ఈమాట రామాయణం

ఈమాట ఒక విచిత్రమైన పత్రిక – ఈ మాట నేనే చెప్పవలసి వచ్చినా కూడా. ఇది కుడియెడమలు రెంటికీ చెడిన రేవడు. మనుషులైనా సంస్థలైనా ఏదో ఒక వర్గానికో వాదానికో చెందవలసినదే అన్న నిర్బంధంతో ప్రతి ఒక్కరినీ వర్గీకరించి, వారి చర్యలకు ఒక రంగు అంటించి, అభిప్రాయాలని కాకుండా వాటిని వెలిబుచ్చిన వారిని నిందించి – Ad Hominem అంటాం – తమ వాదనే సరైనదని సమర్థించుకొనే అఘాయిత్యపు ధోరణి అంతటా వ్యాపించివున్న సమయంలో, వేటికీ చెందకుండా ఎవరికీ లొంగకుండా నిష్పక్షపాతంగా అన్నిరకాల సాహిత్యాలకూ సమానవేదిక ఇవ్వగలగడం సులభం కాదు.

ఇటుపక్కన వామపక్షీయులు, అభ్యుదయవాదుల దృష్టిలో ఈమాట సనాతన భావజాల పత్రిక. మన ప్రాచీన సాహిత్యం బూతు కాదు, శ్రద్ధగా చదవండి అని చెప్పే పత్రిక. సమాజాన్ని మార్చవలసిన ఆయుధం సాహిత్యం; రచన గొప్పదనం రచయిత ఆశయంలో ఉంటుంది; వంటి వారి నిర్వచనాలు వినని పత్రిక. అటుపక్కన సాంప్రదాయికులకు, భక్తులకూ ఈమాట మతం, దైవం, ఆచారం వంటి నమ్మకాల పట్ల విలువ లేని పత్రిక. హైందవం, భారత చరిత్రలపై పాశ్చాత్య చరిత్రకారుల వక్రభాష్యాలకు వత్తాసు పలికే పత్రిక. అసలు నిజం ఏమిటో ఈమాట క్రమం తప్పకుండా చదివే పాఠకులు సులభంగానే గ్రహిస్తుంటారు.

‘సాహిత్యానికి పరిధులు లేవు. పరిమితులు లేవు’ అన్నాను. ఈ వాక్యానికి ‘ఎవరికి ఏది తోస్తే అది రాసేయవచ్చు’గా మీరు అర్థం చెప్పుకుంటే, సాహిత్యం గురించి మీకు కనీస అవగాహన కూడా లేదని నేను అర్థం చేసుకుంటాను. సాహిత్య సృజనకు మూలం ఒక అనుభవంలో ఉంటుంది. కాని, ఆ అనుభవం అక్షరంగా రూపు దిద్దుకొనే సమయంలో ఎంతో వివేచన, పరిశ్రమ అవసరం అవుతుంది. ఈ పరిశ్రమ ద్వారా పుట్టిన ఏ రచన కూడా మీరనుకునే ‘ఎవరికి ఏది తోస్తే అది రాసేసిన’ కోవకు చెందేది కాదు. అలా రాసేసేది సాహిత్యం కాలేదని వేరే చెప్పక్కర్లేదు. రవి గాంచనిచోట కవి గాంచును కాబట్టి, సాహిత్యసృజన వస్తువును ఎన్నుకోవడంలోను, దానిని ప్రకటించడంలోనూ ఏ రకమైన నిర్వచనానికి, నియమానికీ లొంగదు. ఇదీ నేనన్న వాక్యపు అర్థం.

ఏ రచనకయినా పాఠకులందరూ ఒకేలా స్పందించరు. వారి వారి మనస్తత్వాలు, దృక్పథాలు, విశ్లేషణా సామర్థ్యం, అభిరుచుల ఆధారంగా పాఠకులు ఒక రచనను మెచ్చుకుంటారు. లేదా మెచ్చుకోరు. అయితే, ముందు ఆ రచనను శ్రద్ధగా చదవడం, సంయమనంతో విశ్లేషించడం, ఆపైన ఆ రచన కథాకథనాల ఉచితానుచితాలు బేరీజు వేయడం, తమ అభిప్రాయాన్ని స్పష్టం చేసుకొని వ్యక్తం చేయడం – ఇదీ సహృదయులయిన పాఠకుల బాధ్యత, వారి ధర్మం, వారి కర్తవ్యం. అలా వెలువడని అభిప్రాయాలకు – కేవలం సాహిత్యపరంగానే కాదు – విలువ శూన్యం.

