చర్చకు ఆస్కారమెక్కడున్నది?

‘చేపకు ఎగరడం రాదు! పక్షికి ఈదడం రాదు!’ అంటూ ఉన్న గొప్పతనాన్ని గూర్చి చెప్పడం కాక లేనిదాన్ని పైకెత్తి చూపించడం ఈకాలంలోనే కాక ఎనభయ్యేళ్ళ క్రితం పరిస్థితి కూడా అని రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మగారి, శ్రీపాద గోపాలకృష్ణ మూర్తిగారి వ్యాసాలు స్పష్టంచేశాయి. ఈనాటికీ అప్పటికీ తేడా అల్లా, శర్మగారి వ్యాసం ఉన్నదానిమీదే కొద్దిగా ఎక్కువగా కేంద్రీకరించింది. అయినా, లేనిదాని మీద మూడు పేరాల్లో పెద్ద వ్యాఖ్యలనే చేసింది. శ్రీపాదవారి వ్యాసం ఎక్కువగా సాహిత్యం మీదే అవడం వల్ల పైకెత్తడం మీద కాక ఎత్తిపడెయ్యడం మీదే కేంద్రీకరించింది.

త్యాగరాజుకి వాగ్గేయకారుడిగా పేరున్నది గనుక ఆయన పరిపూర్ణతని పూర్తిగా చర్చించాలంటే ఆయన గాత్రాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. కానీ, విన్నవాళ్ళు ఎవరూ మిగల్లేదు గనుక అది కుదరక చర్చ ఆయన సంగీత సాహిత్యాలకే పరిమితమయింది.

‘ఆయన తెలుగుభాష నాలుగైదు తరాలుగా తమిళదేశంలో నిలబడి సహజమైన పెరుగులూ మెరుగులూ చాలావరకు కోలుపోయింది; జడ్డుగట్టింది’ — అన్న అసంబద్ధమైన వ్యాఖ్య పండితులు, కీర్తిశేషులు శర్మగారి నించి వెలువడడం జీర్ణించుకోలేని విషయం. కారణం: త్యాగయ్య స్థల, కాలాలనాటి భాషని శర్మగారు తన పాండిత్యం తోను ఇంకొంతమంది వాగ్గేయకారుల రచనల తోను పోల్చడం. నాకు తెలిసినంత వరకూ అన్నమయ్య కీర్తనలని జనబాహుళ్యం లోకి తీసుకువచ్చిన వారిగా శర్మగారు ప్రసిద్ధులు. ‘త్యాగయ్య వ్యాకరణ నియమాలు ఉల్లంఘించినాడనే కాదు నా మనవి. ఆ ఉల్లంఘన సహజమైన సరళమార్గంలో నడవలేదనే’ అన్నారు శర్మగారు. సహజమైన, సరళమైన మార్గం కృష్ణా, గోదావరీ తీరాలకే పరిమితమయి, కావేరీ తీరానికి చేరలేదనా అర్థం?

‘…బాల భావాలు ఆయన రచనలో పడి నిలిచినవి. చెప్పవలసిన భావాలు స్పష్టంగా, సరళంగా చెప్పగల ఓర్పో, శక్తియో లేక వాక్యమూ ఛందస్సూ ముగిస్తే చాలునని ముందుకుపోయిన రచన యెంతో ఉన్నది. కాబట్టి ఎన్నో కీర్తనలలో అర్థమిప్పటికీ అస్పష్టంగానే నిలబడింది’ — అన్నమయ్య కీర్తనలలో కూడా చాలా పదాలు ఈనాడు జనబాహుళ్యంలో దొర్లనివే, నిఘంటువులలో దొరకనివే, త్యాగయ్యకి మూడు శతాబ్దాల ముందువే, ఈనాడు అర్థం కానివే. వాటికి జడ్డుతనాన్ని ఆయన ఆపాదించలేదు. ఇంక వాక్యమూ ఛందస్సుల విషయానికొస్తే శర్మగారితో విభేదించడానికేమీ లేదు కానీ, ఎదురయ్యే ప్రశ్న: ఆ దారిలో విశ్లేషణ అవసరమా?

