1-1. సంయమనం ఈమాటకూనా?

ఈమాట అక్టోబర్ 2024 సంచికలో వ్రాసిన ముందుమాటపై (ఒక చిన్న) దాడి జరిగింది. ఇది పెద్దమాట అనిపించవచ్చు. వచ్చిన ప్రతిస్పందనను, ఏ ఒకరిద్దరి విషయంలోనో తప్పిస్తే, (సాహిత్య)విమర్శ అనలేను. అన్నది ఒక గొంతే కాబట్టి ఆరోపణ, నింద అనవచ్చు. కాని, ఆ గొంతు వెనకాల ఒక గుంపు కూడా ఉంది కాబట్టి దాడి అన్నాను. అంతే. ఈ దాడి ఈసారి రచయిత, ప్రచురణకర్త అయిన వెంకట్ సిద్ధారెడ్డిగారినుంచి. ఒక ఏడాది క్రితం ఇలాంటి ప్రతిస్పందనే మహమ్మద్ ఖదీర్‍బాబుగారినుండి వచ్చింది. ఫేస్‌బుక్‌లో ప్రతిసారీ జవాబివ్వలేను అని చెప్పాను కాబట్టి అనుకుంటాను, వెంకట్‌గారు వారి పోస్ట్‌ను ఈమాట అభిప్రాయాలలోనూ పెట్టారు. మరికొన్ని అభిప్రాయాలూ వచ్చాయి. ఎప్పట్లానే, ఈమాట పద్ధతుల ప్రకారం, పోయినేడాది ఇదే సమయంలో ఈమాటపై హిందూత్వవాదులు దాడి చేసినప్పటిలానే, ఇప్పుడూ అందరి అభిప్రాయాలు ప్రచురించాను, చేతనైనంత వివరణ కూడా ఇచ్చాను.

అప్పుడప్పుడూ కటువుగా ఉండే నా గొంతు గురించి పాఠకులు, శ్రేయోభిలాషులూ మందలిస్తుంటారు, విమర్శిస్తుంటారు కాబట్టీ అదేమీ కొత్తవిషయం కాదు. ఇంతలో ఒక స్నేహితుడు ‘ఇలా రాయడం నీ స్థాయికి, ఈమాట స్థాయికి తగింది కాదోయ్’ అన్నాడు. దాసరి అమరేంద్ర సంయమనంగానే ‘ఈమాట మాట తూలింది’ అన్నారు. వారన్నది నేను కాదనను. కాని, వెంటనే నాకు ప్రశ్నలు, ఆలోచనలు మొదలయ్యాయి. నేను నిజంగానే ఏదైనా అనుచితంగా అన్నానా? సంయమనం, స్థాయి ఈమాటకు, ఈమాటకే ఉండాలా? ఇంకెవరికీ ఉండక్కర్లేదా? అని పరిశోధనకు దిగాను. అంటే ఇంకేమో కాదు, ఫేస్‌బుక్‌లో కొన్ని గంటలపాటు గడిపాను ఒక రెండు రోజులు వరుసగా. ఫేస్‍బుక్‍ నేను తరచుగా చూడను, అయినా పోగొట్టుకుంది ఏమీ లేదు. సహృదయులైన నా స్నేహితులు అప్పుడప్పుడూ లింకులు పంపి మరీ నా అజ్ఞానాన్ని అదుపులో పెడుతుంటారు, ప్రత్యేకించి ఈమాట గురించో, సాహిత్యం గురించో ఏదైనా పోస్ట్ కనిపిస్తే.

ఇక్కడ, నా ఆలోచనలు, అభిప్రాయాలు కాసిని మీతో పంచుకుంటాను, ఓపికుండి చదవగోరే వారికోసం. దీనిని నేను వ్యాసంలాగా నిర్మించటం లేదు. మాటల పొదుపు పాటించటం లేదు. ఇది ఈ ఒక్క ముందుమాట గురించే కాదు. ఇది ముందుమాటల గురించి, ఈమాట గురించి, తెలుగు సాహిత్యసమాజం గురించి – ఇది మనగురించి.

ఇది ఒక డిౙల్టరీ కాన్వర్సేషన్, ఒక అన్‌ప్లగ్‌డ్ మోనోలాగ్. నాకు సమయాభావం, స్థలాభావం రెండూ లేవు. అందుకని తీరిగ్గా, పొడూగ్గా ఊహకొచ్చినట్టు వ్రాసుకుంటూ పోతాను, మిమ్మల్నీ అంతే తీరిగ్గా నిదానంగా చదువుకోమని చెప్తాను. రేప్పొద్దున్నే పరీక్ష ఏమీ లేదు. ఇప్పుడే చెప్తున్నాను, మీరు చదవకపోతే కోల్పోయేదీ ఏమీ లేదు! కాని, మీరు చదివి స్పందించదలచుకుంటే, అభిప్రాయాలు ఇక్కడే చెప్పవచ్చు. అంతకంటే మెరుగ్గా, మేము కొత్తగా మొదలు పెట్టిన ‘లెటర్ టు ది ఎడిటర్’ శీర్షికకు ఉత్తరం వ్రాయవచ్చు. చర్చను ఒకమెట్టు పైకి తీసుకువెళ్ళదలిస్తే, ఒక పూర్తి వ్యాసంలా వ్రాయవచ్చు కూడా.

వెంకట్‌గారు ఈమాటను ‘ముక్కిపోయి ఎవరూ చదవని’ పత్రిక అన్నారు. ఎవరూ చదవని పత్రికలో నేనేది వ్రాసుకుంటే ఎవరికి నష్టం? ఏమాత్రం నష్టం? చదవకుండానే ఈ ప్రతిస్పందన, ఇంత రాద్ధాంతం అవసరమే లేదు. పోనీ, నేనేదో సి.బి.డి. గమ్మీ ఒకటి నములుతూ, ఈమాటకు తెలుగుసాహిత్యసమాజం ఒక పెద్దపీట* వేసింది, ఈమాట మాటకు విలువ ఉంది (తూచ్! అంబాలీస్!) అందుకే ఇలా… అని భ్రమ పడ్డాననుకుందాం. అలాంటప్పుడు రావలసిన ప్రతిస్పందన ఈ విధంగా ఉండకూడదు. మరి ఈ దాడిని, ఈమాటపైనా నాపైనా చూపించిన ఆగ్రహావేశాలను ఎలా అర్థం చేసుకోవాలి?

