తెలుగుదారి ఒకదారి మాత్రమే

ఉపోద్ఘాతం

అమెరికాలో కొన్ని దశాబ్దాల పాటు తెలుగు నేర్పిన ఆచార్యులు వెల్చేరు నారాయణరావుగారు. బోధనతో పాటు, తెలుగు సాహిత్యంలోని పేరెన్నిక గన్న ఎన్నో గ్రంథాలను ఆంగ్లంలోకి స్వయంగానూ, ఇతరులతోనూ కలిసి అనువదించి పేరుగాంచారు. వీరు రాసిన కొత్త వ్యాకరణం మార్కెట్లోకి వచ్చిందని తెలియగానే తెలుగు భాషా వ్యాకరణాలపై నాకున్న అభిరుచి, ఆసక్తి వల్ల వెంటనే ఒక పుస్తకం కొనుక్కుని చదివాను. దానిపై ఒక సమీక్షా వ్యాసం రాయాలనుకునేలోపే ఆంగ్ల దినపత్రిక ది హిందూలోనూ(23 సెప్టెంబర్ 2023); ఆంధ్రజ్యోతి దినపత్రికలోనూ (9 అక్టోబర్ 2023) సమీక్షలు అచ్చు కావడంతో కొంత నిరుత్సాహంతో పక్కకు పెట్టేశాను. అయితే ఆ రెండు సమీక్షలలో పేర్కొన్న కొన్ని అతిశయోక్తులను సవరించక/సరిచేయక పోతే భాషాశాస్త్రానికి విరుద్ధమైన ఆలోచనలను మౌనంగా సమర్థించినట్లవుతుంది అనిపించింది. ఆపై ఆంధ్రజ్యోతి సమీక్షను యథాతథంగా ఈ సంవత్సరం జనవరి 2024 సంచికలో ఈమాట పత్రిక వారు తిరిగి ప్రచురించడం వల్ల ఆ సమీక్ష నిష్పక్షపాతంగా లేదనిపించి, ఈ పుస్తకం తిరిగి సమీక్షించడం ఒక బాధ్యతగా అనిపించి చేస్తూన్న ప్రయత్నమే ఇది.

నాకు వెల్చేరు నారాయణరావుగారు ముందు కొంత పరోక్షంగానూ, తర్వాత కొంత ప్రత్యక్షంగానూ పరిచయం అయ్యారు. పరోక్షంగా అంటే ఒకప్పుడు 1970లలో వెల్చేరుగారు నారాగా, కవిగా, కవిత ద్వారానే నాకు పరిచయం. నేను బి. ఎ. చదువుతున్నప్పుడు సృజనలో ఆయన కవిత ‘నాకాకలేస్తోంది’ విలక్షణమైందిగా కనపడింది. కలం పేరు వల్ల అప్పటికి ఆయనెవరో తెలియదు. అలాగే, ఆయన రాసిన సిద్ధాంతవ్యాసం తెలుగులో కవితా విప్లవాల స్వరూపం చదివినప్పుడు దానిలో కొత్త దృష్టితో చేసిన విశ్లేషణ నన్ను ఆకట్టుకుంది. ప్రత్యక్షంగా ఆయన్ను మా గురువుగారైన చేకూరి రామారావుగారి వల్ల రెండు మూడు సార్లు కలవడం జరిగింది. అయితే అది అంత దూరాన్నే ఆగిపోయింది.

ఈ వ్యాకరణం ఇప్పుడు మళ్ళీ ఎందుకు సమీక్షించాలి?

ఇన్నాళ్ళ తర్వాత ఆలస్యంగానైనా ఆయన దశాబ్దాల బోధనానుభవాలను రంగరించుకున్న ఈ వ్యాకరణం రావటంవల్ల ఆయన అవలంబించిన తెలుగు బోధనా విధానమూ, ఆయన వివరించిన తెలుగు వ్యాకరణ లక్షణాలూ తెలుస్తాయన్న ఆలోచనతో కుతూహలంతో, శ్రద్ధగా చదివాను.

ఈ వ్యాకరణంపై విమర్శనాత్మక సమీక్ష చెయ్యటానికి ఈ కింది కారణాలు చెప్పుకోవచ్చు:

  1. ఆంధ్రజ్యోతి ఇంటర్వూలో వెల్చేరుగారు స్వయంగా ‘ఇది ఆధునిక తెలుగుకి పరిపూర్ణమైన వ్యాకరణం, ఇలాంటి వ్యాకరణం తెలుగుకి ఎవరూ రాయలేదు’ అని చెప్పడం.
  2. ఆంధ్రజ్యోతి సమీక్షలో కె. వి. యస్. రామారావుగారు ‘తెలుగు క్రియా ప్రాధాన్య భాష’ అని, ఈ పుస్తకంలో క్రియలకు చాలా ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొనడం.
  3. ఇదే విషయాన్ని డేవిడ్ షూల్మన్‌గారు ది హిందూలో రాసిన వ్యాసంలో కూడా చెప్పడం.

    నిజానికి గ్రంథం 5వ పేజీలో ‘How to use this book’ అంటూ రాసి ముందు మాటలో రచయితే ‘[…] because Telugu is a language where verb is important, Telugu does not have adjectives’ అని చెప్పిన దాన్నే సమీక్షకులు గ్రహించినట్టున్నారు; కానీ అది ఆయనే మొదటగా గుర్తించినట్లు వాళ్ళు చెప్పటం మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. బహుశా వాళ్ళు ఇంతకు పూర్వపు తెలుగు వ్యాకరణాలు చూసైనా ఉండకపోవాలి లేదా వాటిని నిర్లక్ష్యంగా పక్కన పెట్టి ఉండాలి. లేకపోతే వెల్చేరుగారు రాసిన దానికి ఇట్లా భిన్న అర్థంలో వ్యాఖ్యానించేవారు కాదేమో!

  4. ఇది రాయటానికి చాలా కాలం పట్టిందంటూ, (for almost 50 years I have been working on it regularly using it in my classes) తెలుగు మాతృభాష కాని వారికి (non-native speakers) తెలుగు నేర్పిన తన అనుభవం నుండే ఈ పుస్తకం రూపొందిందని చెప్పటం వల్ల కలిగిన ఆసక్తి మరో కారణం. ఈ పుస్తకం తెలుగు మాతృభాష కాని వారికి తెలుగు నేర్పే విధానాల గురించి తెలుసుకోవాలనిపించడం మరొక కారణం.

ఇంతకీ, ఇక్కడ అన్నింటికంటే ముందు చెప్పుకోవాల్సిన, గమనించాల్సిన విషయాలు రెండున్నాయి:

ఒకటి, ఏ భాషా లిఖిత వ్యాకరణమూ కూడా పరిపూర్ణం కానీ సమగ్రం కానీ కావు అన్నది అందులో మొదటిది. దీనికి ఉదాహరణగా 13వ శతాబ్దపు మొదటి తెలుగు వ్యాకర్త మూల ఘటిక కేతన రాసిన ఈ పద్యమే చెప్తుంది.

కంచి నెల్లూరు మరి యోరుగల్లయోధ్య
యను పురంబులపై గంగ కరుగు మనిన
పగిది నొక త్రోవ జూపెద బహుపథంబు
లాంద్ర భాషకు గలవని యరసికొనుడు.

అంటే, ఆంధ్ర భాష లక్షణాలు చెప్పడానికి ఎన్నో దార్లున్నాయి, కానీ తాను ఒకటి ఎంచుకున్నాను అని కేతన ఉద్దేశం. సరిగ్గా ఈ పుస్తకం కూడా తెలుగుకు ఒక దారి చూపేదే, కానీ ఇదే ‘పరిపూర్ణం’ అనడం సరియైనది కాదు. ప్రపంచంలో ఏ భాషకూ ఏ వ్యాకరణమూ ఎప్పుడూ కూడా పరిపూర్ణంగా ఎవ్వరూ రాయలేదు అన్నది శాస్త్రీయంగా అంగీకరించాల్సిన విషయం.

రెండోది: తెలుగు రానివారికి తెలుగు నేర్పడం, లేదా తెలుగు రానివాళ్ళు తెలుగు నేర్చుకోవడం అనేది అమెరికాలోనే ప్రారంభమైన విషయం కాదు. 16-17 శతాబ్దాల నుండి వివిధ రకాల పాశ్చాత్యులూ, మరీ ముఖ్యంగా ఆంగ్లేయులు (మిషనరీలుగా, పాలకులుగా) తెలుగు నేర్చుకున్నారు; అంతే కాదు, వాళ్ళు తెలుగుకు గుర్తించిన అనేక లక్షణాలతో భిన్న భిన్నంగా వ్యాకరణ, నిఘంటువులు కూడా రాసారు.

ప్రతి మానవ భాషలోనూ తప్పనిసరిగా ఉండే భాషా భాగాలు నామవాచకాలు, క్రియలూ. వాక్యంలో కర్త, కర్మ, క్రియలు ఉంటాయి కాబట్టి, కర్త, కర్మ రెండూ నామవాచకాలే కాబట్టి భాషలను క్రియాది భాషలు (VOS), క్రియామధ్యభాషలు (SVO), క్రియాంత భాషలుగా (SOV) విభజించారు. భాషలో వాక్యాన్ని నామవాచకపదబంధం (NP), క్రియాపదబంధాల (VP) కలయికగా గుర్తించి సార్వత్రిక వ్యాకరణం రాయవచ్చునని నోమ్ చామ్‌స్కీ తన సిద్ధాంతాలను ప్రారంభిస్తే, ఎప్పుడో ప్రాచీనకాలంలోనే పాణిని సుబంత, తిఙంతాలుగా సార్వత్రిక సూత్రాలతోనే సంస్కృత వ్యాకరణం వివరించాడు.

తెలుగు క్రియాంత భాష కాబట్టి, సాధారణంగా తెలుగు భాషా లక్షణాలను వివరించేందుకు రాసిన సంప్రదాయ వ్యాకరణంలోనైనా, ఆధునిక వ్యాకరణంలోనైనా క్రియకు ప్రాధాన్యం ఉండటం సహజం. అందువల్ల ఈ విషయాన్ని వెల్చేరుగారు మొదటగా కానీ, ప్రత్యేకంగా కానీ ‘కనిపెట్టా’రన్నట్టు చెప్పడం సబబు కాదు. అన్ని వ్యాకరణాలు క్రియను ఎంతో విపులంగా వివరించాయి. చూడండి: కేతన ‘అనంతరంబు క్రియాపదంబు లెరింగించెద’ అంటూ 138వ పద్యం నుండీ 186 పద్యం వరకు వివరించాడు. చిన్నయ సూరి బాల వ్యాకరణంలో క్రియా పరిచ్ఛేదమే పెద్దది. కాంప్‌బెల్, బ్రౌన్‌ల ఆంగ్లేయ వ్యాకరణాలలోనూ ప్రత్యేకంగా క్రియపై అధ్యాయాలున్నాయి. అదీకాక, భాషావర్గీకరణశాస్త్రాలపై (Linguistic Typology) పరిశోధన చేసిన బెర్నార్డ్ కోమ్రీ (Bernard Comrie) తాల్మీ గివోన్ (Talmy Givón) వంటి భాషావేత్తలు కూడా క్రియారూపనిష్పత్తులున్న (verb conjugation ఉన్న) క్రియాంత భాషలలో (SOV భాషలలో) క్రియ అత్యంత ప్రాధాన్యమైనదని, వాక్యానికి కావల్సిన ఎన్నో అంశాలను తనలో కలుపుకొంటుందని వారి పరిశోధనల ద్వారా వివరించారు.

ఇక ఇప్పుడు వెల్చేరు నారాయణరావుగారి తెలుగుదారి: A Grammar of Modern Teluguలో ఆయన తెలుగును విశ్లేషిస్తూ ఉదాహరణలతో సహా ఇచ్చిన వివరణలను పరిశీలిద్దాం.

తెలుగుదారి పుస్తకంపై విపుల సమీక్ష

విషయసూచికలో ఇచ్చిన ప్రకారం ఒక్కొక్కటిగా అదే క్రమంలో తీసుకుని ఈ కింద పరిశీలిస్తాను. దీని వల్ల ఒక సౌలభ్యం ఉంది: ఏ అధ్యాయంలోని విషయాలు అదేచోట విశ్లేషించవచ్చును.

తెలుగు వర్ణమాల

ఇందులో తెలుగు అక్షరాలని మూడు భాగాలుగా పరిచయం చేస్తున్నాను అని చెప్పి 1. Vowels, 2. Consonants: Stops, and 3. Consonants: Semivowels, Liquids and Sibilants అని విభజించారు. ఇలా భాషాశాస్త్ర, వ్యాకరణ పరిభాషలను కలిపివేయడం సరికాదు. సంస్కృతంలో ‘య, ర, ల, వ’లను అంతస్థాలు అంటారు. వాటిని ఆంగ్లంలో Semivowels అనడం పరిపాటి. భాషాశాస్త్రంలో లిక్విడ్స్ (Liquids) అనే వర్గంలో ర, ల (ళ) మాత్రమే చేరుతాయి. య, వలను గ్లైడ్స్ (Glides) అంటారు. కాబట్టి య,ర,ల,వ లను భాషాశాస్త్ర పరిభాషలో చెప్పాలంటే Glides and Liquids అని చెప్పవలసి ఉంటుంది. లేదా, ఈ పుస్తకం ఉపయోగించే విద్యార్థికి ఆంగ్ల వ్యాకరణ పరిభాష తెలిసే ఉంటుంది/ఉండాలి అని అనుకొంటే Semivowels అని రాస్తే సరిపోతుంది. రెండూ రాయడం వల్ల అయోమయం తప్ప ఇతర ప్రయోజనం కనిపించదు.

అలాగే, సిబిలంట్స్ (Sibilants) అంటే స-కార సదృశమైన ధ్వనులు. అంటే శ, ష, సలు మాత్రమే. ఈ వర్గంలో హ-కారం చేర్చడం సరికాదు.

అచ్చులను వివరిస్తున్నప్పుడు, పాఠశాలల్లో పిల్లలు పెద్దగా అ , ఆ; ఇ, ఈ అని పలికినప్పుడు మధ్యలో ఏర్పడే విరామాన్ని (pause) ఒక ముఖ్య విషయంగా ప్రస్తావిస్తూ ఇలా అన్నారు:

“It is customary to read the alphabet chart in five units in the order they are given. there is a glottal stop separating one group from the next. This habit indicates an important principle in Telugu phonology: two vowels never occur in succession without a consonant or a pause intervening”.

వర్ణశాస్త్రం చదువుకొన్న నాకు ఈ రకమైన సిద్ధాంతం సరికాదనిపిస్తోంది. ఏ భాషలోనైనా వర్ణమాల నేర్చుకొనేటప్పుడు వర్ణాలను విడివిడిగానే చదువుతారు. హిందీ వర్ణమాలను కూడా ఇలాగే విడివిడిగానే చదివినా, ఆ భాషలో పదం మధ్యలో కూడా రెండు అచ్చులు వస్తాయి. అలాగే, ఆంగ్లంలో a,e,i,o,u అని అచ్చులను వివరించినప్పుడు కూడా మధ్యలో విరామంతోనే చదువుతారు. కానీ, ఆంగ్లంలో పలు (నాకు తెలిసి ఎనిమిది) సంయుక్తాచ్చులు (Diphthongs) కనిపిస్తాయి.

హల్లుల పరిచయంలో తెలుగులో హల్లులన్నీ అచ్చు లేకుండా పలకటం ఉండదనీ, అందువల్ల అ అనే అచ్చుకు చిహ్నంగా తలకట్టు వస్తుందని చెప్పి వాటికి భిన్నంగా ఉండేవి అంటూ మూడు ఉదాహరణలు (జ, బ, ణ) మాత్రమే ఇచ్చారు కానీ ల, ట లను వాటిలో చేర్చడం మరచారు.

చ జ లకు రెండు భిన్న ఉచ్చారణలున్నాయని చెప్తూ ‘in combination with the vowels ఇ, ఈ ‘they have palatal pronunciation and with the rest of the vowels they are dentals’ అన్నారు. ఈ వివరణ సమగ్రమైనది కాదు. ఇ, ఈ లతోనే కాకుండా, ఎ, ఏ లు చేరినప్పుడు కూడా చ, జలు తాలవ్యాలే (palatals) అవుతాయి. ఈ విషయాన్ని చాలామంది పూర్వ తెలుగు వ్యాకర్తలు, పాశ్చాత్యులతో సహా, చాలా దశాబ్దాల క్రితం చెప్పారు.

ప్రామాణికమైన తెలుగులో గానీ, రాసే తెలుగులో గానీ సంస్కృతం నుండి వచ్చిన తత్సమాలలో వాడే మహాప్రాణాలను వర్ణమాల (Alphabet) అధ్యాయం చివరి పేజీలలో, అంటే 31వ పుటలో ఇచ్చారు. ఆయన వాటి గురించి 5.2.లో చేసిన వ్యాఖ్యలు గమనించతగ్గవి. ముఖ్యంగా థ అన్న అక్షరం పనికిరాదు అంటూనే,

All థ sounds have merged with ధ sounds, and it is only the spelling habit of some people which keeps థ in writing

అని అన్నారు. ఈ వ్యాఖ్య మనకు కృష్ణమూర్తి, గ్విన్‌ల వ్యాకరణంలోనూ కనిపిస్తుంది. కృష్ణమూర్తిగారు తెలుగు అక్షరాల్లో [థ] తొలగించే మిగిలిన వాటిని ఇచ్చారు. అయితే అర్థము, అర్ధము అనే జంటపదాలలో థ, ధల ధ్వని భేదం వల్ల అర్థభేదం కూడా వస్తుంది కాబట్టి థ వేరుగా అవసరం. అదీకాక, కోస్తా జిల్లాలలోనే థ, ధ మధ్య భేదం తొలగిపోయింది కానీ, తెలంగాణా ప్రాంతంలో థ-కారం ధ-కారంతో కలిసిపోలేదు. వ్యవహారికంలో థ-కారాన్ని అల్పప్రాణంగా కత (కథ), అర్తం (అర్థం) అని పలుకుతారేమో కానీ ధ-కారంగా మాత్రం పలకరు.

చివరగా 34వ పుటలో ఇచ్చిన పూర్తి పట్టికలో పొల్లును వివరిస్తూ mark indicating a pure consonant అని చెప్పారు. అలాగే సున్నను కూడా ఉంచారు, కానీ గుణింతాలు చూపినప్పుడు సున్నతో, పొల్లుతో గుణింతాలు కనిపించవు. క్ష అక్షరాన్ని చాలా మంది ఆధునికులు వలె ఈయన కూడా పరిచయమే చేయలేదు, కానీ, అక్షరం అనే పదంలో క్ష వాడారు.

11వ పుట నుండి 34 వరకూ గుణింతాలు, ఒత్తుల వివరణ మొదలైన లిపికి సంబంధించిన అంశాలు సాధారణంగా వ్యాకరణ పుస్తకాలలో కనిపించవు. తెలుగు నేర్పడానికి ఉపయోగించే బోధనాపుస్తకాలలో మాత్రం తప్పనిసరి. అందుకే ఈ పుస్తకాన్ని వ్యాకరణ పుస్తకం అనడం కంటే తెలుగు నేర్చుకోవడానికి ఒక దారి చూపే బోధనా పుస్తకం అని నిర్ణయించవచ్చు.

వ్యాకరణ విభాగాలు

మొత్తం ఏడు అధ్యాయాలు గా విభజించబడ్డ ఈ వ్యాకరణంలో అసలు వ్యాకరణ అధ్యాయాలు రెండు మాత్రమే. అవి: I. Nouns (నామాలు); Il. Verbs (క్రియలు). మిగిలినవి III. More conversations (మరిన్ని సంభాషణలు); IV. Letters (ఉత్తరాలు); V. Tales (కథలు); VI. Verb Paradigms (క్రియా రూపాలు), and VII. Vocabulary (పదజాలం).

అంటే 400 పుటల గ్రంథంలో వ్యాకరణాంశాలు 36 నుండి 280 వరకు 236 పేజీలలో ఉండగా అందులో కూడా ప్రతి వ్యాకరణ అంశం సూత్రీకరణ లేదా లక్షణ వివరణ కింద ఉదాహరణల స్థలానికి కేటాయింపే ఎక్కువ. అయితే భాషా బోధనలో ఉదాహరణలు, అభ్యాసాలు ఎక్కువ ఇవ్వటం సహజమే!

నామవాచకాలు

సంప్రదాయ తెలుగు, ఆంగ్ల వ్యాకరణాలలోనూ, లేదా ఆధునిక భాషాశాస్త్ర నామవిభాగంలోనూ నామాలతో పాటు బహువచనం, ఇతర విభక్తి ప్రత్యయాలూ ఉంటాయి. విశేషణాలు కూడా నామ పదబంధంలో భాగం కాబట్టి నామాల వెంటనే వాటి గురించి చెప్పటం సాధారణ పద్ధతి. బహువచనంతో సహా కొన్ని విభక్తి ప్రత్యయాలు చేరినప్పుడు తెలుగులో సంధి కార్యాలు జరుగుతాయి కాబట్టి సంధులను క్రియకు ముందే వివరిస్తారు. అయితే ఈ పుస్తకంలో నామవాచకాలలో బహువచనంలో మూడు రకాల మార్పులని మాత్రమే చెప్పారు. ఇచ్చిన ఉదాహరణలలో గది-గదులు అన్న రూపాలు ఇచ్చారు కానీ ఇ > ఉ గా మారుతుందని, దీన్ని స్వర సమీకరణ (Vowel harmony) అంటారని చెప్పలేదు; మరికొన్ని ఉదాహరణలు, నిత్యం వాడేవి, పులి, పిల్లి వంటివి కూడా ఇవ్వలేదు. చిన్నయసూరి, చేకూరి రామారావు వంటి వాళ్ళు వీటిని ఎక్కువ వివరంగా ఇచ్చారు.

వెంటనే identification sentences (p. 38) అంటూ ఉదాహరణలతో వివరణ ఇచ్చారు. బల్ల-బల్లలు అనే వాటి ముందు ఇది, ఇవి, అది, అవి అనే సర్వ నామాలు చేర్చి ఇవి రెండు నామాలను కానీ నామ పదబంధాలను కానీ సమానం చేస్తాయని (ఉదా: ఇది బల్ల; అవి బల్లలు), అందువల్ల ఇంగ్లీషులోవలె క్రియ అయిన be రూపం (is/are వంటివి) తెలుగులో ఉండదనీ చక్కగా వివరించారు.

ఇదే అధ్యాయంలో 39వ పుటలో ప్రశ్నలను ఒకే ఒక పేజీలో వివరించారు. ఇది గది అనే వాక్యం ఇది గదా? అన్న ప్రశ్నగా మారుతుందని చెప్పి ఆ వెంటనే గది + ఆ కలిసి గదా అయిందని అక్కడికక్కడే sandhi అనే శీర్షిక కింద వివరించారు. అయితే ఇతర అన్ని పూర్వ వ్యాకరణాలు తెలుగు గ్రాంథిక, వ్యవహార రూపాలలో సంధి జరిగే ఎన్నో అంశాలను వివరించగా ఈ పుస్తకంలో మాత్రం ఇంకెక్కడా సంధి వివరాలే లేవు. పదనిర్మాణంలోనూ, పదబంధాలు, సమాసాలు, వాక్యాల నిర్మాణాల్లోనూ అత్యంత కీలకమైన మార్పులకు దోహదపడే సంధుల వివరాలు వివరంగా లేకపోవడం పెద్దలోపమే.

సర్వనామాలు

41వ పుటలో pronouns అనే శీర్షిక కింద ఇచ్చిన ప్రథమ పురుషలో తరచుగా వాడే కొన్ని సర్వనామాలు చేర్చలేదు. ముఖ్యంగా తెలుగు సర్వ నామాలలో ఉన్న దూర సమీప భేదాలలో సమీప రూపాలైన వీడు, ఇతను, ఈయన, అలాగే స్త్రీలింగ సర్వనామాలైన ఈమె, ఈవిడ; నపుంసకలో ఇది, బహువచనాల్లో వీళ్ళు, ఇవి -ఇవేవీ ఇవ్వలేదు; ఎక్కడా సూచించలేదు. పట్టికలో ఇవ్వని పదాన్ని బొమ్మలో బ్రాకెట్లలో ఇచ్చారు (43).

క్రియలు

రెండవ అధ్యాయంలోని అంశం సమీక్షకులు చాలా ప్రముఖంగా పేర్కొన్న తెలుగుకు అతిముఖ్యమైన క్రియలు. తెలుగు రాని/తెలియని వారికి బోధించడానికి వీటిని ఎలా వివరించారో తెలుసుకుందాం.

ప్రారంభంలోనే imperatives (విధ్యర్థకాల) పట్టిక ఇస్తూ (పుట.46) request, command వంటి ఆంగ్ల వ్యాకరణ పారిభాషిక పదాలకు బదులు “you can say the same word gently, and nicely or, harshly with a strong voice” అని సూచించడం బహుశా వెల్చేరుగారు తమ 50 ఏళ్ళ బోధనలో వాడిన పద్దతి అయి ఉండవచ్చు. 47వ పుట నుండి తెలుగు క్రియా స్వరూపాన్ని వివరించే ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకూ వర్ణనాత్మకంగా ఆంగ్లంలో వివరిస్తూ వచ్చి, 48వ పుట నుండీ “Be your own grammarian” అనే శీర్షికతో భాష నేర్చుకునే విద్యార్థిని (విద్యార్థులను) you అంటూ ముఖాముఖీ పద్ధతితో బోధన ప్రారంభించారు.

తెలుగు క్రియారూపాన్ని Verb base – Tense suffix -Subject suffix అని వివరించారు. ఈ subject suffix అన్నది వెల్చేరుగారు తన బోధనలో వాడుకొన్న పదం కావచ్చు. కానీ, వ్యాకరణ పరిభాషలో subject suffix అంటే వేరే అర్థం వస్తుంది. ఉదాహరణకు ఆంగ్లంలో biology, zoology వంటి కర్తృపదాలను తయారుచేయడానికి ఉపయోగపడే ology/logy అన్న ప్రత్యయాన్ని subject suffix అంటారు. తెలుగు క్రియలలో కర్తకు అనుగుణంగా చివర చేర్చే ప్రత్యయాన్ని PNG-suffix (person, number and gender) అని వివరించడం సర్వసాధరణం. పూర్వ ఆంగ్ల వ్యాకర్తలూ, ఆధునిక భాషా శాస్త్ర నిపుణులూ ఇలాగే వివరించారు.

తెలుగు భాషలో రెండు కాలాలు (Past and Future), ఒక Mode (Progressive) ఉన్నాయన్నారు. 49వ పుటలో ఇచ్చిన subject suffix పట్టికలో ప్రథమ పురుషలో పురుష ప్రత్యయాలలో వాడు కు -డు; అతను కు -ను; ఆయన కు -రు ఇచ్చారు. అతను/ అతడు/ వాడు అన్నింటికీ సాధారణంగా తెలుగువాళ్ళు వాడేది -డు ప్రత్యయమే తప్ప అతను అనే సర్వనామానికి -ను అనే ప్రత్యయం వాడడం ఆధునికమైన తెలుగులో లేదు. అలాగే, Progressiveను Mode అని అన్నారు. Mode అన్నది 18వ, 19వ శతాబ్దులలో కొంతమంది వాడిన పదం తప్ప ఆధునిక వ్యాకర్తల ప్రయోగాలలో కనిపించని పదం.

50వ పుటలో Progressiveతో ప్రారంభిస్తూ క్రియలను నాలుగు తరగతులు (classes) గా విభజించారు. Progressive 1 విభాగంలో తాగు క్రియా రూపాలు చూపారు. Progressive 2 లో class IV క్రియ కొను కు రూపాలు ఇచ్చారు. నపుంసక/స్త్రీ లింగ రూపం అది కర్త అయితే Tense మిగతా వాటి వలె -తున్నా కాకుండా -టున్నా; అలాగే -తోం కు మారుగా -టోం చేరుతుందని, దానిని ప్రత్యేకంగా చూపారు. తెలుగు క్రియలను ఇట్లా విభజించి వివరించడం చక్కని ఆలోచన. భద్రిరాజు కృష్ణమూర్తి, గ్విన్‌ల వ్యాకరణ పుస్తకంలో కూడా ఇలాంటి విభజనే ఉన్నట్టు గుర్తు.

60వ పుటలో Future Tenseలో మొదటి మూడు రకాల రూపాల (Forms I, II, and III classes) క్రియలకు -తా చేరుతుందనీ; 62వ పుటలో class IV కొను రూపాలూ ఇస్తూ, ‘tense suffix -తా changes to retroflex -టా అని వివరించారు. అయితే ఈ రెండు చోట్లా తా/టా ఉండగా, ప్రథమ పురుష నపుంసక/ స్త్రీ (ఆయన ఇలా వివరంగా చెప్పలేదు) ఏక వచనంలో తుం/టుం (సున్న) తో ఏర్పడతాయని చెప్పారు.

68వ పుట నుండీ Past tense క్రియా రూపాలను మూడు తరగతులు (classes) గా వర్గీకరించి ప్రత్యయాలు ఎలా చేరుతాయో ఆ యా paradigms వరుసగా ఇచ్చారు. వీటిలో కూడా ప్రథమ ఏక వచనం (third person singular) రూపాలు భిన్నంగా ఉంటాయని విడిగా ఈ కింది విధంగా చూపారు.

అది -ఇంది
అది తాగింది (పుట. 71); అది రాసింది (72) వంటివి ఉదాహరణలు.

Class IV క్రియా రూపాలకు [-ఆ] Tense Form చేరితే, ప్రథమ పురుష ఏక వచనం నపుంసక లింగానికి (third person neuter singular) మాత్రం రూపం వేరుగా ఇలా ఉంటుంది:

అది -oది -ది – అని ఇచ్చి, ఉదాహరణ గా అది కొంది(?) అనే రూపం కొను కు ఇచ్చారు.

ఉదా: ఆమె పుస్తకాలు కొంది; కూరగాయలు కూడా కొంది.

కానీ, వ్యవహారంలోనూ, రాతలోనూ ఎక్కువగా కొన్నది అన్న రూపమే వాడుతారు. కొంది అనే రూపం బహుశా రచయిత మాండలికమేమో.

పేజీ 89లో ప్రశ్నార్థక పదాల పట్టిక (question words list) ఇచ్చారు. ఇక్కడ గమనించాల్సినముఖ్యమైన అంశాలు రెండు. మొదటిది అవును-కాదు (yes-no) సమాధానం వచ్చే ప్రశ్న వాక్యాలు నామవాచకాల (Nouns) అధ్యాయం 39వ పేజీలో ఇవ్వగా, ప్రశ్న పదాలు 89లో ఇవ్వడం. కానీ ఏం అన్న ప్రశ్న రూపం ఇక్కడ పరిచయం చేసినా, పుట 65లోనే మీరేం చేస్తున్నారు?, సీత ఏం చేస్తోంది? అని సంభాషణల్లో ఇవ్వడం కనిపిస్తుంది. ఇది కూడా ఒక ప్రణాళికాలోపమే!

తెలుగులో విశేషణాలు లేవు (Telugu does not have adjectives) అని ముందుమాటలో చెప్పినా, ఇక్కడ వేరే ఏ వివరణ లేకుండా విశేషణాలు (Adjectives) అన్న శీర్షికతో ఉన్న అంశం ఆశ్చర్యపరచింది. తెలుగులో విశేషణం తర్వాత తప్పనిసరిగా నామం కానీ, సర్వనామం కానీ ఉండాలి/రావాలి అని చక్కగా చెప్పిన వెల్చేరుగారు వీటిని Verbs అధ్యాయంలో ఎందుకు చేర్చారో తెలియదు. అలాగే విశేషణాలు అయిన రంగుల పేర్లు (Colors), క్రియాజన్య విశేషణాలు (adverbs), క్రియా విశేషణాలు (Verbal adjectives) కూడా తర్వాత ఇచ్చారు. అందువల్ల మనం ముందుకూ, వెనక్కూ వెళ్ళి చూసుకోవాల్సి ఉంటుంది. Adverbs ను క్రియ అధ్యాయంలో చేర్చారు; ఇది సబబే.

విభక్తులు

ఇప్పటి వరకూ, ఎన్నో సంభాషణల (conversations) అభ్యాసాలు ఇచ్చినప్పటికీ, పరిచయం చెయ్యని ముఖ్య భాషా విభాగం విభక్తి. దీనిని క్రియా రూపాల తర్వాత అక్కడక్కడా ఎలా వివరించారో ఇప్పుడు చూద్దాం. ఆంగ్లంలో విభక్తి ప్రత్యయాలను Case markers అని వ్యవహరిస్తారు. విభక్తి ప్రత్యయాలు నామాలకు చేరుతాయి. ద్వితీయ మొదలుకొని సప్తమి వరకూ ఈ ప్రత్యయాలు మూల రూపానికి కాకుండా ఔపవిభక్తిక (oblique) రూపానికి చేరుతాయి. సర్వనామాలలో ఈ మార్పు ఎలా ఉంటుందో 92వ పుటలో ఒక పట్టిక ఇచ్చారు. అయితే, ‘Many words in Telugu have oblique forms’ అంటూనే, ‘However, a great majority of Telugu words do not have oblique forms’ (92) అన్నారు. వీటిలోని వైవిధ్య రూపాలను ఇ, టి, తి, బహువచన రూపాలనూ 94లో చూపించారు. కానీ వాటిని గురించి ఇంక ఏమీ చెప్పలేదు.

95వ పేజీలో ప్రశ్నార్థక ప్రత్యయాలు (Question Tags) (కదా, కాదా, గదా, గాదా, కదూ కాదూ, గదూ గాదూ, కా, గా) ఇచ్చారు. Question forms ఇచ్చిన పుటలకూ ఈ పుటకూ మధ్య ఎంతో దూరం కనిపిస్తుంది. బహుశా బోధనలో సులువుగా ఉండేవి ముందుగా ఇచ్చి కష్టం అనుకున్నవి తర్వాత ఇచ్చారేమో! కానీ పుస్తకాన్ని ఈ విధంగా కూర్చడానికి కారణాలు మాత్రం ఎక్కడా చెప్పలేదు.

తర్వాత possessives ను వివరించి దాని పక్కపేజీలో సంఖ్యా వాచకాలు (numbers) ఇచ్చారు. కానీ మూడు వందలతో ఆపేశారు. వెయ్యి, లక్ష ఇవ్వలేదు. వారాల పేర్లు (Days of the week), నెలల (months) పట్టికలున్న 99వ పేజీలో Telling Time అంటూ తెలుగులోని గంట, అర గంట, నిముషం వంటి వివరాలు ఇచ్చారు.

102వ పుటలో postpositions of location అనే శీర్షికతో బొమ్మలతో పైన, మీదన; కింద(న); పక్క (న); బయట; మూల; లోపల; ముందు, వెనుక వంటి రూపాలను చక్కగా వివరించారు.

102లో సప్తమీ విభక్తి (location); ఆ తర్వాత 124లో చతుర్థీ విభక్తికి సంబంధించి Dative: Donations & Recipients ane శీర్షికతో -కి/కు ప్రత్యయాలతో ఉత్తమ పురుష నేను, మేము, మనం లకు మాత్రమే -కు చేరగా తక్కిన వాటికి -కి చేరుతుందని జాబితా ఇచ్చారు. ఇది కూడా మాండలిక భేదమే. ఎందుకంటే ఆయనకి, ఆమెకి వంటి రూపాలకన్న ఆయనకు, ఆమెకు అని వాడటమే ప్రామాణికంగా రాసే తెలుగులో ఎక్కువగా కనిపిస్తుంది.

చతుర్థికి దగ్గర ఉండే క్రియలు ఇచ్చు, చెప్పు. అందువల్ల వాటి paradigms ఇక్కడ పూర్తిగా ఇచ్చారు. చతుర్థి విభక్తి ప్రత్యయం వాడినప్పుడు వచ్చే అర్థాలైన Mobility, goals కింద వెళ్ళు, వచ్చు/ వొచ్చు క్రియలు చేర్చిన రూపాలను ఉదాహరించారు. అట్లా కి ప్రత్యయం చేరినప్పుడు దానికి పూర్వం వచ్చే నామంతో సంధి జరుగుతుందని చూపారు.

అకస్మాత్తుగా గుర్తొచ్చినట్లు Note on Negationలో మరి కొన్ని వ్యతిరేక రూపాలు చూపించి, మళ్ళీదాని తర్వాత పేజీలో Be and Becoming (ఉండు, అవు) రూపాలు వాటి వ్యతిరేక రూపాలతో పట్టికలు ఇచ్చారు. (పు. 107-112). అంటే మధ్యలో గుర్తుకొచ్చిన వ్యతిరేక నిర్మాణాలు కొన్ని అదనంగా చేర్చారన్నమాట. నిజానికి వ్యతిరేకక్రియలు ద్రావిడభాషల ప్రత్యేక లక్షణం. తమిళం వంటి భాషలలో వ్యతిరేకక్రియారూపాలు తొలగిపోయినా, తెలుగులో ఇంకా నిలిచి ఉండడం తెలుగు భాష ప్రత్యేకతగా భాషాశాస్త్రవేత్తలు గుర్తిస్తారు.

115వ పేజీలో ఆత్మార్థక వాక్యాలు (Reflexives) -కొను చేర్చడం వల్ల ఏర్పడుతాయి అనీ, 119వ పేజీలో సహాయక క్రియగా (auxiliary verb) -పెట్టు ను Services అనే శీర్షిక కింద ఉదాహరణలతో చూపారు.

ఇతరాలు

ఈ కింది పాఠ్యాంశాలను, వాటి వ్యాకరణ వివరణలను చూస్తే ఏ క్రమ పద్ధతీ నాకు కనిపించలేదు.

అసంకల్పిత క్రియలు (Non-Volitionals) (పుట. 132) (కనిపించు, వినిపించు, ఆకలి వేయు, నొప్పిపెట్టు వంటివి) ఎలా వాడాలో చూపి, తర్వాత నామాలు క్రియలుగా ఎలా అవుతాయన్న విషయాన్ని వివరించారు. అవి feelings ను తెలియ జేస్తాయని చెప్పారు. ఇంకా -కి వాడే విధానాలను మరికొన్ని వివరించారు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే, వెల్చేరుగారు -కి ప్రత్యయాన్నే ప్రమాణమైనదిగా తీసుకున్నారు. -కు ప్రయోగాలు తక్కువగా ఇచ్చారు.

143వ పేజీలో ద్వితీయా విభక్తి (Accusative) ప్రత్యయం -ను/ని వాడే తీరు తెన్నులు వివరించారు. అయితే వీటిలో కూడా వెల్చేరుగారు -ని (ఉదా: కుక్కని) అనే ప్రత్యయం చేరే రూపాలే ఇచ్చారు తప్ప -ను ప్రత్యయం చేరిన ఉదాహరణలు ఇవ్వలేదు.

149వ పుటలో ఉత్తమ పురుష బహువచనంలో శ్రోతను కలుపుకొని తెలుగులో వాడే మనం అనే సర్వనామంతో వచ్చే క్రియారూపాలను Hortativesలో చూపించారు. అనేక సంభాషణలు ఇస్తూ, కోసం, దగ్గిర (దగ్గర) అనే postpositions పరిచయం చేశారు.

స్థితిసూచక క్రియలను (Statives) పరిచయం చేస్తూ క్రియ ‘నిజాన్ని కానీ స్థితిని కానీ’ తెలియజేస్తుందనీ, ఈ రూపాలు స్థిరపడ్డ పాత/ప్రాచీన తెలుగు (frozen old Telugu) రూపాలనీ చెప్పారు. కానీ భాషాశాస్త్రవేత్తల ప్రకారం తెలుగులో స్థితిని వివరించే స్థితిసూచక క్రియలు (stative verbs) ప్రాచీన క్రియారూపాలలోనే కాకుండా ఆధునిక క్రియారూపాలలో కూడా కనిపిస్తాయి. ముఖ్యంగా statives చర్చించినప్పుడు కర్త చతుర్థీ విభక్తిలో రావడం భారతీయ భాషల ప్రత్యేక లక్షణం. ఆ విషయం వెల్చేరుగారు ప్రస్తావించినా, అసంకల్పిత క్రియలతో పాటు భారతీయేతర విద్యార్థులకు ఈ క్రియలను కొంత విపులంగా వివరించి ఉండాల్సింది.

తర్వాత వరుసగా నిశ్చయార్థక క్రియలు (Obligatives) అంటే -ఆలి ప్రత్యయం చేరే రూపాలు; వ్యతిరేకంలో -కూడదు/-అక్కర్లేదు (162-165) అనే ప్రత్యయాలను ఎలా వాడాలో చూపారు; -రాదు అనే వ్యతిరేక రూపాన్ని ‘పొగ త్రాగరాదు’ అనే ఉదాహరణతో చూపించారు. 169వ పేజీలో కూడదు ఇచ్చి, ఒక బొమ్మలో ఏవేవి ఏయే అర్థాలలో వాడుతారో చూపారు. సాధారణంగా ‘వద్దు’ అనీ వాడే రూపాన్ని ఒద్దు అని రాశారు.

-గల అనే రూపం సామర్థ్యార్థకంగా (abilitative mode) వాడుతారు అని, వ్యతిరేకంలో మాత్రం -లే తో వస్తాయనీ చూపారు.

ఉదా: చెయ్యగలను-చెయ్యలేను

భావార్థక ప్రత్యయాలైన -టం/డం లను Gerunds శీర్షిక కింద చూపి ఆ రూపాన్ని వాక్యంలో ఇతర నామవాచకాలవలనే వాడవచ్చునని వివరించారు.

అయితే వ్యతిరేక భావార్ధక negative gerunds అన్న విభాగంలో ఎక్కువ ఉదాహరణలలో -అకపోవడం ఇస్తూ, సూత్రంలో “Infinitive + అవక పోవడం” అని మాత్రమే ఇవ్వడం వల్ల నేర్చుకునే విద్యార్థులు తికమక పడే అవకాశం ఉంది. ఈ అవకపోవడం ప్రత్యయం చదువు, నడుచు, లేచు వంటి వాటిల్లో ఉంది, మిగతా చోట్ల అకపోవడమే అవుతుంది.

అసమాపక క్రియా రూపాలను, ఉదాహరణలను 183-186లోనూ, conditionals అన్న శీర్షికతో 187-197 పేజీల్లోనూ, వాటి తర్వాత concessives అన్న శీర్షికతో -ఇనా వాక్యాలనూ చక్కగా వివరించారు.

Negative Gerundsలో ఇచ్చిన రూపాన్నే inf. + అకపోయినా concessivesలోనూ ఇచ్చారు. వీటిని నేర్చుకునే విద్యార్థులు ఎలా గ్రహించాలో చెప్పలేదు.

శీర్షిక పేరే UNLESS అని పెట్టి, కానీ/గానీ లను వాడే విధం వివరించారు. కానీ వ్యాకరణ రీత్యా కానీ, బోధన రీత్యా కానీ ఇలాంటి శీర్షికల ఉద్దేశం ఏమిటో తెలియదు. దాని తర్వాత irrevocables అనే శీర్షికతో అకర్మకక్రియలకు -పో చేర్చడం వల్ల ఇవి ఏర్పడుతాయని చెప్పారు. అయితే అవు, ఆగు, వెళ్ళు, ఉండు క్రియలతో -పో వినియోగం కన్నా మిగిలినవే ఎక్కువ వాడుతారని (most frequently used verbs) అన్నారెందుకో!

-ఏయు/వేయు చేర్చి తెలుగులో నిశ్చయార్థక లేదా అవధారణార్థక ప్రయోగాలు (‘Emphatic’ forms) ఏర్పడుతాయని, ఇవి irrevocables అనీ, ఇవి సమాపక క్రియలకు చేరుతాయని భేదం వివరించారు. అయితే వీటిని (-అంటే తాగేసాను, చెప్పేస్తాను వంటి వాటిని) భాషా శాస్త్ర వేత్తలు పూరణార్థకాలుగా (perfective) పరిగణించారు.

ప్రశ్నార్థక పద రూపాలతో వ్యతిరేక సమాపక క్రియ (negative finite verb) వాడితే దాన్ని పూర్తి వ్యతిరేకం (Total Negation) అనాలన్నారు రచయిత. ఇది ఒక కొత్త అవగాహన. దీని ప్రయోగ, ప్రయోజనాలపై పరిశోధన జరగాలి.

Comparisons- తారతమ్యాలను చెప్పటానికి ఇంగ్లీషులోవలె కాకుండా తెలుగులో {-కన్న/కన్నా; కంటె/కంటే} అనే పరసర్గలతో (postposition) వచ్చే ప్రయోగాలు తెలుగులో వాడుతారు అని ఉదాహరణలతో పేర్కొన్నారు. భాషా శాస్త్రం ప్రకారం పరసర్గలనేవి (postpositions) అనేవి నామానికి అనుసంధానమయ్యే స్వతంత్ర విభక్తులు (బల్ల మీద, ఇంటి దగ్గర, గది లోపల మొ॥). అందువల్ల ఈ పారిభాషిక పదాన్ని ‘తరవాత వస్తుంది’ అన్న అర్థంలో ఇంతకుముందు ఎవరూ వాడినట్లు లేరు.

Before and After (ముందు, తరువాత) అనే పదాలను ప్రత్యేక శీర్షిక పెట్టి చూపిస్తూ, మీకు ఇవి కాల బోధక పదాలని (time words) ముందే తెలుసు అంటూ మరి కొన్ని వివరణలతో ఇచ్చారు.

తదనంతరం క్రియా రహిత వాక్యాలు మళ్ళీ (equational sentences Revisited) అంటూ వాక్యంలోని ఉద్దేశం, విధేయం రెండూ కూడా పురుష, వచన ప్రత్యయాలతో పరస్పరం ఏకంగా (agreement) ఉండాలన్న ముఖ్య సమాచారం ఇందులో అదనంగా చేర్చారు.

Habit in the past శీర్షిక కింద (p. 241)ఇచ్చిన సూత్రీకరణ లేదా వివరణలు నా మట్టుకు నాకు ఆమోదయోగ్యంగా కనిపించలేదు.

ఆ తరువాతి అంశం infinitives in questions అంటే ప్రశ్నార్థకాలలోని రెండు రకాలనూ (I) yes- no questions; (ii) question word question తో బాటు, (What, Which, Why) మరింత స్పష్టంగా తెలియపరిచారు.

తెలుగు భాషలో మరో ముఖ్యమైన వాక్య నిర్మాణం అనుకృతి వాక్యాలుగా పేర్కొనబడే ప్రత్యక్ష, పరోక్ష అనుకరణ వాక్యాలు (రిపోర్టింగ్). వీటిని గురించి 249-254 పేజీలలో వివరించారు.

Vowel lengtheningలో వివరించిన అంశాలనే తిరిగి “OR” తో చేర్చి AND/OR కింద వివరిస్తూ, EITHER/OR వాక్యాలను కూడా చేర్చారు.

అసమాపక క్రియలను మళ్ళీ కొన్ని తీసుకొని Non-Finite Revisited అనే అంశం కింద subject (కర్త)లో shift ఎలా జరుగుతుందో వ్యతిరేక వాక్యాలతో సహా తెలిపారు (మరిన్ని వివరాలకు చూ. రామారావు, చేకూరి, 1975).

Infinitive + న్ + ఇచ్చు కలిపితే ఒక రకమైన అనుమతి వాక్యాలు ఏర్పడ్డాయని చూపించి వాటికి FACILITATIVE (?) అని పేరు పెట్టారు. వీటిని చేకూరి రామారావుగారు అనుమత్యార్థకాలు అన్నారు.

భాషా శాస్త్రంలో Fillmore, తెలుగు వ్యాకరణాల్లో కారక పరిచ్ఛేదాలలో తెలుగు వ్యాకర్తలలో కొందరు చెప్పిన అంశాలను తీసుకొని Dative experiencer+obligative verb + అని+ ఉండు/ అనిపించు అనే సూత్రంతో Desires, Feelings, & Thoughts తెలియజేయవచ్చునని ఉదాహరణలు ఇచ్చారు.

అదే విషయాన్ని Nominative + oblig. verb /hortative + అనుకొను అనే రకం వాక్యాలతో కూడా తెలుపడం వీలవుతుందని ఉదాహరణలిచ్చారు.

ప్రేరణార్థక (Causative) క్రియా రూపాలుగా చూపించినవి, ఉదాహరించినవి అసంపూర్ణం అని ఈ అంశాలతో పరిచయం ఉన్న ఎవరైనా గుర్తించగలరు.

273వ పేజీలో -ఏ చేర్చి Definitives అర్థాలను సాధించవచ్చునని తెలుగు మాట్లాడుతున్నాను, తెలుగే మాట్లాడుతున్నాను వంటి వాక్యాలను చూపుతూ ఇవి సందర్భాన్ని బట్టి మారుతాయని వివరించారు. అలాగే -బో (పో) అని చేర్చడం వల్ల ‘Prospective’ అర్థాలు వస్తాయని 274 పుటలో చూపించారు.

MEMORY అనే శీర్షికలో “గుర్తు, జ్ఞాపకం” అనే రెండు నామాలను ఈ క్రియా అధ్యాయంలో చేర్చారు. ఎందుకంటే గుర్తుంది గుర్తున్నాయి గుర్తొచ్చారు, గుర్తు రాలేదు/ రావడం లేదు వంటి రూపాలన్నీ క్రియతో కలిసిపోయి ఉంటాయని కాబోలు అనిపిస్తుంది. (అలాగే జ్ఞాపకం తో కూడా జ్ఞాపకం ఉండు/ చేసుకొను/ తెచ్చుకొను) వంటి ప్రయోగాలను కూడా ఇచ్చారు.

వివరణ బోధన ముగిసిపోయిందని అనుకున్న వ్యతిరేకాలు (Negation)లో కొన్ని వివరాలు ప్రశ్నార్థక పదాలతో కలిసి “Total Negation తెలియజేస్తుంది” అంటూ 279-280 పుటల్లో వివరించారు.

ఈ సెక్షన్‌తో వెల్చేరు నారాయణరావుగారి తెలుగు వ్యాకరణం పూర్తవుతుంది. మిగిలినవన్నీ వ్యాకరణేతర విషయాలే. అందులో ఉదాహరించిన అయిదు ఉత్తరాలలో మూడు అన్ని లక్షణాలు లేక అసంపూర్ణం. (ఇప్పుడిక ఉత్తరాల కాలమే పోయింది కాబట్టి వాటి స్వరూప స్వభావాలు, రాసే విధానం తెలుసుకోవడం అంతా అనవసరం అయిపోయింది). Tales అనే శీర్షికలో ఒకే ఒక్క కథ మాత్రమే ఉంది, అందువల్ల ‘ Tale’ అంటే సరిపోయేదేమో!

ఈ పుస్తకంలోని ప్రతి ఒక్క విభాగాన్ని వదలకుండా పరిచయం చెయ్యడం ఎందుకంటే, వెల్చేరుగారు ఇందులో కొత్తగా పరిచయం ప్రతి అంశాన్ని పాఠకుల ముందుచాలన్నదే నా ప్రయత్నం. ఆయన పుస్తకంలోని మంచిచెడ్డలను కూలంకషంగా విచారించడానికి, నేను చూపిన విషయాలే కాక ఇతర విషయాలపై పాఠకులకు ఆసక్తి, అవగాహన కలిగించాలనే తాపత్రయం. నా ప్రయత్నం కొంతైనా సఫలమయ్యిందని భావిస్తాను.

ఈ తెలుగుదారితో ఉన్న ప్రధాన సమస్యలు

ఈ పుస్తకంలోని వ్యాకరణ నిర్మాణం, పరిభాష పలు భిన్నమైన సంప్రదాయాల ఆధారంగా రూపొందించినట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా:

  1. కొంత ఎక్కువగా ఆంగ్ల వ్యాకరణ నిర్మాణం, పరిభాష.
  2. కొంత భాషా శాస్త్ర ఛాయలు, పరిభాష.
  3. కొంత ప్రాచీన, ఆధునిక శబ్దార్థశాస్త్ర (semantics) అంశాలు
  4. కొన్ని ఆయన స్వయంగా రూపొందించిన తీర్మానాలు, పారిభాషిక పదాలు

ఇందులోని పారిభాషిక అర్థ వివరణలు వ్యాకరణ (మరీ ముఖ్యంగా ఆంగ్ల వ్యాకరణ), భాషాశాస్త్ర పరిచయాలు ఉంటేనే అర్థం అవుతుంది. ఇదివరకు చెప్పుకొన్నట్లు, వేరు వేరు శాస్త్ర పరిభాషలను కలగలపి చెప్పడం వల్ల అయోమయం కలుగుతుంది. ఆయన స్వయంగా తయారుచేసిన శీర్షికలు కొన్ని అర్థబోధకు దోహదపడి ఉండవచ్చునేమో కానీ శాస్త్రీయంగా సమ్మతంకావన్నది ముఖ్యమైన అధిక్షేపం.

ముందుగా చెప్పినట్లుగా ఇది వ్యాకరణ పుస్తకమా, తెలుగు బోధనా పుస్తకమా అన్న విషయంలో రచయితకే స్పష్టత లేదనిపించింది. తెలుగులో పుస్తకం పేరు తెలుగుదారి అని పెట్టి, ఇంగ్లీషులో మాత్రం “A Grammar of Modern Telugu” అని ఎందుకు పెట్టారని సందేహం కలుగుతుంది. బోధన కోసం ఉద్దేశించినదైతే దానితో పేచీ ఏమీ ఉండదు. ఎవరి పద్ధతిలో వాళ్ళు బోధించవచ్చు. కానీ వ్యాకరణ పుస్తకం అంటే మాత్రం ప్రాచీన కాలం నుండీ ఇప్పటి వరకు వ్యాకరణాలు రాసే పద్ధతి/సంప్రదాయాలు ఉన్నాయి. వాటి అవగాహనతో చూస్తే ఇది పూర్తిగా భిన్నమైనది. ఆధునిక భాషాశాస్త్ర వ్యాకరణాలకు phonology, morphology, syntax అంటూ ఒక ఒరవడి ఉంది. ఆ ఒరవడిలో కూడా ఈ పుస్తకం ఒదగదు.

పై విభాగాలలో వివరించినట్లు ఈ వ్యాకరణ పుస్తకం అనేక విషయాల్లో అసంపూర్ణంగా కనిపిస్తుంది. తెలుగు భాషకు మరీ ముఖ్యంగా మాట్లాడే భాషకు అత్యంత ప్రధానమైన సంధి, సమాసాల గురించి ఇందులో ఏమీ లేదు. సంధి ప్రాధాన్యాన్ని వ్యాకరణాలు రాసినవారితో బాటు నిఘంటువులు రాసినవారు కూడా గుర్తించి వివరించారు; ముఖ్యంగా, Galletti, Kelly లాంటివారు మాట్లాడే భాషలో సంధి వల్ల అర్థం ఎంత కష్టమో వివరించారు. ఈ వ్యాకరణంలో విద్యార్థికి ఆ అవగాహన ఏర్పడదు, కాబట్టి ఈ పుస్తకం ద్వారా నేర్చుకునేది చాలా పరిమితం అవుతుంది.

సంస్కృత పరిభాషలో నామ, క్రియా రూపాల నుండి నిష్పన్నమయ్యే కృత్, తద్ధిత రూపాల ప్రస్తావనే లేదు. ఆమ్రేడిత పదాల పరిచయ, వివరాలు లేవు.

మరి ఇలా వెల్చేరుగారి వద్ద గడిచిన యాభై ఏళ్ళలో నేర్చుకున్న విద్యార్థులు తెలుగు పుస్తకాలు ఏమైనా చదవగలిగారో, అందులో చదవటం రాయటం కొనసాగిస్తున్నారో లేదో? వివరాలు ఉంటే బాగుండేది.

Vocabulary (పదజాలం)లో ఇచ్చిన పదాలు పెద్ద బాలశిక్షను గుర్తుకు తెస్తాయి. దీనిలో కూడా బంధు వాచకాల వంటివి అసంపూర్ణం.

ఇట్లా ఎన్నో అసంపూర్ణ విషయాలతో ఉన్న వ్యాకరణ వివరణతో కూడిన ‘ప్రైమర్’ గురించి ‘పరిపూర్ణ’ వ్యాకరణం అని చెప్పుకోవడం కానీ చెప్పడం కానీ సరైనది కాదు. కొన్ని తప్పులు ముద్రణ సమయంలో మరొక్కసారి చదివి సరిదిద్ది ఉంటే తప్పనిసరిగా మెరుగుపడేదే. పునర్ముద్రణలో ఎడిటింగ్ తప్పనిసరి.

ముక్తాయింపు

చివరగా చెప్పాల్సింది ఏమంటే భాషకు సంబంధించిన ఏ గ్రంథమయినా భాషా బోధనకు వ్యాకరాణాంశాల విశేషాల అవగాహనకు దోహదపడేవే; తెలుగు రానివాళ్ళకు, ముఖ్యంగా అమెరికా, యూరోప్ దేశాలవారికి తెలుగు బోధించేవారికి ఇందులోని సూత్రీకరణలు, Primerలో ఇచ్చిన సంభాషణలు బాగా ఉపయోగపడుతాయి. అయితే బోధించేవాళ్ళకైనా, నేర్చుకునేవారికయినా కొంత ఆంగ్ల వ్యాకరణ జ్ఞానం, కొచెం భాషాశాస్త్రం తెలిసి ఉండాల్సి ఉంటుంది.

ఈ పెద్ద వయస్సులో కూడా పట్టుదలతో తన అనుభవాలను రంగరించి రూపొందించిన ఈ తెలుగుదారి భాషా బోధనకు ఉపకరించే ఒక ‘దారే’. దీనిని అటకెక్కించకుండా వెలుగులోకి తెచ్చిన ఆచార్య వెల్చేరు నారాయణరావుగారికి తప్పనిసరిగా అభినందనలు తెలపాల్సిందే.

సంప్రదించిన పుస్తకాలు

  1. ఆంధ్ర భాషా భూషణము మూలఘటిక కేతన వ్యాకరణానికి వ్యాఖ్య, ఉషాదేవి, ఆయినవోలు. 2014. ఎమెస్కో ప్రచురణ.
  2. కొత్త వ్యాకరణం ఎందుకు రాశాను? ఇంటర్వ్యూ . ఆంధ్రజ్యోతి.
  3. రామారావు, చేకూరి. తెలుగు వాక్యం. హైదరాబాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 1975
  4. రామారావు, కె. వి. యస్. సమీక్ష. ఆంధ్రజ్యోతి. అక్టోబర్ 9, 2023
  5. Shulman, David. The Hindu. సెప్టెంబర్ 23, 2023.
  6. చంద్రశేఖర రెడ్డి, డి. తెలుగుదారి సరే! తెలుగు వారిక్కాదు.

అయినవోలు ఉషాదేవి

రచయిత అయినవోలు ఉషాదేవి గురించి: అయినవోలు ఉషాదేవి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆచార్యులు గానూ, భాషాభివృద్ధి పీఠానికి పీఠాధిపతిగా, నిఘంటునిర్మాణ శాఖకు శాఖాధిపతిగానూ పనిచేశారు. వివిధ జాతీయ, అంతర్జాతీయ భాషాశాస్త్ర సదస్సులలో పాల్గొని పత్ర సమర్పణలు చేసిన వీరు ఇంగ్లీషు, తెలుగు భాషల్లో సుమారు 60కి పైగా వ్యాసాలు ప్రచురించారు. Acquisition of Telugu syntax (1990, New Delhi), ధ్వన్యనుకరణ పదకోశం (2001, తెలుగు విశ్వవిద్యాలయం), Issues on Lexicography 2006, Andhra Bhasha bhushanamu: Original Text with Transliteration, meaning, Translation మొదలైనవి ఆవిడ రాసిన గ్రంథాలలో ప్రసిద్ధమైనవి. వివిధ విశ్వవిద్యాలయాల భాషాశాస్త్ర శాఖలలో రిసోర్స్ పర్సన్‌గా, యుజిసి విజిటింగ్ ఫెలోగా ఆహ్వానిత ఉపన్యాసాలిచ్చారు. పాఠ్యసంఘాలలో సభ్యులుగా, పరీక్షకులుగా సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2001లో వీరికి "ఉత్తమ ఉపాధ్యాయ" పురస్కారాన్నిచ్చింది. 2012 లో తెలుగు విశ్వవిద్యాలయం ఉషాదేవిగారిని కీర్తిపురస్కారంతో సత్కరించింది. సైద్ధాంతిక, అనువర్తిత భాషాశాస్త్ర రంగాలతోపాటు, తెలుగు సాహిత్యం, సంప్రదాయ వ్యాకరణాలు కూడా ఉషాదేవిగారికి అభిమాన అధ్యయన విషయాలు. ...