శర్మగారు పేర్కొన్న ఇతర వాగ్గేయకారులు తమ రచనలకి తామే అక్షరరూపాన్ని ఇచ్చినవారు. త్యాగయ్య భిక్షాటన చేస్తూ తనకి తెలిసిన భాషలో ఆశువుగా పాడుకుంటుండగా వెనక నడచిన శిష్యబృందం వాటిని వ్రాసుకున్నారని, అందుకే ఆయన శిష్య సంప్రదాయాల్లోనే కీర్తనలలో తేడాలు కనిపిస్తాయనీ సార్వజనీనం. అందువల్ల, త్యాగయ్య కీర్తనల లోని ఛందస్సుని విమర్శించడం గానీ వెలిబుచ్చిన భావాల్లోని లోపాలని ఎత్తిచూపడం గానీ ఏమాత్రం అర్థవంతం కాని విషయాలు.

‘కనుక తెలుగు సాహిత్యంలో ఇతర మహాకవుల రచనలు చవిచూచిన నాలుకకు త్యాగయ్య కవితలోని రసం చాలదు. మాట సాహసమైతే మన్నించండి’ అన్నారు శర్మగారు. కవిత్రయం లాగా కాక త్యాగయ్య, పోతన తమ రచనలని తమకోసం చేసుకున్నవారు. కవిత్రయాన్ని గానీ పోతనని గానీ లేదా ఈనాటి అవధానులని గానీ సంగీతం రాదని విమర్శించడం ఎంత సబబో త్యాగయ్య సాహిత్యాన్ని విమర్శించడం కూడా అంతే సబబు. (ఇంకొక అడుగు ముందుకేసి, ఆయన కీర్తనలు భౌతిక శాస్త్రపరంగా గాని, గణిత శాస్త్రపరంగా గానీ ఎంత దయనీయ స్థితిలో ఉన్నాయో కూడా వ్యాసాలు రాయచ్చు.) సంగీతపరంగా కాని, సాహిత్యపరంగా కాని, పండితులని మెప్పించడానికి త్యాగయ్య కంకణం కట్టుకోలేదు అన్నది జగద్విదితం. అన్నమయ్యకి సంగీతం ఎంతవచ్చో మనకు తెలియదు; దొరికిన ఆయన తామ్రపత్రాల్లో రాగం పేరు కనిపించగానే ఆయనకి సంగీతంతో పరిచయం ఉన్నది అని మాత్రం అనగలం గానీ సంగీతం వచ్చు అని నిర్ధారించలేము కదా? శర్మగారి పాండిత్యం తెలుగు, సంస్కృత సాహిత్యాలలో. ఆ పరికరాన్ని త్యాగయ్య కీర్తనలని విమర్శించడానికి ఉపయోగించడం దురదృష్టకరం.

నా ఈ విమర్శ ఈనాడు అవసరమా అని ఎవరయినా ప్రశ్నిస్తే దానికి తిరుగు ప్రశ్న, ఈ వ్యాసం ప్రచురించడం ఈనాడు ఎందుకు అవసరం అనిపించింది? అని. ఈ వ్యాసము, శ్రీపాదగారి వ్యాసమూ రెండూ సంపాదకీయంలో ప్రస్తావించబడ్డాయి గనుక – అని జవాబు రావచ్చు. ఆ సంపాదకీయానికి అవసరం? ఒక గాయకుడికి ప్రకటించిన పురస్కారం లేపిన దుమారం. కారణం, త్యాగయ్య మీద ఆ గాయకుడి వ్యాఖ్యలని కొందరు అనుచితాలనడం. శ్రీపాదవారు తమ వ్యాసంలో ‘తెలుగుజాతికి ఆయన ఘనతను చూపించేయత్నంలో పైపండితుల యుత్సాహశకటము సంగీతరస్తా తప్పి సాహిత్యరస్తాలో సుదూరము సాగిపోయినది’ అన్నారు కానీ ఆయన కూడా ఆ తప్పిన దారిలోనే నడిచి, ‘సంగీతకళకు ఔన్నత్యము చేకూర్చిన కారణము చేతనే త్యాగరాజునకు గౌరవము వచ్చినది కాని అందమైన సాహిత్యభావములను వెలిబుచ్చినందుకు కాదు’ అనీ అన్నారు. ‘గౌరవం ఇవ్వ’మని త్యాగయ్య ఎవరినయినా దేబిరించాడా? ‘త్యాగరాజస్వామి చేతుల్లో సంగీతము సౌందర్యాన్నీ సౌశీల్యాన్నీ అలవర్చుకుంది. ఈ కారణాల చేత ఆయన రచనలకి వ్యాప్తి వచ్చింది కాని ఆ కీర్తనలలోని సాహిత్యభావాలవల్ల కాదు’ అని కూడా ఆయన పేర్కొన్నారు. చదవగానే ‘But, Brutus is an honorable man!’ గుర్తుకు రాలేదూ?

