అది 2017వ సంవత్సరం జులై నెల. తొలిసారిగా ఒక రచయిత్రి ముఖారవిందంతో బ్రిటన్‌లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ 10 పౌండ్ల నోటు విడుదల చేసింది. అంతకు ముందు ఆ గౌరవం దక్కినవారు ఇద్దరే: ఛాల్స్ డికెన్స్ (Charles Dickens), ఛాల్స్ డార్విన్ (Charles Darwin). వారి తర్వాత ఈ ఘనత సాధించిన తొలి మహిళ జేన్ ఆస్టిన్ (Jane Austen).
Men have had every advantage of us in telling their story. Education has been theirs in so much higher a degree: the pen has been in their hands – (పర్సుయేషన్ నవలలో ఆన్ ఫించ్ వ్యాఖ్య). మగవాళ్ళ చేతిలో కలం ఉంది చిరకాలంగా. కనక వారి కథనే మనం ఎక్కువగా విన్నాం. వారికి చదువూ ఎక్కువే. చదువూ, కలం తన అధీనంలో ఉంచుకున్న మగవాడికే కథలు చెప్పే అధికారం ఉంటుంది మరి. ఈ అవగాహన ఆన్ ఫించ్‌ది మాత్రమే కాదు. ఆమెను సృష్టించిన జేన్ ఆస్టిన్‌ది. ఆ ‘రాత’ను మార్చేందుకేనేమో, స్వంతంగా ఆలోచించగల, తమ జీవితాలు తమ చేతుల్లోనే ఉండాలని వాదించగల నాయికలను ఆమె సృష్టించింది.
మహిళా రచయితల్లో మకుటం లేని మహారాణి జేన్ ఆస్టిన్ నవలలు చదవడం చక్కని అనుభవం. కానీ వాటిని గురించి విశ్లేషించడం అంత సులభం కాదు. ఎందుకంటే ఆమె చిన్న పరిధిలో అమూల్యమైన విషయాలు అలవోకగా అందించగలిగింది. 18వ శతాబ్దాంతంలో, 19వ శతాబ్ది ప్రారంభంలో రాసిన ఫ్రెంచి, ఇంగ్లీషు రచయిత్రులు కొందరిలా ఆమె రాజకీయ, సామాజిక వాతావరణాన్ని తన రచనల్లో స్పృశించలేదు. బ్రిటిష్ భూస్వామ్య వ్యవస్థ నేపథ్యంలో కుటుంబం, స్త్రీపురుషుల సంబంధాలు అన్న పరిమితి పరిధిలోనే అన్ని నవలలూ రాసింది. అయినా ఆమెకు బ్రహ్మరథం పట్టారు సాహిత్యాభిమానులు, ఇంకా పడుతున్నారు కూడ.
ఆమె నవలల్ని పరామర్శించే ముందు ఆమె రచనలు ఎలాంటి స్పందనను ఆహ్వానించాయో తెలుసుకోవడం అవసరం. అలాంటి వైవిధ్యభరితమైన స్పందనలకు ఆమె నవలలు అవకాశం ఇచ్చాయా లేదా అన్నది ఆ తర్వాత ఆలోచించుకోవచ్చు.
జేన్ ఆస్టిన్ ‘నేను అందరిదాన్నీ’ అని ఏనాడూ చెప్పుకోలేదు కాని, అందరూ ఆమె తమకే చెందుతుందని అనుకున్నారు. తమ సిద్ధాంత పరిధుల్లోకి ఆమెను లాక్కువెళ్ళాలని ప్రయత్నించారు. ఆమె మరణించి రెండు శతాబ్దాలు గడిచినా, ఇప్పటికీ ఆమెను చర్చించుకుంటూనే ఉన్నారు. అందుబాటులో ఉన్న ఆరు నవలల్లోనూ లోతుల్ని వెతుకుతూనే ఉన్నారు. ఆమె నవలలు ఇప్పటికీ సినిమాలుగా వస్తూనే ఉన్నాయి.
‘మంచి నవల చదివి ఆనందించలేనివాళ్ళు, ఆడైనా, మగైనా, పరమ మూర్ఖులై వుంటారు’ అంది ఆమె ఒక నవలలో. ఆ ‘మంచి’కి ఆమె ఎలాంటి నిదర్శనాలూ నిర్వచనాలూ ఇవ్వలేదు. కానీ, ఆమె రాసిన ఆరు నవలలనూ గొప్ప నవలలుగా ఇన్నేళ్ళ తర్వాత కూడ అందరూ కీర్తిస్తూనే ఉన్నారు. ఆమె మరణించిన 50 ఏళ్ళ తర్వాతి నుంచీ ఎవరికి వారు తమకు తోచినట్టుగా ఆమెను ‘చదివి’ కొత్త వ్యాఖ్యానాలు జోడించి, తమ సైద్ధాంతిక సామ్రాజ్యాల్లోకి లాక్కువెళ్ళారు. మచ్చుకి:
‘భావోద్వేగ నవలలు రాజ్యమేలుతున్న రోజుల్లో, దారి మళ్ళించి కుటుంబ సంబంధాల్లో వాస్తవిక రచనకు పట్టంగట్టిన రచయిత్రి’ అని ఆమెను స్వంతం చేసుకున్నారు వాస్తవికవాదులు.