(*పెద్దపీట – ఈ పీటకు మూలం కులంలో ఉంది. ఇది పీట వేయడంలో ఉంటుంది. ఇది బ్రాహ్మణీయవాద భావజాల పదం – బ్రా.భా.ప.)


అప్పుడు ఖదీర్‌‌బాబుగారు, ఇప్పుడు వెంకట్‌గారూ నాపై ఆగ్రహించిన కారణం, అది ప్రకటించిన తీరు ఒకటే. కాకుంటే వెంకట్‌గారు ఖదీర్‌‌బాబుగారికంటే కొన్ని మెట్లు దిగి ప్రతిస్పందించడం కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించింది. కొంచెం విచారాన్నీ మిగిల్చింది. వారిగురించి నాకున్న అభిప్రాయం అలాంటిది కాదు మరి. ఫేస్‌బుక్‌లో మళ్ళీ వీరిద్దరి పోస్టులూ చూశాను. వాటికి కామెంట్లు పెట్టినవారినీ చూశాను. ఇంచుమించు అందరూ వారే, అంటే ఈ రెండు పోస్టులకూ ప్రతిస్పందించినవారు ఆ కొందరే. ఈ కొందరిలో కొన్ని తెలిసిన పేర్లు… ఎన్. వేణుగోపాల్‍గారు, చింతలపల్లి అనంతుగారు, అరిపిరాల సత్యప్రసాద్‍గారు… తదితరులు. వీరు సీనియర్లు (వయసులో అని/అనే కాదు), పాత్రికేయులు, పేరున్న రచయితలు, సామాజికచైతన్యం ఉన్నవారు. కానీ ఎవరూ అప్పుడు ఖదీర్‌‌బాబుగారిని కాని, ఇప్పుడు వెంకట్‌గారిని కానీ – సాహిత్యకారులుగా మీరు స్పందించవలసిన పద్ధతి ఇది కాదు అని చెప్పినట్టు లేరు. ఈమాటనుంచి ఆశించిన సంయమనం, సభామర్యాద ఎవరూ వారినుండి ఆశించినట్టు లేరు. అలా ఏమీ కాదు, ఈమాట పత్రిక, వీరు పాఠకులు కాబట్టీ నియమాలు వేరు వేరు అంటే అది కప్పదాటు అవుతుంది. (కప్పదాటు – బ్రా.భా.ప.?) ఎందుకంటే ఖదీర్‌బాబుగారు, వెంకట్‌గారు, ఇద్దరూ రచనాప్రచురణారంగాలలో ప్రముఖులు, ఉద్దండులు, ఉద్యమనాయకులు. వ్యక్తులే అయినా సంస్థలు వారు. వారిగురించి వేరేవారెవరూ ఏమీ చెప్పక్కర్లేదు. వారు ఆ అవసరం రానీయరు.

ఒక స్నేహితుడినుంచి వాట్సాప్ ఫార్వర్డ్. పసునూరు రవీందర్‌గారు – దళిత రచయితలను అవమానించిన ‘ఈమాట’ సంపాదకవర్గం బహిరంగ క్షమాపణ చెప్పి తన పిచ్చిరాతలను వెనక్కి తీసుకోవాలి-ట. ఏ దళిత రచయితలను అవమానించానో నాకు ఇప్పటికీ తెలియటం లేదు. ఫేస్‌బుక్‌లో రమాసుందరిగారు* – ఈమాట సంపాదకవర్గం అంతా ఆ పత్రిక రాస్తున్న వరుస బ్రాహ్మణీయ సంపాదకీయాలకి బాధ్యత వహించాలి-ట. ఈమాట నడుపుతున్నది మేము, ఈ ముందుమాటలు వ్రాస్తున్నదీ మేమే. బాధ్యత మాది కాక ఏ సారంగదో, మాలికదో అవుతుందా? ఈమాటలో ప్రభాకర్‌గారు – ‘సమాజంలో బలహీన, నిమ్న, విస్మృత వర్గాల గురించి వ్రాసిన సాహిత్యాన్ని మీరెంచుకున్న ప్రమాణాల మీద తిరస్కరించలేరు’-ట. ఈమాటకు పంపిన రచనలనైతే తిరస్కరించగలమేమో కాని సాహిత్యం సాహిత్యాన్నే ఎవరైనా ఎలా తిరస్కరిస్తారు? ఏమిటీ అర్థంలేని పడికట్టు నినాదాలు! నిజం చెప్పొద్దూ, నాకు రంగనాయకమ్మగారు (గారు అనకపోతే నన్ను ఆమె భక్తులు వెలివేస్తారు) వ్రాసిన కుట్ర గుర్తొచ్చింది.

వెలి అంటే గుర్తొచ్చింది. పింగళి చైతన్యగారు ఫేస్‌బుక్‌లో – ‘వెలివేత’ అనే పదం, దాని ఆలోచన, ఆచరణ, పిలుపు – వీటి మూలం కులంలో ఉంది. ఉంటుంది, అని. భావజాలపదకోశం అని కేన్సిల్ కల్చరిస్టుల దగ్గర ఒక ఆయుధముందని తెలుసు. వెలివేత అందులో ఒకటని తెలియదు. మనోభావాలు గాయపరిచారని, మతాన్ని అవమానించారని హుసేన్‌లను, మురుగన్‌లనూ వాళ్ళు కేన్సిల్ చేస్తారు. బ్రా.భా.ప. అని శ్రీశ్రీలను, బాపూలనూ వీళ్ళు కేన్సిల్ చేస్తారు. మనకు ఇంకెవరు మిగులుతారో.

[*ఈమాట సంపాదకవర్గంలో ఉన్న వారందరికీ 1. కథావస్తువు మాత్రమే సాహిత్యనాణ్యతను నిర్ణయించదని, 2. ఇతర కళలలాగే సాహిత్యవ్యాసంగానికీ ఎంతో పరిశ్రమ అవసరమని – నేను చెప్పే రెండు అంశాలపై ఏకాభిప్రాయం ఉందని రమాసుందరిగారికి ఇందుమూలముగా తెలియజేయడమైనది.]

