ఎప్పటిలాగే రాత్రి భోజనాలయ్యాక ఆ నలుగురూ తీరికగా హల్లో సోఫాల్లో కూర్చున్నారు.
“ఇరవైరెండేళ్ళ వయసులో మొదటిసారి నేను కోనసీమకి వెళ్ళడం. పనిమీద ఎలాగూ రాజమండ్రి వెళ్తున్నాను కదా అని, నాతో పాటు కొత్తగా ఉద్యోగంలో చేరిన నందు ఆ పక్కన పల్లెలో వున్న వాళ్ళమ్మకి ఇచ్చి రమ్మని డబ్బుల కవరొకటి ఇచ్చాడు.”
అతడా విషయం మొదలుపెట్టగానే “ఆఫీస్ పని చేసుకోవాలి నాన్న!” అంటూ కొడుకు లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు. భార్య ఆవులించి “నిద్రకి ఆగలేను బాబూ” అంటూ తన గదిలోకి వెళ్ళింది. గోడ గడియారం అప్పటికింకా రాత్రి ఎనిమిదిన్నరే చూపిస్తోంది.
ఎదురుగా కూర్చున్న కొత్త కోడలు కుతూహలంగా చూస్తూ “చెప్పండి మామయ్యా!” అంది.
“మండువా ఇల్లు చూశావా నువ్వు?”
లేదన్నట్లు తల ఊపింది.
“సిటీలో పుట్టి పెరిగానేమో! నేను అదే మొదటిసారి – ఆ ఊర్లోనే చూడ్డం.”
కోడలు వెనక్కి వాలి సర్దుకుని కూర్చుని వినసాగింది.
“ఊరి పొలిమేరలో నన్ను దింపి బస్సు వెళ్ళిపోయింది. మధ్యలో బస్సుకి ఏదో రిపేర్ రావడంతో అనుకున్న సమయానికన్నా మూడు గంటలు ఆలస్యంగా చేరాను. ఆరు దాటాక ఆ దారిన బస్సులు వుండవని చెప్పాడు నందు. అప్పటికే ఏడు దాటింది. ఆకాశం మబ్బుపట్టి వుండటంతో కరెంటు సదుపాయం ఇంకా రాని ఆ ఊరిని చీకటి పూర్తిగా కమ్మేసింది.
నందు ఇంట్లో డబ్బులు ఇచ్చేశాక రోడ్డు మీదకి వచ్చి ఏదైనా లారీలాంటిది పట్టుకోవచ్చేమో అనుకున్నాను. రోడ్డు దగ్గర బడ్డీ కొట్టు మూసేస్తున్న ఓ వ్యక్తి ‘ఎవరింటికండీ?’ అంటూ అడిగాడు. నందు వాళ్ళ ఇంటికని చెప్పాను.
‘తమ్మయ్యగారిల్లా! అలా సెప్పండి… రెండో వీధిలో చివరిల్లు. చివరికంటా ఎళ్ళిపొండి. ఎత్తు గుమ్మాల ఇల్లు.’
నిజంగా ఆయన పేరు తమ్మయ్యా లేక ఓ అన్నకి తమ్ముడిగా ఆ పేరుతో స్థిరపడ్డాడో తెలియదు.
అటూ ఇటూ అక్కడక్కడా తాటి చెట్లు, కొబ్బరి చెట్లు వున్న మట్టి రోడ్డున ఓ మూడు నిమిషాలు లోపలికి నడిచాక అసలు ఊరొచ్చింది. మూడు వీధుల ఊరు – మొదట్లో ఓ చిన్న అమ్మవారి గుడి. రెండో వీధిలో లెక్క పెట్టుకుంటూ వెళ్తే అటూ ఇటూ కలిపి ఇరవై నాలుగు గడపలు. వీధి చివరికి చేరుకున్నాను.
