సెకండ్ ఛాన్స్

అమెరికాలో రెస్టారెంట్లకు వెళ్ళడం నాకు సరదా. తిండి మాటేమోగానీ అక్కడ నవ్వుతూ పలకరించే వెయిటర్లు నచ్చుతారు. మెన్యూ గురించి అడిగితే వాళ్ళు ఓపిగ్గా సమాధానాలు చెప్పే పద్ధతి నాకు బాగా నచ్చుతుంది. నేనా మాట అంటే రాధ నవ్వింది.

ఆ రెస్టారెంట్ లోకీ వెళ్ళీ వెళ్ళగానే ఒక వెయిటర్ వచ్చాడు. రాధను చూసి పలకరింపుగా నవ్వాడు. తను కూడ నవ్వి, ‘టూ’ అంది. మేము అతనితో టేబిల్ దగ్గరకు వెళ్ళేలోగా గోడకు అంటించిన ఎన్నో కాయితాలని చూశాను. వాటి మీద ఏవో సూక్తుల్లాంటివి పెన్నుతో రాసివున్నాయి. కనీసం మూడు పోస్టర్ల మీద ‘వన్ మోర్ ఛాన్స్’ అని వుంది. ఈలోగా మా టేబిల్ దగ్గరికి వచ్చాం.

కూర్చోగానే రాధ “ఏమైంది ఆంటీ. వింతగా చూస్తున్నావ్?” అంది.

చుట్టూ చూసి అడిగాను. “ఇక్కడికి తరచూ వస్తూంటావా? మీదేశంలో ఎప్పుడూ తెలిసినవాళ్ళల్లే పలకరిస్తూంటారనుకో. కానీ వేరే వెయిటర్లు కూడ నిన్ను గుర్తుపట్టినట్టు కనిపిస్తున్నారు?”

అవునన్నట్టు తలవూపింది. “ఇది నాకూ సంకేత్‌కూ ఇష్టమైన అడ్డా… మమ్మల్ని అందరూ గుర్తుపడతారు.”

“ఎందుకు? తిండి అంత బాగుంటుందా?”

రాధ తల అడ్డంగా తిప్పింది. “రుచి గురించి కాదు ఆంటీ. ఐమీన్ పిన్నీ! రుచులు కూడ బాగుంటాయనుకో. అది కాక, వీళ్ళంటే మాకిష్టం.”

నేను డెట్రాయిట్ వచ్చి రెండు రోజులైంది. ముందు ఇక్కడి వాతావరణానికి అలవాటుపడ్డాక బయటకు వెళ్దాంలే అంటే రాధ ఒప్పుకోలేదు. ‘నువ్వుండే వారం రోజుల్లో ఇంకా రెస్టు తీసుకుంటూంటె అయినట్టే ఉంది’ అంటూ ఆరోజు ఆర్ట్ గాలరీకి తీసుకువెళ్ళింది. నాకవి ఇష్టమని తనకూ తెలుసు. మైనస్ ఏడు డిగ్రీల్లో ఇంట్లోంచి కారు ఎక్కేవరకూ వణికినా, ఆర్ట్ గాలరీకి వెళ్ళాక ఆ చలిని కూడ మరిచిపోయాను. పికాసో, రెంబ్రాంట్, ఫ్రిదా, వాన్ గో, డియేగో రివియేరా… చూస్తోంటే నాలుగు గంటలు ఎంత త్వరగా గడిచిపోయాయో. ఇంకా కాస్సేపు డౌన్‌టౌన్ చూపించాక, ఆన్ ఆర్బర్‌లో ఒక రెస్టారెంట్‌కి వెళ్దామంది. డెట్రాయిట్‌లో హోటళ్ళు లేనట్టు అక్కడిదాకా ఎందుకూ అని విసుక్కున్నాను. ‘మిషిగన్‌కి ఎవరు వచ్చినా ఆ రెస్టారెంట్‌లో తినాల్సిందే. అది నా రూలు’ అంటూ లాక్కెళ్ళింది. ఫోర్డ్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న పిల్ల నాకోసమని రెండు రోజులు సెలవు పెట్టుకుని తిరుగుతూంటే నేను తన మాట కాదనలేక ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వస్తానని చెప్పేశాను. అలా ఇక్కడ తేలాం.

