మహోన్నత చిత్రకారుడు బ్రాక్

చాలామందిని చనిపోయిన తరువాత, మృతజీవుల క్రింద పరిగణించి మర్చిపోతాం. కానీ కొంతమందిని మృతజీవులైనా సజీవులగనే లెక్క వేస్తుంటాము. అటువంటి వారు చరిత్రలో బహు కొద్ది మంది. ఒక్కొక్క కాలం, ఒక్కొక్కరకపు తత్వవేత్తలను, విజ్ఞానవేత్తలను, కళాభిజ్ఞులను సృష్టిస్తుంది. కొంతమంది అల్లకల్లోలంగా ఉన్న సమయంలో శాంతిని ప్రసాదించేందుకు జనిస్తే, మరికొంతమంది శాంతంగా వున్న కాలంలో సంచలనాన్ని ఉత్పన్నం చేసేందుకు ఉద్భవిస్తారు. కాని విచిత్రం, ఇవన్నీ కాలగర్భంలో కలిసి పోయేవే. గతంలో జరిగిన మంచైనా, చెడైనా భావికి అండగా ఉండడం సహజం. ఇటువంటి సమయం ఒకసారి చిత్రకళా రంగంలో కూడా వచ్చింది.


సూర్యోదయం (సొలే లెవాఁ)
క్లాడ్ మొనే (1873) ఇంప్రెషనిస్ట్ చిత్రం

అప్పటివరకు కడుపులో నీళ్ళు కదలకుండా మెత్తని సోఫాలో కూర్చుని, చూస్తూ ఆనందించవలసిన నున్నటి ఫోటోగ్రాఫుల వంటి చిత్రాలను, ఇంప్రెషనిౙమ్ (Impressionism) చిత్రాలు వచ్చి ఆటంబాంబులా తుడిచివేశాయి. మొనే (Claude Monet) ‘సూర్యోదయం, ఒక జ్ఞాపకం (Impression, Soleil Levant)’ అని పేరు పెట్టాడు ల హావ్రే (Le Havre) పట్టణంలో చిత్రించిన చిత్రానికి. దానితో ఇంప్రెషనిౙమ్ అనే పేరు ఆ రకమైన చిత్రకళకు వచ్చింది. ఈ పద్ధతిలో ముఖ్యంగా, చూచిన దృశ్యం ఒక క్షణంలో తమపై వేసిన ముద్రను అంతే సహజంగా చిత్రించడానికి ప్రయత్నిస్తారు, ఆ క్షణంలో కదిలే వెలుగునీడలు, మెదిలే రంగులలోనే. ప్రజలు, విమర్శకులు ఈ క్రొత్త కళారంగాన్ని జీర్ణం చేసుకునే లోపునే సెజాన్ (Paul Cezanne) ఒక కొత్త పద్ధతిని, క్యూబిౙమ్ విత్తనాన్ని నాటి మరణించాడు. దీనితో వచ్చిన ప్రళయం కళారంగంలో, అసలు కళాపద్ధతినే మార్చివేసింది. ఒక విధంగా చెప్పాలంటే నేడు ఉన్న అనేక రకాల చిత్రకళా పద్ధతులకు మూలం సెజాన్ పద్ధతే.

సెజాన్ చనిపోయిన తరువాత 1907లో పారిస్‌లో, ఆయన చిత్రాలన్నీ కలిపి, పెద్ద ప్రదర్శన జరిపారు. సెజాన్ బ్రతికి వుండగా మిత్రుడు ఎమీల్ బెర్నార్డ్‌కి (Emile Bernard) వ్రాసిన ఉత్తరాన్ని కూడా ప్రచురించారు. అందులో సెజాన్ అంటాడు: ” లోగడ నేను చెప్పినదాన్ని మరలా ఒకసారి చెపుతాను. ప్రకృతిని గోళాకారము, వర్తుల స్థంభాకారము, కూచి ఆకారములలో చూచినట్లైతే, ప్రకృతి ప్రభావ సిద్ధమా అన్నట్లు, భూమికి సమానాంతరముగ ఉన్న రేఖలు వెడల్పును, నిలువుగ ఉన్న రేఖలు లోతును కల్పిస్తాయి. నిజానికి ప్రకృతి భూమిపై కంటే భూమి లోపలనే ఎక్కువగా ఉంది.”

