ఉర్దూ నుంచి తిన్నగా మనసులోకి!

మూడు పుస్తకాలు – మచ్చలేని అనువాదాలు

కొన్ని మంచి అనువాద కథలు, చరిత్రలోని కొన్ని వాస్తవ దృశ్యాల వివరాలూ చదవాలనే ఆసక్తి గల పాఠకులకు మూడు అరుదయిన పుస్తకాలు సిద్ధంగా ఉన్నాయి. 1. మంటో క్లాసిక్స్ – మంటో కథల సంపుటి, 2. హైదరాబాద్ – మఖ్దూం హైదరాబాద్ స్టేట్ చారిత్రక పరిణామాలపై రాసిన నివేదిక వంటి పెద్ద వ్యాసం… చిన్న పుస్తకం, 3. గుల్‌దస్త – ఉర్దూ కథల సంపుటి, 20 మంది రచయితల ఉర్దూ కథలకు అనువాదాలు.

ఈ మూడు పుస్తకాల్లో రెండు మెహక్ హైదరాబాదీ స్వీయ ప్రచురణలు. మెహక్ సీనియర్ జర్నలిస్టు. ఉర్దూ సాహిత్యంలోని మహామహుల రచనలను అనువదించి మంచి పేరు గడించారు. తెలుగు రచయితల కథలే చదువుతున్నంత సరళ సుఖమైన అనువాదాలివి. ఒక్కోసారి తెలుగు కథలే ఉర్దూలోకి అనువాదమయ్యాయి కాబోలన్నంత అనువాద సౌఖ్యం కనిపిస్తుంది ఈ కథల ‘గుల్‌దస్త’లో! అదీ మెహక్ అనువాద శైలి.

హైదరాబాద్ అనే చిన్న పుస్తకంలో 77 సంవత్సరాల క్రితం నిజామ్ సంస్థానంలో జరిగిన దురాగతాలు, జమీందారీ దాష్టీకం, అనంతర పరిణామం వెండితెర సినిమా లాగ, బ్లాక్ అండ్ వైట్‌లో కనిపిస్తుంది. గొప్ప కవి, ఉద్యమ వీరుడూ మఖ్దూం స్వయంగా చూసి, అనుభవించి, గుండె బాదుకుని రాసిన కన్నీటి చెరువు ఈ పుస్తకం, లేదా నివేదిక. నాటి హైదరాబాద్‌లో ఈ పుస్తక ప్రచురణ దుర్లభం కావడంతో లాహోర్‌లోని కౌమీ దారుల్ ఇషాక్ – నేషనల్ పబ్లిసిటీ సంస్థ – ప్రచురించింది. పుస్తకం సంగతి తెలిసిన నిజామ్ సర్కారు 1947లో ఈ పుస్తకాన్ని నిషేధించింది. పుస్తక ప్రస్తావనే రాజద్రోహ చర్య! నిషేధాన్ని ఉల్లంఘించినవారిని తొక్కి నారదీయటం ఖాయం అని ప్రకటించారు అధికారులు.