‘స్త్రీలకు వివాహం విషయంలో సంపూర్ణస్వేచ్ఛ ఉండాలని, ఆత్మగౌరవమే వారికి ఆభరణమని, మేధ విషయంలో స్త్రీపురుష అంతరం ఉండదనీ చెప్పినందుకు’ ఆమెను తమ ఖాతాలో వేసుకున్నారు స్త్రీవాదులు.
‘బ్రిటన్‌లో భూస్వామ్య వ్యవస్థలోని ఆర్థిక తారతమ్యాలు మానవసంబంధాలను ప్రభావితం చేసిన వైనాన్ని గొప్పగా చెప్పిందని’ తమ ఇంటిలోనూ ఆమెకు చోటిచ్చారు మార్క్సిస్టులు.
‘ఫ్రెంచి విప్లవ ఫలితంగా చెలరేగిన విశృంఖల జీవనాన్ని ఖండించి, నైతిక విలువలను బోధించింద’ని తమ కూటమిలో చేర్చుకున్నారు నైతికవాదులు.
‘ఆంగ్లికన్ చర్చి నియమావళిని, నైతిక సూత్రాలనూ గౌరవించడమే తన రచనల లక్ష్యమని నిరూపించిందని’ చివరికి మతతత్వవాదులు కూడా ఆమె అంటే ముచ్చటపడ్డారు.
‘అసలు ఆమె కూటములు అక్కరలేని రచయిత్రి అని, జీవితాన్ని చిత్రిక పట్టడంలో షేక్‍స్పియర్, సెర్బాన్తెస్, హెన్రీ ఫీల్డింగ్‌లతో సమానంగా ప్రతిభావంతురాలనీ’ తీర్మానించారు చివరికి మరికొందరు.
ఒక సమకాలీన విమర్శకురాలు అన్నట్టు ‘Not only is my Austen unlikely to be yours; it seems that anyone’s Austen is very likely to be hostile to everyone else’s.’ ఎవరికి వారు ఆమె తమకే చెందుతుందని అనుకునేంత పొసెసివ్‌నెస్‌ని ప్రకటించడం, ఆమెను తామే బాగా అర్థం చేసుకున్నామని వాదించడం రచయిత్రుల్లో ఒక్క ఈమె విషయంలోనే కనిపిస్తుంది (తెలుగులో గురజాడ అప్పారావును గురించి అనుకున్నట్టు).
తన మరణానంతరం జరగబోయే ఈ విచిత్రాలన్నీ ఆమెకు తెలీవు, కానీ అసలు తను ఎందుకు రాసిందో, ఎలా రాయాలనుకుందో ఆస్టిన్ ఎక్కడా చెప్పుకున్నట్టు లేదు. బహుశా చెప్పుకుని ఉన్నా, ఆమె లేఖలన్నిటినీ అక్క కసాండ్రా (Cassandra), ఆమె మరణించిన వెంటనే తగలబెట్టేయడంతో ఆమె ఏయే విషయాలు లేఖల్లో చెప్పుకుందో తెలీదు. అలా తగలబెట్టడానికి కారణం, జేన్ తన కుటుంబ సభ్యుల గురించి, బంధుమిత్రుల గురించి వ్యంగ్యవ్యాఖ్యానాలు అనేకం చేయడం. అవి బయటపడితే వాళ్ళందరూ బాధపడతారని కసాండ్రా భావించడం. కానీ ఆ క్రమంలో ఇతర విషయాలపై జేన్‌కు ఉన్న అభిప్రాయాలనూ మనం పోగొట్టుకోవలసివచ్చింది.
