చెప్పింది: బబ్లూ
రాసింది: వాళ్ళ డాడీ
ఈ పెద్దోళ్ళకన్నీ తెలుసని వాళ్ళనుకొంటారు. కానీ వాళ్ళకేమీ తెలీదని నాకొక్కడికే తెలుసు- అని ఓ సారి నా డైరీలో రాశాను. నిజానికి ఈ నిజం చిన్నారికీ కొంచెం తెలుసు. కానీ అదెప్పుడూ ఆ రహస్యం బయటపెట్టేది కాదు. రహస్యాన్ని పొదుపుగా దాచిపెట్టేది.
దానికి రెండేళ్ళప్పుడు “అన్నగాడు గుడ్డా? బాడ్డా?” అని మా నాన్న గొంతు తగ్గించి అడిగితే, “గుడ్డే కానీ, కొంచెం కొడతాడు!” అని అంతకంటే రహస్యంగా చెప్పేది. అంత తెలివైందన్నమాట!
అలా రహస్యం అంటే ఏమిటో, ఎప్పుడు ఎలా వాడాలో చిన్నప్పుడే తెలిసిపోయింది దానికి.
ఇంకోసారేమో ఘాటీ సుబ్రమణ్యం అని లేపాక్షి దగ్గర ఓ గుడికెళ్ళాం. మాతో పాటు అమ్మమ్మా, సంధ్యక్కా. తిరిగొచ్చేప్పుడు చీకటి పడుతోందని అందరూ తొందరగా నడవండి అని అమ్మ అనింది. అప్పటికి చిన్నారికి మూడేళ్ళు కూడా రాలేదు… వెనకాల నెమ్మదిగా వస్తోంది.
అప్పుడదేం చేసిందో తెలుసా?!
మా అమ్మని వెనకాల నుంచి జాలిగా పిలిచింది. మట్టి రోడ్డు కదా, రాళ్ళు తగిలి కింద పడుతుందేమో అని ఎత్తుకొంది అమ్మ.
అప్పుడది అమ్మ చంకలోంచి పెద్ద గొంతేసుకొని ఇలా అరిచింది… “ఇంక తొందరగా నడవండి. చీకటి పడటల్లా?”
అంత ముదురన్న మాట!
అప్పటికి నాకూ చిన్నారికీ ఇంకా పేర్లు పెట్టలేదు మా వాళ్ళు. అందుకని ‘ముదురు మహాలక్ష్మి’ అని అప్పటికప్పుడే పేరు డిసైడ్ చేసేశాడు మా నాన్న. పెద్దవాళ్ళు అలా పిలిస్తే ఆనందించేది. నాకేమో నోరు తిరక్క ‘ముదుయు’ అన్నానని నా జుట్టు మాత్రం పీకేది.
నిజానికి దానికి జుట్టు పీకటం పుట్టంగానే వచ్చేసింది.
చిన్నప్పుడోసారి ఇంట్లో నన్నొదిలి నాలుగురోజులు ఎటోపోయి తర్వాత ఇంటికొచ్చారు అమ్మా నాన్నా. నేను ఆడుకొంటూ పట్టించుకోలేదు, కానీ కాసేపటికి అనుమానమొచ్చి లోపలికెళ్ళి చూశాను. అమ్మ వళ్ళో ఓ పాప పడుకొని ఉంది. ఎవరోలే పాపం అని నా మానాన నేను ఆడుకొంటూ కొంచెం సేపయ్యాక మళ్ళీ చూస్తే అదింకా ఆ ఫోజు లోనే ఉంది. పోన్లే అని ఇంకో రోజు వెయిట్ చేసి చూశానా? మా అమ్మ వళ్ళో పర్మినెంట్‌గా సెటిలయిపోయినట్టు నా వైపే చూస్తోంది గర్వంగా.
పైగా నువ్వెవరు పో అన్నట్టు నవ్వింది.
నాకు ఒళ్ళు మండదూ?
మెల్లగా దాన్ని పక్కకి లాగుదామని ట్రై చేశా. చిన్న చేతులతో నెట్టేసింది. రాజీపడి దాని బొజ్జ మీద తలపెట్టి పడుకొన్నానో లేదో జుట్టు పీకేసింది! (నిజానికి మొదట జుట్టుపీకింది నేనే అని మా నాన్న అన్నాడు గానీ, ఈ పెద్దోళ్ళ మాటలు నమ్మకూడదని నాకు ముందే తెలుసుగా.)