శ్రీపాదవారి ఇంకొక హాస్యాస్పదమైన వ్యాఖ్య, ‘కీర్తన చెఱకుగడ అయితే సాహిత్యము పిప్పీ సంగీతము రసమూను.’ సినిమా సంగీతానికి అద్భుతమైన సాహిత్యాన్ని అందించారని పేరెన్నిక గన్న సముద్రాల, దేవులపల్లి, ఆత్రేయ, సినారె, ఆరుద్ర, వేటూరి, సిరివెన్నెల మాత్రమే కాక ఆ సాహిత్యాన్ని ఆనందంగా ఆస్వాదించిన వాళ్ళందరూ ఈ పిప్పి అన్న చిత్రీకరణకు పడి పడి నవ్వక మానరు. కానీ, అది వ్యక్తిగతమైన అభిప్రాయం అని పూర్తిగా తీసివెయ్యలేకపోవడానికి కారణం ఈ వ్యాసాన్ని ఈమాట సంపాదకీయానికి తోడుగా ప్రచురించడం.

శ్రీపాదవారు ఇంకొక అడుగు ముందుకేసి, ‘నేటి ఆంధ్ర గాయకులు త్యాగరాజుకంటె సాహిత్యాభిమానం బలిసినవారు కనుక, అడ్డదిడ్డపు విరుపు వచ్చినప్పుడు వెనకటి చరణంలోని అక్షరాల్ని ఎరువు తెచ్చుకుని, ‘గో-పురద్వారమున’ ‘శివమనో-విధ మెరుగరు’ అని పాడుతూ…’ అని మొదలుపెట్టి, ‘వెనక పదాల్ని ఈడ్చుకువచ్చి, సాహిత్యం పాడవకుండా రక్షించాలని కంకణము కట్టుకొని సంగీతంలోని అందం చెడగొట్టడానికి మనకేమి హక్కున్నది?’ అన్న ప్రశ్నతో పేరా ముగిస్తారు. శ్రోతలకి సాహిత్యాన్ని స్పష్టపరచడంకోసం గాయకులు చేసే కృషిని ఏమాత్రం సహించక, పైగా ‘సాహిత్యాభిమానం బలిసినవారు’ అని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యతోపాటు, శ్రోతలని, ‘మీకు అర్థం కాకపోతే మీ చావు మీరు చావండి, ఇక్కడ సంగీతానికి మాత్రమే ప్రాముఖ్యత!’ అన్న అహంకారంతో చేసిన ఆదేశాన్ని చూసిన నాకు నోట మాట రాలేదు. దీనినా సంపాదకీయం ప్రామాణికంగా చూపించడానికి వాడుకున్నది!

‘త్యాగరాజు కీర్తనలు కబీరు కవిత్వాన్ని మించి పోయాయని రాసిన సంగీత సుధానిధులు సంగీతాన్ని గురించిన తమ అభిప్రాయాన్ని సాహిత్య వీధుల్లోకి తోలేరంటాను’ – ఇది వారి ఇంకొక వ్యాఖ్య. ‘సంగీత సుధానిధులు’ అన్న వ్యంగ్యాన్ని పక్కన పెడితే, వ్యక్తిగత ప్రతిపాదన అయినా గానీ, ఇది ఇంకొక అనవసరమైన వ్యాఖ్య.