జేన్ ఆస్టిన్ జీవితం
ఇంగ్లండులోని హాంప్‍షైర్‌లో 1775 డిసెంబర్ 16న జేన్ జన్మించింది. తండ్రి ఆంగ్లికన్ పారిష్‌లో రెక్టర్. వారిది మధ్యతరగతి కుటుంబం. జేన్‌కు ముగ్గురు అన్నలు, ఒక అక్క. వారిలో ఒక పిల్లవాడిని దత్తతకు ఇచ్చేశారు. కుటుంబంలో చదువుకు ప్రాధాన్యం ఉండడం వల్ల, చిన్నప్పటినుంచీ ఎన్నో విషయాలను కుటుంబమంతా కూర్చుని చర్చించుకోవడం ఒక అలవాటుగా మారింది. ఆడపిల్లలిద్దరినీ కూడ బాగా చదివించాడు తండ్రి. కొంతకాలం బోర్డింగ్ స్కూల్‌లో ఉండి, ఎన్నో విషయాలను అధ్యయనం చేసింది జేన్ (కుట్లు, అల్లికలు వంటి ‘ఆడ’ విద్యలతో పాటు, సాహిత్యం, నాటకం వరకూ). కానీ అనారోగ్యం, అధిక ఫీజుల కారణంగా మధ్యలోనే ఇంటికి వచ్చేసింది జేన్. అక్కడినుంచి ఇంట్లోనే చదువు కొనసాగించింది. తండ్రిగారి గ్రంథాలయం, ఆయన మిత్రుడైన వారెన్ హేస్టింగ్స్ (Warren Hastings) (మనకు సంబంధించినంతవరకూ బెంగాల్ తొలి గవర్నర్, బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనలో కీలక పాత్ర నిర్వహించిన ఘనుడు) ఇంట్లోని గ్రంథాలయం జేన్‌కు విద్యానిధులయ్యాయి. ఇంట్లో నాటకాలు వేయించే సరదా అన్నలకు ఉండడం వల్ల, జేన్ చిన్నప్పటినుంచీ నాటకాలు చూడ్డం, అపుడపుడూ రాసేందుకు కూడ పూనుకోవడం ప్రారంభమయ్యాయి. కామెడీలు ఎక్కువగా చూసినందువల్లనేమో, జేన్ అనంతర రచనల్లో వ్యంగ్యం, ఐరనీ వంటి గుణాలు సహజంగా వచ్చేశాయి. కొంతకాలం కవిత్వం, లేఖాసాహిత్యం రాసిన జేన్, ఒకానొక దశలో ఆలివర్ గోల్డ్‌స్మిత్ (Oliver Goldsmith) హిస్టరీ ఆఫ్ ఇంగ్లండ్‌కు పేరడీ కూడ రాసింది. ఒకసారి, 4వ జార్జి ఆస్థానంలోని ఒక వ్యక్తి, ‘నవలారచన అనగానేమిటి?’ అని ఆమెకు ఉపన్యాసం ఇవ్వగానే అతనిమీద సెటైర్ రాసేసింది. మొదటినుంచీ ఆమెలో నిశితమైన చూపు, హాస్యస్ఫూర్తి కనిపిస్తాయి. తన 18వ యేటే జేన్ ఆస్టిన్ రచనను వృత్తిగా స్వీకరించాలన్న నిర్ణయం చేసుకుంది. ఆమె తన మొదటి నవల లేడీ సూౙన్‍ను (Lady Susan) అప్పటి రచయిత్రులు చాలామందిలా లేఖారూపంలో రాసింది. మగవాళ్ళను తెలివిగా వల్లో వేసుకుని, అవసరం తీరగానే వదిలేసే ఒకమ్మాయి కథ ఇది. జేన్ ఇతర నవలలతో పోల్చి చూస్తే ఇది నిజంగా ఆమె రాసిందేనా అని అనుమానం వస్తుంది. అది పెద్దగా ప్రచారంలోకి రాలేదు. దానికి ముఖ్య కారణం ఒక ప్రచురణకర్త దాన్ని వేస్తానని తీసుకుని బ్యూరోలో పెట్టి తాళం వెయ్యడం. చివరికి జేన్ 1816లో తన వ్రాతప్రతిని అతని దగ్గర్నుంచి లాక్కురాగలిగింది. ఆ నవలలో మార్పులు, చేర్పులు చేసింది. అది నార్తంగర్ ఆబీగా (Northanger Abbey) ఆమె మరణానంతరం ప్రచురింపబడింది.
తన రెండో నవలను 21వ యేట ఫస్ట్ ఇంప్రెషన్స్ అన్న పేరుతో రాస్తే దాన్ని ప్రచురణకర్త తిరస్కరించాడు. అది పాఠకులకు నచ్చదనే భావించివుంటాడు. అనంతరం ఇదే నవల ప్రైడ్ అండ్ ప్రెజుడిస్‍గా మారి, ఆమె స్వయంగా 1813లో దాన్ని ప్రచురించినపుడు అది బ్రిటిష్ సాహిత్య చరిత్రలో అద్భుత కళాఖండంగా నిలిచిపోతుందని ఎవరూ ఊహించివుండరు. 1804 ప్రాంతంలో ది వాట్సన్ అనే నవల మొదలుపెట్టింది జేన్. ఒక రోగగ్రస్తుడైన వ్యక్తి, అతని పెళ్ళికాని నలుగురు కుమార్తెల కథ అది. పేదరికం గురించి, ఆడవాళ్ళు ఎప్పటికీ మగవాళ్ళపై ఆధారపడవలసిన అవసరం గురించి వేదనను వ్యక్తంచేసే ఈ సీరియస్ నవలని ఆమె పూర్తిచేయలేదు. సగం రాసేసరికి తండ్రి మరణించడంతో, తమ పరిస్థితి తన కథలోలా తయారైందని, నవలను ప్రచురిస్తే అందరూ తమ కథే అనుకుంటారనీ భయపడి మధ్యలోనే ఆపేసింది. ఇలా పూర్తి చెయ్యనివి, ప్రచురణకు నోచుకోనివి పోగా, చివరకు మనకు దక్కినవి ఆరు నవలలు: సెన్స్ అండ్ సెన్సిబిలిటీ (Sense and Sensibility, 1811), ప్రైడ్ అండ్ ప్రెజుడిస్ (Pride and Prejudice, 1813), మాన్స్‌ఫీల్డ్ పార్క్ (Mansfield Park, 1814), ఎమ్మా (Emma, 1815), నార్తంగర్ ఆబీ (Northanger Abbey, 1816), పర్సుయేషన్ (Persuasion, 1818). ఆరూ సుప్రసిద్దాలే. కానీ అన్నిటిలోకీ అత్యధిక ప్రజాదరణ పొందిన నవల ప్రైడ్ అండ్ ప్రెజుడీస్ కాగా, విమర్శకుల ప్రశంసలు అత్యధికంగా పొందింది ఎమ్మా.