సాహిత్యం పట్ల, సమాజంలో దాని స్థానం పట్ల ఎన్నో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ అందరూ అంగీకరించవలసినది – అది ముందు సాహిత్యం కాగలగాలని. ఈ ధ్యేయంతోనే ఏ కథనైనా, కవితనైనా పరిశీలించే ఈమాటలో తిరస్కరించినవి, ప్రచురించినవి అయిన రచనలు ఏ ఒక్క వాదానికో, వర్గానికో, మతానికో, మర్యాదకో కట్టుబడి ఉండకపోవటంలో ఆశ్చర్యం లేదు. సాహిత్య ‘వాదు’లందరితో అజాతమిత్రుత్వం నెరపడంలో ఆశ్చర్యం అంతకన్నా లేదు. (గత నెలగా సాటి తెలుగు రచయితకు తమ గాఢమైన మౌనంతో తెలుగు రచయితలు, తె. ర. సంఘాలు, బృందాలూ ఇంత బలంగా తోడు నిలిచింది ఎందుకనుకున్నారూ?)

ఈమాట ఒక సాహిత్య పత్రిక. అంతే.


“Those who would give up essential Liberty, to purchase a little temporary Safety, deserve neither Liberty nor Safety.” – Benjamin Franklin.

మతం ఒక బలమైన భావన. ప్రత్యేకించి భక్తి ప్రధానమైన భారతదేశం వంటి దేశాలలో అశేష జనానీకానికది సాంఘిక ప్రాతిపదిక, వారి దైనందిన జీవనమార్గం. మతం విభిన్నమైన తాత్విక దృక్పథాలు, ఆచార వ్యవహారాలతో నిరంతరం వర్ధిల్లుతూ ఉంటుంది. ఆ భిన్నత్వం దానికి ఆయువుపట్టు. అయితే, ఒక మతానికి అధికారం కట్టబెట్టడం అంటే ఆ మతాన్ని ఏ కొందరికో అధీనం చెయ్యడం, కేవలం ఆ ‘మతాధికారుల’ ఆదేశాలు, నిర్వచనాలే ఆచారంగా, ధర్మంగా, చట్టంగా, సమాజంలో నిర్బంధంగా అమలు చేయడం, తద్వారా భిన్నత్వాన్ని నిర్మూలించడం. ఇది ఆ మతానికి చావు వేటు.

ఉదాహరణగా భగవద్గీతను తీసుకోండి. అనాదిగా ఎందరో భాష్యాలు వ్రాస్తున్నారు, ఇప్పటికీ వ్రాస్తూనే ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఒక భాష్యాన్ని ప్రకటించి, ఇదే దాని ఏకైక అర్థం, వేరే అర్థాలు వెతికేవారు మతద్రోహులు, వారికి మరణశిక్ష విధిస్తాం అన్నదనుకోండి. ఇది జరగలేదు, జరగబోదు అనుకోకండి. ఇస్లామిక్ దేశాలలో జరిగినది, జరుగుతున్నదీ ఇదే. యూరప్, అమెరికాలలో శతాబ్దాల పాటు ఇలా చర్చ్ చేసిన దురాగతాలు ఎన్నని! చరిత్ర చెప్పిన పాఠాలు నేర్చుకుంటున్న సమాజాలు అందుకే ప్రభుత్వాన్నీ మతాన్నీ వేరు వేరుగా నిలుపుకుంటున్నాయి. చరిత్రను తమకనుగుణంగా తిరిగి వ్రాసుకుంటున్న దేశాలు తాలిబన్ ప్రభుత్వ విధానాలని ఆదర్శంగా తీసుకుంటున్నాయి.

మతధర్మ రక్షణ నెపంతో నియంతృత్వం చేసే ప్రభుత్వాలు ఎల్లప్పుడూ అందరినుండి కొందరిని విడదీసి శత్రువులుగా చూపుతూ ప్రజలలో అసహన దృక్పథాన్ని పెంచి పోషిస్తుంటాయి. విధేయతకు అలవాటు పడిన ప్రజలు వాటి ప్రచారాలను సత్యాలుగా విశ్వసిస్తారు. రాజ్యాలకు తమకు అనుకూలమైన యథాతథస్థితి ఉండడం అవసరం. కళాకారులకు ఆ జడత్వం జీవవైరుధ్యం. ఈ రెంటిమధ్య సంఘర్షణ నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది. అందుకే, అప్రజాస్వామ్యిక ప్రభుత్వాలు భిన్నత్వాన్ని – ఆలోచన లోను, ఆచరణ లోనూ – అణచివేస్తాయి. అభద్రతాభావం ప్రజలలో పెంచి పోషించే వివక్ష వారికి అవసరం. ఈ ప్రభుత్వాల మొట్టమొదటి దాడి కళాకారులు, రచయితలు, పత్రికలపై ఉంటుంది. తమను ప్రశ్నించే వీరిని అంతఃశత్రువులుగా ముద్ర వేస్తాయి. విధేయులను వీరిపై హింసకు ప్రోత్సహిస్తాయి. ఉదాహరణలు అనేకం.