వస్తువులను, ప్రకృతిని గోళాకార, స్తంభాకార, కూచి ఆకారాలలో చూచి చిత్రించే పద్ధతిని, పాబ్లో పికాసో (Pablo Picasso), జ్యార్జ్య్ బ్రాక్‌ (Georges braque) ఎంతో దీక్షగా కొనసాగించారు. అప్పటివరకు చిత్రిస్తున్న ఆకారాన్ని విధ్వంసం చేసి, ఒక క్రొత్త పోకడలో చెప్పారు. దాని వలన వారు చిత్రాలలో కావలసిన వివిధ కోణాకారాలను తేగలిగారు. అందుకే ముఖ్యంగా ఈ క్రొత్త చిత్రకళారంగంలో పికాసో, బ్రాక్‌లు జంటగా నిలుస్తారు.

ప్రపంచాన్ని తన చిత్రాలతో మైమరపింపజేసిన బ్రాక్ (Georges Braque) 31 ఆగస్ట్ 1963న, తన 81వ యేట పరమపదించారు. ఈ వార్తను ప్రపంచం లోని అన్ని రేడియోలు, పేపర్లు ప్రకటించాయి. పారిస్ నగరం మొత్తం దుఃఖించింది. అంతటి వ్యక్తి సాధించిన విషయాన్ని, ఆయన జీవితాన్ని, సాధ్యమైనంత వివరంగా తెలుపుతాను.


జ్యార్జ్య్ బ్రాక్ (1882- 1963)

బ్రాక్ 1882 మే నెల 13వ తేదీన అర్జంటీల్ అనే పట్టణంలో జన్మించాడు. ఇది పారిస్ నగరానికి చాలా దగ్గర. తండ్రిది ఇండ్లకు రంగులు వేసే వృత్తి. తరువాత చిన్న షాపు స్వంతంగా పెట్టి రంగులు అమ్మేవాడు. బ్రాక్ తండ్రితో పాటుగా వెళ్ళి ఇండ్లకు రంగులు వేసేవాడు చిన్నతనంలో. తండ్రికి ఒక్కగానొక్క కొడుకు కావడం వల్ల గారాబంగా పెరిగాడు. చిన్నతనంలో మంచి హుషారైనవాడు. ప్రపంచ ప్రసిద్ధ చిత్రకారుడు రఊల్ డఫీ (Raoul_Dufy) సోదరునితో కలిసి తరచుగా తిరిగేవాడు. ఫ్లూట్ నేర్చుకున్నది కూడా ఇతని వద్దనే. అంత సరదా ఐనవాడు తర్వాత తర్వాత ఎందువల్లనో అంతగా అందరితో తిరిగేవాడు కాదు. చివరి దశలో అసలు దాదాపు ఇల్లు వదిలి కదిలేవాడు కాదు. దగ్గరగా ఉన్న చిత్రకళాశాలలో కొంతకాలం కళాభ్యాసం చేశాడు. బ్రాక్‌కు ఎనిమిదవ యేడు వచ్చేసరికి తండ్రి ల హావ్రే వచ్చి స్థిరపడ్డాడు. అక్కడే బ్రాక్ కొంతకాలం, రంగులు వేసే మరొకతని వద్ద పనిచేశాడు. తండ్రి వేసే పద్ధతుల్ని, ముఖ్యంగా, పాలరాతి లాంటి రంగుల్ని వేయడం, రాతిలో చారలను చూపడం లాంటి ట్రిక్కులని, అవి సరదాగా ఉండడం వల్ల, ఎంతో జాగ్రత్తగా నేర్చుకున్నాడు. ఈ పద్ధతులను తర్వాత తర్వాత తన స్టిల్ లైఫ్ చిత్రాలలో విరివిగా చూపించాడు. అంతగా చదువుపై శ్రద్ధ ఉన్నట్లు, చదివినట్టు కనిపించదు.