జీవితంలో ప్రణయం?
జేన్ ఆస్టిన్ నవలలు ఆరింటిలోనూ బ్రిటిష్ సంపన్నుల పైనా, సంప్రదాయవాదుల పైనా చెణుకులు ఎన్నివున్నప్పటికీ, ప్రణయమే ప్రధాన వస్తువు. ఆమెకు స్త్రీపురుషుల ప్రేమబంధం గురించి ప్రత్యేకమైన అభిప్రాయాలుండేవి. ఈ అంశాన్ని ఎంతో సున్నితంగా, వాస్తవికంగా, వివేకంతో చర్చించింది. నిజజీవితంలో ఆమె అవివాహితురాలిగా ఉండిపోయింది. జేన్‌కు ఇరవై యేళ్ళ వయసులో, పక్కింటి చుట్టంగా వచ్చిన టామ్ లెఫ్రాయ్‌తో (Thomas L Lefroy) పరిచయమైంది. ‘అందగాడు, మర్యాదస్తుడు, ప్రసన్నంగా ఉండేవాడు’ అని అక్కకు రాసిన లేఖలో వర్ణించిన టామ్‌తో అతను ఉన్నన్ని రోజులూ ఎంతో సమయం గడిపింది జేన్. ‘అతను ప్రపోజ్ చేస్తే బాగుండునని, తనకు తిరస్కరించే అవకాశం వచ్చేదనీ’ తమ అనుబందాన్ని జోక్‌గా కొట్టిపారేసినా, నిజానికి జేన్ ప్రేమించింది తన జీవితకాలంలో అతనొక్కడినే అని ఆమె జీవిత చరిత్రకారులంటారు. ఐర్లండ్‌కు చెందిన టామ్ కూడా జేన్ లాగే దిగువ మధ్యతరగతికి చెందినవాడు. ఇద్దరిలో ఒక్కరికైనా సంపద ఉండి తీరాలని రెండు కుటుంబాలూ భావించాయి కనక, అతని తల్లిదండ్రులు ఎక్కడ జేన్ ప్రేమలో పడతాడోనని భయపడి, త్వరత్వరగా అతన్ని ఐర్లండ్‌కు పంపేశారు. ఆ తర్వాత అతను ఎప్పుడైనా హాంప్‌షైర్‌కు వచ్చినా జేన్‌ని కలవడానికి ప్రయత్నించలేదు. అనంతరం ఎప్పుడో టామ్ ఒక ఇంటర్‍వ్యూలో తను అప్పట్లో జేన్‌ని ప్రేమించిన విషయం నిజమేనని ఒప్పుకున్నాడు.
చాలా యేళ్ళ తర్వాత, జేన్‌కు ఒక ధనికుడితో వివాహప్రతిపాదన వచ్చింది. అందంగా లేకపోవడమే కాక, దురుసుగా, మొరటుగా ఉండే అతని ప్రవర్తన, స్వభావం జేన్‌కు ఏ మాత్రం నచ్చలేదు. కానీ తండ్రి మరణానంతరం అన్నలు పంపే కొద్దిపాటి డబ్బుతో నెట్టుకొస్తున్న తమకు పేదరికం నుంచి విముక్తి వస్తుందని, అతనితో వివాహానికి ఒప్పుకుంది జేన్. కానీ అదృష్టవశాత్తు అది ఒక్క రాత్రి నిర్ణయంగా మిగిలిపోయింది. రెండో రోజే తను ఎంత తప్పు చెయ్యబోయిందో గ్రహించి, తన తిరస్కారాన్ని తెలిపింది. అక్కడితో ఆమె జీవితంలో ప్రణయం, పెళ్ళి ముగిశాయి. వివాహబంధానికి పరస్పర గౌరవం, ప్రేమ ఎంత ముఖ్యమో తన రచనల్లో పదే పదే చెప్పిన జేన్, ఇలాంటి వివాహం చేసుకునే కంటే అవివాహితగా ఉండిపోవడమే నయమనుకోవడంలో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు.