పైన ప్రస్తావించిన సీనియర్లు కాక, ఆ కామెంట్లలో మరికొన్ని తెలిసిన పేర్లు కనపడ్డాయి. ఉదా. అపర్ణ తోట (Elitist తోలు కప్పుకున్న Conformist వ్యాఖ్యలివి. వీరి ప్రకారం సాహిత్యంలో empathyకి, compassionకి చోటు లేదు!); పింగళి చైతన్య (‘సమాజంలో బలహీన… మాత్రాన అవి సాహిత్య రత్నాలు అయిపోవు.’ దీనిని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావట్లేదు. ఎలా అనేయగలరు ఇంత మాట?!); అలమూరు సౌమ్య (చాలా అహంభావ వ్యాఖ్యలు అవి. నిమ్న, బలహీన వర్గాల నుంచి సాహిత్యం రావడమే చాలా మంచి విషయం. దానికి వీళ్ళ సర్టిఫికెట్లు ఎవడు అడిగాడుట?!); ప్రసాద్ చరసాల (నాసిరకం పాఠకులు… సంపాదకీయంలో కక్కిన విషం…); విషయం అర్థమయింది కాబట్టీ కొన్ని వ్యాఖ్యల తరువాత ఇక నేను చదవలేదు.

అపర్ణ ఈమాటలో ఒకటీ రెండు కథలు వ్రాశారు. అలా కొంత పరిచయం. ఇప్పుడు జెండర్ ఇష్యూస్ మీద అవగాహన కల్పిస్తూ సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్నారని ఎఫ్.బి. ద్వారా తెలిసింది. చైతన్య ఏం చేస్తారో నాకు తెలియదు కాని, కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో వలసకార్మికుల కోసం ఇతరులతో కలిసి పడ్డ కష్టం, చేసిన సహాయం నాకు వివరంగానే తెలుసు. జూన్ 2020 సంచికకు చైతన్య తీసిన ఫోటోనే ముఖచిత్రంగా పెట్టాం. ఆ సంచిక ముందుమాటకు వారి స్వచ్ఛందసేవే స్ఫూర్తి కూడా. సౌమ్య, ప్రసాద్‌గార్లు నేను ఫేస్‌బుక్ అడపాదడపా తెరిచినప్పుడు అప్పుడప్పుడూ కనపడే పేర్లు, పోస్టులు. వారిగురించి నాకు వేరే పరిచయం లేదు. ఇప్పుడు వీరందరినీ పేరుపేరునా ప్రస్తావించడానికి వేరే కారణం ఏమీ లేదు. నాకు తెలిసినంతవరకూ వీరంతా తెలివైనవారు, సామాజిక చైతన్యం ఉన్నవారు. వ్యక్తులుగా వీరంటే నాకు గౌరవం ఉంది.

నాకు అర్థం కానిదల్లా, వెంకట్‌గారి పోస్టుకి వత్తాసుగా కామెంట్లు పెట్టేముందు వీరు నిజంగా నా ముందుమాట చదివారా? ఏం చెప్తున్నది అని ఆలోచించారా? లేదూ ఒక సామూహిక ఆవేశంలో కొట్టుకుపోయారా? వీరెవరికీ ఆయన వాడిన భాషతో, ఆ స్పందనతో ఎటువంటి ఇబ్బందీ లేదా? అన్నదే. నా మీద గౌరవంతో (గంజాయి గమ్మీ ఇంకా నోట్లోనే ఉంది) ‘తెలుగువారికి నింపాదిగా చదివి తార్కికంగా వాక్యాన్ని అర్థం చేసుకోవడం రాదు’ అన్న నా అభిప్రాయాన్ని బలపరచడానికే ఇలా చేశారేమో అన్న అనుమానమూ నాకు రాకపోలేదు. నేను వ్రాసింది వాక్యాలు కాబట్టి, ఈక్వెషన్లు కావు కాబట్టి, కొంత పెడర్థం రావచ్చేమో కాని మరీ ఇంతగా వేరే అర్థం రావడానికి ఆస్కారం ఉండకూడదు. వీరు ఇలా కామెంట్లు పెట్టినందువల్ల నాకేమీ వీరెవరిపట్లా గౌరవం తగ్గలేదు కాని, వీరిలా ఎందుకిలా? అన్న ప్రశ్న మాత్రం మిగిలిపోయింది. ఖదీర్‌‌బాబుగారి పోస్ట్, వెంకట్‌గారి పోస్ట్, రెంటికీ వచ్చిన కామెంట్లలో ఒక సాపత్యం కనిపించింది, ఎ ప్రెడిక్టబుల్ నారేటివ్, ఎ కండిషన్‌డ్ రియాక్షన్. (అపర్ణగారి కామెంట్ నిజంగా హైలైట్. ఎటో వెళ్ళిపోయారు వారు!)

స్క్రోల్‌డౌన్…రచయితలకు బోడి సలహాలు, ఒప్పుకోళ్ళు అక్కర్లేదు అంటూ నాగిని కందాళగారి ప్రకటన. తెలుగు యాంకీగారనుకుంటా, డనింగ్-క్రూగర్ సిండ్రోమ్ అని ప్రస్తావన. అదేమిటో తెలుసుకొని, ఆంగ్లభాషలో ష్రగ్గి ముందుకు పోత. ఎవరో ఒక యువకవి జాసిమిన్ను వైటటా రాగంలో ఈమాటకు టాటా అని చిక్కటి చక్కటి కవిత ఒకటి వెలయించారు. ఈ యువకవి ఉన్నంతవరకు తెలుగుకవిత్వానికి ఇంకో కవి అక్కర్లేదు. ఈమాటను బ్యాన్ చేయాలి, వారికి రాసే రచయితలకు… అంటూ ఒక నినాదం; బహుశా పాత్రికేయులయుండాలి. ఐతే అంతా ఇదే అని కాదు. కొన్ని మంచి విషయాలూ తెలిశాయి. శ్యామ్‌ సుందర్‌గారి రూరల్ వీడియోలు, సామాజిక, రాజకీయ అంశాలపై తులసి చందుగారి పాత్రికేయ విశ్లేషణలు, ఇలా మరికొందరు… అమ్మయ్య. ఇలాంటివారు, అపర్ణాచైతన్యల వంటివారు ఇలా కాక సమాజంలో మార్పు కథలు, కవితల ద్వారా తెద్దామని అవి వ్రాస్తూ ఉండివుంటే వీరు సాధించిన దానిలో లక్షోవంతు కూడా సాధించివుండరన్నది నిజం. తెలుగులో ఎవరైనా సాహిత్యం ద్వారా సాధించగలిగిన సామాజిక ప్రయోజనం శూన్యం, అసలదంటూ ఉంటే. తెలుగు సాహిత్యానికి ప్రస్తుతం ఆ స్థాయి లేదు. అంత శక్తి లేదు.