రెండు వైపులా ఎత్తు అరుగుల పెంకుటిళ్ళు. రెండూ ఒకేలా వున్నాయి. కుడి వైపుదో ఎడమ వైపుదో చెప్పలేదతను. జన సంచారం లేని ఆ చీకటి వేళ అదృష్టం కొద్ది కుడివైపు ఇంటి అరుగు పైన ఓ పెద్దాయన కూర్చుని కనిపించాడు. ఎత్తైన వీధి తలుపు ఓరగా తెరచివుంది. మెట్లకి ఇటువైపు అరుగుపైన ఓ చిన్న బుడ్డి దీపం వెలుగుతోంది. అతడి సగభాగం ఆ దీపం వెలుగులోను మిగిలిన సగభాగం చీకట్లోను వున్నాయి. పైకి మడచుకున్న ఎడమ కాలుపైన చేతిని చాచి పెట్టి పోత పోసిన కంచు విగ్రహంలా కూర్చుని వున్నాడు. పంచకట్టు. గుండు తల. దీపం వెలుగు పడి ఈ వైపు చెవి పోగులు మెరుస్తున్నాయి. మెడలో రుద్రాక్ష మాల.
కొద్దిగా దగ్గరగా వెళ్ళాను. నుదుటి మడతల మధ్య కుంకుమ బొట్టు. ఒత్తైన కనుబొమ్మలు ముడుచుకుని ఆయనెందుకో కోపంగా వున్నట్లు కనిపించాడు.
నసిగినట్లుగా దగ్గాను. కళ్ళముందు వున్న ఏదో వస్తువుని తీవ్రంగా చూస్తున్నట్లు కూర్చుని వున్నాడు ఆయన. నా కేసి చూడనే లేదు. ఈసారి కాస్త గట్టిగా దగ్గి, ఆయన మొహం దగ్గరగా మొహం పెట్టి, ‘నందు వాళ్ళ ఇల్లు ఇదేనా అండీ!’ అంటూ అడిగా.
ఆయన నాకేసి తిరిగి కోపంగా చూస్తూ, ‘నువ్వెవడివి? ఆ నందుగాడు ఎక్కడ చచ్చాడు? ఇంత రాత్రైంది. కొంపకి చేరాలని తెలియదా?’ అంటూ అరిచాడు.
నా వొంట్లోకి కంగారొచ్చింది. కాళ్ళలోకి వొణుకొచ్చింది. అది నందు వాళ్ళ ఇల్లే అని అర్థమైంది. ఇదేమిటీయన ఇలా మాట్లాడుతాడు అనుకుంటూనే… ఏ కళ నున్నాడో ఏమిటో అనుకుని… మళ్ళీ కూడదీసుకుని – కాస్త వెనక్కి జరిగి, నెమ్మదిగా, ‘నందు వాళ్ళ అమ్మగారు ఎక్కడ? ఆవిడకి ఈ కవర్ ఇవ్వాలి’ అన్నాను.
ఈసారి ఆయన నాకేసి మరింత కోపంగా చూశాడు. ఊ… అంటూ ఓసారి దీర్ఘం తీసి, ‘ఇంకెక్కడి నందు వాళ్ళమ్మ? నేనెప్పుడో దాన్ని పీక పిసికి చంపేశానుగా’ అన్నాడు.
ఆ మాటతో నా గుండెలవిసిపోయాయి. కాళ్ళ క్రింద భూమి కదలిపోయింది. ఆ పరాయి ఊరిలో… ఆ చీకట్లో… నే విన్నది నిజమేనా అని వెర్రిగా ఆయనకేసి చూస్తునప్పుడు… చెవి దగ్గర ఎవరో గుసగుసలు పోయారు. దడుచుకుని తిరిగి చూసే లోగా ఆ వ్యక్తి నా చెయ్యి పట్టుకుని పక్కకి లాగేశాడు.
తూలి నిలదొక్కుకుని కీచుగొంతుతో ‘హా! ఆ!… ఎవరూ?’ అన్నాను. ఆ వ్యక్తి నా మొహం దగ్గరగా మొహం పెట్టి మరింత గుసగుసగా, ‘తమ్మయ్యగారితో ఇప్పుడు మాటాడకండి! మీకే మంచిది కాదు. ఊరంతా వినబడేలా అరిచి గోల చేసేస్తాడు’ అన్నాడు.
‘ఏ… ఏ… ఏమీ… ‘ అన్నాను తడబడుతూ.
‘ఇంకా ఆయన నల్లమందు వేసుకున్నట్లు లేదు. మీరా తలుపులోనుండి లోపలికి వెళ్ళిపోండి. సూరమ్మగారు లోనుంటారు.’
