ఉన్నట్టుండి

1.

పిల్లలిద్దరినీ, ముందు రాత్రి స్లీపోవర్‌కి వచ్చిన వాళ్ళ ఫ్రండ్స్ ఇద్దరినీ తీసుకుని ఐహాప్‌కి వెళ్ళామా ఆదివారపు ఉదయం. అదొక ఆనవాయితీగా మారింది ఎప్పుడో. దారంతా వాళ్ళకేం కావాలో ఒకరిని మించి ఒకరు చెప్తూనే ఉన్నారు. కారాపగానే బయటికి ఉరికారు వెచ్చటి ఎండలోకి కేకలూ నవ్వులతో పాటు. ‘నెమ్మదిగా, నెమ్మదిగా… కార్లు వస్తాయి చూసుకోండి!’ అని వసు అరుస్తూ వాళ్ళ వెనకే.

పక్కన చెట్లు నిండుగా పూచి ఉన్నాయి. గాలి హాయిగా చుట్టుకుంటూ ఉంది. ఎదురొస్తున్న ముసలి జంటలోని ఆవిడ ‘ఎంత బావుంది ఈ రోజు!’ అని పలకరింపుగా అంది. ‘అవును, స్ప్రింగ్ వచ్చింది కదా!’ అని బదులు చెప్పి లోపలికి నడిచి చూస్తే డైనింగ్ హాల్ అంతా సందడి సందడిగా ఉంది.

గ్రీటర్ పిల్లల గొడవ చూసి నవ్వుకుంటూ వాళ్ళ ఫేవరెట్ కార్నర్ సీట్లలో కూచోబెట్టి వెళ్ళాడు. మెనూ తెరిచి ఎవరికి ఏం కావాలో అరుస్తూ చెప్పుకుంటున్నారు పిల్లలు. వెయిట్రెస్ వచ్చి ఆర్డర్ తీసుకుని వెళ్ళింది. చుట్టూరా ఎవరి మాటలూ, నవ్వుల్లో వాళ్ళున్నారు. పిల్లలూ మిగతా రోజంతా ఏం చేయాల్లో ప్లాన్ వేస్తున్నారు. ఎవరో ఒక పాప అన్ని టేబుల్స్ వద్దకూ వెళ్ళి తన షూస్ మీద వెలుగుతూన్న బల్బుల్ని చూపిస్తూ తిరుగుతూంది. వాళ్ళ అమ్మ వచ్చి నవ్వుతూ సారీ చెప్పి తీసుకువెళుతూంది.

అంతలో ఒక మగ గొంతు గట్టిగా వినిపించింది. ఏమయిందో అర్థం కాలేదు కానీ అటువైపు చూస్తే రెండు వరసల అవతల ఒకతను పైకి లేచి టేబుల్ పై గుద్దుతూ ‘నెవర్ నెవర్ నెవర్!’ అని కోపంగా అరిచి, కుర్చీ వెనక్కు నెట్టి విసురుగా బయటికి వెళ్ళిపోయాడు. ఎదురుగా కూచుని ఉన్నామె చెంపల మీద కారుతున్న కన్నీటిని తుడుచుకోకుండా అలాగే బిత్తరపోయి చూస్తూంది.

కొన్ని సెకన్లు రెస్టారెంటంతా నిశ్శబ్దంగా అయింది. అతని వైపు చూస్తూన్న అందరి కళ్ళూ ఆమెవైపు తిరిగాయి. ఆమె తలవంచుకుని మొహం దాచుకోవడంతో తలలు తిప్పుకున్నారు. ఆమెకు మరింత ఇబ్బంది కలిగించకూడదన్న సామూహిక ఒప్పందానికి వచ్చినట్టు ఏం జరగలేదన్నట్టు అందరూ తమ మాటలు కొనసాగించారు. పిల్లలు ‘దట్స్ మీన్!’ ‘హౌ రూడ్!’ అని గుసగుసలుగా అంటున్నారు.

వసు ‘వాడికేం పోయే రోగం! పీడా పోయిందిలే!’ అంటూంది చెవిలో.

చెరువులో ఒక రాయి పడి బుడుంగున మునిగినా అలలేవీ రేగకుండా ఉన్నట్టుంది కానీ ఆ బరువు తెలుస్తూనే ఉంది. విచారం పల్చగా అంతా కమ్ముకున్నట్టయింది.