చేసిన పరిశోధన చాలనుకున్నాను. అమరేంద్రగారు ఈమాటలో వెలిబుచ్చిన అభిప్రాయానికి జవాబుగా వారితో మరికొంత సాహిత్య సంభాషణ చేసి, ముందుకు పోతాను. ఆపైన ఉండేదల్లా నా సోది రామాయణమే కాబట్టి, సమయం ఈ కొంతయినా వృధా కాలేదన్న తృప్తి నాకు మిగులుతుంది.


అమరేంద్రగారు తన అభిప్రాయంలో:

  • సాహిత్య ప్రయోజనాలు అనేకం… చరిత్రలోకి వెళితే ఇలా ఎన్నో ప్రయోజనాలు సాధించబడి కనిపిస్తాయి.

నిజమే అనుకుందాం. కాని, తెలుగులో? పతంజలి ఖాకీవనంతోను, కారా యజ్ఞంతోను తెలుగు సాహిత్యసమాజం ‘ఉలిక్కిపడింది’ అని కాసేపు అనేసుకున్నాం. ఆ తర్వాత ఏం జరిగింది? తుండు దులుపుకొని ఎవరిదారిన వారు పోయేరు. కారాగారు కథలు ఎందుకు వ్రాయడం మానేశారో మీకు తెలుసు. గమనిస్తే తెలుగులో సాహిత్యం సాధించింది ఎక్కువగా మానసోల్లాసమే. మానసిక వికాసం అతి కొద్దిగా. ఈ రెండు కూడానూ ‘సీరియస్’ సాహిత్యం కన్నా, ‘పాప్యులర్’ సాహిత్యం (ఇది సామ్యవాదుల వర్గీకరణ. నాది కాదు. మార్చ్ 2023 ముందుమాట) ద్వారానే ఎక్కువమందికి అందింది. ఒకానొక కాలంలో రచయిత్రులు యుక్తవయస్కులు, ఉద్యోగస్తులవంటి వారికోసం వ్రాసిన నవలలు, పత్రికలలో సీరియల్స్; ఆపైన యండమూరి, మల్లాది వంటి పాప్యులర్ రచయితల సాహిత్యాన్నే తెలుగు ప్రజ ఇతోధికంగా చదివింది, చర్చించింది. చలం, కుటుంబరావు వంటివారిని కౌమారంలో చదివి కొంత ప్రభావితులైనవారు లేరని కాదు. అలా అని ఆ స్త్రీసాహిత్యం విలువలేనిదనీ కాదు (మే 2022 ముందుమాట; ఆగస్ట్ 2020 ముందుమాట). సీతాదేవిగారి మరీచిక నవలను ప్రభుత్వం నిషేధించిందని గుర్తు. కాని, మీరు ప్రస్తావించిన ఇతర ప్రయోజనాలు – వ్యవస్థ మార్పు, ప్రతిఘటన, పోరాటం వంటివి తెలుగు సమాజంలో సాహిత్యం సాధించిన ప్రయోజనాలుగా కనపడవు.

సాహిత్యం ద్వారా ఏ సమాజంలోనైనా ఎంత/ఎటువంటి మార్పు వస్తుంది అన్నది ప్రశ్నార్థకం. వస్తే ఎలా వస్తుంది? అప్పటికప్పుడు ఒక సమూహంలో ఆవేశం నింపి వారిని చైతన్యవంతం చేయాలంటే సాహిత్యం కన్నా సంగీతానికి ఎక్కువ శక్తి ఉంది. నినాదాలకు కూడా ఒక లయ ఉండేది ఇందుకే కదా. జననాట్యమండలి సాధించిన ప్రయోజనాలు అది జనసాహిత్యమండలి అయివుంటే సాధించేదేనా? సాహిత్యం తెచ్చే మార్పు సామూహికంగా రాదు. అది వైయక్తికస్థాయిలోనే సాధ్యమవుతుంది. ఉదా. వోల్తేర్ ఫ్రెంచ్ రివల్యూషన్‍‍ని ప్రభావితం చేశాడు, శ్రీశ్రీ యువతను మేలుకొల్పాడు – లాంటి మాటలకు నిజంగా అర్థం ఏమిటి? ఫ్రెంచి విప్లవంలో పాల్గొన్న కర్షకకార్మికప్రజానీకం సమస్తం వోల్తేర్‌ను చదివి ఉత్తేజితమైందనా? కాదు కదా. ఏ కొద్దిమందో చదివి ఉంటారు. వోల్తేర్ వారిలో ఒక ఆలోచనను కలిగించి ఉంటాడు. అక్కడ ఎన్నో ఇతర కారణాలు పనిచేస్తూ ఉండుంటాయి. ఇతర పరిస్థితులూ అనుకూలించి ఉంటాయి. శ్రీశ్రీని చదివినంత మాత్రానే ఎవరూ అడవిదారి పట్టలేదు. ఆవేశంతో అడవిదారి ఎలానూ పట్టబోతున్న ఆ యువతీయువకులకు ఆయన వ్రాసిన కవిత్వం పాడుకోటానికి పనికివచ్చింది.