‘నందువాళ్ళ అమ్మా?’
‘ఆ, ఆవిడే. మీరెళ్ళండి.’
గుమ్మం ముందు పాతాళభైరవి విగ్రహంలా ఈయన కూర్చుని వుంటే దాటుకుని నేను లోపలికి వెళ్ళేదెలా?
నా తటపటాయింపు చూస్తూ పర్లేదు వెళ్ళండి అన్నట్లు సైగ చేశాడతడు. అతడ్ని, తమ్మయ్యగారిని మార్చి మార్చి చూస్తూ నెమ్మదిగా ఓరగా తీసివున్న వాకిలి నుండి ఇంటి లోపలికి నడిచాను.
నాలుగు వైపులా నాలుగు గాజుబుడ్డి దీపాలు ఇందాక వీధిలో చూసిన వాటికన్నా కాస్త పెద్దవి వెలుగుతున్నాయి. ఆ కాస్త వెలుగులో బెరుకుగా నాలుగు వైపులా పరికించి చూశాను. విశాలమైన సావిడి. ఆర్చీలా వున్న పైకప్పు భారాన్ని మోస్తూ – అటో మూడు ఇటో మూడు స్తంభాలు. పైకప్పులో ఏదో తేడాగా వుందని చూస్తే మధ్యలో కిటికీ పెట్టినట్లు ఖాళీగా వుంది.
కుడి ఎడమల రెండేసి గదులు. తలుపులు దగ్గరగా వేసివున్నాయి. గోడల నిండా ఫోటోలు. అలా చూస్తూ కాస్త ముందుకు వెళ్తూ ఎందుకో ఆగి చూస్తే మధ్యలో చతురస్రాకారంలో నీళ్ళతొట్టి లాంటి పెద్ద గుంట. నీళ్ళయితే లేవు. ఇంకా నయం పైకి చూస్తూ ధుర్యోధనుడిలా అందులో పడ్డాను కాదు.
ఏదో తెలిసినట్లైంది. ఆ పైన కప్పులో ఆ పెద్ద కిటికీ నుండి పగలు ఈ సావిడంతా వెలుగూ వస్తుంది. వర్షం వస్తే ఈ కింద గుంటలో పడతాయి కాబోలు. ఎదురుగా స్తంభాలకి అవతల మరో తలుపు తీసివుంది. లోపల దీపం తెలుస్తోంది. నీళ్ళ బిందె, మరింక గిన్నెలేవో కనిపిస్తున్నాయి. వంటిల్లయివుంటుంది.
వొంట్లో ఒణుకింకా తగ్గలేదు. గొంతు పెగుల్చుకుని ‘అమ్మా!’ అని పిలిచాను.
ఎవరూ పలకలేదు. ఇంతదాకా వచ్చాక ఆ వంటింటి గుమ్మం దాకా వెళ్ళి చూస్తే సరిపోతుంది కదా!
మధ్యలో ఈ గొయ్యొకటి. అక్కడిదాకా వెళ్ళాలంటే ఈ పక్కనుంచో ఆ పక్కనుంచో తిరిగి వెళ్ళాల్సిందే. చప్పుడు చెయ్యకుండా మెల్లిగా పాకుతున్నట్లు కుడి వైపునుండి తిరిగి వంటింటికేసి వెళ్ళాను.
మళ్ళీ ‘అమ్మా!’ అన్నాను. నా గొంతు నాకే ఏడుస్తున్నట్లు వినిపించింది.
అటువైపు పెరట్లోకి మరో తలుపనుకుంటాను. ఓరగా తీసివుంది. గుండె చిక్కబట్టుకుని ఈ తలుపు ముందే నిల్చుని ఈసారి ‘సూరమ్మగారూ!’ అంటూ పిలిచాను. చప్పుడు లేదు.