మఖ్దూం ఒక మహా కేతనం, సమూహశక్తి కావటంతో ఆయన చెప్పరాని ఇబ్బందులకు గురయ్యాడు. నాటి నిజామ్ సర్కారు దుర్మార్గాన్ని అప్పటి నాయకులు, ఉద్యమ వీరులు, రచయితలు వాస్తవచిత్రంగా రాసి, పాడి, అభినయించి, ప్రదర్శించిన సంగతులు అందరికీ తెలిసిన, చదివిన, విన్న విషయాలే కానీ నేటి పరిశోధకులు, రచయితలు చెబుతున్నదీ రాస్తున్నదీ ఇందుకు భిన్నంగా ఉంది. నాటి అనర్థాలకు అత్యధిక శాతం కారణం నిజామ్, ఆయన అధికార వర్గం కాదు, కేవలం జమీందారులు, దేశముఖ్‌ల వంటి వారేనని నిర్ద్వంద్వంగా చెబుతున్నారు. నిజామ్ ప్రభువు ఉదార స్వభావం గల అభివృద్ధి కాముకుడని, ఆయన సేవలు, దానధర్మాలు, సమాజ శ్రేయస్సు కోరి చేపట్టిన నిర్మాణాలు ఎంత విలువయినవో నేటి తరం తెలుసుకోవలసి ఉందంటున్నారు. ఇక్కడ ముస్లిమ్ నాయకుల పాత్ర కన్నా సంస్థానాధీశుల, దొరల దురాగతాలే ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి అనే వాదనను ముందుకు తెస్తున్నారు… కొట్టిపారేయలేని సమగ్ర పరిశోధన అది. కానీ ఈ పుస్తకంలో మఖ్దూం రాసిన విశేషాలు, వివరాలు, కథనం మాత్రం నేటి పరిశోధనల పరిశీలనకు భిన్నంగానే వుంది. అవసరమయిన చర్చకు అవకాశం కల్పిస్తున్నది. మఖ్దూం దృష్టికోణం, పరిశీలన తెలియని నావంటి పాఠకులకు ఈ పుస్తకం గొప్ప పరిచయాన్ని కలిగిస్తుంది. ఈ పుస్తకాన్ని ఎంచుకోవడంలో మెహక్ ఆసక్తిని, అనువాదానికి చేసిన కృషినీ ఎంతో అభినందించాలి.

[హెచ్.బి.టి. ప్రచురణలు (2023) వెల: 100.00 రూ., ప్రతులకు: హైదరాబాద్ బుక్ ట్రస్ట్, తెలుగుబుక్స్.ఇన్]


మరో పుస్తకం మంటో క్లాసిక్స్. మంటో రాసిన అనేక ఉర్దూ కథల నుంచి 24 మంచి కథలను ఎంచుకుని తెలుగులోకి బహుబాగా అనువదించారు మెహక్. మంటో కథలను ఇంగ్లీషు నుంచి తెలుగులోకి తెచ్చేదానికంటే ఉర్దూలోంచి తిన్నగా తెలుగులోకి తేవడం ఉత్తమం, అత్యవసరం అని మెహక్ అనువాదం చెబుతుంది. మంటోను, ఆయన కథలను సత్కథాసాహిత్యం తెలిసిన పాఠకులకు పరిచయం చేయడం శుద్ధ అనవసర శ్రమ. ఐతే మంటో కథల సంగతి అసలు తెలియనివారికి ఇక్కడ విస్తారంగా రాయటం కంటే ఆయన కథల అనువాదాలున్న ఈ పుస్తకం కొని చదవమని చెప్పడమే నయం. మంటో కథాసాహిత్యం ఎందరిని ఎంతగా కుదిపి నిద్రమత్తు వదిలించిందో ఈ 180 పేజీల పుస్తకం చదివితే అర్థమవుతుంది. దేశ విభజన జరిగిన కాలంలో మనుషులను నిర్దాక్షిణ్యంగా ఏరివేసిన దుర్భర దృశ్యం మంటో కథల వెనక నేపథ్యసంగీతంలా కనిపిస్తుంది. మనుషులను మతాతీతంగా, ప్రాంతీయాతీతంగా ఏకైక మానవ నియతికి కట్టుబడి వుండేలా చూడాలన్న మహాతాపత్రయం కథల నీడలా కనిపిస్తుంది. కారుణ్య దీపకాంతిలో సాదాసీదా మనుషులు కదలి, కలిసిపోవడమూ కనిపిస్తుందీ కథల్లో. 