అమెరికన్ కామిక్ జాన్ స్టువర్ట్ అన్నది చూడండి: It’s like when people say Bob Dylan changed the world in the ’60s. He wrote some good tunes, and some people who did actually end up changing the world probably hummed them a lot, but that’s not what changed the world. సాహిత్యం మనలను సమూలంగా మార్చలేదు. మనలో లేని భావాలను అది పుట్టించలేదు. సాహిత్యం మనలో నిద్రాణమైవున్న భావాలను వెలికి తీయగలదు. మన ఆలోచనలకు స్పష్టతనిచ్చి మాటల్లో పెట్టుకోడానికి సహకరించగలదు, అంతే. పోనీ కాదు, సాహిత్యం ద్వారా అలా మార్పు వస్తుంది అనే అనుకుందాం. అలా మార్పు రావాలంటే ఎలాంటి సాహిత్యం కావాలి? వివేచనాత్మకసాహిత్యం కావాలి (ఏప్రిల్ 2023 ముందుమాట). చదువరులలో ఉత్తేజాన్ని రగిలించి, వారిని కార్యోన్ముఖులను చేయగల రచనలు ఈ తరంలో ఎందరు వ్రాస్తున్నారు? అలాంటివారు భూతద్దం* పెట్టి వెతికినా ఇప్పుడు దొరుకుతారా తెలుగు సమాజంలో?

(*భూతం అనేది ఒక మూఢనమ్మకం. అద్దాలకు భూతాలు భూతాలకు అద్దాలూ ఉండవు. అటువంటి పదాలు వాడడం ద్వారా ఈ ఈమాట సంపాదకుడు తను ప్రదర్శిస్తున్న బ్రాహ్మణీయ భావజాల మౌఢ్యానికి బాధ్యత తీసుకోవాలి! అభూతవర్గాలకు ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలి!)

సాహిత్యం సమాజాన్ని చీల్చిచెండాడగల ఆయుధం (డిసెంబర్ 2020 ముందుమాట) అనే ఒక భావుకత్వపు ధోరణి (రొమాంటిక్ నోషన్) ప్రబలంగా ఉంది సామ్యవాదులు, అభ్యుదయవాదులలో. కాని, మన చేతిలో ఉన్నది అసలు ఆయుధమేనా? అయితే, ఇది ఎటువంటి ఆయుధం? ఇది మనం చేయదలచుకున్న యుద్ధానికి తగినదేనా అన్న ఆలోచన ఎందరికి ఉంది? తిప్పడం రానివాడి చేతిలో కత్తి లాగా, వాక్యపు స్వభావం తెలియనివారు దానిని ఆయుధంగా ఎలా మలుచుకోగలరు? అలానే, ‘విప్లవం ద్వారా మార్పు’ మరొక రోమాంచిత భావన. దానివల్ల ప్రభుత్వాలు మారవచ్చేమో కాని ఆశయాలు నెరవేరతాయా? ఎప్పటిదో ఒక చిన్న బిబిసి వ్యాసం చదవండి.

  • ‘గతమూ యథాస్థితీ కోసం రాసేవారి వెనుక శతాబ్దాల సాధన ఉంది. వ్యవస్థ తోడ్పాటు తప్పక ఉంటుంది. వారి వస్తువు ఎలాంటిదైనా శైలి శిల్పం లాంటి సాహితీ విలువలు పుష్కలంగా ఉంటాయి.’

స్థూలంగా మీ ఉద్దేశ్యం అర్థమయింది. కాని, రచయితల సాహితీవిలువలకు, వారి రచనావస్తువుకూ సంబంధం లేదు. వ్యవస్థ తోడ్పాటు ఉన్నవారంతా యథాతథస్థితి కోసమే వ్రాయలేదు కూడా (కనీసం ఆధునిక కాలంలో). అలా వ్రాసిన/వ్రాయని వారందరిలో సాహితీవిలువలు పుష్కలంగానూ లేవు. కొన్నిసార్లు అసలు లేవు. ఎన్నో ఉదాహరణలు చూపించగలను. నా దృష్టిలో, నా అనుభవంలో ఇవి పూర్తిగా రెండు వేరు వేరు విషయాలు. ఒకటి- సామాజిక దృక్పథం, రెండు- సాహిత్య నైపుణ్యం.

  • ‘రేపటి కోసం రాసేవారిది ఏనాడైనా ఎదురీత. రాయడం ఇప్పుడే నేర్చుకొంటోన్న బృందమిది.’

బృందం అనడంలో ఇబ్బంది. నేర్చుకుంటున్న, సృజిస్తున్న క్షణంలో అది వైయక్తికమే కదా. ఇంతకూ ఎవరీ రాయడం ఇప్పుడే నేర్చుకొంటోన్న వారు? ఈ రెండు ప్రతిపాదనల లోని తర్కం నాకు స్పష్టం కావడం లేదు. ఏ ప్రాతిపదికన ఈ వర్గీకరణ? ఈ వ్రాయడం ‘నేర్చుకుంటున్న’ వారి నైపుణ్యంపై వారి సామాజిక స్థితిగతుల ప్రభావం ఎలా ఉంటుంది? ఉన్నా, ఆ ప్రభావం కేవలం వారి దృక్పథాన్ని శాసించి వారి వస్తువును నిర్దేశిస్తుంది మాత్రమే కదా. (ఖదీర్‍బాబుగారు తన స్పందనలోనూ ఇలాంటి అభిప్రాయమే వెలిబుచ్చారు.) నేపథ్యం ఏదైనా వారు ఔత్సాహిక రచయితలే. వారందరికీ వ్రాయడం ‘నేర్చుకోవాల్సిన’ అవసరం ఉంది. నేనంటున్నదీ ఇదే కదా.

సాహిత్యానికి నైపుణ్యం అవసరమని మేము తరచూ అనడం వల్ల, ‘రచనలో పరిణత నిర్దుష్టతే ప్రామాణికమనీ ఈమాట అనుకుంటుం’దన్న అభిప్రాయం ఏర్పడిందని నాకు బోధపడింది. రచనలో పరిణతి ఒక ఆశయం, ఒక ప్రయాణం. ఆ స్పష్టత మాకు ఉంది. ఈమాటలోనే చూడండి. సంచిక సంచికకూ మధ్య, ఒకే సంచికలో రచనల మధ్య నాణ్యత వేరు వేరు స్థాయిలలో ఉంటుంది. అందరు రచయితలనూ ఒకే తాటిపై నిలబెట్టాలన్నది మా మార్గమైతే ఇది ఎలా సాధ్యపడుతుంది? ఇంతకీ ఈ ప్రామాణికత ఏమిటి? చదివించగలిగేలా వ్రాయడం, చెప్పదలచుకున్న విషయాన్ని పాఠకులకు వీలైనంత స్పష్టంగా చేర్చేలా వాక్యాన్ని దిద్దుకోవడం – ఇదే కదా!

