ఇల్లు మారే ప్రతిసారి
ఏదో ఒకటి కోల్పోతున్నాం.
అవ్వ వక్కలు కత్తిరించే అడకత్తెర.
తమ్ముడు అగ్గిపెట్టె బొమ్మలు
చింపి అంటించిన నోటుబుక్కు.
నాన్న ఆఫీసుకు వెళ్ళేందుకు సానుకూలంగా
ఇంటికి దగ్గర్లోనే ఆగే సిటీబస్సు.
నాకు
పిక్కలు కనబడేలా వంగి
ముగ్గులు వేసే ఎదురింటమ్మాయి.
కమ్యూనిజంతో మొదలు పెట్టి
కామసూత్ర వరకు మాట్లాడే
టీ కొట్టు నేస్తాలు.
ఈసారి
వారం క్రితమే నాటిన
గులాబీమొక్క మొదలుకొని
ఎండలో దండేనికి ఆరేసిన
లోదుస్తుల వరకు
ప్రతిదీ
పొందికగా తీసిపెట్టాను.
అయినా సరే
ఇంకేదో
మర్చిపోయినట్టు ఏదో వెలితి.
అన్నట్టు
ఎంగిలి మెతుకులు
తినడానికి వచ్చే కుక్కతో
ఎవరు చెప్తారు
మేము ఇల్లు మారుతున్నామని.
(మూలం: పిరిదలుమ్, పిరిదల్ నిమిత్తముం. ‘పట్టాంబూచ్చి విర్పవన్’ కవితా సంకలనం నుండి.)