకి మొదటికథలో రచయిత్రి తన కొడుకు కోసం కేకులు ఇంట్లోనే తయారుచేసే పద్ధతిని నేర్చుకోవడం లాంటివి. ఇది కథను ఏ ఉద్దేశాల కోసం రాశారో వాటినుంచి డివియేట్ అయినట్లనిపించింది. తనని తాను మంచి హౌస్‌వైఫ్‌గా చూపించడానికి రాశారా? అదే కారణం అయితే ఒకటి రెండు వాక్యాల్లో రాస్తే సరిపోయేది. కథ నిడివిని అనవసరంగా పెంచే అవసరం ఉండేది కాదు. అలాగే రెండవ కథలో 2048ల కాలంలో సోషల్ మీడియా పూర్తిగా పాలకుల హస్తాల్లో చిక్కుకుపోయినట్లు చూపించడం, దానికి సంబంధించిన ఇతర విషయాలు కథకు అవసరమా అనిపించింది.
ఇక ఈ కథలు బాగా చదువుకున్న మిడిల్‌క్లాస్, అప్పర్ మిడిల్‌క్లాస్ పాఠకులను దృష్టిలో ఉంచుకుని రాసినట్లనిపిస్తుంది. ఒక్కోసారి కథలు సూటిగా, టు-ది-పాయింట్‌గా కాకుండా, ఇన్‌డైరెక్టుగా, అనేకములైన నుఆన్సెస్‌తో, ట్విస్ట్‌లతో, ఆబ్‌స్ట్రాక్ట్‌గా ఉండడంవలన కథ సారాంశాన్ని పట్టుకోవడానికి, అసలు రచయిత్రి ఏం చెప్పాలనుకుంటున్నదో గ్రహించడానికి కొంత మెంటల్ ఎక్సర్‌సైజ్ చెయ్యాల్సివస్తుంది. కథ సారాంశము పాఠకుని మానసిక పరిణితి బట్టి మారే అవకాశం కూడా ఉండొచ్చు. ఈ కారణాల వలన, ఇంగ్లీషు పదాలు ఎక్కువగా వాడటం వలన సామాన్య పాఠకులకు ఈ కథలు ఎంతవరకు అర్థం అవుతాయో చెప్పడం కష్టం.
వైవిధ్య భరితమైన కథావస్తువులతో విలక్షణమైన శైలితో పూర్ణిమ, శ్రీసుధ మోదుగు లాంటివారు మెదడుకు పదును పెట్టే ఇటువంటి కథలను ఈమధ్య రాస్తున్నారు. పాఠకులను మెప్పిస్తున్నారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. వస్తుపరంగా, శిల్పపరంగా, శైలిపరంగా, భావవ్యక్తీకరణపరంగా తెలుగు కథ వైవిధ్యాన్ని, విలక్షణతను సంతరించుకుంటున్నది. దీనికి కారకులైన ఈ కొత్తతరం కథకులను అభినందించక తప్పదు.
పూర్ణిమగారి ఈ కథలు చర్చకు పెట్టి, చదివించి, విశ్లేషణకు పోత్సహించిన సాహితీ వేదిక, ఢిల్లీవారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.