నిజంగానే వుందా ఈవిడ లోపల? చీకట్లో పొరపాటున దారి తప్పి నేను ఏదైనా దయ్యాల దీవికి రాలేదు కదా! ఇందాక వీధిలో కోపంగా ఆ పెద్దమనిషి. లోపలికి వెళ్ళమన్న ఆ గుసగుసల రాయుడు. ఇక్కడ వీళ్ళంతా నాతో ఆడుకోవటం లేదుకదా! ఆ మూసిన గదుల్లో ఇంకెవరున్నారో! కాళ్ళు వొణుకుతో కదలలేకపోతున్నాయి. ఇప్పుడిక ఇక్కడి నుండి పారిపోవడం కూడా కష్టమే.
ఇదేమి దేవుడా! అనుకుంటూ వుండగానే ఇందాక బయట తమ్మయ్యగారన్న మాట పిడుగుపాటులా గుర్తొకొచ్చింది. ఆయన వాలకం చూస్తే ఉన్మాదపు మనిషిలానే వున్నాడు. నిజంగానే ఆవిడ పీక పిసికి బయటకి వచ్చి కూర్చోలేదు కదా!
అయ్యో! ఇప్పుడు నందుకి ఎలా కబురు పంపడం? అసలు ఊర్లో వాళ్ళెవరైనా నన్నిక్కడ చూస్తే… అమ్మో! చేతిలో ఈ డబ్బు కవరుతో ఊరికి కొత్త మనిషిని… నేనే ఆవిడని చంపి డబ్బుతో పారిపోతున్నానని అనుకోరుకదా! ఎందుకనుకోరు? ఎన్ని సినిమాల్లో చూడలేదు! శవానికి దగ్గరగా ఎవరుంటే వాళ్ళనే అనుమానిస్తారు కదా! లాభం లేదు. ఎలాగో అలా శక్తి తెచ్చుకుని ఇక్కడి నుండి బయట పడాలి. దడదడలాడుతున్న గుండెని చేతబట్టుకుని వెనక్కి తిరిగాను.
వెనకనించి ‘ఏరా అబ్బిగా! పెరుగు తేవడానికి ఇంతసేపైంది? బాబుగారి భోజనానికి ఇప్పటికే ఆలస్యం అయిపోలేదూ’ అంటూ వినిపించింది.
గమ్మున వెనక్కి తిరిగి చూసాను.
దీపం చేతిలో పట్టుకుని, అటువైపు తలుపు పూర్తిగా తెరచి లోపలికి వచ్చిందావిడ. గడపదాటి లోపలికి అడుగు పెట్టిన కాళ్ళు, వాటికి కడియాలు. హమ్మయ్యా! బయట పెద్దాయన భయపెట్టినట్లు కాకుండా ఈవిడ బ్రతికే వుంది. ప్రాణం కుదుటపడింది.
అప్పటికే ఆవిడ నేను కొత్త మనిషినని గ్రహించినట్లుంది. దీపం పైకెత్తి చూస్తూ ‘ఎవరు నాయనా నువ్వు?’ అంటూ అడిగింది.
ఓ కొత్త మనిషిని ఇంట్లో ఇంత లోపలికి వస్తే కూడా భయం లేకుండా ఎంత నింపాదిగావుంది ఈవిడ, అనుకుంటూనే ‘నేనండి, నందు స్నేహితుడిని… శ్రీనివాసుని’ అన్నాను.
నవ్వుతూ, ‘ఓ! శ్రీనివాసువా? నందూ చెప్పినట్లే వున్నాడు నీ సంగతి’ అంటూ వంటిల్లు గుమ్మం దాటి ఇవతలికి వచ్చింది.
కుదుటపడ్డ గుండెతో ‘నందు మీకు ఈ డబ్బులు ఇమ్మన్నాడు’ అంటూ ఇస్తుండగా ఆవిడ ఎదురుచూస్తున్న అబ్బిగాడు పెరుగు తీసుకొచ్చాడు. ఆలస్యం చేసినందుకు ఆవిడ చేత చీవాట్లు తిన్నాడు.
ఇక ఇక్కడి నుంచి బయట పడితే మంచిదనిపించింది. ఆ సమయంలో బస్సులు లేకపోయినా రాజమండ్రి వైపు వెళ్ళే లారీలు, ట్రక్కులు వుంటాయా అంటూ ఆ అబ్బిని అడిగాను.