ఇటువంటి అప్రకటిత ఆత్యయిక పరిస్థితి ఒకటి సమాజంలో నెలకొన్నప్పుడు, మతం పేరిట హింస ప్రభుత్వవిధానం అయినప్పుడు – పత్రికలు, రచయితలు, కళాకారుల కర్తవ్యం ప్రభుత్వాలకు, జనబాహుళ్యపు నమ్మకాలకూ తల వొగ్గడం కాదు. నెలకొని ఉన్న సమాజ యథాస్థితిని ప్రశ్నించడం, ఎంత అసౌకర్యం కలిగించేది అయినా సరే నిజం వైపు నిలబడడం. ప్రతిఫలంగా ఎందరో కళాకారులు, రచయితలు, చిత్రకారులు, తత్త్వవేత్తలు ఎన్నో శతాబ్దాలుగా బెదిరించబడ్డారు, ఖైదు చేయబడ్డారు, చంపివేయబడ్డారు. వారి పుస్తకాలు, వర్ణచిత్రాలు తగులపెట్టబడ్డాయి. ఎంత రక్తం పారినా, ఎంత వెల చెల్లించవలసి వచ్చినా అంతిమంగా విజయం వీరిదే అయింది. వీరిని ప్రతిఘటించిన సమాజమే ఆ విజయఫలాలను అనుభవించింది. శతాబ్దాలుగా చరిత్ర ఈ సత్యాన్ని పదే పదే చూపుతూనే ఉంది.


The God said, “I refuse to prove that I exist, for proof denies faith, and without faith I am nothing.” – Douglas Adams.

రామాయణం ఒక సంక్లిష్టమైన మహాకావ్యం. అనాదిగా భారతీయ సాహిత్యాది కళలను, సామాజిక జనజీవన విధానాలను ఎంతగానో ప్రభావితం చేసిన అపురూపకావ్యం. అన్నిటికన్నా ముఖ్యంగా అది ఒక సజీవకావ్యం. అంటే ఏమిటి? ఒక కావ్యం సమాజంలో మమేకమై, ఆ సమాజం లోని ప్రతీ వర్గం ఆ కావ్యాన్ని తమదిగా, అందులోని పాత్రలను తమవారిగా సొంతం చేసుకొని, తమ తమ కథలను వారి ద్వారా చెప్పుకోగలిగినప్పుడు, అలా చెప్పుకోగలిగినంత కాలం ఆ కావ్యం ఆ సమాజంలో చిరంజీవిగా నిలిచివుంటుంది. రామాయణం అటువంటి మహాకావ్యం.

నిర్జీవమైన కావ్యాలకు ఒకే కథ ఉంటుంది. ఒకే కథనం ఉంటుంది. రామాయణం భారత ఉపఖండం అంతటా ఎన్నో కథలలో ఎన్నో కథనాలలో దర్శనమవుతున్న కావ్యం. ఇలా పరివ్యాప్తమైన రామాయణ కథలకు ప్రామాణికత ఏమిటి? ఎందుకు? కావ్యాలకు, గ్రంథాలకూ ప్రామాణికత ఆపాదించడం, ఆ ప్రాతిపదికన నిర్ధారించడం, పాశ్చాత్య పద్ధతి. వారిని అనుకరించడం వల్ల మన ఇతిహాస కావ్యసంపదకు నష్టం తప్ప ఏ లాభమూ లేదు. మన సాహిత్యాన్ని విశ్లేషించవలసిన పద్ధతి, అర్థం చేసుకోవలసిన తీరూ అది కాదు.

భారతీయ సమాజం ఎన్నో అసమానతలు నిండిన సమాజం. అనాదిగా కొన్ని వర్గాలవారిని అణచివేతకు, దౌర్జన్యానికి, దాష్టీకానికి గురి చేసిన సమాజం. ఈ సమాజంలో నిమ్నకులస్తుడు, అంటరానివాడుగా వెలివేయబడిన వ్యక్తి రామాయణాన్ని అగ్రవర్ణ బ్రాహ్మణ దృక్పథంతో ఎలా చూడగలడు? ఏం, రామాయణం అతనిదీ కాదా? సీతారాములు అతని దైవాలు కూడా కారా? అతనికి ఓదార్పు ఇవ్వడానికి ఇంకెవరున్నారు? అందుకే అతను రామాయణంలో తనదైన కథను వెతుక్కున్నాడు. లేనిచోట, తనవాడైన రాముడిని ప్రతిక్షేపించుకొని రామాయణ కథను వ్రాసుకున్నాడు.