తోబాటేక్‌సింగ్ సరిహద్దులు భూమికేగాని మనుషుల మధ్య ఉండరాదన్న విశాల సద్భావం, మహదాశయం పలికే ‘వెర్రివాడి’ మాటల కథ. మామిడి పళ్ళు, గిల్గిత్ ఖాన్, బులెట్ వంటి కథలు గుండె లోతుల నుంచి ఎగసిపడే మానవతా కెరటాల్లాగ అనిపిస్తాయి. ఈ పుస్తకంలో నాడు నిషేధానికి గురయిన ఓ మూడు కథలు ప్రత్యేకించి చేర్చారు మెహక్. అంత నిషేధానికి గురికావలసిన అవసరమేమో కనబడలేదు వీటిలో… రచయిత సమున్నత శైలి తప్ప. అది ఎత్తున ఎగిరే జెండాలాగ కనిపిస్తుంది. చల్లని మాంసం కథలో ఒక విచిత్రానుభవ స్పర్శ కథని పదేపదే గుర్తుచేస్తుంది. ఆవిర్లు కథను ఆనాటి పాఠకులు ఏపాటి ఆదరించారో మరి! సున్నితమైన మనో వాతావరణం ఎంత చిత్రంగా పరుగు తీయిస్తుందో సర్కస్ ఫోకస్ లైట్‌లా చూపెడుతుంది. 

[మెహక్ ప్రచురణలు (2021) వెల: 150.00 రూ., ప్రతులకు: నవోదయా బుక్ హౌస్, తెలుగుబుక్స్.ఇన్]


ఇక ఇంకొక పుస్తకం గుల్‌దస్త. ఈ పుస్తకం చదువుతోంటే ఉర్దూలో కథలు రాసిన ముస్లిమ్ సోదరులు ఎందరెందరు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ ఉన్నారో అర్థమవుతుంది. ఆశ్చర్యమేమంటే ఆదాన్‌ప్రదాన్, తెహజీబ్ వంటి కబుర్లు చెప్పే అనేకమంది రచయితలు ఇక్కడి ఉర్దూ రచయితలతో సాహిత్య సమావేశాలు, వర్క్‌షాపులు నిర్వహించి అనువాదపరమైన అంశాలతో సహా సత్సాహితీ గోష్టి ఏర్పరచిన సందర్భాలు దాదాపు లేవు. ఇక ఏపాటి సాహితీ సుహృద్భావ వాతావరణం ఉన్నట్టు చెప్పుకోగలం చెప్పండి! ఇప్పుడు మెహక్ పలువురు ఉర్దూ రచయితల కథలను తెలుగులోకి తెచ్చి సాహిత్య స్నేహ వాతావరణం విస్తరించేందుకు సహకరించారు. ఇక్కడ సంపుటిలో కొందరు ఉర్దూ కథారచయితలు నాటి అభ్యుదయ రచయితల సంఘం సభ్యులు కాగా, కొందరు ఏ సంస్థకీ సంబంధించని, సరికొత్త పంథా ప్రదర్శించిన వారున్నారు. ఇలాగే నాటి ‘తెలంగాణా పబ్లికేషన్స్’ రచయితల్లో ఒకరి కథ ఈ సంపుటిలో చేర్చారు. తెలుగు పాఠకులకు బాగా పరిచయం ఉన్న జిలానీ బానుగారి కథ ఒకటి ప్రముఖంగా చేర్చారీ సంకలనంలో.