శ్రీపాదవారి ‘ఇంతకూ చెప్పబోయేదేమిటంటే త్యాగరాజుని సాహిత్యపుటద్దాలతో కాదు చూడవలసినది. ఇంతవరకూ మన దురదృష్టమువల్ల సాహితీపరులే త్యాగరాజుని పట్టుకున్నారు’ అన్న వాక్యాలు అప్పటిదాకా ఆయన వెలిబుచ్చిన వ్యంగాన్నీ, అనవసర వ్యాఖ్యలనీ కొద్దిగా పక్కన పెట్టినట్టున్నా గానీ, అనర్థం జరిగిపోయింది. ఇంక అడుసులో కూరుకుపోయిన కాలిని గాని, విసిరిన రాయిని గానీ వెనకకు తీసుకోవడం సాధ్యం కాదు.

పైన పేర్కొన్న కారణాలవల్ల రాళ్ళపల్లి, శ్రీపాద వారి వ్యాఖ్యలని వ్యక్తిగత అభిప్రాయాలుగా తప్ప ప్రామాణికంగా తీసుకోవలసిన అవసరం ఏమాత్రం లేదు అన్న నిర్ధారణని పక్కన పెడితే, ఆ వ్యాసాల్లో గాని, ఈమాట సంపాదకీయంలో గానీ ప్రస్తావించబడనిది, సంగీత కళానిధి పురస్కార గ్రహీతగా ప్రకటించబడిన వ్యక్తి త్యాగయ్య కృతులలో హీనంగా పోల్చబడిన కొన్ని వర్ణాల గూర్చి పేర్కొన్న అంశాల గూర్చి. ‘పామరులనించి దూరంగా ఉంచు’ అంటూ స్పష్టంగానే కొన్ని కీర్తనల్లో ఉంటుంది. ‘వగవగగా భుజియించు’ అన్నదాన్ని ‘ఆత్రంగా తినడం’ అని నేను అర్థం చేసుకున్నాను గానీ ఈమధ్య ఎక్కడో దాన్ని ఒక వర్ణానికి సంబంధించిన విషయంగా చదివి ఆశ్చర్యపోయాను.

పంచరత్న కీర్తనలుగా* చెప్పబడే వాటిలో ‘దుడుకు గల నన్నేదొర కొడుకు బ్రోచురా’ అన్న కీర్తనలో ‘మొదటి కులజుడనుచు భువిని శూద్రుల పనులు సల్పుచును ఉంటిని గాక’ అని ఒక చరణం చివరిలో వస్తుంది. ఇంతకు ముందు చెప్పినట్లే, ఇది తన సమకాలీన సమాజంలో మసలిన త్యాగయ్య తనకోసం రాసుకున్న కీర్తన. దాన్ని ‘నేర్చుకుని పాడండి!’ అని ఆయన ఎవరినయినా ఆదేశించాడా లేక నిర్బంధించాడా? ఆయన రచించాడని చెప్పే 72 వేల కీర్తనలలో ఈనాడు లభ్యమయ్యేవి కొన్ని వందలు మాత్రమే. వాటిల్లో వర్ణాలని తక్కువ చేసినట్టు కనిపించేవి ఎన్ని? కనిపించినవాటిని అభ్యంతరకరంగా భావించేవాళ్ళు ఆ చరణాలని లేదా ఆ కీర్తన(ల)ని పాడక్కర్లేదు. కానీ, సంగీతాన్ని ఆయన కీర్తనలద్వారా గురుముఖతా నేర్చుకుని, పాడి పేరు తెచ్చుకుని, ‘త్యాగయ్య గొప్పవాడేం కాదు’ అని నిర్ధారించడం, విమర్శించడం పాలు తాగిన రొమ్ముని గుద్దడమే.

[*ఈ నామకరణం త్యాగరాజు చేసింది కాదు; క్రిత శతాబ్దం మొదట్లో అరైకుడి రామానుజం అయ్యంగార్, బెంగుళూరు నాగరత్నమ్మగార్లు చేశారని మా గురువుగారు, పట్టమ్మాళ్‌గారి సోదరుడు కీ.శే. డి. కె. నాగరాజన్ (ఇద్దరూ కూడా రామానుజం అయ్యంగార్ వద్ద సంగీతం నేర్చుకున్నవారే) సెలవిచ్చారు.]

