జ్వరగీతం

అరిచేతులరికాళ్ళు చల్చల్లగా
అరలరల మెదడులో
కిరుకిర్రున తెరవబడు పొరలు తెరలు

మాగన్ను మగతలో గతాల తలపోతల్
ఏనాటి మోహాలేనాటి విరహాల్
ఈపూట ఏ వీటిమొగలో దరహాసహారాల్

గడ్డుకాలమెల్లా అటకమీద అట్టిపెట్టి
ఆనక కట్టగట్టి నట్టేట్లోకి నెట్టినట్టి
అట్టహాసపు బతుకు

గట్టెక్కక పట్టుబడక
ఒట్టిచేతుల మెట్టమాటల
మొనాటనీ గుటకల గటగట

మధ్యకుట్టులో మూతపడ్డ పుస్తకం
మిథ్యా వాస్తవ మీటలపై
వేలికొనల పలవరింతల
డ్రిప్ డ్రాప్ డ్రిప్ డ్రాప్

జంపకానా నుంచి పంకాకు
విమానాలు నావలు మూలుగు మేనాలు
చలిచీమల చేతజిక్కిన రొట్టెముక్కలాగ ఒళ్ళు
నాలుకలోంచి యమకంగా మందుగుళిక చేదు చేదు
షివర్వివరణల్లో షివర్లీ శోభిల్లకున్నచో క్షమాకీజియే


స్వాతికుమారి బండ్లమూడి

రచయిత స్వాతికుమారి బండ్లమూడి గురించి:

స్వాతిగారి రచనలతో మూడు కవిత్వ పుస్తకాలను, అరసున్నా అనే కథా సంపుటిని ప్రచురించారు. హెమ్మింగ్వే రాసిన “ఓల్డ్ మ్యాన్ అండ్ ది సీ” ను తెలుగులోకి అనువదించారు. పొద్దు మరియు వాకిలి వెబ్ పత్రికలకు ఎడిటర్ గా వ్యవహరించారు. ఈవిడ రచనలను గడ్డిపోచలు బ్లాగ్ లో చదవవచ్చు. వృత్తిరీత్యా ఛార్టర్డ్ ఎకౌంటెంట్ గాను, ఉపాధ్యాయురాలిగాను పని చేస్తున్నారు.

 ...