‘ఊరి పొలిమేరలో రోడ్డు పక్కన నిల్చున్నారంటే చాలు, అరగంట కొకటి. నిక్షేపంగా వెళ్ళొచ్చు మీరు’ అంటూ దీర్ఘం తీశాడు. కావాలంటే తనొచ్చి దింపుతానన్నాడు.
‘చాల్లే. ఇంకా నయం. చీకట్లో పురుగూపుట్రా వుంటాయి కూడాను. ఈ రాత్రికి భోంచేసి పడుక్కుని తెల్లారగట్లే వెళ్దువుగాని. నందుగాడి గది వుండనే వుంది’ అందావిడ.
బయట ఆ చీకటి, ఈ ఊరి వాతావరణం గుర్తొచ్చి, ఎందుకైనా మంచిది ఈ రాత్రికి ఇక్కడే వుండటం నయమనిపించింది.
‘అలాగే వెళ్తూ వెళ్తూ బాబుగారిని లోపలికి రమ్మని చెప్పు’ అంటూ అబ్బికి పురమాయించింది.
‘అమ్మో! ఆయన జోలికి నేనెళ్ళను బాబు’ అంటూ వాడు బయలుదేరాడు.
‘ఏడిశావ్ వెధవ!’ అంటూ నవ్వుతూ వాడిని కసిరి, నాకేసి చూసి, ‘అదిగో అదే నందుబాబు గది. ఆ గడప పక్కన అరుగు మీదున్న కుర్చీలో కూర్చో. ఈయన నిన్ను చూసి ఏవైనా అడిగినా జవాబు చెప్పకు. నెమ్మదిగా వుండు. ఆయనకి భోజనం పెట్టాక మనం చేద్దామే!’ అంటూ వీధిలోకి నడిచింది.
దాంతో మళ్ళీ నాకు గుండెదడ మొదలైంది. నాకు మూడింతలున్న ఆ పడక కుర్చీలో బిక్కుబిక్కుమంటూ కూర్చుని చూడసాగాను.
వీధి తలుపు పూర్తిగా తెరుచుకుని ముందర ఆయన, వెనుక ఆవిడ లోపలికి వచ్చారు. ఆవిడ తలుపు గడియవేసి, ‘రండి’ అంటూ అటు వైపు అరుగు పైనుండి వంటింటికేసి దారితీసింది.
చేతిలో అంకుశం లేని మావటిలా ముందు ఆవిడ, వెనుక ఏనుగులా ఆయన. తల మీద పిడికిలితో ఓ మొట్టు మొట్టి క్రింద కూల్చేయగలడు. ఒక్క చేత్తో పీక పిసికెయ్యగలడు. తలుచుకుంటేనే దుఃఖంగా వుంది. ఎవరు చెప్పాలి ఈవిడకి ఆయన మనసులో దురుద్దేశం.
ఆ కనిపించీ కనిపించని చిరుపాటి వెలుగులో నేనెక్కడ కనిపించానో, అటువైపు అరుగు పైన వెళ్తున్నవాడల్లా టక్కున ఆగిపోయాడు. ‘ఈ నందుగాడు ఏంచేస్తున్నాడక్కడా… వెధవ! ఊరంతా బలాదూరుగా తిరిగొచ్చి, ఆ…’ అంటూ హూంకరించాడు. బిగుసుకుపోయి మరింత ముడుచుపోయి కూర్చున్నాను.
‘సర్లెండీ! మీరు ముందు భోజనం చెయ్యండి. ఇంట్లో పెరుగు సరిగ్గా తోడుకోక కదా ఆ అబ్బిగాడిని తెమ్మనడం. పాపం మీకు ఆలస్యం అయిపోయింది ఈపూట’ అంటూ ఆవిడ ఆయన్ని తిరిగి ముందుకు కదిలించింది.
భోజనం అయ్యాక విగ్రహంలా ఆయన గడపలోనే నిల్చున్నాడు. ఆవిడేదో చేతిలో పెట్టి మంచినీళ్ళ గ్లాసు చేతికిచ్చింది. తిరిగి ఆవిడ వెనుకే ఆయన అటు పక్కన ఉన్న మొదటి గదిలోకి వెళ్ళాడు. ఇక నిద్రపోతాడు కాబోలు.