నాగరికతకు దూరంగా జనపదాలలో బ్రతికే గ్రామీణులు, సంస్కృత పండితుల రామాయణాన్ని తమదిగా చూడలేరు. వారి జానపదంలో భాగమైన ఆ సీతారాములు నాగరీకులు కారు. ఇప్పటికీ పురుషాహంకారాన్ని ఎదుర్కొంటున్న స్త్రీలు, ఎంతో కాలంగా అణచివేతకు, అవమానాలకు, శారీరక మానసిక హింసలకూ గురి అయిన స్త్రీలు, పురుషదృక్కోణంలో రామాయణాన్ని ఎలా చూడగలరు? వారికి సీతమ్మ కేవలం ఒక దైవం కాదు. ఆమె వారి తోబుట్టువు. ఆమె పడిన కష్టాలు ఇంకొక స్త్రీ పడలేదు. తమ బాధలు, తమ ఫిర్యాదులు ఆమెతో కాక, ఆమె ద్వారా కాక ఇంకెలా మొర పెట్టుకోగలరు? అందుకే వారు స్త్రీల రామాయణాలు వ్రాసుకున్నారు. తమ జీవితానుభవాలను సీత ద్వారా పలికించుకున్నారు. ఆ సౌలభ్యం వీరందరికీ రామాయణం మాత్రమే ఇచ్చింది. ఎవరి రామాయణం వారిదే. ఎవరి సీతారాములు వారివారే. స్తుతికైనా నిందకైనా రామాయణమే పందిరి నీడ అయింది అందరికీ.

(అంటే గుర్తొచ్చింది. శ్రీరామనవమి పందిరి నీడలోకి వస్తే మార్క్స్ అయినా ఎంగెల్స్ అయినా సరే, గుప్పెడు వడపప్పు తిని, గ్లాసుడు పానకం తాగి, తడిసిన బవిరిగడ్డాలు తుడుచుకుంటూ బ్రేవుమని త్రేన్చి, శ్రీరామచంద్రప్రభువుకూ జై! అనకుండా ఉండలేరంటుంది, ‘ఇల్లాలి ముచ్చట్ల’ ఆ దొడ్డమాయిల్లాలు సీత.)

కాలక్రమేణా రామాయణాలు మారుతూ వచ్చాయి, కొత్తగా పుడుతూ వచ్చాయి, కొత్త కొత్త కథనాలు, దృక్కోణాలు వాటిలో ప్రక్షిప్తమయ్యాయి, అవుతూనే ఉంటాయి. రామాయణం ఏ కొందరి సొత్తో కాదు. సీతారాములు ఏ కొందరికో మాత్రమే దేవుళ్ళు కారు. మరెందరికో కేవలం దేవుళ్ళు మాత్రమే కారు. ఇది రామాయణానికి, వాల్మీకికీ అశేష భారతం చూపుతూనే ఉన్న గౌరవం. ఎప్పుడైతే ఇది మరిచిపోయి రాముడు ‘మా’వాడు, రామాయణం ‘మాది’, ‘మాకు నచ్చిందే, మేము చెప్పిందే రామాయణం’ అన్న దౌర్జన్యం ప్రబలుతుందో అప్పుడు సమాజంలో భిన్నవర్గాల మధ్య ఘర్షణ అనివార్యమవుతుంది. ఈ పోరులో మనగలిగితే, మానవజాతి సజీవంగా ఉన్నంతవరకూ రామాయణం కూడా సజీవంగా ఉంటుంది. లేదూ, ఒక నిర్జీవ కావ్యంగా మాత్రమే మిగిలిపోతుంది.


సీతారాములే కాదు, రామాయణంలో ఏ పాత్రనయినా పరిశీలించండి. ప్రతీ పాత్ర చిత్రణలో ఎంత వైవిధ్యం! చర్చనీయం, వివాదాస్పదం అయిన వారి నిర్ణయాలలో, సమర్థనలో, ధర్మాధర్మ వివేచనలో ఎంత విచికిత్స. ఎంత సంఘర్షణ! ఈ సంక్లిష్టతే రామాయణాన్ని ఇప్పటికీ సజీవంగా ఉంచింది. ఇన్ని రామాయణాలకు నాంది పలికింది. ఇప్పటికీ పలుకుతోంది. సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ తమ సుఖదుఃఖాలు, ఆలోచనలు, ఆవేదనలను రామాయణ పాత్రల ద్వారా పలికించుకోవడం వెనుక వారు తమవారు అన్న స్పృహ ఉంది. ఇది వేరెవరూ ఆర్చలేనిది, తీర్చలేనిది.

నేత్రోన్మీలనం కథ ద్వారా రచయిత పూర్ణిమ ఇదే చేసింది. ఒక జానపద రామాయణం నుంచి కలిగిన సాహిత్యస్ఫూర్తితో రాజ్యానికీ కళాకారునికీ మధ్య నిరంతరమూ ఉండే సంఘర్షణను సీతారాముల పాత్రల ద్వారా తన కథగా పలికించుకుంది. ఒక బలమైన సంఘర్షణకు ప్రతిరూపం ఇవ్వడానికి అంతే బలమైన పాత్రల అవసరం ఉంటుంది. సీతారాములకంటే ఈ సంఘర్షణకు ప్రతిరూపం ఇవ్వగలిగినవారు ఇంకెవరున్నారు? రామాయణం కంటే గొప్ప నేపథ్యం ఇంకేది ఉంది? ఇది అవమానం ఎలా? ఇది అనాదిగా వస్తూన్న భారతీయ సాహిత్యధారలో ఒక పాయ. అంతే.

ఈ కథ వల్ల భారతీయుల హిందువులకు కానీ రామాయణానికి కానీ కొత్తగా జరిగిన అవమానమేమీ లేదు. నిజానికి, రాముడు రాజకీయాలలో ఒక పావు అయినప్పుడే; మత దౌర్జన్యం, విధ్వంసాలకు ఒక సాకు అయినప్పుడే; రామనామం హింసకు నినాదం అయినప్పుడే జరగవలసిన అవమానం జరిగిపోయింది. సీతారాములను కేవలం విగ్రహాలుగా, రామాయణాన్ని పూజామందిరాలలో కళ్ళకద్దుకునే ఒక పుస్తకంగా మాత్రమే మిగిల్చే ప్రయత్నం మొదలైన రోజే జరగవలసిన అవమానం జరిగిపోయింది. జాతీయసంపద అయిన రామాయణాన్ని ‘మాది’ అని కొందరు కబ్జా చేసుకుని తెగబడ్డప్పుడే జరగవలసిన నష్టమూ జరిగిపోయింది.

బహుశా, ఒక రచయిత తనపై ఇలా దాడి జరిగితే, దాని నుండి కోలుకోవచ్చు, లేకపోవచ్చు. ఇదే మొదటిసారి కాదు, ఇదే ఆఖరూ కాబోదు. ఇంతకుముందు జరిగినట్టు, ఇకముందు జరగబోతున్నట్టు, భారతీయ అస్తిత్వం నుంచి విడదీయరాని రామాయణం ద్వారా రచయితలు కొత్తగా తమ కథలు చెప్పుకుంటూనే ఉంటారు, నటులు నాటకాలు వేస్తూనే ఉంటారు, చిత్రకారులు చిత్రాలు గీస్తూనే ఉంటారు. ఇది అనివార్యం. అటువంటి కథలు ఈమాటకు వచ్చినప్పుడల్లా, ఈమాట ప్రచురణా ప్రమాణాలను అవి అందుకున్నప్పుడల్లా మేము వాటిని ప్రచురిస్తూనే ఉంటాం. ఇదీ అనివార్యమే.


“The most important thing I have learned is the difference between taking one’s work seriously and taking one’s self seriously. The first is imperative, and the second disastrous.” – Margot Fonteyn.

నేత్రోన్మీలనం కథ కొందరికి నచ్చింది. కొందరికి నచ్చలేదు. కథనం బాగాలేదా? పాత్రౌచిత్యం లోపించిందా? సన్నివేశాలు అసహజంగా ఉన్నాయా? కథ నచ్చినా నచ్చకున్నా మీ ప్రతిస్పందన ఆ రచన పరిధిలోనే ఉండాలి. ఇది కనీస సాహిత్యనియమం. ఈమాటలో ఈ కథపై వచ్చిన భిన్నాభిప్రాయాలను ఈమాట నియమాల ప్రకారం ప్రచురిస్తూనే ఉన్నాను. ఆవేశంలో కొంత పరుషంగా చెప్పిన అభిప్రాయాలకూ అంతే విలువ ఇచ్చాను. అనుమానాలకు సమాధానాలూ ఇచ్చాను. ఆ కథ గురించి మీ అభిప్రాయం ఏదైనా, అది సభ్యమైన భాషలో ఉండి, వ్యక్తిగత నిందలకు దిగనంత వరకూ – ఎంత క్రూరంగా ఉన్నా – అది తప్పకుండా ప్రచురించబడింది. నిస్సందేహంగా అటువంటి అభిప్రాయాలు ఇక ముందూ ప్రచురించబడుతూనే ఉంటాయి.