1900వ సంవత్సరంలో పారిస్‌కి వచ్చి స్థిరపడ్డాడు. చిత్రకళాశాలలో, స్టూడియోలలో, ఎకాడమీలలో తిరిగి ఎంతో అనుభవాన్ని సంపాదించాడు. అసలు బ్రాక్‌కు అదృష్టం అతని కున్న స్నేహితుల వల్ల వచ్చింది. ఈనాటి ప్రపంచ ప్రసిద్ధ చిత్రకారులందరూ అతనికి చిన్ననాటి స్నేహితులు. వారందరూ కలిసి ప్రదర్శనలు ఏర్పాటు చేస్తే బ్రాక్‌ను కూడా కలుపుకునేవారు. అలా అందరితోబాటు ఇతను గూడా నలుగురికి తెలియడం జరిగింది. రఊల్ డఫీ, ఓథాన్ ఫ్రీష్జ్ (Othon Friesz), ఫ్రాన్సిస్ పికాబియా (Francis Picabia), మరీ లారెన్సిన్ (Marie Laurensin), ఆన్రీ మథీస్ (Henri Matisse) లాంటి వారందరూ స్నేహితులు. ఇంక అంతకంటే ఏమి కావాలి? అటువంటి వాతావరణం, అటువంటి మిత్రబృందంలో ఉండి, ఎంతో చురుకైన వాడవడం వల్ల, ఇట్టే పైకి రావడం జరిగింది.


రివర్ సెయిన్ ఎట్ షటో బ్రిడ్జ్
మరీస్ వ్లామిన్క్ (1906) ఫావిస్టు చిత్రం

1906లో జీవితంలో మొట్టమొదటి ప్రదర్శన జరిగింది. సలాన్ దె ఇండిపెండాన్స్ (Salon_des_Indépendants) అనే ప్రదర్శనను మిత్రులందరూ కలిసి ఏర్పాటు చేశారు. అందులో ఆరు చిత్రాలను ప్రదర్శించాడు బ్రాక్. ఈ ప్రదర్శన ఫావ్ (Fauve) చిత్రకారులందరూ కలిసి ఏర్పాటు చేసింది. ఈ ఫావ్ పద్దతిలో వేసిన రంగులు, చాలా ముతకగా ఒక రంగును ఏ ఇతర రంగుతోను కలపకుండా చిత్రించినట్టుగా వుంటాయి చిత్రాలు. ఇంప్రెషనిౙమ్ పద్ధతిలోవలె గాలిలో ఎగురుతున్న చిత్రాల వలె, మంచుతెరలలో కనిపించీ కనిపించని చిత్రాల వలె, మసకమసకగా మెరిసే పద్ధతి కాదు ఇది. బలాన్నీ, ఒకవిధమైన గ్రామీణ చిత్రకళా పద్ధతిని పుణికి పుచ్చుకున్న పద్ధతి. చిత్రాలు చూస్తే మన జామినీ రాయ్ చిత్రాలవలే కొట్టవచ్చినట్టు కనిపిస్తాయి. వీరికి చిత్రంలో కాంపోజిషన్ ముఖ్యం, బలం ముఖ్యం. అంతేగానీ ఇంప్రెషనిౙమ్ పద్ధతిలోని ఆకార స్వరూపాలు కాదు. దీని వలన ఇంప్రెషనిౙమ్ కంటే ఎక్కువ సౌలభ్యం ఉంది. చిత్రీకరణలో, ముఖ్యంగా కొట్టవచ్చే రంగులలో చిత్రించే పద్ధతి బాగా నచ్చింది బ్రాక్‌కు. అందుకే ఆ కాలంలో ఎన్నో చిత్రాలు ఫావిౙమ్ పద్ధతిలో చిత్రించాడు. అతనిపై ఆ కాలంలో డఫీ, ఫ్రీష్జ్‌ల ప్రభావం విపరీతంగా కనిపిస్తుంది.

పారిస్ వదిలి ఫ్రాన్స్‌లో చాలా చోట్ల తిరిగాడు. ఫావిౙమ్‌లో చాలా చిత్రాలు వేశాడు. ఎన్నో ప్రకృతి దృశ్యాలను ముఖ్యంగా కొండలను, సముద్రపు ఒడ్డులను, ఓడ రేవులని చిత్రించాడు. అతనిలో మరొక మార్పు తెచ్చింది మిత్రుడు డానియెల్-హెన్రీ కాన్‌వైలర్ (Daniel – Henry Kahnweiler). ఇతను క్రొత్తగా చిత్రాలను అమ్మే షాపు ప్రారంభించాడు. పికాసో, డొన్గన్ (Kees Van Dongen), వ్లామిన్క్ (Maurice De vlAminck) తదితరుల చిత్రాలను కొన్నాడు. మొట్టమొదటగా బ్రాక్ చిత్రాన్ని కొన్నది కూడా ఇతనే. తర్వాత కొన్ని మాసాలకు బ్రాక్ చిత్రాలనన్నీ కొనివేశాడట. దాన్ని బట్టి బ్రాక్ చిత్రాలు ఎలా అమ్ముడు పోయాయో తెలుస్తుంది. అదృష్టవంతుడి కింద లెక్క బ్రాక్ మిగతా చిత్రకారులతో పోలిస్తే. అతని చిత్రాలు అమ్ముడు పోకపోవడం అన్నది ఏనాడూ జరుగలేదు జీవితంలో. ఈ కాన్‌వైలరే ఇతన్ని పికాసోకు పరిచయం చేసింది. ఈ పరిచయం బ్రాక్‌ను ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారులలో ఒకరినిగా చేసింది. పికాసో అప్పటి మిత్రులు లియో స్టీన్ (Leo Stein), గియామె అపోలినేర్ (Guillame Apollinaire), మాక్స్ జేకబ్ (Max Jacob), వాన్ గ్రిస్ (Juan Gris)లతో తిరుగుతుండేవాడు. మొట్టమొదటగా పికాసో చిత్రాలను చూచి సంభ్రమాశ్చర్యాలను పొందాడు బ్రాక్. చిత్రాలను చూడగనే అతను పికాసోతో అన్న వాక్యమిది: “చూడవయ్యా! నీ చిత్రాలను గూర్చి నువ్వేం చెప్పుతావో నాకనవసరం. మేము మంటలు కక్కేందుకు, పెట్రోలు త్రాగమని చెప్పేందుకు నువ్వు చిత్రరచన చేస్తావు.” ఈ సంభ్రమాశ్చర్యాలు, తాను ఇంతవరకు చూడని క్రొత్త పద్ధతి, పికాసో యొక్క చిత్రకళా విధానం ఇతన్ని కలవరపరిచినై. తాను చేసే ఫావిౙమ్ పద్ధతితో ఇక లాభం లేదు, ఏదో మార్పు తేవాలి తన చిత్రాలలో అనుకున్నాడు. అందుకే ద్విగుణీకృత నిశ్చయంతో చిత్రాలను వెయ్యడం ప్రారంభించాడు.


మెయ్‌సాఁస్ అ లె ఎస్టాక్
బ్రాక్ (1907) క్యూబిస్టు చిత్రం

1907-08లలో బ్రాక్ ‘ఎస్టాక్ వద్దగల ఇళ్ళు’ (మెయ్‌సాఁస్ అ లె ఎస్టాక్: Maisons à l’Estaque) అనే చిత్రాన్ని చిత్రించాడు. మథీస్ చూచి మొట్ట మొదటిసారిగా “అవి చిన్న చిన్న ‘క్యూబుల’ లాగా కనిపిస్తాయి” అన్నాడు. 1909లో బ్రాక్ చిత్రించిన స్టిల్ లైఫ్స్, ప్రకృతి దృశ్యాలను చూచి ఒక కళా విమర్శకుడు వాటిని చిత్రమైన ‘క్యూబు’ ఆకారాలని వర్ణించాడు. దానితో క్యూబిౙమ్ (Cubism) అనే పద్ధతి వాడుకలోకి వచ్చింది. ఇలాగే పికాసో కూడా చేశాడు కొన్ని చిత్రాలు. కనుక ఈ ఇద్దరిలో ముందు ఎవరు ఇలా క్యూబుల పద్ధతిలో చిత్రించింది అని తెలియచెప్పలేం. దీనికి వీరిద్దరు ముందు కారకులే. చాలామంది విమర్శకులు ‘క్యూబిజానికి మూల కారకులు వీరిద్దరిలో ఎవరు?’ అని తలలు బ్రద్దలు కొట్టుకున్నారు – ఎవరెస్టు పర్వతం ఎక్కి ముందుగా శిఖరము పైన కాలు ఉంచినది ఎడ్మండ్ హిల్లరీయా, లేక టెన్సింగ్ నార్కేనా అని తలలు బ్రద్దలు కొట్టుకున్నట్లు. ఏది ఏమైతేనేం ప్రపంచ చిత్రకళారంగంలో, ఒక వినూత్న చిత్ర శైలిని సృష్టించిన ఇద్దరిలో ఒకడుగా బ్రాక్‌ను ప్రపంచం గుర్తించింది.