అభిరుచి, అధ్యయనం ఉన్న సంపాదకులు; భావనాగరిమ, రచనాపటిమ ఉన్న రచయితలు; ఆసక్తి గల పాఠకులతో తెలుగునాట పత్రికలకు స్వర్ణయుగమొకటి నడిచింది. అయితే రచనతో ఎదురైన సమస్యలకు ఏకపక్షంగా కత్తెర పట్టిన సంపాదకులు, తమ రచనలు వేరొకరు పరిష్కరించడం తమ ప్రతిభకు అవమానకరంగా భావించిన రచయితలు ఆనాడూ లేకపోలేరు. సాహిత్యం వ్యాపారమైన సమయంలోనే సాహిత్యంలో రాజకీయవాదాలూ ప్రబలమై ప్రచురణకర్తలే సంపాదకులూ అయినాక పత్రికల ఏకఛత్రాధిపత్యానికి రచయితలు, పాఠకులు తలొగ్గక తప్పలేదు. తిరస్కరణలు, ప్రచురణలూ ప్రశ్నార్థకంగా మారి, సమీక్షాపరిష్కరణల గురించిన సంభాషణ కొరవడిన ఆకాలం సంపాదకుల పట్ల ఔత్సాహిక రచయితలకు అపనమ్మకాన్ని మిగిల్చింది. క్రమేణా పత్రికాప్రాబల్యం కనుమరుగై సాంకేతిక సహకారంతో రచయితలే ప్రచురణకర్తలుగా మారిన ఈకాలం తామేది రాస్తే అదే సాహిత్యం అనే అహాన్ని నేటి రచయితలకు మిగిల్చింది. ఈ రెండు వైపరీత్యాల ఊగిసలాటలో ఏది సాహిత్యమో ఏది కాదో, అది ఏ ప్రమాణాలతో ప్రచురణకు నోచుకుంటోందో అర్థంకాని అయోమయ వాతావరణంలో తెలుగు సాహిత్యలోకం కూరుకుపోయింది. ఈ స్థితిలో వెబ్పత్రికలు వచ్చాయి. సాహిత్యాన్ని శ్రద్ధతో, గౌరవంతో సమీపించే రచయితలకు మునుపు సాధ్యపడని వేదికను ఇవి కల్పించాయి. ప్రచురణకు ముందుగానే రచయితకు తమ పరిష్కరణలకు కారణాలు చూపించడానికి సంపాదకులకు, ఆ మార్పుల పట్ల తమ అభిప్రాయాలను వెల్లడించడానికి రచయితలకు, వెబ్ పత్రికలు సౌలభ్యాన్ని కలిగించాయి. అందువల్ల, రచనను మెరుగుపరిచి ప్రచురణ దాకా తెచ్చేందుకు సంపాదకులూ రచయితలూ కలిసికట్టుగా పనిచేయడానికి అవసరమైన ఆ సంభాషణ ఇప్పుడు సాధ్యమయింది. రచయిత ఏం చెప్పదలుచుకున్నాడో దానికి అతి దగ్గరగా రచనను తీసుకువెళ్ళాలన్న సంపాదకుడి బాధ్యతను ఇది కొంత తేలిక చేస్తుంది. సంపాదకుడి ఆశయమూ రచనను మెరుగు పర్చడమేనని తమ వ్యాసంగం పట్ల గౌరవం ఉన్న రచయితలకూ ఇదే తెలియజేస్తుంది. సంపాదకులు-సమీక్షలు-పరిష్కరణ అనేవాటి గురించే కాక సాహిత్యం-సృజన-అభివ్యక్తి వంటి వాటిపట్ల రచయితలకు ఉన్న అపోహలు కూడా చెదరాలంటే ఇలాంటి సుహృద్భావ వాతావరణం ప్రస్తుతం తెలుగులో తప్పనిసరి. ఒక రచనను సంపాదకులు ఎంత శ్రద్ధగా పరిశీలించి పరిష్కరించి ప్రచురిస్తున్నారన్నదానిబట్టే సాహిత్యం పట్ల, రచయితల పట్ల వారికున్న గౌరవనిబద్ధతలు, అవి ఉండడంలోని అవసరం, అనివార్యత స్పష్టమవుతాయి. కాబట్టి, సంపాదకత్వమంటే కేవలం రచనలకు ఒక వేదికను ఇవ్వడం మాత్రమే కాదని తెలిసిన సంపాదకులు నేడు అవసరం. తమ అపరిపక్వ భావావేశాలకు తావివ్వడమే ప్రోత్సాహం అని అపోహపడే రచయితలు నేడు అనవసరం. సాహిత్యవ్యాసంగం ఒక నిరంతర అధ్యయనం అని తెలుసుకొని ఈ అవకాశాన్ని తెలుగు సాహిత్యకారులు ఎంతగా సద్వినియోగం చేసుకుంటారన్నది వారి వివేచనపై ఆధారపడివుంటుంది.