ఇంక అప్పటినుంచి నేను ఎడ్డెం అంటే అది తెడ్డెం అనేది. నాకు దొండకాయ ఇష్టమంటే తనకి బెండకాయ. మహేష్ బాబు అంటే అల్లు అర్జున్. డీయస్పీ అంటే జస్టిన్ బీబర్. టామ్ సాయర్ అంటే హారీ పోటర్. ఆటో అంటే బస్సు. ఒకటా రెండా!
నాకు ఆకుపచ్చ రంగు అంటే ఇష్టమని దానికి అర్థమయ్యాక తనకి పింక్ కలరంటే ఇష్టం అని చెప్పటం మొదలెట్టింది. మళ్ళీ కొన్ని రోజులాగి పింక్ కాదు బ్లూ అంది. అంతటితో ఆగిందా? “ఐ హేట్ గ్రీన్!” అని తన ఫెండ్స్‌తో ఇప్పటికీ చెప్తుంటుంది.
మా వాళ్ళు మాత్రం బతికించార్రా బుడ్డోళ్ళారా అని ఊపిరి పీల్చుకొని నాకు గ్రీన్ బాగూ దానికి పింక్ బాగూ, నాకు గ్రీన్ బాటిల్ దానికి బ్లూ బాటిల్ – ఇలా కొనటం మొదలెట్టారు. ఇవతల నాకు మండుతుంటే వాళ్ళకేమో హాపీ! కానీ వాళ్ళ సంతోషం కొన్ని రోజులేలే. ఒకే బొమ్మ కొనాల్సొచ్చినప్పుడు, ఒకే సైకిల్ కొన్నప్పుడు పట్టపగలే నక్షత్రాలు కనపడ్డాయని మా నాన్న ఇప్పటికీ అంటుంటాడు. చూడండి… డే టైమ్! అందులో మళ్ళీ స్టార్స్!! ఇలా ఉంటాయి పెద్దోళ్ళ మూఢనమ్మకాలు.
ఎవరన్నా ఇంటికొచ్చి మీ అన్న ఎక్కడా? అంటే ‘బబ్లూ అక్కడ…’ అంటుంది కానీ ‘అన్న’ అని మాత్రం పిలవదు- నేను చెల్లీ, చెల్లి పాప అని చిన్నప్పుడు పిలిచేవాడినన్న కృతజ్ఞత కూడా లేకుండా!
దాంతో ఒక్క సారన్నా అన్న అనిపించాలని మా నాన్న ఓ పథకం వేశాడోసారి.
“చిన్నారీ, ఒక పాట నేర్పుతా… దా!” అని పిలిచి “ఒక్కొక్క లైనూ చెప్తాను. రిపీట్ చెయ్యాలి, సరేనా?” అని ఓ పాట ఇలా నేర్పబోయాడు…
“దేవుడెలా ఉంటాడని…”
“దేవుడెలా ఉంటాడని…”
“ఎవరైనా అడిగితే…”
“ఎవరైనా అడిగితే…”
“మా అన్నలా ఉంటాడని అంటాను నేను.”
“… ఉంటాడని అంటాను నేను.”
“ఉహూ! మళ్ళీ పాడు …మా అన్నలా ఉంటాడని అంటాను నేను.”
“… ఉంటాడని అంటాను నేను.”
ఇక లాభం లేదని చేతులెత్తేశాడు మా నాన్న. నేను మాత్రం ‘అనురాగమెలా ఉంటుందని’ నించీ ‘చెల్లిలా ఉంటుందని చెపుతాను నేను’ దాకా బుద్ధిగా పాడాను. అప్పటినించీ నాకు తెలుగు పాటల మీద ఇంటరెస్టూ, గౌరవం ఎక్కువయిపోయింది. యూ ట్యూబ్‌లో ఈ పాట నా ఫేవరెట్.
తనేమో ఇంగ్లీషు పుస్తకాలూ పాటలూ అంటుంది.
‘చదువుతో పాటు మీరు కళా పోషణ కూడా చెయ్యాల్రోయ్!’ అని మా వాళ్ళు బుర్ర తినటం మొదలెట్టాక ‘ఏం నేర్చుకొందాం…’ అని నేనూ చిన్నారీ తెగ అలోచించాం. కానీ బయటపడలేదు.
“ఏమిటా దీర్ఘాలోచన?” అడిగారు మావాళ్ళు అమాయకంగా.
ముందు నేనేం చెప్తానా అని చిన్నారీ, తనేం చెప్తుందా అని నేనూ వెయిట్ చేస్తున్నామని వాళ్ళకి తెలీదు. ఇంక ఆగలేక, ‘చిన్నది కదా, ముందు చెల్లి చెప్తుంద’ని అమ్మ అనటంతో చిన్నారి దగ్గు టానిక్ తాగినట్టు మొహం పెట్టింది.