మీ కథావస్తువు ఏదైనా మాకు అంగీకారమే. దానిని వాక్యరూపంలో పెడుతున్నప్పుడు అందుకు తగిన నైపుణ్యాన్ని అలవర్చుకోండి. (జూన్ 2024 ముందుమాట) ఇదొక్కటే ఎన్నిసార్లు చెప్పినా ఇంకెన్నిసార్లు చెప్పబోతున్నా. వారసత్వ సంపద అంటే కావ్యాలూ ప్రబంధాలూ అనే కాదు కదా, మన తరం, మన ముందుతరం రచయితల సాహిత్యం కూడా అని. సాహిత్యాది కళలను సమాజం పరికించే తీరు, పరిశీలించి సమీపించే తీరూ తరతరానికీ మారుతుంటుంది. జులై 2024 ముందుమాటలో ‘ఈ విలువలను యువరచయితలు మార్చుకోవచ్చు. కొత్తవి తెచ్చుకోవచ్చు. కానీ అసలు సాహిత్యనియమాలే అవసరం లేదనుకోవడం అజ్ఞానం. ఆశయాల గొప్పదనంతో రచన విలువ ముడిపడి లేదు’ అని అన్నది ఇందుకే. మీరు సాహిత్యనియమాలు ఉంటాయని అంగీకరించారు.

  • ‘అగ్రవర్ణ సాహిత్యమూ అణచబడినవారి సాహిత్యమూ ఒకే స్థాయిలో ఉండాలనకోడం సమంజసం కాదు. అలాంటి సాహిత్యాన్ని నిరసించడం తగదు.’

ఈ వర్ణ వర్గీకరణ సామాజికం మాత్రమే. అని సాహిత్య వర్గీకరణ కా(లే)దు. ఇప్పుడు తెలిసింది, మాట తూలడమన్న ఆరోపణకు ఒక కారణం. ‘అణగారిన వర్గాలవారి సాహిత్యాన్ని నిరసిస్తున్నా’మన్నది ఈమాటపై బలంగా పాతుతున్న/కుంటున్న అపోహ*.  అలా మేము ఎప్పుడూ అనలేదు, అనుకోలేదు, ఆ ఉద్దేశ్యమే లేదు. ఒక ఉదా. చూపించగలరా? అసాహిత్యధోరణులను విమర్శించాం తప్ప ఏ రకమైన సాహిత్యాన్నీ నిరసించలేదు, ఏ ఒక్క రచయితనూ వేలెత్తి చూపలేదు. సాహిత్యానికి అటువంటి నిర్వచనాలు, నియమాలు, వర్గీకరణలు మాకు లేవు. అగ్రవర్ణ సాహిత్యం, నిమ్నవర్ణ సాహిత్యం అని కథా వస్తువు/రచయిత కులం వల్ల ఎవరైనా వర్గీకరించగలరేమో కాని, సాహిత్యస్థాయివల్ల కాదు. కొన్ని దశాబ్దాలుగా స్త్రీ, దళిత, మైనారిటీ వర్గాల రచయితలు ఎందరో తమ గొంతులు బలంగా, చక్కగా వినిపించారు, ఇకముందు వినిపిస్తూంటారు కూడా. (మరి వీరి మాట? వీరూ కొత్తగా వ్రాయడం నేర్చుకున్నవారే కదా?). అందుకే మళ్ళీ చెప్తాను. మంచి రచనకు, ఆ రచయిత సామాజిక నేపథ్యానికి సంబంధం లేదు. రచన బాగాలేకుంటే అది రచయిత తప్పిదం. రచన వెనుక రచయిత శ్రమ ఉండాలని, తన రచన పట్ల రచయితకు గౌరవం ఉండాలని మాత్రమే మేం చెప్తూ వచ్చాం.

ఆవేశంలో వ్రాసేదే కవిత్వమని, రచనను మెరుగు పెడితే దానిలోని సహజత్వం పోతుందని… కొన్ని అపోహలు చాలా ప్రబలంగానే మన రచయితలలో ఉన్నాయి (మార్చ్ 2022 ముందుమాట). సమాజాభ్యుదయం కోసం వ్రాస్తున్నాను కాబట్టి నాకు సాహిత్యనియమాల అవసరం లేదు. నా ప్రకటన నా ఇష్టం, ఒకసారి వ్రాసినాక దిద్దను, నా రచనను విమర్శించడానికి మీరెవరు? అనే అహం (లేదా అజ్ఞానం) కూడా మనం అనుకున్న దానికంటే ఎక్కువమందిలోనే కని-పిస్తుంది, -పించింది ఇన్నేళ్ళలో. (అదృష్టవశాత్తూ, వీరూ కొందరే.) ఈ సాహిత్య అపోహలగురించి ఒక పూర్తి వ్యాసం వ్రాయవలసిన అవసరం ఉంది.

[*నేను ఏ తారతమ్యమూ లేకుండా అందరినీ ఈమాటకు వ్రాయమనే అడుగుతుంటాను. కాని, పైన చెప్పిన అహాలు, అపోహలున్న రచయితలు, సాహిత్యనియమాలకు అతీతులం అనుకొనేవారు, ఈమాటకు వ్రాయరు. వీరికి రచనపై మరికొంత సమయం వెచ్చించడం, మాతో కలిసి పనిచేయడం పట్ల ఆసక్తి ఉండదు. తోచింది వ్రాసేశాం, మా బాధ్యత తీరిపోయింది అన్న ధోరణి. ఒక్క రచన తిరస్కరించినందుకుగాను ఇక మాకు ఎప్పుడూ వ్రాయరు ఇంకొందరు. కొన్ని చారిత్రిక కారణాలవల్ల ప్రెజుడిస్ ఉన్న మరికొందరు ఈమాటకు వ్రాయరు. మాకు వచ్చిన రచనలనుంచే కదా ఏ సంచికైనా ఉండేది. కొందరు ఈమాట సంచికలు కొన్ని చూసి ఈమాట ఇటువంటి రచనలే ప్రచురిస్తుంది అని అభిప్రాయ పడతారు/పడ్డారు. పదుగురి మాటల్లో కాలక్రమేణా బలపడుతూ వచ్చి అది ఒక నిజంగా ప్రచారం అవుతుంది/అయింది. ఈమాటకు ఒక్కటంటే ఒక్క రచన పంపనివారు, కనీసం ఈమాట తరచుగా చదవని వారికి కూడా ఈమాటపై ఎన్ని నిరాధారమైన అభిప్రాయాలు, అపోహలు ఉన్నాయో చూపిస్తే మీరు ఆశ్చర్యపోతారు.]