ఆ గాయకుడి గూర్చిన ప్రశ్నలు అతని వ్యక్తిత్వానికి సంబంధించినవి. అయినా, మద్రాస్ మ్యూజిక్ అకాడెమీ ఒక ప్రైవేట్ సంస్థ; నిష్పాక్షికంగా వ్యవహరిస్తుందన్న అపప్రథకు ఏనాడూ గురి కానిది. అస్మదీయులని పైకెత్తడం కానీ తస్మదీయులని కిందకు తొయ్యడం కానీ వాళ్ళ ఇష్టప్రకారం చేయవచ్చు, ఇంతకు ముందు చేశారు కూడా. ఉదాహరణకి, మళయాళీలయిన చెంబై వైద్యనాథ భాగవతార్, ఎం. డి. రామనాథన్ లాంటి వాళ్ళకి వీలయినంతవరకూ ఆ పురస్కారాన్ని ఇవ్వకుండా ఉండడానికే ప్రయత్నించారు. కన్నడ, తెలుగు, మళయాళీలు ఎంత తక్కువ సంఖ్యలో ఆ పురస్కారానికి ఎంపిక కాబడ్డారో స్వయంగా పరిశోధించి తెలుసుకోవచ్చు.

ఆ పురస్కార గ్రహీతగా పేర్కొన్న గాయకుడు విడుదల చేసిన ఒక సీడీని (Rare Thyagaraja kritis) కొని వింటే చరణాల మాట అటుంచి అందులోని పల్లవులలోని పదాలు కూడా నాకు అర్థం కాలేదు. “మహానుభావా, తెలుగొచ్చిన నాకే ఈ పరిస్థితి అయితే, పాపం, ఎప్పుడూ వినని మిగతా భాషలవాళ్ళ సంగతి ఏమిటండీ?” అని ఆయనకి ఈమెయిల్ పంపాను. “కర్ణాటక సంగీతానికి సాహిత్యం అనవసరం అంటూ ఒక పుస్తకాన్ని రాశాను,” అని ఆయన జవాబిచ్చాడు. “అలాంటప్పుడు ఆ-ఆ-ఇ-ఈ లనో క-కా-కి-కీ-లనో అంటూ నువ్వు పాడుకోవచ్చుగా?” అని తిరుగు ప్రశ్న వెయ్యడం అనవసరం అనిపించి ఇంక అతన్ని వదిలేశాను. పాశ్చాత్య సంగీతంలాగా కంపోజిషన్‌లకి స్కోర్ షీట్ తయారు చేసుకుని ఉత్త స్వరాలని తన్నన్నా అంటూ తానే పాడుకోవచ్చు. (కర్ణాటక సంగీతంలో వాయిద్య సంగీతానికి కూడా ఆదరణ లభించడం కేవలం ఆ కీర్తనల వల్లనే సాధ్యమయింది.) కానీ అలా చెయ్యడం లేదే? పైగా, సదాశివబ్రహ్మం రాసిన ‘పిబరే రామరసం’ని కాస్తా ‘పిబరే ఏసురసం’ అంటూ మార్చి పాడాడు. (దీనినేనా, సంప్రదాయం ఆశించే యథాతథస్థితిని అతను ప్రశ్నించడం, దాని పునాదులు కదిల్చే ప్రయత్నాలు చెయ్యడం అంటూ సంపాదకీయంలో ప్రస్తావించింది?) కర్ణాటక సంగీతంలో అమర్చిన క్రీస్తు మీది పాటలు (ఉదాహరణకి, ఏసు నామమె పావనము, నడిపించు నా నావ) 1967లోనే ఆల్ ఇండియా రేడియోలో వచ్చాయి. రెండు పంథాలకీ తేడా లేదూ?