ఇందులోని కథల విషయానికొస్తే ఎక్కువభాగం కథల్లో చివరిఘట్టం వచ్చేసరికి గిర్రున ఒక మలుపు తిప్పి, కొంత ఆశ్చర్యానికి గురిచేసే ప్రయత్నం, అది కొంత ఫలించడమూ కనిపిస్తుంది, ఓ హెన్రీ కథల్లో వలే. ఇక ముస్లిమ్ రచయితలు కొందరు వారి పరిసరాల్లో తాము పరిశీలించిన హిందూ కుటుంబాల మానసిక, ఆర్థిక, సామాజిక స్థితిగతుల సారాంశాన్ని కథలుగా వినిపించారు. కరుణ ప్రధానంగా కనిపించే ఇతివృత్తాలు ఎక్కువ వున్న కథల సంపుటి ఇది. ఒకటి రెండు కథలు మినహాయిస్తే కథలన్నీ అమిత సరళంగా, నీతికథల్లాగా వరసన స్కేలుతో గీత గీసినట్టు వాక్యాలుంటాయి. కథనంలో ప్రత్యేకత, శైలి, ప్రతిభ కొట్టొచ్చినట్టో, పలకరించినట్టో కనబడవు. ఐతే మానవ విలువలు, అవి తలకిందులు కావడం దాపరికం లేకుండా రాసిన కథలు ఎక్కువ. ఐతే ఒకటి రెండు మూడు కథల్లోనే ఉర్దూ భాష సౌందర్యం వల్ల కావచ్చు, గౙల్‌ ప్రభావం కావచ్చు, హఠాత్తు పాటలో పల్లవిలాగ, కవితా పదంలాగ భలే మెరుపులు కనిపించాయి. ప్రాణం లేచొచ్చినట్టుంటుంది అవి చదువుతోంటే… ఇంకొన్ని వాదాలు, దృశ్యాలూ సర్రియలిస్టు ఇమేజ్‌లను చూపెడతాయి. సరళవాక్యం కొన్నిసార్లే నయంగా ఉంటుంది. వాక్యం కళకళలాడకుండా ఇసకపర్రలా వుంటే ముచ్చటేముంటుందీ – అదీ సాహిత్య విలువలు ఆశించిన వచనంలో!

మెహక్ ఈ సంపుటి ముందుమాటలో చెప్పినట్టు రెండు ముఖ్య విషయాలు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఒకటి – ఇతివృత్తాలు, సంవిధానం, ముగింపు భిన్నంగానే కనిపిస్తాయి. రెండు – ఇరు మతాల మధ్య సయోధ్య పెంపొందించి, వైరుధ్యాలను వెదికి వేరుచేసి, చెరిపేసే కృషి వున్న సృజనశీలత. ఈ రెండు విశేషాలు స్పష్టంగా వ్యక్తమవుతాయి ఈ కథల్లో.

ఈ మూడు పుస్తకాలను తీసుకురావడంలో శ్రమ చిన్నది కాదు. ఉర్దూ రచయితలను, ప్రొఫెసర్‌లను, విశ్వవిద్యాలయాలనూ సందర్శించి, సంప్రదించి ఉన్నతాశయంతో చేసిన ఈ గట్టి ప్రయత్నం విలువయినది – శభాష్ మెహక్!

[మెహక్ ప్రచురణలు (2023) వెల: 200.00 రూ., ప్రతులకు: నవోదయా బుక్ హౌస్, తెలుగుబుక్స్.ఇన్]


తల్లావజ్ఝుల శివాజీ

రచయిత తల్లావజ్ఝుల శివాజీ గురించి: జననం విద్యాభ్యాసం ఒంగోలులో. కళాసాహిత్య విషయాలలో పితామహులు తల్లావజ్ఝుల శివశంకర శాస్త్రిగారి ప్రభావం బాల్యం నుంచీ. బొమ్మలు గీయడం చిన్నప్పటినుంచే స్వయంకృషితో నేర్చుకున్నారు. పాత్రికేయుడిగా ఉద్యోగవిరమణ అనంతరం ఆదివాసీల సంక్షేమం కోసం పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని అడవులలో తిరిగి వారి జీవితాన్ని దగ్గరనుండి పరిశీలించారు. ఆ ప్రకృతి, ఆ జీవనవిధానపు స్వచ్ఛత, సరళత, నిరాడంబరతలు భారతీయ సంస్కృతి, ఇతిహాసాలలో వేళ్ళూనుకున్న వీరి చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తాయి. చక్కటి రచయిత, కళావిమర్శకుడు అయిన శివాజీ ఎన్నో చిత్రప్రదర్శనలు చేశారు. ...