అప్పుడు చిన్నారి నా దగ్గరకొచ్చి చెవిలో రహస్యంగా చెప్పింది “కళా అంటే పోషణ అంటే ఎంటో అడుగు. ప్లీజ్ బబ్లూ!”
నేను దాని ట్రాప్‌లో పడిపోయి అదే అడిగాను.
“కళ అంటే?”
“ఆర్ట్!”
“ఆర్ట్ అంటే?”
“కళ!”
“కళాపోషణ చేస్తే ఏమొస్తుంది?”
“కళ వస్తుంది.”
“కళ వస్తే ఏమొస్తుంది?”
అప్పుడు మా వాళ్ళు సైలెంటయిపోయారు. వాళ్ళ మొహంలో అయోమయం. ఆ ప్రశ్న అడిగినందుకు నా మీద నాకే మహా ముచ్చటేసింది.
ఎలాగో తేరుకొని అన్నారు, “యూ విల్ బికమ్ ఎ హోల్ మాన్!”
“అంటే, బొక్క పడుతుంది!” అన్నాను.
“అవును. పెద్ద బొక్క!” అన్నాడు మా నాన్న ప్రాక్టికల్‌గా.
“అయితే నేను కళ నేర్చుకోను.” అన్నాను.
“అయితే నేను కళ నేర్చుకొంటా!” అంది చిన్నారి మహా ఉత్సాహంగా. దానికి అప్పటికే బాగా తెలుసు ఎవరిని ఎలా మెప్పించాలో.
“నేను డాన్స్ నేర్చుకుంటాగా…” అని నాతో అంది మురిపాలు పోతూ.
నేను షాక్!
దాని దెబ్బ నుంచి రెండు రోజుల తర్వాత కోలుకొని, “అయితే నేను మ్యూజిక్ నేర్చుకొంటా డాడీ!” అన్నాను మా నాన్నతో- తప్పు చేస్తున్నట్టు. అప్పటికి ఖలేజా సినిమాలో ‘సదాశివా సన్యాసీ! సాహసీ కైలాస వాసీ! నీ పాద ముద్రను…’ పాట మొత్తం వచ్చీ రాని తెలుగులో పాడుతుండేవాడిని. ఇంకా ‘సరీగమా పదనిస్సా కరో కరో జర జల్సా!’ కూడా.
“అవును, నీకదే బెటర్!” అన్నారు మా వాళ్ళు సంతోషిస్తూ. చిన్నారి డాన్స్ అంది కనుక నేను మ్యూజిక్ అన్నానని వాళ్ళకి ఇప్పటికీ తెలీదు.
“కర్నాటిక్కా హిందూస్తానీనా?” అని అడిగారు ఓ సంగీతం మాస్టారు.
“అంటే?” తేడా ఏమిటో తెలీని మా నాన్న మొహంలో ‘కళంటే?’ అని అడిగినప్పటి కంటే అయోమయం.
“మీ అమ్మాయి కూచిపూడి అన్నారు. మృదంగం నేర్పండి, తోడుగా ఉంటాడు.” అన్నారు ఇంకో మాస్టారు.
నేనేమో స్టేజ్ వెనకనించీ మృదంగం కొట్టటం. అదేమో స్టేజ్ మీద డాన్స్ చేసి చప్పట్లు కొట్టించుకోటం! అందుకని గబుక్కున “తబలా నేర్చుకొంటా. జాకీర్ హుస్సేన్ అవుతా!” అన్నాను మా నాన్నతో.
అప్పటిదాకా నేనంటే చిన్నారికి కొంచెం భయం ఉండేది గానీ, ఓ సారి సమ్మర్ కాంప్‌లో నేను పెయింటింగ్ నేర్చుకొంటుంటే చిన్నారి కరాటే గ్రూపులో చేరింది. నీకూ నేర్పుతా అని నాకు కొన్ని పంచ్‌లు ఇచ్చింది కూడా. కరాటే నాకోసమే నేర్చుకొంటుందని అనుమానమొచ్చి సమ్మర్ కాంప్ నించి మమ్మల్ని రక్షించాడు మా నాన్న. అయినా ఆ సమ్మర్ నుంచీ ఇక నేనే ఎక్కువ భయంగా ఉండాల్సి వస్తోంది.
ఇంకోసారేమో బాలాజీ అంకుల్ – ఆయన సినిమా డైరెక్టర్ కూడా – మా ఇంటికొచ్చి “సినిమాలో యాక్ట్ చేస్తారా!” అని అడిగాడు. ఇద్దరం మహా ఉత్సాహంగా “సరే! ష్యూర్‌గా!” అని ఒకేసారి అరిచాం.