నేను ఇంతకుముందు కూడా అమెరికాకు వచ్చినా ఎప్పుడూ నా కూతురున్న కాలిఫోర్నియాలోనే అన్ని రోజులూ గడిపేసేదాన్ని. అమ్మమ్మ డ్యూటీ కదామరి. వేరే ఊళ్ళు చూసే పరిస్థితే లేదు. ఇప్పుడిక డ్యూటీలు అయిపోయాయి. పిల్లలకు నా అవసరం లేదు. అలాగే పెద్దలకు కూడా. అమ్మాయి, అల్లుడు ప్రేమగానే ఉంటారు కానీ నేను ఎక్కువ రోజులుండకపోయినా బాధపడరని నాకూ అర్థమైంది. అందుకే నన్ను ఎప్పటినుంచో రమ్మంటున్న నా కజిన్ కూతురు రాధ దగ్గరికి ముందుగా వచ్చాను. ఇక్కడినుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకి వెళ్ళి అమ్మాయి తిరిగి రాగానే అక్కడినుంచే ఇండియాకి వెళ్ళాలని రిటర్న్ టికెట్ బుక్ చేసుకున్నాను.

“ఇంతకూ వీళ్ళంటే నీకు ఎందుకిష్టం?”

రాధ అప్పటిదాకా ఇంగ్లీషులోనే మాట్లాడుతోంది. తనకు మొదట్నుంచీ తెలుగులో మాట్లాడ్డం సమస్యే. నాలుగు పదాలు తెలుగులో అంటే, తెలీకుండానే ఇంగ్లీషులోకి వెళ్ళిపోతుంది. ఇక పదిహేనేళ్ళనుంచీ అమెరికాలో స్థిరపడ్డాక చెప్పనవసరం లేదు. బెంగాలీ కుర్రాడిని కట్టుకోవడం మరో సాకు తెలుగు మరచిపోడానికి. ఇప్పుడు హఠాత్తుగా తెలుగులోకి మారిపోయింది.

“వీళ్ళందరికి నేరచరిత్ర ఉన్నది పిన్నీ.”

నేను ఉలిక్కిపడ్డాను. తను నేరచరిత్ర లాంటి పెద్ద పదం వాడినందుకే కాదు. అలాంటి వాళ్ళ హోటల్‌కి నన్నెందుకు తీసుకువచ్చిందని.

“దీన్ని పెట్టిన అబ్బాయి… ఉష్! వెంటనే చూడకు. అక్కడ కుడివైపు నించుని ఒక ఆఫ్రికన్ అమెరికన్ అమ్మాయితో మాట్లాడుతున్నాడు. అతను ఇదివరకు డ్రగ్స్ అమ్మేవాడు. కానీ కొన్ని వారాల్లోనే అరెస్టయ్యాడు. జైలు నుంచి వచ్చాక కొన్ని రోజులు ఎవరూ జాబ్ ఇవ్వలేదు. ఇక్కడ ఇంతకుముందు మరో అతని రెస్టారెంట్ ఉండేది. అతనికి ఇతని పాస్ట్ తెలిసే అమ్మాడో, తెలీక అమ్మాడో నాకు తెలీదు. కానీ మొత్తానికి ఇతనికి అమ్మేశాడు.”

నేను ఆశ్చర్యపోయాను. “తెలిస్తే ఎందుకు అమ్ముతాడే? తెలీదు కనకే అమ్మివుంటాడు.”

రాధ మళ్ళీ అడ్డంగా తల తిప్పింది. “అంత కొట్టిపారేయకు పిన్నీ… అతని పాస్ట్ ఈ హోటల్‌కి వచ్చే మాలాంటి కస్టమర్లందరికీ దాదాపుగా తెలుసు. అలాంటప్పుడు అమ్మినవాడికి తెలీకుండా ఉంటుందా?”

“అందరికీ నీలాగే కాస్తంత పిచ్చిలా ఉంది.” అన్నాను చిరాగ్గా.

రాధ నవ్వింది. “మనకు సర్వ్ చేశాడు చూడు, అతను దొంగ. షాపుల అద్దాలు పగలకొట్టి అందినంత ఎత్తుకుపోయేవాడు.”

నేను కెవ్వుమన్నంత పని చేశాను. “నన్ను ఎక్కడికి తీసుకువచ్చావే తల్లీ!” అన్నాను. ఇద్దరం లోగొంతుకతోనే మాట్లాడుతున్నా నా గాభరా దానికి అర్థమవుతూనే ఉంది.

“ఇతనే కాదు. ఈ రెస్టారెంట్‌లో చాలామంది ఎంప్లాయీస్ పాత నేరస్తులు. ప్రిజన్ టర్మ్ ఆరునెల్లనుంచి ఆరేళ్ళ వరకూ అనుభవించినవాళ్ళే.”

ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ, చిరునవ్వు చెక్కుచెదరకుండా ఒక్కొక్కళ్ళూ పదేసి టేబుళ్ళకు ఎక్కడా ఆలస్యం చేయకుండా, సర్వ్ చేస్తున్న విధానం చూస్తూంటే ఎంత ముచ్చటగా ఉందో. వీళ్ళంతా జైలు పక్షులా!