కేవలం కథావస్తువు వల్ల కథకు విలువ రాదు – ఇలా మేము అనడం, అది ఇంకోలా అర్థం కావడానికి కారణం, సాహిత్యాన్ని సామాజిక అభ్యుదయంతో ముడివేయడం (అందుకే కదా నా ముందుమాటను అపార్థం చేసుకున్నారు ఇందరు). దృక్పథం సమాజాన్ని చూసే తీరుతో వస్తుంది. సాహిత్యస్థాయి వ్యక్తిగతసాధన వల్ల వస్తుంది. ఇప్పుడే వ్రాయటం నేర్చుకుంటున్న వారికి సాహిత్యం ద్వారా వారి స్వరాన్ని మరింత బలంగా వినిపించటంలో తర్ఫీదు ఉండాలని, అలాంటి సాహిత్యవాతావరణం ఏర్పరచాలనీ అంటున్నాను. ఏది ఎలా వ్రాస్తే అదే సాహిత్యం అనడం, పొగడడం, ఇంకే అభ్యాసమూ అవసరం లేదనటం వారికి ఇవ్వదగిన/ఇవ్వవలసిన ప్రోత్సాహమేనా?

  • ‘ఈమాట ఎవరిది? ఎవరికోసం? మనకు స్పష్టత అవసరం.’

ఈమాట అభిప్రాయాలలోను, ఇక్కడా నేను ఇచ్చిన వివరణలతో ఈ ప్రశ్నకు మీకు సమాధానం స్పష్టమయిందనే అనుకుంటాను. ఈమాట ఒక సాహిత్య పత్రిక అని మొదటినుంచీ అంటూనే ఉన్నాను. ఈమాట రాజకీయ వార్తాపత్రిక కాదు. రాజకీయచర్చలకు చోటు లేదు. మతతత్త్వాలకు, వాటి ప్రచారానికి చోటు ససేమిరా లేదు. సాహిత్యపరంగా అన్ని రకాల వాదాలకు, భావాలకు, దృక్పథాలకూ సమానంగా, నిష్పక్షపాతంగా చోటు ఇవ్వడానికే ఈమాట ఉంది. సాహిత్యానికి వర్గాలు లేవు, వర్ణాలు లేవు. సమాజంలానే సాహిత్యమూ బహుముఖీన కదా. ఏదో ఒక ముఖాన్ని మాత్రమే మేము చూపాలని ఆశించి మాకు ఎప్పుడూ వ్రాయనివారి దృక్పథాన్ని ఈమాటలో ఎలా చూపగలం? కేవలం ఒక ముందుమాట, లేదా ఒక కథ, ఒక వ్యాసం చాలా మాపై ఒక ముద్ర వేయటానికి? సంప్రదాయసాహిత్య వ్యాసాలు, పద్యాలు కొన్ని కనిపిస్తే చాలా ఈమాటను బ్రాహ్మణవాద భావజాల పత్రిక అని వర్గీకరించడానికి? చిన్నపాటి విమర్శ చేసినా అలా వేలెత్తి చూపడానికి? ఇదే విషయం ఈమాట రామాయణం మొదట్లో వివరించాను.

మీరన్న వాక్యం నుంచి – సాహిత్యం వైయక్తిక ప్రక్రియ అనిపించినా అది సామూహిక సామాజిక ప్రక్రియ – సామాజిక అన్న పదం తాత్కాలికంగా తీసివేసి చూడండి. రచయిత-రచన-సంపాదకుడు-పత్రిక ఇలా సామూహికంగా పని చేసి పాఠకులకు ఒక మెరుగైన వాక్యాన్ని ఇచ్చే ప్రక్రియ ఇది. మేము ఆశించేది రచయితలనుంచి కేవలం ఇదే. రచయితల వస్తువు, సామర్థ్యాన్ని బట్టి వాక్యసౌందర్యంలోను, పాఠకులలో స్పందన కలిగించే తీరులోనూ భేదాలుంటాయి. కాని ప్రతీ రచనను వీలైనంతగా తీర్చిదిద్దటం అనేది రచయిత కర్తవ్యం (ఫెబ్యువరి 2024 ముందుమాట, మార్చ్ 2022 ముందుమాట, మే 2020 ముందుమాట). వారికి అందులో సహాయపడటం మా కర్తవ్యం.

సాహిత్య పత్రిక అయినా సామాజిక అంశాలపై అవసరం అనుకున్నప్పుడు మౌనంగా లేము. మా అభిప్రాయం/నిరసన తెలుపుతూనే ఉన్నాం. మద్దతు పలుకుతూనే ఉన్నాం. ఉదా: రుష్దీ మీద దాడి (సెప్టెంబర్ 2022), వార్తాపత్రికల భాష (ఏప్రిల్ 2022); బి.ఎల్.ఎమ్ (జులై 2020), కోవిడ్ లాక్‍డౌన్ (జూన్ 2020), సామాజిక వివక్ష (మార్చ్ 2020) ఆంగ్లభాషలో బోధన (డిసెంబర్ 2019), సమగ్రవిద్యాబోధన (జూన్ 2023), రచయితలపై దాడులు (ఆగస్ట్ 2018, మార్చ్ 2015), ప్రచురణకర్తలకు సూచన (సెప్టెంబర్ 2023), అనువాదకులకు గౌరవం (ఫెబ్యువరి 2022)…

ఇప్పుడు నేను అడుగుతాను:

ఇన్నేళ్ళ ముందుమాటలలో, ఈమాటలో ప్రచురించిన రచనలలో ఏ వర్గ సాహిత్యాన్నయినా, ఏ సాహిత్య మార్గాన్నయినా నిరసించినట్టు ఒక్కటంటే ఒక్క ఉదాహరణ ఉందా?