సోషల్ మీడియాలో వచ్చిన అభిప్రాయాలు(?) రెండు రకాలు. మొదటి రకం: బూతులు, తిట్లు, బెదిరింపులతో తమ స్పందన తెలియచేసినవారు. పూర్ణిమ స్త్రీ కావడం వీరికి అదనపు సౌలభ్యం. వీరిలో చాలామంది ఈ కథను ‘చదివి’లేరు, ఏ కథనూ ‘చదవ’లేరు. వీరికి కళలు, సాహిత్యాలతో ఏ సంబంధమూ ఉండదు. ఎవరో ఎక్కడో ఒక రాయి విసిరిన అలికిడి వినవస్తుంది. వెంటనే లేచి అరవడం మొదలుపెడతారు. కాసేపటికి చల్లబడి, ఇంకో రాయి విసిరిన చప్పుడు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వీరి అస్తిత్వానికి మతమో, వాదమో, దేశమో, దైవమో, సినీనటులు, రాజకీయ నాయకుల పట్ల వీరాభిమానమో – ఏదో ఒక ఊతం కావాలి. వీరికి ధైర్యం మందిబలం ఇస్తుంది, సోషల్ మీడియా ఇస్తోంది. ఇలా అసభ్యమైన నోటితో ఓటి బెదిరింపులకు దిగే వీరికి తిరిగి అదే నోటితో రామయ్య తండ్రి. సీతమ్మ తల్లి. నిజంగా? ఎలా?

రెండవ రకం: వీరు విద్యాధికులు. మేధావులు. సోషల్ మీడియాలో గణాధిపతులు. వీరు ఏదీ నేరుగా చెప్పరు. జనాంతికంగా అన్యాపదేశంగా, ఒక అభిప్రాయాన్నో ప్రశ్ననో, అంతర్లీనమైన అసహనంతో, సవ్యమైన భాషతో – snide remarks అంటాం – విసురుతారు. ఆ అసహనాన్ని పసికట్టిన అనుచరగణాలన్నీ వెంటనే వత్తాసు పలుకుతూ రాళ్ళు విసరడం మొదలుపెడతాయి. ఈ పెద్దవారు వారి అనుయాయుల అనుచిత అభిప్రాయాలను నియంత్రించరు, సభ్యతను సూచించరు. అన్నీ తెలిసినవారు. వీరికి చెప్పడం ఇష్టం. వినడం కష్టం. వీరు వివరంగా విమర్శ చేయలేక కాదు. తమ అభిప్రాయం విస్పష్టంగా ప్రకటించలేకా కాదు. అలా చేయరు. వారి ఆశయం, అవసరం అది కాదు. అభివ్యక్తిలో, భాషలో మాత్రమే తేడా ఉన్న ఈ రెండు రకాల సోషల్ మీడియా స్పందనలకూ సాహిత్యపరంగా విలువ శూన్యం.

ఒక రచయితను రాయని కథపై, ఒక గాయకుడిని పాడని పాటపై, ఒక చిత్రకారుడిని గీయని బొమ్మపై విమర్శించడం ఎంత తర్కవిరుద్ధమో, ఈ రచన ఇలానే ఎందుకు చేశావు, ఈ పాట ఇలానే ఎందుకు పాడావు, ఈ బొమ్మ ఇలానే ఎందుకు గీశావు అని అడగడం అంతే అర్థరహితం. కళాకారులు వారి సృజనకు ఎంచుకున్న మార్గాలని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. అందువల్ల, నీకు సీతారాములే కావాల్సొచ్చిందా, వేరొకరిని పెట్టి రాసుకోవచ్చు కదా? నీకు మా రామాయణమే దొరికిందా? అసలు పురాణపాత్రలు ఎందుకు వాడాలి? వంటి ప్రశ్నలకు సమాధానం అనవసరం. వాటిలో కళల గురించిన అవగాహన శూన్యం.

ఇక మూడవ రకం: మనోభావాలు దెబ్బతీసుకునే వారు. మా మనోభావాలు దెబ్బతిన్నాయి అనడం వారి అభద్రతాభావాన్ని చట్టబద్ధం చేసుకోవడానికి చేసే ప్రయత్నం. ఇది వారు ధర్మాగ్రహం అనుకునే ఒక అభాస నుంచి పుట్టిన అసహనానికి ప్రతిరూపం. పైన చెప్పిన మొదటిరకం ఇలానే తమ భాషను, ప్రవర్తననూ సమర్థించుకుంటారు. అందుకే ఈ ప్రపంచంలో ఎప్పుడూ ఎవరో ఒకరికి మనోభావాలు గాయపడుతూనే ఉంటాయి. వాటికి మందు లేదు. ఆ అవసరం అంతకన్నా లేదు. అవమానం లేని చోట అది ఉందనుకోవడం ఆత్మన్యూనత; తమ మనోభావాలు గాయపరిచినందుకు క్షమాపణలు చెప్పమనడం తమ దృక్పథానికి విధేయతను ఆశించడం. మన దేశంలో మనోభావాలు దెబ్బతినడం ఒక వ్యాపారం కూడా అయిందని ఉదాహరణలు కనిపిస్తున్నాయి. ఇలా రకాలు ఎన్నయినా వీటన్నిటి అంతఃసూత్రం ఒక్కటే – అభద్రతాభావం నుండి పుట్టిన అసహన దృక్పథం. అందుకే వీటివేటిలోనూ వివేచన శూన్యం.