అన్ని నవలలు అనామిక రచనలే
ఇంతకుముందు అనుకున్నట్టు, 19వ శతాబ్ది నాటికి కూడా ‘రచనను వృత్తిగా స్వీకరించడం’ ‘స్త్రీత్వానికి’ కళంకం. ప్రచురణకర్తను రచయిత్రులు కలవడం, కాంట్రాక్టులపై సంతకాలు పెట్టడం నిషిద్ధం. రచనల ద్వారా సంపాదించడం అనైతికం. అందువల్ల జేన్ కూడ ఏదో ఉబుసుపోకకు రాస్తున్నానే తప్ప, నేనేమంత గొప్ప రచయిత్రిని కానన్నట్టు యథాలాపంగానూ, ‘అనామకం’గానూ తన రచనలు ప్రచురించింది. ఆడవాళ్ళు రాయడం నిషిద్ధం కాదు గానీ దాని వల్ల పేరు ప్రఖ్యాతులు సంపాదించడం మాత్రం ‘అశ్లీలం’ కనక తను సెలబ్రిటీని కాదలుచుకోలేదని ఎప్పటికప్పుడు రచయిత్రులు సూచించాలి. అదే చేసింది జేన్ కూడా.
ప్రచురణకు నోచుకున్న తొలి నవల సెన్స్ అండ్ సెన్సిబిలిటీ మంచి సమీక్షలే దక్కించుకుంది. దానిపై వచ్చిన డబ్బు జేన్‌కు మనోధైర్యాన్నిచ్చింది. తన తొలి నవలపై ఆమె పేరు ‘ఒక మహిళ’. ఆ తర్వాత ప్రచురించిన ప్రతి నవలపైనా ఆమె పేరు ‘సెన్స్ అండ్ సెన్సిబిలిటీ’ రచయిత్రి! తన జీవితకాలంలో జేన్ ఆస్టిన్ ముద్రణలో తన పేరు చూసుకోలేకపోయింది. ఆమె నవలల్లో విమర్శకులకు అంత నచ్చకపోయినా పాఠకులకు నచ్చినది మాన్స్‌ఫీల్డ్ పార్క్. అందరికీ అమితంగా నచ్చినవి ప్రైడ్ అండ్ ప్రెజుడీస్, ఎమ్మా. నార్తంగర్ ఆబీ, పర్సుయేషన్, ఆమె మరణానంతరం సోదరులు ప్రచురించారు.
జేన్ 1816 నుంచి అనారోగ్యంగానే ఉన్నా, తనకేమీ కాలేదని తననూ, ఇంట్లో వాళ్ళనూ నమ్మిస్తూ గడిపింది. 1817లో తన 41వ యేట మరణించేవరకూ ఏదో ఒకటి రాస్తూనే ఉంది. మరీ నీరసించి రాయలేని స్థితి వచ్చేవరకూ. అప్పటికి ఆమె వ్యాధి ఏమిటో తెలియదు కానీ ఆమె జీవిత చరిత్ర రాసిన వాళ్ళు కేన్సర్‌తో మరణించిందని నిర్థారించారు. జేన్ ఆస్టిన్ గురించిన వివరాలు కొన్నయినా తెలీడానికి ఆధారం ఆమె మేనల్లుడు ఆస్టిన్ లే (Austin Leigh) 1869లో రాసిన ఆమె జీవిత కథ, అక్క కసాండ్రా తగలబెట్టగా మిగిలిన ఆమె లేఖలు (ఈ లేఖలన్నీ అక్కకు రాసినవే). 20వ శతాబ్దిలో ఆమె గురించి 40కి పైగా పుస్తకాలు వచ్చాయి.
బ్రిటిష్ నవలా పీఠంపై మహారాణిలా వెలిగిన, వెలుగుతున్న జేన్ ఆస్టిన్ తన జీవితకాలంలో చెప్పుకోదగ్గ ప్రశంసలూ అందుకోలేదు. ధనమూ సంపాదించలేదు. రెండు శతాబ్దాలుగా రొమాంటిక్ హీరో అంటే డార్సీ, రొమాంటిక్ హీరోయిన్ అంటే ఎలిజబెత్ (ప్రైడ్ అండ్ ప్రెజుడీస్) అన్నంతగా ప్రణయ నవలలకు ప్రోటోటైప్‌లలా నిలిచిపోయిన ఆ పాత్రల సృజనతో, అద్భుతమైన కథనంతో మన హృదయాల్లో తిష్టవేసిన ఆమె రచనలు, 19వ శతాబ్దిలో విమర్శకుల దృష్టిని ఆకర్షించడానికి మాత్రం చాలా కాలమే పట్టింది.
అనామక రచయిత్రి ఐకన్‍గా ఎలా మారింది?
జేన్ ఆస్టిన్‌ను ఈనాటికీ పాఠకులే కాదు ప్రభుత్వాలు కూడ గుర్తుంచుకున్నాయని చెప్పుకున్నాం. ఆమె 200వ వర్ధంతి సందర్భంగా 2017లో బ్రిటిష్ ప్రభుత్వం ఆమె ఆకృతితో 10 పౌండ్ల నోటును ముద్రించడమే దానికి నిదర్శనం.