ఇద్దరం భోజనానికి కూర్చున్నాం. ‘నువ్వెంత కష్టంలో వున్నావో నీకు తెలియదు తల్లీ!’. తింటున్నంతసేపు బెంగగా ఆలోచిస్తూనే వున్నాను. కానీ ఎలా చెప్పాలి ఈవిడకి.
తిని లేచాక ‘నందు గదిలో పక్క దులుపుకుని పడుక్కో బాబు!’ అంటూ ఆవిడ వెళ్ళబోయింది.
ఇప్పుడుకాక పోతే ఇంకెప్పుడు అడగడం? ‘అమ్మా! ఒక్కమాట. ఇందాక నేను వచ్చినప్పుడు ఆయన అదోలా మాట్లాడారు. ఒంట్లో కులాసాయేనా! నల్లమందు ఇచ్చారా!’ అన్నాను.
ఆవిడ ఉలిక్కిపడి కంగారుగా ఇటూ అటూ చూసింది. గొంతు తగ్గించి కోపంగా అడిగింది ‘నీకెవరు చెప్పారు?’
నేను మరింత కంగారుగా ‘ఇందాక బయట ఆయనెవరో అన్నారండి. ఆ నల్లమందు గురించి నాకేం తెలియదు’ అన్నాను.
‘ఉష్! అలా పైకి అనకు నాయనా! అదో నిషిద్ధ పదార్థం కదా!’
తెల్లబోయిన నా మొహం చూసి తిరిగి చెప్పింది. “అదో గంజాయిలాంటి మత్తుమందు బాబు. నిద్ర మాత్రలాంటిదనుకో. ఈయనకి కోపం జాస్తి. దానికితోడు నిద్రపట్టదు. పైగా చెరుపు మరుపు. పాత విషయాలే కానీ కొత్తవేవీ గుర్తుండవు. కొన్నిమార్లు రెండు పూటలా ఇస్తే కానీ కుదురుగా వుండరు. ఊర్లో కొంతమంది పెద్దవాళ్ళకి ఇది మామూలే, కానీ ఇలా వాడుతున్నామని బయటెక్కడా గట్టిగా అనకూడదుట. సర్లే వెళ్ళి పడుకో.’
నాకదేంటో కాస్త అర్థం అయింది. చెప్పాల్సిన విషయం చెప్పకుండానే నందు గదిలోకి వచ్చాను. గదిలో పెద్ద పట్టెమంచం. పక్కన అద్దాల బీరువా. పడుక్కున్నానే కానీ నిద్ర వొచ్చే సూచనలేవీ లేవు. వొచ్చి వొచ్చి ఇక్కడ ఇలా ఇరుక్కుపోయానేమిటి? ఉద్యోగం వదిలి నందు ఇక్కడకి వచ్చి వుండడు. ఇంట్లో ఇంకెవరూ లేరు. ఈవిడని రక్షించే వాళ్ళెవరూ? ఆయన మనసులో వున్న చెడు తలపు తెలిసి తెలిసీ ఆవిడని హెచ్చరించకుండా తిరిగి వెళ్ళడం ఎలా?
నెమ్మదిగా కునుకు పట్టే సమయానికి ధన్ మంటూ చప్పుడు వినిపించింది. వేగంగా బయటకి పరిగెత్తాను. ఆవిడ అటువైపు అరుగు పైన పరుపు వేసుకుని పడుక్కున్నట్లు వుంది. ‘నీళ్ళ జగ్గు పడేసుకున్నట్లున్నారు’ అంటూ లేచి ఆయన గదిలోకి వెళ్తోంది.
అటువైపు వెళ్ళడమా వద్దా అని ఆలోచించే లోపల ఆవిడ తిరిగి బయటకి వచ్చింది.
గుమ్మంలో నిల్చున్న నన్ను చూసి ‘ఏం బాబు? కొత్త ప్రదేశం కదా! నిద్రరావటం లేదులా వుంది. గదిలో ఉక్కపోస్తుంటే పరుపు అలా అరుగు మీద వేసుకో’ అంది.
పరుపు వేసుకుని వాలుతూ అడిగాను ‘మీరు నిద్రపోయినట్లు లేదు.’ కాస్త మాట మాటా కలిపి చెప్పాల్సినది చెప్పడానికి ఇదే మంచి సమయం అనిపించింది.