“సరే సీన్ చెపుతాను. వినండి. చిన్నారీ నువ్వు లోపలి నుంచీ వచ్చి ‘అన్నా! ఆ గదిలో ఏదో ఉంది…’ అని భయంగా అనాలి.”
“ఎవరితో అనాలి?”
“బబ్లూతో.”
“చీ! సినిమాలో కూడా వీడేనా అన్న?” అనేసింది చిరాకుగా.
“దీంతోనా నేను యాక్ట్ చెయ్యాల్సింది? చీ!” అన్నాను నేనూ అంతకంటే కోపంగా.
బాలాజీ అంకుల్ లేచి పారిపోవటంతో, చిన్నారి వల్లే ఆ చాన్స్ పోయి నా సినిమా కెరీర్ నాశనం అయిందని ఇప్పటికీ తనని తిడుతూ ఉంటాను.
అలా చిన్నప్పటినుంచీ చాలా సార్లు కొట్టుకున్నాం, కొట్టుకుంటూనే ఉన్నాం; ఏం చెయ్యాలో తెలీక మా వాళ్ళు ఇంకా జుట్టు పీక్కుంటూనే ఉన్నారు. కానీ అప్పుడప్పుడూ సమ్ స్ట్రేంజ్ థింగ్ హాపెన్స్.
స్కూలు నుంచి వచ్చి ముందు గదిలో వణికిపోతూ పడుకున్నప్పుడు లోపలికి పరిగెత్తి, “బబ్లూకి జ్వరం!” అని చిన్నారి భయంతో అరిచినప్పుడూ…
స్కూల్లో ముగ్గురు కలిసి రౌడీల్లా నన్ను ఒక్కడినీ చేసి కొట్టబోతే నాకు సపోర్ట్‌గా వచ్చినప్పుడూ…
ఇంకా, మీ అన్న నోట్సులు అస్సలు రాయడు అని టీచర్లు నన్ను కాక చిన్నారిని తిట్టినప్పుడూ…
ఆ పెండింగ్ వర్కయ్యే వరకూ ఓపిగ్గా నా పక్కనే కూచున్నప్పుడూ…
ఓ సారెవడో ఓ అమ్మాయి బాగ్‌లో స్కూల్ ఫీజు డబ్బులు కొట్టేసి నా బాగ్‌లో పెడితే ‘బబ్లూ అమాయకుడు. వాడలా చెయ్యడు!’ అని అసలు దొంగ మీద ఆ అమ్మాయితోనే టీచర్‌కి కంప్లయింట్ ఇప్పించినప్పుడూ…
ఇంకా చాలా సార్లు…
చాలా చాలా సార్లు…
అందాకా చిన్నారిని తిట్టినందుకూ కొట్టినందుకూ ఏడుపొస్తుంది. కానీ అది చెప్తే నన్నింకా ఏడిపిస్తుందేమో అని బయటకు చెప్పలేదు.
అంతకంటే…
ఎప్పుడో… అంటే చాలా చాలా కాలం తరవాత నాకు చిన్నారీ, చిన్నారికి నేనూ మాత్రమే ఉంటామని తెలిసినప్పుడు – ఇప్పుడు కూడా – ఏడుపొస్తుంది.
నీతో డైరెక్ట్‌గా చెప్పలేక ఇక్కడ రాస్తున్నా… సారీ చిన్నారీ! రియల్లీ సారీ!!
ఇంకానేమో నువ్వు క్లాసికల్ డాన్స్ కాంపిటీషన్లో నేషనల్స్‌కి సెలెక్టయ్యి ఢిల్లీ వెళ్తున్నావని స్కూల్లో అందరూ నిన్ను పొగుడుతుంటే నాకూ అంతకంటే హాపీగా ఉంది. వచ్చే ఏడాది మ్యూజిక్‌లో గెలిచి నీతో పాటు నేను కూడా ఢిల్లీ వస్తాగా!!
అక్కడ చూసుకుందాం.
నోట్: చిన్నారీ! ‘అదీ’ ‘ఇదీ’ అని పైన రాసింది నేను కాదు. డాడీ. వద్దూ! నా వీపు విమానం మోత మోగిస్తుందీ, చిన్నారి అనే రాయీ అని మొత్తుకున్నా ‘పర్లేదు లెహే!’ అని రాసేశాడు. పైగా నేను రాశానని తెలిస్తే నువ్వు అస్సలు చదవ్వని గారంటీ కూడా ఇచ్చాడు. పొరపాటున నువ్వు కానీ ఇది చూస్తే… చివరిదాకా చదవకుండానే పరిగెత్తుకొచ్చి గారంటీగా నా వీపు… అని కొంచెం భయంగానే ఉంది!