కళాసృజన ఒక ప్రవాహం. అన్ని పాయలనూ కలుపుకుంటూ, కొత్త మార్గాలను అన్వేషిస్తూ సాగే నిరంతర ప్రయాణం. ఏ కళాకారుడూ శూన్యంలోనుంచి కొత్తకళను సృష్టించలేడు. ఈ ప్రపంచాన్ని మన ప్రాచీనులనుంచి, సమకాలీనుల దాకా ఎందరో ఎన్నో రకాలుగా విశ్లేషించారు, విశ్లేషిస్తున్నారు, ఎవరెవరు ఎన్నివిధాలుగా పరిశీలిస్తున్నారో ఒకరి ద్వారా ఒకరు తెలుసుకుంటున్నారు. కళలయినా, తత్త్వచింతనయినా, శాస్త్రపాఠాలయినా ముందు అప్పటిదాకా ఇతరులు కూడబెట్టిన అనుభవజ్ఞానాన్ని నేర్చుకొని, దానికి తమ వంతు జోడించడమే సిసలయిన అభ్యుదయం. శిల్పులు, చిత్రకారులు, సంగీతకారులు, శాస్త్రజ్ఞులు – ఇలా ఏ కళలో రాణించాలనుకునే వారైనా, ముందు ఆ కళలో ఉన్న మెళకువలను, పద్ధతులను, పరిశోధనలనూ గమనిస్తారు. అప్పటిదాకా వచ్చిన విభిన్న ధృక్పథాలను, విప్లవాలనూ చదువుతారు, విద్యలా అభ్యసిస్తారు. ఇలా విస్తారంగా ఆ చరిత్రను ఆకళింపు చేసుకొని, ఆ విజ్ఞానంతో తమ కళను మరింత మెరుగు పరుచుకుంటారు. సాహిత్యమూ నిజానికి ఇలాగే ఎదగాలి. కానీ దురదృష్టవశాత్తూ తెలుగులో రచయితలకు చదవడం, నేర్చుకోవడం అన్నది ఎందుకో పడదు. వారిలో తమకు తెలిసింది చెప్పాలన్న తపన తప్ప, తమకు తెలియనిది తెలుసుకోవాలన్న తృష్ణ కాని, తాము చెప్పే తీరును ఎలా మెరుగుపరుచుకోవచ్చు అన్న ఆలోచన, పరిశ్రమ కానీ ఒక పట్టాన కనపడవు. ఎక్కువ పుస్తకాలు చదివితే, ఆయా రచయితల ప్రభావం తమ మీద పడిపోతుందని, తమకంటూ సృష్టించుకున్న శైలి ఏదో పాడైపోతుందన్న అపోహల్లో మగ్గిపోతూ ఉంటారు. ఇవి నిజంగా అపోహలో కుంటిసాకులో చెప్పడం కూడా కష్టమే. భిన్నంగా రాయాలన్న తపనను అర్థం చేసుకోవచ్చు కానీ తామే భిన్నమన్న భ్రమలో బ్రతికే తత్వాన్ని – అజ్ఞానమో, అహంకారమో – ఎలా అర్థం చేసుకోగలం! సాహిత్యపు మౌలికప్రయోజనం ఏమిటంటే అది ప్రపంచాన్ని వేరేవాళ్ళ కళ్ళతో చూడనిస్తుంది. ఇది పాఠకులకే కాదు, రచయితలకూ వర్తిస్తుంది. నచ్చిన దృక్పథాన్ని, నచ్చనిదానినీ కూడా సమాపేక్షతో చూడలేనివారు మంచి రచయితలు కాలేరని; ప్రతీ సమస్యకూ తక్షణ, తాత్కాలిక తీర్పులు ఉండవని; తప్పూ ఒప్పులకు ఆవల సందర్భమూ అవసరమూ అనేవి కూడా ఉంటాయని రచయితలు కేవలం విస్తారంగా చదవగలగడం ద్వారానే నేర్చుకోగలరు. మానవజీవితపు సంక్లిష్టతను అర్థం చేసుకోగలరు. ప్రపంచంలో ఏ మూలలోనైనా ఏ మనిషికైనా దొరికేవి అవే కొన్ని సత్యాలు, విలువలు, ఆదర్శాలు అనే మెలకువలోకి రాగలరు. చెప్పదలచుకున్న విషయాన్ని లోతుగా కూలంకషంగా అర్థం చేసుకొని, దానికి సరిపోయిన కథనాన్నివ్వగలరు. రచనను విజయవంతంగా పాఠకులకు చేర్చగలరు. ఈ సాధన, నైపుణ్యత, వివేచన, విజ్ఞానం, విశ్లేషణ ఇవన్నీ రచయితలకు తప్పక ఉండవల్సిన పరికరాలు. ఇవేమీ లేకుండా సహజాతంగానో, అభ్యాసపూర్వకంగానో కేవలం చదివించగల వాక్యం వ్రాయడం అలవడినంత మాత్రాన ఎవరూ మంచి రచయితలు కాలేరు. రకరకాల సాధనాలతో ప్రస్తుతం నిండుగా ఉండాల్సిన తెలుగు రచయితల సంచీలలో శుక్లాలు కమ్మిన ఒంటికంటి కలం ఒక్కటే పనిముట్టుగా కనిపిస్తోంది. తరువాతి తరాలకు సాహిత్యకారులు చివరికి ఏది చేయకూడదో చెప్పే ఉదాహరణలుగా మాత్రమే మిగిలిపోవడం కనిపిస్తోంది.