‘నాదెప్పుడూ కోడి కునుకే నాయనా! చీమ చిటుక్కుమన్నా మెలుకొవొచ్చేస్తుంది.’
‘చెరుపు మరుపు అన్నారు. కోపం ఎక్కువన్నారు… బాబుగారు మీతో బానే వుంటారా అండీ!’
ఆవిడ ముసిముసిగా నవ్వింది. ‘కోపం ప్రదర్శిస్తే బయటివాళ్ళ మీదే! తినండి పడుకోండి అంటూ నేను చెప్పాలే కానీ నన్ను ఒక్క మాట అనరు.’
ఉత్త అమాయకురాలు. అంతా మనసులో పెట్టేసుకున్నాడు ఆ ముసలాయన. లోపల ఎంత కక్ష దాచుకున్నాడో. ఈవిడని ఎలా హెచ్చరించడం?
‘నిద్రపో నాయనా! తెల్లవారుజామున లేపుతాను’ అంటూ ఆవిడ అటు తిరిగి పడుక్కుంది.
వెళ్ళాక నందుకి చెపితే ఇంట్లో ఓ మనిషిని తోడుగా పెట్టే ఏర్పాటేదైనా చేస్తాడేమో. చెప్పినా నమ్ముతాడో లేదో! ఆలోచనల మధ్య ఎప్పుడో నిద్రపట్టింది.
నిన్న రాత్రి జరిగింది కల కాదు అని తెలుస్తూ నేను పడుకున్న అరుగుమీదే నిద్ర లేచాను. కప్పుపైని గవాక్షం గుండా నీలి ఆకాశం కనిపిస్తోంది. పక్క పరుపు చుట్టి లోపలి మంచం పైన వేసి ఆవిడని వెతుక్కుంటూ వంటిల్లు దాటి పెరట్లోకి వెళ్ళాను. చాలా విశాలమైన పెరడు. ప్రహరీ గోడకి అవతల మరో పెద్ద పెరడు కొబ్బరి చెట్లతో నిండుగావుంది.
అప్పుడే అవతలి పెరటిలో నుండి రాలిపడిన కొబ్బరికాయొకటి చేత పట్టుకుని వచ్చిందావిడ. ‘మొహం కడుక్కుని రా! పాలు కాచి వుంచాను. తాగి, రెండు ఇడ్లీలు తిని వెల్దువుగానీ’
స్నానం చేసి ఆవిడ పెట్టినవి తిని నా చేతి సంచి తీసుకుని బయటకు వచ్చాను. ఓ సారి చూడాలనిపించింది. నెమ్మదిగా వెళ్ళి ఆయన గదిలోకి తొంగిచూశాను. గుర్రుపెడుతున్న వాడల్లా చిన్నగా దగ్గుతూ పక్కకి తిరిగాడు. గబుక్కున వెనక్కి తిరిగాను.
‘నువ్వొచ్చినట్లు తెలిసిందో లేదో ఆయనకి. నందుబాబేమో అనుకున్నారుగా! ఒక వేళ అడిగితే నేను చెపుతానులే’ అంది బొండాం నీళ్ళున్న గ్లాసు నా చేతిలో పెడుతూ.
భయమైతే పోయింది కానీ ఏదో తెలియని బెంగ. నిన్న రాత్రి నేను విన్నది అసత్యం కాదు. ఆయన స్పష్టంగానే అన్నాడు. ఈవిడ బానేవుంది. బహుశా ఊహించుకుంటూ వుంటాడు కాబోలు. అసలే చెరుపు మరుపు. ఏదో ఒక రోజున ఆ నల్లమందేదో సమయానికి పడకపోతే ఎప్పుడు ఏ క్షణాల్లో ఏమి చేస్తాడో తెలియదు కదా!
‘నందు అక్కడ బాగానే వున్నాడా నాయనా! నిన్నటినుండి చూస్తున్నాను. నువ్వేదో చెప్పాలని చెప్పలేకపోతున్నావు. ఏంటి సంగతి నాయనా?’