మనలో పేరుకొని పోయిన ఈ న్యూనత మనల్ని భిన్నదృక్కోణాలను చూడనివ్వదు. ఇతరుల ఉద్దేశ్యాలకు గౌరవం ఇవ్వనివ్వదు. వారి ప్రతి మాటా వక్రంగా వినపడుతుంది. వారి ప్రతి చర్య వెనుక ఏదో గూడుపుఠాణీ కనపడుతుంది. తమకు నచ్చినట్టు లేకుంటే రామాయణాన్ని చేస్తున్నది హేళనే (కాదు) అనడం హాస్యాస్పదం. ఇతర మతగ్రంథాల ఆధారంగా వ్రాసిన కథలనూ ప్రచురిస్తారా (తప్పకుండా!) అనడగడం కేవలం ఉడుకుమోతుతనం. మరి ఈ కథ నచ్చిన రామభక్తులు భక్తులు కారా? నచ్చకపోతేనే మీకు భక్తి ఉన్నట్లా? ఇప్పుడు ఈ నేత్రోన్మీలనం కథ పట్ల ప్రకటించిన ఆగ్రహావేశాలన్నీ ‘మీరు-మేము’, ‘మా రామాయణం-మీ అవమానం’ అన్న అసహన దృక్పథం నుండి, ఆత్మన్యూనతను కప్పిపుచ్చుకొనే డాంబికం నుండీ వచ్చినవే. ఆత్మవిశ్వాసం లేని ఎవరైనా తమ నమ్మకాలపై ఏ కొద్దిపాటి హాస్యాన్నయినా విమర్శనయినా ఎంతమాత్రమూ సహించలేరు. నా మాట నమ్మడం కష్టంగా ఉంటే మన సామ్యవాదుల ముందు శ్రీమహామార్క్స్‌ను ఒక మాట అని చూడండి, మీకే తెలుస్తుంది.

అలా అని, మత విశ్వాసాలను, ధార్మికతనూ ప్రయత్నపూర్వకంగా హేళన చేసి, ఆయా మతస్థులను నిజంగానే నొప్పించిన సంఘటనలు జరగలేదని, ఇక జరగవనీ కాదు. రాజకీయ, సామాజిక రంగాలలో అటువంటివి కనిపించినప్పుడు వాటిని ప్రతిఘటించే తీరు వేరు. సాంస్కృతిక, సాహిత్యాది కళారంగాలలో అవి అనిపించినప్పుడు ఉండవలసిన ప్రతిస్పందన వేరు.

తన దేశపు జండాని గౌరవంతో గర్వంగా ఎగరవేసే పౌరుడికి, తన దేశం పట్ల నిరసన చూపడానికి అదే జండాను తగలవేసే హక్కు కూడా ఉన్నప్పుడే అది ప్రజాస్వామ్యమని ఒక నిర్వచనం. అది ఆచరణయోగ్యమా, అభిలషణీయమా అన్నది పక్కన పెట్టి, కనీసం ఆ హక్కు గురించి కొంత ఆలోచించండి. (మనలో ఎందరం మన అమ్మానాన్నల మీద ఒక్కసారయినా కోపం తెచ్చుకోకుండా, ఒక్కపూటయినా వారిమీద అలగకుండా పెరిగి పెద్దయ్యాం? అది వారికి అవమానమేనా?) సైద్ధాంతికంగా అయినా ఆ హక్కును మీరు ఒప్పుకోలేకపోతే, కనీసం సంయమనంతో చర్చించలేకపోతే, మీరు ప్రజాస్వామ్యానికి, అది ఇచ్చే స్వేచ్ఛాస్వాతంత్ర్యాలకు అర్హులు కారు. ధర్మాన్ని కాపాడుకోవడానికి దౌర్జన్యం అవసరం అని సమర్థించుకొనే భక్తతాలిబన్‌లకు రామాయణ మహాకావ్యపు పూర్తి విలువ ఎప్పటికీ అర్థమూ కాదు.

