తెలుగులో ప్రస్తుతం స్థూలంగా రెండు రకాల కవులున్నారు. ఒకరు తమను తాము సామాజిక చైతన్యంతో అభ్యుదయవాదులుగా ఊహించుకుంటూ రచనలు చేసేవారు. రెండవవారు, తమ తమ ఆంతరంగిక, ప్రాకృతిక జగత్తులోనుండి కవిత్వం వ్రాసుకునేవారు. చిత్రంగా, ఈ రెండు కోవలకు చెందినవాళ్ళు ఒకరి కవితలను ఒకరు ప్రశంసించడం కనపడదు. వారికి వీరు కవులుగా వీరికి వారిది కవిత్వంగా అనిపించదేమో. కవులు అని ఎవరిని అనాలి? కవిత్వం వ్రాసిన వాళ్ళని అనాలి. అప్పుడు వాళ్ళ రచనలో మనం ఏం చూడాలి? వస్తువులో, అభివ్యక్తిలో కొత్తదనం, భావం, అనుభూతి సాంద్రత – ఒక్కమాటలో, కవిత్వాన్ని చూడాలి. తమ అనుభవాలను, ఆవేశాలను కవిత్వంగా మార్చదలచినవాళ్ళు ఆ పని నేర్పుగా చెయ్యగలిగితే అది వేరే సంగతి. కానీ ఏదో ఒక భావజాలానికో భావుకతకో చెందాలనే ఆరాటంలో, తమ అభ్యుదయాన్ని లేదా అనుభూతిని ప్రకటించుకోవాలన్న తొందరలో వ్రాసేవి కృతకమైన రాతలు, కవితలు కావవి. అంటే, కవిత ఎత్తుగడతో సంబంధం లేకుండా ప్రయత్నపూర్వకంగా చొప్పించే భావుకత, వెలిబుచ్చే ఆవేశం కవితని బలోపేతం చెయ్యవు. మరొకలా చెప్పాలంటే, నిజాయితీ లేమి కవితలను నిర్జీవం చేస్తుంది. ఒక కవిత/రచన పాఠకులను చదివించలేకపోతే, ఆలోచించనీయకపోతే, వారు దానితో కాసేపైనా మమేకం కాలేకపోతే, ఎవరికోసమైతే వ్రాశారో వారితో సహా ఎవ్వరికీ అందకుండా అది ఒక వ్యర్థప్రయత్నంగా మిగిలిపోతుంది. అసహనం, ఆవేశం, అనురాగం, సున్నితత్వం–ఇవేమీ తప్పులు కాదు, కవులకు రచయితలకూ ఉండకూడనివీ కావు. కాని, ఒక రచనకు ఇవి ముడిసరుకులు మాత్రమే. వీటిని కథగా కవితగా మలచాలంటే పరిశ్రమ కావాలి. రచయిత చూపు పక్కకు చెదరకుండా, రచన ఆసాంతం ఆ బిగి సడలకుండా ఉండాలి. తనకు తెలిసినదల్లా, తాను అనుభవించినదల్లా చెప్పాలనే అత్యుత్సాహం, ఒకే అంశం మీద నిలబడి మాట్లాడలేని అసహనం వదలాలి. అట్లా మాట్లాడేందుకు తగిన సరుకు పోగుచేసుకునేందుకు కృషి చేయాలి. ఎందుకంటే సమస్య ఎంత జటిలమైనదయినా, అనుభూతి ఎంత లోతయినదయినా అది పాఠకుల దగ్గరకు చేరకపోతే ఆ రచనకు విలువ లేదు. కవితలో కేవలం స్పందనే కాదు, అది ప్రకటించడంలో కొంత వివేచన కూడా ఉండాలి. ఆ వివేచన ఊతంగానే పాఠకుడు రచనను, రచన పాఠకుడిని పట్టుకుని ఉండగలిగేది. ప్రస్తుత తెలుగు సమాజంలో కవిత్వానికి విలువ తగ్గిపోయింది, కవులంటే హేళన పెరిగిపోయిందీ కవిత్వాభిమానులు లేకనో, కవిత్వాభిరుచి పోయో కాదు. కవులమని చెప్పుకుంటూ అకవిత్వాన్ని మోస్తున్నవారు, కవులమని చెప్పుకుంటూ అకవిత్వాన్ని ప్రచురిస్తున్నవారు ఇందుకు కారకులు. తాము వ్రాసిందంతా కవిత్వమనుకునే వారి వెర్రి ధోరణి దీనికి కారణం. కవిత్వం వ్రాయాలీ అంటే ముందు కవిత్వం చదవడం నేర్చుకోవాలి. ఒక కవితను కూలంకషంగా చదివి విశ్లేషించగలగాలి. దానిలోని లోతుపాతులు బేరీజు వేయగలగాలి. కవి తన ఉద్దేశ్యాన్ని స్పష్టంగా, భావస్ఫోరకంగా ప్రకటించగలిగాడో లేదో, తన ఆశయంలో కృతకృత్యుడు కాగలిగాడో లేదో గమనించగలగాలి. ఇలాంటి శ్రమతో మాత్రమే ఏది ఏ స్థాయి కవిత్వమో బోధపడుతుంది. కనుక కవులారా, మీరు వ్రాసిన ఏ కవితనయినా అందులో వస్తువు కొత్తదనం ఏమాత్రం, పోలికలలో కొత్తవి ఎన్ని, అభివ్యక్తిలో నవ్యత ఎంత, అన్న మూడు ప్రశ్నలతో సరి చూసుకోండి. కవిత్వానికి కొలమానాలు ఉండవు లాంటి మాటలు ఉట్టి అపోహలు. అవి బలిమి ఉన్న కవిత్వాలకు. మీరు భేషుగ్గా మీ మీ కవిత్వాలను కొలిచి చూసుకోండి. మీ కవిత్వం ఏదో ఒక స్థాయికి తూగే దాకా మిమ్మల్ని మీరు కవులు అని చెప్పుకోవడానికి సంశయించండి. కవిత్వాన్ని కొలవగల తూనికరాళ్ళు లేకపోలేదు, గుర్తుంచుకోండి.