ప్రతీ ప్రాంతీయ సమాజమూ తమ భాష, కళలు, సంస్కృతుల మనుగడ, కొనసాగింపుల కోసం తపన పడుతుంది. ప్రత్యేకించి ఒక కళ కనుమరుగవుతోందన్న భయం ఉన్నప్పుడు దానిని కాపాడుకోవడం కోసం కొంత ప్రయత్నమూ కనిపిస్తుంది. ఇతర భారతీయ భాషలతో పోలిస్తే, తెలుగులో సాహిత్యానికి ఆదరణ తక్కువవుతోందన్న ఆందోళన ఒకటి నేటి వాతావరణంలో ఉంది. కానీ గమనిస్తే ఇలా ఆందోళన పడిన ప్రతీ తరం వెనక కొత్త తరం రచయితలు, కవులు పుడుతున్నారు, సాహిత్య సృజనను కొనసాగిస్తున్నారు. ఇన్ని కోట్లమంది మాట్లాడే తెలుగు భాషకి మరికొన్ని తరాల దాకా, కనీసం ఇప్పటికి బతికున్న తరంలో పుట్టిన ఆఖరు మనిషి చనిపోయేదాకా, ముంచుకొచ్చే ముప్పేమీ లేదు. తెలుగులో సాహిత్యానికి కొత్తగా రాబోయే లోటూ లేదు. కాని, సాహిత్యాదరణ, సాహిత్యాభిరుచి ముందుతరాలలో మరింతగా పెరగాలి అనుకుంటే – వారికి వ్రాతలో మనం ఏం మిగుల్చుతున్నాం? ఎటువంటి సాహిత్య లోకంలోకి వారిని ఆహ్వానిస్తున్నాం? బహుముఖీనమైన మన సాహిత్యంలో ఎన్ని ముఖాలను మన తరువాతి తరాలకు కనపడేలా, మరీ ముఖ్యంగా కనపడకుండా ఉండేలా చేస్తున్నాం? అన్నవి ఆలోచించవలసిన ప్రశ్నలు. మనకే ప్రత్యేకమో కాదో తెలియదు కాని, తెలుగులో సీరియస్ సాహిత్యం, సీరియస్ రచయితలు అనే ఒక ప్రత్యేక ప్రథ ఉంది. పాప్యులర్ సాహిత్యంగా పరిగణించబడే ఇతర సాహిత్యప్రక్రియల పట్ల కేవలం – హాస్యరచనలని, క్షుద్ర రచనలని, వంటింటి ఊసులని, కలల కబుర్లని – చిన్నచూపు ఉండటం మనకు చిరపరిచితం. ఈ చూపు, విచిత్రంగా పాఠకులకు ఏనాడూ పట్టలేదు – పుస్తకాదరణను పరిగణనలోకి తీసుకుంటే, వాళ్ళు తమ తమ అభిరుచులకు అనుగుణంగా అన్నిరకాల సాహిత్యాలనూ ఆదరిస్తూనే వస్తున్నారన్నది స్పష్టం. ఈ ధోరణి కేవలం సాహిత్యాన్ని, దాని ప్రయోజనాన్ని నిర్వచించి నియంత్రించబూనిన రచయితల సంఘాలది. పాఠకులు ఏది చదవాలో నిర్దేశించాలన్న దౌర్జన్యం అది. కళాకారులుగా ప్రతి ఒక్కరికీ తమదైన ఆశయం, రాజకీయ దృక్పథం, భావజాలం ఉండవచ్చు. వారు వాటికి అనుగుణంగా రచనలూ చేయవచ్చు. తప్పు లేదు. కాని, అది మాత్రమే అసలైన సాహిత్య ప్రయోజనమని, అలా కాని రచనలను, ఆయా రచయితలను ఉపేక్షించడం లేదా కువిమర్శకు గురి చేయడం సాహిత్యానికి, సదరు ఆశయానికీ కూడా హానికరమే. ఇందువల్లనే నిర్బంధసమాజాల్లో సప్తవర్ణ సమ్మిళితమైన సాహిత్యం అన్ని రంగులూ హంగులూ కోల్పోయి వర్ణవిహీనమైన ప్రాపగాండా సాహిత్యంగా మాత్రమే మిగిలేది. ఎల్లలు లేని సాహిత్యం నిజాలు చూపిస్తుంది, కలలూ కననిస్తుంది; ప్రశ్నిస్తుంది, సమాధానాలూ చూపుతుంది; ఆశయాలకు ఆలోచనలకూ స్పష్టత నిస్తుంది, మేధోమథనానికి దారి తీస్తుంది, కాసేపు ఆదమరిచి నవ్వుకునేలానూ చేస్తుంది. ఏ రకమైన సాహిత్యప్రక్రియ అయినా ఇంకొకదానికంటే గొప్ప కాదు, తక్కువా కాదు. రచయిత ఆశయం వల్ల సాహిత్యానికి విలువ పెరగదు, తరగదు కూడా. సమాజంలో దేని స్థానం దానికుంటుంది. అన్ని రకాల సాహిత్యప్రక్రియలూ సమానమైన ఆదరానికి నోచుకోగల స్వేచ్ఛాపూరిత వాతావరణంలో మాత్రమే ఔత్సాహిక రచయితలు విభిన్నమైన సాహిత్యప్రయోగాలతో ముందుకు వస్తారు. ఆ విభిన్నతతో పాటు పాఠకులూ పెరుగుతారు. భాష మనుగడ మరింత పెరుగుతుంది. రచనా విమర్శలో భావజాలపు చీటీలను తీసేసి, రచనను చర్చించడం ఒక అవసరమని సాహిత్యకారులు గమనించడం, ప్రస్తుత వాతావరణంలో మార్పు తీసుకురావడానికి దోహదపడే ఒకానొక ముఖ్యమైన అంశం. సృజన అన్ని నియమాలనూ త్రోసిరాజని బతుకుతుంది. ఇక్కడ చెల్లుబాటయ్యే నియమం ఏదైనా ఉందీ అంటే, అది ఏ నియమమూ ఉండకూడదన్నదే.