అయితే, తను జీవించివున్నంత కాలం జేన్ ఆస్టిన్‌కు అభిమానులు లేరు. ఆమె నవలలకు సమీక్షలు కూడ తక్కువే. ఆమె పేరు లేకుండా నవలలు ప్రచురింపబడ్డప్పటికీ, అందరికీ అవి జేన్ రాసినవని తెలుసు. కానీ అంతమాత్రాన వ్యక్తిగతంగా ఎటువంటి ఆరాధనలు, గౌరవాలూ ఆమెకు అందలేదు. 1817లో ఆమె మరణిస్తే, 1833 నాటి పునర్ముద్రణలో తొలిసారిగా ఆమె పేరు రచయిత్రిగా ముద్రింపబడింది. ప్రచురించగానే సంక్షిప్తసమీక్షలకు నోచుకున్న నవలలు మూడు: సెన్స్ అండ్ సెన్సిబిలిటీ, ప్రైడ్ అండ్ ప్రెజుడీస్, ఎమ్మా. కానీ ఆ సమీక్షలు ‘నవలద్వారా ఆమె అందించిన నీత్యుపదేశాని’కే పరిమితమయ్యాయి.
మొట్టమొదటిసారి జేన్ ఆస్టిన్‌ను ఒక మంచి రచయిత్రిగా గుర్తిస్తూ, ప్రశంసిస్తూ రాసిన మహానుభావుడు, చారిత్రక నవలారచనలో దిట్ట అయిన సర్ వాల్టర్ స్కాట్ (Walter Scott). 1816లో మారు పేరుతో ముద్రించిన ఆయన సమీక్షలో ‘తన చుట్టూ ఉన్న సమాజాన్ని, జీవితాన్ని అతి వాస్తవికంగా, గొప్ప నైపుణ్యంతో చిత్రించిన రచయిత్రి’గా మెచ్చుకున్నాడు. (మహిళలను పొగడ్డానికి ఆయన కూడ మారుపేరుతో రాయాల్సివచ్చిందేమో!)
మళ్ళీ వాల్టర్ స్కాటే, 1826లో తన జర్నల్‌లో ప్రైడ్ అండ్ ప్రెజుడిస్ నవలలో పాత్ర చిత్రణ అద్భుతంగా ఉందని ప్రశంసిస్తూ, ఇంత ప్రతిభావంతురాలైన రచయిత్రి అంత త్వరగా మనల్ని వీడిపోవడం ఎంతో బాధాకరమని అన్నాడు. అనంతర కాలంలో ఒక ఐకన్‌గా నిలిచిన ఈ నవల ప్రత్యేకతను మొట్టమొదట గుర్తించిన వ్యక్తి స్కాట్.
అదే సమయంలో జేన్ ఆస్టిన్ నవలల్లోని ఐరనీని అర్థం చేసుకోలేక ఆమె నీతిని ఉపదేశించడానికి నవలను మాధ్యమంగా చేసుకుందని పొరబడిన సమీక్షకులెందరో. మరికొందరు, ఆమె మరీ వాస్తవికంగా రాయడానికి కారణం, ఆమెలో కల్పనాశక్తి లేకపోవడమే అని కొట్టిపారేశారు. ఆమె కల్పనాశక్తి పాత్ర చిత్రణలో, సన్నివేశ కల్పనలో, అప్రత్యక్ష సంవాదంలో (ఇన్‌డిరెక్ట్ స్పీచ్) ఎంత గొప్పగా కనిపిస్తుందో అర్థం చేసుకునేంత పరిజ్ఞానం వాళ్ళకు లేకపోయింది!
జేన్ ఆస్టిన్ సీరియస్‌గా పరిగణించాల్సిన రచయిత్రి అని స్కాట్‌తో పాటే గుర్తించిన సమీక్షకుడు రిచర్డ్ వేట్‌లీ (Richard Whately). 1821లో క్వార్టర్లీ రివ్యూ పత్రికలో ఆయన జేన్ ఆస్టిన్ రచనల్ని విశ్లేషిస్తూ, నాటకీయ సంవిధానంలో హోమర్‌తో, షేక్స్‌పియర్‌తో ఆమెను పోల్చాడు. నిజానికి అప్పట్లో నవల ఒక సాహితీ ప్రక్రియగానే వివాదాస్పదంగా ఉంది. అది కేవలం కాలక్షేప ప్రక్రియ అనీ దాన్ని లోతుగా పరిశీలించనవసరం లేదనీ ఒక వర్గం వాదిస్తున్న రోజులవి. (తెలుగులో ఆ దౌర్భాగ్యం ఇంకా పూర్తిగా వదలలేదు.) అటు వాల్టర్ స్కాట్, ఇటు వేట్‌లీ ఇద్దరూ జేన్ ఆస్టిన్ నవలల్ని ఉదాహరణగా చూపుతూ నవల ఎంత ఉదాత్తమైన ప్రక్రియో చూడండి అంటూ సవాలు విసిరారు. మహిళల కోణం చూపిన తొలి నవలారచయిత్రిగా ప్రశంసిస్తూ వేట్‌లీ ‘we suspect one of Miss Austin’s great merits in our eyes to be, the insight she gives us into the peculiarities of female characters… Her heroines are what one knows women must be, though one never can get them to acknowledge it.’ అన్నాడు. అయితే, అమెరికన్ రచయితల్లో మార్క్ ట్వయిన్‌కు (Mark Twain) ఆమె నవలలు ఏ మాత్రం నచ్చలేదు; దానికి ఆయన సహేతుకమైన కారణాలు కూడ ఇవ్వలేదు. మరో గొప్ప అమెరికన్ నవలారచయిత హెన్రీ జేమ్స్ (Henry James) మాత్రం ఆమెను అందలం ఎక్కించాడు. ఆమెను షేక్స్‌పియర్, సెర్బాన్తెస్, హెన్రీ ఫీల్డింగ్‌లతో ఒక సందర్భంలో పోల్చిన ప్రముఖుడు హెన్రీ జేమ్సే.