మరొక్కసారి విస్పష్టంగా చెప్తున్నాను. నేత్రోన్మీలనం కథలో రామాయణం పట్ల, అందులోని పాత్రల పట్ల లేశమాత్రమైనా అగౌరవం ధ్వనించి ఉంటే ఆ కథ ఈమాటలో ప్రచురించేవాడిని కాను. ఆ అవసరం నాకు కాని, రచయితకు కాని, ఈమాటకు కానీ లేదు. నా దృష్టిలో అది ప్రచురించదగ్గ కథ. పదిమందీ చదివి చర్చించదగ్గ కథ. నా నిర్ణయంలో సంశయాలు సందేహాలూ నాకు లేవు. ఒక సంపాదకుడిగా ఆ కథను పునఃప్రచురించడానికి సిద్ధంగా ఉన్నాను, ఉంటాను.

ఎంతో కాలం ఆగక్కరలేదు. త్వరలోనే ఈ కథపై వచ్చిన స్పందనలు తిరిగి చూసుకుంటే ఎవరి సంస్కారం ఎటువంటిదో, ఎవరి మనోభావాలు ఎటువంటివో, ఏది అవమానమో ఏది కాదో, మనస్తత్వాల ఉచ్ఛనీచాలు, అభివ్యక్తి నిమ్నౌన్నత్యాలు అన్నీ తెలిసి వస్తాయి – చూసుకోదలిచిన వారికి. కానీ ఎవరో చూసి నేర్చుకుంటారని నేను పగటి కలలు కనను. ఈ ప్రపంచపు నిజరూపం నాకు స్పష్టం. ఇందులో నా స్థాయి, నా స్థానం నాకు స్పష్టం. సాహిత్యం కొన్నిసార్లు నొప్పిస్తుంది. అసహనం రేకెత్తిస్తుంది. ఆ అసహనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఏ విధంగా ప్రకటించాలి అన్నది పాఠకుల విజ్ఞతకు వదిలేయడం మినహా నేను చేయగలిగినది ఏమీ లేదు. ఇదీ అంతే స్పష్టం.

ఈ ప్రహసనం మమ్మల్ని మా బాధ్యత పట్ల మరింత జాగరూకులని చేసింది. రచయితలకు ఏ పరిమితులూ లేని స్వేచ్ఛాపూరిత వేదికను ఇవ్వడం. వారిని నిర్భయంగా వారి కథలను, ఆలోచనలను చెప్పుకోనివ్వడం, అందుకు తోడ్పడడం. అదే సమయంలో వాటి పట్ల తమ అభిప్రాయాలు సభ్యతతో పంచుకొనేందుకు పాఠకులకూ అంతే స్వేచ్ఛను ఇవ్వడం. సాహిత్య సంస్కారానికి లోబడి వీరిరువురి మధ్య చర్చలు జరిగేలా చూడడం – ఈమాట పత్రిక పట్ల ఇదే మా బాధ్యత. ఇది మేము మర్చిపోము. మార్చుకోము.

నమస్తే

మాధవ్ మాౘవరం
ఈమాట సంపాదకుడు.


తాక: జీవితంలో హాస్యం లేకుంటే కష్టం, ఏ పరిస్థితులలోనయినా మనమీద మనం నవ్వుకోగలగడం ఆరోగ్యకరం. ఈ జాబు ఒక ఇన్సాల్వెంట్ ప్రొఫెషనల్ రాశారు సభాముఖంగా. వారికి అలానే సమాధానం ఇద్దామని నా కోరిక.

P V N Rao FCA,CAIIB Insolvency Professional <****@gmail.com>
Tue, Nov 7, 1:33 AM

to editors: “ఈ మాచవరం మాధవరావు అనే సంపాదకుడు సంపాదన కోసం ఈ పత్రిక వేదిక పెట్టాడని మిషనరీ ఫండింగ్ వస్తుందని ఒక కథ రాస్తే పబ్లిష్ చెయ్యగలరా నా సృజనాత్మకు సంకెళ్ళు వెయ్యకుండా!?”

మా.మా.: మందుగుండువలె సృజనాత్మ దట్టించబడిన మీ ప్రశ్న నా దినమును చేసినది. మీపై ఆ దయామయుని కృప పెఠిల్లుగాక. మీ కథలోనూ ఇంత సృజనాత్మ ఉంటే తప్పకుండా ప్రచురిస్తాము. దయచేసి ఆ మిషనరీ వివరాలు కథలో వివరంగా రాయండి. పిల్లల కాలేజి చదువుకు, ఇటాలియన్ స్పోర్ట్స్ కారుకూ డబ్బు చాలా అవసరంగా ఉంది.