త్యాగయ్యతో కలిపి మూర్తిత్రయంగా పేర్కొనబడే దీక్షితార్, శ్యామశాస్త్రిల కీర్తనలు ఒకటి, మహా అయితే రెండుకి మించి కచేరీల్లో ఆనాడూ ఈనాడూ కూడా వినబడవు. కారణం, దీక్షితార్ ఎంత అందగా రాసినా, భక్తికే ప్రాధాన్యం ఇచ్చినా ఆయన ఎన్నుకున్న భాష సంస్కృతం – నాడూ నేడూ కూడా చాలామందికి అర్థం కాని భాష. శ్యామశాస్త్రి విషయంలో, తెలుగులోనే రాసినా తరచుగా విన్న తెలుగు కీర్తనలనే శ్రోతలు కోరడం కారణం కావచ్చు. కానీ, త్యాగయ్య కీర్తన లేని సంగీత కచేరీ ఉండదు. ఎవరయినా శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటున్నారని చెబితే మొదటగా సామాన్య ప్రజలు అడిగేదేమిటి? ‘ఎందరో మహానుభావులు వచ్చా?’ అని. ఇంతకన్నా ప్రజల మనసుల్లోకి చొచ్చుకుపోయిన త్యాగయ్య గూర్చి వేరే చెప్పాలా?

కర్ణాటక సంగీతాన్ని భక్తి అనే ఏకభావప్రాధాన్యతా శృంఖలాల నుండి తప్పించడానికి కృష్ణ చేస్తున్న ప్రయత్నాల వల్ల ఆ సంగీతం మరింత ప్రౌఢము, విస్తారమూ అవుతుంది తప్ప అది ఏ రకంగానూ బలహీనపడదు – అంటారు సంపాదకీయంలో. ఇంతకు ముందు పేర్కొన్న సినిమా కవులతో కలిసి జనబాహుళ్యాన్ని ఎంతో మెప్పించేలా శాస్త్రీయ రాగాల్లోనే రూపొందించిన సాలూరు రాజేశ్వరరావు, మహదేవన్, ఇళయరాజా, రహమాన్‌ల సినిమా పాటలు; బాలాంత్రపు రజనీకాంతరావు, మల్లిక్ తదితరులు సంగీతం సమకూర్చిన లలిత గీతాలు రెండు లేదా మహా అయితే మూడు తరాల్లో మరుగయిపోతున్న కాలంలో (సత్యంగారి గూర్చి గానీ జి.కె. వెంకటేశ్‌గారి గూర్చి గానీ ఎంత వినపడుతున్నది?), 175 ఏళ్ళ తరువాత కూడా త్యాగయ్యగారి కీర్తనలని (ఇవేనా శృంఖలాలు?) నేర్చుకుంటున్నారు, కచేరీల్లో పాడుతున్నారు, ఆ కీర్తనలు కొంతమందికి భుక్తి సమకూర్చుకోవడానికి సహాయపడుతున్నవి అన్న విషయాలని గుర్తిస్తే అది త్యాగయ్య చేరిన తారాపథాన్ని గుర్తించినట్లే. ఎవరు తల పైకెత్తి చూసినా చూడకపోయినా కూడా ఆ తారాపథం అక్కడే ఉంటుంది.