నాకు ఎంతో రుచిగా ఉన్నా నూడుల్స్ గొంతునుంచి దిగడంలేదు.

“మారియో… అదే, ఈ రెస్టారెంట్ పెట్టినతను. తనకు జీవితంలో సెకండ్ ఛాన్స్ దొరకడం చాలా అదృష్టంగా అనుకున్నాడు. అందుకే తనలాంటి వాళ్ళను వెదికి పట్టుకుని మరీ ఇలా ఉద్యోగంలోకి తీసుకున్నాడు. ఎంత గొప్ప విషయం కదా… తప్పులు అందరం చేస్తాం. అందరికీ శిక్ష కూడ పడదు. కానీ వీళ్ళంతా శిక్ష అనుభవించి వచ్చినవారు. అలాంటివాళ్ళకి సెకండ్ ఛాన్స్ ఇవ్వాలనుకోవడం గొప్ప కదూ… అందుకే ఐ రెస్పెక్ట్ దెమ్ ఎ లాట్. ఎంత చక్కగా జీవితాన్ని దిద్దుకున్నారో.” కష్టపడుతూ కూడబలుక్కుని చెప్పింది రాధ, ఇంగ్లీష్ వీలయినంతగా మాట్లాడకుండా ఉండటానికి ప్రయత్నిస్తూ.

నేను మాట్లాడలేదు. అందుకేనా ‘వన్ మోర్ ఛాన్స్’ అని అన్ని పోస్టర్లు అంటించారు!

రాత్రి పడుకున్నానన్నమాటే గానీ నిద్ర రావడంలేదు. చిన్నప్పటినుంచీ ఎంతో కలిగిన కుటుంబంలో అల్లారుముద్దుగా పెరిగి, అమెరికాలో చదువుకోవాలన్న కోరిక తీర్చుకుని, తనకిష్టమైన అబ్బాయిని పెళ్ళి చేసుకుని, జీవితమంతా వడ్డించిన విస్తరిలా బతుకుతున్న రాధ ఇలాంటి వాళ్ళ గురించి అంత సానుభూతి ఎలా చూపగలిగింది? ఆ అమ్మాయిలో ఆ సంస్కారం ఎలా వచ్చింది? భారీగా టిప్పులిచ్చింది కూడానూ, ఈ దేశంలో సర్వర్‌లకు టిప్పులు ఇవ్వడం అనివార్యమంటూ… తను ఇచ్చిన డబ్బుల్ని వాళ్ళు దుర్వినియోగం చెయ్యరన్న భరోసా ఏమిటి ఈ పిల్లకు? తప్పు చేసిన మనుషుల్లో కూడా మంచి ఉంటుందని ఎంత ధీమా తనకు! ఎలా నమ్ముతోంది వీళ్ళని!

ఉదయం హోటల్ గురించి విన్నప్పటినుంచీ నాకు మనసులో ఏవేవో జ్ఞాపకాలు… మనసంతా వికలంగానూ ఉంది. ఆనందంగానూ ఉంది. రెండిటికీ కారణం తెలీడం లేదు. రాత్రంతా కలతగానే గడిచింది.

పొద్దున్నే లేచాక ఒకే ముఖం కళ్ళముందు కనిపించడం మొదలయింది నాకు. నా 13వ యేట, ఇంటినుంచి వెళ్ళిపోయిన 16 యేళ్ళ అన్నయ్య ముఖం. అన్నయ్యంటే ప్రాణం పెట్టే అమ్మ ఆరోజు నుంచీ ఎప్పటికీ మామూలు మనిషి కాలేదు. ఇరవై యేళ్ళ తర్వాత మద్రాసులో ఏదో బాంక్‌లో పనిచేస్తున్నాడని ఎవరి ద్వారానో తెలిసింది. అమ్మ నన్ను వెళ్ళి వాణ్ణి తీసుకురమ్మని ఎన్నిసార్లు అడిగిందో! నేను వెళ్ళలేదు. వాడు గనక ఈ ఇంటికి వస్తే నేను మళ్ళీ ఆ ఇంటి గడప తొక్కనని అమ్మకు చెప్పేశాను. ఇంటి బాధ్యతలు, అమ్మానాన్నల ప్రేమ అన్నీ వదిలేసుకుని తన జీవితం తను చూసుకుని వెళ్ళిపోయినవాడు. ఆడపిల్లనైనా నేనే ఇద్దరినీ వార్ధక్యంలో చూసుకోవలసిన పరిస్థితి కల్పించినవాడు. వాణ్ణి మళ్ళీ చూడడం నా వల్ల కాదని చెప్పేశాను. అమ్మ ఏమనగలదు? నామీద ఆధారపడి బతుకుతోందాయె. మరి కొన్నేళ్ళకు మా ఆచూకీ తను తెలుసుకున్నట్టున్నాడు. నా ఆఫీసుకు ఓసారి ఫోన్ చేశాడు.