నాకు పొలమారింది. కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
‘ఆయన… ఆయన… బయట… నిన్న రాత్రి… నేను నందు వాళ్ళమ్మ ఎక్కడా అని అడిగితే…’ అంటూ ఆయన చెప్పిన సమాధానం చెప్పేసి ఊపిరి తీసుకున్నాను.
‘మీరొక్కరు ఈ ఇంట్లో ఇలా వుండటం మంచిది కాదండీ!’
ఆవిడొక్కసారిగా కొయ్యబారిపోయింది. అంతలో తేరుకుని నవ్వి ‘నీకూ తెలిసిపోయిందా!’ అంది.
‘అంటే ఆయన అలా అనడం ఇంతకు ముందు మీరు కూడా విన్నారా? మీకు ఈ విషయం…’
‘నాతో ఎప్పుడూ అనలేదులే. నందూ వాళ్ళ అమ్మ గురించి మేమెవ్వరం ఆయనతో మాట్లాడం.’
నేను అయోమయంగా చూస్తుండగా ‘అదిగో చూడు’ అంటూ గోడ కేసి చూపించింది. పాత బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో ఓ ఇరవై ఏళ్ళ స్త్రీ. ఫోటోకి దండ వేసి వుంది.
‘ఆమే నందూ వాళ్ళ అమ్మ. నా సవతి. నా పెళ్ళి అయి వొచ్చేనాటికి నందు ఆర్నెల్ల పిల్లవాడు. వచ్చిన మూడు నెలలకి మొదటిసారిగా విన్నాను. అప్పట్లో మా పనమ్మాయి చుట్టూ ఎవరు లేకుండా చూసి చెప్పింది. ఈయనకి కోపం ఎక్కువని, ఆ కోపంలో ఈయనే ఆవిడని … … ఎంతవరకు నిజమో తెలియదు.’
నేను తెల్ల మొహం వేసుకుని వినసాగాను.
‘తెలిసినప్పటి నుండి ఈయన పక్కన పడుకుంటే భయంతో నిద్ర పట్టేదికాదు. ఒకరాత్రి వేళ లేచి వెళ్ళి మా అత్తగారి పక్కలో దూరి పడుకునేదాన్ని. ఆవిడో రెండు రాత్రులు చూసి, అర్థం చేసుకుని, భయం లేదులే తల్లీ! నీ పెళ్ళికి ముందే చెప్పాను వాడికి. నిన్నో మాట అన్నా, చెయ్యెత్తినా, ఇంట్లోంచి గెంటేస్తానని- అంటూ నచ్చచెప్పారు. ఒకప్పుడంతా బానే వుండేవారు. ఈమధ్యనే కాస్త చెరుపు మరుపు. పాత విషయాలు గుర్తుంటాయి. కొత్తవి ఇట్టే మరచిపోతారు. నన్ను గుర్తు పెట్టుకున్నంతకాలం పర్లేదు. జీవితం గడచిపోవడానికి.’
‘అయినా ఇలాంటి కళాకళల మనిషితో కష్టం కదండీ? ఎప్పుడైనా ఏదైనా చెయ్యొచ్చు. మీకు రక్షణేది?’ అన్నాను.
ఆవిడ హాయిగా నవ్వింది. ‘ఇప్పుడు పోయేదేమిటి బాబు! ముందో వెనుకో అంతే. ఏం జరిగినా బెంగలేదు. నేనంటూ వుంటే ఆయన్ని చూసుకుంటాను. లేదంటే పాపం నందుబాబుకి కష్టమైపోతుంది.”
“తరువాతేమైంది మావయ్యా?” అడిగింది ఆ కథలోనుండి ఇంకా బయట పడలేని కొత్తకోడలు.
“నందు చెపితేనే తెలిసింది. ఓ మూడేళ్ళ తరువాత ఆయన, ఆ తరువాత ఓ ఎనిమిదేళ్ళకి ఆవిడ వెళ్ళిపోయారని. అక్కడ జరిగిందేమీ నేను నందుకి చెప్పలేదు. వాళ్ళ ఇంటి విషయాలు నాకు తెలిసినట్లు వాడికి తెలియకపోవడమే మంచిదనిపించింది.”
[ఆ ఒక్కటి, మరికొన్ని కథలు – విజయ కర్రా. ఛాయా ప్రచురణలు (2023)]