వెయిట్రెస్ ఒకామె ఆమె వద్దకు వచ్చి పక్కనే మోకాళ్ళ మీద కూచుని చుట్టూ చేయి వేసింది. నెమ్మదిగా ఓదార్పు మాటలేమో ఆమె చెవిలో చెప్తూంది. ఆమె దుఃఖం తగ్గుతూందో, ఎక్కువవుతూందో తెలియడంలేదు గానీ ఆమె ఎలాగో ఈ దుఃఖాన్నుంచీ, కష్టాన్నుంచీ తేరుకోగలదన్న భరోసా కలిగింది. ఆ ఒక్క చేయీ అక్కడి సమూహాన్నంతా దగ్గరకు తీసుకున్నట్టు అనిపించింది.

చుట్టూరా మాటలు నెమ్మదిగా పుంజుకుని మునుపటి వాతావరణం కొనసాగింది.

2.

వాళ్ళమ్మగారు వచ్చారని ఆ మధ్యాహ్నం వేణు వాళ్ళింటికి వెళ్ళాం. మేం కూచుని కబుర్లు చెప్పుకుంటుంటే వాళ్ళమ్మగారు వచ్చారు. బడలిక తెలుస్తూంది కానీ ప్రసన్నంగా ఉందామె మొహం. మమ్మల్ని పరిచయం చేశాక ‘ప్రయాణం బాగా అయిందా?’ అని అడిగితే నవ్వుతూ తలూపింది. ఇంకో రెండు ప్రశ్నలకూ సైగలతోటే సమాధానాలివ్వడం చూసి ‘గొంతు పాడయ్యిందా ఆంటీ, ఫ్లైట్ ప్రయాణమయితే నాకూ అంతే!’ అని సుమ చెపుతూ ఉంటే వేణు అడ్డుపడి ‘కాదు, అమ్మకు మాట రాదు!’ అని చెప్పాడు. వేణుతో మాటల్లో ఆ విషయం ఎప్పుడూ రాలేదు.

కాసేపయ్యాక ఆమెను పడుకోమని చెప్పాడు వేణు. ‘జెట్ లాగ్ ఇంకా వదల్లేదు అమ్మకి’ అని మాతో చెప్తూ. తను తెచ్చినవి మాకు ఇమ్మని సైగలతోటే గుర్తు చేసి ఆమె లోపలికి వెళ్ళిపోయింది.

“సారీ, అమ్మగారికి మాటలు రావని తెలియదు!” సుమ అంది వేణుతో. “మాటలు రావని కాదండీ, అత్తయ్య మాట్లాడరు!” వేణూ వాళ్ళావిడ అంది. “అదేమిటీ?” అని అడిగితే చెప్పడానికి వేణు ఇబ్బంది పడుతూంటే వాళ్ళావిడ “చెప్పండి, పర్లేదు!” అంది.

“మా చిన్నప్పుడు చెల్లి బర్త్ డే పార్టీలో పిల్లల మధ్య ఏదో గొడవయ్యింది. మా నాన్నకు కోపం వచ్చి నన్ను కొట్టబోతే అమ్మ అడ్డుకుని నాన్నకు సర్దిచెప్పబోయింది. చుట్టూ చుట్టాలూ, స్నేహితులూ ఉన్నారనయినా చూసుకోకుండా “నువ్వు నోర్ముయ్యి. ఇంకొక్క మాట మాట్లాడకు!” అని గట్టిగా అరిచాడు ఆయన. అంతే. అప్పటినుంచీ ఒక్క మాటా మాట్లాడలేదు.”

“ఛ! అదేమిటీ? ఎవరూ నచ్చచెప్పలేకపోయారా?”

“అన్నీ అయ్యాయి. నాన్న బ్రతిమలాడటాలు, బెదిరింపులు, మౌన వ్రతాలూ, మా ఏడుపులూ. పెద్దవాళ్ళూ, సన్నిహితులూ అంతా ప్రయత్నించారు. చివరికి వదిలేశారు.”

కొద్దిసేపు ఆగి అన్నాడు. “అలా ఉండడంలో విచారమూ, నిరసనా ఎప్పుడూ కనపడలేదు. తనకు అలాగే బాగున్నట్టు అనిపిస్తుంది. అందరమూ అలవాటు పడిపోయాం.”

“అయ్యో, ఎందుకలా?”

బదులు లేనట్టు చేయి తిప్పుతూ “అందుకే అమ్మకు మాట రాదని చెప్తాం!” అన్నాడు. కాసేపటిదాకా ఎవరూ ఏం మాట్లాడలేదు.

రచయిత చంద్ర కన్నెగంటి గురించి: జననం గుంటూరు జిల్లా సౌపాడులో. నివాసం గ్రేప్‌వైన్‌, టెక్సస్‌లో. సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేస్తున్నారు. కథలు, కవితలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. కథనంలో శిల్పంలో వీరు చూపించే విభిన్నత అపూర్వం.  ...