“శారదా… నేను పెద్ద తప్పే చేశాను. సమర్థించుకోను. కానీ మిమ్మల్ని తలచుకోని రోజు లేదు. తిరిగిరావడానికి నామోషీ. ఏం గొప్ప సాధించానని రావాలి అనుకున్నాను. కానీ ఈమధ్య అనిపిస్తోంది. సొంత ఇంటికి రావడానికి ఏ గొప్పలూ సాధించనవసరంలేదు కదా అని. ఒకసారి వచ్చి అమ్మను చూస్తానే… కనీసం క్షమాపణ చెప్పుకోడానికైనా ఒక్క అవకాశం ఇవ్వవే… నాన్న ఎలాగూ పోయారు.”

ఓ పావుగంట కష్టపడి, ఈ నాలుగు వాక్యాలూ ఎలాగో అన్నాడు. వాడికి నేను సమాధానం కూడా చెప్పలేదు. ఫోన్ పెట్టేశాను. ఇన్నేళ్ళుగా తను నాకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయలేదు. నాన్న అన్నయ్యను చూడకుండానే పోయారు. అన్నయ్య ఆచూకీ దొరికిన విషయం నాన్నకు నేను చెప్పలేదు. అమ్మను చెప్పొద్దని శాసించాను కూడా. అమ్మ నాతోనే ఉంటుంది. పైకి చెప్పదు కానీ మనసులో నామీద కోపం, అసంతృప్తి ఉన్నాయని తెలుసు. ఇప్పుడు అన్నయ్య వయసెంత వుంటుంది? 68… నాకు 65 కదా…

“ఏం పిన్నీ! అలా వున్నావు? ఆ హోటల్ కుర్రాళ్ళు కల్లోకి వచ్చి నీ ఇల్లు దోచుకుపోయారా ఏంటి?” అంది నవ్వుతూ రాధ.

నేనూ నవ్వాను. “కల్లోకి వచ్చిన మాట నిజమే… కానీ దోచుకోడానికి కాదు. కళ్ళు తెరిపించడానికి.” అన్నాను. రాధ అర్థంకానట్టు చూసింది. ఏం చెప్పను రాధకి? నందగోపాల్ అనే వేలు విడిచిన మామయ్య ఒకడు తనకున్నట్టు కూడ తెలీదు పాపం. అమాయకత్వంతోనో, దుందుడుకుతనంతోనో, తోటి మిత్రుల ప్రభావం వల్లో… లేక నిజంగానే నాన్న తిట్లు, దెబ్బలు బాధపెట్టినందువల్లో… ఎందుకో… అలా వెళ్ళిపోయాడు. ఎలా బతికాడో, ఎన్నెన్ని పనులు చేశాడో… ఏం చదువుకున్నాడో కూడ తెలీదు. తన అపరాధాన్ని మన్నించే మరో అవకాశం వస్తుందని ఎదురుచూస్తున్నాడు.

నా మనసంతా ఎపుడెపుడు చెన్నైలో ఉన్న అన్నయ్యకు ఫోన్ చేద్దామా అనే. ఇప్పుడు రాత్రి 10 దాటివుంటుంది. ఇప్పుడు చెయ్యనా? అమ్మ పడుకుని వుంటుంది. అన్నయ్యకు చెయ్యనా? తను కూడ పడుకున్నాడేమో. ఇంతకూ అమ్మకు ముందు చెయ్యనా? అన్నయ్యకా? ఇండియాలో తెల్లారేవరకూ ఆగగలనా? ఆలోచిస్తూ సెల్ ఫోన్ పర్సులోంచి బయటకు తీశాను.


సి. మృణాళిని

రచయిత సి. మృణాళిని గురించి: రచయితగా, విద్యావేత్తగా, వక్తగా, కాలమిస్ట్‌గా, పలు టీవీ రేడియో ఛానళ్లలో ప్రయోక్తగా, వివిధరూపాల్లో తెలుగు పాఠకులకు, ప్రేక్షకులకు పరిచితురాలయిన మృణాళిని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో తులనాత్మక అధ్యయన శాఖలో ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశారు. ఇతిహాసాల్లోని స్త్రీ పాత్రలను విశ్లేషిస్తూ వీరు వ్రాసిన వ్యాసాలు, తాంబూలం శీర్షికలో వ్రాసిన వ్యాసాలు బహుళ ప్రజాదరణ పొందాయి. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ...