ఇవ్వాల్టి కోసమే నిన్నటి కాటుక కారిన కంటితో
వేల మైళ్ళ కాలి మాల కట్టుకుని, రాళ్ళు వదిలే ఊపిరిగా…
రెక్కల కొమ్మల భుజాలని ఇచ్చాను.
గుమ్మడి పూల ఒళ్ళు అలవాటులో పడి చుక్కల ఆకాశం తెప్పల రాగం పాతగా పాడింది.
చెక్కిన ఏనుగు దంతపు మొనతో అధికార వసంతపు ఆట.
నలుగు ఒళ్ళు నలిపి, పక్కకి వంచిన జుట్టు విల్లు.
కాలిపోతున్న నిప్పులో నిలబడి పెదాలు కాలుతున్న కోరిక. మండే మంట లాగా
నిన్ను నువ్వు పక్కకి జరుపుకుని కురిపించిన గంధపు చెక్కల పూల వాన. ఆగి ఆగి
అర్థం లేని ముత్యాల కబుర్లు పిచ్చి నవ్వులుగా రాలిపోయి, శరద్రుతువు మళ్ళీ బుగ్గల్లో పూసింది.
అంతా వెన్నే, నుదురు కరిగి పాకుతూ పొట్ట పొట్లంలో తాడు చుట్టలా పేనుకుంది.
ఏడు రాత్రుల గులాబీల ఎదని పేర్చి, రాతి శిల్పాలు రాతలో మునిగి,
కుప్ప తేనీగల ఎంగిలి పూల చేతిమాల, మెడ కోసం తడుముకునే వేళ్ళకి దొరికిన తేనెపట్టు.
బాత్రూమ్‌లో నీళ్ళ చప్పుడు, ఖాళీ చేసిన పక్క దుప్పటిని తడిమితే అరచేతికి అందిన ఊసులు ఎన్నో.
తిరగా బోరలా రెండు ఏడుల గది. దారిలేని బంధం
కలనేత బాణాలు, చినుకులని తాగిన గొంతులు, పొడి పొడి అక్షింతలు పారపోసి పోయింది రోజు.
అప్పుడప్పుడూ అరచేతిలో పాద పద్మం బుగ్గ చారిక రాసింది.
హఠాత్తుగా అర్ధరాత్రి బ్రహ్మ కమలాలు విరుస్తూ కురిశాయి.
సుగంధాల తడి పూత చూశాను.
నిన్ను ఊపిరిగా ఉంచుకొన్నాను.