మా ముందుమాటలన్నీ మరొక్కసారి చదివి చెప్పండి. పాత సంచికలు కొన్ని తిరగేసి చెప్పండి. ఎవరైనా సరే మీ/పై ప్రశ్నకు సమాధానం.

రచన ముఖ్యం, రచయిత కాదు. రచయితకు గౌరవం ఇస్తే రచనకు ఇచ్చినట్లు కాదు. కాని, రచనకు గౌరవం ఇస్తే రచయితకు తప్పకుండా ఇచ్చినట్లే! మేమంటున్న ఈ విషయం మన రచయితలకు పూర్తిగా/సరిగ్గా అర్థమయినప్పుడు ఇప్పుడున్న చాలా అపోహలు ఇకపై ఉండవు.

ఈమాట ఎవరిదీ కాదు, ఎవరికోసమో కాదు. అందరిదీ, అందరికోసమూ. ఈమాట ఒక సాహిత్య పత్రిక.


ఈమాటలో సాహిత్య ప్రమాణాలు అని మేము తరచూ అనడంపట్ల ఎన్. వేణుగోపాల్‍గారికి కొంత అసంతృప్తి ఉందని తెలుసు. ఈమాట శుద్ధసాహిత్యవాదాన్ని అనుసరిస్తోంది అని వారి విమర్శ అనుకుంటాను. అదేమిటో నాకు తెలియదు. వేణుగోపాల్‍గారు కమ్యూనిస్టు. వారికి సాహిత్యం పట్ల వాదనిశ్చయమైన అభిప్రాయాలుంటాయి, నిర్వచనాలుంటాయి. నేను కమ్యూనిస్టును కాను. నాకు సాహిత్యానికి సంబంధించి ఏ నియమాలు, నిర్వచనాలు, నిబంధనలు లేవు. ఒక రచయిత రాజకీయ సామాజిక నేపథ్యం, భావజాలం నాకు అనవసరం. రచయితలను నేను అడుగుతున్నదల్లా ఏది వ్రాసినా పాఠకులను ఆసక్తితో చదివించేలా వ్రాయమని, అందుకు ప్రయత్నించమని, నేర్చుకుంటూ ఉండమని. అంటే పత్రికగా మా ధ్యాస వాక్యం పట్ల, దాని మెరుగుదల పట్ల, చెప్పదలచుకున్న భావాన్ని ఎంత బలంగా అది చదువరులకు అందించగలదు అన్న విషయాల మీద కూడా ఉంటుంది. వారి అభివ్యక్తికి సహాయపడే దిశలో ఉంటుంది. అందుకు, మమ్మల్ని రూపవాదులనో శుద్ధవాదులనో ముద్ర వేస్తే అభ్యంతరం లేదు. ప్రతీ విషయాన్ని, ప్రతీ మనిషిని వర్గీకరించడం సామ్యవాద ధోరణులలో ఒకటి. తప్పనడం లేదు (ఏప్రిల్ 2019 ముందుమాట). ఆ అవసరం లేదంటున్నాను.

శుద్ధసాహిత్యవాదం అంటే కళ కళ కోసమే అనా? అదే అయితే ఇక్కడ రెండు మాటలు చెప్పకతప్పదు నాకు. మనం అరువు తెచ్చుకున్న రెండు ఆంగ్లవాడుకలున్నాయి. 1. హంగ్రీ ఆర్టిస్ట్, 2. ఆర్ట్ ఫర్ పీపుల్ సేక్.

కళాకారుడికి ఆకలి ఉండాలి అన్నదాన్ని సామ్యవాదులు (కానివారు కూడా) అర్థం చేసుకున్న తీరు హాస్యాస్పదం. ఈ ఆకలి కడుపుకు సంబంధించిందిగా వీరు చూశారు, కళాకారుడు పేగులెండుకుపోయి ఉంటే తప్ప అతనిది కళ కానట్టు. పికాసో, బ్రాక్, జామినీ రాయ్, ఎస్వీరామారావు, రవివర్మ, అమ్రితా షెర్‍గిల్… వీళ్ళది కళ కాదా? చూచాయగా గుర్తు, కొందరు ఆర్టిస్టులు గాలరీలు తెరిచి, తమ పెయింటింగులు ఖరీదు పెట్టి అమ్ముకోవడం, కొంచెం డబ్బు చేసుకోవడం నచ్చని మోహన్‍గారు వారందరినీ విమర్శిస్తూ వ్యాసం ఒకటి రాశారని. కళాకారుడికి ఆకలి ఉండవలసింది కళలో. కడుపులో కాదు. ఇది తెలుసుకోని ధోరణి కళాకారులకు ప్రమాదకరం.

ఇక రెండవది. కళ కళ కోసం కాదు ప్రజల కోసం అని. (ఇది ఎప్పటి వాదన! కనీసం ఒక శతాబ్దం వెనకది.) అంటే ఏమిటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. కాడ్‍వెల్‍, హెండర్‌సన్ వంటివారి మార్క్సిస్ట్ దృక్పథం నాది కాదు; ప్రాపగాండా కరపత్ర సాహిత్యం గురించి ఇక్కడ నేను మాట్లాడటం లేదు. కళ అంటే ఏమిటి? ప్రజలు అంటే ఎవరు? ఎవరైనా ఒకరు, పొగమంచు నిర్వచనాలు ఇవ్వకుండా స్పష్టంగా, సోదాహరణంగా వివరిస్తే బాగుండు.

ఇప్పటిదాకా నేను గమనించిన సందర్భాల్లో సామ్యవాదుల వర్గీకరణే ఈ విభజనకు ప్రమాణం. వారు ఏది కళ కోసం అంటే అది. ఏది ప్రజలకోసం కళ అంటే అదే. ఆ విభజన కేవలం ఆ వాదానికే పరిమితమైనది. ఈమాటకు సంబంధించనిది.