మొత్తం మీద, స్కాట్, వేట్‌లీల పుణ్యమాని జేన్ ఆస్టిన్ నవలలపై 19వ శతాబ్ది ఉత్తరార్ధంలో ఆమె ప్రతిష్ట ఇనుమడించింది. 20వ శతాబ్ది వచ్చేసరికి ఆమె రచనలు విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశంగా మారడంతో, ఆమె రచనల గురించి చర్చలు, సిద్ధాంత గ్రంథాలు, అధ్యయనాలు మరింత పెరిగాయి. అయితే ఆమె నవలల్ని ఎలా అర్థంచేసుకోవాలి? అన్న విషయంపై తర్జనభర్జనలు కొనసాగుతూనే వచ్చాయి. ‘తను ఏ రకం వ్యక్తులను అసహ్యించుకుందో, వాళ్ళు తన నవలల్ని చదివి ఆనందించేలా చేయడమే ఆమె లక్ష్యం’ అని వ్యాఖ్యానించాడు విమర్శకుడు హార్డింగ్ (D.W. Harding). దీనికి ఆమె ఐరనీని వాడుకుందని, అది అందరికీ కొరుకుడు పడలేదనీ ఆయన వాదించాడు. విక్టోరియన్ విమర్శకులు జేన్ ఆస్టిన్ రచనల్లోని లోతులను అర్థం చేసుకోకుండానే ఆమె అభిమానసంఘాల్లో ఉండిపోయారని ఆయనన్నాడు. మరో సుప్రసిద్ధ విమర్శకుడు లెవిస్ (F. R. Leavis) కూడ దాదాపు ఇదే అభిప్రాయాన్ని ప్రకటించాడు. జేన్ ఆస్టిన్ అగ్రశ్రేణి నవలాకారుల జాబితాలో చేరడానికి, ఆమెపై అధ్యయనాలు పెరగడానికి ఎఫ్. ఆర్. లెవిస్, ఐన్ వాట్ (Ian Watt) వంటి మరికొందరు ఆమెను ప్రశంసించడం కూడ దోహదం చేసింది. ముఖ్యంగా నవలా ప్రక్రియను నిశితంగా అధ్యయనం చేసిన ఐన్ వాట్, ఆ ప్రక్రియను పరిపుష్టం చేయడంలో జేన్ ఆస్టిన్ నిర్వహించిన పాత్రను ప్రత్యేకంగా పేర్కొన్నాడు. అంటే కేవలం ఒక రచయిత్రి నవలలో పాత్రలు, కథనం, వస్తువు, నిర్వహణ బాగున్నాయని కాక, అసలు ఆ ప్రక్రియకే వన్నె తీసుకువచ్చింది ఆమె రచన అని చెప్పడం ద్వారా ఆస్టిన్ రచనల విమర్శకు అతను కొత్త చూపును అందించాడు. అప్పటికింకా స్త్రీలు విమర్శకులుగా గుర్తింపు పొందలేదు కనక పురుషుల విమర్శలే రచయిత్రుల ప్రతిభకు కొలమానాలయ్యాయి.
కానీ, జేన్ ఆస్టిన్ పూలతో పాటు రాళ్ళూ అందుకుంది. ఆమె నవలల్లో స్త్రీపురుషుల అనుబంధాల్లో ఉండాల్సిన భావోద్వేగం, ఉద్విగ్నత ఉండవని, పాత్రలన్నీ చాలా యథాలాపంగా ప్రవర్తిస్తాయని, అందువల్ల పాఠకులకు కూడా ఆసక్తి కలగదనీ మరో ప్రముఖ రచయిత్రి షాలట్ బ్రాంటి (Charlotte Brontë) -జేన్ ఇయెర్ (Jane Eyre) రచయిత్రి- వ్యాఖ్యానించింది. ఆమె నవలలు సమకాలీన సామాజిక పరిణామాలను చిత్రించవని, పాత్రలను బట్టి చూస్తే ఆమె నవలలు విషాదాంతాలు కావలసివుండగా, కృతకంగా సుఖాంతాలు చేసిందనీ అన్నవాళ్ళూ ఉన్నారు.