కళలు మత, రాజ్య, సంప్రదాయాల పరిమితులకు, నియమాలకు లోబడి ఉండవని, నిరంతర వినూత్నత, విభిన్నత వాటి ధర్మం, కర్తవ్యం అని కనీసం ఊహకు కూడా రాకపోవడం – అంటూ ముగుస్తుంది సంపాదకీయం. కానీ, క్రీస్తుపూర్వపు శతాబ్దాలనించీ లభిస్తున్న రోమన్, గ్రీకు శిల్పాలకి గానీ, మైకెలాంజిలో శిల్పాలకి గానీ, వాటికన్‌లో కప్పుమీద కనిపించే అతని వర్ణచిత్రాలకి గానీ, హిందూ ఆలయాల మీది శిల్పాలకి గానీ ఈనాటికీ లభించే ఆదరణలకి మూలం మతమూ, రాజ్యమూ, సంప్రదాయాలే. (గెలీలియో పరిశోధనలకి సహకారం, మొదటి ప్రోత్సాహం మతాధికారుల నించే; అయితే, భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నది అని అతను ప్రతిపాదించిన తరువాత పరిస్థితి మారింది.) యూరప్‌లో మ్యూజియములలో కనిపించే శిల్పాలు, చిత్రాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. మతపరం కానివాటి మనుగడ అంతంత మాత్రమే; అవి అదృశ్యమవడం కూడా నిశ్శబ్దంగానే, ఏ హడావిడీ లేకుండా జరుగుతున్నది. స్వాతంత్ర్యోద్యమ సమయంలో పారుకుళ్ళే నల్ల నాడి, ఎంగళ్ భారత్త నాడి’ వంటి ఉత్తేజాన్నిచ్చిన పాటలు ఎన్ని ఈనాడు వినబడుతున్నాయి? ఆ కర్ణాటక రాగాలు ఎక్కడికీ పోలేదు కదా అని తిరుగు ప్రశ్న వేస్తే, ఈ క్షణాన, లేదా మరొక దశాబ్దం పాటు ‘నిజమే!’ అని జవాబివ్వవచ్చు. తరువాత? నమ్మకం లేదు. త్యాగయ్య కీర్తనల్లో వచ్చే సంగతులే రాగస్వరూపాన్ని గాయకుడికీ శ్రోతలకీ అందించడానికి మొదటగా సహాయపడడంవల్ల కీర్తనలు మరుగున పడితే రాగాలు కూడా వాటి వెంటనే మాయమవుతాయి. కళలకి ధర్మాన్నీ కర్తవ్యాన్నీ ఆపాదించడం అవి అదృశ్యమవడాన్ని త్వరితం చేస్తున్నది.

ఏ విషయాన్నయినా సమగ్రంగా, అన్ని కోణాలనించీ పరిశీలించాలని అనుకోకపోవడంవల్ల, లేదా అనుకున్నా గానీ ఈ సోషల్ మీడియా యుగంలో దాన్ని ఆచరణలో పెట్టడం సాధ్యం కాకపోవడంవల్ల కావచ్చు; ప్రజలు తమ పరిమిత పరిధుల్లోనే స్పందించడంవల్ల చర్చలు అనుచితమైన వేడిని సంతరించుకుంటున్నాయి. సంపాదకీయంలో పేర్కొన్న భిన్నత్వాన్ని కనీసం మాటమాత్రంగా కూడా సహించలేని మన కురచతనం, సామాజిక వివేచన కోల్పోయిన మన సంకుచితత్వం, తమ బాగే అభ్యుదయం అనుకొనే స్వార్థం – అంటూ వెలిబుచ్చిన ఆవేశంలో ప్రస్తావించిన ‘మనం’ని నిర్వచించడం కూడా అంత తేలికగా సాధ్యం కాదు – ‘మన’కి వ్యతిరేక అభిప్రాయమున్న వాళ్ళందరినీ ఆ తస్మదీయుల సమూహంలో చేరిస్తే తప్ప. ఇంక సంపాదకీయం కోరిన చర్చ మొదలవడానికి ఆస్కారమెక్కడున్నది?


PS: రాళ్ళపల్లివారి వ్యాసంలో ‘రామా నీపై తనకు ప్రేమపోదు/ భోగానుభవంబులందు బాగుగా బుద్ధినీయదు’ అన్నచోట ముద్రారాక్షస మెప్పటిదో తెలియదు గాని, ‘బుద్ధినీయదు’కి బదులు ‘బుద్ధి నీయందు’ అని ఉండాలి. పూర్తి చరణం: భోగానుభవములందు బాగుగా బుద్ధి నీయందు/ త్యాగరాజుని హృదయమందు వాకిటానందమందు. దీనిని ‘రామా నీపై తనకు ప్రేమపోదు’ అన్న పల్లవితో కలిపి చూస్తే, అన్ని చోట్లా తనకి రామస్మరణే అని చెప్పుకుంటున్నాడు. పల్లవిలో పేర్కొన్న ‘తనకు’ని ‘నాకు’కి ప్రథమ పురుష వ్యక్తీకరణగా చూడాలి. పైగా, ప్రాసకి ప్రాధాన్యమిచ్చే వ్యక్తిగా ముద్ర పడడం కూడా అది ముద్రారాక్షసం అని నిర్ధారించడానికి సహాయపడుతుంది.