20వ శతాబ్ది నాటికి పైన చెప్పుకున్న అన్ని కూటముల వాళ్ళూ జేన్ ఆస్టిన్‌ని స్వంతం చేసుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. వీటన్నిటికంటే భిన్నంగా పూర్తి ఫెమినిస్టు కోణం నుంచి ఆమెను అంచనా వేసిన రచన, శాండ్రా గిల్బర్ట్ (Sandra Gilbert), సూౙన్ గూబర్ (Susan Gubar) రాసిన ది మాడ్ ఉమన్ ఇన్ ది ఆటిక్ (The Mad woman in the Attic, 1979). ఈ శీర్షిక వింటేనే, జేన్‌ని వెక్కిరించిన షాలట్ బ్రాంటి నవల ఆధారంగా పెట్టినదని అర్థమవుతుంది (జేన్ ఇయెర్‌లో మాడ్ వుమెన్ గుర్తుకు వస్తుంది). 19వ శతాబ్ది బ్రిటిష్ రచయితలను నూతన దృక్పథంతో అంచనా వేసిన ఈ గ్రంథంలో జేన్ ఆస్టిన్ గురించి కూడ ఆసక్తికరమైన విశ్లేషణ ఉంది. రచయిత్రులు శాండ్రా, సూౙన్, జేన్ నవలల్లో 19వ శతాబ్ది రచయిత్రులకు సమాజంపై ఉన్న అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తమవుతాయని వాదించారు. జేన్ ఆస్టిన్ కేవలం ఒక రచయితగా రాయలేదని, ‘ఒక స్త్రీ’గా కూడా రాసిందనీ వాళ్ళన్నారు. ఆమె పాత్రలు పైకి సమాజ సూత్రాలకు అనుగుణంగా ప్రవర్తించినట్లు కనిపించినా, వారి మాటల్లో అంతర్లీనంగా ఒక ఎగతాళి, తిరస్కారం, ప్రతిఘటన ఉంటాయని వాళ్ళు విశ్లేషించారు. అక్కడినుంచి ఆమె నవలల విశ్లేషణ కొత్తదారులు తొక్కింది. వీరి విమర్శలు ‘అతిగా’ ఉన్నాయన్న ఆరోపణలు కూడ మొదలై, ఇంకా ఆస్టిన్ నవలల మీద చర్చ కొనసాగుతోంది.
దృశ్యమాధ్యమాల్లో జేన్
1900-1975 లోగా జేన్ ఆస్టిన్ నవలల ఆధారంగా సినిమా, రేడియో, టెలివిజన్‌లలో 60కి పైగా రూపకల్పనలు వచ్చాయి. అన్నీ జేన్ రచనలకు పూర్తి విధేయంగా లేవు. 1970 తర్వాత బి.బి.సి. రూపొందించిన టీవీ సినిమాలో మాత్రం జేన్ ఆస్టిన్ నవలలకు పూర్తి న్యాయం జరిగిందని ఎక్కువమంది అభిప్రాయం. ఆ తర్వాత ఎక్కువ ప్రజాదరణ పొందింది 2005లో వచ్చిన హాలీవుడ్ సినిమా. ఎలిజబెత్ బెనెట్‌గా అత్యధికంగా మార్కులు కొట్టేసింది ఈ సినిమాలో కీరా నైట్లీ. 2004లో భారతీయ నేపథ్యంలో, భారతీయ దర్శకురాలు గుర్విందర్ ఛద్దా ఇంగ్లీష్, హిందీ, పంజాబీ భాషల కలగలుపుగా నిర్మించిన బ్రైడ్ అండ్ ప్రెజుడీస్ ఫరవాలేదనిపించుకుంది. (ఇందులో ఎలిజబెత్ పాత్రధారిణి ఐశ్వర్య రాయ్.)
అలాగే ఎమ్మా నవల కూడ చాలాసార్లే దృశ్యమాధ్యమంలోకి వచ్చింది. బాలీవుడ్‌లో కూడ సోనమ్ కపూర్ నాయికగా 2010లో ఆయేషా పేరుతో ఎమ్మా నవల రూపొందింది. ఇటీవలే 2020 లోనూ మరోసారి హాలీవుడ్‌లో ఎమ్మా సినిమాగా వచ్చింది.
ఇలా, చనిపోయిన 200 ఏళ్ళ తర్వాత కూడా ఇంకా విశేషంగా అమ్ముడుపోతున్న నవలలతో, అందరినీ అలరిస్తున్న సినిమాలతో విజయపతాకం ఎగరేస్తున్న జేన్ ఆస్టిన్ నవలల పరిచయం వచ్చే సంచికలో.